Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

దేశ ధర్మాలు

''వివిధ దేశాలలోని హిందువుల మధ్య పరస్పర స్నేహాభివృద్ధిని కాంక్షీస్తూ, పరస్పర యోగక్షేమాలు ఆశించి కృషిచేసే ఒక సంఘటన ఉండాలి. అట్టి సంఘటన ఉంటేనే సమాజానికి రక్ష, అట్టి పని ఈ పరిషత్తు ద్వారా జరగాలి.

ఒక కుటుంబములోని సోదరీ సోదరులు, తల్లిదండ్రులు, పిల్లలు - వీరంతా ఉద్యోగరీత్యా, చదువురీత్యా వేర్వేరు స్థలాలలో ఉన్నప్పుడు పరస్పర యోగక్షేమములను ఉత్తరాల ద్వారా తెలుసుకుంటే వారి మనస్సులకు సంతోషం కలుగుతుంది. వారు పరస్పరం సహాయం చేసుకుంటారు. కష్టనష్టాలను పరస్పరం పంచుకుంటారు. తద్వారా ఒక తృప్తిని అనుభవిస్తారు. హిందువులు ఈ విధంగా పరస్పరం ఉపకారం పొందుతూ ఉండాలి.

ఇది ఆలోచించుకోవడానికి విశ్వం అంటే ప్రపంచం మొత్తంలోని హిందువులందరు ఒకరి కొకరు కుటుంబంలోవలె చేదోడు వాదోడుగా పరస్పరం సహాయం చేసుకోవటానికి ఈ పరిషత్తు ప్రారంభించబడింది. ప్రతిదేశంలో, ప్రతినగరంలో ప్రతినిధులు పరిషత్తుగా ఏర్పడి అనేక సహాయ సంఘాలను సృష్టిపరచి విశ్వమంతా వ్యాపించిన హిందువులను ఏకముఖంగా తెచ్చి, వారిమధ్య ప్రేమసంబంధాలు ఏర్పరచి, పరస్పర యోగక్షేమాలు తెలిసేటట్లు చేస్తూ ఒక సంఘం ఉంటే అదే మనకు రక్ష, పరస్పర రక్షణకు అదే కారణం.

అందరికీ-సర్వమానవులకు-సహాయం కావాలి సహాయకులు కావాలి, ఒక్కొక్క దేశంవారు మరోదేశానికి సహాయం, డబ్బు ఇస్తున్నారు, డబ్బు, మనుష్యులు, యంత్రాలు ఇచ్చి సహాయం చేస్తూన్నారు. దానికి మనం కృతజ్ఞులుగా ఉండాలి, అది ఉదారమైన భావం. అయితే వారి రాజకీయ నీతికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అప్పుడు వారు దాన్ని--ఆ ద్రవ్యసహాయాన్ని-తగ్గించ గలరేమో అని భయం చూపిస్తున్నట్లుండే వ్యవహారం ఉన్నది. కష్టాలలో ఉన్న వారందరికీ రాజకీయ భావం. అనుకూలత ప్రతికూలతలు ఆలోచించకుండా సహాయం చేసే శక్తి మనకు కావాలి. ఇతర దేశాల డబ్బుకోసం ప్రతీక్షించకుండా, ఇతర దేశ ద్రవ్యనిరపేక్షంగా, స్వయంగానే హిందూదేశం ఐశ్వర్యంగా ఉండాలి. అట్టి స్వతంత్రమైన శక్తి ఉండాలి, కర్మాగారం, ఆయుధం, ఆహారం అన్నిటిలో మనం ఒకరికి సహాయము చేయగలగాలి. మనకు డబ్బు, వారికి ఆయుధాలు ఇవ్వడం నేడు జరుగుతోంది. ఇది రాజకీయంగా ఉంది, అట్టిది కాక నిష్కల్మషమైన సహాయం కావాలి. విశ్వహిందూ పరిషత్‌ ప్రయత్నం వలన అట్టి సమృద్ధి, శక్తి మనకు వస్తుంది.

మనకు యోగశాస్త్రం జ్ఞానశాస్త్ర మని రెండు శాస్త్రాలు ఉన్నాయి. దానికి అష్టాంగ యోగం అని పేరు. యమ, నియమ ఆసన, ప్రాణాయామ, ధ్యానాదులు వానిలో ఉన్నాయి అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం చివరికి అపరిగ్రహం వానిలో ఉన్నాయి. ఈ అపరిగ్రహం హిందూత్వానికి ప్రధానం. అహింస, సత్యములను గాంధీగారు 40 ఏండ్లపాటు సాయంకాల సభలలో గ్రామాలలో ప్రచారం చేశారు. దాని వల్ల దేశానికి ఒకసంఘం ఏర్పడి విదేశీయులు దేశాన్ని వదలి వెళ్లినప్పుడు దాన్ని తీసుకోవడానికి పాత్రత దొరికింది. గాంధి శతాబ్ది సమయంలో వారి శిష్యులు దానిని మరింతగా ప్రచారం చేస్తున్నారు.

దాన్ని అపరిగ్రహం అంటే మనకు ఏమికావాలో దానికంటే ఎక్కువ భూదేవినుండి తీసుకో కూడదు. అవసరం లేని వస్తువులను మనం పరిగ్రహించకూడదు. ఏమి లేకపోతే మనం చస్తామో, మనం జీవించలేమో అని తప్ప ఇతరవస్తువువులన్ని మనకు అక్కరలేదు. చివరకు మాటలు కూడ తూచిక వేసినట్లు - ఈమాట అనకపోతే బ్రతకలేమో అనే విధంగా మాట్లాడాలి, యమ, నియమములు, హిందూత్వ ప్రత్యేకతలు తాగుడు, చుట్ట, సినిమా, ఖరీదైన వస్త్రం ఇవన్నీ లేనిదే ఉండలేమా? సులభ##మైన పుష్టి అయిన ఆహారం, మానానికి శైత్యానికి ఒక కంబళం మనిషికి సరిపోవా? కొందరు ఆడవాళ్ళకు 100, 150 చీరెలు ఉంటాయి. గిరిజనులకు బీదలకు చిన్న చిన్న పాకలుకూడా కరవవుతున్నాయి, మనం పెద్ద పెద్ద మేడలు కట్టినట్లయితే వారికి అసూయ కలుగుతుంది. మనం ఆభరణాలు, మంచి డ్రస్సు వేసుకుంటే అంతా సంతోషిస్తారని మనం అనుకుంటాం. కాని చూచేవారిలో అసూయే కలుగుతుంది. దొంగతనం లేకుండా ఉండాలి. అంటే దొంగిలించవలసిన సామానులు - విలువైన వస్తువులు మనవద్ద లేకుండా ఉండాలి.

అందరికీ అహింస పెడితే అనేక చిక్కులు వస్తాయి. అన్నీ వదలిన వాడికే పూర్తి అహింస. అందరికీ అహింస బుద్ధుడు, గాంధీ చెప్పితే చిక్కులు వస్తాయి. ప్రభుత్వానికి ప్రజలను రక్షించే పూచీ ఉంది. స్త్రీల మానరక్షణ పూచీ ఉంది. ద్రోహులను శిక్షించే పూచీ ఉంది. యుద్ధాలు వస్తాయి. సన్యాసికి తప్ప పూర్తి అయిన అహింస మన శాస్త్రం చెప్పలేదు.

గృహస్థుకు అపరిగ్రహం అలవరచాలి. ఎంత తక్కువ ఖర్చు చేయగలిగితే అంత తక్కువ ఖర్చు చేయాలి. కుటుంబ జమాఖర్చులు వ్రాయడం అలవాటు చేసుకోవాలి. ఏది అవసరమో, ఏది అనవసరమో ఒకరు చెప్పేదికాదు. ఎవరికి వారికే తెలియాలి. అపరిగ్రహం ఉంటేనే శాంతి, బలం అదే ఆచారం, మిగిలినది. అనాచారం, మడి మైలకాదు. అపరిగ్రహం ఉంటే, ప్రతిచోటికి అప్పులకు బయలు దేరవలసిరాదు, అపరిగ్రహం వల్ల అప్పులు లేకుండ చేయగలం, ఇతరులకు సహాయముకూడా చేయగలం. పరిషత్‌ వల్ల ఈపని జరగాలి, అందరికి మనం సేవ చేయాలి. మొదట హిందువులు కలవాలి. హిందువులందరూ కలిసి ఇతరులకు సేవచేయాలి. లోకా స్సమస్తా స్సుఖినో భవంతు, అన్న ప్రకారం లోకకళ్యాణం జరుగుతుంది.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page