Satyanveshana    Chapters   

ఈశ్వరోపాసన

అహమాత్మా గుడాకేశ సర్వభూతా శయస్థితః

అహమాదిశ్చ మధ్యంచ భూతానాం మన్త సవచ

(భగ, విభూతి యోగము)

ఆకాశాది భూతములకు ఉపాదానకారణమైన ఆ అవ్యక్త స్వరూపుడును భూతముల యొక్క మధ్యమ స్థితి రూపుడును, వ్యక్త స్వరూపుడును, భూతముల యొక్క ప్రళయ స్వరూపుడును అయిన ఈశ్వరుని ఉపాసింపుము. ఆ ఈశ్వరత్వము ప్రపంచముయొక్క ప్రళయరూపముతో నుండిన సగుణమైన పరమాత్మ. అట్టి పరమాత్మయే సర్వులకు నుపాసింపదగినది. దోషరహితులైన యతులచే దర్శింపదగినది. ఆ పరమాత్మ ప్రతి శరీరమునందును ఆత్మరూపమున జ్యోతిర్మయుడై వెలుగుచున్నాడు. అది గ్రహించినవారే యోగులు మహాత్ములు. అట్టి భగవత్తత్త్వము మనసునకు అందనిది. వర్ణింప శక్యముకానిది. అది విషయాకార సూన్యమైన సత్యము. శుద్ధము, సందేహరహితము, సర్వవ్యాసకము, సర్వాంతరము, స్థిరము, నిరాకారము, విర్గుణము జన్మక్షయ పరిణామాది షడ్భావ వికార రహితము. జ్ఞానస్వరూపము. అట్టి సత్యమే నిత్యం శివం సుందరం. ముముక్షువులగు జిజ్ఞాసువులు నిరంతరము అన్వేషించునది అదియే. అది తార్కిక వాదములచే గోచరముకాదు. మీమాంసక వైయాకరణులచే సాధింపబడదు చేతనాచేతనమైన ఈ ప్రపంచమెల్ల ఆ భగవంతునియందు బొడమును. అతనిలో లయమగును. అట్టి భగవంతుడు అనన్య దర్శనుడు. అట్టిచో ఉపాసించు టెటుల? అను సందేహము కలుగుట మానవ సహజము సందేహ నివారణకు శాస్త్రములు కలవు. ఆ శాస్త్రములందు ఉపాసనా ప్రకరణము నందిటుల చెప్పబడినది. ఉపాపన రెండు విధములు. ఆఖండోపాసన, ఖండోపాసన.

ఆఖండోపాసన:- సర్వకాల సర్వావస్థలయందును, ఏ వ్యాపారము చేయుచున్నను భగవంతుని ఆరాధించుట ఈ ఉపాసన అవిచ్ఛిన్నమైనది. అది అందరికి సులభసాధ్యము కాదు. కట్టకడపటి అనగా చివరి జన్మ ఏవరికో వారికి మాత్రమే సాధ్యము అనగా ఆ జన్మతో జన్మరాహిత్యము ఎవరికి గలుగునో వారికి మాత్రమే ఈ ఆఖండోపాసన ఆచరణ సాధ్యము. ప్రహ్లాదాది భక్తులే తార్కాణము. జ్ఞానయోగుల కిది సాధ్యము.

ఖండోపాసన:- కొన్ని కొన్ని దేశములందు, కొన్ని కొన్ని సమయములందు కొన్ని కొన్ని వస్తువులందు పరమాత్మను భజించుట. ఇది దేశకాల పాత్రలమీద నాధారపడియున్నది. కాశీరామేశ్వరాది తీర్థ క్షేత్ర దర్శనము ఏకాదశి శివరాత్రి మొదలగు పర్వదినములకు సంబంధించిన వ్రతాదులు మొదలగునవి యుదాహరణములు. కొన్ని వస్తువులు భగవంతుని మహిమను తెల్పుచున్నవి. వాటిని పూజించుటయు ఖండోపాసనయే యని భావించవలయును.

పరమయోగులకు మాత్రమే నిర్గుణ బ్రహ్మోపాసన సాధ్యము. అందఱికికాదు అందుచే నిరాకార బ్రహ్మమును సాకారబ్రహ్మముగను నిర్గుణ బ్రహ్మమును సగుణబ్రహ్మమునుగను రూపొందించుకొని ఉపాసించుట ఒకమార్గము. ఈ మార్గమును తీర్చిదిద్దినది వేదవ్యాసులు. తపస్సంపన్నులగు యోగులందరు బ్రహ్మునుభూతిని బొందినవారే. వారు వారి వారి ప్రవృత్తులనుబట్టి, అనుభూతులను బట్టి సంస్కారమును బట్టి పరమాత్మను వివిధ రూపముల దర్శించినవారే. అట్టివారికి నిర్గుణుడు, సకలగుణ సంపన్నడుగను, నిరాకారుడు సాకారుడుగను గోచరమైనాడు. ఏకత్వమున నానాత్వము చూచినారు. ఆ నానాత్వములో ఏకత్వము సాధించినారు. అనంతకోటి రూపముల చూచుట అనేక నామముల నాపాదించుట సాధన వివిధ మార్గముల ప్రవర్ధ మానమగుటయే.

బ్రహ్మసాధన ప్రకరణము అతి విశాలము. బహురూపయుతము, అతి గభీరము. అది అధికార తారతమ్యమునుబట్టి విస్తరిల్లుచున్నది. బ్రహ్మ జ్ఞాన సిద్ధికి సాధన అవసరము. ఆ సాధనకు శాస్త్రము, ఉత్సాహము, గురువు, కాలము, మూలస్థంభములు. సాధన విధానమును, సాధ్యస్వరూపమును తెలుపునది శాస్త్రము. మానవునకు సత్యాన్వేషణ చేయుటలో ఉండవలసిన ఆకాంక్షయే ఉత్సాహము. ఉత్సాహమున్నను. శాస్త్ర పరిచయ మున్నను, ముఖాముఖిని ప్రత్యక్ష నిదర్శనములతో, ఆత్మ ప్రబోధము కావించుటకు గురువు కావలయును ఈ మూటిని సంఘటించి పరిపక్వము చేయునది కాలము. ఇటుల వివిధాంశములతో గూడిన సాధన, జ్ఞాన, భక్తి, కర్మ మార్గములుగ విభజింపబడినది. జ్ఞాన మార్గముసధ్యానధారణ యోగసమాధులు సోపానములుకాగా, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య మహాభావములు ఉద్బోధన స్త్రోత్రవందన ప్రార్ధన అనుతాపమంగళాది భజనలు, అసంఖ్యాకములగు ప్రపత్తులు మొదలగు రసములతోకూడినది భక్తిమార్గము ఆశ్రమచతుష్టయము కర్మమార్గమున ప్రముఖస్థానమాక్రమించినవి. పంచమహా యజ్ఞములు, వ్రతములు విధి నిషేధములతో గూడిన యజ్ఞయాగ జపతపాదులు ఉపాంగములుగా గలది కర్మమార్గము. ఇవియన్నియు సాధన మార్గములు. భగవదోపాసనకు ప్రధాన సోపానములు.

ఉపాసన ప్రతీకోపాసన, సంపదకోపాసన, స్వరూపోపాసన, మానసికోపాసన యను భేదములు గలదని చెప్పుదురు. ఆయా భేదములు అధికార తారతమ్యములబట్టి యున్నవి.

ప్రతీకోపాసన : ఇది అనధికారులకు నుద్దేశింపబడినది. దీనిని అధ్యాస జవితోపాసనయని గూడ నందురు. అనగా ఒక వస్తువు యొక్క గుణమును, మఱొకవస్తువునకు ఆరోపించుటయే అధ్యాస. శ్రుతి జ్ఞానముచే గలిగిన జ్ఞానమును పలుపటముల కారోపించి పూజించుట, ప్రతీకోపాసన ఇది సర్వసామాన్యము.

సంపదకోపానము :- నిమ్నాధికారుల కొఱకు నిర్దేశింపబడినది. అనధికారులకన్న నిమ్నాధికారులు ఎక్కువ చిత్త సంస్కారముకలవారు. స్వల్పవస్తువుల మూలమున పెద్ద వస్తువులను ఊహింపగలరు. రెండు వస్తువులకు గల సామాన్యధర్మముల కనిపెట్టి వారు పరోక్షమునుండి యపరోక్షము చేరగలరు. (Known to Unknown) సూర్యుని ప్రకాశత్వమును జగత్ర్బకాశత్వముగా భావించి, ఆ జగత్ర్సకాశత్వమే పరబ్రహ్మ యొక్క స్వప్రకాశత్వముగ పరగణించి ధ్యానించగలరు. సూర్యోపాసన ప్రాణోపాసన, మనోపాసన, అవతారోపాసన, నిమ్నాధికారికి సాధన సోపాన పరంపర. ఈ సోపానముల నన్నింటిని దాటిన నిమ్నాధికారి అధికారి కాగలడు. ప్రతీకోపాసనపరుడగు ఆనధికారికి, సంపద కోపాసన పరుడగు నిమ్నాధికారికి ప్రత్యక్షానుభూతి గలుగదు.

స్వరూపోపాసన :- ఇది యుత్తమాధికారులకే సాధ్యము. చిత్తనివృత్తి గలవారికి మాత్రమే ఇది సాధ్యము. చంచలచిత్తమున చిద్వస్తువు ప్రకాశింపదు. ఏకనిష్ఠతో నిజస్వరూపమును ఉపాసించినప్పుడే సాక్షాత్కారము లభించును, ముందు స్తోత్రాదులచే చిత్తశుద్ధి కావించుకొనవలయును. మనసును చిక్కబట్టి యోగాభ్యాసమున సమాధ్యావస్థను పొందవలయును. అప్పుడే దివ్యానుభూతులు గలుగును. బ్రహ్మసాక్షాత్కారమగును. ఆ సాక్షాత్కారము ఏరూపముననుండును? ఆ అనుభూతి యెట్టిది? అది వారికే తెలియవలయును ఆత్మయందు పరమాత్మోపలబ్ధిని పొందుటయే ఈ ఉపాసన ఉద్దేశము. నిర్వికల్పసమాధియందుండు మునులకు యోగులకు ఇది ప్రత్యక్షానుభూతి.

మానసికోపాసన :- ఇది నిమ్నాధికారుల సంపదకోపాసన కాదు. బ్రహ్మజ్ఞాన సాధనము కాదు. బ్రహ్మజ్ఞానము నందు, బ్రహ్మ ప్రకాశము మాత్రమే సాక్షాత్కారమగును. స్థావరజంగము లన్నియు ఇష్ట దేవతారూపములుగా ఇందు కనపడును అది విగ్రహసృష్టి కాదు. జగత్తంతయు బ్రహ్మరూపమను అవస్థనుండి భక్తులు దాటవలసిన స్థితి. బ్రహ్మప్రకాశముకంటె బ్రహ్మవిలాసము మహత్తరమైనది. బ్రహ్మప్రకాశము ఒకేరూపు కాగా, బ్రహ్మవిలాసము అనంతకోటి రూపముల, అనంతకోటినామముల, అవతారముల, లీలల ప్రకాశమగును. మానసికోపాసనశక్తి యట్టిది.

''ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా

సాధకానాం హితార్ధాయ బ్రహ్మణోరూపకల్పనా''

అను సూత్రములు కలవు. కల్పన చేయునది సాధకులుకాదు. సాధకుల కొఱకు సిద్ధులు చేయుదురు. వారు తమ ప్రసన్నచిత్తమున దేనిని సాక్షాత్కారము పొందిరో, అనగా నిర్వికల్పసమాధిలో ఏ అనుభూతిని బొందిరో, దివ్యమైన ఏ బ్రహ్మవిలాసమును దర్శించిరో, దానిని మొదట ప్రతిమలరూపమున ప్రకాశింపజేసిరి. సమాధిలో గలిగిన ఆత్మోపలబ్ధితో వారు తృప్తి పొందరు. సమాధి నిత్యావస్థకాదు. దానిని విడిచిన తరువాత సమాధిలో ప్రత్యక్షమైన రూపును, బయటనుకూడ చూడ కాంక్షింతురు. జాగ్రదావస్ధయందు సహితము ఆ రూపును తమ సమక్షమున నుంచుకొనుటకు, యోగీంద్రులు రూపకల్పన చేయుదురు. ఇంద్రియ సంయమముచే, చిత్త నిరోధముచే సమాధిని పొంది, ఏ యుపాస్యదేవతా సాక్షాత్కారమును బొందునో, దానిని బయట ప్రవృత్తియందు తిరిగి శబ్ద స్పర్శ; రూప, రసగంధములందు సేవించుటకు యోగి యుత్కంఠుడగును. భక్తుడు తన రసమూర్తిని, తన ఇష్టదైవమును తనయందేకాక, నిత్యజీవనమందును, సంసారమునందును, సమాజమునందును, సర్వకళలయందును ప్రతిష్ఠంచిన గాని వాని యానందము పూర్తికాదు. ఆ మూర్తిని నిర్మించుటకు శిల; దారు లోహములతో మూర్తిమంతముచేయును. చిత్రించును, స్తోత్రము చేయును. వర్ణించును, పూజించును, ఇటుల అంగాంగీ భావములతో నిరాకారుడు, సాకారముగను, నిరాలబంసము, సాలంబనముగను అన్యోన్యము ప్రవర్తిల్లును. ఈ కారణముననే నిరాకారుని సాకారునిగ, బహురూపిగా, నిర్గుణువి సకలగుణ సంపూర్ణునిగ, ముముక్షువుల సాధనక్రమము సులభము చేయుటకు రూపొందింపబడినవి. లౌకికముగ జూచినను ఏ వస్తువును, ఏ భావమును, దేనిని గూడ నామరహితముగ, రూపరహితముగ ఊహించలేము. వర్ణించలేము. అది సామాన్యుల కందని పని. ఏదియో రూపమున, ఏదియో భావమున, ఏదియోనామమున, స్థూలరూపమున (Concrete) యోచింపగలమే కాని, రూపనామ భావరహితముగ (Abstract) ఊహించుట దుస్తరము.

హిందూమతములో బహు దేవతారాధన, విగ్రహారాధనలు కలవనియు, అవి మూఢత్వమువలన గలిగినవనియు, అన్యమతస్తులగు పాశ్చాత్యాదులే గాక బౌద్ధ, జైన, బ్రహ్మ సమాజమతస్తులు, పాశ్చాత్యనాగరకత సంస్కృతి వ్యామోహితులగు హూణ విద్యాపారంగతులగు నవీనులు కూడ అనుట పరిపాటి యయినది అట్టివారు వైదికమత సిద్ధాంతములను, సాధన మార్గములను పూర్తిగ నర్థము చేసికొని యుండరు. చివరకు ఆ ప్రయత్నమైన చేసియుండరు. ఐహిక సౌఖ్యచింతల మునిగిన వారికి ఆధ్యాత్మిక చింతనచేయు అవసరము కనబడియుండదు. సాకార బ్రహ్మోపాసన గలుగుటకు కారణములు గ్రహించితిమి. హిందూ మతమున ఈ లోపములున్నవను, ఇతర మతములవారును, వారికి తెలియకుండగనే సాకార బ్రహ్మమును, విగ్రహములను పూజించువారే. జైనులకు దైవమగు పార్శనాధుని దృడోన్నత శరీరునిగా నూహించి, విగ్రహముగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేయు పార్శనాధదేవాలయములు కలవు. నిత్య పూజాదికములు జరుగుచునే యుండును. బౌద్ధ విహారములు, బుద్ధుని విగ్రహములు అనేక భంగిమల రూపొందింపబడినవికలవు. బౌద్ధ మత గ్రంధముల పేటికయందుంచి పూజింతురు. బుద్ధుని విగ్రహములనే గాక, బుద్ధుని శిరోజములను, నఖములను ఆస్తికలభాగములను సువర్ణ పేటికలందు భద్రపఱచి పూజింతురు బుద్ధ గయను. బోధివృక్షమును పుణ్యక్షేత్రముగ దర్శించుచున్నారు.

మహమ్మదీయులు మహమ్మదుప్రవక్త పవిత్ర శిరోజముల శ్రద్ధతో పదిలపఱచి భక్తితో పూజించుచున్నారు. వారు ఏదేశములో నున్నను, ఏ ప్రాంతముననున్నను మక్కావైపు తిరిగి అచట స్థాపితమైయున్న నల్ల రాతి పలకము నందు మనసుకేంద్రీకరించి ప్రతిదినము ఆరు వేళలధ్యానము చేయుదురు. బిగ్గరగా గొంతెత్తి అల్లాను స్తవము చేయుదురు. మహమ్మదు ప్రవక్తనేగాక, మహమ్మదు అల్లుండ్రును ఇస్లాము మత ప్రచారమున అసువులు గోల్పోయిన మహాభక్తులను నేటికిని పూజించుచునే యున్నారు. వారి చిహ్నములుగ వెండి బంగారు పీర్లను నిర్మించుచున్నారు. మ్రొక్కుబడులు తీర్చుచున్నారు. కొలుచుచున్నారు. అది మోహరం పండుగ. హిందువులు కార్తీకమాసమున 'నక్తాలు' ఉందురు. అనగా పవలంతయు ఉపవసించి రాత్రి శివపూజ చేసి భుజించుటగా గల ఒక వ్రతము. అటులనే 'రంజాను' మాసమున మహమ్మదీయులు పవలంతయు ఉపవసింతురు. హిందువులకు వేదములెంత పవిత్రములో మహమ్మదీయులకు వేదగ్రంధమగుకొరాను అంత పవిత్ర గ్రంధము.

ఇక క్రైస్తవుల ప్రార్ధనా మందిరములు (Churches) శిలువను Cross గలిగి యుండును. అది వారికి పవిత్రమైన పూజావస్తువు. దానిని ప్రమాణసాధనముగా నుపయోగింతురు. క్రీస్తు పటములులేని, శిలువ చిహ్నములేని, ఏసు మాతయగు మేరీ పటములేని క్రైస్తవగృహమే యుండదు. వారు ప్రతి యుదయము ఏసుప్రభువు పటము చూడ నమస్కరింప నిచ్చగింతురు. క్రీసును భక్తి భావముతో స్పృశింతురు. కొందరు దానిని తమ కంఠమాలలందు ధరింతురు. వారి మత గ్రంధమైన బైటిలు పవిత్ర మైన పూజాగ్రంధము. రోమను క్యాతలిక్కుల పూజామందిరములు దర్శించిన, అందు బహు విధములగు విగ్రహములు, పటములు, పూజావస్తువులు, దీపారాధనలు కనబడును. ఇంతయేల God created man in his own image అనుటలోనే భగవంతునకు రూపముకలదనియు, సృష్టి స్థితి లయములను త్రిగుణములు కలవాడనియు, అందుచే క్రైస్తవులందరు సాకార సగుణోపాసకులేయని తేలుచున్నది. ఇంతకుమించి దీనిని దృఢపరచునది మరొకని శేషముకలదు. వారు ఏసుప్రభువునే గాక ఏసుమాతయగు 'మేరీని' మరి యమ్మ అను పేరుతో విగ్రహప్రతిష్ఠ చేసి పూజింతురు. ప్రతి వత్సరము ఉత్సవములు చేయుదురు. మ్రొక్కుబడులు చెల్లింతురు. విగ్రహారాధకులని అందరిచే హేళనచేయబడుచున్న హిందువులు, శ్రీరామచంద్రుని తల్లి యగు కౌశల్యను గాని, శ్రీకృష్ణుని జననియగు దేవకీదేవినిగాని పూజింపరు. ఏకేశ్వరోపాసకులమని చెప్పుకొను బ్రహ్మసమాజకులు గూడ భగవంతుని బహునామముల స్తోత్రము చేయుదురు. పలుగుణముల నాపాదింతురు. ఈ ఈ కారణముల భగవదారాధన అన్ని మతములందు ఏదో రూపమున సగుణోపాసనయే యనియు, సాకారోపాసనయే యనియు, నిర్వివాదముగ నిశ్చయింప వచ్చును.

హిందూ దేవతామూర్తులు, విగ్రహములు సమాధ లబ్ధమైన ఇష్ట దేవతామూర్తులే యని ఎల్లరు అంగీకరింపక తప్పదు. అవి దేవతా రూపముల ప్రతిమలు. అవి సర్వాంతర్భావుకుడగు, ఆ అశిలరసమూర్తి భావ బాహ్య భేదములని గ్రహించవలయును. వివిధ లక్షణములతో వివిధ రూపములు గల ఈ విగ్రహముల సృష్టించినవారు సాధారణ మానవులుకారు. వారు బ్రహ్మ సాక్షాత్కారమునందిన సిద్ధపురుషులు. వారి సమాధ్యవస్థకు భంగము కలిగినప్పుడు సంప్రాప్తమైన ఆవేదనతో వారు తమ ఉపాస్య దేవతలను మంత్రములతో స్తవము చేసి, ఉత్తమ లక్షణముల నాపాదించిరి. ఆ మంత్రముల ననుసరించి శిల్పులు దారు శిలా లోహ విగ్రహముల రూపొందించిరి. చిత్రకారులు వివిధరంగులతో ఆహార్యము గూర్చిరి. కవులు వర్ణించిరి. గాయకులు గానము చేసి. అతీంద్రియతత్త్వమునకు ఇంద్రియముల సముఖమున మంత్రప్రతిష్ఠ జరిగినది. ఇందు ఒక క్రమపద్ధతి కలదు. నియమిత రూపములు నిర్థారణ చేయబడినవి. ఎవరి యిష్ట ప్రకారము వారు విగ్రహములు చేయుటకు వీలులేదు. దేవాలయ నిర్మాణముకూడ అట్టి కట్టుబాటులతో గూడినదే. అదియెకశాస్త్రము. అర్యఋషులు మంత్ర ద్రష్టలు. నిరాకారవాదులు సహితము ఈ మార్గమున గమించి మానసమున భగవంతుని మూర్తి మంతము జేసికొని ఉపాస్యదేవతల గల్పించుకొని 'ఓమ్‌ పితానోసి' అని బ్రహ్మమునకు ప్రణామము చేయుచున్నారు. అటుల విశ్వపితయగుట మానసిక రూపకల్పన కాక మఱమి? విగ్రహారాధన కూడదని విడనాడిన మానసికోపాసనపరులు సహితము ఈ విధముగ సున్నిత మగు మానసిక రూపగుణకల్పనకు లోనగుచున్నారు. వారు చేయునది నిరాకారోపాసన కాదు. నిర్గుణ బ్రహ్మోపాసనయు కాదు. అటుల భ్రమ పడుట మాత్రమే. ఎప్పుడు పరబ్రహ్మమును చరాచరాత్మకమగు జగద్రూపమునదర్శించుచున్నామో, కీర్తించుచున్నామో, ఎప్పుడు వానిని తండ్రీ, తల్లీయని, ప్రభువాయని, సంభోధించుచున్నామో అప్పుడే మానసికమగు రూప నామ గుణకల్పన జరిగినదనియే యంగీకరించవలయును.

భక్తుడు జిజ్ఞాసువు రస పిపాసకుడు. తన యన్వేషణయందు రసపిపాసయందు అతడు నూత్నరాగముల, నూత్నవేషముల, నూతనాలంకారముల, నూతన విలాసముల ఎప్పటికప్పుడు దర్శింపగోరును. భగవంతుని చిద్విలాసపరంపర వివిధ రూపముల దర్శించి ఆనందించగోరును. అది యొక మహాయత్నము. ఆకాంక్ష. బలవత్తరమైన ఆ కోరిక వానిని ఒక చోట నిలువనీయదు. ఆ దివ్యలీలల గాంచుటకు వాడు క్షేత్రము నుండి క్షేత్రమునకు, ఆలయమునుండి ఆలయమునకు, విగ్రహమునుండి విగ్రహమునకు, సహస్రనామ సంకీర్తనతో ప్రణామములు చేయుచు, ఆరాధించుచు తిరుగుచుండును ఒక చోట బాలగోపాలకృష్ణుని దర్శించును. మఱొక చోట గోవర్ధనగిరిధారిని, వేఱొక చోట రాసక్రీడా వినోరధి, ఒండొక చోట కోదండపాణియగు శ్రీరామచంద్రమూర్తిని, మణియొకచోట పార్ధసారధిని, ఒకచోట గంగాధరుడగు పరమేశ్వరుని, వేఱొక చోటున నటరాజమూర్తిని, ఒకచోట అర్థనారీశ్వరుని, ఒకచోట కాళీమాతగను వేఱొక చోట మహిషాసురమర్దనిగను గనినభక్తుడే ఒక స్థలమున లక్ష్మీరూపముగను మఱొచోట సరస్వతీ రూపముగను ఆ చిదానందమూర్తి చిద్విలాసముల జూచి మురిసి తన్మయుడగును, భక్తునకు తృప్తి యనునది లేదు భగవంతుని దివ్యమూర్తిని చూచిన కొలదియు చూడగోరును, సేవించినకొలది సేవించగోరును. సంకీర్తన చేసినకొలది సంకీర్తన చేయగోరును. ఉన్న రూపములు చాలవు, బహురూపముల నూహించుకొనును. ఉన్ననామములు చాలవు,బహురూపములు కల్పనచేసికొనును. అట్టి భక్తుని తృప్తి పఱుపక భగవంతుడెట్లుండగలడు? భగవంతుడు భక్తజన సులుభుడుగద. భక్తుని తృప్తి కొఱకు భగవంతుడు ఎప్పటికప్పుడు నూతన రూపముల ధరించుటకు నూతననామముల దాల్చుటకు సిద్ధముగనుండును. నృసింహావతార రహస్యమిదియేకద. అది భగవంతునకు భక్తులయెడ గల వాత్సల్య రూపము భక్తుడు ఆ రూపముల విగ్రహములుగ నొనర్చి నూతన నామములవిడి పూజించుచు; నూతన రూపముల దర్శంచుటకు నిరీక్షించుచునే యుండును. ఆ విగ్రహ సృష్ఠికి తెంపులేదు. ఆ నామోత్పత్తికి అంతులేదు. ఇది ఏకేశ్వరోపాసనకాదు. కాకున్న పోనిండు. ఎవరికి ఏ విధమైనబాధయు లేదు. సర్వజగత్తునకు సృష్టి స్థితి లయములకు, మూల కారణము సర్వాంతర్యామి సత్యం శివం సుందరం అయిన ఆ పరతత్త్వమును వర్ణించుటకు ఒకే నామము చాలదు. ఒకే రూపము చాలదు. అటులుండవలయునను నిర్భంధమేల? విగ్రహారాధనచే ప్రబోధింపబడిన దేవతాబుద్ధియే బ్రహ్మోపాసనకు దోహదకారిగనుండును.

ఇచట ఒకటి గమనించవలయును విగ్రహములు అనధికారులకు ప్రయోజనకరములుకావు. వారికి వాటి యందు శిల లోహ దారుజ్ఞానము కాక మఱదియు తోచదు శిల శిలగా లోహము లోహముగా దారువు దారువుగా తోచును. సాధకున కటుకాదు. మహాత్ములచేత ప్రకాశితములైన లక్షణములననుసరించి, తమ లక్ష్యము నందుకొన చూచువారేకద సాధకులు. తమ యత్నమున ఒకసారియైన, తమ జీవితమందు బ్రహ్మజ్ఞానము లేశ##మైన బొందినవారు మాత్రమే సాధకులగుదురు. ఈశ్వర సహకారమును నమ్మి, ఆ పరమాత్మ సహవాసమును నిత్యానుభూతిగ చేసికొన యత్నించువారే సాధకులు. వారికి మాత్రమే దారుశిలా లోహ నిర్మితములైన విగ్రహములందు వారి వారి యుపాస్యదేవతారూపము సాక్షాత్కారమగును. ఆ మహత్తును వారు మాత్రమే గ్రహించగలరు.

విగ్రహారాధన మొదటినుండియు తుదివఱకు మంత్ర తంత్రము లతో గూడినది. ప్రతి విగ్రహము కొందరజ్ఞాను లనుకొనినటుల ప్రతిశిలయు పూజనీయమని ఏ విగ్రహారాధకుడు భావింపడు. సమంత్రకముగా ఆరోపితమైన దైవశక్తిగల విగ్రహమే పూజార్హము. ప్రతి మంత్రమునకు ఒక అధిష్ఠాన దేవతయుండును. విగ్రహములు ఆ ప్రతీష్ఠాన దేవతల ప్రతిమలు కావున ఒక విగ్రహము ఉపాస్యమగుటకు దానికి ప్రాణ ప్రతిష్ఠ కావలయును అనగా ఆ విగ్రహమునకు జెందిన మంత్రము యొక్క బీజాక్షరములుగల యంత్రముపై దానిని స్థాపించి ఆ మంత్రానుష్ఠాన దైవశక్తిని దానియందు నారోపింతురన్నమాట.

మంత్రోపాసన లేని విగ్రహారాధన సఫలముకాదు. భక్తుడు ఏకాగ్రతతో, మంత్రోచ్చారణతో ధ్యానము చేయునప్పుడు, దారుశిలా లోహ విగ్రహములందు వస్తుజ్ఞానము నశించి దేవతాబుద్ధియే యుండును. అంత ముముక్షువునకు అతీంద్రీయదృష్టి వికసించి ఈశ్వరగుణానుభవము కలుగును. ఈ కారణమున ప్రచారములోనున్న సారూప సగుణోపాసన విగ్రహారాధనలు ముక్తి కారకములు కావనువారికి, ఈ తత్త్వము తెలియదు. అట్టి అజ్ఞానులవాదము నిస్సారము. సాకారనిరాకారములు, నానాత్వ ఏకత్వములు, సగుణ నిర్గుణములు, అన్నియు పరస్పరాశ్రయములు. ఒకటి రెండవదానికి దారితీయును. అన్నిటికి ఫలసిద్ధి జీవాత్మపరమాత్మలో నైక్యమగుటయే.

ఆఖండ సచ్చిదానందమూర్తి, సాధకునకు ప్రప్రధమున విశ్వశక్తిగనో.విశ్వ ప్రేమగానో, విశ్వాత్మగానో, సర్వాతీతమైన ఆనంతసత్వముగనో, అంతర్భావకుడైన పురుషోత్తముడుగనో, ఏ రూపముననైనను, ఏ నామముననైనను గోచరింపవచ్చును. తుదకు ఆ నాయములన్నియు ఆ రూపములన్నియు నొకటేయని తెలిసి కొనగల్గును. ఈశ్వరుడెప్పుడు ఏ రూపమున దర్శనమిచ్చునోయని పరిశుద్ధమనస్కుడై వేచియుండుట సాధకుని విధి. చివరకు ఆ నామ రూపములన్నియు ఒక్కటై, నిర్గుణనిరాకార నిర్వికార తత్త్వమగు ఈశ్వరత్వమున లీనమగును సాధకునకు ఆ అనుభూతి గలిగిన సిద్ధుడై ముక్తిగాంచును. ఆ స్థితి గాంచిన సాధకుడు ఉపాసించునది ఏ రూపముకాదు. ఏ నామముకాదు; సర్వమునకు అతీతుడైన అనంతునే. ''సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకశరణం వ్రజ....'' అను గీతా వాక్యమే వాని హృదయగహ్వరమున ప్రతిధ్వనించుచుండును. అదియే యుత్తమ స్థితి. ఉపాసనాఫలము. ఉపానాపరులు ఆర్తుడు మొదలుగా గల బేధములనుబట్టి నాలుగువిధములందురు. ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్థార్థి ఈశ్వరత్వమును సగుణోపాసన మార్గమున ఉపాసించుచున్నారు. నాల్గవ వాడగు జ్ఞాని అనగా బ్రహ్మవిదుడు, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ మగు ఈశ్వరత్వమును సమాధి గరిష్ఠుడై ఉపాసనను చేయుచున్నాడు. అందఱికి ఫలసిద్ధి ఒక్కటే_

---------------------------------------------------------------------------------------------

కీ|| శే|| గురుదేవులు ముట్నూరి దివ్యబోధసారము ఆధారము.

Satyanveshana    Chapters