Page load depends on your network speed. Thank you for your patience. You may also report the error.

Loading...

Siva Maha Puranam-3    Chapters   

అథ పంచవింశో%ధ్యాయః

కాలజ్ఞాన వర్ణనము

వ్యాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ త్వత్సకాశాన్మయా మునే | స్త్రీస్వభావః శ్రుతః ప్రీత్యా కాలజ్ఞానం వదస్వ మే || 1

వ్యాసుడు ఇట్లు పలికెను-

ఓ సనత్కుమారా ! నీవు సర్వజ్ఞుడవు. ఓ మునీ! నేను నీవద్దనుండి దుష్టస్త్రీల స్వభావమును గురించి ప్రీతిపూర్వకముగా వినియుంటిని. నాకు కాలజ్ఞానమును గురించి చెప్పుము (1).

సనత్కుమార ఉవాచ |

ఇదమేవ పురా%పృచ్ఛత్పార్వతీ పరమేశ్వరమ్‌ | శ్రుత్వా నానాకథాం దివ్యాం ప్రసన్నా సుప్రణమ్య తమ్‌ || 2

సనత్కుమారుడు ఇట్లు పలికెను-

పూర్వము పార్వతి దివ్యములగు అనేకగాథలను వినిన పిదప పరమేశ్వరునకు చక్కగా నమస్కరించి ఇదే విధముగా ప్రశ్నించెను (2).

పార్వత్యువాచ |

భగవంస్త్వత్ర్పసాదేన జ్ఞాతం మే సకలం మతమ్‌ | యథార్చనం తు తే దేవ యైర్మంత్రైశ్చ యథావిధి || 3

అద్యాపి సంశయస్త్వేకః కాలచక్రం ప్రతి ప్రభో | మృత్యుచిహ్నం యథా దేవ కిం ప్రమాణం యథాయుషః || 4

తథా కథయ మే నాథ యద్యహం తవ వల్లభా | ఇతి పృష్టస్తయా దేవ్యా ప్రత్యువాచ మహేశ్వరః || 5

పార్వతి ఇట్లు పలికెను-

ఓ పరమేశ్వరా ! నీ అనుగ్రహముచే నేను సర్వమును తెలుసుకొని మననము చేసితిని. ఓ దేవా! నిన్ను యథావిధిగా ఏయే మంత్రములతో ఎట్లు అర్చించవలెనో తెలుసుకుంటిని (3). ఓ ప్రభూ! అయిననూ నాకు ఇంకనూ కాలచక్రమును గురించి ఒక సందేహము గలదు. ఓ దేవా! రాబోయే మరణమును సూచించే చిహ్నములు ఏవి? జీవితముయొక్క పరిమాణము ఎంత? (4). ఓ నాథా! నేను నీకు ప్రియురాలనైనచో, ఈ విషయములను నాకు చెప్పుము. ఆ దేవి ఇట్లు ప్రశ్నించగా, మహేశ్వరుడు ఇట్లు బదులిడెను (5).

ఈశ్వర ఉవాచ|

సత్యం తే కథయిష్యామి శాస్త్రం సర్వోత్తమం ప్రియే | యేన శాస్త్రేణ దేవేశి నరైః కాలః ప్రబుధ్యతే || 6

అహః పక్షం తథా మాసమృతుం చాయనవత్సరౌ | స్థూలసూక్ష్మగతైశ్చిహ్నైర్బహిరంతర్గతైస్తథా || 7

తత్తేహం సంప్రవక్ష్యామి శృణు తత్త్వేన సుందరి | లోకానాముపకారార్థం వైరాగ్యార్థముమే%ధునా || 8

అకస్మాత్పాండురం దేహమూర్ధ్వరాగం సమంతతః | తదా మృత్యుం విజానీయాత్‌ షణ్మాసాభ్యంతరే ప్రియే || 9

ముఖః కర్ణౌ తథా చక్షుర్జిహ్వాస్తంభో యదా భ##వేత్‌ | తదా మృత్యుం విజానీయాత్‌ షణ్మాసాభ్యంతరే ప్రియే || 10

రౌరవానుగతం భద్రం ధ్వనిం నాకర్ణయేద్ద్రుతమ్‌ | షణ్మాసాభ్యంతరే మృత్యుర్‌జ్ఞాతవ్యః కాలవేదిభిః || 11

రవిసోమాగ్నిసంయోగాద్యదోద్యోతం న పశ్యతి | కృష్ణం సర్వం సమస్తం చ షణ్మాసం జీవితం తథా || 12

వామహస్తో యదా దేవి సప్తాహం స్పందతే ప్రియే | జీవితం తు తదా తస్య మాసమేకం న సంశయః || 13

ఉన్మీలయంతి గాత్రాణి తాలుకం శుష్యతే యదా | జీవితం తు తదా తస్య మాసమేకం న సంశయః || 14

నాసా తు స్రవతే యస్య త్రిదోషే పక్షజీవితమ్‌ | వక్త్రం కంఠం చ శుప్యేత షణ్మాసాంతే గతాయుషః || 15

ఈశ్వరుడు ఇట్లు పలికెను-

ఓ ప్రియురాలా ! నీకు సర్వశ్రేష్ఠమగు శాస్త్రమును యథార్థముగా చెప్పగలను. ఓ దేవ దేవీ ! ఈ శాస్త్రమును ఆధారముగా చేసుకొని మాత్రమే మానవులు కాలమును తెలియగలుగుచున్నారు (6). దినము, పక్షము, మాసము, ఋతువు, అయనము, సంవత్సరము అను కాలవిభాగమును శాస్త్రము బోధించుచున్నది. బయట మరియు లోపల ఉండే స్థూలము మరియు సూక్ష్మము అగు చిహ్నములచే భవిష్యత్తును ఊహించవచ్చును (7). ఓ సుందరీ! నేను నీకు ఆ వివరములను యథాతథముగా చెప్పెదను. ఓ ఉమా! నేను ఇప్పుడు ఆ విషయమును వైరాగ్యమను కలిగించి మానవులకు ఉపకారమును చేయుటకొరకై చెప్పుచున్నాను (8) ఓ ప్రియురాలా! హఠాత్తుగా దేహము పాలిపోయి తెల్లగా అయి, పై భాగమునందు అంతటా ఎర్ర బడినచో, ఆరు మాసములలో మృత్యువు కలుగునని తెలియవలెను (9). ఓ ప్రియురాలా! ముఖము, చెవులు, కన్నులు లేదా నాలుక స్తంభించినచో, ఆరు మాసములు లోపులో మృత్యువు కలుగునని తెలియుము (10). ఓ మంగళస్వరూపురాలా! పెద్ద కేకయొక్క ధ్వని వెంటనే విన రాకున్నచో, ఆరు మాసములు లోపులో మృత్యువు కలుగునని కాలవేత్తలు చెప్పుచున్నారు (11). సూర్యచంద్రులను, అగ్నిని చూచినప్పుడు ప్రకాశించే జ్యోతి కానరాకుండగా, అంతా నల్లగా కానవచ్చినచో, వాని జీవితకాలము గలదు. సందేహము లేదు (13). అవయవములు పెద్దవి అగుచున్నదో, లేదా కొండ నాలుక ఎండిపోయినచో, అట్టి వాడు కేవలము నెల రోజులు మాత్రమే జీవించును. ఈ విషయములో సందేహము లేదు (14). కఫవాతపిత్తములలో దోషము ఏర్పడి ముక్కు నీరు గారుచున్నచో, అట్టి వ్యక్తి పదిహేను రోజులు మాత్రమే జీవించును. ముఖము మరియు కంఠము ఎండి పోయినచో, అట్టివాడు ఆరు మాసముల తరువాత మరణించును (15).

స్థూలజిహ్వా భ##వేద్యస్య ద్విజాః క్లిద్యంతి భామిని | షణ్మాసాజ్జాయతే మృత్యుశ్చిహ్నైసై#్తరుపలక్షయేత్‌ || 16

అంబుతైలఘృతస్థం తు దర్పణ వరవర్ణిని | న పశ్యతి యదాత్మానం వికృతం పలమేవ చ || 17

షణ్మాసాయుస్స విజ్ఞేయః కాలచక్రం విజానతా | అన్యచ్చ శృణు దేవేశి యేన మృత్యుర్విబుధ్యతే || 18

శిరోహీనాం యదా ఛాయాం స్వకీయాముపలక్షయేత్‌ | అథవా ఛాయయా హీనం మాసమేకం న జీవతి || 19

ఆంగికాని మయోక్తాని మృత్యుచిహ్నాని పార్వతి | బాహ్యస్థాని బ్రువే భ##ద్రే చిహ్నాని శృణు సాంప్రతమ్‌ || 20

రశ్మిహీనం యదా దేవి భ##వేత్సోమార్కంమండలమ్‌ | దృశ్యతే పాటలాకారం మాసాస్ధేన విపద్యతే || 21

అరుంధతీం మహాయానమిందుం లక్షణవర్జితమ్‌ | అదృష్టతారకో యో%సౌ మాసమేకం న జీవతి || 22

దృష్టే గ్రహే చ దిఙ్మోహః షణ్మాసాజ్జాయతే ధ్రువమ్‌ | ఉతథ్యం న ధ్రువం పశ్యేద్యది వా రవిమండలమ్‌ || 23

రాత్రౌ ధనుర్యదా పశ్యేన్మధ్యాహ్నే చోల్కపాతనమ్‌ | వేష్ట్యతే గృధ్రకాకైశ్చ షణ్మాసాయుర్న సంశయః || 24

ఋషయస్స్వర్గపంథాశ్చ దృశ్యంతే నైవ చాంబరే | షణ్మాసాయుర్విజానీయాత్పురుషైః కాలవేదిభిః || 25

ఓ సుందరీ! ఎవని నాలుక మొద్దు బారునో, పళ్లు నీరు గారుచుండునో, అట్టి వానికి ఆరు మాసములలో మరణము కలుగునని ఆ చిహ్నములను బట్టి గుర్తించవలెను (16). ఓ సుందరీ! ఎవడైతే నీరు, నూనె, నేయి మరియు అద్దము అను వాటిలో తన ప్రతిబింబమును చూడడో, లేదా పాలిపోయినట్లు వికృతమగు ప్రతిబింబమును చూచునో, వానికి ఆరు మాసముల ఆయుర్దాయము గలదని కాలచక్రజ్ఞానము గల పండితుడు తెలుసుకొనును. ఓ దేవదేవీ! మృత్యువును గుర్తు పట్టే మరియొక లక్షణమును కూడ వినుము (17, 18). ఎవనికి తన నీడ తల లేనిదిగా కానవచ్చునో, లేదా నీడయే కానరాదో, అట్టి వాడు ఒక మాసమైననూ జీవించడు (19). ఓ పార్వతీ! దేహవయమవములయందు కానవచ్చే మృత్యుచిహ్నములను ఇంతవరకు చెప్పితిని. ఓ మంగళస్వరూపురాలా! ఇప్పుడు బాహ్యమునందు కానవచ్చే గుర్తులను చెప్పుచున్నాను. వినుము (20). ఓ దేవీ! ఎవనికైతే సూర్యచంద్రమండలములు ప్రకాశహీనములుగా ఎర్రని ఆకారములో కానవచ్చునో, అట్టివాడు పదిహేను రోజులలో మరణించును (21). ఎవడైతే అరుంధతీ నక్షత్రమును మహాయానమును కనజాలడో, లేదా చంద్రుని యందలి మచ్చను కనజాలడో, లేదా నక్షత్రములను చూడలేడో, అట్టివాడు నెల రోజులు మాత్రమే జీవించును (22). గ్రహమును చూచిననూ ఎవనికి దిక్కులు తోచవో, ఎవడైతే ఉతథ్యధ్రువనక్షత్రములను మరియు సూర్యమండలమును చూడజాలడో, అట్టివాడు నిశ్చయముగా ఆరు మాసములలో మరణించును (23). ఎవడైతే రాత్రియందు ఇంద్రధనస్సును చూచునో, మధ్యాహ్నము ఉల్క పడుటను గాంచునో, ఎవడైతే గద్దలు మరియు కాకుల చేత చుట్టువారబడునో, అట్టివానికి ఆరు మాసములు మాత్రమే ఆయుర్దాయము గలదనుటలో సందేహము లేదు (24). ఎవడైతే ఆకాశములో సప్తర్షిమండలమును మరియు పాలపుంతను గనజాలడో, అట్టివానికి ఆరు మాసముల ఆయుర్దాయము గలదని కాలవేత్తలగు పెద్దలు చెప్పెదరు (25).

అకస్మాద్రాహుణా గ్రస్తం సూర్యం వా సోమమేవ చ | దిక్చక్రం భ్రాంతవత్పశ్యేత్‌ షణ్మాసాన్మ్రియతే స్ఫుటమ్‌ || 26

నీలాభిర్మక్షికాభిశ్చ హ్యకస్మాద్వేష్ట్యతే పుమాన్‌ | మాసమేకం హి తస్యాయుర్‌ జ్ఞాతవ్యం పరమార్థతః || 27

గృధ్రః కాకః కపోతశ్చ శిరశ్చాక్రమ్య తిష్ఠతి | శీఘ్రం తు మ్రియతే జంతుర్మాసైకేన న సంశయః || 28

ఏవం చారిష్టభేదస్తు బాహ్యస్థస్సముదాహృతః | మానుషాణాం హితార్థాయ సంక్షేపేణ వదామ్యహమ్‌ || 29

హస్తయోరుభయోద్దేవి యథా కాలం విజానతే | వామదక్షిణయోర్మధ్యే ప్రత్యక్షం చేత్యుదాహృతమ్‌ || 30

ఏవం పక్షౌ స్థితౌ ద్వౌ తు సమాసాత్సురసుందరి | శుచిర్భూత్వా స్మరన్‌ దేవం సుస్నాతస్సంయతేంద్రియః || 31

హస్తౌ ప్రక్షాల్య దుగ్ధేనాలక్తకేన విమర్దయేత్‌ | గంధైః పుషై#్పః కరౌ కృత్వా మృగయేచ్చ శుభాశుభమ్‌ || 32

కనిష్ఠమాదితః కృత్వా యావదంగుష్ఠకం ప్రియే | పర్వత్రయక్రమేణౖవ హస్తయోరుభయోరిపి || 33

ప్రతిపదాదివిన్యస్య తిథిం ప్రతిపదాదితః | సంపుటాకారహస్తౌ తు పూర్వదిఙ్ముఖసంస్థితః || 34

స్మరేన్నవాత్మకం మంత్రం యావదష్టోత్తరం శతమ్‌ | నిరీక్షయేత్తతో హస్తౌ ప్రతిపర్వణి యత్నతః || 35

ఎవడైతే హఠాత్తుగా సూర్యచంద్రులను రాహువు మ్రింగినట్లు గనునో, దిక్కులన్నియు గిరగిర తిరుగుచున్నట్లు గనునో, అట్టివాడు నిశ్చయముగా ఆరు మాసములలో మరణించును (26). ఎవడైతే హఠాత్తుగా నల్లని తేనెటీగలచే చుట్టివేయబడునో, అట్టివానికి ఖచ్చితముగా నెల రోజులు మాత్రమే ఆయుర్దాయము గలదని తెలియవలెను (27). ఎవని శిరస్సుపై గ్రద్ద గాని, కాకి కాని, పావురము గాని తలను ఆక్రమించి వ్రాలి నిలిచియుండునో, అట్టివాడు తొందరలోనే అనగా నెల రోజులలో మరణించుట నిశ్చయము (28). ఈ విధముగా బాహ్యప్రకృతిలోని అపశకునములను గురించి చెప్పియుంటిని. మానవుల హితమును గోరి నేను సంక్షేపముగా మరియొక విషయమును చెప్పుచున్నాను (29). ఓ దేవీ! ఎడమ, కుడి అనే రెండు చేతుల మధ్యలో కాలమును ప్రత్యక్షముగా తెలుసుకొనే విధానము వర్ణించబడినది (30). ఓ సుందరి యగు దేవతామూర్తీ! ఈ విషయములో రెండు పక్షములు గలవు. వాటిని సంగ్రహముగా చెప్పెదను. వ్యక్తి చక్కగా స్నానమును చేసి శుచియై ఇంద్రియములను అదుపులో నుంచుకొని పరమేశ్వరుని స్మరించుచూ (31). చేతులను పాలలో కడిగి వాటికి లత్తుక రంగును మర్దించి, చేతులను గంధములతో మరియు పుష్పములతో ఆరాధించి వాటి ద్వారా శుభాశుభములను తెలుసుకొనే ప్రయత్నమును చేయవలెను (32). ఓ ప్రియురాలా! చిటికెన వ్రేలితో మొదలిడి బొటన వ్రేలి వరకు రెండు చేతులతో ఒక్కొక్క వ్రేలికి మూడు పర్వల చొప్పున క్రమముగా (33). పాడ్యమితో మొదలిడి తిథులను అన్నింటినీ న్యాసము చేయవలెను. తూర్పు దిక్కునకు అభిముఖముగా కూర్చుండి చేతులను సంపుట (దొన్నె) ఆకారములో ఉంచవలెను (34). తరువాత నవాత్మకమంత్రమును నూట యెనిమిది సార్లు జపించి, తరువాత చేతులను ప్రతి పర్వయందు జాగరూకతతో పరిశీలించవలెను (35).

తస్మిన్‌ పర్వణి సా రేఖా దృశ్యతే భృంగసన్నిభా | తత్తిథౌ హి మృతిర్‌ జ్ఞేయా కృష్ణే శుక్లే తథా ప్రియే || 36

అధునా నాదజం వక్ష్యే సంక్షేపాత్కాలలక్షణమ్‌ | గమాగమం విదిత్వా తు కర్మ కుర్యాచ్ఛృణు ప్రియే || 37

ఆత్మవిజ్ఞానం సుశ్రోణి చారం జ్ఞాత్వా తు యత్నతః | క్షణం త్రుటిర్లవం చైవ నిమేషం కాష్ఠకాలికమ్‌ || 38

ముహూర్తకం త్వహో రాత్రం పక్షమాసర్తువత్సరమ్‌ | అబ్దం యుగం తథా కల్పం మహాకల్పం తథైవ చ || 39

ఏవం స హరతే కాలః పరిపాట్యా సదాశివః | వామదక్షిణమధ్యే తు పథి త్రయమిదం స్మృతమ్‌ || 40

దినాని పంచ చారభ్య పంచవింశద్దినావధి | వామాచారగతౌ నాదః ప్రమాణం కథితం తవ || 41

భూతరం ధ్రదిశ##శ్చైవ ధ్వజశ్చ వరవర్ణిని | వామచారగతౌ నాదః ప్రమాణం కాలవేదినః || 42

ఋతోర్వికారభూతాశ్చ గుణాస్తత్రైవ భామిని | ప్రమాణం దక్షిణం ప్రోక్తం జ్ఞాతవ్యం ప్రాణవేదిభిః || 43

భూతసంఖ్యా యదా ప్రాణాన్‌ వహంతే చ ఇడాదయః | వర్షస్యాభ్యంతరే తస్య జీవితం హి న సంశయః || 44

దశఘస్రప్రవాహేణ హ్యబ్దమానం స జీవతి | పంచదశప్రవాహేణ హ్యబ్దమేకం గతాయుషమ్‌ || 45

ఓ ప్రియురాలా! ఏ పర్వయందు తుమ్మెద వంటి రేఖ కానవచ్చునో, దానికి సంబంధించిన పక్షము (శుక్ల/ కృష్ణ) లో ఆ తిథినాడు మరణము సంభవించునని తెలియవలెను (36). ఓ ప్రియురాలా! ఇప్పుడు శబ్దమును బట్టి కాలమును గురించి తెలుసుకునే ప్రక్రియను సంక్షేపముగా చెప్పెదను. వినుము. మానవుడు ప్రాణముయొక్క రాకను, పోకను తెలుసుకొని కర్మను చేయవలెను (37). ఓ సుందరీ! మానవుడు గ్రహచారమును ప్రయత్నపూర్వకముగా తెలుసుకొని ఆత్మజ్ఞానమును సంపాదించవలెను (లేదా తన భవిష్యత్తును తెలుసుకొనవలెను). క్షణము, త్రుటి, లవము, నిమేషము, కాష్ఠము (38). ముహూర్తము, పగలు-రాత్రి, పక్షము, మాసము, ఋతువు, సంవత్సరము, యుగము, కల్పము, మహాకల్పము అను విధముగా కాలము విభజింపబడి యున్నది (39). సదాశివుడు ఈ విధముగా కాలస్వరూపుడై ఒక క్రమములో ఆయుర్దాయమును హరించుచుండును. కాలగణనములో ఎడమ, కుడి, మధ్య అనే ఈమూడు మార్గములను మహర్షులు చెప్పుచున్నారు (40). ఎడమ చేతితో చేసే కాలగణనమునందు అయిదుతో మొదలిడి ఇరువది అయిదు రోజుల వరకు శబ్దము ప్రమాణమని నేను నీకు చెప్పియుంటిని (41). ఓ సుందరీ! ఎడమ చేతితో చేసే కాలగణనమునందు కాలవేత్తల మానము అయిదు, తొమ్మిది, పది అగుచున్నది. మరియు వారు చిహ్నమును, నాదమును కూడ పరిగణించెదరు (42). ఓ సుందరీ! ప్రాణగతిని తెలుసుకున్న విద్వాంసులు కుడి చేతి గణనములో ఆరు, అయిదు, మూడు అను సంఖ్యలను శబ్దమానముగా స్వీకరించెదరని తెలియవలెను (43). ఇడా మొదలగు నాడులు అయిదు రోజుల వరకు ప్రాణశక్తిని తమలో ప్రవహింప జేసినచో, అట్టి వాని జీవితము నిస్సంశయముగా సంవత్సరము లోపులో అంతమగును (44). ఈ ప్రవాహము పది రోజులు ఉన్నచో అట్టివాడు సంవత్సరకాలము జీవించును. ఈ ప్రవాహము పదిహేను రోజులు ఉన్నచో, అట్టివాడు సంవత్సరము తరువాత మరణించును (?) (45)

వింశద్దినప్రవాహేణ షణ్మాసం లక్షయేత్తదా | పంచవింశద్దినమితం వహతే వామనాడికా || 46

జీవితం తు తదా తస్య త్రిమాసం హి గతాయుషః | షడ్వింశద్దినమానేన మాసద్వయముదాహృతమ్‌ || 47

సప్తవింశద్దినమితం వహతేత్యతివిశ్రమా | మాసమేకం సమాఖ్యాతం జీవితం వామగోచరే || 48

ఏతత్ర్పమాణం విజ్ఞేయం వామవాయుప్రమాణతః | సవ్యేతరే దినాన్యేవ చత్వారశ్చానుపూర్వశః || 49

చతుఃస్థానే స్థితా దేవి షోడశైతాః ప్రకీర్తితాః | తేషాం ప్రమాణం వక్ష్యామి సాంప్రతం హి యథార్థతః || 50

షడ్‌ దినాన్యాదితః కృత్వా సంఖ్యాయాశ్చ యథావిధి | ఏతదంతర్గతే చైవ వామరంధ్రే ప్రకాశితమ్‌ || 51

షడ్‌ దినాని యదా రూఢం ద్వివర్షం చ స జీవతి | మాసానష్టౌ విజానీయాద్దినాన్యష్ట చ తాని తు || 52

ప్రాణస్సప్తదశే చైవ విద్ధి వర్షం న సంశయః | సప్తమాసాన్విజానీయాద్దినైః షడ్భిర్న సంశయః || 53

అష్టఘస్రప్రభేదేన ద్వివర్షం హి స జీవతి| చతుర్మాసా హి విజ్ఞేయాశ్చతుర్వింశద్దినావధిః || 54

యదా నవదినం ప్రాణా వహంత్యేవ త్రిమాసకమ్‌ | మాసద్వయం చ ద్వే మాసే దినా ద్వాదశ కీర్తితా || 55

ప్రాణప్రవాహము ఇరువది రోజులు ఉన్నచో, వాని ఆయుర్దాయము ఆరు మాసములని తెలియవలెను. ఎడమ నాడిలో ప్రవాహము ఇరువదిరోజులు ఉన్నచో, ఆతడు మూడు మాసములలో మరణించును. ఇరువది ఆరు రోజులు ఉన్నచో, ఆయుర్దాయము రెండు మాసములని చెప్పబడినది (46, 47). ప్రాణము చాల మెల్లగా ఇరువది ఏడు రోజులు ప్రవహించినచో, వాని ఆయుర్దాయము ఒకనెల యని తెలియవలెను. ఈ మానము ఎడమ చేతికి సంబంధించినదనియు, ఎడమ నాడియందలి ప్రాణప్రవాహమును ఆధారముగా చేసుకొని చెప్పబడినదనియు తెలియవలెను. కుడివైపు ఇదే స్థితి ఉన్నచో, వాని ఆయుర్దాయము నాలుగు రోజులు మాత్రమే. ఓ దేవీ! నాలుగు స్థానములలో యథాక్రమముగా నుండే ఈ పదునారు మానములను నేను వర్ణించి చెప్పితిని. ఇప్పుడు వాటి ప్రమాణమును యథాతథముగా చెప్పగలను (48-50). ఆరు దినములు అనే సంఖ్యలో మొదలిడి యథావిధిగా లెక్కించినచో ఎడమ చేతి ప్రక్రియలో చెప్పనట్లుగనే సరిపడును (?) (51). ప్రాణప్రవాహము ఆరు దినములు స్థిరముగా నున్నచో, ఆ వ్యక్తి రెండు సంవత్సరముల ఎనిమిది మాసముల ఎనిమిది రోజులు జీవించును (52). పదిహేడు రోజులు ప్రాణప్రవాహము ఉన్నచో ఆయుర్దాయము ఒక సంవత్సరము ఏడు మాసములు ఆరు రోజులు అని తెలియవలెను. దీనిలో సంశయము లేదు (53). ఎనిమిది దినములు ఆ ప్రవాహము ఉన్నచో, రెండు సంవత్సరముల నాలుగు మాసముల ఇరువది నాలుగు రోజుల ఆయుర్దాయము ఉండునని తెలియవలెను (54). తొమ్మిది దినములు ప్రాణప్రవాహము ఉన్నచో, ఏడు మాసములు పన్నెండు రోజులు ఆ వ్యక్తి జీవించునని చెప్పబడినది (55).

గమనిక : ఈ ప్రసంగము చాల నిగూఢముగా గాని, ఆసందర్భముగా గాని ఉన్నది. ఇది గాక అనేకలేఖకదోషముల సంక్రమించుటచే కొన్ని శ్లోకములు దురూహ్యములుగా నున్నవి.

పూర్వవత్కథితా యే తు కాలం తేషాం తు పూర్వకమ్‌ | అవాంతరదినా యే తు తేన మాసేన కథ్యతే || (?) 56

ఏకాదశప్రవాహేణ వర్షమేకం స జీవతి | మాసా నవ తథా ప్రోక్తా దినాన్యష్టమితాన్యపి || 57

ద్వాదశేన ప్రవాహేణ వర్షమేకం స జీవతి | మాసాన్‌ సప్త విజానీయాత్‌ షడ్ఘస్రాంశ్చాప్యుదాహరేత్‌ ||58

నాడీ యదా చ వహతి త్రయోదశదినావధి | సంవత్సరం భ##వేత్తస్య చతుర్మాసాః ప్రకీర్తితాః || 59

చతుర్వింశద్దినం శేషం జీవితం చ న సంశయః | ప్రాణవాహా యదా వామే చతుర్దశదినాని తు || 60

సంవత్సరం భ##వేత్తస్య మాసాః షట్‌ చ ప్రకీర్తితాః | చతుర్వింశద్దినాన్యేవ జీవితం చ న సంశయః || 61

పంచదశప్రవాహేణ నవ మాసాన్‌ స జీవితి | చతుర్వింశద్దినాధిక్యం కథితం కాలవేదిభిః || 62

షోడశాహప్రవాహేణ దశమాసాన్‌ స జీవతి | చతుర్వింశద్దినాధిక్యం కథితం కాలవేదిభిః || 63

సప్తదశప్రవాహేణ నవమాసైర్గతాయుషమ్‌ | అష్టాదశదినాన్యత్ర కథితం సాధకేశ్వరి || 64

వామచారం యదా దేవి హ్యష్టాదశదినావధిః | జీవితం చాష్టమాసం తు ఘస్రా ద్వాదశ కీర్తితాః || 65

ప్రాణప్రవాహము పదకొండు రోజులు ఉన్నచో, ఆ వ్యక్తి ఒక సంవత్సరము తొమ్మిది మాసములు ఎనిమిది దినములు బ్రతుకును (57). ప్రవాహము పన్నెండు రోజులు ఉన్నచో, ఆ వ్యక్తి ఒక సంవత్సరము ఏడు మాసముల ఆరు రోజులు జీవించునని చెప్పబడినది (58). నాడీప్రవాహము పదమూడు రోజులవరకు ఉన్నచో, ఆ వ్యక్తికి సంవత్సరము నాలుగు మాసములు ఇరువది నాలుగు రోజుల ఆయుర్దాయము మిగిలి యున్నదనుటలో సందేహము లేదు. ఎడమభాగమునందు ప్రాణము పదునాలుగు రోజులు ప్రవహించినచో, ఆతనికి సంవత్సరము ఆరు మాసముల ఇరువది నాలుగో రోజుల ఆయుర్దాయము ఉండుననుటలో సందేహము లేదు (59-61). ప్రాణప్రవాహము పదునైదు రోజులు ఉన్నచో, ఆ వ్యక్తి తొమ్మిది మాసముల ఇరువది నాలుగు రోజులు జీవించునని కాలవేత్తలు చెప్పెదరు (62). పదునారు దినములు ప్రాణప్రవాహము ఉన్న వ్యక్తి పది మాసముల ఇరువది నాలుగు రోజులు జీవించునని కాలవేత్తలు చెప్పెదరు (63). భక్తులను కాపాడే ఓ పార్వతీ! పదిహేడు రోజులు ప్రాణప్రవాహము ఉన్న వ్యక్తి తొమ్మిది మాసములు పదునెనిమిది దినములు జీవించునని చెప్పబడినది (64). ఓ దేవీ! ఎడమ భాగమునందు ప్రవాహము పదునెనిమిది దినములు ఉన్నచో, వాని జీవితము ఎనిమిది మాసములు పన్నెండు రోజులని చెప్పబడినది (65).

చతుర్వింశద్దినాన్యత్ర నిశ్చయేనావధారయ | ప్రాణవాహో యదా దేవి త్రయోవింశద్దినావధిః || 66

చత్వారః కథితా మాసాః షడ్‌ దినాని తథోత్తరే | చతుర్వింశప్రవామేణ త్రీన్మాసాంశ్చ స జీవతి || 67

దినాన్యత్ర దశాష్టౌ చ సంహారంత్యేవ చారతః | అవాంతరదినే యస్తు సంక్షేపాత్తే ప్రకీర్తితః || 68

వామచారస్సమాఖ్యాతో దక్షిణం శృణు సాంప్రతమ్‌ | అష్టావింశప్రవాహేణ తిథిమానేన జీవతి || 69

ప్రవాహేణ దశాహేన తత్సంస్థేన విపద్యతే | త్రింశద్ఘస్రప్రవాహేణ పంచాహేన విపద్యతే || 70

ఏకత్రింశద్యదా దేవి వహతే చ నిరంతరమ్‌ | దినత్రయం తదా తస్య జీవితం హి న సంశయః || 71

ద్వాత్రింశత్ర్పాణసంఖ్యా చ యదా హి వహతే రవిః | తదా తు జీవితం తస్య ద్విదినం హి న సంశయః || 72

దక్షిణః కథితః ప్రాణో మధ్యస్థం కథయామి తే | ఏకభాగగతో వాయుప్రవాహో ముఖమండలే || 73

ధావమానప్రవాహేణ దినమేకం స జీవతి | చక్రమేకతత్పరాసోర్హి పురావిద్భిరుదాహృతమ్‌ || 74

ఏతత్తే కథితం దేవి కాలచక్రం గతాయుషః | లోకానాం చ హితార్థాయ కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి || 75

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం కాలజ్ఞానవర్ణనం నామ పంచవింశో%ధ్యాయః (25).

ఓ దేవీ! ప్రాణప్రవాహము ఇరువది మూడు రోజుల వరకు ఉన్నచో, ఆ వ్యక్తి నిశ్చయముగా నాలుగు మాసముల ఇరువది తొమ్మిది దినములు జీవించునని తెలుసుకొనుము. ప్రవాహము ఇరువది నాలుగు రోజులు ఉన్నచో, ఆ వ్యక్తి అవాంతరదినములు లెక్కను కూడ కలుపుకుని మూడు మాసముల పదునెనిమిది రోజులు జీవించును. నేను నీకు ఈ విధముగా ఎడమ చేతి కాలగణనమును చెప్పితిని. ఇప్పుడు కుడి చేతి గణనమును వినుము. ఇరువది ఎనిమిది దినముల ప్రవాహము ఉన్నచో, ఆతడు అన్ని రోజులు మాత్రమే జీవించును (66-69). ప్రవాహము పది దినములు ఉన్న వ్యక్తి వెనువెంటనే మరణించును. ముప్పది రోజుల ప్రవాహము ఉన్న వ్యక్తి అయిదు రోజులలో మరణించును (70). ఎవనిలో ప్రాణప్రవాహము నిరంతరముగా ముప్పది ఒక్క రోజుల వరకు ఉండునో, వాని జీవితము మూడు రోజులు మాత్రమే మిగిలి యున్నది. దీనిలో సందేహము లేదు (71). ఎవని సూర్యనాడిలో ప్రాణప్రవాహసంఖ్య ముప్పది రెండు ఉండునో, అట్టి వ్యక్తి రెండు రోజులు మాత్రమే జీవించును. దీనిలో సందేహము లేదు (72). కుడి భాగమునందలి ప్రాణప్రవాహము గురించి నీకు ఇంతవరకు చెప్పియుంటిని. ఇప్పుడు మధ్యభాగమునందలి ప్రాణప్రవాహమును గురించి చెప్పెదను. ఎవని ముఖమండలమునందు ప్రాణము ఒక భాగమునందు మాత్రమే పరుగు వేగముతో ప్రవహించునో, అట్టి వ్యక్తి ఒక రోజు మాత్రమే జీవించును. ఆ వ్యక్తి మరణించుచున్నాడని పురాతనులగు కాలవేత్తలు చెప్పిరి (73,74). ఓ దేవీ! ఈ విధముగా మానవుల హితమును గోరి నీకు మరణమునకు ఉన్ముఖముగా నున్నవారి కాలచక్రమును గురించి చెప్పితిని. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (75)

శ్రీ శివమహాపురాణములో ఉమాసంహితయందు కాలజ్ఞానవర్ణనమనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది (25).

Siva Maha Puranam-3    Chapters