Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

24. నరకాసురవధ - ఔచిత్యము

''అనౌచిత్య దృతేనాన్య ద్రస భంగస్య కారణమ్‌'' ఔచిత్యము లోపించిన రసభంగ మగును. రసపోషణ చేయునప్పుడు ఔచిత్యమును తప్పక పాటించవలయును. ఔచిత్యములేని విషయమును ఎంతటి రస పోషణతో వివరించినను రసభంగమే యగును. నరకాసురవధ కథను నడుపుటయందు పోతన ఔచిత్య పోషణమున నెంతటి ప్రజ్ఞావంతుడో గోచరించుచున్నది.

నేను విద్యార్థిగా నున్నప్పుడు, పోతనను నా అభిమానకవిగా భావించి పొగడుచుండుట గాంచి నెల్లూరునుండి వచ్చిన ఒక సహపాఠి ''మీ పోతరకంటె మా ఎఱ్ఱాప్రగడ గొప్పకవి'' యని వాదించెను. అతని దృష్టిలో ఎఱ్ఱాప్రగడకున్న ఔచిత్యము పోతనకు లేదు. అతడు భాగవతము నందలి నరకాసురవధ కథా కథనముకంటె ఎఱ్ఱాప్రగడ హరివంశమునందును, నాచనసోముని ఉత్తరహరివంశము నందును. కథ చక్కగా నడుపబడినదని నాతో వాదించి భాగవతకథ యందలి రెండు లోపములు నాకు జూపెను.

1) నరకాసురునితో యుద్ధముచేయ సంసిద్ధురాలగు సత్యభామను

పోతన చాల పేలవముగ వర్ణించుట మొదటి లోపము.

శా|| వేణిం జొల్లెమువెట్టి, సంఘటిత నీవీ బంధయై, భూషణ

శ్రేణిందాల్చి, ముఖేందు మండల మరీచీజాలముల్‌ పర్వగా

బాణిం బయ్యెద జిక్కగా దుఱిమి, శుంభ ద్వీర సంరంభ##యై

ఏణీలోచన లేచి నిల్చె తన ప్రాణశాగ్ర భాగంబునన్‌.

భాగవతము 10-170

కేవలము జడను చుట్టుకొని, నడుము బిగించి ఆభరణములు ధరించి, పైట సవరించి, వీర సంరంభముతో సత్యభామ యుద్ధముచేయ లేచి నిలుచుకొనె ననుటలో ఆమె సామాన్య స్త్రీవలె చింత్రింపబడినది కదా? ఈ సందర్భాన ఎఱ్ఱాప్రగడ వ్రాసిన పద్యమెంత రసవంతముగా నున్నదో చూడుడు.

శౌ|| వీరం బాడుదనంబు నొందె ననగా, విక్రాంత సౌందర్య ల

క్ష్మీరేఖన్‌ బచరించె నాగ, ధృతి అక్షీణాకృతిన్‌ బొందెనా,

ధీరోదాత్త పతిక్రియా చరణ భక్తిప్రౌఢ యాతన్వి దా

ప్రారంభించె మహారణ క్రియకు ఆ ప్రత్యర్థితో నుక్కువన్‌.

పై పద్యములో వీరత్వమే ఆడుదనము పొందినట్లు పరాక్రమము సౌందర్య లక్ష్మీ రేఖగా తోచినట్లు సత్యభామ అగుపించుచున్నదని వ్రాయుటలో ఆమె చక్కగా వర్ణింపబడినది. పై రెండు పద్యములు పోల్చిచూచిన ఎఱ్ఱనదే పై చేయి యనవచ్చును.

2) సత్యభామ యుద్ధవర్ణనములో రెండు సీసపద్యములయందు పరస్పర వ్యతిరేక అభిప్రాయము లుండుట రెండవ లోపము.

సీ|| బొమ్మ పెండ్లిండ్లకు బో నొల్లనను బాల

రణరంగమున కెట్లు రాదలంచె

మగవారి గనిన దా మఱుగుజేరెడు నింతి

పగవారి గెల్వ నే పగిది జూచె

బసిడియుయ్యల లెక్క భయమందు భీరువు

ఖగపతి స్కంధ మే కడిది నెక్కె

సఖుల కోలాహల స్వనము లోర్వని కన్య

పటహ భాంకృతుల కెబ్బంగి నోర్చె

ఆ|| నీలకంఠములకు నృత్యంబు గఱపుచు

నలసి తలగిపోవు నలరు బోడి

యే విధమున నుండె నెలమి నాలీఢాది

మానములను రిపుల మాన మడప.

భాగవతము 10-180

సీ|| వీణ జక్కగబట్ట వెరవెఱుంగని కొమ్మ

బాణాసనం బెట్లు పట్ట నేర్చె

మ్రాకున దీగె మార్పంగ నేరని లేమ

గుణము నేక్రియ ధమఃకోటి గూర్చె

సరవి ముత్యము గ్రువ్వజాలని యబల యే

నిపుణత సంధించె నిశిత శరము

జిలుకకు పద్మంబు సెప్పనేరని తన్వి

అస్త్రమంత్రము లెన్న డభ్యసించె

ఆ|| బలుకు మనిన బెక్కు బలుకని ముగుద యే

గతి నొనర్చె సింహ గర్జనములు

ననగ మెఱసె ద్రిజగదభిరామ, గుణధామ,

చారు సత్యభామ, సత్యభామ.

భాగవతము 10-181

పై పద్యములలో సత్యభామను గూర్చి చెప్పిన అభిప్రాయములు పరస్పర విరుద్ధములుగానున్నవి. అస్త్రమంత్రము లెన్న డభ్యసించెను? బాణాసనము నెప్పుడు బట్ట నేర్చెను? అనుటచే సత్యభామకు ఇంతకు ముందు యుద్ధనైపుణ్యము లేదని చెప్పవలయును కదా? అందువలన నరకాసురునితో పోరగల పరాక్రమము, నైపుణ్యము, ఆమెకు కలవని ఎట్లు సమర్థింప వీలుపడును? పోతన కేవలము నాచనసోముని క్రింది పద్యముల ననుకరించెనని నా సహపాఠి అభిప్రాయము.

సీ|| తంత్రి వినోదంబు తడవు సైపని వేళ్ళు,

గొనయంబు తెగలపై గోరుకొనుట

చెలికత్తె నొత్తిల చీరలేని ఎలుంగు

సింహ నాదంబుచే చెదర కునికి

ఉత్తర హరివంశము

పై పద్యమునకూడ సత్యభామ ప్రదర్శించిన పరాక్రమమునకు కారణ మగుపించలేదు.

''పలికించెడు వాడు రామభద్రుండట'' అని పోతన తలపోసెను. శ్రీరాముడే పలికించిన శ్రీ మహాభాగవతములో లోపములుండవుకదా? అందువలన హరివంశము, ఉత్తర హరివంశము. భాగవతము ఈ మూడింటి యందలి నరకాసురవధ ఘట్టములను జాగ్రత్తగా పరిశీలించితిని. ఎఱ్ఱన, నాచనసోముల కంటె పోతనయే రసవత్తరముగను ఔచిత్యయుక్తముగను కథను నడిపించినట్లు నాకు తోచినది.

నాచనసోముని ఉత్తర హరివంశములోని కథను మొదట పరిశీలింతము. నరకాసురుని ధాటి కోర్వజాలక ఇంద్రుడు శ్రీకృష్ణునితో మొరపెట్టుకొనెను. శ్రీకృష్ణుడతని కభయ మిచ్చి సత్యభామతో కూడి గరుత్మంతు నధిరోహించి నరకుని జంపుటకు వెళ్ళెను. తొలుత తన్నెదిరించిన మురాసురుని వధించెను. తరువాత నరకుడు శ్రీకృష్ణు నెదిరించెను. యుద్ధమున నరకునిదే పైచేయిగా తోచెను.

క|| నరకుం డేసిన బాణము

హరి నిటల తటంబుదాకి యల్లల నాడెన్‌

నరకుడు వేసిన బాణము ఫాలభాగమున దాకగా శ్రీహరి తల్ల డిల్లెను. ఇంకను

ఉ|| కాడిన యమ్ముతో సొలసి కంస విరోధి శిరోధివ్రేల జే

యాడక మూర్ఛపోయె ----ఉత్తర హరివంశము

బాణము తాకిడితో తెలివిదప్పి తన తల వ్రేలాడగా, చేయి కదల్పలేక శ్రీ హరి మూర్ఛపోయెను. అంత సత్యభామ తగిన పరిచర్యసేపి మేల్కొల్పగా

''శార్జమింద నీవు సమరంబె కోరుదు

నవసరంబు వచ్చె ననుచు నిచ్చె''

సత్యభామకు తన ధనుస్సునిచ్చి ''నీవు యుద్ధము చేయగోరి యుంటివి. సమయము వచ్చినది యుద్ధము చేయు'' మని తెలిపెను. సత్యభామ నరకునితో యద్ధమొనర్చి అతని నోడించి తన పరాక్రమమును ప్రద్శించుకొనెను. ''నీవు సమరమె కోరుదు''వని కృష్ణుడు సత్యభామతో తెల్పుటచేత ఆమె కోర్కెను పూర్తి చేయుటకు యుద్ధము నకు తీసికొని రాబడినను, శ్రీకృష్ణుడు నరకుని బాణము సోకి వివశుడై సత్యభామను తనకు బదులుగా యుద్ధము సేయుమని కోరినట్లుగా కథ నడచినది.

భాగవతమున కూడ సత్యభామ యుద్ధము సేయుటకై వచ్చిన దనియే చెప్పబడినది.

క|| జన్యంబున దనుజుల దౌ

ర్జన్యము లుడుపంగ గోరి సనుదెంచిన సౌ

జన్యవతి ---భాగవతము10-177

ఎఱ్ఱాప్రగడ హరివంశమునకూడ కథ పైవిధముగనే నడచినది. మూర్ఛనుండి తేరుకొన్న శ్రీకృష్ణుడు సత్యభామను నరకాసురునితో యుద్ధము సేయమని కోరగా నరకుడు శ్రీకృష్ణు నుద్దేశించి ఈ క్రింది పరిహాస వాక్యము లాడెను.

చ|| తన పనిమాలి ఇంక వనితన్‌ బురికొల్పి రణం బొనర్ప బం

చిన జయింప నోపునె ఇసీ యని

---హరివంశము

''తాను యుద్ధ మొనరింపజాలక అబలయగు సత్యభామను పురికొల్పి యుద్ధమునకు బంపిన శ్రీకృష్ణుడు జయము పొందగలడా?'' అని నరకాసురుడు గేలిచేసెను. ఇచట శ్రీకృష్ణుని పరాక్రమము కుంటువడినదిగా అగుపించుచున్నది.

ఇక శ్రీమహాభాగవతమున పై కథను నడిపించుటయందు పోతన జూపిన నైపుణ్యము పరికించిన అది అనన్యసాధ్యమని చెప్పవచ్చును.

సత్యభామను రణరంగమునకు కొని రావలసిన కారణము హరి వంశమునగాని ఉత్తర హరివంశమునగాని సంస్కృత వ్యాస భాగవతమునగాని తెలుపబడి యుండలేదు. ఈ లోటును పోతన సవరించెను. సత్యభామ మనసులో యుద్ధము తాను చేయవలయునని కోర్కెయున్నది. కాని ఆమె స్త్రీ సహజమైన నేర్పుతో రణరంగమున యుద్ధము సేయవలెనను తన ఉబలాటమును గుప్తపరచి శ్రీకృష్ణుని పొగడుచు ఇట్లు తెలిపెను. యుద్ధరంగమున శ్రీకృష్ణుని యుద్ధ ప్రావీణ్యమును స్వయముగా కన్నులార తిలకించి తిరిగివచ్చి తన సవతులకడ అతని ప్రతాపమును పొగడుటకై తాను యుద్ధభూమి కరుదెంతునని వేడుకొన్నది. ఇట్లు ముఖస్తుతి చేసిన శ్రీకృష్ణు డుబ్బిపోయి ఆమెను యుద్ధభూమికి గొనిపోవునని ఎత్తుగడ వేసినది.

శా|| దేవా! నీవు ని శాట సంఘముల నుద్దీపించి చెండాడ నీ

ప్రావీణ్యంబును జూడ గోరుదు గదా ప్రాణశ | మన్నించి, న

న్నీ వెంటం గొనిపొమ్ము నేడు కరుణన్‌ , నే జూచి ఏతెంచి నీ

దేవీ సంహతికెల్ల జెప్పుదు భగవద్దీప్త ప్రతాపోన్నతుల్‌.

భాగవతము 10-151

ఆమె ఎత్తుగడను గ్రహింపనివాడు వోలె నటించి జగన్నాటక సూత్రధారియగు శ్రీకృష్ణుడు యద్ధమునందలి భయంకర విషయములను తెలిపి భయపెట్టి ఆమె ప్రయత్నమును మాన్నజూచెను.

నీ|| సమద పుష్పంధయ ఝంకారములు గావు

భీషణ కుంభీంద్ర బృంహితములు

వాయునిర్గత పద్మ వనరేణువులు గావు

తురగ రింఖా ముఖోద్ధూత రజము

లాకీర్ణ జల తరంగాసారములు గావు

శత్రు ధనుర్ముక్త సాయకములు

కలహంస సారస కాసారములు గావు

దనుజేంద్ర సైన్య కదంబకములు

తే|| కమల కల్హార కుసుమ సంఘములు గావు

చటుల రిపుశూల ఖడ్గాది సాధనములు

కన్య నీ వేడ? రణరంగ గమన మేడ?

వత్తు వేగను, నిలువుము, వలదు వలదు.

భాగవతము 10-153

అని వారించెను. అంత నేర్పరియైన సత్యభామ ''బ్రియునకుం బ్రియంబు జనింప డగ్గణి'' అతని మనస్సును కరిగింప ప్రయత్నించెను

ఉ|| దానవులైన నేమి, మరి దైత్య సమూహము లైననేమి? నీ

మానిత బాహుదుర్గముల మాటున నుండగనేమి శంక; నీ

తో నరుదెంతునంచు, గరతోయజముల్‌ ముకుళించి మ్రొక్కెన

మ్మానిని దన్ను భర్త బహుమాన పురస్సరదృష్ఠి జూడగన్‌.

భాగవతము 10-155

శ్రీకృష్ణుడు పొగడ్తకు లొంగడని గ్రహించిన సత్యభామ అతనకి నమస్కరించి అతని దయాదృష్టని కోరినది. సత్యభామ రెండవ ప్రయత్నముకూడ విఫలమైనఎడల స్త్రీ సహజముగా ఆమె కన్నీరు గార్చి విలపించునని శ్రీకృష్ణుడు భావించెనేమో? ''తనకు మ్రొక్కిన సత్యభామను కరకమలంబుల గ్రుచ్చి ఎత్తి తోడ్కొని గరుడారూఢుడై మరి గగనమార్గంబున జనియె.

శ్రీకృష్ణుడు ప్రాగ్జ్యోతిష పురంబునకేగి తొలుత మురాసురుని వధించెను. తరువాత మురాసుర నందనులను సంహరించెను. ఈ వార్త విని నరకుడు స్వయముగా యుద్ధము సేయుటకు బయలుదేరి వచ్చుచుండెను. ఆ సమయములో శ్రీకృష్ణుడు ''లలనారత్నము కూడి సంగర కథా లాపంబులన్‌'' జేయుచుండెను. '' జన్యంబున దనుజుల దౌర్జన్యము లుడుపంగ గోరి చనుదెంచిన'' దని గ్రహించిన శ్రీకృష్ణుడామెను సంగర కథాలాపములతో నుత్తేజితను జేసి యుద్ధము సేయపురికొల్పెను. నరకుని జూడగనే సత్యభామ యుద్ధ సన్నద్ధ యగటకు లేచి నిలచుకొనెను.

శా|| వేణిం జొల్లెము వెట్టి సంఘటిత నీవీ బంధయై భూషణ

శ్రేణిం దాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్‌ పర్వగా

బాణిం బయ్యెద జక్కగా దునిమి శుంభద్వీర సంరంభ##యై

యేణీలోచన లేచి నిల్చె దన ప్రాణశాగ్ర భాగంబునన్‌.

భాగవతము 10-170

ఇట్లు నిలుచున్న సత్యభామయందు యుద్ధము చేయవలయునను కుతూహలము. ఆవేశము ఉన్నవి కాని, నరకాసురుని వంటి రాక్షస యోధునితో పోరాడగల శక్తి లేదని శ్రీకృష్ణుడు గ్రహించెను. ''జన్యంబున దనుజుల దౌర్జన్యము లుడుపంగ గోరి చనుదెంచి''నను ఆమెను గెలిపించుటకు శ్రీకృష్ణుడు అట్టి శక్తిని ఆమెకు ప్రసాదింపవలయునని పోతన భావించెను.

పోతనకు భగవంతుని శక్తియందే నమ్మకము. మానవు డస్వతంత్రుడని అతని నిశ్చితాభిప్రాయము. దీనికి తార్కాణముగా కృష్ణ నిర్యాణానంతరము అర్జునునితో బలించిన దీనాలాపములు పరికింపుడు.

సీ|| పందికై పోరాడ ఫాలాక్షు డెవ్వని

బలమున నా కిచ్చె బాశుపతము

ఎవ్వని లావున నిమ్మేన దేవేంద్రు

పీఠార్ధమున నుండ బెంపు గంటి

కాలకేయ నివాత కవచాది దైత్యుల

జంపితి నెవ్వని సంస్మరించి

గోగ్రహణమునాడు కురు కులాంభోనిధి

గడచితి నెవ్వని కరుణజేసి

ఆ|| కర్ణసింధురాజ కౌరవేం ద్రాదుల

తలల పాగలెల్ల తడవి తెచ్చి

ఏ మహాత్ము బలిమి నిచ్చితి విరటుని

పుత్రి యడుగ బొమ్మ పొత్తి కలకు.

భాగవతము1-365

మ|| గురు భీష్మాదులగూడి బన్నిన కురుక్షోణీశ చక్రంబులో

గురుశక్తిన్‌. రథయంతయై, నొగలపై గూర్చుండి, యా మేటి నా

శరముల్‌ వాఱకమున్న వారల బలోత్సాహాయు రుద్యోగత

త్వరతల్‌ చూడ్కుల సంహరించు, నమితోత్సాహంబు నా కిచ్చుచున్‌

భాగవతము 1-366

మ|| అసురేంద్రుం డొనరించు కృత్యములు ప్రహ్లాదున్‌ బ్రవేశించి గె

ల్వ సమర్ధంబులు గానికై వడి, కృపాశ్వత్థామ గాంగేయ సూ

ర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా

దెసకున్‌ రాక దొలంగు, మాధవు దయాదృష్టిన్‌ నరేంద్రోత్తమా!

భాగవతము1-367

శ్రీకృష్ణునివలన అర్జునునకు ఇట్టి సహాయము శక్తి లభించినవి. కాని శ్రీకృష్ణ నిర్యాణానంతరము అర్జునుని గతి పరికింపుడు.

శా|| కాంతారంబున నొంటి దోడికొని రాగా జూచి, గోవిందు శు

ద్దాంత స్త్రీల బదారువేల మదరా గాయత్తులై తాకి, నా

చెంతన్‌ బోయలు మూగి పట్టికొన, నా సీమంతినీ సంఘమున్‌.

భ్రాంతిన్‌ భామినిభంగి నుంటి విడిపింపన్‌ లేక, ధాత్రీశ్వరా!

భాగవతము 1-374

పై పలుకులలో మహావీరుడైన అర్జునుడు శ్రీకృష్ణుని అను గ్రహమువలననే శివునితో బోర గలిగెను. అనేక శక్తి మంతములైన కార్యము లొనర్చి జయమే పొందగలిగెను. కాని శ్రీకృష్ణ నిర్యాణానంతరము అతడు ''భామిని భంగి నుంటి'' నని తన బలహీనతను తెలిపికొనెను.

అందువలన భగవంకుని శక్తి యందు నమ్మకముగల పోతనకు హరివంశము నందును, ఉత్తర హరివంశమునందును గల నరకాసుర వధ కథలో, నరకాసురుడు ప్రయోగించిన బాణము శ్రీకృష్ణుని ఫాలమున సోకి శ్రీకృష్ణుడు మూర్ఛనందుటయు, సేదదీరిన తరువాత సత్యభామను యుద్ధమునకు పురికొల్పి తన యశక్తతను జాటుకొనుటయు నరకాసురుడు శ్రీకృష్ణుని పరిహసించుటయు, సత్యభామ స్వయముగా తన స్వశక్తిచేత తన పరాక్రమము జూపి నరకుని ఓడించుటయు. అనౌచిత్యములుగా దోచినవి. సర్వశక్తి మంతుడు. సర్వ కారణభూతడునైన శ్రీకృష్ణపరమాత్మ దెబ్బతిని మూర్ఛబొంది సత్యభామను యుద్ధము సేయుమని కోరు దుర్గతికి దిగజారుట ఔచిత్యము కాదు గదా? భగవత్సంకల్పము లేక మానవమాత్రు రాలగు సత్యభామ యుద్ధము జేయగలదా? ఎఱ్ఱన నాచనసోములు కథనెంత రసవంతముగ వ్రాసినను ఔచిత్యము లోపించుటవలన రసభంగమైనదని పోతన భావించెను. వ్యాస విరచితమైన సంస్కృత భాగవతమున సత్యభామ నరకునితో యుద్ధ మొనర్చుట వ్రాయబడి యుండలేదు. సంస్కృత హరివంశము ననుసరించి ఎఱ్ఱన నాచనసోములట్లు వ్రాసిరేమో. ఔచిత్యము లేనందున పోతన కథావస్తువును పూర్తిగా మార్చివైచెను. శ్రీ మహాభాగవత కథలో సత్యభామ యుద్ధము చేయ గోరుదునని చెప్పలేదు. యుద్ధ మొనర్ప కుతూహల మున్నను భర్తయైన శ్రీకృష్ణుని ప్రతాపమును తిలకింప వత్తునని కోరినది. శ్రీకృష్ణుడు మురాసురుని చంపిన తరువాత నరకుడు యుద్ధసన్నద్ధుడై వచ్చులోపల సత్యభామతో ''సంగర కథాలాపములాడి ''ఆమె ఆంతర్యమును గ్రహించి ఆమెలోని సంగర కుతూహలమును ఇనుమడించెను. నరకాసురుడు రాగానే సత్యభామ శ్రీకృష్ణుడు కోరకయే యుద్ధము సేయుటకై లేచి నిల్చెను. ఈ కథలో శ్రీకృష్ణుడు నరకునితో తొలుత పోరు సలుపలేదు. మూర్ఛచెందలేదు. సత్యభామను యుద్ధము సేయుమని కోరనులేదు. కోరకయే లేచి నిలుచున్న సత్యభామయొక్క ఆవేశమును గ్రహించి జగన్నాటక సూత్రధారుడు సరస సల్లాసము లాడెను.

క|| లేమా! దనుజుల గెలువగ

లేమా? నీవేల కడగి లేచితి విటు రా.

లే, మాను, మానవౌ

లే ,, భాగవతము 10-172

''యుద్ధమున నేను దనుజుల గెలువగలను గదా? ఏల నీవు యుద్ధము చేయ లేచితివి?'' అని సరసోక్తు లాడెను. తన చేతి విల్లును ఆమె కందించి దాని ద్వారా నరకునితో బోరజాలు బలమును ఆమెకు ప్రసాదించెను.

శా|| ఆ విల్లంది, బలంబు నొంది, తదగణ్యానంత తేజో విశే

షావిర్భూత మహా ప్రతాపమున వీరాలోక దుర్లోకయై

భాగవతము10-175

పై పద్యములో పోతన పాఠకునకు తన అభిప్రాయమును చక్కగా తెలుపబూని, సత్యభామకు నరకు నెదిరించుబలము శ్రీకృష్ణ ఉత్తమైన విల్లునుండి కలిగినదని రెండు పర్యాయములు తెలిపెను. ఇది పునరుక్తి దోషము కాదు. పాఠకుని మేల్కొలిపి తన అభిప్రాయమును గ్రహింపజేయుటకై అట్లు చేసెను. శ్రీకృష్ణపరమాత్మ ప్రసాదించిన శక్తి చేత ఆమె ''వీరాలోక దుర్లోక'' అయినది. ఇదిగాక హరివంశములో కేవలము వీరత్వము మాత్రమే ఆడుదనము నొందినది. భాగవతమున భగవత్ర్పసాదమున సత్యభామ

''వీర శృంగార బయ రౌద్ర విస్మయములు '' (10-177) కలిపి భామిని యైనది. ఇంకను హరికి శృంగారరసము నరకునకు వీరరసము చూపరులకు భయ రౌద్ర విస్మయములు సత్యభామ యుద్ధమున వెదజల్లినది.

మ|| పరుజూచున్‌, వరుజూచు, నొంప నలరింపన్‌, రోష రాగోదయా

విరతి భ్రూకుటి మందహాసముతో, వీరంబు శృంగారమున్‌

జరగన్‌, గన్నుల గెంపు సొంపు బరగన్‌ చండాస్త్ర సందోమమున్‌

సరసాలోక సమూహమున్‌ నెఱపుచున్‌, చంద్రాస్య హేలాగతిన్‌

భాగవతము 10-178

ఇక నా స్నేహితుడు సూచించిన రెండవ లోపమును పరిశీలింతము. ముందు వ్రాసిన సీసపద్యముల [ (1) బొమ్మ పెండ్లిండ్లకు 2) వీణ చక్కగబట్ట ] లో సత్యభామ యుద్ధముచేయునప్పుడు పరస్పర విరుద్ధ భావములు గోచరించుచున్నవి. పై పద్యములు నాచనసోముడు రచించిన ''తంత్రీ వినోదంబు'' అతను పద్యమునకు అనుకరణము లనుటకు సందేహములేదు. బొమ్మ పెండ్లిండ్లకు బోనొల్లనను సత్యభామ రణరంగమున కెట్లు రాగలిగినది? మొదలగు ప్రశ్నలకు సమాధానము బడయవలయును. ఆమె తొలుత భీరువే. శ్రీకృష్ణ ప్రసాదమున శక్తిని పొందిన తరువాతనే యుద్ధమున నరకు నోడింపగలిగినది. ఈ విషయము తెలియని చూపరులకు పై ఆశ్చర్యము కలిగించు అభిప్రాయములు కలుగవచ్చును కదా ? శ్రీకృష్ణ దత్తమైన విల్లును గ్రహించి శక్తిని పొందకముందు సత్యభామ

బొమ్మ పెండ్లిండ్లకు బో నోల్లదు

మగవారి గనిన మరుగు జేరును

పసిడి యుయ్యల లెక్క భయమందును

సఖుల కోలాహల స్వనము లోర్వదు

మ్రాకున తీగ గూర్పలేదు

ముత్యము గ్రువ్వజాలదు

చిలుకకు పద్యము సెప్పనేరదు

పలుకు మనిన బెక్కు పలుకదు.

''ఆ విల్లంది బలంబు నొందిన'' తరువాతనో

రణరంగమునకు రా గలిగినది

పగవారి గెల్వ జూచినది

ఖగపతి స్కంధ మెక్క గలిగినది

పటహభాంకృతుల కోర్వ గలిగినది

ఆలీఢాది మానముల నుండగలిగినది

బాణాసనము పట్ట గలిగినది

అల్లెత్రాటిని ధనస్సునకు గూర్చ గలిగినది

నిపుణతతో శరము సంధించ గలిగినది

అస్త్రమంత్రము లెఱిగినది

సింహగర్జనము చేసినది.

హరి కరుణా విశేషముతో బలమునుపొంది పై విధముగా జేయగల్గుటలో వ్యతిరేక మేమియు లేదుకదా? అందులకే పోతన చూపరులకు సత్యభామ ''అనగ నొప్పె'' యని సమర్థించుకొన్నాడు. ''తంత్రీ వినోదంబు'' అను నాచనసోముని సీసపద్యములో వ్యతిరేక అభిప్రాయముల సమర్థింపగల కారణము గోచరింపదు.

ఇదిగాక పోతనకథ నడపుటయందు చేసిన ఇంకొక గొప్ప చమత్కారము గమనింపదగినది. ఇది హాస్యరస కారకమైనది. భాగవతము నందును హరివంశము నందును. నరకుడాడిన పరిహాస వాక్యములలో గల తారతమ్యమును గమనింపుడు. హరివంశమున నరకుడు వేసిన బాణముచే శ్రీకృష్ణుడు మూర్ఛపోయెను. సత్యభామ యొనచ్చిన పరిచర్యచే సేదదేరెను. ఆమెను యుద్ధముసేయుమని కోరెను. అప్పుడు నరకుడాడిన పరిహాస వాక్యములు శ్రీకృష్ణుని పరాక్రమమును కించపరచుచున్నవి.

చ|| తన పనిమాని ఇంక యువిదన్‌ బురికొల్పి రణంబు సేయ బం

చినను జయింప నోపునె ఇసి'' యని

తాను మగవాడై యుద్ధము సేయక శ్రీకృష్ణడు ఆడదానిని యుద్ధముసేయ బంపుట సిగ్గుచేటని నరకుడు ఎత్తి పొడిచెను.

శ్రీ మహాభాగవతమున పరిస్థితి వేరుగ నున్నది. హరి దత్తమైన పరాక్రమముచే సత్యభామ నరకుని చిత్తుగా నోడించెను. అతని సైన్యము ఆమె ధాటి కోర్వజాలక వెనుకకు మరలెను. అంతట శ్రీ కృష్ణుడు సత్యభామ ఆహవ నైపుణ్యమును కొనియాడి. ఆమెకు ఆభరణములు బహుమానముగా నిచ్చి సంతోషపరచి తానిచ్చిన విల్లును వెనుకకు తీసికొనెను. అప్పుడు శ్రీకృష్ణు నుద్దేశించి నరకు డాడిన పరిహాస వాక్యములు పాఠకులకు నరకుని బలహీనతనే సూచించుచున్నవని తోపక మానదు. ''తాను క్రిందబడినను తనదే పై చేయి'' అన్నట్లు క్రింది పలుకులు ఆతని శక్తిహీనతను వ్యంగ్యముగా ధ్వనింపజేయుచున్నవి.

క|| మగువ మగవారి ముందర

మగతనములు సూప రణముమానుట నీకున్‌

మగతనముగాదు, దనుజులు

మగువల దెస జనరు, మగల మగ లగుట హరీ!

భాగవతము10-189

నరకాసురుడును అతని సైన్యము సత్యభామ ధాటి కోర్వలేకపోయిరి. ఆమెను యుద్ధవిరమణ చేయమని శ్రీకృష్ణుడుకోరుట నరకునకు లోలోన సంతోషము కలిగించెను. సత్యభామ యుద్ధము విరమించుటగని తేరుకున్న నరకుడు శ్రీకృష్ణుని గెలువగలనని భావించి ఎగతాళి చేయ బూనెను. ''ఆడదైనను సత్యభామ మగవారైన రాక్షసులతో యుద్ధముచేసి మగతనము ప్రకటించుకొనుచుండగా కృష్ణుడు యుద్ధమునకు మగువను పంపి తాను యుద్ధము సేయకుండుట మగ తనముకాదు, రాక్షసవీరులు మగలకు మగ లగుటచేత మగువలతో యుద్ధముసేయరు'' అని శ్రీకృష్ణుని యుద్ధముసేయుటకు పురికొల్పెను. శ్రీకృష్ణుడు కేవలము పురుషుడు మాత్రమేకాదని పురుషోత్తముడని నరకుడు గ్రహింపలేదు. సత్యభామ శక్తియు శ్రీకృష్ణ దత్తమని గ్రహింపలేదు. పై నరకుని ఎత్తి పొడుపు మాటలు నిజముగా ప్రగల్భ వాక్యములనియు, తాను సత్యభామకే ఓడిపోయెననియు పాఠకులు గ్రహింపగలరు. శ్రీకృష్ణుని పరాక్రమము కించబడకుండునట్లు పోతన వ్యంగ్యముగా నరకునినోట ఎట్లు బలికించెనో గమనింపదగినది.

ఇట్లు కథా కథనమునందును, ఔచిత్యము పాటించుటయందును తనపోషణమునందును పోతన దిట్ట. అతని కతడే సాటి. నాటకీయుత, సవ్యత పై కథయందు ఆరోపించ గలిగెను. కాన పోతన మహాకవి యగుటచే భాగవతమువంటి మహాపురాణము వ్రాయగలిగెను.

నరకాసురవధ అంతరార్థమును శ్రీరమణమహర్షి ఇట్లు తెలిపెను. వారు రచించిన తమిళ పద్యమునకు భావము.

''నరక సదృశ శరీరగృహము నేనను అభిమానమే నరకుడు. ఆ యభిమానమును నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటయే దీపావళి.''

Sri Bhagavadgeetha Madanam-2    Chapters