Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ త్రయస్త్రింశో%ధ్యాయః

జటిలావతారము

నందీశ్వర ఉవాచ|

సనత్కుమార సుప్రీత్యా శివస్య పరమాత్మనః | అవతారం శృణు విభోర్జటిలాహ్వం సుపావనమ్‌ || 1

పురా సతీ దక్షకన్యా త్యక్త్యా దేహం పితర్మఖే | స్వపిత్రా%నాదృతా జజ్ఞే మేనాయాం హిమ భూధరాత్‌ || 2

సా గత్వా గహనే %రణ్య తేపే సువిమలం తపః | శంకరం పతిమిచ్ఛంతీ సఖీభ్యాం సంయుతా శివా || 3

తత్తపస్సుపరీక్షార్థం సప్రర్షీన్‌ పై#్రషయచ్ఛివః | తపస్థ్సా నం తు పార్వత్యా నానా లీలా విశారదః || 4

తే గత్వా తత్ర మునయః పరీక్షాం చక్రురాదరాత్‌ | తస్యాస్సుయత్నతో నైవ సమర్థా హ్యభవంశ్చ తే || 5

తత్రా గత్య శివం నత్వా వృత్తాంతం చ నివేద్య తత్‌ | తదాజ్ఞాం సమనుప్రాప్య స్వర్లోకం జగ్మురాదరాత్‌ || 6

గతేషు తేషు మునిషు స్వస్థానం శంకరస్స్వయమ్‌ | పరీక్షితుం శివావృత్తమైచ్ఛత్సూతికరః ప్రభుః || 7

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ సనత్కుమారా! సర్వవ్యాపకుడు, పరమాత్మయగు శివుడు పరమపవిత్రమగు జటిలావతారమును దాల్చెను. నీవా గాథను పరమప్రీతితో వినుము (1). పూర్వము దక్షుని కుమార్తెయగు సతీదేవి తండ్రియొక్క యజ్ఞములో తన తండ్రిచే అవమానింపబడి మేనాహిమవంతులకు కుమార్తెయై జన్మించెను (2). ఆ పార్వతి శంకరుని భర్తగా పొందగోరి సఖురాండ్రతో గూడి దట్టమగు అడవిలో వెళ్లి గొప్ప తపస్సును చేసెను (3). అనేకలీలలను ప్రకటించుటలో పండితుడగు శివుడు పార్వతి యొక్క తపస్సును పరీక్షించుట కొరకై ఆమె తపస్సు చేయుచున్న స్థలమునకు సప్తర్షులను పంపించెను (4). ఆ మహర్షులు అచటకు వెళ్లి ఆమెను ఆదరపూర్వకముగా పరీక్షించిరి. వారు అధిక ప్రయత్నమును చేసియూ ఆమెలో దోషమును కానరైరి (5). అపుడు వారు కైలాసమునకు వెళ్లి శివునకు ప్రణమిల్లి ఆ వృత్తాంతమును విన్నవించి ఆయన అనుమతిని పొంది ఆదరముతో స్వర్గలోకమునకు వెళ్లిరి (6). వారు తమ స్థానములకు వెళ్లిన పిదప, లీలాకరుడగు శంకరప్రభుడు పార్వతీదేవి యొక్క ప్రవృత్తిని స్వయముగా పరీక్షించగోరెను (7).

సుప్రసన్నస్తపస్వీచ్ఛాశమనాదయమీశ్వరః | బ్రహ్మచర్యస్వరూపో%భూత్తదాద్భుతతరః ప్రభుః || 8

అతీవ స్థవిరో విప్రదేహధారీ స్వతేజసా | ప్రజ్వలన్మనసా హృష్టో దండీ ఛత్రీ మహోజ్జ్వలః || 9

ధృత్యైవం జాటిలం రూపం జగామ గిరిజావనమ్‌ | అతిప్రీతియుత శ్శంభుశ్శంకరో భక్తవత్సలః || 10

తత్రాపశ్యత్‌ స్థితాం దేవీం సఖీభిః పరివారితామ్‌ | వేదికోపరి శుద్ధాం తాం శివామివ విధోః కలామ్‌ || 11

శంభుర్నిరీక్ష్య తాం దేవీం బ్రహ్మచారిస్వరూపవాన్‌ | ఉపకంఠం య¸° ప్రీత్యా చోత్సుఖీ భక్తవత్సలః || 12

ఆ గతం సా తదా దృష్ట్వా బ్రాహ్మణం తేజసాద్భుతమ్‌ | అంగేషు లోమశం శాంతం దండచర్మసమన్వితమ్‌ || 13

బ్రహ్మ చర్యధరం వృద్ధం జటిలం సకమండలుమ్‌ | అపూజయత్పరప్రీత్యా సర్వపూజోపహారకైః || 14

తతస్సా పార్వతీ దేవీ పూజితం పరయా ముదా | కుశలం పర్యపృచ్ఛత్తం బ్రహ్మచారిణమాదరాత్‌ || 15

బ్రహ్మచారిస్వరూపేణ కస్త్వం హి కుత ఆగతః | ఇదం వనం భాసయసి వద వేదవిదాం వర || 16

అపుడు అద్భుతమగు లీలలను ప్రదర్శించే ఆ శంకరప్రభుడు కోరికలు తొలగిపోవుటచే ప్రసన్నమగు మనస్సు గలవాడు, తపశ్శాలి అగు బ్రహ్మచారి రూపమును దాల్చెను (8). ఆయన మిక్కిలి ముదుసలియగు బ్రాహ్మణుని వేషమును దాల్చెను. ఆయన స్వీయమగు తేజస్సుతో ప్రకాశిస్తూ, ఆనందముతో నిండిన మనస్సును కలిగియుండెను. ఆయన కర్రను, గొడుగును చేతబట్టి అతిశయించిన కాంతితో ప్రకాశించెను (9). మంగళకరుడు, భక్తవత్సలుడు అగు శంకరుడు అతిశయించిన ప్రేమ గలవాడై ఈ విధముగా జటాధారియగు బ్రహ్మచారిరూపమును దాల్చి పార్వతీదేవియొక్క తపోవనమును ప్రవేశించెను (10). అచట వేదికపై చెలికత్తెలతో చుట్టువారబడి, చంద్రుని మంగళకరమగు స్వచ్ఛమైన కళవలె ప్రకాశించే పార్వతీదేవిని చూచెను (11). బ్రహ్మచారి రూపములో నున్న భక్తవత్సలుడగు శంభుడు ఆ దేవిని చూచి, ప్రేమతో మరియు ఉత్కంఠతో దగ్గరకు వెళ్లెను (12). అపుడు తేజస్సుతో అద్భుతముగా ప్రకాశించుచున్నవాడు, రోమములతో నిండిన అవయవములు గలవాడు, ప్రసన్నుడు, కర్ర మరియు మృగచర్మము గలవాడు, బ్రహ్మచారి, ముదుసలి, కమండలమును పట్టుకున్నవాడు అగు ఆ బ్రాహ్మణుడు తన వద్దకు వచ్చుటను గాంచి, ఆమె పరమప్రీతితో ఆయనను సకలములగు పూజా ద్రవ్యములతో పూజించెను (13, 14). ఈ విధముగా పూజలనందుకున్న ఆ బ్రహ్మచారిని తరువాత ఆమె పరమప్రీతితో మరియు ఆదరముతో కుశలప్రశ్నలనడిగెను (15). ఓయీ ! నీవు బ్రహ్మచారివలె కన్పట్టుచున్నావు. నీవెవరివి ? ఎక్కడనుండి వచ్చితివి ? చెప్పుము. వేదవేత్తలలో శ్రేష్ఠుడవగు నీచే ఈ వనము భాసించుచున్నది (16).

నందీశ్వర ఉవాచ |

ఇతి పృష్టస్తు పార్వత్యా బ్రహ్మచారీ స వై ద్విజః | ప్రత్యువాచ ద్రుతం ప్రీత్యా శివాభావపరీక్షయా || 17

నందీశ్వరుడిట్లు పలికెను-

పార్వతి ఇట్లు ప్రశ్నించగా, బ్రహ్మచారియగు ఆ బ్రాహ్మణుడు ఆమె భక్తిని పరీక్షింపగోరి వెంటనే ప్రేమతో ఇట్లు సమాధానమును చెప్పెను (17).

బ్రహ్మ చార్యువాచ |

అహమిచ్ఛాభిగామీ చ బ్రహ్మచారీ ద్విజస్స వై | తపస్వీ సుఖదో%న్యేషాముపకారీ న సంశయః || 18

బ్రహ్మచారి ఇట్లు పలికెను-

నేను యథేచ్ఛగా సంచరించే బ్రహ్మచారిని, బ్రాహ్మణుడను. తపశ్శాలినగు నేను ఇతరులకు ఉపకారము చేసి, సుఖమును కలిగించుచుందుననుటలో సందేహము లేదు (18).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్త్వా బ్రహ్మచారీ స శంకరో భక్తవత్సలః | తస్థివానుపకంఠం స గోపయన్‌ రూపమాత్మనః || 19

నందీశ్వరుడిట్లు పలికెను-

బ్రహ్మచారి రూపములోనున్న భక్తవత్సలుడగు ఆ శంకరుడు ఇట్లు పలికి, తన యథార్థస్వరూపమును రహస్యముగా నుంచి, ఆమెకు దగ్గరలో నిలబడెను (19).

బ్రహ్మచార్యువాచ |

కిం బ్రవీమి మహాదేవి కథనీయం న విద్యతే | మహానర్థకరం వృత్తం దృశ్యతే వికృతం మహత్‌ || 20

నవే వయసి సద్భోగసాధనే సుఖకారణ | మహోపచార సద్భోగైర్వృథైవ త్వం తపస్యసి || 21

కా త్వం కస్యాసి తనయా కిమర్థం విజనే వనే | తపశ్చరసి దుర్ధర్షం మునిభిః ప్రయతాత్మభిః || 22

బ్రహ్మచారి ఇట్లు పలికెను-

ఓ మహాదేవీ ! ఏమి చెప్పగలను? చెప్పదగినది ఏదీ లేదు. గొప్ప హానిని కలిగించే మహావికృతమగు దృశ్యము నాకు కనబడుచున్నది (20). మంచి భోగములకు సాధనము, గొప్ప పరిచర్యలతో మరియు చక్కని భోగములతో సుఖమునకు హేతువు అగు నవ¸°వనములో నీవు వ్యర్థముగా మాత్రమే తపస్సును చేయుచున్నావు (21). నీవెవరివి? ఎవరి దానవు ? ఈ నిర్జనమగు వనములో నీవు సమాహితమనస్కులగు మహర్షులు కూడ చేయలేని కఠోరమగు తపస్సును చేయుటకు కారణమేమి ? (22)

నందీశ్వర ఉవాచ |

ఇతి తద్వచనం శ్రుత్వా ప్రహస్య పరమేశ్వరీ | ఉవాచ వచనం ప్రీత్యా బ్రహ్మచారిణముత్తమమ్‌ || 23

నందీశ్వరుడిట్లు పలికెను-

ఆ పరమేశ్వరి ఉత్తముడగు ఆ బ్రహ్మచారియొక్క ఆ మాటను విని నవ్వి ప్రీతిపూర్వకముగా ఇట్లు పలికెను (23).

పార్వత్యువాచ |

శృణు విప్ర బ్రహ్మచారిన్‌ మద్వృత్తమఖిలం మునే | జన్మమే భారతే వర్షే సాంప్రతం హిమవద్గృహే || 24

పూర్వం దక్షగృహే జన్మ సతీ శంకరకామినీ | యోగేన త్యక్త దేహాహం తాతేన పతినిందినా || 25

అత్ర జన్మని సంప్రాప్య సుపుణ్యన శివో ద్విజ | మాం త్యక్త్వా భస్మసాత్కృత్య మన్మథం స జగామ హ || 26

ప్రయాతే శంకరే తాపా ద్వ్రీడితాహం పితుర్గృహాత్‌ | ఆగచ్ఛమత్ర తపసే గురువాక్యేన సంయతా || 27

మనసా వచసా సాక్షాత్కర్మణా పతిభావతః | సత్యం బ్రవీమి నో%సత్యం సవృతశ్శంకరో మయా || 28

జానామి దుర్లభం వస్తు కథం ప్రాప్యం మయా భ##వేత్‌ | తథాపి మన సౌత్సుక్యాత్తప్యతే మే తపో%ధునా || 29

హిత్వేంద్రప్రముఖాన్‌ దేవాన్‌ విష్ణుం బ్రహ్మాణమప్యహమ్‌ | పతిం పినాకపాణిం వై ప్రాప్తుమిచ్ఛామి సత్యతః || 30

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ బ్రాహ్మణ బ్రహ్మచారీ ! నా వృత్తాంతమునంతనూ వినుము. ఓ మునీ! నేను ఈ జన్మలో భారతదేశములో హిమవంతుని ఇంటిలో పుట్టితిని (24). పూర్వజన్మలో దక్షుని కుమార్తెనై జన్మించి శంకరుని చెట్టబట్టితిని. నా తండ్రి నా భర్తను నిందించగా, నేను యోగాగ్నిచే దేహమును విడిచిపెట్టితిని (25). ఓ బ్రాహ్మణుడా ! గొప్ప పుణ్యముచే ఈ జన్మలో ఆ శంకరుని కనుగొంటిని. కాని, ఆయన మన్మథుని బూడిదచేసి, నన్ను విడిచివెళ్లినాడు (26). శంకరుడు నిష్క్రమించిన పిదప నేను దుఃఖమును పొంది, సిగ్గుపడినదాననై, గురువుయొక్క ఉపదేశమును స్వీకరించి, తపస్సును చేయుటకై తండ్రిగారి ఇంటివద్దనుండి ఇక్కడకు వచ్చితిని (27). నేను సత్యమును చెప్పుచున్నాను. నేను మనోవాక్కాయకర్మలతో సాక్షాత్తుగా శంకరుని భర్తగా వరించితిని. ఇది అసత్యము కాదు (28). పొందశక్యము కాని వస్తువును నేను ఎట్లు పొందగలను? అయినప్పటికీ, నేను ఇప్పుడు మనస్సుయొక్క ఉత్సుకత కారణముగా తపస్సును చేయుచున్నాను (29). ఇంద్రుడు మొదలగు దేవతలను మాత్రమే గాక, బ్రహ్మవిష్ణువులను కూడ విడిచి పెట్టి నేను పినాకమనే ధనస్సును ధరించే శంకరుని భర్తగా పొందగోరుచున్నాను. ఇది యథార్థము (30).

నందీశ్వర ఉవాచ|

ఇత్యేవం వచనం శ్రుత్వా పార్వత్యా హి సునిశ్చితమ్‌ | మునే స జటిలో రుద్రో విహసన్‌ వాక్యమబ్రవీత్‌ || 31

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మునీ! పార్వతియొక్క ఈ నిశ్చితమగు వచనమును విని జటాధారియగు ఆ రుద్రుడు నవ్వి ఇట్లు పలికెను (31).

జటిల ఉవాచ|

హిమాచలసుతే దేవి కా బుద్ధిస్స్వీకృతా త్వయా | రుద్రార్థం విబుధాన్‌ హిత్వా కరోషి విపులం తపః || 32

జానామ్యహం చ తం రుద్రం శృణు త్వం ప్రవదామి తే | వృషధ్వజస్స రుద్రో హి వికృతాత్మా జటాధరః || 33

ఏకాకీ చ సదా నిత్యం విరాగీ చ విశేషతః | తస్మాత్త్వం తేన రుద్రేణ మనో యోక్తుం న చార్హసి || 34

సర్వం విరుద్ధరూపాది తవ దేవి హరస్య చ | మహ్యం న రోచతే హ్యేతద్యదీచ్ఛసి తథా కురు || 35

ఆ జటాధారి ఇట్లు పలికెను-

ఓ హిమవత్పుత్రీ ! దేవీ ! నీవు ఎట్టి బుద్ధిని కలిగియున్నావు? దేవతలను కాదని రుద్రుని కొరకై కఠోరమగు తపస్సును చేయుచున్నావు (32). ఆ రుద్రుడు నాకు తెలిసినవాడే. నేను చెప్పెదను. నీవు వినుము. వృషభము ధ్వజమునందు గల ఆ రుద్రుడు జటలతో వికృతమగు దేహమును కలిగియుండును (33). సర్వకాలములలో ఏకాకిగా ఉండే ఆయన విశేషించి పూర్ణమగు వైరాగ్యము గలవాడు. కావున, నీవు నీ మనస్సును ఆ రుద్రునిపై ప్రసరింప జేయుట తగదు (34). ఓ దేవీ! నీకు, ఆ శివునకు రూపము మొదలగు సర్వము విరుద్ధముగ నుండును. ఇది నాకు నచ్చలేదు. నీకు తోచినట్లు నీవు చేయుము (35).

నందీశ్వర ఉవాచ|

ఇత్యుక్త్వా చ పునా రుద్రో బ్రహ్మచారి స్వరూపవాన్‌ | నినింద బహుధాత్మానం తదగ్రే తాం పరీక్షితుమ్‌ || 36

తచ్ఛ్రుత్వా పార్వతీ దేవీ విప్రవాక్యం దురాసహమ్‌ | ప్రత్యువాచ మహాక్రుద్ధా శివనిందాపరం చ తమ్‌ || 37

ఏతావద్ధి మయా జ్ఞాతం కశ్చిద్ధన్యో భవిష్యతి | పరం తు సకలం జ్ఞాతమవధ్యో దృశ్యతే%ధునా || 38

బ్రహ్మచారి స్వరూపేణ కశ్చిత్త్వం ధూర్త ఆ గతః | శివనిందా కృతా మూఢ త్వయా మన్యురభూన్మమ || 39

శివం త్వం చ న జానాసి శివాత్త్వం హి బహిర్ముఖః | త్వత్పూజా చ కృతా యన్మే తస్మాత్తా పయుతా%భవమ్‌ || 40

శివనిందాం కరోతీహ తత్త్వమజ్ఞాయ యః పుమాన్‌ | ఆజన్మసంచితం పుణ్యం తస్య భస్మీభవత్యుత || 41

శివవిద్వేషిణం స్పృష్ట్వాప్రాయశ్శిత్తం సమాచరేత్‌ || 42

రే రే దుష్ట త్వయా ప్రోక్త మహం జానామి శంకరమ్‌ | నిశ్చయేన న విజ్ఞాతశ్శివ ఏవ పరః ప్రభుః || 43

యథా తథా భ##వేద్రుద్రో మాయయా బహురూపవాన్‌ | మమాభీష్ట ప్రదో%త్యంతం నిర్వికారస్సతాం ప్రియః || 44

ఇత్యుక్త్వా తం శివా దేవీ శివతత్త్వం జగాద సా | యత్ర బ్రహ్మతయా రుద్రః కథ్యతే నిర్గుణో%వ్యయః || 45

తదాకర్ణ్య వచో దేవ్యా బ్రహ్మచారీ స వై ద్విజః | పునర్వచన మాదాతుం యావదేవ ప్రచక్రమే || 46

ప్రోవాచ గిరిజా తావత్‌ స్వసఖీం విజయాం ద్రుతమ్‌ | శివాసక్తమనో వృత్తి శ్శివ నిందా పరాఙ్ముఖీ || 47

నందీశ్వరుడిట్లు పలికెను-

ఈ విధముగా పలికి బ్రహ్మచారిరూపములోనున్న రుద్రుడు మరల ఆమె యెదుట ఆమెను పరీక్షించుట కొరకై తనను తాను పలువిధములుగా నిందించుకొనెను (36). సహింప శక్యము కాని ఆ బ్రాహ్మణుని వచనములను విని ఆ పార్వతీదేవి గొప్ప కోపమును పొంది శివుని నిందించుటయే ప్రధానకర్తవ్యముగా గల ఆయనను ఉద్దేశించి ఇట్లు బదులు చెప్పెను (37). నాకు ఇంతమాత్రము తెలిసినది. శివనిందను చేసినవాడెవడైనా వధకు అర్హుడు అగును. కాని నాకు అంతయు తెలిసినది. నీవు వధకు అర్హుడవు కావని నాకు తోచుచున్నది (38). బ్రహ్మచారిరూపములో వచ్చిన నీవు ఊరు పేరు లేని ధూర్తుడవు. ఓయీ మూర్ఖా! నీవు శివుని నిందించి నాకు కోపమును తెప్పించినావు (39). నీకు శివుడు తెలియదు. నీవు శివతత్త్వము విషయములో బహిర్ముఖుడవు. నేను నిన్ను పూజించినాను అనే విషయము నాకు మనస్తాపమును కలిగించుచున్నది (40). ఈ లోకములో ఏ మానవుడు సత్యము తెలియనివాడై శివుని నిందించునో, వాని పూర్వజన్మార్జితమైన పుణ్యము అంతయు భస్మమగును (41). శివునిచే ద్వేషించువానిని ముట్టుకున్నచో, ప్రాయశ్చిత్తమును చేసుకొనవలెను (42). ఓరీ దుష్టా! నాకు శంకరుడు తెలిసినవాడేనని నీవు చెప్పియుంటివి. కాని పరమప్రభుడగు ఆ శంకరుని నీవు ఖచ్చితముగా యెరుగవు (43). ఆ రుద్రుడు మాయచే వివిధములగు రూపమును దాల్చుచుండును. వికారములు లేనివాడు, సత్పురుషులకు ప్రియుడు అగు ఆయన నిశ్చయముగా నా అభీష్టమును నెరవేర్చును (44). ఆ పార్వతీదేవి ఆ బ్రహ్మచారితో ఇట్లు పలికి, మరల ఈ విధముగా శివతత్త్వమును బోధించెను. నిర్గుణము, వినాశము లేనిది అగు పరబ్రహ్మమే సగుణోపాధియందు రుద్రుడు అని పిలువబడుచున్నది (45). ఆ బ్రాహ్మణబ్రహ్మచారి ఆ దేవియొక్క మాటలను విని, మరల మాటలాడుటకు సిద్ధపడుచుండెను (46). అంతలో శివునియందు లగ్నమైన మనోవృత్తులు గల పార్వతి శివనిందను భరించలేనిదై, తన సఖురాలగు విజయతో వెంటనే ఇట్లు పలికెను (47).

గిరిజోవాచ|

వారణీయః ప్రయత్నేన సఖ్యయం హి ద్విజాధమః | పునర్వక్తుమనాశ్చాయం శివనిందాం కరిష్యతి || 48

న కేవలం భ##వేత్సాపం నిందాకర్తు శ్శివస్య హి | యో వై శృణోతి తన్నిందాం పాపభాక్‌ స భ##వేదిహ || 49

శివనిందాకరో వధ్యస్సర్వథా శివకింకరైః | బ్రాహ్మణశ్చేత్స వైత్యాజ్యో గంతవ్యం తత్‌ స్థలా ద్ద్రుతమ్‌ || 50

అయం దుష్టః పునర్నిందాం కరిష్యతి శివస్య హి | బ్రాహ్మణత్వాదవధ్యశ్చ త్యాజ్యో%దృశ్యశ్చ సర్వథా || 51

స్థలమేతద్ద్రుతం హిత్వా యాస్యామో%న్యత్ర మా చిరమ్‌ | యథా సంభాషణం న స్యా దనేనావిదుషా పునః || 52

పార్వతి ఇట్లు పలికెను-

ఓ సఖీ! నీవు ప్రయత్నపూర్వకముగా ఈ బ్రాహ్మణాధముని ఆపుము. ఈతడు మరల ఏదో చెప్పబోవుచున్నాడు. మరల శివుని నిందించగలడు (48). ఈ లోకములో శివుని నిందించువానికి మాత్రమే గాక, ఆ నిందను విను వానికి కూడ పాపము సంక్రమించును (49). శివనిందను చేయువాడు వధకు అర్హుడు. శివభక్తులు వానిని వధించవలెను. కాని వాడు బ్రాహ్మణుడైనచో, వదలి పెట్టవలెను. కాని, అచ్చోటనుండి వెంటనే దూరముగా పోవలెను (50). ఈ దుష్టుడు మరల శివుని నిందించగలడు. కాని, బ్రాహ్మణుడు గనుక వధార్హుడు కాడు. కావున, మరల కంటికి కానరాని విధముగా, వీనికి మనము దూరముగా పోవలెను (51). కావున ఆలస్యము చేయవద్దు. మనమీ స్థలమును వెంటనే విడిచిపెట్టి దూరముగా పోయెదము. ఈ మూర్ఖునితో మనకు మరల సంభాషణము వద్దు (52).

నందీశ్వర ఉవాచ |

ఇత్యుక్త్వా చోమయా యావత్పదముత్‌ క్షిప్యతే మునే | అసౌ తావచ్ఛివ స్సాక్షాదాలలంబే పటం స్వయమ్‌ || 53

కృత్వా స్వరూపం దివ్యం చ శివాధ్యానం యథా తథా | దర్శయిత్వా శివాయై తామువాచావాఙ్ముఖీం శివః || 54

నందీశ్వరుడిట్లు పలికెను-

ఓ మునీ! పార్వతి ఇట్లు పలికి కాలును ముందుకు వేయునంతలో ఈ శివుడు సాక్షాత్తుగా స్వయముగా ఆమె కొంగును పట్టుకొనెను (53). ఆ పార్వతి ధ్యానములో ఏ రూపమును దర్శించెడిదో, అట్టి దివ్యరూపమును శివుడు ఆమెకు చూపించి, తలను వంచుకొనియున్న ఆమెతో నిట్లనెను (54).

శివ ఉవాచ|

కుత్ర త్వం యాసి మాం హిత్వా న త్వం త్యాజ్యా మయా శివే | మయా పరీక్షితాసి త్వం దృఢభక్తాసి మే%నఘే || 55

బ్రహ్మచారి స్వరూపేణ భావమిచ్ఛుస్త్వదీయకమ్‌ | తవోపకంఠమాగత్య ప్రావోచం వివిధం వచః || 56

ప్రసన్నో%స్మి దృఢం భక్త్యా శివే తవ విశేషతః | చిత్తేప్సితం వరం బ్రూహి నాదేయం విద్యతే తవ || 57

అద్య ప్రభృతి తే దాసస్తపోభిః ప్రేమనిర్భరే | కృతో%స్మి తవ సౌందర్యాత్‌ క్షణ ఏకో యుగాయతే || 58

త్యజ్యతాం చ త్వయా లజ్జా మమ పత్నీ సనాతనీ | ఏహి ప్రియే త్వయా సాకం ద్రుతం యామి స్వకం గిరిమ్‌ || 59

ఇత్యుక్తవతి దేవేశే శివాతి ముదమాప సా | తపోదుఃఖం తు యత్సర్వం తజ్జహౌ ద్రుతమేవ హి || 60

తతః ప్రహృష్టా సా దృష్ట్వా దివ్యరూపం శివస్య తత్‌ | ప్రత్యువాచ ప్రభుం ప్రీత్యా లజ్జయాధోముఖీ శివా || 61

శివుడు ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! నన్ను విడిచి ఎక్కడకు వెళ్లుచుంటివి ? నీవు నన్ను విడిచి వెళ్లరాదు. నేను నిన్ను పరీక్షించితిని. ఓ పుణ్యాత్మురాలా ! నీకు నాయందు దృఢమగు భక్తి గలదు (55). నీ భక్తిని తెలుసుకొనుటకై నేను బ్రహ్మచారి రూపములో నీ వద్దకు వచ్చి అనేకములగు పలుకులను పలికితిని (56). ఓ పార్వతీ! నీ భక్తిచే నేను విశేషించి ప్రసన్నుడనైతిని. నీ మనస్సునకు నచ్చిన వరమును కోరుకొనుము. నీకు ఈయరానిది లేదు (57). ప్రేమతో నిండిన హృదయము గల ఓ పార్వతీ! నీవు నన్ను నీ తపస్సుతో కొనివేసితివి. నేను ఈ నాటినుండి నీ సౌందర్యమునకు దాసుడనైతిని. నీవు లేని క్షణము ఒక యుగముగా తోచుచున్నది (58). నీవు సిగ్గును విడువుము. నీవు నాకు శాశ్వతధర్మపత్నివి. ఓ ప్రియురాలా ! రమ్ము. నేను నిన్ను తీసుకొని వెంటనే నా కైలాసపర్వతమునకు వెళ్లెదను (59). ఆ దేవదేవుడు ఇట్లు పలుకగా, పార్వతి మహానందమును పొందెను. ఆమె వెంటనే తపస్సులో తనకు కలిగిన క్లేశమునంతనూ మరచి పోయెను (60). శివుని ఆ దివ్యరూపమును గాంచి మహానందమును పొందియున్న శివపత్నియగు ఆ పార్వతి అప్పుడు ప్రేమతో మరియు సిగ్గుతో తలను పంచుకున్నదై ఇట్లు బదులు చెప్పెను (61).

శివోవాచ |

యది ప్రసన్నోదేవేశ కరోషి చ కృపాం మయి | పతిర్మే భవ దేవేశ ఇత్యుక్తశ్శివయా శివః || 62

గృహీత్వా విధివత్పాణిం కైలాసం స తయా య¸° | పతిం తం గిరిజా ప్రాప్య దేవకార్యం చకార సా || 63

ఇతి ప్రోక్తస్తు తే తాత బ్రహ్మచారి స్వరూపకః | శివావతారో హి మయా శివాభావపరీక్షకః || 64

ఇదామాఖ్యానమనఘం పరమం వ్యాహృతం మయా | య ఏతచ్ఛృణుయాత్ర్పీత్యా స సుఖీ గతిమాప్నుయాత్‌ || 65

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్ర సంహితాయాం జటిలావతారవర్ణనం నామ త్రయస్త్రింశో%ధ్యాయః (33).

పార్వతి ఇట్లు పలికెను-

ఓ దేవదేవా ! నీవు ప్రసన్నుడవైనచో, నాయందు దయను చూపుము. ఓ దేవదేవా ! నీవు నాకు భర్తవు కమ్ము. పార్వతి శివునితో ఇట్లు పలికెను (62). ఆయన ఆమెను యథావిధిగా వివాహమాడి, ఆమెను తీసుకొని కైలాసమునకు వెళ్లెను. ఆ పార్వతి ఆయనను భర్తగా పొంది దేవకార్యమును చేసెను (63). ఓయీ కుమారా! ఈ విధముగా పార్వతియొక్క భక్తిని పరీక్షించిన శివుని బ్రహ్మచారి అవతారమును గురించి నేను నీకు చెప్పితిని (64). నేను నీకు చెప్పిన ఈ పరమపవిత్రమగు గాథను ఎవడైతే ప్రీతితో వినునో, అట్టివాడు సుఖములనను భవించి మోక్షమును పొందును (65).

శ్రీ శివ మహాపురాణములోని శతరుద్రసంహితయందు శివుని జటిలావతారమును వర్ణించే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).

Siva Maha Puranam-3    Chapters