Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

lign="center">అథ పంచపంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః

పునర్వ్యవహారే దివ్యప్రమాణమ్‌

అగ్నిరువాచ :

తపస్వినో దానశీలాః కులీనాః సత్యవాదినః | ధర్మప్రధానా ఋజవః పుత్రవన్తో ధనాన్వితాః. 1

పంచయజ్ఞ క్రియాయుక్తాః సాక్షిణః పంచవాత్రయః | యథాజాతి యథావర్ణం సర్వేసర్వేషు వాస్మృతాః. 2

స్త్రీవృద్ధ బాలకితవమత్తోన్మత్తాభిశస్తకాః | రంగావతారి పాషండికూట కృద్వికలేన్ద్రియాః. 3

పతితాప్తాన్న సంబంధి సహాయ రిపుతస్కరాః | అసాక్షిణః సర్వసాక్షీ చౌర్యపారుష్య సాహసే. 4

ఉభయానుమతః సాక్షీభవత్యేకో7పి ధర్మవిత్‌ | అబ్రువన్హినరః సాక్ష్యమృణం నదశబంధకమ్‌ . 5

అగ్నిదేవుడు చెప్పెను : తపస్వులు, కులీనులు, దానశీలులు, సత్యవాదులు, కోమలహృదయులు, ధర్మాత్ములు పుత్రయుక్తులు, ధనవంతులు, పంచయజ్ఞములు చేయువారు, అయిన ఐదుగురు గాని, ముగ్గురుగాని సాక్షులుండవలెను. వారు జాతివర్ణానుసారముగ ఉండవలెను. లేదా అందరికిని అందరును ఉండవచ్చును స్త్రీలు, బాలకులు, వృద్ధులు, జూదరులు, మత్తులో ఉన్నవారు, ఉన్మత్తులు, పాతకులు, నటులు, పాషండులు, వంచకులు, వికలమైన ఇంద్రియములు కలవారు, పతితులు, ఆప్తులు, అర్థసంబంధముకలవారు, సహాయకులు, శత్రువులు, చోరులు, సాహసవంతులు, దోషులుగ పరిగణింపబడినవారు, బంధ్వాది పరిత్యక్తులు సాక్షులుగా ఉండుటకు అర్హులుకారు. వాది ప్రతివాదులు ఇరువురును అంగీకరించినచో ధర్మవేత్తయగు ఒక్క వ్యక్తియే సాక్షిగా ఉండవచ్చును. స్త్రీని బలాత్కరించుట, దొంగతనము చేయుట, ఎవరైన నిందించుట కఠిన దండనము వేయుట, మొదలగు దుస్సాహసకార్యములందు అందరిని సాక్షులుగా గ్రహింపవచ్చును.

రాజ్ఞాసర్వం ప్రదాప్యః స్యాత్షట్‌ చత్వారింశ కే7హని | న దదాతిహియః సాక్ష్యం జానన్నపి నరాధమః. 6

సకూట సాక్షిణాం పాపైస్తుల్యో దండేన చైవ హి | సాక్షిణః శ్రావయే ద్వాది ప్రతివాది సమీపగాన్‌. 7

యే పాతక కృతాం లోకా మహాపాతకినాంతథా | అగ్నిదానాంచ యేలోకా స్త్రీ బాలఘాతినామ్‌. 8

తాన్సర్వాన్సమవాప్నోతియః సాక్ష్యమనృతం వదేత్‌ |

సుకృతం యత్త్వయా కించిజ్జన్మాంతరశ##తైః కృతమ్‌. 9

తత్సర్వం తస్య జానీహియం పరాజయసే మృషా | ద్వైధే బహూనాం వచనం సమేషు గుణినాం తథా. 10

గుణద్వైధేతు వచనం గ్రాహ్యం యే గుణవత్తరాః | యస్యోచుః సాక్షిణః సత్యాంప్రతిజ్ఞాం సజయీభ##వేత్‌. 11

అన్యథా వాదినోయస్య ధ్రువస్తస్య పరాయజః

సాక్ష్యము చెప్పని వానిచే రాజు నలుబది ఆఱవరోజున పదవవంతు అధికముగా కలిపి ఋణమును ధనికునకు ఇప్పించవలెను. తెలిసి కూడ సాక్ష్యము చెప్పని నరాధమునకు అసత్యముగా సాక్ష్యము చెప్పిన వానికి వచ్చు పాపము వచ్చును ఆతనిని కూడ సాక్షిని శిక్షించునట్లు శిక్షించవలెను. ''పాపములు చేసిన వారికిని, మహాపాతకములు చేసిన వారికిని. గృహదాహము చేసిన వారికిని, స్త్రీబాలఘాతుకులకును ఏలోకములు వచ్చునో కూటసాక్ష్యము చెప్పినవానికి కూడ ఆలోకములే ప్రాప్తించును. నీవు అసత్యముగా సాక్ష్యముచెప్పి ఎవరిని పరాభవింపచూచుచున్నావో వానికి నీవు నూరు జన్మములలో చేసిన పుణ్యములన్నియు చేరిపోవును'' అని వాదిప్రతివాదుల సమీపమునందున్న సాక్షులకు చెప్పవలెను. చాలమందిలో అభిప్రాయభేదము వచ్చినప్పుడు గుణవంతుల సాక్ష్యమును అంగీకరించవలెను. గుణవంతుల మధ్యభేదమువచ్చినపుడు అధికగుణవంతుల సాక్ష్యమును గ్రహించవలెను. సాక్షులు ఎవనిమాటను సమర్థింతురో ఆతనికి జయము కలుగును. వ్యతిరేకముగా ఇచ్చినచో ఆతడు పరాజయము పొందును.

ఉక్తే7పి సాక్షిభిః సాక్ష్యే యద్యన్యే గుణవత్తరాః | 12

ద్విగుణావాన్యథాబ్రూయుః కూటాఃస్యుః పూర్వసాక్షిణః | పృథక్‌ పృథగ్దండనీయాః కూటకృత్సాక్షిణస్తథా.

వివాదాద్ద్విగుణం దండం వివాస్యో బ్రాహ్మణః స్మృతః |

యః సాక్ష్యం శ్రావితో7న్యేభ్యో నిహ్నుతే తత్తమో వృతః. 14

సదాప్యో7ష్టగుణం దండం బ్రాహ్మణంతు వివాసయేత్‌ |

వర్ణినాం హి వధోయత్ర తత్ర సాక్ష్యే7నృతం వదేత్‌. 15

యః కశ్చిదర్థో7భిమతః స్వరుచ్యాతు పరస్పరమ్‌ | లేఖ్యంతు సాక్షిమత్కార్యం తస్మిన్దనిక పూర్వకమ్‌.

సమామాసతదర్ధాహర్నామ జాతిస్వ గోత్రజైః | సబ్రహ్మచారి కాత్మీయ పితృనామాది చిహ్నితమ్‌. 17

సమాప్తే7ర్థే ఋణీ నామస్వ హస్తేన నివేశ##యేత్‌ | మతం మే7ముకపుత్రస్య యదత్రోపరిలేఖితమ్‌. 18

సాక్షిణశ్చ స్వహస్తేన పితృనామక పూర్వకమ్‌ | ఆత్రాహమముకః సాక్షీ లిఖేయురితి తేసమాః. 19

అలిపిజ్ఞ ఋణీయః స్యాల్లేఖయేత్స్వమతంతునః | సాక్షీవా సాక్షిణాన్యేన సర్వసాక్షిసమీపతః.

20

ఉభయాభ్యర్థితేనైతన్మయా హ్యముకసూనునా | లిఖితం హ్యము కేనేతి లేఖకా7ర్థాంస్తతో లిఖేత్‌. 21

వినాపి సాక్షిభిర్లేఖ్యం స్వహస్త లిఖితం చయత్‌ | తత్ర్పమాణం స్మృతం సర్వం బలోపాధికృతాదృతే. 22

ఋణలేఖ్యకృతం దేయం పురుషైస్త్రిభిరేవతు | ఆధిస్తు భుజ్యతే తావద్యావత్తన్నప్రదీయతే. 23

దేశాన్తరస్థే దుర్లేఖ్యే నష్టోన్నృష్టే హృతేతథా | భిన్నే ఛిన్నే తథా దగ్ధేలేఖ్యమన్యత్తుకారయేత్‌. 24

సందిగ్ధార్థవిశుద్ధ్యర్థం స్వహస్త లిఖితం చయత్‌ | యుక్తిప్రాప్తిక్రియాచిహ్న సంబంధాగమహేతుభిః. 25

లేఖ్యస్య పృష్ఠే7ఖిలిఖేత్ర్ప విష్టమధమర్ణినః | ధనీచోపగతం దద్యాత్స్వహస్తపరిచిహ్నితమ్‌. 26

దత్త్వర్ణం పాటయేల్లేఖ్యం శుద్ధ్యైచాన్యత్తు కారయేత్‌ | సాక్షిమచ్చ భ##వేద్యస్తు తద్దాతవ్యం ససాక్షికమ్‌. 27

మొదట కొందరు సాక్షులు సాక్ష్యము చెప్పినను తరువాత అధిక గుణవంతులు కొందరు గాని రెట్టింపు సంఖ్య కలవారుగాని మరొక విధముగా సాక్ష్యము చెప్పినచో పూర్వము సాక్ష్యము చెప్పినవారు కూటసాక్షులగుదురు. కూటసాక్షులను ఒక్కొక్కరిని వివాదాస్పదమైన ధనముకంటె రెట్టింపుధనము దండించవలెను. కూటసాక్షి బ్రాహ్మణుడైనచో ఆతనిని దేశమునుండి వెడలగొట్టవలెను. ఇతరులు చెప్పిన సాక్ష్యమును కప్పిపుచ్చిన వానినుండి ఎనిమిదిరెట్ల ధనమును దండముగా గ్రహించవలెను. బ్రాహ్మణుడైనచో దేశమునుండి బహిష్కరించవలెను. వర్ణముల వారికివధ ప్రాప్తిచు సందర్భమునందు సాక్షి అసత్యముకూడ చెప్పవచ్చును. ధనికుడును, అధమర్ణుడును (ఋణమును తీసుకున్నవాడు) పరస్పరాంగీకార పూర్వకముగా ఋణము తీసికొనిన ధనమును గూర్చి సాక్షులతో పత్రముపై వ్రాయించుకొనవలెను. ఆ పత్రముపై సంవత్సరము, మాసము, పక్షము, దినము, పేరు, జాతి, వారిగోత్రము, వారిమిత్రులు బంధువులు, తండ్రులు, మొదలగువారి పేర్లు కూడ వ్రాయవలెను. వ్రాయుట పూర్తియగు పిమ్మట ఋణగ్రహీత అముకుని (ఫలానావారి)పుత్రుడనైన నాకు ఈ పత్రముపై వ్రాసినది అంగీకార్యమే. అని చేవ్రాలు చేయవలయును. సాక్షులందరును అముకుడనైన నేను దీనికి సాక్షిని, యని తమతమ తండ్రులపేరు కూడ నిర్దేశించుచు హస్తాక్షరములు ఉంచవలెను అధమర్ణుడు లిపిజ్ఞానములేని వాడైనచో ఆతడు అందరి సాక్షుల యెదుట తనమతమును వ్రాయించవలెను. సాక్షి అందరి సాక్షుల యెదుట అముకుడి కుమారుడనైన నేను ఇరువురును కోరగా వ్రాయుచున్నాను. అని ప్రారంభించి లేఖకార్థమును వ్రాయవలెను. స్వహస్తలిఖితమైన లేఖ్యము సాక్షులు లేకపోయినను ప్రమాణమే. కాని బలాత్కారముచేత గాని, మోసము చేతగాని, వ్రాయించబడినది ప్రమాణము కాదు. లేఖ్యపూర్వకమైన ఋణమును మూడు తరములవరకును చెల్లించవలసియుండును. తాకట్టు పెట్టిన వస్తువును దానిపై తీసుకొనిన ఋణము తీర్చనంతవరకు ధనికుడు అనుభవించవచ్చును. లేఖ్యము వ్రాసిన వాడు దేశాంతరమునందున్నను లేఖ్యము నష్టమైనను తుడిచివేయబడినను, హరింపబడినను భిన్నమైనను ఛిన్నమైనను దగ్ధమైనను మరొక లేఖ్యమును వ్రాయించవలెను. లేఖ్యము సందిగ్ధముగా నున్నపుడు మరల మరొక లేఖ్యము వ్రాయవలెను. లేఖ్యమునకు శుద్ధి, యుక్తిప్రాప్తిచేతను (ఆదేశకాలములలో ఆతనివద్ద ఇంతధనము ఉండుటకు అవకాశమున్నది అని యుక్తి చేతను క్రియ (సాక్షులహస్తాక్షరములు)చేతను చిహ్నముల చేతను (ప్రత్యేకముగా ఉపయోగించిన గుర్తులు) ధనిక ఋణగ్రహీతల సంబంధము చేతను వారిధనప్రాప్తి సంభావ్యమే అను ఆగమము చేతను, నిర్ణయింపబడును, ఋణములోని కొంత ధనము చెల్లించినపుడెల్ల ధనికుడు ఆలేఖ్యము వెనుక వైపున చెల్లించిన ధనమును వ్రాసి హస్తాక్షరములు వుంచవలెను. ఋణము పూర్తిగా చెల్లించివేసినపుడు అలేఖ్యమును చింపివైచి చెల్లించినట్లుగా ధనికుడి నుండి పత్రమును పొందవలెను. సాక్షులున్నపుడు తీసుకున్న ఋణమును వారి యెదుటనే చెల్లించవలెను.

తులాగ్న్యాపోవిషంకోషో దివ్యానీహవిశుద్ధయే | మహాభియోగేష్వేతాని శీర్షకస్థే7భియోక్తరి. 28

రుచ్యావాన్యతరః కుర్యాదితరో వర్తయేచ్ఛిరః | వినాపి శీర్షకాత్కుర్యాన్నృపద్రోహే7థపాతకే. 29

నా7సహస్రాద్ధరేత్పాలం న తులాం సవిషం తథా | నృపార్థేష్వభియోగేషు వహేయుః శుచయః సదా. 30

సహస్రార్థేతులాదీనికోశమల్పే7పి దాపయేత్‌ | శతార్ధం దాపయేచ్ఛుద్ధమశుద్దోదండబాగ్భవేత్‌. 31

సచైల స్నాతమాహూయ సూర్యోదయ ఉపోషితమ్‌ | కారయేత్సర్వదివ్యాని నృపబ్రాహ్మణ సన్నిధౌ. 32

తులాస్త్రీవాల వృద్ధాన్ధపంగు బ్రాహ్మణ రోగిణామ్‌ | అగ్నిర్జలం వాశూద్రస్యయవాః సప్తవిషస్యవా. 33

తులాధారణ విద్వద్భిరభియుక్తస్తులాశ్రితః | ప్రతిమానసమీభూతోరేఖాం కృత్వావతారితః. 34

ఆదిత్య చంద్రావనిలో7నలశ్చద్యౌర్‌భూమిరాపోహృదయంయమశ్చ |

అహశ్చరాత్రిశ్చ ఉభే చనంధ్యేధర్మశ్చ జానాతి నరస్యవృత్తమ్‌. 35

త్వంతులే నత్యధామాసి పురాదేవైర్వినిర్మితా | సత్యం వదస్వ కల్యాణి సంశయాన్మాం విమోచయ. 36

యద్యస్మిపాపకృన్మాత్తస్తతోమాం త్వమధోనయ | శుద్ధశ్చేద్గమయోర్ధ్వం మాంతులామిత్యభిమంత్రయేత్‌.

ధర్మశాస్త్రములలో సందిగ్ధమైన విషయమును నిర్ణయించుటకై తుల, అగ్ని, జలము, విషము, కోశము అను ఐదు దివ్యప్రమాణములు చెప్పబడినవి. అభియోగము చాల తీవ్రమైనపుడున్ను అభియోక్త వ్యవహారము చివరనున్నపుడును వీటిని ప్రయోగించవలెను. వాది ప్రతివాదులు అంగీకరించి ఈ దివ్యప్రమాణ ప్రయోగమునకు సిద్ధముకావలెను. లేదా ఇతరములగు శారీరక ఆర్థిక దండములకు సిద్ధము కావలెను. రాజద్రోహము, మహాపాతకము, మొదలగు విషయములందు సందేహము కలిగినపుడు శీర్షకస్థితి (వివాదము చరమావస్థ) రాకున్నను ఈ దివ్యమును స్వీకరించవచ్చును. వెయ్యి పణములకు తక్కువైన అభియోగమునందు తులా-విష దివ్యములను ప్రయోగించకూడదు. కాని రాజద్రోహ మహాపాతకమునందు వీటిని గ్రహించవచ్చును. అభియోగము వేయిపణములకొరకు అయినచో తుల మొదలగు మూడు ప్రమాణములను ప్రయోగించవచ్చును. అంతకు తక్కువైనను కోశమును ప్రయోగించవచ్చును. శపథము చేసినవాడు శుద్ధుడుయని (నిర్దోషి) నిర్ణయమైనచో రెండవవానిచే అతనికి యేబది పణములు ఇప్పించివలెను. దోషియైనచో దండించవలెను. పరీక్షింపదగిన వానిచే మొదటిరోజున ఉపవాసము చేయించి మరునాడు సూర్యోదయ సమయమున వస్త్రసహితముగా స్నానము చేయించి రాజబ్రాహ్మణ సముఖమున దివ్యప్రమాణము చేయించవలెను. స్త్రీ, బాలకులు, వృద్ధులు, అంధులు, కుంటివారు, బ్రాహ్మణులు, రోగములతో బాధపడుతున్నవారు ఇట్టి అపరాధులచే తులా దివ్యప్రమాణము మాత్రమే చేయించవలెను. శూద్రునకు అగ్నికాని, జలముకాని, విషయముయొక్క ఏడుయవలుకాని దివ్యప్రమాణములుగా విధింపబడినవి. తూచుటయందు నేర్పుకలవారు అభియుక్తుని (దోషిని) తులలో (కాంటాలో) ఒక వైపునుంచి మరొకవైపున ప్రతిమానము (సమమైన మరొక పదార్థమును) వుంచి ఒక రేఖ గీసి క్రిందికి దింపవలెను. ఆతడు ఈ క్రింది వాక్యమును చదువుచు తులను అభిమంత్రించవలెను. ''సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము, హృదయము, యముడు, పగలు, రాత్రి, రెండు సంధ్యలు, ధర్మదేవత, వీరందరును మానవుని వృత్తము తెలుసుకొనగలరు. ఓతులా ! నీవు సత్యమునకు స్థానముగా పూర్వము దేవతలచే నిర్మింపబడితివి. ఓ కల్యాణీ! సత్యమునే చెప్పుము. నన్ను సంశయము నుండి విడిపించుము. ఓతల్లీ! నేను పాపము చేసియున్నచో నన్ను క్రిందికి దింపుము. శుద్ధుడనైనచో నన్ను పైకి లేపుము.

కరౌవిమృదిత వ్రీహేర్లక్షయిత్వాతతోన్యసేత్‌ | నప్తాశ్వత్థన్య పత్రాణి తావత్సూత్రేణ వేష్టయేత్‌. 38

త్వమేవసర్వభూతానామన్తశ్చరసిపావక | సాక్షివత్పుణ్య పాపేభ్యో బ్రూహి సత్యంకరేమమ. 39

తస్యేత్యుక్తవతో లౌహం పంచాశత్పలికం సమమ్‌ | అగ్నివర్ణం న్యసేత్పిండం హస్తయోరుభయోరపి. 40

సతమాదాయ సపై#్తవ మండలాని శ##నైర్వ్రజేత్‌ | షోడశాంగులకం జ్ఞేయం మండలం తావదన్తరమ్‌. 41

ముక్త్వాగ్నిం మృదితవ్రీహిరదగ్ధః శుద్ధిమాప్నుయాత్‌ | ఆన్తరాపతితే పిండే సందేహే వా పునర్హరేత్‌. 42

పవిత్రాణాం పవిత్రః త్వం శోధ్యం శోధయపావక | సత్యేన మాభిరక్షస్వ వరుణత్యభిశస్తకమ్‌. 43

నాభిదఘ్నోదకస్థస్య గృహీత్వోరూ జలం విశేత్‌ | సమకాల మిషుం ముక్తమానీయాద్యో జవీనరః. 44

యదితస్మిన్నిమగ్నాంగం పశ్యేచ్చేచ్ఛుద్ధిమాప్నుయాత్‌ | త్వం విషబ్రహ్మణః పుత్రః సత్యే ధర్మేవ్యవస్థితః. 45

త్రాయస్వాస్మాదభీశాపాత్సత్యేనభవమే7మృతమ్‌ | ఏవముక్త్వా విషం శార్జగం భక్షయేద్ధిమ శైలజమ్‌. 46

యస్య వేగైర్వినా జీర్ణం శుద్ధిం తస్య వినిర్ధిశేత్‌ | దేవానుగ్రాన్సమభ్యర్చ్య తత్స్నానోదక మాహరేత్‌. 47

నంశ్రావ్య పాయయేత్తస్మాజ్జలాత్తు ప్రసృతిత్రయమ్‌ | ఆ చతుర్దశకాదహ్నో యస్యనో రాజదైవికమ్‌. 48

వ్యసనం జాయతే ఘోరం సశుద్ధః స్యాదసంశయమ్‌ | సత్యవాహన శస్త్రాణి గోబీజకనకానిచ. 49

దేవతాగురు పాదాశ్చ ఇష్టాపూర్త కృతానిచ | ఇత్యేతే సుకరాః ప్రోక్తాః శపథాః స్వల్ప సంశ##యే. 50

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వ్యవహారే దివ్యాని నామ పంచపంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

అభియుక్తునిచే చేతులలో ధాన్యమును నలిపించి చేతులకు రంగుపూసి అతని చేతులలో ఏడు అశ్వత్థ పత్రములను దారముతో కట్టవలెను. అతనిచే ''ఓఅగ్నిదేవా ! నీవే సర్వభూతములలోపల సాక్షివై సంచరించుచున్నావు. నీవు నా పుణ్యపాపములనుగూర్చి సత్యముగా చెప్పుము.'' అని చెప్పించి గోళాకారములోనున్న యేబది పలముల లోహపిండమును ఎఱ్రగా కాల్చి ఆతని చేతులలో వుంచవలెను. అతడు దానిని గ్రహించి మెల్లగా ఏడు మండలములు నడుపవలెను. మండలము అనగా పదహారు అంగుళముల దూరము. అక్కడ అగ్నిని విడిచిపెట్టి మరల చేతులతో ధాన్యమును నలిపిచేతుల కాలకుండ వున్నచో అతడు శుద్ధుడు. ఆ అయఃపిండము మధ్యలో పడిపోయినను ఏదైన సందేహము కలిగినను మరల ఆతడు ఆ పిండమును తీసుకొనివెళ్లవలెను. ''ఓ వరుణదేవా! నీవు పవిత్రులలో పవిత్రుడవు. ఓ పావకా! శోధింపదగిన నన్ను శోధించుము. అభిశస్తుడనైన నన్ను సత్యముచే రక్షింపుము'' యని జలమును అభిమంత్రించి బొడ్డు లోతునీటిలో నిలబడివున్న పురుషుని కాళ్లుపట్టుకొని అభియుక్తుడు జలములో ప్రవేశించవలయును. అదే సమయమున ఒకడు బాణము విడువగా వేగవంతుడగు మరొకడు ఆ బాణమును తిరిగి తీసుకొనివచ్చునంతవరకు అతడు (అభియుక్తుడు) నీటిలో మునిగియున్నచో శుద్ధుడగును (నిర్ధోషి). ''ఓ విషమా! నీవు బ్రహ్మ పుత్రుడవు సత్యధర్మమునందు నిలచియున్నావు నన్ను ఈ అభిశాపము (దోషారోపణము) నుండి రక్షించుము. సత్యముచే నీవు నాకు అమృతము అగుము'' అని పలికి అభియుక్తుడు హిమాలయ పర్వతమునందు పుట్టిన శార్జగవిషమును భక్షించవలయును. అతడు విషవేగము ఏమియులేక దానిని జీర్ణించుకొన్నచో ఆతడు శుద్ధుడు యని నిర్ణయింపవలయును. న్యాయాధికారి ఉగ్రదేవతలను పూజించి వారి అభిషేకోదకమును తీసికొనివచ్చి అభియుక్తునకు ఆ విషయమును చెప్పి వారిచే చారడేసి చొప్పున మూడు మారులు త్రాగించవలయును. పదునాలుగు దినములలోపుగా ఆతనికి రాజువలనకాని దైవమువలనకాని ఘోరమైన వ్యసనము కలుగకొన్నచో ఆతడు నిస్సందేహముగా శుద్ధుడు. అధిక మూల్యములగు వస్తువుల విషయమున అభియోగమునందు స్వల్పసంశయము కలిగినపుడు సత్యము వాహనములు శస్త్రములు గోవులు బీజములు సువర్ణము దేవతలు గురుచరణములు ఇష్టాపూర్తములు మొదలగు పుణ్య కార్యములు వీటిపై శపథము చేయించవలయును.

అగ్ని మహాపురాణమునందు వ్యవహారకాండమున దివ్యములు అను రెండువందల యేబదిఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page