Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

31. షట్‌ దర్శనములు

భగవద్గీత - భాగవతము

మానవుడు దుఃఖ నివృత్తికి, సుఖప్రాప్తికి నిరంతర కృషి సల్పుచున్నాడు. అన్ని మతములు దుఃఖ నివృత్తికి సుఖప్రాప్తికి మార్గములు సూచించుచున్నవి. షడ్దర్శనములు పురాణములు ఇట్టి ఉద్దేశ్యముతోనే వ్రాయబడినవి. సుఖము సత్త్వలక్షణము. తృష్ణ రజస్సు లక్షణము. ఇంద్రియ సుఖమును మన మాశించు చున్నాము. కాని ఇంద్రియ సుఖములు స్వర్గాది భోగములు, నిత్యమైనవి కావు అవి దుఃఖ హేతువులే.

శ్లో|| ''సుఖ మాత్యంతికం యత్ర బుద్ధి గ్రహ్య మతీంద్రియం''

--గీత 6-21

సుఖము అతీంద్రియ మైనది. బుద్ధిచేత గ్రాహ్యమైనది. అందులకే భాగవతము

''అల్పతరమైన సుఖముల నందుచున్న జనుల దుఃఖంబు మాన్పంగ జాలు'' న దని చెప్పబడినది. ఇంద్రియ సుఖములు అల్పసుఖములే, ఉదాహరణమునకు భగవద్గీత అర్జున విషాద యోగముతో ఆరంభ##మైనది. యుద్ధము చేయవలయునా? వలదా? అను అంశముపై కర్తవ్యమేది? అకర్తవ్యమేది? ధర్మమేది? అధర్మమేది? అని నిర్ణయింపజాలక అర్జునుడు విషాదమున మునిగెను. శత్రువులను జయింపజాలనను భయముగాని, రాజ్యకాంక్షగాని అతనికి విషాదము కలిగింప లేదు. ఆ కారణముచేత యుద్ధ విముఖుడు కాలేదు.

శ్లో|| నకాంక్షే విజయం కృష్ణ! నచ రాజ్యం సుఖానిచ

--గీత 1-32

శ్లో|| అహోబత మహత్పాపం కర్తుం వ్యవసి తావయం

యద్రాజ్య సుఖ లోభేన హంతుం స్వజన ముద్యతాః

--గీత 1-45

''రాజ్యము సుఖములపై ఆశ##చేత బంధువులనుగూడ చంపుట కుద్యుక్తుల మగుట పాపహేతువు కదా! ఇట్టి పాపభీతిదే అర్జునునకు విషాదయోగము కలిగినది. ఇది కాక యుద్ధము వలన వంశక్షయము, కుల ధర్మనాశనము, కులస్త్రీలు చెడుట, వర్ణసంకరము ఇత్యాదులు కలుగును. కావున అర్జునునకు కర్తవ్య అకర్తవ్యములు నిర్ణయించుటకు వీలు కాలేదు. అతని విషాద కారణమును గుర్తించి కార్యోన్ముఖుని చేయుటకు భగవంతుడు ధర్మాధర్మములు వివరించి కర్తవ్యమును నిర్ణయించెను.

శ్లో|| ఆశోచ్యా నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే

గతాసూన గతాసూంశ్చ నాను శోచన్తి పండితాః

--గీత 2-11

నీవు దుఃఖింపదగని భీష్మద్రోణాదుల గురించి దుఃఖించితిని. మాటలు మాత్రము వివేకులు పలుకునట్టి మాటలు పల్కు చున్నావు. మృతి నొందిన వానిని గూర్చిగాని బ్రతికియున్న వానిని గూర్చిగాని పండితులు శోకింపరు.

శ్లో|| జాతస్య హి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ

తస్మా దపరి హార్యేర్థే నత్వం శోచితు మర్హపి

--గీత 2-27

పుట్టిన వానికి జావును, చచ్చిన వానికి పుట్టుకయును గలుగుట నిశ్చయమైనది, గావున ఆవశ్యకముగా గలుగుచున్న జనన మరణములు విషయమై నీవు వ్యసనము బొందుట యుచితము గాదు.

శ్లో|| సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వా సర్వపా పేభ్యో మోక్షయి ష్యామి మా శుచ

--గీత 18-66

సర్వ ధర్మములను విడనాడి నన్నొక్కనినే శరణు పొందుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విడిపింతును. శోకింపకుము.

అట్లే భాగవతమున కూడ వ్యాసునకు విషాద యోగము కలిగినది. ఆ మహర్షి ఒకటిగానున్న వేదమును బుగ్‌ యజు స్సా మా ధర్వణములను నాలుగు భాగములుగా విభజించెను. పామరులకు వేదార్థము స్ఫురించదని భావించి 17 పురాణముల వ్రాసెను. ఇట్లు లోకహితమొనర్చినను, అతనికి మనశ్శాంతి లభించలేదు. శాంతి అనగా కామా ధ్యరిషడ్వర్గలయము. అట్టి శాంతిని పొందుటకు చేయదగినదేమో తెలియక నారదు నాశ్రయించెను.

సీ|| వ్రతధారినై వేదవహ్ని గురుశ్రేణి

మన్నింతు, విహిత కర్మముల గొఱత

వడకుండ నడపుదు, భారత మిషమున

బలికితి వేదార్థ భావమెల్ల

మునుకొని స్త్రీశూద్ర ముఖ్యధర్మములందు

దెలిపితి, నే జెల్ల దీనజేసి

యాత్మసంతత మంద, దాత్మలో నీశుండు

సంతసింపక యున్న జాడదోచె

భాగవతము 1-85

అని వ్యాసుడు విషాదమున మునిగెను. దానికి నారదుడు ''భగవంతుడు, ధర్మముల్‌ ప్రపంచించిన మెచ్చునే? గుణవిశేషము లెన్నిన గాక'' (భాగవతము 1-95) అని తెలిపి శ్రీనారాయణ స్తుతిపరమైన భాగవతమును వ్రాయుమని ఆదేశించెను.

దప్పిచే బాదపడువాడు నీటికై వెదకునట్లు, విషాదము కలిగి నప్పుడే మానవుడానంద ప్రాప్తికి ప్రయత్నించును. దుఃఖమునుండి నివృత్తి జెంది సుఖమును పొందగోరును. షడ్దర్శనములు దుఃఖముతో ఆరంభించి దుఃఖనివృత్తికి వేరువేరు మార్గములను సూచించినవి. ఈ మార్గములలో భిన్నత్వము కలదు. వీనిని సవరించి సమన్వయ పరచుటయే భగవద్గీత భాగవతముల విశిష్టత యనవచ్చును. (Synthetic philosophy). ఈ గ్రంథముల లక్ష్యము దుఃఖనాశము బ్రహ్మానందప్రాప్తి.

సంసారము దుఃఖమయ మని భగవద్గీత అనేక పర్యాయములు తెలుపుచున్నది.

''అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య'' ----గీత 9-33

లోకము అనిత్యము సుఖ రహితము.

''మృత్యు సంసార వర్త్మని' ---గీత 9-3

మృత్యు రూపమగు సంసార పథము.

జన్మదుఃఖ జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం''

జననము ముసలితనము వ్యాధి మొదలగు దుఃఖములు కలది.

భాగవతమునకూడ ప్రహ్లాదుడు రాక్షస బాలురతో సంసారమును గూర్చి ఇట్లు తెలిపెను.

ఆ|| దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు,

జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి

పొరల నేల? మనకు పుట్టని చావని

త్రోవ వెదకికొనుట దొడ్డ బుద్ధి

భాగవతము 7-214

సంసారమున మునుగుటయే విషాదయోగము. భాగవత భతవద్గీతలు ఇట్టి సంసార దుఃఖ నివారణోపాయములను సూచించినవి. ఏ విధముననైన భగవంతుని శరణు పొందుటయే ఆనందప్రాప్తికి హేతువని దీని సందేశము.

1) జైమిని పూర్వ మీమాంసా దర్శనమును

2) గౌతముని న్యాయ దర్శనమును

3) కణాదుడు వైశేషిక దర్శనమును

4) కపిలుడు సాంఖ్యదర్శనమును

5) పతంజలి యోగదర్శనమును

6) బాదరాయణుడు వేదాంత దర్శనమును వ్రాసిరి.

సాంఖ్య న్యాయ వైశేషికులు తర్కము నవలంబించిరి.

షడ్దర్శనములు సూచించిన మార్గములను భగవద్గీత భాగవతము లెట్లు సవరించినవో పరిశీలింతము.

పూర్వ మీమాంసా దర్శనము:

వేదమున సంహిత బ్రహ్మణముల యందు కర్మకాండ వివరింపబడినది. పూర్వమీమాంసకులకు వేదమునందలి కర్మకాండయే ప్రధానము. వేదవిహితమైన యజ్ఞ యాగాదులు సేయుటయే వారు ధర్మమని, కర్తవ్యమని భావించిరి. ''స్వర్గకామో యజేత'' స్వర్గకాములు యజ్ఞము నాచరింపవలెను. దానివలన స్వర్గమును పొందుటచే దుఃఖనివృత్తి కలుగును. అశ్వమేధమును చేసినచో పాపమును మృత్యువును తరింపవచ్చును.

కాని స్వర్గ ప్రాప్తి శాశ్వత దుఃఖనివృత్తి కలిగించదని గీతా చార్యుడు వచించెను.

శ్లో|| యామిమాం పుష్పితాం వాచం ప్రవదం త్యవిపశ్చితః

వేద వాద రతాః పార్థ! నాన్యదస్తీతి వాదినః

గీత 2-42

వేదములందు తెలిపిన ఫలములను అర్థవాదములని గ్రహింపక మీమాంసకులు ఇంతకంటే వేరు లేదని యందురు.

శ్లో|| కామాత్మనః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం

క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి

గీత 2-43

కర్మ ననుసరించి జన్మలు కలుగును. స్వర్గమే ఉత్తమ పురుషార్థము, అని ఇట్టి భోగైశ్వర్య ప్రాప్తికై కర్మ భేదములను తెలుపుచున్నారు.

శ్లో|| భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ నవిధీయతే గీత 2-44

భోగైశ్వర్య లాలసులైన వారి వాక్కులకు మోసపోయినవారు దలచిత్తము కల వారగుదురు. అట్టివారికి నిశ్చయాత్మక బుద్ధి కలిగి సమాధియందు స్థిరపడరు.

అట్లయినచో కర్మకాండ వదలుమని భగవంతుని ఆదేశమా?

కాదు.

''యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్‌'' గీత 18-5

అని భగవంతుడు యజ్ఞదాన తపములను వదలకూడదని తెలిపెను. అయినచో గీత చెప్పిన కర్మానుష్ఠాన మెట్టిది? దుఃఖ నివృత్తి కై స్వర్గప్రాప్తి కోరి చేయు యజ్ఞ యాగాది కర్మలు మోక్షప్రదములు కావు.

''క్షీణ పుణ్య మర్త్యలోకే విశంతి'' గీత 9-21

పుణ్యము భోగమువలన పూర్తిగా నశించిన తరువాత మరల భూమిపై జన్మింపవలసినదే. కాబట్టి స్వర్గసుఖ మశాశ్వతము.

''న కర్మణా, ప్రజయా, ధనేన, త్యాగేనైకే అమృతత్వ మానశుః''

మహానారాయణోపనిషత్తు

కర్మ, ధనము మొదలగు వానిచే మోక్షమురాదు. త్యాగము చేత మాత్రమే మోక్షప్రాప్తి.

భాగవతమున జెప్పబడిన యజ్ఞము స్వర్గకాముడుచేయు పశుయజ్ఞముకాదు. భారతమున ధర్మరాజు రామాయణమున రాముడు అశ్వమేధములు చేసిరి. భాగవతమున హరిని జేరుటకై ఋషులు సత్రనామక యజ్ఞము చేసిరి. ఇది నిష్కామముగా ఈశ్వరార్పణ బుద్ధితో చేయు మనోయజ్ఞము, లేదా ధ్యానయజ్ఞము లేదా బ్రహ్మ యజ్ఞము. ప్రాచీనబర్హిచే చేయబడిన పశుయజ్ఞము భాగవతమున దూషింపబడినది.

''కర్మణా బధ్యతే జస్తుః విద్యయాతు విముచ్యతే''

జీవుడు సకామకర్మవలన బద్ధుడగును! జ్ఞానమువలన ముక్తుడగును. అందువలన కర్మల నీశ్వరార్పణబుద్ధితో చేయవలయునని భాగవతము తెలుపుచున్నది.

''కర్మంబులు సంసార హేతుకంబు లయ్యును. ఈశ్వరార్పిత ములై తమ్ముతాము చెరచుకొన నోపియుండును.'' ఈశ్వరునియందు సమర్పితంమైన కర్మంబు దాపత్రయంబుల మాన్ప నౌషధంబగు.

భాగవతము 1-110

''ఫలంబు గోరక కర్మంబీశ్వరునకు సమర్పణంబు సేయకున్ననది ప్రశస్తంబై యుండదు'' భాగవతము 1-98

తే|| అరయ నిష్కామ ధర్ములైనట్టి భక్తు

లందు నీవు ప్రసన్నుండవైన రీతి

హృదయముల బద్ధకాములై యొనయు దేవ

గణములందు బ్రసన్నత గలుగ నీవు. భాగవతము 3-99

''నిపుణుడైనవాని నిష్కర్మతకు మెచ్చువాని కే నొనర్తు వందనములు '' గజేంద్రమోక్షము.

అట్లే భగవద్గీత యందును ఇట్లు చెప్పబడినది.

శ్లో|| యజ్ఞార్థా త్కర్మణో7న్యత్ర లోకో7యం కర్మబంధనః

తదర్థం కర్మ కౌంతేయ! ముక్తసంగ స్సమాచర.

---గీత 3-9

ఈశ్వరార్థముగా చేయు కర్మకంటె భిన్నమగు కర్మ లోకమునకు బంధము కలిగించును. అందువలన ఈశ్వరార్థమగు కర్మను ఫలాపేక్ష లేనివాడై చేయును.

పై వివరణమువలన భగవద్గీతకాని భాగవతముకాని కర్మలను చేయకూడదని నిషేదింపదు. కామ్య కర్మ మోక్షప్రదముకాదు. అందు వలన ఈశ్వరార్పణబుద్ధితో ఫలాపేక్ష రహితముగ యజ్ఞయాగాదులను చేయవలయునని బోధంచుచున్నవి. ఇదియే కర్మయోగము.

ఇంకను

శ్లో|| యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ

సిధ్య సిధ్యో స్సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే.

---గీత 2-48

యోగమునం దున్నవాడవై, కర్మఫలాసక్తి వదలి, కర్తృత్వ భావమును వదలి, సముడవై అనగా కార్యము సిద్ధించినపుడును ప్రతి కూలించినపుడును సమబుద్ధితో కర్మల నాచరింపుము. ఇదియే కర్మయోగము. కర్తృసంగము ఫలసంగము వదలుమని భావము.

శ్లో|| బుద్ధియుక్తో జిహాలీహ ఉభే సుకృత దుష్కృతే

తస్మాత్‌ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్‌

గీత 2-50

సమత్వబుద్ధితో కూడిన వానిని పుణ్యపాపములు రెండును అంటవు. కావున నీ విట్టి కర్మయోగము నవలంబింపుము. కర్మలుచేయుట యందు నేర్పరితనమే యోగము.

శ్లో|| కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః

జన్మ బంధ వినిర్ముక్తాః పదం గచ్ఛం త్యనామయమ్‌.

---గీత 2-51

సమత్వబుద్ధితో గూడుకొన్న పండితులు కర్మవలన బుట్టిన ఫలమును వదలి జన్మబంధములకు లోబడనివారై సర్వోపద్రవ రహిత మైన విష్ణు దివ్యపదమును పొందుదురు.

పై విధముగా మీమాంసకుల కర్మ సిద్ధాంతము స్వరప్రదము కాగా, భగవద్గీత భాగవతముల యందలి కర్మయోగము మోక్షప్రదమైనది.

న్యాయదర్శనము:

కేవల మనుమాన ప్రమాణము ద్వారా ఈశ్వరు డున్నాడని ఈ దర్శనము చెప్పుచున్నది. మానవుడు చేయు కర్మఫలము అతని అధీనమున నున్నదని తెలుపుచున్నది. మోక్షప్రాప్తికి సాధనము ఈ దర్శనమున పేర్కొనబడిన 16 పదార్థముల జ్ఞానమే ననియు, ఈశ్వరునకు ప్రాధాన్యత లేదనియు సూచించుచున్నది. భగవద్గీతయందు, భగవంతుని సంకల్పము లేనిది ఏమియు జరుగదనియు, మానవుడు పురోగమింప జాలడనియు, తెలుపుటచే గీతలో న్యాయదర్శన ప్రసక్తి అగుపించదు.

వైశేషికదర్శనము:

ఈ దర్శనముతో గూడ గీత ఏకీభవించదు. ఇందులో ఏడు పదార్థముల సాధర్మ వై ధర్మ జ్ఞానమే తత్త్వజ్ఞానమని తెలుపబడినది. ఈశ్వరునకు ప్రాధాన్యతలేదు. అందువలన గీతలో దీని ప్రసక్తిలేదు.

సాంఖ్యదర్శనము:

దీనిని కపిలమహర్షి రచించెనని చెప్పుదురు.

ప్రస్తుతము ఈశ్వరకృష్ణ కవి రచించిన సాంఖ్యకారికలను బట్టి సాంఖ్య సిద్ధాంతమును సంగ్రహముగ గ్రహింపవచ్చును. ఈ సిద్ధాంతసారమేమనగా ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక దుఃఖములను విచారించుటే ముక్తికి మార్గము. ఇది ప్రకృతి పురుష వివేకమనెడి జ్ఞానముచేత సాధ్యమగును. పరిణామమే స్వభావముగా గల ప్రకృతి సత్త్వరజస్తమో గుణాత్మకము. అతి స్వయముగా సృష్టి యొనర్చును. ప్రకృతి పురుషు లిద్దరు స్వతంత్రులు. అనాది వస్తువులు. అనంతులు. ఈ దర్శనములో ఈశ్వర ప్రసక్తి లేదు. సాంఖ్యులు 25 తత్త్వముల సూచించిరి.

మూలప్రకృతి - 1

మహత్తత్వము - 1

అహంకారము - 1

పంచతన్మాత్రలు - 5

కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు

+ మనస్సు } - 11

పంచభూతములు - 5

పురుషుడు - 1

---------------

25

----------------

కొన్ని విషయములలో గీత సాంఖ్యముతో ఏకీభవించును.

1) సాంఖ్య సిద్ధాంతము ప్రకారము సృష్టియందు ప్రకృతి పురుషులు కలిసి యుందురు. పురుషుని గుణములు ప్రకృతి యందును ప్రకృతి గుణములు పురుషుని యందును సంక్రమించును. ఇందువలన అచేతనమగు ప్రకృతి సచేతన మగును. అకర్తయగు పురుషుడు కర్తగ అగుపించును. గీత ఈ సిద్ధాంతమునే సమర్థించుచున్నది.

శ్లో|| పురుషః ప్రకృతి స్థోహి భుఙ్కట్‌త ప్రకృతిజాన్‌ గుణాన్‌

గీత 13-24

జీవరూపుడగు పరమ పురుషుడు ప్రకృతి యందుండియే ప్రకృతి వలన బుట్టిన గుణముల ననుభవించును.

భాగవతమున ఇట్టి అభిప్రయమే తెలుపబడినది.

సీ|| జననుత! సత్వరజస్తమో గుణ మయ

మైన ప్రాకృత కార్యమగు శరీర

గతుడయ్యు పురుషుండు గడగి ప్రాకృతములు

నగు సుఖదుఃఖ మోహముల వలన

గర మనురక్తుండుగాడు, వికార హీ

నుడు ద్రిగుణ రహితుడు నగుచు

బలసి నిర్మల జల ప్రతిబింబింతుడైన

దినకరు భంగి వర్తించు నట్టి

తే|| ఆత్మ బ్రకృతి గుణంబుల యందు దగులు

వడి, యహంకార మూఢుడై తొడరి యేను

గడగి నిఖిలంబునకు నేను గర్తనని ప్ర

సంగ వశతను బ్రకృతి దోషముల బొంది.

భాగవతము 3-904

2) ప్రకృతి గుణములైన సత్వరజస్తమో గుణములే సర్వ కార్యములను జేయుచున్నవి. పురుషుడు సాక్షిమాత్రుడని రెండును అంగీకరించుచున్నవి.

శ్లో|| ప్రకృతేః క్రియమాణాని గుణౖః కర్మాణి సర్వశః

అహంకార విమూఢాత్మా కర్తాహ మితి మన్యతే.

గీత 3-27

ప్రకృతివలన బుట్టిన సత్వరజస్తమోగుణములు కర్మలకు కారణ మగుచుండును. అహంకారముగల అవివేకి ఆ కర్మలన్నియు తన చేతనే జరుగునని తలచును.

శ్లో|| ప్రకృత్యైవచ కర్మాణి క్రియమాణాని సర్వశః

యః పశ్యతి తథా7త్మాన మకర్తారం స పశ్యతి

గీత 13-29

ఎల్ల కర్మలు ప్రకృతి గుణములచే చేయబడును. ఇది తెలిసిన వాడు ఆత్మను కర్మలు చేయని దానినిగా జూచుచున్నాడు.

3) పరమాత్మ నిష్క్రియుడు, నిర్లిప్తుడని రెండును అంగీకరించును.

శ్లో|| అనాదిత్వాత్‌ నిర్గుణత్వాత్‌ పరమాత్మ7య మవ్యయః

శరీరస్థో7పి కౌన్తేయ నకరోతి నలిప్యతే గీత 13-31

పరమాత్మ అనాది, నిర్గుణుడు, అవ్యయుడు. శరీరము నందున్నప్పటికిని ఏమియు చేయడు. దేనికి అంటుకొనడు. చేయనివాని కింకఫల మంటు టెక్కడ?

సాంఖ్య దర్శనమునకు గీతా సిద్ధాంతమునకు కొన్ని భేధములు కలవు.

1) సాంఖ్యమున ఈశ్వరుని గూర్చిన ప్రసక్తియే లేదు. అతని యునికి ఋజువు కాలేదు.

2) గీతయందు ప్రకృతి రెండు విధములుగా చెప్పబడినది.

1) అపరా 2) పరా. ఈ రెండే సాంఖ్యులు సూచించు ప్రకృతి పురుషులనవచ్చును. వీరే క్షరపురుషుడు, అక్షరపురుషుడు. ఈద్వైతము తోనే సాంఖ్యము ముగిసినది. గీతయందు వీరిద్దరికి పరుడైన పరమాత్మ చెప్పబడెను.

శ్లో|| ద్వావిమౌ పురుషౌ లోకే శ్చా క్షర ఏవచ

క్షర స్పర్వాణి భూతాని కూటస్థో7క్షర ఉచ్యతే

గీత 15-16

పురుషు డీలోకమున క్షరుడనియు, అక్షరుడనియు రెండు విధములుగా నున్నాడు. సమస్త భూతజాలములు క్షరుడు. కూటస్థుడైన జీవు డక్షరుడు.

శ్లో|| ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః

యో లోకత్రయ మా విశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః

గీత 15-17

క్షరా క్షరములకంటె విలక్షణమగు ఉత్తమ పురుషుడు మరియొకడు కలడు. అయన మూడు లోకములు వ్యాపించి సమస్తమును భరించుచున్నాడు. నాశరహితుడు పరమాత్మ అని చెప్పబడుచున్నాడు.

3) 25 తత్త్వముల విచారణ, ప్రకృతి పురుషుల వివేక జ్ఞానమే ముక్తికి సాధనమని సాంఖ్యుల మతము. ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే ముక్తికి సాధనమని గీత మతము.

భాగవతము కూడ గీత మతమునే సమర్థించుచున్నది.

శ్లో|| నిరోధో7స్యాను శయన మాత్మనః సహశక్తి భిః

ముక్తిర్హిత్వా న్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితః

ద్వి. 10-6

4) సాంఖ్యము పురుషు లనేకులని తెలుపుచున్నది. గీత ఈ విషయము నొప్పుకొనదు.

శ్లో|| యధా ప్రకాశయ త్యేకః కృత్స్నం లోక మిమం రవిః

క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత!

గీత 13-33

సూర్యుడొక్కడే యయ్యును లోకమంతయు నెట్లు ప్రకాశము కలిగించునో అటులనే పరమాత్మ ఒక్కడయ్యు సర్వ క్షేత్రములకు ప్రకాశము నిచ్చుచున్నాడు. భూతకోట్లనేకముగా నుండినను అంతర్యామి యగు పరమాత్మ ఒక్కడే.

శ్లో|| క్షేత్రజ్ఞ వాపి మాం విద్ధి సర్వ క్షేత్రేషు భారత!

గీత 13-12

సమస్త శరీరము లందుండెడి నన్ను క్షేత్రజ్ఞునిగా దెలియుము.

శ్లో|| అవిభక్తంచ భూతేషు విభక్త మివచ స్థితం గీత 13-16

బ్రహ్మము సకల ప్రాణుల యందు అభేదముగా నున్నను ఉపాధి భేదముచేత అజ్ఞానులకు వేరువేరుగా విభజింపబడిన దానివలె నుండును.

భాగవతమున భీష్ముడు శ్రీకృష్ణుని నుతించునప్పుడు పై అభిప్రాయమును సూచించెను.

మ|| ఒక సూర్యుండు సమస్త జీవులకు దా నొక్కొక్కడై తోచు పో

లిక, నే దేవుడు సర్వకాలము మహాలీలన్‌ నిజోత్పన్న జ

న్య కదంబంబుల హృత్సరోరుహములన్‌ నానావిధానూనరూ

పకుడై యొప్పుచు నుండునట్టి హరి నే బ్రార్థింతు శుద్ధుండనై

భాగవతము 1-226

5) ప్రకృతిస్వభావమే పరిణామమని సాంఖ్యుల మతము. కాని పురుషుని ఆశ్రయముచేతనే పరిణామము కలుగుచున్నదని గీతమతము.

శ్లో|| మయా ధ్యక్షేణ ప్రకృతిః సూయతే స చరాచరమ్‌

గీత 9-10

నా అధ్యక్షత చేతనే చరాచరమగు సమస్త భూతములను ప్రకృతి పుట్టించుచున్నది.

భాగవతము ఈ విషయమునే తెలుపుచున్నది.

శ్లో|| కాల వ్యత్యాతు మాయా యాం

గుణమయ్యా మధోక్షణః

పురుషే ణాత్మ భూతేన

వీర్యమాధత్త వీర్యవాన్‌

తతో7 భవత్‌ మహత్తత్త్వం. భాగవతము 3-5-26-7

కం|| పురుషాకృతి నాత్మాంశ

స్ఫురణము గల శక్తి నిలిపి పురుషోత్తము డీ

శ్వరు డభవుం డజుడు నిజో

దర సంస్థిత విశ్వమపుడు దగ బుట్టించెన్‌

6) ప్రకృతి పురుషులు పరమాత్మయందే లీనమగు చున్నారని భగవద్గీత భాగవతముల మతము. సాంఖ్యుల ప్రకృతిపురుషులు కేవల పరమాత్మ విలాసములు మాత్రమే.

శ్లో|| భూమిరాపో7నలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా. గీత 7-4

భూమి నీరు అగ్ని గాలి ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని నామాయాశక్తి ఎనిమిది విధములగు భేదమును బొంది యున్నది.

శ్లో|| అపరేయ మితి స్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్‌

జీవభూతాం మహాబాహో! యయేదం ధార్యతే జగత్‌ గీత 7-5

పైని జెప్పిన 8 విధములు గలది నా అపరా ప్రకృతి. దాని కంటె ఇతరమైనది పరాప్రకృతి. అదియే సమస్త ప్రాణ ధారణ కారణము, సకల ప్రపంచము దానిచే ధరింపబడి యున్నదని తెలిసి కొనుము.

శ్లో|| ఏత ద్యోనీని భూతాని సర్వాణీ త్యుస ధారయ

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తధా

గీత 7-6

సమస్త భూతములు ఈ పరాప్రకృతి వలననే పుట్టినవి. నేను జగత్తునకు ఉత్పత్తికిని నాశనమునకును కారణ భూతుడను.

శ్లో|| మత్త తరం నాన్య త్కించిదస్తి ధనంజయ!

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.

గీత 7-7

నా కంటె ఇతర కారణము మఱొకటిలేదు. ఈ సర్వ ప్రపంచము దారమునందు రత్నమువలె నాయందు గూర్పబడి యున్నది.

గీత తెలిపిర పై అభిప్రాయములనే భాగవతము కూడ సమర్థించుచున్నది. శ్రీరామ నారాయణ వ్యాస్‌ రచించిన The Synthetic Philosophy of Bhagavatha నుండి ఈశ్వరకృష్ణుని సాంఖ్యమునకును భాగవతమున కపిలుని సాంఖ్యమునకును గల భేదములను క్రింద సూచించితిని.

"The first point of difference between the two views is that while Bhagavatha postulates only one' Purusa ' as the real all pervadingsoul, which is the real seer of all our experiences and the basic reality that underlies all things of the Universe, it emphatically rejects the plurality of the purusas accepted by the Classical Samkhya of Isvara Krishna.

Next, the Classical samkhya is atheistic, while the Bhagavatha samkhya is distinctly theistic.

The concept of 'Prakrti' too has different connotations Prakrti according to the Bhagavatha, is no doubt beginningless, but for the true knower, brahman alone exists. Prakrti loses its existence in Him Classical samkhya holds the view that Prakrti is eternal and beginingless and thus is coeval with Purusa

Both differ in their conception of emancipation. According to classical samkhya, emancipation means the absolute cessation of all pain, Spiritual (adhyatmika), material (adhibhouthika) and destined (adhidaivika) - withpout a possibility of return, But in the Bhagavatha, emancipation can be attained when the true nature of atman is realised and penetrating the veil of maya one identifies one self with brahman, the true self.

And then there is a further difference between the two so far as the number of categories is concerned. The Bhagavatha has allotted a very important position to Kala or Time which is missing from the classical Samkhya. The Bhagavatha realy speaking accepts only one category, viz,brahman or the supreme Being, while the classical samkhya has the twenty five categories that constitute the world.

భాగవతమున ఇట్లు చెప్పబడినది.

జనులకెల్ల శుభము సాంఖ్యయోగము, దాని

వలన ధర్మనిష్ఠ వలననైన

అంతకాల మందు హరి చింతసేయుట

పుట్టువులకు ఫలము భూవరేంద్ర!

శ్లో|| ఏతావాన్‌ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మ పరినిష్ఠయా

జన్మలాభః పరః పుంసా మంతే నారాయణ స్మృతిః

సాంఖ్యమునకు కర్మతో యోగముచేసి సరియైనజ్ఞానము వలన సరియైన కర్మల నాచరించును. సాంఖ్యమును కర్మతో యోగముచేసి స్వధర్మమును పరినిష్ఠితము చేయవలయును.

పై విధముగా ఈశ్వరకృష్ణ సాంఖ్య కారికలకును భగవత భగవద్గీతల సాంఖ్య సిద్ధాంతమునకును గల భేదములు వివరింప బడినవి.

పాతంజల యోగ దర్శనము:-

దీనిని పతంజలి రచించెను. ఈ దర్శనమున 4 పాదము లున్నవి. 1) సమాధిపాదము. 2) సాధనపాదము. 3) విభూతిపాదము. 4) కైవల్యపాదము. పతంజలి సాంఖ్యులు చెప్పిన 25 తత్త్వములే కాక ఈశ్వరుడను 26వ తత్త్వమును తెలిపెను. ఈశ్వరుడనగా సాంఖ్యులుచెప్పిన పురుషుడుకాడు. ఇతడు విశేష పురుషుడు.

ఈ శాస్త్రము ప్రతిపాదించు ముఖ్య విషయము విశేష పురుషుని గుఱించి కాదు. దీని ముఖ్యవిషయము యోగము. అందులకే దీనిని యోగదర్శన మనిరి. ప్రకృతి పురుషుల నిశ్చయజ్ఞానమునకు యోగమేనని పతంజలి భావము.

''యోగః చిత్తవృత్తి విరోధః''

పతంజలి చిత్తవృత్తి నిరోధమే యోగమని నిర్వచించెను. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిథానము -దీనిని క్రియాయోగ మందురు. వీనిచే మానవుడు ఏకాగ్రచిత్తుడగును.

చిత్త పురుషసంయోగమే చిత్తవృత్తులు ఉత్పన్నమగుటకు కారణము భగవంతుడు శుద్ధ స్ఫటికము వంటివాడు. ఎర్రని పువ్వు స్ఫటికము ప్రక్కన ఉన్నప్పుడు స్ఫటికము ఎర్రగా అగుపించును. అట్లే ఆత్మ యందు దుఃఖము సుఖము మొదలగు చిత్తవృత్తులు ప్రతిఫలించును. ఆత్మ వానితో తద్రూపమునొంది తాను సుఖదుఃఖముల ననుభవించు నట్లు తలచును. కాని వాస్తవముగా ఆత్మకు సుఖదుఃఖములు లేవు. యోగమువలన చిత్తవృత్తులు నిరోధించిన పిదప ఆత్మయందు వాని వృత్తి కనిపించదు. ఆత్మ స్వ స్వరూపమున నిలకడ జెందును.

చిత్తవృత్తి నిరోధమునకు అనేక ఇతర మార్గములు సూచింపబడినవి.

1) అభ్యాస వైరాగ్యములు

2) ఈశ్వర ప్రణిధానము

3) ప్రాణాయామము.

యోగాంగము లెనిమిది. అవి యమ నియమ ఆసనప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు.

1) యమము=అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము.

2) నియమము=తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము.

3) ఆసనము=యోగాసనములు.

4) ప్రాణాయామము=రేవక పూరక కుంభకములు.

5) ప్రత్యాహారము=ఇంద్రియ నిగ్రహము (బాహ్య నామరూపముల యందు మనస్సును పోనీక ఏక మార్గము నొందజేయుట.)

6) ధారణ=మనస్సును ఒక స్థానమందు నిలుపుట.

7) ధ్యానము=సోహంభావముతో ధ్యానించుట.

8) సమాధి=అహమను స్ఫురణ అణగిన స్థితి.

వీని వలన ఏర్పడు నిర్బీజ సమాధిస్థితియే కైవల్యమని పతంజలి అభిప్రాయము.

భగవద్గీత పై అష్టాంగములను సమర్థించినది.

1) యమము:-

ప్రశాంతతా విగతభీః బ్రహ్మచారీ వ్రతే స్థితః'' గీత 6-14

శాంతచిత్తడై భయమును వదలి బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడై యుండ వలయును.

2) నియమము:-

''మనసై వేంద్రియ గ్రామం వినియమ్య సమం తతః''

---గీత 6-24

మనస్సున ఇంద్రియములను నియమించవలెను.

3) ఆసనము:

శుచేదేశే ప్రతిష్ఠాస్య స్థిరమాసన మాత్మనః ---గీత 6-11

పరిశుద్ధమగు ప్రదేశమున స్థిరాసనుడు కావలెను.

4) ప్రాణాయామము:-

''ప్రాణాపానే సమం కృత్వా నాసా భ్యంతర చారిణౌ''

---గీత 5-27

ప్రాణాపానముల రెంటిని సమము చేయవలెను.

5) ప్రత్యాహారము:-

''స్పర్శాన్‌ కృత్వా బహి ర్బాహ్యాన్‌'' ---గీత 5-27

బాహ్య విషయములనుండి విముఖుడు కావలెను.

6) ధ్యానము:-

''మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః''

---గీత 6-14

మనస్సును చిక్కబట్టి నాయందు లగ్నమొనరించి ధ్యానించు చుండవలెను.

7) ధారణ:-

''చక్షుశ్చై వాంతరే భృవో'' ---గీత 5-27

శ్లో|| యతో యతో నిశ్చరతి మనః చంచల మస్థిరమ్‌

తతస్తతో నియమ్యైత దాత్యనైవ వశం నయేత్‌

---గీత 6-26

చలించు మనస్సును విషయమునుండి మరల్చి ఆత్మయందు నిలకడ నొందింనవలయును.

8) సమాధి:-

''ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్‌''

---గీత 6-25

మనస్సును ఆత్మయందుంచిఎట్టి చింతయు లేనివాడు కావలెను.

భాగవతము కూడ అష్టాంగయోగములవలన ముక్తి లభించునవి తెలుపుచున్నది.

ధ్యానములో యోగ మవసర మనియు తెలుపుచున్నది.

పతంజలి యోగదర్శనమునకును గీతలో యోగముపై సూచించిన అభిప్రాయములకును భేదము లేకపోలేదు.

1) ప్రకృతి పురుషుల నియోగము లేక వివేకజ్ఞానమే పతంజలి యోగము. జీవబ్రహ్మల సంయోగమే యోగమని గీత తెల్పుచున్నది.

2) చిత్త నిరోధమునకు ఈశ్వర ప్రణిధానము అనేక సాధనములలో నొకటియని పతంజలి భావించెను, కాని ఈశ్వర ప్రణిధానమే చిత్తవృత్తి నిరోధమునకు ముఖ్యమైన ఉపాయమని గీత తెలుపు చున్నది.

భాగవతమున కూడ ఇట్లు చెప్పబడినది.

''దివ్య విలస దవయవోదార సుందర నప విలాస

మందహాస మనోహర మధుర వచన

రచనచే నపహృత మనః ప్రణు కలగుచు,

నెలమి నుందురు'' భాగవతము 3-879

భక్తుడు ఈశ్వరునియందు మనస్సు లగ్నము చేసినప్పుడు ''అపహృత మనః ప్రణుడగు'' ననుట చేత చిత్తవృత్తి నిరోధమునకు ఈశ్వర ప్రణిధానమే ముఖ్యోపాయమని విశద మగుచున్నది. ప్రహ్లాదుడుకూడ విష్ణుచింతనమున''మఱచెనే తద్విశ్వమున్‌'' అనగా బాహ్యప్రపంచ జ్ఞానమును వదలెనని చెప్పబడినది.

3) పతంజలి తెలుపు ముక్తావస్థలో దుఃఖ నివృత్తియేగాని ఆనంద ప్రాప్తి లేదు. ఎందుకనగా పురుషుడు చిత్స్వరూ పుడేగాని ఆనంద స్వరూపుడుగాడని పతంజలి అభిప్రాయము. కాని భగవద్గీతలో యోగి బ్రహ్మానంద మనుభవించునవి చెప్పబడినది.

శ్లో|| ప్రశాస్త మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమం

ఉపైతి శాంత రజసమ్‌ బ్రహ్మభూత మకల్మషమ్‌.

గీత 6-23

నిరంతరము ఇట్లు యోగమునందు దస యాత్మను నిల్పు స్థిర ప్రయత్నముగల యోగికి దోషములు పూర్తిగా నశించును. కావున అతడు అనాయసముగ అత్యుత్తమమగు బ్రహ్మానందసుఖము ననుభవించును.

4) నిర్బీజ సమాధియందు జీవునకు తన సాక్షాత్కారమేకాని బ్రహ్మ ప్రాప్తి కాదని పతంజలి అభిప్రాయము. కాని యోగమువలన కలుగు సాక్షాత్కారము బ్రహ్మసాక్షాత్కారమని గీత అభిప్రాయము.

శ్లో|| యుంజన్నేవం సదా7త్మానం యోగీ నియత మానసః

శాన్తిం నిర్వాణ పరమాం మత్సం స్థా మధిగచ్ఛతి

గీత 6-15

ఇట్లు నిశ్చయించిన మనస్సుగల యోగి తన మనస్సు సర్వదా స్వాధీనము చేసికొని ఉత్తమ మగు నాయొక్క స్థానమును బొందు చున్నాడు.

5) కర్మల నీశ్వరున కర్పణ సేయుటయే ఈశ్వర ప్రణిధానమని పతంజలి నుతము. కాని ఇది గీతయొక్క కర్మయోగ సిద్ధాంతము. ఈశ్వర ప్రణిధాన మనగా ఈశ్వరుని యందు మనస్సు లగ్నము చేయుటు కాదని పతంజలి భావించెను.

శ్లో|| యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్‌,

యత్తపస్వసి కౌన్తేయ! తత్కురుష్వ మదర్పణమ్‌.

గీతా 9-27

దేహయాత్రకు వలయునట్టి లౌకికకర్మ ఏది చేయుచున్నావో, యజ్ఞము, దానము, తపస్సు, భుజించు పదార్థములు అన్నీ నాకర్పణ చేయుము. ఇదియే ఈ కర్మ సిద్ధాంతమే పతంజలి ఈశ్వరప్రణిధానము. సర్వకాల సర్వావస్థల యందును ఈశ్వరునియందు మనస్సులగ్నము సేయుటయే ఈశ్వర పణిదానమని భాగవతముకూడ సమర్థించెను. ప్రహ్లాదుని దినచర్య పరికింపుడు.

శో|| పానీయంబులు ద్రావుచున్‌, గుడుచుచున్‌, భాషించుచున్‌, హాసలీ

లానిద్రాదులు సేయుచున్‌, దిరుగుచున్‌, లక్షించుచున్‌ సంతత

శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృత స్వాదసం

ధానుండై మఱచెన్‌ సురారిసుతు డేత ద్విశ్వమున్‌ భూవరా!

భాగవతము 7-23

6) ఈశ్వర ప్రణిధానమున చిత్తైకాగ్రత కలుగును. ఆత్మ సాక్షాత్కారము కలుగునవి పతంజలి అభిప్రాయము. కాని ఈశ్వరునితో చిత్త సంయోగమే యోగమని గీత అభిప్రాయము.

శ్లో|| యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా

శ్రద్ధావాన్‌ భజతే యోమాం సమే యుక్తత మోమతః

గీత 6-47

యోగులందరిలో నాయందంతః కరణము గలవాడగుచు, శ్రద్ధతో నన్నెవ్వడు సేవించుచున్నాడో ఆతడు యోగశ్రేష్ఠుడని నా మతము.

అందువలననే శ్రీకృష్ణుడు యోగము నిట్లుపదేశించెను.

శ్లో|| మన్మనాభవ, మద్భక్తో, మద్యాజీ మాం నమస్కురు

మామే వైష్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణః

గీత 9-34

నాయందే మనస్సు నిల్పుము. నాయందే భక్తి కలిగియుండుము. నాకే నమస్కరింపుము. ఇట్లు నన్నే ఎంచితివేని నన్నే పొందగలవు.

పైన చూపినట్లు భాగవత భగవద్గీతలకును పతంజలి యోగ సూత్రములకును కొంతభేదము అగుపించుచున్నది. అందులకే భాగవతమున బ్రహ్మదేవుడు యోగజనిత జ్ఞానమును పొందియు కమల నయనుడైన శ్రీహరిని కనుగొనజాల డయ్యెను. కాని ''కనియెన్‌ నిశ్చల భక్తియోగమున'' అని భాగవతము సూచించుచున్నది.

శ్లో|| తపస్వి భ్యోధికో యోగీ జ్ఞాని భ్యోపి మతోధికః

కర్మిభ్య శ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున!

గీతా 6-46

వేదాంత దర్శనము :

దీనిని బ్రహ్మసూత్రము లనియు, ఉత్తర మీమాంస ఆనియు అందురు. దీనికి బాదారాయణ మహ్న రచించెను. వేదములలో అంతమందు జ్ఞానకాండ ఉపనిషత్తులలో చెప్పబడినది. ఆ విషయమునే క్రింది విధముగా వేదాంత దర్శనము ప్రతిపాదించుచున్నది.

దుఃఖ నివృత్తి ఆనందప్రాప్తి-ఈ రెండు వేదాంతదర్శన లక్ష్యములు. బ్రహ్మస్రాప్తివలననే దుఃఖ నివృత్తి కలుగును. బ్రహ్మ జ్ఞానమువలననే గాని కర్మకాండవలన ముక్తి లభింపదు. వేదాంత మతానుసారము జీవుడే బ్రహ్మము. బ్రహ్మము సచ్చిదానంద స్వరూపము వేదాంత దర్శనము బ్రహ్మజ్ఞానముతో ప్రారంభ##మై బ్రహ్మ ప్రాప్తితో ముగియుచున్నది. జీవుడు వేరు దేవుడు వేరను భావము భ్రాంతి. కర్మవలన ఈ భ్రాంతి తొలగదు. జ్ఞానమువలననే సాధ్యమగును. భగవంతుడు సగుణ నిర్గుణరూపములు కలవాడు. శంకరులు చెప్పిన ''బ్రహ్మసత్యం జగన్‌ మిథ్య'' అను వాక్యమును బ్రహ్మసూత్రములు సమర్థించుచున్నవి.

పారమార్థిక దృష్టితో బ్రహ్మము నిర్గుణము. నిరుపాధికము, వాక్కున కందనిది. వ్యావహారిక దృష్టితో సగుణము, ఉపాధి సహితము, నిర్గుణోపాసన పునరావృత్తి రహిత కైవల్యముక్తి కలగించును. సగుణోపాసన క్రమముక్తి కలిగించును.

భాగవతము పునరావృత్తి రహిత కైవల్యముక్తి జ్ఞానముచైతనే గాక భక్తిచేతనే భాగవతులు పొందగలరని తెలుపుచున్నది.

వరమ భాగవతులు పాటించు పధమిది

ఈ పధమున యోగి ఏగెనేని

మగిడిరాడు వాడు, మరి సంశయములేదు

కల్ప శతములైన కౌరవేంద్ర. -- భాగవతము 2-33

''స్వధర్మ నిరతుడైన పురుషుడు. అనేక జన్మల తర్వాత బ్రహ్మత్వమునొంది తరువాత ఈశ్వరత్వమును తరువాత విష్ణుదివ్యపదమును పొందును. కాని భగవంతు డట్టి పదంబును దనంతనే పొందు'' నని శివుడు భాగవతుల ప్రాశస్త్యముగూర్చి తెలిపెను.

భాగవతము 4-699

భాగవత భగవద్గీతలు వేదాంత దర్శనముతో అనేక విషయము లందు ఏకీభవించును.

1) వేదాంత దర్శనమువలెనే భగవద్గీత భాగవతములు దుఃఖవివృత్తి నిరతిశయ ఆనందప్రాప్తి లక్ష్యములుగా గలిగియున్నవి. బ్రహ్మసూత్రములచే తత్త్వము తెలుపబడినది. దానినే గీత రూపమున భగవాను డుపదేశించెను.

2) గీతలో కృష్ణుడే సృష్టి స్థితి లయములకు బీజమని చెప్పబడినది. జగత్తు పరమాత్మ రెండుసత్యములను ద్వైతులవలెగాక బ్రహ్మ సూత్రములు కూడ పరమాత్మ సత్యమని జగత్తు మిథ్య అని ఒప్పుకొనుచున్నవి.

''ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజ మవ్యయమ్‌''

గీత 9-18

ఈ ప్రపంచ ఉత్పత్తి స్థితిలయ స్థానములు నేనే. దీనికి బీజము నిధానము నేనే.

3) పారమార్థిక దృష్టితో జగత్తు బ్రహ్మమే. వ్యావహారిక దృష్టితో దానికి మూలకారణము బ్రహ్మమైనను, మాయచే అది నానాత్వము పొందినదని బ్రహ్మసూత్రములు తెలుపుచున్నవి. భగవద్గీత దీనిని సమర్థించుచున్నది.

శ్లో|| భూమి రాపోనలో వాయుః ఖం మనోబుద్ధి రేవచ

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా

గీత 7-4

శ్లో|| ఆపరేయ మతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం

గీత 7-4

శ్లో|| మత్తః పరతరం నాస్తి కించిదస్తి ధంనజయ

గీత 7-7

నా ప్రకృతి రెండు విధములు. 1) పరా 2) అపరా. నా అపరా ప్రకృతి అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, ఆహాంకారము అనునవి, జీవస్వరూప ప్రకృతి పరాప్రకృతి. నా కంటె భిన్నమగున దేదియు లేదు.

శ్లో|| మయాధ్యక్షేణ ప్రకృతి, సూయతే స చరాచరమ్‌

గీత 9-10

నా ఆధిపత్యమున ప్రకృతి సృష్టి చేయుచున్నది.

4) జీవుడే బ్రహ్మమను వేదాంత వాక్యమునే గీత ఆమోదించుచున్నది.

శ్లో|| అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితిః గీత 10-20

నమస్త ప్రాణుల హృదయ మందుండు ఆత్మను నేనే.

5) వేదాంతము జీవబ్రహ్మల ఐక్యమును అంగీకరించినను. ఉపాధి భేదముచే భిన్నత్వము తెలుపుచున్నది. అట్లే భగవద్గీత కూడ

శ్లో|| ద్వావిమౌ పురషే లోకే క్షరశ్చాక్షర ఏవచ

క్షర స్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే గీత 15-16

శ్లో|| ఉత్తమః పురుష స్త్వన్యః పరమాత్మే త్యుదాహృతః

గీత 15-17

లోకమున క్షరుడు అక్షరుడు అను ఇద్దరు పురుషులు కలరు. భూతములు క్షరపురుషుడు. కూటస్థు డక్షర పురుషుడు. ఈ ఇద్దరి కంటె ఉత్తమ పురుషుడే పరమాత్మ.

6) సగుణ నిర్గుణ బ్రహ్మమును గీతయు సమర్థించు చున్నది.

శ్లో|| సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం

ఆసక్తం సర్వ భృచ్చైన నిర్గుణం గుణభోక్తృచ| గీత 13-14

సమస్త ఇంద్రియ గుణములు కలిగియు, ఇంద్రియములు లేనిది. నిర్గుణమయ్యు అన్ని గుణములు కలది.

భాగవతమున కూడ

క|| అగుణుండగు పరమేశుడు

జగములు గల్పించు కొఱకు చతురత మాయా

సగుణుండగు గావున హరి

భగవంతుం డనగ బరగె భాగవతము 2-99

7) యజ్ఞ యాగాదులచే కల్ప పర్యంత ముక్తియని జ్ఞానముచేత పునరావృత్తి రహిత కైవల్య ముక్తియని గీతయు సమర్థించినది.

శ్లో|| అబ్రహ్మ భవనాల్లోకాః పునరావర్తి నోర్జున

మా మూపేత్యతు కౌన్తేయ పునర్జన్మ నవిద్యతే -గీత 8-16

బ్రహ్మలోకమును జెందినవారు కల్పాంతమున తిరిగి పుట్టవలసినదే. జ్ఞానులు ముక్తులగుచున్నారు.

కొన్ని విషయములలో మాత్రమే వేదాంత దర్శనమునకును, గీతకును భేదములు కనుపించును. గీత, జ్ఞానభక్తి కర్మ ధ్యానమార్గములను, నాల్గింటిని సమర్థించును. కాని నిష్కారము కర్మయోగమే ప్రధానమని గీతకూడ తెలుపుచున్నది.

శ్లో|| ఉత్సీదేయు రిమే లోకా నకుర్యాకర్మచే దహం

సంకరస్యచ కర్తాస్యా ముపహన్యామి మాః ప్రజాః

గీత 3-24

శ్రీకృష్ణుడే తాను కర్మచేయని యెడల లోకములు నశించుననియు జీవుల నాశనమునకు కారణ మగుదుననియు తెలిపికొనెను.

వేదాంతము కర్తవ్యరూపమున ఏమియు చేయకుండుటయే సన్యాసమని తెలుపగా లోకరక్షణకై జ్ఞానియు కర్మముచేయుటను గీత సమర్ధించుచున్నది. కర్మత్యాగి సన్యాసి కాడని, సంకల్పత్యాగి నిజమైన సన్యాసి అని గీతమతము.

శ్లో|| ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తంభ్యాత్మన మాత్మనా

జహి శత్రుం మహాబహో కామరూపం దురాసదమ్‌

గీత 3-43

ఈ విధముగా బుద్ధికంటె పరమైన ఆత్మను గ్రహించి, మనస్సు చేత ఇంద్రియముల నిగ్రహించి, కామరూప శత్రువును నిర్జించుము.

పై విధముగా భాగవత భగవద్గీతలు షడ్దర్శనములను సవరించి ముక్తి మార్గమును నిర్ణయించినవి.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters