Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

25. కుచేలోపాఖ్యానము

పోతన వ్యక్తిత్వము:-

పోతన జీవితమే ఒక భాగవతము. అతడు ప్రహ్లాద కుచేలాది భాగవత భక్తులతో తాదాత్మ్యము బొందియుండెడి భాగవత నైష్ఠికుడు. షష్ఠస్కంధమున సింగన సుక వినుతి యొనర్చుచు పోతనగూర్చి ఇట్లు వ్రాసెను.

ఉ|| ఎమ్మెలు సెప్పనేల జగమెన్నగ పన్నగరాజ శాయికిన్‌

సొమ్ముగ వాక్యసంపదలు సూరలు సేసినవాని, భక్తిలో

నమ్మినవాని, భాగవత నైష్ఠికుడై తగువాని బేర్మితో

బమ్మెర పోతరాజు గవి పట్టపురాజు దలంచి మ్రొక్కెదన్‌,

భాగవతము 6-12

కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యసఖుడు, అతనిని ఖండోత్తరీయుడు. కుచేలుడు, పేదవిప్రుడు, దరిద్రపీడితుడు, కృశీభూతాంగుడు, జీర్ణాంబరుడని పోతన వర్ణించెను. అతని నామమునందే అతని దారిద్ర్యము కొట్ట వచ్చిన ట్లగుపించుచున్నది. కాని అతడు మానధనుడు, విజితేంద్రియుడు, స్థితప్రజ్ఞుడు, విజ్ఞాని, రాగరహిత స్వాంతుడు, శాంతుడు, ధర్మవత్సలుడు, ఘనుడు, బ్రహ్మవేత్త యగుటచేత బ్రహ్మజ్ఞానికుండవలసిన లక్షణములన్నియు కుచేలునీయందు మూర్తీభవించియుండెను. ఇట్టి లక్షణములే పోతనయంనును గలవని గమనింపవలయును. కుచేలుని పాత్రయందు పోతనయే మన కగుపించును.

ఇంకను కుచేలుడు ''దారిద్ర్యంబు బాధింపనొరుల గార్పణ్యవృత్తి నడుగబోవక దనకుదా వచ్చినట్టి కాసు పదివేల నిష్కములుగా దలంచి యాత్మ మోదించి పుత్ర దారాభిరక్ష యొక విధంబున నడపుచునుండు'' వాడు. అట్లే పోతనకూడ దారిద్రుడైనను ఇతరుల యాచింపని అపరిగ్రహుడు. లభించినదానితో తృప్తి జెండెడివాడు. ''సంతుష్టు డీ మూడు జగముల పూజ్యుండు'' అని పోతన చెప్పెను. ''నిజదార సుతోదర పోషణార్థమై'' కవులు కర్షకవృత్తి నవలంబించినను, కందమూలముల తిని జీవించినను లోపములేదు. ఆకటికై పోతన కవితాకన్య నమ్ముకొని పడుపుకూడు తిన నిచ్చగింపడు. కుచేలునివలె దారిద్ర్యమునే వరించెను. సంపన్నాందులకు దారిద్ర్యమే ఆంజనము.

శా|| సంపన్నుండొరు గానలేడు, తనువున్‌ సంసారమున్‌ నమ్మి హిం

సింపన్‌ జూచు దరిద్రు డెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హిం

సింపం డన్వుల నాత్మకున్‌ సములుగా జింతించు నటౌట త

త్సంపన్నాందుల కంజనంబగు సుమీ దారిద్ర్య మూహింపగన్‌

భాగవతము 10-394

పోతనకు భోగ భాగ్యములయం దాసక్తిలేదు. కుచేలునివలె పేదరికమునందే తృప్తి చెంది యుండెను. ధన మదాంధులైన రాజులయొద్ద కొలువు నాశింపలేదు.

పీ|| కమనీయ భూమి భాగములు లేకున్న వే

పడియండుటకు దూది పరుపులేల

సహజంబులగు కరాంజలులు లేకున్న వే

భోజన భాజన పుంజమేల

వల్కలాజిన కుశావళులు లేకున్న వే

కట్ట దుకూల సంఘంబు లేల

గొనకొని వసియింప గుహలు లేకున్న వే

ప్రాసాద సౌధాది పటల మేల

గీ|| ఫల రసాదుల గురియవే పాదపములు

స్వాదుజలముల నండవే సకల నదులు

పొసగ భిక్షము వెట్టరే పుణ్యసతులు

ధన మదాంధుల కొలు వేల తాపసులకు

భాగవతము 2-21

రాజులను ''ఇమ్మనుజేశ్వరాధములు'' అని నిరసించెను.

మ|| కారే రాజులు రాజ్యముల్‌ గలుగవే గర్వోన్నతిం జెందరే

వారేరీ! సిరి మూటగట్టికొన పోవం జాలిరే !

భాగవతము 8-590

అని సిరిసంపదలు చనిపోవునప్పుడు వెంటరావను సత్యమును వెల్లడించెను. అందులకే వసురాయకవి పోతన కవిత్వమును గూర్చి ఆశ్చర్యమును వ్యక్త పరచెను.

''బ్రతుకుపై యాసకూడను బాడు సేయు

ఘోర దారిద్ర్య దుఃఖంబు గుడుచు చకట

ఏ గతిని బల్కె పోతన్న భాగవతము ?

కుచేలుని భార్య పతివ్రతా తిలకము. వంశాభిజాత్య. దుస్సహ దరిద్రబాధకు ఓర్వలేని సంతానము గతినితిలకించి తన పతితో దారిద్ర్య బాధ దీర్పు నుపాయ మూహింపుమని, బాల్యసఖుడైన శ్రీకృష్ణు నాశ్రయింపుమని, సునయోక్తుల బలికెను. శ్రీకృష్ణుని దర్శించుట ''యిహ పర సాధనమగు'' నని కుచేలుడు భావించి అటుకులు మూట గట్టుకొని శ్రీకృష్ణ సందర్శనార్ధ మేగెను. కుచేలునకు శ్రీకృష్ణు డిచ్చు భాగ్యము కంటె శ్రీకృష్ణ సందర్శన భాగ్యమే ఎక్కువ. అందువలన ''జనియె గోవిందు దర్శనోత్సాహి యగుచు''

దారిలో కుచేలున కనేక సందేహములు కలిగినవి. ఒకవేళ బడుగు బాపడని ద్వారపాలకు లడ్డగించిన వారిని సంతృప్తి పరచుటకు తా నర్ధశూన్యుడు కదా? శ్రీకృష్ణ దర్శన భాగ్యమెట్లు లభింపగలదు ! కుచేలుని మనసున దోచిన సమాధానము పరికింపుడు.

తే|| ఐన నాభాగ్య మతని దయార్ద్ర దృష్టి

గాక తలపోయగా నొండుగలదె? యాత

డేల నన్ను పేక్షించు. నేటిమాట

లనుచు ద్వారకాపుర మతడు సొచ్చి భాగవతము 19-976

''సంశయాత్మా వినశ్యతి. తనకీ యనుమానము లేల?'' తాను భక్తుడు శ్రీకృష్ణుడు భక్త వత్సలుడు. అతని దయార్ద్రదృష్టి దక్క ఇతరము తన కండగాలేదు. భగవంతడు తన దర్శనము ప్రసాదింపక ఏల ఉపేక్ష సేయును. అని కుచేలుడు మనస్సును కుదుట బఱచు కొనెను. భక్త కుచేలుడు భావించినట్లే అతనికి ఏ అడ్డు తగులలేదు. ద్వారపాలకు లడ్డుపడలేదు. అతడు రాజమార్గమున పయనించి కక్ష్యాం తరములను ఏ అడ్డు లేక దాటి శ్రీకృష్ణుని దర్శించెను.

''ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునన్‌ జని చని కక్ష్యాంతంబులు గడచి చని ముందట'' అని వ్రాసి పోతన ద్వారపాలకు లడ్డగించు ప్ర సక్తియే చేయలేదు. ఎందులకు? రాజ ప్రాసాదమునకు ద్వారపలకులుండరా? అను ప్రశ్న రాక మానదు.

రాజమార్గమమును బ్రవేశించె ననుటచేత రాజయోగము (లేదా భగవద్గీతలోని రాజవిద్యా రాజ గుహ్యయోగము) ననుసరించి సుషుమ్నా మార్గముద్వారా పయనించెననియు అధః కుండలిని అధిగమించి ఆజ్ఞాచక్రమును చేరి ఇంద్రియములను మనస్సును వశపరచుకొనెననియు, ఊర్ధ్వకుండలిలోని నవచక్రము లనబడు కక్ష్యాంతరముల దాటి ఆత్మసాక్షాత్కారము పొందెననియు చెప్పవచ్చును.

కుచేలున కెట్లు భగవద్దర్శనము కలుగుటయందు సందేహము లేదో అట్లే పోతన దృష్టిలోకూడ మోక్షము సిద్ధించుటయందు అనుమానము లేదు. తాను ''శ్రీ కైవల్య పదంబు జేరుటకునై'' చింతించెను. తాను నిమిత్తమాత్రుడు. శ్రీహరి సూత్రధారి. భాగవతమును పలికించినవాడు రామభద్రుడు. శ్రీరాము డతనిని సాక్షాత్కారించి ''ఏను రామభద్రుండ. మన్నామాం కితంబుగా శ్రీ మహాభాగవతము రెనుంగు సేయుము. భవ బంధములు తెగు''నని యాన తిచ్చెను. పోతన ''శ్రీ మహాభాగవత పాదప పారిజాత సమాశ్రయంబునను హరి కరుణా విశేషంబునను గృతార్థత్వంబు సిద్ధించె''నని బుద్ధి నెఱిగెను; భాగవతమును తెనిగించి పునర్జన్మము లేకుండ తన జన్మను సఫలము జేసికొనెను. అట్లే కుచేలుడు శ్రీకృష్ణ దర్శనభాగ్యము తనకు తప్పక కలుగునని భావించెను. ఆత్యంతిక భక్తుడైన కుచేలుడు భారమంతయు శ్రీహరిపై వదలెను. అందువలన ఏ అడ్డులేక కక్ష్యాంతరముల దాటెను.

ఈ సన్నివేశములో భారతము నాంధ్రీకరించిన తిక్కన వాక్యములలోని అభిప్రాయమును గమనింతము. తిక్కనకూడ పోతనవలె అభేదభక్తినే పాటించి హరిహరనాథుని స్తుతించెను.

శ్లో|| కిమస్తి మాలా కిము కౌస్తుభం వా

పరిష్క్రియా యాం బహు మన్యసే త్వం

కిం కాలకూటః కింవా యశోదా

స్తన్యం తవస్వాదు వద ప్రభోమే

హరిహరనాధుడు స్వప్న దర్శన మిచ్చెను. (పోతన ధ్యాన మగ్నుడైనపుడు శ్రీరాముడు దర్శన మిచ్చెను.) తాను అల్పజ్ఞుడయ్యు మోక్షఫలము నాశించెను. తలపై కిరీటముంచిన రీతిని మోక్ష మొసగుటకు వీలులేదు కదా? ఇంద్రియ మనోనిగ్రహములు ఆవరణ నాశము కలుగవలెను. వీనిని సాధించుటకు కర్మ భక్తి జ్ఞానమార్గముల నవలంబించి పరిణత దశకు చేరుకొనవలెను. అందువలన హరిహరనాధుడు డతనికి సంసారమునుండి దూరము తొలగు మార్గము కనుగొను వెలుగును మాత్రము ప్రసాదించెను. మోక్షమును ఇవ్వలేదు.

తే|| జనన మరణాదులైన సంసార దురిత

ములకు నగుపడ కుండంగ దొలగు తెరువు

గను వెలుంగు నీ కిచ్చితి

అని హరిహరనాథుడు తెలిపెను. కాని పోతనకు శ్రీరాముడగుపించి ''శ్రీ మహాభాగవతంబు దెనుంగు సేయుము. భవ బంధంబులు తెగు''నని యాన తిచ్చెను.

ఇదిగాక ఇంకొక రహస్యము #9; శుద్ధ సత్వగుణముగల సనకన నందనాదులు శ్రీ హరిని దర్శింప వై కుంఠమున కేగినపుడు రజస్త మో గుణములు గల జయ విజయు లడ్డగించి వారిచే శపింపబడిరి. వారే కుంభకర్ణ రావణులుగను. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగను శిశుపాల దంతవక్త్రులుగను జన్మించిరి. భాగవత పఠనమువలన రజస్త మోగుణ పరిహారిణియగు భక్తి సంభవించును. కుచేలుడు భాగవత శిఖామణి యగుటచేత రజస్త మోగుణములను జయించి ఇంద్రియ మనోనిగ్రహముల సాధించిన ఉత్తమాధికారి, శుద్ధ సత్వగుణ సమన్వితుడు అందువలన శ్రీకృష్ణ దర్శనము (లేక ఆత్మ సాక్షాత్కారము) పొందుటకు అడ్డులేకపోయినది. కుచేలుని శ్రీ కృష్ణ మందిర ద్వారపాలకులు అడ్డగింపలేదని పోతన చెప్పలేదు. చెప్ప నవసరములేదు. కుచేలుడు, పోతన, పరీక్షిత్తు అర్ధ కామములు సన్యసించినవారు. అందువలన పోతన. కుచేలుడు తమకు బ్రహ్మ సాక్షాత్కారము తప్పక కలుగునని భావించిరి.

చూడవచ్చిన కుచేలుని శ్రీకృష్ణు డతిథి సత్కారముల బూజించెను. రుక్మిణీదేవి వింజామరలచే వీచెను. కుచేలుని పూర్వజన్మ సుకృత మేమని వర్ణింపవచ్చును? తరువాత శ్రీకృష్ణుడు ప్రాస్తావికముగా కుచేలుడు తన సహపాఠిగానున్న దినములలో గురువుయింట జరిగిన విషయములను జ్ఞప్తికి దెచ్చెను. భార్య అనుకూలవతిగా నున్నదా ! యని తొలుత ప్రశ్నించెను. తరువాత కుచేలుని నిస్సంగత్వము తెలుపుటకై ఇట్లనెను.

సీ|| తలప గృహక్షేత్ర ధన దార పుత్రాదుల

యందు నీ చిత్తంబు చెందకుంట

తోచుచున్నది; ఏను దుది లోక సంగ్రహా

ర్థంబు కర్మాచరణంబు సేయు

తే|| గతి మనంబుల గాను మోహితులు గాక

యర్థిమె యుక్త కర్మంబు లాచరించి

ప్రకృతి సంబంధములు వాసి భవ్యనిష్ఠ

దవిలియుందురు కొందరుత్తములు భువిని.

భాగవతము 10-990

తామరాకుపై నీటి బిందువువలె కుచేలుడు సంసారము నంటి అంటక యుండెను. ఓడ సముద్రమున తేలియుండవలయునేగాని సముద్రము నీరు ఓడలో ప్రవేశింపరాదు. కొందరుత్తములు ఇట్లు జీవితమును గడపుదురు పోతనయు ఇట్టి ఉత్తమ వర్తనము గలవాడే.

శ్రీకృష్ణడు స్వయముగా విజ్ఞాన పదుడైన గురువయ్యు, గురు భజనంబు పరమ ధర్మంబని భావించి కుచేలునితోగూడి సాందీపుడను గురువును సేవించెను. త్రిజగద్గురువైన శ్రీకృష్ణుడు గురువును ధర్మమని సేవించుటయు, తాను రాజము దరిద్రుడగు కుచేలునితో స్నేహితము సేయుటయు గమనింపదగినవి.

ఒకనాడు సాందీపు డూరలేనపుడు అతని భార్య శ్రీకృష్ణకుచేలురను. అరణ్యమున కరిగి కట్టెల గొనితెమ్మని కోరెను. వారు అరణ్యమునకేగి అచట గాలివానలో చిక్కుకొని కదలలేక యుండగా తెల్లవారు సమయమున వారిని వెదకుచు గురువగు సాందీపు డరుదెంచి ''శిష్యులై కష్ట బుల కోర్చి బుణంబు దీర్చుకొంటిరి. మీకు ధన బంధుదార బహుపుత్ర విభూతి జయా యు రున్నతల్‌ సమకూరెడి'' అని దీవించెను. శ్రీకృష్ణడు కుచేలున కీ విషయమును జ్ఞప్తికి తెచ్చి ''నీకు గురు దీవన ఫలించినదా?'' అని ప్రశ్నించెను. శ్రీకృష్ణున కేమో గురుదీవన ప్రకారము సకలసంపద లొప్పియుండెను. కుచేలుడు దరిద్రుడు గనేయుండెను. అందువలన శ్రీకృష్ణుని ప్రశ్నకు బదులుగా కుచేలుడు ''సాభిప్రాయంబుగ'' బలికిన పలుకులు గమనింపుడు.

క|| గురుమతి దలపగ త్రిజగ

ద్గురుడ వనం దగిన నీకు గురుడనగా నొం

డొరు డెవ్వ డింతయును నీ

కరయంగ విడంబనంబు యగుగాదె హరీ:

భాగవతము 10-1005

గురువులకు గురువై సంపద లిచ్చువాడు శ్రీకృష్ణుడైన నీవే కదాయని పై మాటలలో స్ఫురించుచున్నది. ఆ మాటలువిని ''సమస్త భావాభిజ్ఞుండై'' న శ్రీకృష్ణుడు ''నీవు బక్తితో నాకేమి యుపాయనంబు దెచ్చితివి. ఆ పదార్థము కొంచెమైనను బదివేలుగ నంగీకరింతును. భక్తిలేని నీచవర్తనుడు హిమాచల తుల్యమైన పదార్థ మొసంగినను నాకు సమ్మతముగాదు.

క|| దళ##మైన పుష్పమైనను

ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్‌

గొలిచిన జను లర్పించిన

నెలిమిన్‌ రుచిరాన్నముగనె ఏను భుజింతున్‌

భాగవతము 10-1010

అని తెలిపెను. పై పద్యమును స్ఫురించు శ్లోకము భగవద్గీతలోను కలదు.

శ్లో|| పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్ఛతి

తదహం భక్త్యుప హృతం అశ్నామి ప్రయతాత్మనః

కుచేలు డటుకుల నిచ్చుటకు సిగ్గుపడి యూరకున్న ''అవ్విప్రుండునను దెంచిన కార్యంబు కృష్ణుండు దనదివ్యచిత్తంబున నెఱింగి యతండు పూర్వభవంబున నైశ్వర్యకాముండై నన్ను సేవింపడైన నిక్కుచే లుండు నిజకాంతా ముఖోల్లాసంబు కొరకు నా యొద్దకు జను దెంచినవాడని తలచి అటకులను కొన్ని తానే తీసికొని ''ఆ యుటుకురే సకల లోకంబులను, నన్నును బరితృప్తి బొందింప జాలు''నని పలికి వాని నారగించెను. దానిచే కుచేలునకు సర్వసంపదలు కలిగెను. కాని, కుచేలునకు ఈ విషయము తెలియదు. తానారాత్రి కృష్ణుని ఆతిధ్యము స్వీకరించి నిజపురంబునకు బయలుదేరెను. తనకు శ్రీకృష్ణ సందర్శన భాగ్య మబ్బి నందులకు సంతోషించెను. అతని పరిచర్యలను కొని యాడెను.

సీ|| పరికింప గృపణ స్వభావుండ నై నట్టి

యేనేడ? నిఖిలావ నీశ్వరియగు

నిందిరాదేవికి నెనయంగ నిత్య ని

వాసుడై యొప్పు న వ్వాసుదేవు

డేడ? నర్థిమై దోడబుట్టినవాని

కై వడి కౌగిట గదియ జేర్చి

దైవంబుగా నన్ను భావించి నిజతల్ప

మున నుంచి సత్ర్కియల్‌ పూని నడపి

తే|| చారు నిజ వధూ కర సరోజాత కలిత

చామ రానిలమున గతశ్రమునిజేసి

శ్రీ కుచాలిప్త చందనాంచన కరాబ్జ

తలములను నడ్గులొత్తు వత్సలత మెఱసి.

భాగవతము 10-1917

కావున.

ఉ|| శ్రీనిధి ఇట్లు నన్ను బచరించి ఘనంబుగ విత్తమేమియు

న్నీని తెఱంగు గానబడె; నెన్న దరిద్రుడ సంపదంధుడై

కానక తన్ను జేండని కాక శ్రితార్తి హరుండు సత్కృపాం

భోనిధి సర్వవస్తు పరిపూర్ణునిగా నను జేయకుండను:

భాగవతము 10-1910

అని తన మనంబున వితర్కించెను. ఒకవేళ తాను సంపదంధుడై శ్రీహరిని గొల్వడని భావించిన కృష్ణుడు సంపద లీయ దలంప డేమోనని కుచేలుడు భావించెను. కుచేలుడు ఇల్లు చేరగనే తనకు సర్వ సంపదలు హరి కరుణా విశేషంబున నొనగూడెనని కనుగొనెను. పోతన కూడ తన దారిద్ర్యము శ్రీకృష్ణుడు బాపకుండుటకు కారణము తాను ధనమదాంధూడై శ్రీహరిని చింతింపడని అట్లోనర్చి యుండునని భావించెను. ''సంపన్నాంధుల కంజనంబగు సుమీ దారిద్ర్యమూహింపగన్‌ '' అని రచించెను.

కుచేలుడు సతీసమేతుడై నిఖిల భోగంబులయం దాసక్తి నొందక రాగాది విరహితుండును నిర్వికారుండునునై అఖిల క్రియల యందును అనంతుని అనంత ధ్యాన సుధా రసంబునన్‌ జొక్కుచు విగత బంధ నుండై యపవర్గ ప్రాప్తి నొందెను. పోతనయు పై విధముగనే తన జీవితకాలము గడిపెను.

పై విధముగా కుచేలోపాఖ్యానము పోతన నిరాడంబర జీవితమున కద్దము పట్టినట్లుండి అతని వ్యక్తిత్వము జాటుచున్నది. భాగవత పాత్రలతో ఆయన తాదత్మ్యము గమనింపదగినది.

కుచేలోపాఖ్యానమున గమనింపదగిని విషయములు :-

1) భక్తి నిష్ఠులైన సజ్జనులు లేశ మాత్రంబగు పదార్థంబైన భక్తి పూర్వకంబుగా సమర్పించిన దానిని కోటి గుణిత బుగకృష్ణుడు గ్రహించును.

2) ధనమదము గలవాడు శ్రీహరిని విస్మరించును.

3) భగవద్భక్తితో గడవు సాత్విక జీవన ముత్తమమైనది.

4) సంపదలు గలిగినను కుచేలుడు తనకు మనోవికారము లంటకుండ జాగ్రత్తపడెను.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters