Siva Maha Puranam-3    Chapters   

అథ ద్వితీయో%ధ్యాయః

అష్టమూర్తి

నందీశ్వర ఉవాచ |

శృణు తాత మహేశస్యావతారాన్‌ పరమాన్‌ ప్రభోః | సర్వకార్యకరాన్‌ లోకే సర్వస్య సుఖదాన్మునే || 1

తస్య శంభోః పరేశస్య మూర్త్యష్టకమయం జగత్‌ | తస్మిన్‌ వ్యాప్య స్థితం విశ్వం సూత్రే మణిగణా ఇవ || 2

శర్వో భవస్తథా రుద్ర ఉగ్రో భీమః పశోః పతిః | ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః || 3

భూమ్యంభో%గ్నిమరుద్‌ వ్యోమక్షేత్రజ్ఞార్క నిశాకరాః | అధిష్ఠితాశ్చ శర్వాద్యైరష్ట రూపై శ్శివస్య హి || 4

ధత్తే చరాచరం విశ్వం రూపం విశ్వం భరాత్మకమ్‌ | శంకరస్య మహేశస్య శాస్త్రసై#్యవేతి నిశ్చయః || 5

సంజీవనం సమస్తస్య జగత్సలిలాత్మకమ్‌ | భవ ఇత్యుచ్యతే రూపం భవస్య పరమాత్మనః || 6

బహిరంతర్జగద్విశ్వం బిభర్తి స్పందతే స్వయమ్‌ | ఉగ్ర ఇత్యుచ్యతే సద్భీ రూపముగ్రస్య సత్ర్పభోః || 7

సర్వావకాశదం సర్వవ్యాపకం గగనాత్మకమ్‌ | రూపం భీమస్య భీమాఖ్యం భూపబృందస్య ఖేదకమ్‌ || 8

నందీశ్వరుడిట్లు పలికెను-

వత్సా ! మహర్షీ! మహేశప్రభుని గొప్ప అవతారములను వినుము. ఈ అవతారములు లోకమునందు కార్యములనన్నిటినీ చక్కబెట్టి సర్వులకు సుఖమునిచ్చును (1). పరమేశ్వరుడగు ఆ శంభుని ఎనిమిది మూర్తులతో ఈ జగత్తు నిండియున్నది. దారమునందు మణుల పూసలువలె, ఈ జగత్తు అంతయూ ఆయనయందు ప్రతిష్ఠను పొంది ఆయనచే వ్యాప్తమై యున్నది (2). శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు మరియు మహాదేవుడు అనునవి అష్టమూర్తుల నామధేయములుగా ప్రసిద్ధి గాంచినవి (3). శర్వుడు మొదలగు ఈ శివుని అష్టమూర్తులచే క్రమముగా భూమి, జలము. అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞుడు (జీవుడు), సూర్యుడు మరియు చంద్రుడు అధిష్ఠింపబడి యున్నారు (4). మంగళకరుడగు మహేశునియొక్క భూమి అనే మూర్తి స్థావరజంగమాత్మకమగు ప్రాణి కోటిని అంతనూ ధరించి యున్నదిని శాస్త్రము నిర్ణయించినది (5). పరమాత్మ, సద్ఘనుడు అగు శివుని భవ అనుపేరు గల మూర్తి జలరూపములో సర్వప్రాణులకు ప్రాణములను నిలబెట్టుచున్నదని మహర్షులు చెప్పుచున్నారు (6). పాపులకు భయంకరుడు, సత్పురుషులకు శరణు అగు శివుని రూపమైన ఉగ్రుడు ప్రాణుల లోపల, బయట తానే ఉండి క్రియా రూపములో విశ్వమును భరించుచున్నాడని సత్పురుషులు చెప్పుచున్నారు (7). సర్వపదార్థములకు అవకాశము నిచ్చునది, సర్వమును వ్యాపించియున్నది, ప్రాణి సమూహములో భేదమునకు ఆలంబనమైనది అగు ఆకాశముయొక్క రూపములో భయంకరాకారుడగు శివుని మూర్తియే గలదు. ఆ మూర్తికి భీముడని పేరు (8).

సర్వాత్మనామధిష్ఠానం సర్వక్షేత్ర నివాసకమ్‌ | రూపం పశుపతేర్జేఞ యం పశుపాశనికృంతనమ్‌ || 9

సందీపయజ్జగత్సర్వం దివాకర సమాహ్వయమ్‌ | ఈశానాఖ్యం మహేశస్య రూపం దివి విసర్పతి || 10

ఆప్యాయయతి యో విశ్వమమృతాంశుర్నిశాకరః | మహాదేవస్య తద్రూపం మహాదేవస్య చాహ్వయమ్‌ || 11

ఆత్మా తస్యాష్టమం రూపం శివస్య పరమాత్మనః | వ్యాపికేతరమూర్తీనాం విశ్వం తస్మాచ్ఛివాత్మకమ్‌ || 12

శాఖాః పుష్యంతి వృక్షస్య వృక్షమూలస్య సేచనాత్‌ | తద్వదస్య వపుర్విశ్వం పుష్యతే చ శివార్చ నాత్‌ || 13

యథేహ పుత్రపౌత్రాదేః ప్రీత్వా ప్రీతో భ##వేత్పితా | తథా విశ్వస్య సంప్రీత్యా ప్రీతో భవతి శంకరః || 14

క్రియతే యస్య కస్యాపి దేహినో యది నిగ్రహః | అష్టమూర్తేరనిష్టం తత్కృతమేవ న సంశయః || 15

ఆత్మలన్నింటికీ అధిష్ఠానము, క్షేత్రము (దేహము) లన్నింటియందు నివసించునది, జీవుల సంసారబంధములను తెగగోయునది అగు శంకరమూర్తికి పశుపతి యని పేరు (9). మహేశుని ఈశానుడను పేరుగల మూర్తి సూర్యరూపములో జగత్తు నంతనూ ప్రకాశింపజేయుచూ ద్యులోకమునందు సంచరించుచున్నది (10). మహాదేవుడను పేరుగల మహాదేవుని మూర్తి చంద్రరూపములో అమృతకిరణములను జగత్తుపై వెదజల్లి పుష్టిని, తృప్తిని కలిగించుచున్నది (11). శివపరమాత్ముని ఎనిమిదివ రూపము ఆయన ఆత్మయే. ఆ రుద్రరూపము ఇతరమూర్తులన్నింటితో గూడిన జగత్తును వ్యాపించియుండును గనుక, అది శివుని స్వరూపమే (12). చెట్టుమొదట్లో నీరు పోసినచో కొమ్మలకు పుష్టి కలుగును. అటులనే, శివుని ఆరాధించినచో, ఆయన దేహము అయిన జగత్తునకు పుష్టి కలుగును (13). ఈ లోకములో పుత్రులు, పౌత్రులు మొదలగు వారి ఆనందమును గాంచి తండ్రి ఆనందించును. అటులనే, జగత్తు ఆనందించినచో శంకరుడు ప్రీతుడగును (14). ఏ ప్రాణికైననూ కష్టమును కలిగించినచో, అది ఆ అష్టమూర్తియగు శివునకు అప్రియమును చేసినట్లు అగును. సందేహము వలదు. ఇది నిశ్చయము (15).

అష్టముర్త్యాత్మనా విశ్వమధిష్ఠాయాస్థితం శివమ్‌ | భజస్వ సర్వభావేన రుద్రం పరమకారణమ్‌ || 16

ఇతి ప్రోక్తాస్స్వరూపాస్తే విధిపుత్రాష్ట విశ్రుతాః | సర్వోపకార నిరతాస్సేవ్యాశ్ర్శేయో%ర్థి భిర్నరైః || 17

ఇతి శ్రీ శివమహాపురాణ శతరుద్రసంహితాయాం శివాష్టమూర్తి వర్ణనం నామ ద్వితీయో%ధ్యాయః (2)

అష్టమూర్తుల రూపములో జగత్తును అధిష్ఠించి యున్నవాడు, మంగళస్వరూపుడు, సర్వకారణకారణుడు అగు రుద్రుని'సర్వము రుద్రుడే' యను భావముతో భజించుము (16). ఓయీ సనత్కుమారా! నీకు ఇంతవరకు విఖ్యాతి గాంచిన అష్టమూర్తులను గురించి చెప్పితిని. సర్వప్రాణులకు హితమును చేయుటలో సంలగ్నమై యున్న ఈ అష్టమూర్తులను శ్రేయస్కాములగు మానవులు సేవించవలెను(17).

శ్రీ శివమహాపురాణములోని శతరుద్రసంహితయందలి శివాష్టమూర్తి వర్ణనమనే రెండవ అధ్యాయము ముగిసినది (2).

Siva Maha Puranam-3    Chapters