Siva Maha Puranam-3    Chapters   

అథ చతుస్త్రింశో%ధ్యాయః

నటావతారము

నందీశ్వర ఉవాచ|

సనత్కుమార సర్వజ్ఞ శివస్య పరమాత్మనః | అవతారం శృణు విభోస్సునర్తకనటాహ్వయమ్‌ || 1

యదా హి కాలికా దేవీ పార్వతీ హిమవత్సుతా | తేపే తపస్సు విమలం వనం గత్వా శివాప్తయే || 2

తదా శివః ప్రసన్నో%భూత్త స్యా స్సుతపసో మునే | తద్వృత్త సుపరీక్షార్థం వరం దాతుం ముదా య¸° || 3

స్వరూపం దర్శయామాస తసై#్య సుప్రీతమానసః | వరం బ్రూహీతి చోవాచ తాం శివాం శంకరో మునే || 4

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ సనత్కుమారా ! నీవు సర్వజ్ఞుడవు. సర్వవ్యాపకుడు, పరమాత్మయగు శివుడు నాట్యమును చేయు నటుని అవతారమును దాల్చిన గాథను వినుము (1). కాళిక, హిమవత్పుత్రికయగు పార్వతీ దేవి శివుని పొందగోరి అడవికి వెళ్లి కఠోరమైన తపస్సును చేయగా (2), శివుడు ఆమె యొక్క గొప్ప తపస్సునకు ప్రసన్నుడాయెను. ఓ మునీ! ఆయన ఆమెయొక్క భావమును దృఢముగా పరీక్షించి వరమునొసంగుటకై ఆమె వద్దకు వెళ్లెను (3). మిక్కిలి సంతసిల్లిన మనస్సు గల శంకరుడు ఆమెకు తన రూపమును చూపించెను. ఓ మునీ! అపుడాయన ఆమెతో వరమును కోరుమని పలికెను (4).

తచ్ఛ్రుత్వా శంభువచనం దృష్ట్వా తద్రూపముత్తమమ్‌ | సు జహర్ష శివాతీవ ప్రాహ తం సుప్రణమ్య సా || 5

శంభుని ఆ వచనమును విని, ఆయనయొక్క ఉత్తమమగు రూపమును చూసి, ఆపార్వతి ఆయనకు చక్కగా నమస్కరించి, మహానందమును పొంది, ఆయనతో ఇట్లు పలికెను (5).

పార్వత్యువాచ |

యది ప్రసన్నో దేవేశ మహ్యం దేయో వరో యది | పతిర్భవ మమేశాన కృపాం కురు మమోపరి || 6

పితుర్గేహే మయా సమ్యగ్గమ్యతే త్వదనుజ్ఞయా | గంతవ్యం భవతా నాథ మత్పితుః పార్శ్వతః ప్రభో || 7

యాచస్వం మాం తతో భిక్షుః ఖ్యాపయంశ్చ యశశ్శుభమ్‌ | పితుర్మే సఫలం సర్వం కురు ప్రీత్యా గృహాశ్రమమ్‌ || 8

తతో యథోక్త విధినా కర్తు మర్హసి భో ప్రభో | వివాహం త్వం మహేశాన దేవానాం కార్యసిద్ధయే || 9

కామం మే పూరయ విభో నిర్వికారో భవాన్‌ సదా | భక్తవత్సలనామా హి తవ భక్తస్మ్యహం సదా || 10

పార్వతి ఇట్లు పలికెను-

ఓ దేవదేవా! నీవు నాపై ప్రసన్నుడవైనచో, నాకు వరమునీయ దలచినచో, నాకు భర్తవు కమ్ము. ఓ ఈశ్వరా ! నాపై దయను చూపుము (6). నీ ఆజ్ఞననుసరించి నేను చక్కగా మాతండ్రి గారి ఇంటికి వెళ్లుచున్నాను. ఓ నాథా ! ప్రభూ ! నీవు నా తండ్రి వద్దకు తప్పక వెళ్లవలెను (7). నీవు భిక్షుకుడవై నీ శుభకరమగు కీర్తిని విస్తరింప జేయుచూ నా గురించి కోరుము. నీవు ప్రేమతో నా తండ్రియొక్క గృహస్థాశ్రమమును పూర్ణముగా సార్థకము చేయుము (8). ఓ ప్రభూ! ఆ తరువాత నీవు యథావిథిగా వివాహమును చేసుకొన దగుదువు. ఓ మహేశ్వరా ! నీవు దేవతల కార్యమును ఈ విధముగా సిద్ధింప జేయుము (9). ఓ ప్రభూ ! నీవు నా కోరికను నెరవేర్చుము. నీయందు ఏ కాలములోనైననూ వికారములు లేవు. నీకు భక్తవత్సలుడు అను పేరు గలదు. నేను సర్వదా నీకు భక్తురాలను (10).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్తస్స తయా శంభుర్మహేశో భక్తవత్సలః | తథాస్త్వితి వచః ప్రోచ్యాంతర్హితస్స్వగిరిం య¸° || 11

పార్వత్యపి తతః ప్రీత్యా స్వసఖీభ్యాం వయో%న్వితా | జగామ స్వపితుర్గేహం రూపం కృత్వా తు సార్థకమ్‌ || 12

పార్వత్యాగమనం శ్రుత్వా మేనయా స హిమాచలః | పరివారయుతో ద్రష్టుం స్వసుతాం తాం య¸° ముదా || 13

దృష్ట్వా తాం సుప్రసన్నాస్యామానయామాసతుర్గృహమ్‌ | కారయామాసతుః ప్రీత్యా మహానందౌ మహోత్సవమ్‌ || 14

ధనం దదౌ ద్విజాదిభ్యో మేనా గిరివరస్తథా | మంగలం కారయామాస స వేదధ్వనిమాదరాత్‌ || 15

తతస్స్వకన్యయా సార్ధమువాస ప్రాంగణ ముదా | మేనా చ హిమవాన్‌ శైలస్స్నాతుం గంగాం జగామ సః || 16

ఏతస్మిన్నంతరే శంభుస్సులీలో భక్తవత్సలః | సునర్తకనటో భూత్వా మేనకాసన్నిధిం య¸° || 17

శృంగం వామే కరే ధృత్వా దక్షిణ డమరుం తథా | పృష్ఠే కంథాం రక్త వాసా నృత్యగానవిశారదః || 18

తతస్తు నటరపో%సౌ మేనకా ప్రాంగణ ముదా | చక్రే స నృత్యం వివిధం గానం చాతిమనోహరమ్‌ || 19

శృంగం చ డమరుం తత్ర వాదయామాస సుధ్వనిమ్‌ | మహోతిం వివిధాం ప్రీత్యా స చకార మనోహరామ్‌ || 20

నందీశ్వరుడు ఇట్లు పలికెను-

ఆమె ఇట్లు పలుకగా, మహేశ్వరుడు మరియు భక్తవత్సలుడు అగు శంభుడు, అటులనే అగుగాక ! అని పలికి, అంతర్ధానమును చెంది తన పర్వతమునకు వెళ్లెను (11). తరువాత నవ¸°వనవతి అగు పార్వతి కూడ తన చెలికత్తెలతో కూడినదై, ప్రీతిపూర్వకముగా తన తండ్రిగారి ఇంటికి వెళ్ళెను. ఆమె తన సౌందర్యమునీ విధముగా సార్థకము చేసుకొనెను (12). పార్వతి తిరిగి వచ్చినదని తెలిసి, మేనాహిమవంతులు పరివారముతో గూడి, తమ అట్టి కుమార్తెను చూచుటకు ఆనందముతో వెళ్ళిరి (13). వారు మిక్కిలి ప్రసన్నమగు ఆ పార్వతిని చూచి ఇంటికి తీసుకువెళ్లి, మహానందమును పొంది, ప్రీతితో గొప్ప ఉత్సవమును చేసిరి (14). మేనాహిమవంతులు ఇద్దరు బ్రాహ్మణులు మొదలగు వారికి ధనమునిచ్చిరి. ఆయన మంగళకరమగు వేదఘోషను సాదరముగా ఏర్పాటు చేసెను (15). తరువాత మేన కుమార్తెతో గూడి ఇంటి వాకిటిలో ఆనందముగా నుండగా, ఆ హిమవత్పర్వతుడు స్నానమును చేయుటకు గంగకు వెళ్లను (16). ఇంతలో చక్కని లీలలను ప్రకటించువాడు, భక్తవత్సలుడు అగు శంభుడు చక్కని నాట్యగాని వేషమును వేసుకొని మేనకవద్దకు వెళ్లెను (17). నాట్యము మరియు గానము అనుకళలలో నిపుణుడగు ఆ శివుడు ఎడమ చేతిలో కొమ్మ బూరాను, కుడిచేతిలో డమరువు (బుడబుక్కల వాద్యము) ను పట్టుకొని, భుజముపై బొంతను వేసుకొని, ఎర్రని వస్త్రమును ధరించియుండెను (18). తరువాత నటుని రూపములోనున్న ఈ శివుడు మేనయొక్క ఇంటి వాకిట్లో ఆనందముతో రకరకముల నాట్యమును చేయుచూ, మిక్కిలి మనోహరమగు పాటలను పాడెను (19). ఆయన అచట కొమ్ము బూరాను, డమరువును చక్కని ధ్వని కలుగునట్లుగా వాయించెను. ఇంతే గాక ఆయన మిక్కిలి మనోహరములగు రకరకముల గొప్ప లీలలను ప్రీతిపూర్వకముగా ప్రకటించెను (20).

తం ద్రష్టుం నాగరాస్సర్వే పురుషాశ్చ స్త్రియస్తథా | ఆ జగ్ముస్సహసా తత్ర బాలా వృద్ధా అపి ధ్రువమ్‌ || 21

శ్రుత్వా సుగీతం తం దృష్ట్వా సునృత్యం చ మనోహరమ్‌ | సహసా ముముహుస్సర్వే మేనాపి చ తదా మునే || 22

తతో మేనాశు రత్నాని స్వర్ణ పాత్ర స్థితాని చ | తసై#్మ దాతుం య¸° ప్రీత్యా తదూతి ప్రీతమానసా || 23

తాని న స్వీచకారాసౌ భిక్షాం చేతే శివాం చ తామ్‌ | పునస్సునృత్యం గానం చ కౌతుకాత్కర్తు ముద్యతః || 24

మేనా తద్వచనం శ్రుత్వా చుకోపాతి సువిస్మితా | భిక్షుకం భర్త్సయామాస బహిష్కర్తుమియేష సా || 25

ఏతస్మిన్నంతరే తత్ర గంగాతో గిరిరాడ్య¸° | దదర్శ పురతో భిక్షుం ప్రాంగణస్థం నరాకృతిమ్‌ || 26

శ్రుత్వా మేనాముఖాద్వృత్తం తత్సర్వం సుచుకోప సః | ఆజ్ఞాం చకారానుచరాన్‌ బహిః కర్తుం చ భిక్షుకమ్‌ || 27

మహాగ్నిమివ దుస్స్వర్శం ప్రజ్వలంతం సుతేజసమ్‌ | న శశాక బహిః కర్తుం కో%పి తం మునిసత్తమ || 28

తతస్స భిక్షుకస్తాత నానాలీలా విశారదః | దర్శయామాస శైలాయ స్వప్రభావమనంతకమ్‌ || 29

శైలో దదర్శం తం తత్ర విష్ణురూపధరం ద్రుతమ్‌ | తతో బ్రహ్మ స్వరూపం చ సూర్యరూపం తతః క్షణాత్‌ || 30

మరియు నగరములోని స్త్రీపురుషులు, పిల్లలు, వృద్ధులు అందరు వెంటనే అచటకు నిస్సంకోచముగా విచ్చేసిరి (21). ఆ చక్కని గానమును విని, మనోహరమగు నాట్యమును చూసి, వారందరు శీఘ్రముగా మోహమును పొందిరి. ఓ మునీ! మేన కూడ ఆ సమయములో మోహమును పొందెను (22). తరువాత మేన ఆతని లీలలచే ప్రీతిని పొందిన మనస్సు గలదై ఆయనకు ఇచ్చుటకై వెంటనే బంగరు పాత్రలో రత్నములను ప్రీతితో తెచ్చెను (23). కాని, ఆయన వాటిని తీసుకొన లేదు. ఆయన పార్వతిని భిక్షగా కోరెను. ఆయన ఉత్సాహముతో మరల చక్కని నాట్యమును చేయుటకు, పాటను పాడుటకు సంసిద్ధుడాయెను (24). ఆయన మాటను విని మేన చాల కోపమును, ఆశ్చర్యమును పొందెను. ఆమె ఆ భిక్షుకుని మెడపట్టుకొని బయటకు గెంటవలెనని తలపోసెను. ఆమె ఆయనను నిందించి భయపెట్టెను (25). ఇంతలో పర్వతరాజగు హిమవంతుడు గంగనుండి తిరిగి వచ్చి, తన ఇంటి వాకిట్లో భిక్షుకుని రూపములో మానవదేహమును దాల్చియున్న శివుని చూచెను (26). ఆయన మేన చెప్పగా ఆవృత్తాంతమునంతను విని చాల కోపించి, ఆభిక్షకుని మెడ పట్టుకొని బయటకు గెంటుండని సేవకులను ఆజ్ఞాపించెను (27). ఓ మహర్షీ! మండే పెద్ద నిప్పువలె స్పృశించ శక్యము కానివాడు, గొప్ప తేజస్సు గలవాడు అగు ఆ శివుని బయటకు గెంటుటకు ఎవ్వరికీ శక్తి లేకపోయెను (28). ఓ కుమారా! తరువాత అనేకలీలలను చేయుటలో నిపుణుడగు ఆ భిక్షకుడు తన అనంతమగు ప్రభావమును హిమవంతునకు చూపించెను (29). ఆ సమయములో ఆయన హిమవంతునకు విష్ణురూపములో, మరల వెంటనే బ్రహ్మరూపములో, దాని తరువాత మరల క్షణకాలములో సూర్యరూపములో కానవచ్చెను (30).

తతో దదర్శ తం తాత రుద్రరూపం మహాద్భుతమ్‌ | పార్వతీసహితం రమ్యం విహసంతం సుతేజసమ్‌ || 31

ఏవం స బహురూపాణి తస్య తత్ర దదర్శ సః | సువిస్మితో బభూవాశు పరమానంద సంప్లుతః || 32

అథాసౌ భిక్షువర్యో హి తస్మాత్త స్యా శ్చ సూతికృత్‌ | భిక్షాం యయాచే దుర్గాం తాం నాన్యజ్జగ్రాహ కించన || 33

తత శ్చాంతర్దధే భిక్షుస్వరూపః పరమేశ్వరః | స్వాలయం స జగామాశు దుర్గావాక్యప్రణోదితః || 34

తదా బభూవ సుజ్ఞానం మేనాశైలేశయోరపి | అవాం శివో వంచయిత్వా గతవాన్‌ స్వాలయం విభుః || 35

అసై#్మ దేయా స్వకన్యేయం పార్వతీ సుతపస్వినీ | ఏవం విచార్య చ తయోశ్శివభక్తి రభూత్పరా || 36

ఓ వత్సా! తరువాత గొప్ప ఆశ్చర్యమును కలిగించువాడు, పార్వతితో గూడి నవ్వుచున్న సుందరుడు, గొప్ప తేజస్సు గలవాడు అగు రుద్రుని రూపములో ఆయన హిమవంతునకు కనబడెను (31). అపుడు ఆయన ఈ విధముగా శివుని ఆనేకరూపములను చూచి మహాశ్చర్యమును పొందెను. వెనువెంటనే ఆయన హృదయము పరమానందముతో నిండిపోయెను (32). తరువాత చక్కని లీలలను చేసే ఆ భిక్షుకశ్రేష్ఠుడు ఆ మేనాహిమవంతులనుండి ఆ దుర్గను భిక్షగా కోరెను. మరియొక భిక్షను దేనినీ ఆయన స్వీకరించలేదు (33). తరువాత భిక్షురూపములోనున్న ఆ పరమేశ్వరుడు దుర్గయొక్క వచనముచే ప్రేరేపించబడిన వాడై, అంతర్ధానమును చెంది, వెంటనే తన నివాసమునకు వెళ్లెను (34). శివవిభుడు మనలను మోసగించి తన నివాసమునకు వెళ్లినాడు అనే చక్కని జ్ఞానము అపుడు మేనాహిమవంతులకు కూడ కలిగెను (35). మనము గొప్ప తపస్సును చేసిన ఈ కన్యయగు పార్వతిని ఈ శివునకు ఈయవలెనని వారు నిశ్చయించుకొనిరి. పూర్వమునందు వలెనే వారిరువురిలో శివభక్తి నెలకొనెను (36).

అతో రుద్ర మహోతీశ్చ కృత్వా భక్తముదావహమ్‌ | వివాహం కృతవాన్‌ ప్రీత్యా పార్వత్యా స విధానతః || 37

ఇతి ప్రోక్త స్తుతే తాత సునర్తకనటాహ్వయః | శివావతారోహి మయా శివావాక్యప్రపూరకః || 38

ఇదమాఖ్యానమనఘం పరమం వ్యాహృతం మయా | య ఏతచ్ఛృణుయాత్ర్పీత్యా స సుఖీ గతి మాప్నుయాత్‌ || 39

ఇతి శ్రీశివమహాపురాణ శతరుద్రసంహితాయాం నటావతార వర్ణనం నామ చతుస్త్రింశో%ధ్యాయః (34).

తరువాత గొప్ప లీలలను ప్రదర్శించే రుద్రుడు భక్తులకు ఆనందమును కలిగించువాడై పార్వతిని ప్రీతితో యథావిథిగా వివాహమాడెను (37). వత్సా! శివుడు ఈ తీరున పార్వతీ దేవి యొక్క మాటను నిలబెట్టుటకై సుందరమగు నటుని అవతారమును దాల్చి నర్తించెను. ఈ వృత్తాంతమును నేను నీకు చెప్పియుంటిని (38). నేను నీకు చెప్పిన ఈ పరమ పవిత్రమగు గాథను ఎవడైతే ప్రీతితో వినునో, వాడు సుఖమును, పుణ్యగతిని పొందును (39).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు నటావతార వర్ణనమనే ముప్పది నాలుగవ అధ్యాయము ముగిసినది (34).

Siva Maha Puranam-3    Chapters