Sri Bhagavadgeetha Madanam-2    Chapters   

18. ప్రహ్లాద చరిత్రము చింతన భక్తి

(నవవిధ భక్తి మార్గము)

శ్రీహరిచేత తన తమ్ముడగు హిరణ్యాక్షుడు నిహతుడు కాగా హరిని నిర్జించుటకై హిరణ్యకశిపుడు బ్రహ్మనుగూర్చి తప మొనరించెను.

క|| అజరామర భావంబును

త్రిజగ ద్రాజ్యంబు, నప్రతి ద్వంద్వము, దో

ర్విజితాఖిల శాత్రవమును

గజరిపు బలమును హిరణ్యకశిపుడు గోరెన్‌

భాగవతము 7-71

ఇట్లు వెయ్యి దివ్య సంవత్సరములు తపము చేసినంత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కోరిన వరముల నొసగెను. హిరణ్యాక్ష వరములని లోకమున చెప్పికొనుట యున్నది కదా!

శా|| గాలిన్‌ గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్‌ దిక్కులన్‌

రేలన్‌ ఘస్రములన్‌ దమః ప్రబల భూరి గ్రాహ రక్షో మృగ

వ్యాళాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిన్‌ సమస్తాస్త్ర శ

స్త్రాళిన్‌ మృత్యువు లేని జీవనము లోకాధీశ ఇప్పింపవే.

భాగవతము 7-90

ఇట్టి దురభములైన వరములను పొంది సోదరుని జంపిన కారణమున హిరణ్యకశిపుడు శ్రీహరిపై పగ బూనెను. వర గర్వియై గంధర్వులను, నాగులను, యక్షులను, సిద్ధులను, కిన్నరులను భూత ప్రేత పిశాచములను జయించెను. దిక్పాలుర నోడించెను. ఇంద్రుని సింహాసనము నధిష్ఠించెను.

శౌ|| ఏ దిక్పాలుర జూచి నే డలుగునో, ఏ దేవు బంధించునో

యే దిగ్భాగము మీద దాడిచనునో, ఏ ప్రాణులం జంపునో

యీ దైత్యేశ్వరు డంచు నొందొరులు దా రింద్రాదు లాస్థాన భూ

వేదిన్‌ మెల్లన నిక్కిచూతురు భయా విర్భూత రోమాంచులై.

భాగవతము 7-100

భయభ్రాంతులై దేవతలందరు శ్రీహరిని శరణు వేడిరి. సమయము వచ్చినప్పుడు రక్కసుని చంపెదనని శ్రీహరి అభయ మొసగెను.

ఆ|| శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు

గోవులందు విప్ర కోటియందు

ధర్మపదవియందు దగిలి నాయందు వా

డెన్న డలుగు నాడె హింస నొందు.

భాగవతము 7-111

హిరణ్యకశిపునకు నలుగురు కుమారు లుద్భవించిరి. అందులో ప్రహ్లాదు డొకడు. మందర పర్వతముపై హిరణ్యకశిపుడు ఘోరతపమాచరించునపుడు ఇంద్రుడు రాక్షసులపై దండెత్తివచ్చి వారలనోడించి హిరణ్యకశిపుని భర్యయగు లీలావతిని చెరగొని పోవుచుండెను. దారిలో నారదు డెదురై''ఈమె గర్భమునందు పరమ భాగవతోత్తము డైన కుయారుడు కలడ'' ని తెలుపగా ఇంద్రు డామెను వదలి వేసెను. నారదు డామెను తన ఆశ్రమమున నుంచి ఆమెకు వేదాంతవాక్యములను శ్రీహరి కథావిశేషములను బోధించెను. గర్భస్థుడైన ప్రహ్లాదకుమారుడు వానిని గ్రహించెను. అందువలన ఆ బాలుడు హరిభక్తి పుంభావ మైనవాడుగా నుండెను. అతని గుణగణములు పరమ భాగవత శిఖామణి గుణగణముల బోలియుండెను. పోతన యందును ఇట్టి గుణములే యుండి ఈ క్రింది పద్యమునందు ప్రహ్లాదుని గుణములే కాక పోతన వ్యక్తిత్వము కూడ గోచరించుచున్నది.

సీ|| తనయందు నఖిల భూతములందు నొకభంగి

సమహితత్త్వంబున జరుగువాడు,

పెద్దల గనుగొన్న భృత్యుని కై వడి

జేరి నమస్కృతుల్‌ జేయువాడు

కన్నుదోయికి అన్యకాంత లడ్డంబైన

మాతృ భావముసేసి మరలు వాడు

తల్లిదండ్రుల భంగి ధర్మవల్సలతను

దీనుల గావ జింతించు వాడు

తే|| సఖులయెడ సోదరస్థితి జరుపువాడు

దైవతము లంచు గురువుల దలచువాడు

లీల లందును బొంకులు లేనివాడు

లలిత మర్యాదుడైన ప్రహ్లాదు డధిపః

భాగవతము 7-116

సీ|| ఆకారజన్మ విద్యార్థ వరిష్ఠుడై

గర్వ సంస్తంభ సంగతుడు గాడు

వివిధ మహానేక విషయ సంపన్నుడై

పంచేంద్రియములచే పట్టు వడడు

భవ్య వయో బల ప్రాభవో పేతుడై

కామ రోషాదుల గ్రందుకొనడు

కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన

వ్యసన సంసక్తి నా వంక బోడు

ఆ|| విశ్వమందు గన్న విన్న యర్థములందు

వస్తు దృష్ఠిజేసి వాంఛ యిడడు

ధరణినాథ! దైత్య తనయుండు హరిపర

తంత్రుడై హతావ్యతంత్రు డగుచు భాగవతము 7-117

సీ|| శ్రీ వల్లభుడు తన్నుజేరిన యట్లైన

జెలికాండ్ర నెవ్వరి జేరమఱచు

అసురారి తనమ్రోల ఆడిన యట్లైన

నసుర బాలురతోడ నాడ మఱచు

భక్తవత్సలుడు సంభాషించి నట్లైన

పరభాషలకు మాఱు బలుక మఱచు

సురవంద్యు తనలోన చూచినయట్లైన

జొక్కి సమస్తంబు జూడ మరచు.

తే|| హరి పదాంభోజయుగ చింతనామృతమున

నంతరంగంబు నిండినట్లైన నతడు

నిత్య పరిపూర్ణుడగుచు నన్నియును మఱచి

జడత లేకయు నుండును జడుని భంగి

భాగవతము 7-122

పై విధముగా ప్రహ్లాదుడు భక్తిసమాధిలో నిమగ్ను డగు చుండెను. ఇంకను

శౌ|| పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ భాషించుచున్‌ హాస లీ

లా నిద్రాదులు సేయుచున్‌ దిరుగుచున్‌ లక్షించుచున్‌ సంతత

శ్రీ నారాయణ పాదపద్మయుగళీ చింతామృతా స్వాద సం

ధానుండై మఱచెన్‌ సురారిసుతు డేత ద్విశ్వమున్‌ భూవరా!

భాగవతము 7-123

''అనన్యా శ్చింతతో మాం'' అను గీతా శ్లోకమును పై పద్యము వివరించుచున్నది.

సీ|| వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై

యొక్కడు నేడుచు నొక్కచోట

నశ్రాంత హరిభావనా రూఢచిత్తుడై

యుద్ధతుడై పాడు నొక్కచోట

విష్ణుడింతయకాని వేరొండులేదని

యొత్తిలి నగుచుండు నొక్కచోట

నలినాక్షుడను నిధానము గంటి నేనని

యుబ్బి గంతులు వైచు నొక్కచోట.

ఆ|| బలుకు నొక్కచోట బరమేశు కేశవు,

బ్రణయ హర్షజనిత బాష్ప సలిల

మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై

యొక్కచోట నిలచి యూరకుండు.

భాగవతము 7-124

''బాలోన్మత్త పిశాచవత్‌'' అను అవధూతస్థితిని పై పద్యము సూచించుచున్నది.

ఇట్లు సద్గుణ గరిష్ఠుడై ముకుంద సేవాపరాయణుండైన ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు చండామార్కులను గురువులవద్ధకు విద్యాభ్యాసమున కనిపెను. వారును రాజనీతి శాస్త్రములను ప్రహ్లాదునిచే చదివించిరి. కాని ప్రహ్లాదు డావిద్యలన్నియు మిథ్యలని భావించెను. చలింపని విష్ణుభక్తి పరిపూర్ణుడై యుండెను.

ఒక నాడు ప్రహ్లుదుని పరీక్షింపగోరి హిరిణ్యకశిపు డీతనిని సభకు పిలిపించెను. ''నీకు భద్ర మెయ్యది?'' అని ప్రశ్నించెను. దానికి ప్రహ్లాద కుమారుడిట్లు బదులు చెప్పెను.

ఉ|| ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటినూతి లోపలన్‌

ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్నులై వ

ర్తిల్లక సర్వమున్‌ నతని దివ్యకళామయమంచు విష్ణు నం

దుల్లముజేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ!

భాగవతము 7-142

ఇల్లను చీకటి నూతిలో బడక సర్వము శ్రీహరి లీలయని భావించి విష్ణునియందు మనస్సు నిలిపి అడవియం దుండుటమేలని ప్రహ్లాదుడు వచించెను.

హిరణ్యకశిపుడు తన శత్రువగు విష్ణునిగూర్చి పలుకు ప్రహ్లాదకుమారుని మాటలు వినెను. పరులు నేర్పించినట్లు బాలురు పలుకుచుందురని తలచి ''శ్రీహరి దానవుల విరోధి. అతనిని వర్ణింప నీకేల? హరి గిరి యని మోహాంధుడవై చెడకు'' మని కొడుకునకు హితము చెప్పెను. కాని ప్రహ్లాదుడు తన చిత్తము హరి పదాయత్త మైనదని, మారజాలదనియు తెలిపెను.

సీ|| మందార మకరంద మాధుర్యమున దేలు

మధుపంబు పోవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికల దూగు

రాయంచ సనునె తరంగిణులకు

లలిత రసాత పల్లవ ఖాదియై చొక్కు

కోయిల సేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక

మరుగునే సాంద్ర నీహారములకు

తే|| అంబుజోదర దివ్యపాదార వింద

చింతనామృతపాన విశేష మత్త

చిత్త మేరీతి నతరంబు జేరనేర్చు

వినుత గుణశీల! మాటలు వేయునేల?

భాగవతము 7-150

చండామార్కులు తాము విరోధిపాఠములు చెప్పలేదనియు. ఈ పర్యాయము మఱల చక్కగా చదివింతుమనియు చెప్పి ప్రహ్లాదునకు రాజనీతులు బోధించిరి. ఆ బాలుని హిరణ్యకశిపు వద్దకు పరీక్షకై గొని తెచ్చిరి. కాని ప్రహ్లాదునిలో మార్పు రాలేదు.

సీ|| అడు గడ్గునకు మాధవాను చింతన సుధా

మాధుర్యమున మేను మరచు వాని

నంభోజ గర్భాదు లభ్యసింపగలేని

హరిభక్తి పుంభావ మైనవాని

మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా

జిత్త మచ్యుతుమీద జేర్చువాని

నంకించి తనతోన నఖిల ప్రపంచంబు

శ్రీ విష్ణుమయ మని చెలగువాని

తే|| వినయ కారుణ్య బుద్ధి వివేక లక్ష

ణాది గుణముల కాటపట్టైన వాని

శిష్యు, బుధలోక సంభావ్యు, జీరి గురుడు

ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు.

భాగవతము 7-160

హిరణ్యకశిపుడు తన పుత్రుని విద్యాబలమును పరీక్షీంపనెంచి ''నీవు చదివిన శాస్త్రములలోని విషయముల కొన్ని చర్చింపు'' మని కోరెను. ప్రహ్లాదుడు నిర్భయుడై తాను ''చదువులలో మర్మమెల్ల చదివితి'' నని ఇట్లు తెలిపెను.

తను హృద్భాషల సఖ్యమున్‌, శ్రవణమున్‌, దాసత్వమున్‌ వందనా

ర్చనముల్‌, సేవయు, నాత్మలో నెఱుకయున్‌ సంకీర్తనల్‌, చింతనం

ణను నీ తొమ్మిది భక్తి మార్గముల సర్వత్మున్‌ హరిన్‌ నమ్మి స

జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్‌ సత్యంబు దైత్యోత్తమా!

భాగవతము 7-167

సీ|| కమలాక్షు నర్చించు కరములు కరములు

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు

శేషశాయికి మ్రొక్కు శిరము శిరము

విష్ణు నా కర్ణించు వీనులు వీనులు

మధువైరి దవిలిన మనము మనము

భగవంతు వలగొను పదములు పదములు

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి.

తే|| దేవదేవుని జింతించు దినము దినము

చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు

కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు

తండ్రి హరి జేరుమనియెడి తండ్రి తండ్రి.

భాగవతము 7-169

ఇంద్రియము లీశ్వర విషయములు కావలెనని భావము. అట్లు ఇంద్రియము లీశ్వర విషయములు కాని ఎడల

సీ|| కంజాక్షునకుగాని కాయంబు కాయమే

పవన గుంఫిత చర్మ భస్త్రిగాక

వైకుంఠు బొగడని వస్త్రంబు వక్త్రమే

ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక

హరి పూజనములేని హస్తంబు హస్తమే

తరుశాఖ నిర్మిత దర్విగాక

కమలేశు జూడని కన్నులు కన్నులే

తనుకుడ్య జాల రంధ్రములు గాక

ఆ|| చక్రిచింతనలేని జన్మంబు జన్మమే

తరళ సలిల బుద్భుదంబుగాక

విష్ణుభక్తిలేని విబుధుండు విబుధుడే

పాదయుగముతోడ పశువు గాక.

భాగవతము 7-170

పై పద్యమువలన చదువులలోని మర్మమగు భాగవత హృదయము లేక సందేశము వ్యక్త మగుచున్నదని గ్రహింవవలయును. భాగవత ప్రతిపాదిత భక్తి మార్గమునకు ఈ పద్యములు సారభూతములు. ఇంద్రియము లీశ్వర విషయము లొనర్చి మనస్సును నిశ్చల తత్త్వము సేయవలయునని మైత్రేయుడు విదురునకు తెల్పుట ముందు సూచించియుంటిని. ఈ రెంటిని సాధించుమార్గము పై పద్యముల యందు ప్రహ్లాదుడు తెలిపెను.

భక్తి మార్గములు తొమ్మిది.

శ్లో|| శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనమ్‌

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మ నివేదనమ్‌

ఈ తొమ్మిదింటిని ''తనుహృద్భాషల'' అనగా మనో వాక్కా యములచేత (త్రికరణ శుద్ధిగా) ఆచరింపవలయునని ప్రహ్లాదుడు వచించెను.

మందాధికారియగు మానవుడు దేహాత్మభావము కలిగియుండును. తమోగుణమువలన అతనికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను అరిషడ్వర్గము లేర్పడి యుండును. వానివలన ఇంద్రియార్థములను గోరి వానికి దాసుడగును. ఈ బంధము తొలగించుటకు భాగవతము ఇంద్రియముల నవవిధ భక్తి మార్గములచే ఈశ్వరపదము చేయవలయునని చెప్పుచున్నది.

దాసత్వము, వందనము, అర్చనము

సేవ, శ్రవణము కాయముతోను

సంకీర్తనము వాక్కుతోను

సఖ్యము, స్మరణము, ఆత్మలో

నెఱుక, చింతనము మనస్సుతోను

చేయవలయును.

పై విధముగా మనోవాక్కాయములతో పంచేంద్రియములకు పనులను గల్పించి పంచేంద్రియముల నీశ్వరపరము చేయవలయునని ప్రహ్లాదుడు సూచించెను. ఇట్లొనర్చి మనస్సును భగవంతునిపై నిలిపి నచో, ఇంద్రియ మనోనిగ్రహములు కలుగును. దీనివలన రజస్తమో గుణములు నశించి శుద్ధసత్త్వ మేర్పడును. ''సత్వాత్‌ సంజాయతే జ్ఞానమ్‌'' అనుటచే జ్ఞానము కలుగును. దానిచే సత్త్వగుణము ఆవరణముకూడ నశించి ఆత్మసాక్షాత్కార మగును.

ప్రహ్లాదు డనుసరించినది చింతనభక్తి. ఇది ఆత్మానాత్మ విచారమునకు దారితీసి ముక్తిని కలిగించును. అందులకే ప్రహ్లాదు డిట్ల నెను. ''ముక్తినిధి గానవచ్చునే ముఖ్యమైన శార్‌ఞ్గకోదండ చింత నాంజనము లేక.''

పోతన కూడ ప్రహ్లాదునివలెనే ''శ్రీ కైవల్యపదంబు జేరుట కునై చింతించెదన్‌'' అని గ్రంధారంభముననే చింతనపదమును వాడెను. ప్రహ్లాద చరిత్రయందు చింతనపదము అనేక పర్యాయములు వాడబడుట గమనింపదగినది.

1) అడుగడ్గునకు మాధ వానుచింతనసుధా మాధుర్యమున మేను మరచువాని

2) చక్రి చింతనలేని జన్యంబు జన్మమే

3) హరి పదాంభోజయుగ చింతనామృతమున

4) సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సంధానుండై

5) వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై

6) కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్‌

7) అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము

8) దేవదేవుని చింతించు దినము దినము

9) జిజ్ఞాసా పథమందు మూఢులు కదా చింతింప.

ప్రహ్లాదుడు విష్ణుచింతనమును ''పానీయంబులు ద్రావుచున్‌ గుడుచుచున్‌ .........'' అనగా సర్వకాల సర్వావస్థలయందు చేయుచుండెను. ఇట్టి చింతనభక్తి చేతనే జీవేశ్వర నిర్ణయజ్ఞుడై, సర్వము విష్ణుమయముగా గ్రహించి ''విష్ణు డింతియకాని వేరొండులేడని తెలిసి కొని ''ఇందుగల డందులేడను సందేహము'' వదలి భాగవతోత్తము డయ్యెను.

త్యాగరాజు మొదట ''మరుగేలరా?'' అని భగవంతుని గానక ప్రశ్నించెను. కాని ''అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగాను వెదకి తెలిసికొంటినయ్యా'' అని ప్రహ్లదునివలె అన్నింటియందును భగవంతుని జూడ గలిగెను.

హిరణ్యకశిపునకు ప్రహ్లాదకుమారుని మాటలు వింతగా తోచినవి. గురువులైన చండామార్కులు ప్రహ్లాదునకు హరిభక్తిని బోధించలేదుకదా? '' వీని కెవ్వరు నేర్పి'' రని సందేహించి ప్రహ్లాదుని ప్రశ్నించెను. ఈ ప్రశ్నకు బదులుగా ప్రహ్లాదుడు చెప్పిన వాక్యములలో గ్రహింపదగిన విషయములు మూడు కలవు.

1) ఉ|| అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై

చచ్చుచు బుట్టుచున్‌ మరల చర్విత చర్వణు లైరవారికిన్‌

చచ్చెర బుట్టునే పరులు సేప్పిననైన నిజేచ్ఛనైన నే

మిచ్చిన నైన గానలకు నేగిననైన హరి ప్రబోధముల్‌.

భాగవతము 7-181

అజ్ఞానాంధకారముచే సంసారమున బడి ఇంద్రియార్థముల గోరి జనన మరణ ప్రవాహమున కొట్టుకొని పోవు వారికి ఒకరు చెప్పినగాని సొంతముగా కానీ, అడవుల కేగినకాని, హరి ప్రబోధములు కలుగవు. విషయ ప్రవిష్టు లనుటచే ఇంద్రియ నిగ్రహ మవసరమని సూచించబడినది.

2) ఉ|| కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్‌

గానని భంగి, గర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై

కానరు విష్ణు, కొందఱటు గందు రకించన వైష్ణవాంఘి సం

స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా!

భాగవతము 7-182

ఒక వస్తువును జూడనివానిని వెంబడించినవాడు ఆ వస్తువు నెట్లు చూడజాలడో అట్లే కర్మబద్ధులైన వారల నాశ్రయించినవారు శ్రీ హరిని దర్శింపలేరు. కాననివాడు అనుటచే బ్రహ్మ సాక్షాత్కారము చెందనివాడని అర్థము. నిష్కానుకర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుచు హరిపదభక్తి గలవారే శ్రీహరిని దర్శింపగలరు.

3) శౌ|| శోధింపంబడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వేయేటికిన్‌

గాధల్‌, మాధవ శేముషీతరణి సాంగత్యంబునన్‌ గాక దు

ర్మేధన్‌ దాటగవచ్చునే సుతవదూ మీనోగ్ర వాంఛా మద

క్రోధోల్లోల విశాల సంసృతి మహాఘోరామితాంభోనిధిన్‌

భాగవతము 7-182

పెక్కు మాటలేల. సర్వశాస్త్రముల సార మేమనగా రజస్తమో గుణ పరిహారిణి యగు భాగవత ప్రతిపాదిత భక్తి యను నావయే సంసార సాగరమునకు తరణోపాయము.

పై మాటలు విని పినతండ్రిని జంపిన శ్రీహరిపై ప్రహ్లాదుడు భక్తి కలిగియుండుటకు హిరణ్యకశిపుడు కోపించి ఆ బాలుని పెక్కు గతుల హింసించెను. కాని ఆ హింసలు ప్రహ్లాదునియందు నిష్ఫలములయ్యెను.

ఉ|| తన్ను నిశాచరుల్‌ వొడువ దైత్యకుమారుడు మాటిమాటికో

పన్నగశాయి! యోదనుజ భంజన! యో జగదీశ! యో మహా

పన్న శరణ్య! యో నిఖిలపావన! యంచు నుతించుగాని తా

గన్నుల నీరుదేడు. భయకంప సమేతుడుగాడు భూవరా!

భాగవతము 7-193

ఉ|| పారడు లేచి దిక్కులకు, బాహువులొడ్డడు, బంధురాజిలో

దూఱడు, ఘోరకృత్యమని దూఱడు, తండ్రిని మిత్రవర్గమున్‌

జీరడు, మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోనికిన్‌

దాఱుడు, కావరే యనడు, తాపము నొందడు, కంట గింపడున్‌.

భాగవతము 7-194

''ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై యమ్మహా విష్ణునియందు జిత్తంబుజేర్చి తన్మయుండయి పరమానందంబునం బొందియున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుండు తన కింకరులచేతం జేయించుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందు ప్రయుక్తంబులైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటంజూచి'' హిరణ్యకశిపున కాశ్చర్యంబు కలిగెను.

----భాగవతము 7-195

ప్రహ్లాదుడు ''పరబ్రహ్మంబు తానయై'' యున్నవాడు. ఇది ''అహం బ్రహ్మాస్మి'' అను అద్వైతవాక్యమును సూచించుచున్నది. బ్రహ్మము ''ఇట్టిట్ట నరానిది'' అనుటచే ''ఆశ్చర్యవత్‌ పశ్యతి కశ్చిదేనమ్‌'' అను భగవద్గీతలోని శ్లోకమును సూచించుచున్నది. అమ్మ హా విష్ణునియందు చిత్తంబు జేర్చి యనుటచే ''ఆత్మ సంస్థం మనః కృత్వా'' అను భగవద్గీత వాక్యము సూచింపబడినది. బ్రహ్మానందము ననుభవించు ప్రహ్లాదుని రాక్షసుల హింసలు బాధింపలేదు. ''సైనంఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః'' అను గీతా వాక్యముచే ఆత్మ హింసకు గురికాదని సూచింపబడినది. ప్రహ్లాదుడు సర్వకాల సర్వావస్థలయందును శ్రీహరి చింతనచేయుటచేత అతడు రక్షింపబడెను. ఈ విషయము గీతలోని ''అనన్యా శ్చింతయం తోమా..... యోగక్షేమంవహా మ్యహమ్‌'' అను శ్లోకముచే సూచింపబడినది. భగవద్గీత భాగవతములు లక్ష్య లక్షణ గ్రంథములు కదా?

అంతట హిరణ్యకశిపు డిట్లు తలపోసెను.

ఉ|| ముంచితి వార్ధులన్‌, గదల మొత్తిది, శైలతటంబులందు ద్రో

బ్బంచితి, శస్త్రరాజి బొడిపించితి, మీద నిభేంద్ర పంక్తి ఱొ

ప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరదవాగ్నులందు ద్రో

యించితి, బెక్కుపాట్ల నలయించితి, జావ డిదేమి చిత్రమో.

భాగవతము 7-201

''కావున వీడు మహా ప్రభావ సంపన్నుండు. వీని కెందును భయంబులేదు. వీనితోడి విరోధంబున దనకు మృత్యువు సిద్ధించు'' నని హిరణ్యకశిపుడు నిర్ణయించుకొనెను.

తరువాత గురువులు ప్రహ్లాదునకు గృహస్థులైన రాజుల కుపదేశింపదగు దర్వర్థకామంబుల నుపదేశించిరి. కాని ప్రహ్లాదుడు రాగద్వేషములచే విషయాసక్తులైనవారికి గ్రాహ్యంబులగు ధర్మార్థ కామంబులు తన కగ్రాహ్యంబులని భావించెను. ఇట్లే ఏడు దినములలో ముక్తిని బొందినెంచిన పరీక్షిత్తుకూడ అర్థకామముల సన్యసించెను. పోతనయు నిట్టివాడే. అతడు ''శ్రీ కైవల్య పదంబునుగోరి'' అర్ధ కామముల సన్యసించెను.

ప్రహ్లాదుడు రాజనీతిశాస్త్రముల జదువుటలో తప్పు లేదుకదా యనియు ''సదసద్వివేకము గలుగుట'' కు విద్య అవసర మనియు ప్రశ్నింపవచ్చును. కాని భాగవతభక్తులు శాస్త్రార్ధ చర్చలకుకూడా ప్రాధాన్యత నొసగరు. బ్రహ్మ ద్వితీయస్కంధమున నారదునితో చెప్పినమాటలు గమనింపుడు. ''అమ్మహాత్ముని పాదారవిందంబుల భక్తి నిషుడనై యున్నవేళం దెలియుదు, రాజస గుణుండనై యున్న

వేళం దెలియజాల గావున శాస్త్రంబుల ప్రవచింపక కేవల భక్తి జ్ఞాన యోగంబున సేవింతు''నని బ్రహ్మ తెలిపెను.

ఈ విషయములో శాస్త్రవాసనను గూర్చి రమణమహర్షి అభిప్రాయమును గమనింపుడు. ''ఊడ్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించుటవలన నెటులు ప్రయోజనము లేదో అట్లే తన్నెఱుంగవలసిన వాడు తన్నుం గప్పియుండు తత్త్వముల నన్నింటిని గుంపుగా జేర్చి త్రోసివేయక, అవి ఇన్నియని లెక్కించుటచేతను వాని గుణంబులను పరీక్షించుటచేతను లాభము లేదు.

భాగవతము మోక్ష గ్రంథము, ముముక్షుత్వము సాధన చతుష్టయములతో నొకటి. అందులకే ముముక్షుత్వము గోరిన ప్రహ్లాదుడు తోడి బాలుర కిట్లు పదేశించెను.

ఆ|| దీన శుభములేదు, దివ్యకీర్తి యులేదు,

జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి

పొరలనేల మనకు? పుట్టని చావని

త్రోవ వెదకికొనుట దొడ్డ బుద్ధి. ----భాగవతము 7-214

''త్రైగుణ్య విషయా వాదాః నిసై#్త్రగుణ్యో భవార్జున'' అని భగవద్గీతలో చెప్పినట్లు ''నిసై#్త్రగుణ్యంబునన్‌ పరమ పురుషుడైన హరికి నాత్మసమర్పణంబు సేయుట మేలని '' తెలిపెను.

తే|| కడగి త్రిగుణాత్మకములై న కర్మములకు

జనకమైవచ్చు అజ్ఞాన సముదయంబు

ఘనతర జ్ఞానవహ్నిచే గాల్చి పుచ్చి

కర్మ విరహితులై హరి గనుటమేలు.

భాగవతము 8-238

తరువాత హిరణ్యకశిపుడు ప్రహ్లదుని పిలిచి ''నే సందరికంటె బలవంతుడనై యందర జయించితిని. నీ వెవ్వని బలమున నిట్లుంటి'' వని ప్రశ్నించెను. దానికి ప్రహ్లాదు డిట్లు బదులు చెప్పెను.

క|| బలయుతులకు దుర్బలులకు

బలమెవ్వడు నీకు బ్రహ్మాదులకున్‌

బలమెవ్వడు, ప్రాణులకును

బలమెవ్వం డట్టి విభుడు బల మసురేంద్రా!

భాగవతము 7-275

క|| దిక్కులు గాలముతో నే

దిక్కున లేకుండు, గలుగు దిక్కుల మొదలై

దిక్కుగల లేనివారికి

దిక్కయ్యెడివాడు నాకు దిక్కు మహాత్మా!

భాగవతము 7-265

మార్గము దప్పిన నీ చిత్తమే నీ శత్రువు----

ఉ|| లోకము లన్నియుం గడియలోన జయించినవాడ (1) వింద్రియా

నీకము 2) జిత్తముం గెలువ నేరవు. నిన్ను నిబద్ధు జేయు నీ

భీకర శత్రు లార్వుర బ్రభిన్నుల జేసిన బ్రాణి కోటిలో

నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వరా!

భాగవతము 7-267

అనగా ఇంద్రియ మనోనిగ్రహములు కర్తవ్యములని తెలిపెను.

''నా సోదరుని జంపిన విష్ణునకై నేను వెదకితిని. నారాయణుడీ విశ్వమున గానరాడు. వాడెక్కడ నుండు'' నని హిరణ్యకశిపుడు ప్రశ్నించెను. దానికి ప్రహ్లాదుడు

క|| ఇందుగల డందులేడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదెకి జూచిన

నందందే కలడు దానవాగ్రణి వింటే.

భాగవతము 7-275

అని బదులు చెప్పి శ్రీహరి విశ్వాకారుడు సర్వవ్యాపియని తెలిపెను.

భాగవతమున శుకుడు కూడ

క|| హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సందియము పని లేదా

హరిమయము గాని దవ్యము

పరిమాణువు లేదు లోకపావన: వింటే?

భాగవతము 7-275

అని పై అభిప్రాయమునే తెలిపెను. దానికి హిరణ్యకశిపుడు ''హరి సర్వాకృతుల యందుగల డంటిని. సభాస్తంభమున జూపగలవా'' యని ప్రశ్నించెను. దానికి ప్రహ్లాదుడు

శౌ|| అంభోజాసను డాదిగాగ దృణ పర్యంతంబు విశ్వాత్ముడై

సంభావంబుననుండు ప్రోడ విపుల స్తంభంబునం దుండడే,

స్తంభాంతర్గతు డయ్యు నుండుటకు నే సందేహమున్‌ లేదు ని

ర్దంభత్వంబున నేడు గానబడు బ్రత్యక్ష స్వరూపంబునన్‌.

భాగవతము 7-282

హిరణ్యకశిపుడు స్తంభము నరచేతితో గొట్టెను. స్తంభమునుండి భీకరాకారుడై శ్రీ నరసింహమూర్తి ఆవిర్భవించెను. స్వామి ఆవిర్భావమును గూర్చి వ్రాయునపుడు పోతన రచించిన వచనములో 32 భాగము లున్నవి. శ్రీ నృసింహ అనుష్టుప్‌ మంత్రరాజమునకు 32 అక్షరములుండుట గమవింపదగినది. హిరణ్యకశిపుడు నరసింహునిచే చూపబడెను. బ్రహ్మాదులు శ్రీ నృసింహమూర్తిని స్తుతించిరి. కాని రోష విజృంభమాణుడగు నరసింహుని జేరవెఱచి అతనిని శాంతింప జేయటకై లక్ష్మీ దేవిని బంపిరి. ఆమెయు భీకరాకారముజూచి చేరుటకు భయమందెను.

సీ|| ప్రళయార్కబింబంబు పగిది నున్నదిగాని,

నెమ్మోము పూర్ణేందు నిభముగాదు

శిఖి శిఖాసంఘంబు చెలువు సూపెడు గాని

చూడ్కి ప్రసాద భాసురము గాదు

వీర రౌద్రాద్భుతావేశ మొప్పెడు గాని

భూరి కృపారస స్ఫూర్తిగాదు

భయద దంష్ట్రాంకుర ప్రభలు గప్పెడుగాని

దర హసితాంబు జాతంబు గాదు

తే|| కఠినఖర నారసింహ విగ్రహము గాని

కామినీజన సులభ విగ్రహము గాదు

విన్నదియుగాదు తొల్లి నే విష్ణువలన

గన్నదియుగాదు భీషణాకార మనుచు.

భాగవతము 7-342

భావించి లక్ష్మీదేవి దూరముగా నుండెను.

తరువాత బ్రహ్మ భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుని జీరి '' నీవైన స్వామి కోపమును బాపు'' మనెను. ప్రహ్లాదకుమారుడు శ్రీ నృసింహ దేవునకు భక్తితో దండ ప్రణామము లాచరించెను. భక్తవత్సలుడైన నరసింహమూర్తి శాంతిని బాలకుని తలపై తన హస్తముంచి ఆశీర్వదించెను. ప్రహ్లాదు డిట్లు పలికెను.

మ|| ఖరదంష్ట్రా భృకుటీ సటా నఖయు, నుగ్రధ్వానయున్‌ రక్తకే

సరయున్‌, దీర్ఘతరాంత్ర మాలికయు, భాస్వన్నేత్రయు న్నైననీ

నరసింహాకృతి జూచి నే వెఱవ, బూర్ణ క్రూర దుర్వార దు

ర్భర సంసార దవాగ్నికిన్‌ వెఱతు, నీ పాదాశ్రయుం జేయవే.

భాగవతము 7-355

భక్తిలేక భవదీయ జ్ఞానంబులేదు. భవదీయ దాస్యయోగంబు గలిగింపుమని వేడెను. ''అట్ల యగుగాక'' యని నరసింహమూర్తి ఆశీర్వదించి పూర్ణముగా శాంతించెను.

పై కథతోపాటు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టుటకు కారణమును గూడ విచారించవలయును. బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులు విష్ణు సందర్శనమునకై వైకుంఠమున కేగిరి. ద్వారపాలకులైన జయ విజయులు వారి అడ్డగించిరి. సనక సనందనాదులు వారిపై కోపించి రజస్త మో గుణయుతులైన అసుర రాక్షయోనుల బుట్టుడని శపించిరి. జయవిజయులు శాపవశమున దితిగర్భమునందు హిరణ్యకశిప హిరణ్యాక్షులుగను, గైకసియందు రావణ కుంభకర్ణులు గను జనించిరి. మూడవ జన్మలో వారే శిశుపాల దంతవక్త్రులుగ పుట్టిరి. తమో రజోగుణములుగల వీరి లక్షణములు భగవద్గీతయందు చక్కగా వివరింపబగడినవి.

శ్లో|| రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవమ్‌

త న్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహనమ్‌.

ప్రాపంచిక విషయాసక్తి, కోరికలు, అభిమానము కలవారు రజోగుణయుతులు. హిరణ్యకశిపుడు, రావణుడు, శిశుపాలుడు ఇట్టి వారు.

శ్లో|| తమ స్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వ దేహినామ్‌

ప్రమాదాలస్య నిద్రాభి స్త న్ని బధ్నాతి భారత!

ప్రమాదము సోమరితనము నిద్ర కలవారు తమోగుణము కల వారు. హిరణ్యాక్షుడు, కుంభకర్ణుడు, దంతవక్త్రుడు ఇట్జివారు.

తమోగుణమువలన రాక్షసులు రజోగుణమువలన అసురులు కలిగిరని భాగవతము తెలుపుచున్నది. రజస్తమోగుణ పరిహారిణి యగు భక్తి లభించెనని నారదుడు తెలిపెను. అనగా ఇంద్రియ మనస్సులను జయించి రుజస్తమో గుణములను బాసిన శుద్ధ సత్వ మేర్పడిజ్ఞానము లభించును. మందాధికారి ఇంద్రియముల నీశ్వరపరము జేసి దైవసామీప్యమును, మధ్యమాధికారి మనోవిక్షేపమును తొలగించి సారూప్యమును, ఉత్తమాధికారి ఆవరణమును తొలగించి సాయుజ్యమును పొందుదురు.

ఇది గాక,

క|| వైరాను బంధనంబున

జేరిన చందమున విష్ణు చిరతర భక్తిన్‌

జేరగరాదని తోచును

నారాయణ భక్తి యుక్తి నాచిత్తమునన్‌

భాగవతము 7-15

క|| కీటకము దెచ్చి భ్రమరము

పాటవమున బభ్రమింప భ్రాంతంబై త

త్కీటకము భ్రమరరూపము

బాటించి వహించుగాదె భయయోగమునన్‌

భాగవతము 7-16

శిశుపాల దంతవక్త్రులు పాయని మహావైరముతో ''నిత్యజాత క్రోధ స్మరణంబుల''చేత హరియందు మనస్సు నిలిపి ''చక్రిం జెందిరి వారు పార్శ్వచరులై సారూప్య భావంబునన్‌''. భయమయోగమున జింతించినను సారూప్యము జెందుదురని భాగవతము తెలుపుచున్నది.

ప్రహ్లాదచరిత్ర భాగవతమునకంతకు సారభూతమైనది. ఇందులో తెలిసికొనదగిన విషయములు.

1) నవవిధ భక్తి మార్గముల నవలంబించి త్రికరణ శుద్ధిగా భగవంతుని ఆరాధించి ఇంద్రియముల నీశ్వరపరముజేసి మనస్సును లయింపజేయవలయును.

2) వైరముచే భయయోగమునను భగవంతుని పొందవచ్చును.

3) శ్రీనరసింహస్వామిని శాంతింపజేయుటకు లక్ష్మీదేవి వెనుకాడెను. కాని, ప్రహ్లాదుడు స్వామిని జేరి శాంతింపజేసెను. కాబట్టి భగవంతుని జేరుటకు భక్తియే సాధనము.

మ|| జ్వలదాకారముజూచి చేర సిరియున్‌ శంకింప బ్రహ్మాది ది

వ్యులు ప్రహ్లాదుని జేరబంపిన శరత్పూర్ణేందు సంకాశ శీ

తలతన్‌ బొందితి భక్తవత్పలుడవై: త్వత్పాద సద్భక్తియే

సులభోపాయము నిన్నుబొంద నవవచ్చున్‌ శ్రీ నృసింహేశ్వరా!

---సువర్ణమాల

4) కేవల కర్మనిష్ఠులు మోక్షము పొందజాలరు.

5) సంసార సాగరమును తరించుటకు శ్రీహరి పదభక్తియే నావయగును.

6) ఇక్కడ ఒక రహస్యమున్నది. పరీక్షిత్తు శాపగ్రస్తుడై 7వ దినమునాడు తక్షకుని విషమునకు గురియై మరణించెను కదా? కాని భాగవతమేమి చెప్పుచున్నదో చూడుడు.

శ్లో|| దశతం తక్షకం పాదే - లేలిహానాం విషాననైః

నద్రక్ష్యసి శరీరంచ - విశ్వంచ పృధగాతమనః

తక్షకుడను సర్పము బ్రహ్మణ శాపబలమున వచ్చి పరీక్షిత్తును కరచినప్పటికిని అతడు చావడు. ''ఇట్టిట్టనరాని బ్రహ్మంబు'' తానైన ప్రహ్లాదునికి రాక్షసులు పెట్టిన హింసలు భాదింపజాలనట్లే సప్త భూమి కలదాటి బ్రాహ్మభూతుడైన పరీక్షీత్తును పాముకాటు ఏమి చేయగలదు ఆత్మకు మరణము మెక్కడిది? ఆత్మకు మరణము లేదు. పరీక్షీత్తు ముక్తిని గాంచెనని భావము.

శ్రీ రమణమహర్ణి కి కూడ చిన్నననముననే తాను మరణించి నట్లు తోచినది. అవయవములు కదలలేదు. రక్తము నీలివర్ణము చెందినది. తాను మరణించెననియు, తన దేహము కట్టెలలో ఉంచి దహింతురనియు, తోచినది. ఇంతలోనే ఆయనకు ఒక భావముస్ఫురించినిది. ఏమనగా తన దేహము మరణించినదిగాని తాను ఉన్నాను కదా? అని తోచినది తాను వేరు దేహము వేరనియు తనకు మృత్యువు లేదనియు నిర్ణయించుకొన గలిగెను.

Sri Bhagavadgeetha Madanam-2    Chapters