Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

19. అంబరీషోపాఖ్యానము

బ్రాహ్మణ శాపము రిత్త పోవుట:-

భగవత నవమ స్కంధమున అంబరీషోపాఖ్యానము కలదు. మహాభక్తుడైన అంబరీషునియెడ ''జగదప్రతిహతంబైన బ్రాహ్మణ శాపము'' నిరర్థక మయ్యెను, అట్లే బ్రాహ్మణుడైన అశ్వత్థామచే ప్రయోగింపబడిన ''ప్రతిక్రియా రహిత బ్రహ్మశిరో నామకాస్త్రము'' ను శ్రీకృష్ణుడు సుదర్శనముచే ప్రతిఘటించెను. ఇదిగాక దక్షాధ్వర ధ్వంస మొనరింపుమని శివుడు వీరభధ్రుని బంపెను. యజ్ఞమున నున్న బ్రాహ్మణశక్తిని జయించుట వీలుకాదేమోనని వీరభద్రుడు శంకించెను. అప్పుడు శివు డిట్లు తెలిపెను.

''బ్రాహ్మణ తేజ మజేయమంటివే. నరిది మదంశ సంభవుడ వై తగు నీకు నసాధ్యమెయ్యెడన్‌'' దైవశక్తి ముందు బ్రాహ్మణతేజము నిరర్థకమని పై మూడు నిదర్శనములు సూచించుచున్నవి. రజస్తమయో గుణముల తొలగించుకొని శుద్ధసత్త్వము గలవాడు బ్రాహ్మణుడు. కానీ పరబ్రహ్మము త్రిగుణాతీతుడు. కావున బ్రాహ్మణతేజము పరబ్రహ్మశక్తిని మించజాలదని భావము.

సప్త ద్వీప విశాల భూభారము వహించిన అంబరీషమహారాజు వైష్ణవార్చనలతో కాలము బుచ్చెడివాడు. అతడు సద్గుణ గరిష్ఠుడు.

సీ|| చిత్తంబు మధురిపు శ్రీ పాదముల యంద

పలుకులు హరిగుణ పఠనమంద

కరములు విష్ణు మందిర మార్జనము లంద

శ్రవములు హరికథా శ్రవణ మంద

చూపులు గోవిందరూప వీక్షణ మంద

కామంబు చక్రి కైంకర్య మంద

తే|| సంగ మచ్యుజనత సంగ మంద

ఘ్రాణ మసురారి భక్తాంఘ్రి కమల మంద

రసన తులసీ దళములంద, రతులు పుణ్య

సంగతుల యంద యా రాజచంద్రమునకు

భాగవతము 9-82

క|| హరి యని సంభావించును

హరి యని దర్శించు నంటు నా ఘ్రాణించున్‌

హరి యని రుచి గొనదలచును

హరి హరి ఘను నంబరీషు నలవియె పొగడన్‌.

భాగవతము 9-86

పై విధముగ అంబరీషుని పంచేంద్రియము లీశ్వరపరము లయ్యెను. అంబరీషుడు సమలోష్ఠకాంచనుడై సర్వకర్మలు హరిపరంబు సేసి ధరణినేలిన పుణ్యచిత్తుడు. ఈశ్వరాయత్తుడగు మహాభాగవతుడు. నిష్కాముడు.

అంబరీషుడు నిష్ఠతో ఏకాదశీవ్రత మాచరించెను. గోదానము అన్నదానము చేసెను. ద్వాదశినాడు అతనికడకు దుర్వాసు డతిథియై ఏతెంచెను. ఆ ముని కాళింద జలముల ధ్యానమగ్నుడై ద్వాదశి ఘడియలు మించి పోవుచున్నను దాడాయెను. అంబరీషుడు ద్వాదశి ఘడియలు మించకయే పారణ చేయవలయునని చింతించి విద్వజ్జనుల నిట్లు ప్రశ్నించెను. ''అతిథియగు దుర్వాసుడు ద్వాదశి ఘడియలు మించి పోవుచున్నను రాలేదు. కాని పారణసేయుట ఎట్ల''ని ధర్మపథమును తెలుపగోరెను. వారు ఆలోచించి ఇట్లు నిర్ణయించిరి.

ఆ|| అతిథివోయి రామి నధిప! ఈ ద్వాదశి

పారణంబు మాన పాడిగాదు

గుడువకుంట గాదు, గుడుచుటయును గాదు

సలిల భక్షణంబు సమ్మతంబు.

భాగవతము 9-99

విద్వజ్జను లిట్లు ధర్మసందేహంబు బాపినంత, అంబరీషుడు హరిని దలచి నీరు పారణంబు చేసెను. ఇంతలో దుర్వాసు డరుదెంచి రాజొనర్చినది, విని దానిని అకృత్యముగా భావించి, తాను కోపించిన మన్నింపగల వారెవ్వరని గర్వించి, తన జడను బెఱికి, కృత్యను సృష్టించి అంబరీషునిపై బంపెను. అంతట విశ్వరూపుడగు శ్రీహరి ''వెట్టి తపసి సేయు వేడబంబు జక్కబెట్టు మనుచు'' సుదర్శన చక్రమును బంపెను. విష్ణుచక్రము, ముని సృష్టించిన కృత్యను దహించి ముని పరుగిడెను. చక్రానల జ్వాలల కోర్వలేక ముని మూడు లోకముల పరుగిడెను. బ్రహ్మగాని శివుడుగాని అతనిని కాపాడజాలరైరి. తుదకతడు శ్రీ విష్ణువునే శరణు వేడెను. ''సాధువులైన భక్తుల నెదిరించువారికి ఇతర రక్షణలేదు. ఆ మహాభాగుడగు అంబరీషు డిచ్చు గక్షయే నీ కభయమగు''నని శ్రీహరి తెలిపెను. దుర్వాసు డంబరీషుని కడకేగి అతని పాదముల బట్టికొని అభయము కోరెను. అంబరీషుడు సుదర్శనచక్రమును ప్రార్థింప

ఆ|| విహిత ధర్మమందు విహరింతు నేనిని

నిష్టమైన ద్రవ్య మిత్తునేని

ధరణిసురుడు మాకు దైవతం బగునేని

విప్రునకు శుభంబు వెలయు గాక.

భాగవతము 9-137

అని వేడగా చక్రము శాంతించి తిరిగి వెడలెను. అంబరీషుడంత ముని పాదములకు నమస్కరించి అతనిని మృష్టాన్నముల తృప్తునిజేసి పంపెను.

1) తిరుగులేని బ్రాహ్మణశాపముకూడ భక్తులెడ నిరర్థక మగును. దురంతంబైన బ్రహ్మదండంబు దుర్వాసునిచే ప్రయోగింపబడినను భక్తుడైన అంబరీషుడు రక్షింపబడెను.

2) అత్యంతిక భక్తుడైన అంబరీషుడు తనపై ప్రయోగింపబడిన కృత్యను గాంచి నిస్సహాయుడైనను చలింపకుండెను.

3) ''తనువు మనవు విడచి తనయుల జుట్టాల, నాలి విడచి సంపదాళి విడచి, పంచేంద్రియముల తెరవులు వంచించి'' మనమున శ్రీహరిని బ్రతిష్ఠించిన భక్తుడు రక్షింపబడును. అనగా ఇంద్రియ మనంబు లీశ్వరపరము జేయవలయును.

4) ''చంపదగిన యట్టి శత్రువు తన చేత

జిక్కినేని కీడు సేయరాదు

అన్నట్లు తనపై కృత్యను ప్రయోగించి చంపజూచిన దుర్వాసుని గూడ క్షమింపజాలు సాత్త్వికలక్షణము హరిభక్తులఎడ గమనింపదగినది.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters