Siva Maha Puranam-3    Chapters   

అథ పంచత్రింశో%ధ్యాయః

ద్విజావతారము

నందీశ్వర ఉవాచ|

సనత్కుమార సర్వజ్ఞ శివస్య పరమాత్మనః | అవతారం శృణు విభోస్సాధువేషద్విజాహ్వయమ్‌ || 1

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ సనత్కుమారా! నీవు సర్వజ్ఞుడవు. సర్వసమర్థుడు, పరమాత్మయగు శివుడు సత్పురుషుడగు బ్రాహ్మణుని అవతారమును దాల్చెను. ఆ గాథను వినుము (1).

మేనాహిమాలయోర్భక్తిం శివే జ్ఞాత్వా మహోత్తమామ్‌ | చింతామాపుస్సురాస్సర్వే మంత్రయామాసురాదరాత్‌ || 2

ఏకాంతభక్త్యా శైలశ్చేత్కన్యాం దాస్యతి శంభ##వే | ధ్రువం నిర్వాణతాం సద్య స్సంప్రాప్స్యతి శివస్య వై || 3

అనంతరత్నాధారో%సౌ చేత్ర్పయాస్యతి మోక్షతామ్‌ | రత్నగర్భాభిధా భూమి ర్మిథ్యైవ భవితా ధ్రువమ్‌ || 4

అస్థిరత్వం పరిత్యజ్య దివ్యరూపం విధాయ సః | కన్యాం శూలభృతే దత్వా శివలోకం గమిష్యతి || 5

మహాదేవస్య సారూప్యం ప్రాప్య శంభోరనుగ్రహాత్‌ | తత్ర భుక్త్వా మహాభోగాంస్తతో మోక్షమవాప్స్యతి || 6

ఇత్యాలోచ్య సురాస్సర్వే జగ్ముర్గురుగృహం మునే | చక్రర్నివేదనం గత్వా గురవే స్వార్థ సాధకాః || 7

శివునియందు మేనాహిమవంతులకు గల సర్వోత్కృష్టమగు భక్తిని గురించి తెలుసుకొని, దేవతలందరు చింతను పొంది సాదరముగా సలహా సంప్రదింపులను చేసిరి (2). హిమవంతుడు ఏకాంతమగు భక్తితో శివునకు తన కన్యను ఇచ్చినచో, నిశ్చయముగా వెంటనే మోక్షమును పొంది శివలోకమును చేరుకొన గలడు (3). లెక్క లేనన్ని శ్రేష్ఠ వస్తువులకు ఆధారమగు ఈ హిమవంతుడు మోక్షమును పొందినచో, రత్నగర్భ అనే పేరుగల భూమికి ఆ పేరు నిశ్చయముగా అసత్యమగును (4). ఆయన తన కదలని రూపమును విడిచిపెట్టి దివ్యరూపమును దాల్చి కన్యను శూలపాణియగు శివునకు సమర్పించి శివలోకమును పొందును (5). ఆయన శంభుని అనుగ్రహముచే ఆ మహాదేవుని సారూప్యమును పొంది అచటనే మహాభోగములననుభవించి, తరువాత మోక్షమును పొందగలడు (6). ఓ మునీ! స్వార్థమును సాధించుకునే దేవతలందరు ఈ విధముగా ఆలోచించి, బృహస్పతి ఇంటికి వెళ్లి, ఆయనకు విన్నవించిరి (7).

దేవా ఊచుః |

గురో హిమాలయగృహం గచ్ఛాస్మత్కార్యసిద్ధయే | కృత్వా నిందాం మహేశస్య గిరి భక్తిం నివారయ || 8

స్వశ్రద్ధయా సుతాం దత్వా శివాయ స గిరిర్గురో | లభేత ముక్తిమత్రైవ ధరణ్యాం స హి తిష్ఠతు || 9

ఇతి దేవవచశ్శ్రుత్వా ప్రోవాచ చ విచార్య తాన్‌ || 10

దేవతలిట్లు పలికిరి-

ఓ బృహస్పతీ! మన కార్యమును సాధించుటకై నీవు హిమవంతుని ఇంటికి వెళ్లి, మహేశ్వరుని నిందించి హిమవంతునకు ఆయనపై గల భక్తిని తొలగించుము (8). ఓ బృహస్పతీ ! ఆ హిమవంతుడు స్వయముగా శ్రద్ధతో కన్యను శివునకు సమర్పించినచో, ఆయనకు మోక్షము లభించును. కాని ఆయన ఈ భూమిపైననే ఉండవలెను (9). ఆయన దేవతల ఈ మాటను విని, ఆలోచించి, వారితో నిట్లనెను (10).

గురురువాచ |

కశ్చిన్మధ్యే చ యుష్మాకం గచ్ఛేచ్ఛైలాంతికం సురాః | సంపాదయేత్స్వాభిమతమహం తత్కర్తుమక్షమః || 11

అథవా గచ్ఛత సురా బ్రహ్మలోకం సవాసవాః | తసై#్మ వృత్తం కథయ స్వం స వః కార్యం కరిష్యతి || 12

బృహస్పతి ఇట్లు పలికెను-

ఓ దేవతలారా ! మీలో ఒకడు హిమవంతుని వద్దకు వెళ్లి, మీ కార్యమును సాధించుకొన వచ్చును. ఆ పనిని చేసే సామర్థ్యము నాకు లేదు (11). ఓ దేవతలారా! లేదా, మీరు ఇంద్రునితో కలిసి బ్రహ్మలోకమునకు వెళ్లుడు. ఆయనకు విషయమును చెప్పుడు. ఆయన మీ పనిని చేయ గలడు (12).

నందీశ్వర ఉవాచ |

తచ్ఛ్రుత్వా తే సమాలోక్య జగ్ముర్విధిసభాం సురాః | సర్వం నివేదయామాసుస్తద్వృత్తం పురతో విధేః || 13

అవోచత్తాన్విధిశ్రుత్వా తద్వచస్సువిచింత్యవై | నాహం కరిష్యే తన్నిందాం దుఃఖదాం కహరాం సదా || 14

సురా గచ్ఛతకైలాసం సంతోషయత శంకరమ్‌ | ప్రస్థాపయత తం దేవం హిమాలయగృహం ప్రతి || 15

స గచ్ఛేదథశైలేశమాత్మనిందాం కరోతు వై పరనిందా వినాశాయ స్వ నిందా యశ##సే మతా || 16

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ దేవతలు ఆ మాటను విని ఒకరినొకరు చూచుకొని, బ్రహ్మగారి సభకు వెళ్ళి, ఆయన యెదుట ఆ వృత్తాంతమునంతనూ విన్నవించు కొనిరి (13). వారి మాటను విని, బ్రహ్మ బాగా ఆలోచించి, వారితో నిట్లనెను. నేను శివుని నిందను చేయను. శివుని నిందించు వారికి సుఖము శాశ్వతముగా దూరమై దుఃఖము కలుగును (14). ఓ దేవతలారా! మీరు కైలాసమునకు వెళ్లి, శంకరుని సంతోష పెట్టుడు. ఆ దేవుని హిమవంతుని ఇంటికి పంపుడు (15). ఆయన హిమవంతుని వద్దకు వెళ్లి, తనను తాను నిందించుకొను గాక! ఇతరులను నిందించినచో వినాశము, తనను తాను నిందించుకున్నచో కీర్తి కలుగునని మహర్షులు చెప్పుచున్నారు (16).

నందీశ్వర ఉవాచ|

తతస్తే ప్రయయుశ్శీఘ్రం కైలాసం నిఖిలాస్సురాః | సుప్రణమ్య శివం భక్త్యా తద్ద్రుతం నిఖిలా జగుః || 17

తచ్ఛ్రుత్వా దేవవచనం స్వీచకార మహేశ్వరః | దేవాన్‌ సుయాపయామాస తానాశ్వాస్య విహస్య సః || 18

తతస్స భగవాన్‌ శంభుర్మహేశో భక్తవత్సలః | గంతుమైచ్ఛ చ్ఛైలమూలం మాయేశో న వికారవాన్‌ ||19

దండీ ఛత్రీ దివ్యవాసా బిభ్రత్తిలకముజ్జ్వలమ్‌ | కరే స్ఫటికమాలాం చ శాలగ్రామం గలే దధత్‌ || 20

జపన్నామ హరేర్భక్త్యా సాధువేషధరో ద్విజః | హిమాచలం జగామాశు బంధువర్గై స్సమన్వితమ్‌ || 21

తం చ దృష్ట్వా సముత్తస్థౌ సగణో%పి హిమాలయః | ననామ దండవద్భూమౌ సాష్టాంగం విధిపూర్వకమ్‌ || 22

తతః పప్రచ్ఛ శైలేశస్తం ద్విజం కో భవానితి | ఉవాచ శీఘ్రం విప్రేంద్రస్స యోగ్యాద్రిం మహాదరాత్‌ || 23

నందీశ్వరుడిట్లు పలికెను-

అపుడు ఆ దేవతలందరు వెంటనే కైలాసమునకు వెళ్ళి, శివునకు భక్తితో చక్కగా నమస్కరించి, ఆ విషయమును ఆయనకు చెప్పిరి (17). ఆ మహేశ్వరుడు ఆ దేవతల మాటను విని వారి కోరికను అంగీకరించి వారిని ఓదార్చి నవ్వి, వారిని చక్కగా సాగనంపెను (18). తరువాత భక్తవత్సలుడు, మహేశ్వరుడు, మాయకు అధీశ్వరుడు, వికారములు లేనివాడు అగు ఆ శంభుడు హిమవంతుని గృహమునకు వెళ్లగోరెను (19). ఆయన కర్రను, గొడుగును పట్టుకొని, దివ్యమగు వస్త్రములను ధరించి, మెరిసి పోయే తిలకమును దిద్ది, చేతిలో స్ఫటికమాలను, కంఠములో శాలగ్రామమును ధరించెను (20). ఆయన ఈ విధముగా సాధుబ్రాహ్మణవేషమును ధరించి, హరినామమును జపిస్తూ, వెంటనే బంధువర్గములతో కూడియున్న హిమవంతుని వద్దకు వెళ్లెను (21). హిమవంతుడు ఆయనను చూచి తన పరిజనముతో సహా లేచి నిలబడి, యథావిధిగా సాష్టంగ నమస్కారమును చేసెను (22). తరువాత ఆ పర్వతరాజు ఆ బ్రాహ్మణుని, నీ వెవరు? అని ప్రశ్నించెను. ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు యోగ్యుడగు ఆ హిమవంతునకు వెంటనే గొప్ప ఆదరముతో ఇట్లు బదులిడ.ను (23).

సాధుద్విజ ఉవాచ |

సాధుద్విజాహ్వశ్శైలాహం వైష్ణవః పరమార్థదృక్‌ | పరోపకారీ సర్వజ్ఞ స్సర్వగామీ గురోర్బలాత్‌ || 24

మయా జ్ఞాతం స్వవిజ్ఞానాత్‌ స్వస్థానే శైలసత్తమ | తచ్ఛృణు ప్రీతితో వచ్మి హిత్వా దంభం తవాంతికమ్‌ || 25

శంకరాయ సుతాం దాతుం త్వమిచ్ఛసి నిజోద్భవామ్‌ | ఇమాం పద్మసమాం రమ్యామజ్ఞాతకులశీలినే || 26

ఇత్థం మతిస్తే శైలేంద్ర న యుక్తా మంగలప్రదా | నిబోధ జ్ఞానినాం శ్రేష్ఠ నారాయణకులోద్భవ || 27

పశ్య శైలాధిపత్వం చ న తసై#్మ కో%స్తి బాంధవః | బాంధవాన్‌ స్వాన్‌ ప్రయత్నేన పృచ్ఛ మేనాం చ స్వప్రియామ్‌ || 28

సర్వాన్‌ సంపృచ్ఛ యత్నేన మేనాదీన్‌ పార్వతీం వినా | రోగిణ నౌషధం శైల కుపథ్యం రోచతే సదా || 29

న తే పాత్రానురూపశ్చ పార్వతీ దానకర్మణీ | మహాజనస్స్మేరముఖ శ్శ్రుతి మాత్రాద్భవిష్యతి || 30

నిరాశ్రయస్సదా%సంగో విరూపో నిర్గుణో%వ్యయః | శ్మశానవాసీ వికటో వ్యాలగ్రాహీ దిగంబరః || 31

విభూతి భూషణో వ్యాలవరావేష్టితమస్తకః | సర్వాశ్రమపరిభ్రష్టస్త్వ విజ్ఞాతగతి స్సదా || 32

ఆ సాధుబ్రాహ్మణుడు ఇట్లు పలికెను-

ఓ పర్వతరాజా ! నేను పరమార్థమునెరింగిన వైష్ణవుడను. నా పేరు సాధుద్విజుడు. నేను గురువు యొక్క అనుగ్రహము వలన సర్వమును తెలుసుకొని, అన్ని స్థలములకు వెళ్లుచూ, ఇతరులకు ఉపకారము చేయుచుందును (24). ఓ పర్వతరాజా! నేను ఉన్నచోటనే ఉండి నా బుద్ధిశక్తిచే ఒక విషయమును తెలుసుకుంటిని. నేను దంభము (నేనే ధర్మాత్ముడను అనే అహంకారము) ను విడిచిపెట్టి, నీ యెదుట దానిని ప్రేమపూర్వకముగా చెప్పెదను. వినుము (25). లక్ష్మీదేవితో సమానురాలగు సుందరియైన ఈ నీ కుమార్తెను నీవు శంకరునకు ఇచ్చి వివాహమును చేయగోరుచున్నావు. కాని నీకు ఆయన కులము గాని, స్వభావము గాని తెలియవు (26). ఓ పర్వతరాజా ! నారాయణుని వంశములో జన్మించిన నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు. అమంగళకరమగు ఇట్టి ఆలోచన నీకు తగదు. తెలుసుకొనుము (27). ఓ పర్వతరాజా ! నీవు గమనించుము. ఆ శివునకు బంధువులు ఎవ్వరూ లేరు. నీ బంధువులను, నీ ప్రియురాలగు మేనను ప్రయత్నించి సంప్రదించుము (28). పార్వతిని మినహాయించి, మేన మొదలగు వారిని అందరినీ సంప్రదించుము. ఓ పర్వతరాజా ! రోగికి ఏ నాడైననూ మందు రుచించదు. కాని, చెడు పథ్యము మాత్రము రుచించును (29). నీవు పార్వతిని కన్యాదానము చేయుటకు నిర్ణయించుకున్న శివుడు దానికి యోగ్యమగు పాత్ర కాడు. ఈ సంగతిని విన్న వెంటనే పెద్దలు చాటుమాటుగా నవ్వెదరు (30). ఆశ్రయము లేనివాడు, సర్వదా సంసారమునందు ఆసక్తి లేనివాడు, కురూపి, గుణములు లేనివాడు, వికారములు లేనివాడు, శ్మశానమునందు నివసించువాడు, భయంకరాకారుడు, పాములను పట్టుకొనువాడు, దిగంబరుడు (31), భస్మమే అలంకారముగా గలవాడు, తల చుట్టు భయంకరమగు పాములను చుట్టుకున్నవాడు, ఆశ్రమములన్నింటినుండి భ్రష్టమైనవాడు అగు ఆ శివుని స్థితిగతులు ఏనాడైననూ ఎవ్వరికైననూ తెలియవు (32).

బ్రహ్మోవాచ |

ఇత్యాద్యుక్త్వా వచస్తథ్యం శివనిందా పరం స హి | జగామ స్వాలయం శీఘ్రం నానాలీలాకరశ్శివః || 33

బ్రహ్మ ఇట్లు పలికెను-

అనేక లీలలను చేస్తూ ఉండే ఆ శివుడు ఖచ్చితముగా శివనిందతో కూడిన ఇట్టి వచనములను పలికి వెంటనే తన నివాసమునకు వెళ్లెను (33).

తచ్ఛ్రుత్వా విప్రవచనమభూతాం చ తనూ తయోః | విపరీతానర్థపరే కిం కరిష్యామమహే ధ్రువమ్‌ || 34

తతో రుద్రో మహోతిం చ కృత్వా భక్త ముదావహమ్‌ | వివాహయిత్వా గిరిజాం దేవకార్యం చకార సః || 35

ఇతి ప్రోక్తస్తు తే తాత సాధువే షో ద్విజాహ్వయః | శివావతారో హి మయా దేవ కార్య కరః ప్రభో || 36

ఇద మాఖ్యానమనఘం స్వర్గ్యమాయుష్యముత్తమమ్‌ | యః పఠేచ్ఛృణుయాద్వాపి స సుఖీ గతిమాప్నుయాత్‌ || 37

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం సాధు ద్విజావతారవర్ణనం నామ పంచత్రింశో%ధ్యాయః (35).

ఆ బ్రాహ్మణుని ఈ వచనములను విని మేనా హిమవంతులిద్దరి దేహములు విపరీతమైన పీడకు గురియైనవి. వారిద్దరు ఏమిచేయవలెనో తోచక బాధపడిరి (34). అపుడా రుద్రుడు భక్తులకు ఆనందమును కలిగించు గొప్ప లీలను ప్రకటించి పార్వతిని వివాహమాడి దేవకార్యమును చేసెను (35). వత్సా! ప్రభూ! ఈ విధముగా శివుడు సాధువగు బ్రాహ్మణుని వేషమును దాల్చి దేవకార్యమును చేసిన తీరును నీకు చెప్పి యుంటిని (36). పవిత్రమైనది, ఇహలోకములో ఆయుర్దాయమును, మరియు స్వర్గమును ఇచ్చునది అగు ఈ ఉత్తమమగు వృత్తాంతమును ఎవరైతే పఠించెదరో, లేక వినెదరో వారు సుఖములనను భవించి, ఉత్తమగతిని పొందెదరు (37).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు సాధు ద్విజావతార వర్ణనమనే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).

Siva Maha Puranam-3    Chapters