Sri Matsya Mahapuranam-1    Chapters   

చతుస్త్రింశదుత్తరశతతమో7ధ్యాయః.

దేవవినిర్జితమయస్య త్రిపురప్రవేశః.

సూతః : మయో మహారణం కృత్వా మాయావీ దానవేశ్వరః | వివేశ తూర్ణం త్రిపుర మభ్రో నీలమివామ్బరమ్‌. 1

స దీర్ఘముష్ణం నిఃశ్వస్య దానవాన్వీక్ష్య మధ్యగః | దధ్యౌ లోకక్షయే ప్రాప్తే తథా కాల ఇవాపరః. 2

ఇన్ద్రోపి కమ్పతే యస్య స్థితో యుద్ధే సురాగ్రతః | సచాపి నిధనం ప్రాప్తో విద్యున్మాలీ మహాయశాః. 3

దుర్గం తత్‌ త్రిపురం యస్య న సమం విద్యతే పరమ్‌ | తస్యా7 ప్యేషో లయః ప్రాప్తో న దుర్గం కారణం క్వచిత్‌. 4

కాలస్య వశగం సర్వం దుర్గం దుర్గాన్తరంచ యత్‌ | కాలే క్రుద్ధే కథం తస్మా త్ప్రాణాన్తోద్య భవిష్యతి. 5

లోకేషు త్రిషు యత్కించి ద్దీప్యతే నిర్భయాత్మకమ్‌ | కాలస్య తద్వశః పూర్వ మితి పైతామహో విధిః. 6

అస్మిన్కః ప్రభ##వేద్యోగా దసన్ధార్యే7మితాత్మని | లఙ్ఘనే కస్సరమర్థస్స్యా దృతే దేవా న్మహేశ్వరాత్‌. 7

నాస్థా మమేంద్రే న యమే వరుణ న చ విత్తపే | స్వామీ యఏష దేవానాం దుర్జయ స్సమరే క్వచిత్‌. 8

ఐశ్వర్యస్య ఫలంయత్ర ప్రభుత్వస్యచ యత్ఫలమ్‌ | తదహం దర్శయిష్యామి యావద్విధి మహం గతః. 9

వాపీ మమృతతోయేన పూర్ణాం స్రక్ష్యామి తామహమ్‌ | ఉపజీవన్తి యాం దైత్యా స్సఞీవన మివౌషధమ్‌. 10

నూట ముప్పది నాలుగవ అధ్యాయము.

మయుడు దేవతల చేతిలో ఓడి త్రిపుర దుర్గమున ప్రవేశించుట.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: మాయావియు దానవేశ్వరుడునగు మయుడు మహాయుద్ధము చేసిన అనంతరము మేఘము నీలాకాశమున ప్రవేశించినట్లు త్రిపురమున శీఘ్రముగా ప్రవేశించెను. అతడు దానవులనడుమ కూర్చుండి దీర్ఘముగ వేడి ఊర్పులు వదలుచు రెండవ ప్రళయకాల యముడువలె చింతింపసాగెను. సురల కగ్రగామి యగు ఇంద్రుడును యుద్ధమున ఎవని ఎదుట నిలువజాలక గడగడలాడుచుండెడివాడో అట్టి మహా యశశ్శాలియగు విద్యున్మాలియు మరణించెనుగదా! దేనికి సాటియగు మరియొక దుర్గము ఏదియు లేదో-అట్టిదానికి గూడ ఇదుగో! ఇపుడు నాశము ప్రాప్తించినట్లు కనబడుచున్నది; ఎక్కడను గెలుపు ఓటములకు దుర్గము హేతువుకాదు. దుర్గముకాని మరియేదికాని ప్రతియొకటియు కాలమునకు వశమయి నడుచుచుండును. అందువలన కాలుడు క్రుద్ధుడైనను కాలము రానపుడు ఇప్పుడే ప్రాణాంతము ఎట్లు జరుగును? 'మూడు లోకముల యందును ఇది నిర్భయమయినదని చెప్పదగినదేదేది కలదో-అది ఎల్ల మొట్టమొదలే కాలమునకు వశగమయి యుండెను.' అని బ్రహ్మ చెప్పిన వచనము. నంధారణము చేయుటకు సాద్యము కానిదియు అమిత స్వరూపము కలదియు అగు కాలము విషయమున మహేశ్వరుడు దేవుడునగు శివుడు ఒక్కడు తప్ప మరి ఎవ్వడు తన సాధనముల అమరికతో తన శక్తి చూపగలడు? ఇంద్రుడు యముడు వరుణుడు కుబేరుడు-ఈ ఎవ్వరిని నేను లెక్కపెట్టను. దేవతలకు ప్రభువగు ఈ పరమేశ్వరుడు మాత్రమే యుద్ధమున ఎక్కడను దుర్జయుడు. ఐశ్వర్యమునకు ఫలము ఏదో-ప్రభుత్వమునకు ఫలము ఏదో - దానిని నా విధానముననుసరించినంతలో నేను చూపెదను. దైత్యులకందరకును సంజీవనౌషధమువలె జీవనాధారమగు అమృత జలపూర్ణమగు వాపిని (దిగుడు బావిని) సృష్టింతును.

మయకృతమాయా7మృతవాపీనిర్మాణమ్‌.

ఇతి సఙ్చిన్త్య మనసా మయో మాయావినాం వరః | అస్రాక్షీ న్మాయయా వాపీం రమ్భామివ పితామహః.

ద్వియోజనాయతాం దీర్ఘాం పూర్ణయోజనవిస్తృతామ్‌ | మాధుర్యరసవీచీభి శ్చిత్రరూపాం కథామివ. 12

చన్ద్రనిర్యాసకల్పస్య పుష్టస్యామృతగన్ధినః | పూర్ణాం పరమతోయస్య గుణపూర్ణా మివాఙ్గనామ్‌. 13

ఉత్పలైః కుముదైః పద్మై ర్వృతాం కాదమ్భకై స్తథా| చన్ద్రభాస్కరసఙ్కాశై ర్భ్రమరాభరణౖ ర్యుతామ్‌.

హంసై ర్మధురవాచాలై శ్చారుచామీకరప్రభైః | కామేషుభి రివాకీర్ణాం దీప్యతే రమణీమివ. 15

సృష్ట్వా మయ స్స తాం వాపీం గఙ్గామివ మహేశ్వరః| అస్యాం ప్రక్షేపయామాస విద్యున్మాలిన మాదృతః.

స వాప్యాం మజ్జితో దైత్యో దేవశత్రు ర్మహాబలః | ఉత్తస్థా విన్ధనై రిద్ధ స్సంవర్ధిత ఇవానలః. 17

మయస్య చాఞ్జలిం కృత్వా తారకాక్షో7భివాదితః | విద్యున్మాలీతి వచనం మయమేవ మభాషత. 18

క్వ నన్దీ సహరుద్రేణ వృతః ప్రమథజమ్బుకైః | యుధ్యమానశ్చ నిష్పీడ్య మయా దేహేషు మోహితః. 19

ప్రసాదాదేవ రుద్రస్య భవామః ప్రభవిష్ణవః | తైర్వా వినిహతే యుద్ధే భవిష్యామో యమాసనమ్‌. 20

విద్యున్మాలివచస్త్వేవం నిశమ్యాత్యన్త మూర్జితమ్‌ | సమ్పరిష్వజ్య సార్ద్రాక్ష ఏవమాహ మహాసురః. 21

విద్యునాలి న్నమే రాజ్య మభిప్రేతం న జీవితమ్‌ | త్వయా వినా మహాబాహో త్వదర్థేన మహాసుర. 22

మయా7మృతమయీ వాపీ చైషా మాయాబలేనతు | సృష్ట్వా దానవదైత్యానాం హతానాం జీవవర్ధనీ. 23

దిష్ట్యా త్వాం దైత్య! పశ్యామి యమలోకా దిమాగతమ్‌ | నిర్గతం నిర్ధనస్యేహ భాగ్యాదివ మహానిధిమ్‌. 24

దృష్ట్వా దృష్ట్వా తు తాంవాపీం మాయయా తు వినిర్మితామ్‌ | హృష్టాస్తాం వీక్ష్య దైత్యేన్ద్రా ఇదం వచన మబ్రువ&. 25

మాయావులలో మొనగాడగు మయుడు తన మనస్సులో ఇట్లాలోచించి బ్రహ్మదేవుడు రంభను సృజించినట్లు తన మాయతో వాపిని సృష్టించెను. దాని పోడవు రెండు యోజనములు; వెడల్పు ఒక యోజనము; అది 'కథ'యను కావ్య విశేషమువలె మాధుర్య రసముతో నిండిన అలలతో నిండియుండెను; చందనపు బంకవలె నుండినదియు పుష్టి కలిగించునదియు అమృతమువలె రుచి కలుగుటతోపాటు కమ్మని వాసనలు వెదజల్లు ఉత్తమ జలముతో నిండి సద్గుణపూర్ణయగు యువతివలె కనబడుచుండెను. నల్లని తెల్లని కలువపూలతోను పద్మములతోను కాదంబములనెడు హంసలతోను చుట్టుకొనబడి చంద్ర సూర్యులతో క్రమ్మబడినట్లు ఆ వాపి కనబడుచుండెను. తుమ్మెదలనెడు ఆభరణములతో అలంకరించబడియుండెను. కమ్మని ధ్వనులు చేయుచు మనోహరమగు బంగారు కాంతులు గల హంసలతో కూడి అది మన్మథ బాణములతో వ్యాప్తయైన రమణివలె కనవచ్చుచుండెను. మహేశ్వరుడు గంగనువలె మయుడు ఆ వాపిని సృష్టించి విద్యాన్మాలిని ఆదరముతో దానిలో పడవేయించెను. దేవ శత్రువును మహాబలుడునగు ఆ విద్యున్మాలిని దాని యందు ముంచగానే కట్టెలతో చక్కగా వృద్ధి చేయబడి ప్రజ్వలించుచు ప్రకాశించు అగ్నివలె అతడు ప్రకాశించుచు లేచి నిలువబడెను. మయుని నమస్కరించెను. తారకాక్షుడు విద్యున్మాలికి నమస్కరించెను. అంతట విద్యున్మాలి మయునితో ఇట్లు పలికెను: ప్రమథులు అనెడు జంబుకములు తను కొలుచుచుండగా రుద్రుని వెంటనుండు నంది ఎక్కడ? నేను బాణములతో అతని దేహమును పీడించి మోహపరచితిని. మనము ఇప్పుడయినను రుద్రుని అనుగ్రహమువలననే సమర్థులము అయ్యెదము. అప్పుడు శత్రువులను గెలిచెదము. లేక వారే మనలను చంపిరా-యమునకు ఆసనముగా అయ్యెదము. ఇట్లు పలికిన విద్యున్మాలి మాటలు విని మహాసురుడును మిగుల బలశాలియునగు మయుడు ఇట్లు పలికెను: విద్యున్మాలీ! మహాబాహూ! నాకు ఈ రాజ్యముకూడ ఇష్టముకాదు. మహాసురా! నీకొరకే నేను మరణించిన దైత్యులకును దానవులకును జీవన వర్ధనము కలిగించు ఈ అమృతమయియగు వాపిని నా మాయాబలముతో సృష్టించితిని. దైత్యుడా! నేను అదృష్టవంతుడను గనుక తనంతట తాను వెలికివచ్చి నిర్ధనునకు కనబడిన మహానిధివలె నాకు నీవు కనబడుచున్నావు. మయుడు తన మాయతో నిర్మించిన ఆ మాయామయమగు అమృతవాపిని చూచి చూచి దైత్యపుంగవులు హర్షము చెంది ఇట్లు పలుకనారంభించిరి:

దానవా యుధ్యతేదానీం ప్రమథై స్సహ నిర్భయాః | మయేన నిర్మితా వాపీ హతా న్త్సఞ్జీవయిష్యతి. 26

తతః క్షుబ్ధామ్బుధిరివ భేరీ సాతు భయంకరీ | వాద్యమానా రవైరుచ్చై రౌరవీతి పునఃపునః. 27

శ్రుత్వా భేరీరవం ఘోరం మేఘసన్నాదసన్నిభమ్‌ | నిష్పతన్తి సురాస్తూర్ణం త్రిపురా యుద్ధలాలసాః. 28

లోహరాజతసౌవర్ణైః కటకై ర్మణిభూషితైః | ఆముక్తా మణ్డలై ర్హారై ర్మకుటైరపి చోత్కటైః. 29

ధూమాయన్తే హ్యవిరతం లలన్తఇవ పావకాః | ఆయుధాని సమాదాయ కోటిశో దృఢవిక్రమాః. 30

నృత్యమానా ఇవ నటా గర్జన్తఇవ తోయదాః | కరోచ్ఛ్రితా ఇవ గజా స్సింహా ఇవచ నిర్దయాః. 31

హ్రదాఇవచ గమ్భీరా స్సూర్యా ఇవచ తాపినః | యమాఇవచ దైత్యేన్ద్రా స్త్వరయన్తో బలంమహత్‌. 32

ప్రమథాహ్యపి సోత్సాహా గరుడోత్పాతపాతినః | యుయుత్సవో విధావన్తి దానవా& దానవారయః. 33

నన్దీశ్వరేణ ప్రమథా స్తారకాక్షేణ దానవాః | చక్రు స్సదైత్యా స్సఙ్గ్రామం చోద్యమానా బలేన తే. 34

తోమరై శ్చన్ద్రసఙ్కాశై శ్శూలై శ్చానలసన్నిభైః | బాణౖశ్చ దృఢనిర్ముక్తై రభిజఘ్నుః పరస్పరమ్‌. 35

శరాణాం సృజ్యమానానా మసీనాం చ నిపాత్యతామ్‌ | రూపాణ్యాస న్మహోల్కానాం పతన్తీనా మివామ్బరాత్‌. 36

శక్తిభిర్భిన్నహృదయా నిర్దయాహతపాతితాః | నిరయేష్వివ నిర్మగ్నాః కూజన్తే ప్రమథా స్సురాః. 37

హేమకుణ్డలజుష్టాని కిరీటమకుటానిచ | శిరాంసి వ్యాపతన్తిస్మ గిరికూటనిభానిచ. 38

దానవులారా! ఇపుడు నిర్భయులై ప్రమథులతో తలపడి యుద్ధము చేయుడు. యుద్దమున రాక్షసులు మరణించినను వారిని మయుడు నిర్మించిన 'వాపి' బ్రతికించగలదు. అని దైత్యులు పరస్పరము అన నారంభించిరి. అంతట దానవులు మ్రోగించు భయంకర భేరి క్షోభిల్లు సముద్రమువలె మాటిమాటికి బిగ్గరగా మ్రోగనారంభించెను. మేఘ ధ్వనులబోలు భేరీనాదమును విని యుద్ధము చేయు కుతూహలముతో త్రిపుర దానవులు పరుమునుండియు-దేవతలు తమతమ సేనాని వేశములనుండియు బయటకు వచ్చిరి. త్రైపురదానవులు ఇనుముతోను వెండితోను బంగారుతోను చేసి మణులతో అలంకరించబడిన గుండ్రని హారములును ఉత్కటములగు మకుటములును ధరించియుండిరి. దృఢ విక్రములగు ఆదానవులు కోట్లకొలదిగా అయుధములు ధరించి ఎడతెగక జ్వలించుచు నాలుకలు కోయు అగ్నులవలె పొగలు గ్రక్కుచుండిరి. వారు నృత్యము చేయు నటుల వలెను గర్జించు మేఘములవలెను తొండము పైకెత్తిన ఏనుగుల వలెను నిర్దయములగు సింహములవలెను కనబడుచుండిరి. గంభీరములగు హ్రదములవలెను అధికముగ తపించు సూర్యులవలెను యములవలెను దైత్యేంద్రులు తమ దైత్య మహాసేనను త్వరపెట్టుచుండిరి.

ప్రమథులును ఉత్సాహవంతులయి గరుడుడు ఎగిరిపడునట్లు ఎగిరిపడు పాదములతో తాము దానవులకు శత్రువులు కావున దానవులతో యుద్ధము చేయగోరి దానవుల మీదకు పరుగెత్తుచుండిరి. నందీశ్వరునితో కూడి ప్రమథులును తారకాక్షునితో కూడి దానవులును దైత్యులును తమతమ బలముల ప్రేరణతో సంగ్రామము చేయనారంభించిరి. చంద్రులవంటి తోమరములతోను అగ్నులవంటి శూలములతోను దృఢముగా విడువబడిన శరములతోను వారు పరస్పరము కొట్టుకొనసాగిరి. ప్రయోగించబడు శరములును విసరిపడవేయబడు ఖడ్గములును అంతరిక్షమునుండి రాలిపడు ఉల్కలవలె కానవచ్చుచుండెను. శక్తుల దెబ్బలతో హృదయములు చీలగా నిర్దయముగా తగిలి దెబ్బలతో పడిపోవుచున్న ప్రమథులును దేవతలును నరక కూపములలో మునిగిపోవుచున్న వారువలె కనబడుచుండిరి. బంగారు కుండలములు అలంకారములుగా గలిగి కిరీటములును మకుటములును ధరించియున్న ప్రమథుల-దేవతల-శిరస్సులు పర్వతశృంగముల వలె అంతరిక్షమునుండి క్రింద పడుచుండెను.

శిలీముఖైః పట్టసైశ్చ ఖడ్గైః పరశుభిస్తథా | ఛిన్నాః కరికరాకారా భుజాఃపేతు ర్ధరాతలే. 39

గర్జన్తి సహసమ్మృష్టాః ప్రమథా భీమతర్జనాః | సాధయన్తి పరే సిద్ధా యుద్ధగాన్ధర్వమద్భుతమ్‌. 40

ప్రమథాభాసిబలవద్దానవాభాసిదర్పితః | ఇతి చోచ్చారయ న్వాచం చారణా రణభూగతాః. 41

పరిఘైరాహతాః కేచిద్దానవై శ్శఙ్కరానుగాః | వమన్తో రుధిరం వక్త్రై స్స్వర్ణధాతు మివాచలాః. 42

ప్రమథైరపి గీర్వాణౖ ర్దారితా స్సురశత్రవః | ద్రుమైశ్చ గిరిశృఙ్గైశ్చ బహవోపహతా రణ. 43

సూదితా& సూదితాన్‌ దైత్యా నన్యే దానవపుఙ్గవాః | ఉతిక్షప్య చిక్షిపు ర్వాప్యాం మయదానవచోదితాః. 44

తే చాపి భాస్వరైర్దేహై స్స్వర్గలోకా దివాగతాః | ఉత్తస్థు స్త్సూయమానాఖ్యా స్తద్రూపాభరణామ్బరాః. 45

అథైకే దానవాః ప్రాప్య వాపీ ప్రక్షేపణా దసూ& | ఆస్ఫోట్య సింహనాదైశ్చ కృత్వా7ధావం స్తథా7సురాన్‌.

దానవాః ప్రమథా నేతా న్ప్రసర్పథ కిమాస్యతే | హతానపిహి నోవాపీ పున స్సఞ్జీవయిష్యతి. 47

ఏవంశ్రుత్వా శఙ్కుకర్ణ స్తథా హ్యశనిసన్నిభః | సమాగత్యతు దేవేశ మిదం వచన మబ్రవీత్‌. 48

సూదితాస్సూదితా దేవ ప్రమథై రసురాహ్యమీ | ఉత్తిష్ఠన్తే పునర్భీమా స్సస్యాఇవ జలోక్షితాః. 49

అస్మిన్కిల పురేవాపీ *పూర్ణామృతరసాహ్వయా | నిహతా నిహతా యత్ర క్షిప్తా జీవన్తి దానవాః. 50

ఇతి వ్యజ్ఞాపయద్దేవం శఙ్కుకర్ణో మహేశ్వరమ్‌ | దానవానాం బలే మూర్ఛా కోపశ్ఛాసీ త్సుదారుణః. 51

తారకాక్షస్తు భీమాక్షస్తారకాక్ష ఇవామ్బుదః | అభ్యధావ త్సుసఙ్క్రుద్ధో మహాదేవరథం ప్రతి. 52

త్రిపురేషు తదోత్కృష్టభేరీశఙ్ఖరవో7భవత్‌ | దానవా నుద్ధతా& దృష్ట్వా దేవదేవరథం ప్రతి. 53

బాణములతో పట్టినములతో ఖడ్గములతో గండ్రగొడ్డండ్రతో నరుకబడిన ప్రమథుల భుజములు ఏనుగు తొండములవలె క్రింద పడుచుండెను. చక్కగా అలంకరించుకొని యుద్ధము చేయుచున్న ప్రమథులు కొందరు భయంకరముగా గర్జించుచుండిరి. ఇది అంతయు చూచుచు అంతరిక్షమున సిద్ధులు కొందరు అద్భుతమగు యుద్ధ సంగీతమును సాధనచేయుచు ఆనందించుచుండిరి. (ఈ యుద్ధమును వర్ణించుచు గేయములు రచించి పాడుచుండిరి.) రణభూమికి తిన్నగా అంతరిక్షమున నిలిచిన చారణులనెడు దేవ జాతులవారు 'ప్రమథుడా! నీవు దానవునికంటె బలవంతుడవుగా కానిపించుచున్నావు. దానవా! నీవే ప్రమథునికంటె దర్పితుడవుగా భాసించుచున్నావు.' అని ఇట్లు యుద్ధములో పైచేయిగా నున్నవారిని పొగడుచుండిరి.

ప్రమథులు కొందరు దానవుల పరిఘల దెబ్బలు తిని నోట నెత్తురు క్రక్కుచు స్వర్ణధాతువుల క్రక్కు కొండలవలె నుండిరి. ప్రమథులును దేవతలును చీల్చివీయగా వృక్షములతో పర్వత శిఖరములతో కొట్టగా దానవులు చచ్చుచుండిరి. అట్టివారిని మయుడు తన వారిచేత వాపియందు పడవేయించుచుండెను. వారు మరల బ్రదికి ప్రకాశించు దేహములతో స్వర్గమునుండి వచ్చు దేవతలవలె వచ్చుచుండిరి: వారి ఆభరణములును వస్త్రములును దేవతలకువలె నుండుటచే పొగడ్తలందుకొనుచుండిరి. అట్లు తిరిగి బ్రదికిన కొందరు దానవులు భుజములు చరచి సింహనాదము చేయగా భయపడి ప్రమథులును దేవతలును పారిపోవుచుండిరి. దానవులు కొందరు ప్రమథులను దేవతలను చూచి 'ఇంకను పారిపోక నిలిచెదరేల? మీరు మమ్ము చంపినను 'వాపి' మమ్ము మరల బ్రదికించును.' అనుచుండిరి. అది విని వజ్ర సమానుడగు శంకుకర్ణుడనునాతడు శివునికడకు పోయి ఇట్లనెను: దేవా! ఈ దానవులను మన ప్రమథులు చంపివేసినను నీటితో తడిపిన పైరులవలె లేచి భయంకరులై వచ్చుచున్నారు. ఈ త్రిపురదుర్గమునందు అమృత రసముతో నిండిన 'అమృతరసా' అను 'వాపి' (దిగుడు బావి) కలదట. చచ్చిన దానవులను దానియందు వేయగా వారంతరు మరల బ్రదికి వచ్చుచున్నారు.

___________________________________________

* పూర్ణా7మృతరసామ్భసా.

అంతలో దానవులు దారుణమగు కోపోద్రేకము చెందిరి. తారకాక్షుడు భయంకర నేత్రములతో తారకాక్షమను మేఘమువలె మహా క్రోధముతో మహాదేవుని రథము వైపునకు పరుగెత్తుకొని వచ్చెను. దేవదేవుని రథము వైపునకు దానవులుద్ధతులయి పోవుట తెలిసి త్రిపురదుర్గవాసులు అధిక భయంకరముగా భేరీ శంఖధ్వనులు చేసిరి.

తే తత్ర నిస్సృతా దేవా స్తారకాక్షేణ సంయుగే | జ్ఞాత్వా క్షోభ మగాద్రుద్ర స్స్వయమ్భూశ్చ పితామహః.

తాభ్యాం దేవవరిష్ఠాభ్యా మన్విత స్స రథోత్తమః | +అనాధవన్త మాసాద్య సీదతే గుణవానివ. 55

ధాతుక్షయా ద్దేహమివ గ్రీష్మే నద్యామివోదకమ్‌ | శైథిల్యం యాతి సరథ స్స్నేహో విప్రకృతో యథా.

శరాదేక బలాద్దేవ స్సీదన్తం సరథోత్తమమ్‌ | ఉజ్జహార మహాప్రాణ సై#్త్రలోక్యం రథరూపిణమ్‌. 57

శరాదపిచ నిష్ల్పుత్య పీతవాసా జనార్దనః | వృషరూపం మహాత్కృత్వా రథం జగ్రాహ దుర్ధరమ్‌. 58

విషాణాభ్యాంచ త్రైలోక్యం రథమేవ మహారథః | ప్రగృహ్యోద్వహతే విష్ణుః కులం కులమహాన్యథా. 59

తారకాక్షోపి దైత్యేన్ద్రో గిరీన్ద్రఇవ పక్షవా& | ·పరిఘేన స తా నశ్వా న్బ్రహ్మాణం హతవాంశ్చ సః. 60

స తారకాక్షాభిహతః ప్రతోదం న్యస్య కూబరే | విజజ్వాల ముహుర్బ్రహ్మా పునశ్శ్వాసం సముద్గిర&. 61

తత్ర దైత్యై ర్ముహు ర్నాదో దానవైశ్చాపి భైరవః | Oతతో వృషమయో విష్ణు స్తత్పురం ప్రవివేశహ. 62

వృషరూపివిష్ణుకృతమాయామృతవాపీపానమ్‌.

తత్రామృతరసాం వాపీం గత్వా జలజమన్దిరామ్‌ | శతపత్రవనాఢ్యాంచ కర్పూరక్షోదగన్ధినీమ్‌. 63

పపౌ సమ్మోహ్య దైత్యేన్ద్రా న్వృషరూపధరో హరిః | వాపీం పీత్వా సురేన్ద్రాణాం పీతవాసాజనార్దనః. 64

నర్దమానో మహాబాహుః ప్రవివేశ శరం తతః | తతోసురా భీమణౖ శ్శరార్దితాః ప్రహారసంవర్ధితశోణితాపగాః. 65

పరాఙ్ముఖా భీమగణౖః కృతా రణ యథా మృగాః కేసరిణా మహావనే | స తారకాక్ష స్తటిమాలిరేవచ మయేనసార్ధం ప్రమథై రభిద్రుతాః. 66

పురం పరావృత్య గతాశ్శరాతురా యథా శరీరం పవనాదయో గతాః | గణశ్వరా హ్యుత్కటగర్వశాలినో మహేన్ద్రనన్దీశ్వరషణ్ముఖా యుధి. 67

వినేదురుచ్చై ర్జహసుశ్చ దుర్మదా జయేమ చన్ద్రశ్చ దిగీశ్వరై స్సహ. 67u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురోపాఖ్యానే దేవదానవయోర్యుద్ధే

దేవగణపరాజితమయాదీనాం త్రిపురప్రవేశ కథనం నామ

చతుస్త్రింశదుత్తరశతతమోధ్యాయః.

ఆ సమయమున తారకాక్షునితో జరుగనున్న ఆయుద్ధమునకై దేవతలును వెలుపలికి వచ్చి రంగమున నిలిచిరి. ఇది తెలిసి రుద్రుడును స్వయంభూబ్రహ్మయు కలతచెందిరి. ఆ దేవశ్రేష్ఠులిద్దరు నారోహించియున్న ఆ

___________________________________________

+ అనాయతనమాసాద్య.

· అభ్యద్రవ త్తదాదేవం బ్రహ్మాణం ప్రభుమీశ్వరమ్‌.

O రథచరణకరోప్యవాప యుద్ధే వృషభవపు ర్వృషభేన్ధ్రపత్రపూతః | దితితనయబలం విమథ్య సర్వం త్రిపురపురం ప్రవివేశ కేశవః. సజలజలజరాజితాం సమస్తాం కుముదవరోత్పలఫుల్లపఙ్క జాఢ్యామ్‌ | సురగురు రపి తత్పపౌ జలాన్తా మఖిలమివార్ణవ (మగ్నిరివౌ) (మౌ)ర్వసమ్భవః||

రథోత్తమము అనాథుడు వచ్చి తన్నాశ్రయించగా వానినెట్లు రక్షింతునాయని దిగులుచెందు గుణవంతుడగు వీరుడువలెను ధాతు క్షయవ్యాధి గ్రస్తమయిన దేహమువలెను గ్రీష్మ నదీజలము వలెను తిరస్కరింపబడిన స్నేహమువలెను (తాను చూపిన స్నేహమును అవతలివారు తిరస్కరించినచోవలె) శిథిలము కాసాగెను. ఆరథము సామాన్యమయినదికాదు- త్రైలోక్యరూపమయినది. అట్టి శంకర రథమును (త్రైలోక్యమును) తాను శరీరమునందు ఉండియే మహా (ముఖ్య) ప్రాణతత్త్వరూపుడుగా ఆ బాణమునందున్న విష్ణువు పైకి లేవనెత్తెను. ఐనను అది నిలువబడుటలేదు. అందుచే పీతాంబరుడగు జనార్దనుడు వెంటనే శరమునుండియు ఎగిరి దుమికి మహావృషభ (ధర్మ) రూపమును ధరించి వచ్చి మరెవ్వరికి ధరించుటకు (పడకుండ నిలిపి పట్టుటకు) సాధ్యముకాని ఆ రథమును తన కొమ్ములతో ఎత్తి పట్టి నిలిపెను. అది కేవల రథముకాదు. త్రైలోక్యరూపము అయినది. దేవోత్తముడగు ఆ విష్ణువు దానినట్లు నిలిపి పట్టుట ఒక కులమందలి మహాపురుషుడు తన కులమును ఉన్నతికి తెచ్చుటవలె కనబడుచుండెను.

దైత్యేంద్రుడగు తారకాక్షుడు ఱక్కలుగల గిరివలె ఎగిరివచ్చి పరిఘతో అశ్వములను సారథిని చావమోదెను. బ్రహ్మయు తారకాక్షుని చేతిదెబ్బతిని ప్రతోదము (కశా-కొరడా)ను కూబరమున పడవేసి మాటిమాటికి శ్వాస వదలుచు ఉష్ణమును క్రక్కుచు కూలబడెను. అది చూచి దైత్య దానవులు మాటిమాటికిని భయంకరమగు నాదము చేయసాగిరి.

అంతట విష్ణువు పృషభరూపమున త్రిపురదుర్గమును ప్రవేశించెను. అచ్చట ఆదేవుడు 'అమృతరస'యను 'వాపి'ని చూచెను. దానియందు సాధారణ జాతి పద్మములును నూరు దళముల పద్మములు నుండెను. కర్పూరపు పొడివాసన దానినుండి వచ్చుచుండెను. వృషరూపధారియగు హరి దానవులను నమ్మోహపరచి వారికి తెలియకుండ ఆ వాపి (యందలి నీటిని)ని త్రాగివేసెను. పీతాంబరుడగు జనార్దనుడు అసురేంద్రుల ఆవాపిని త్రావి ఆ మహాబాహుడు గర్జన సేయుచు మరల శరమును ప్రవేశించెను. తరువాత అసురులను భయంకరులగు ప్రమథులు బాణపు దెబ్బలతో బాధించిరి. ఆ శరప్రహారములతో రక్తనదులు అధికమయ్యెను. ఇట్లు వారు సింహములు మృగములను తరిమినట్లు దానవులను రణమునుండి పరాజ్ముఖులనుగా చేసి తరిమిరి. తారకాక్షుడును విద్యున్మాలియు మయుడును పారిపోయిరి. శరీరమునుండి ప్రాణవాయువులు మొదలగు జీవాశ్రిత ధర్మములు వెడలిపోయినట్లు వారెల్లరును రణ రంగమునుండి త్రిపురదుర్గమునకు వెడలిపోయిరి.

మహేంద్ర నందీశ్వర షణ్ముఖులును చంద్రుడును దిక్పాలురును ప్రమథ గణాధిపతులును అత్యధిక గర్వశాలురై యుద్ధమున మనము జయించెదమను విశ్వాసముతో దుర్మదులయి గర్జించిరి; బిగ్గరగా నవ్విరి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయాదులు పరాజితులయి త్రిపురమున ప్రవేశించుటయను నూట ముప్పది నాలుగవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters