Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోనత్రింశదధిక ద్విశతతమోధ్యాయః

అథ స్వప్నాధ్యాయః

పుష్కర ఉవాచ :

స్వప్నం శుభాశుభం వక్ష్యే దుఃస్వప్న హరణం తథా | నాభింవినాన్యత్ర గాత్రే తృణవృక్షసముద్భవః. 1

చూర్ణనం మూర్ధ్ని కాంస్యానాం ముండనం నగ్నతాతథా | మలినాంబర ధారిత్వమభ్యఙ్గః పఙ్కదిగ్ధతా. 3

ఉచ్చాత్ర్పపతనం చైవ వివాహో గీతమేవచ | తంత్రీవాద్య వినోదశ్చ దోలారోహణమేవచ. 3

అర్జనం పద్మ లోహానాం సర్పాణామథమారణమ్‌ | రక్తపుష్పద్రుమాణాంచ చాండాలస్యతథైవచ. 4

వరాహశ్వఖరోష్ట్రాణాం తథాచారోహణక్రియా | భక్షణం పక్షిమాంసానాం తైలస్యకృసరస్యచ. 5

మాతుఃప్రవేశోజఠరే చితారోహణమేవచ | శుక్రధ్వజాభిపతనం పతనం శశి సూర్యయోః. 6

దివ్యాన్తరిక్ష భౌమానాముత్పాతానాం చ దర్శనమ్‌ | దివద్విజాతి భూపానాం గురూణాం కోపఏవచ. 7

నర్తనం హసనం చైవ వివాహోగీతమేవచ | తంత్రీ వాద్య విహీనానాం వాద్యానామపివాదనమ్‌. 8

స్రోతోవహాధో గమనం స్నానం గోమయవారిణా | పంకోదకేన చ తథా మషీతోయేన వాప్యథ. 9

ఆలింగనం కుమారీణాం పురుషాణాంచ మైథునమ్‌ | హానిశ్చైవ స్వగాత్రాణాం విరేకోవమనక్రియా. 10

దక్షిణాశాప్రగమనం వ్యాధినాభిభవన్తథా | ఫలానాముప హానిశ్చ ధాతూనాం ఖేదనం తథా. 11

గృహాణాం చైవ పతనం గృహ సమ్మార్జనం తథా | క్రీడా పిశాచ క్రవ్యాదవానరాంత్యనరైరపి. 12

పరాదభిభవశ్చైవ తస్మాచ్చ వ్యసనోద్భవః | కాషాయవస్త్రధారిత్వం తద్వసై#్త్రః క్రీడనంతథా. 13

స్నేహపావావగాహౌచ రక్తమాల్యానులేపనమ్‌ | ఇత్యధన్యాని స్వప్నాని తేషా మకథనం శుభమ్‌. 14

భూయశ్చ స్వపనం తద్వత్కార్యం స్నానం ద్విజార్చనమ్‌ |

తిలైర్హోమో హరిబ్రహ్మశివార్క గణపూజనమ. 15

తథాస్తుతి ప్రపఠనం పుంసూక్తాది జపస్తథా | స్వప్నాస్తు ప్రథమే యామే సంవత్సర విపాకినః. 16

షడ్భిర్మాసైర్ద్వితీయే తు త్రిభిర్మాసైస్త్రియామికాః | చతుర్థే త్వర్ధమాసేన దశాహాదరుణోదయే. 17

పుష్కరుడు పలికెను : శుభా శుభ స్వప్నములు. అశుభస్వప్న ఫలనివారణోపాయములు చెప్పెదను. నాభితప్పఇతర శరీరాంగములందు తృణములు వృక్షములు మొచ్చుట, నెత్తిమీద పెట్టుకొన్న కాంస్యపాత్రలు బ్రద్దలగుట తల గొరిగించుకొనుట, వస్త్రవిహీనుడగుట, మలినవస్త్రములు ధరించుట, తైలము, బురద పూసికొనుట, పైనుంచిపడుట, వివాహమగుట, గీతములు వినుట, వీణా వాద్యములు వినుచు మనోవినోదము చేయుట, ఉయ్యాల ఊగుట, పద్మములను లోహములను సంపాదించుట, సర్పములును చంపుట, ఎఱ్ఱటి పూవులతోనిండిన వృక్షములను చండాలులను చూచుట సూకరము. కుక్క, గాడిద, ఒంటె - వాటిపై ఎక్కుట, పక్షిమాంసము భుజించుట తైలము త్రాగుట, కిచడీ తినుట, మాతృగర్భము ప్రవేశించుట, చితిపై ఎక్కుట, ఇంద్రధ్వజము విరిగిపడుట, సూర్యచంద్రులు పడిపోవుట, దివ్య - అంతరిక్ష - భూలోకములందు ఉత్పాతములు కనబడుట - దేవతా - బ్రాహ్మణ - రాజ- గురువులకు కోపము కలుగు, నాట్యమాడుట, నవ్వుట, గీతములు పాడుట, వివాహము చేయుట, వీణతప్ప మిగిలిన వాద్యములను తాను వాయించుట, నదిలో మునిగి క్రిందికి పోవుట, గోమయము, బురద, సిరా కలసిన నీళ్ళలో స్నానము చేయుట, కుమారీకన్యలను ఆలింగనము చేసికొనుట. పురుషులు పరస్పరము మైథునము చేసికొనుట, తన అవయవముల హాని, వమనము, విరేచనము అగుట. దక్షిణదిక్కు వైపు వెళ్ళుట, రోగముచే పీడితుడగుట. ఫలముల హాని, ధాతువును బ్రద్ధలు కొట్టుట, ఇండ్లను పడద్రోయుట, ఇండ్లలోతుడుచుట పిశాచ - రాక్షస - వానర - చాండాలాదులతో క్రీడించుట, శత్రువుచే అవమానితుడగుట, శత్రువులనుండి కష్టములు వచ్చుట, కాషాయవస్త్రములు ధరించుట, కాషాయవస్త్రములతో ఆడుకొనుట, తైలము త్రాగుట, దానిలో స్నానము చేయుట, ఎఱ్ఱని పూలమాల ధరించుట, ఎఱ్ణని చందనము ధరించుట, ఇవన్నియు చెడు స్వప్నములు. వీటిని ఇతరులకు చెప్పకుండుట మంచిది. ఇట్టి స్వప్నములు వచ్చినపుడు మరల నిద్రించవలెను. స్వప్నదోషశాంతికై బ్రాహ్మణులను పూజించవలెను. తిలహోమము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివులను, సూర్యగణములను పూజించి స్తోత్ర - పురుషసూక్తాదుల పారాయణము చేయవలెను. రాత్రిమొదటి జామునందు చూచిన స్వప్నములఫలము ఒక సంవత్సరములోకలుగును. రెండవజామునచూచినవాటి ఫలము ఆరుమాసములందును మూడవజామునందు చూచిన వాటి ఫలము మూడు మాసములందును, నాల్గవ జామునందుచూచిన స్వప్నములఫలము పదునైదుదినములందును కలుగును. అరుణోదయసమయమున చూచిన దానిఫలము పదిరోజులలోనే కలుగును.

ఏకస్యామథ చేద్రాత్రౌ శుభం వాయదివా7శుభమ్‌ | పశ్చాద్దృష్టస్తుయన్తత్ర తస్యపాకం వినిర్దిశేత్‌. 18

తస్మాత్తు శోభ##నే స్వప్నే పశ్చాత్స్వాపో నశస్యతే | శైల ప్రాసాదనాగాశ్వ వృషభా రోహణం హితమ్‌. 19

ద్రుమాణాం శ్వేత పుష్పాణాం గగనేచ తథా ద్విజ |

ద్రుమే తృణోద్భవో నాభౌ తథా చ బహు బాహుతా. 20

తథా చ బహు శీర్షత్వం పలితోద్భవ ఏవచ | సుశుక్లమాల్యధారిత్వం సుశుక్లాంబర ధారితా. 21

చంద్రార్కతారా గ్రహణం పరిమార్జనమేవచ | శక్రధ్వజాలింగనంచ ధ్వజోచ్ఛ్రాయక్రియాతథా. 22

భూమ్యమ్బుధారా గ్రహణం శత్రూణాం చైవ విక్రియా| జయో వివాదో ద్యూతేచ సంగ్రామే చ తథా ద్విజ.

భక్షణం చార్ద్రమాంసానాం పాయసస్య చ భక్షణమ్‌ | దర్శనం రుధిరస్యాపి స్నానం వా రుధిరేణచ. 24

సురారుధిరమద్యానాం పానం క్షీరస్య వాప్యథ | ఆసై#్త్రర్విచేష్టనం భూమౌ నిర్మలం గగనం తథా. 25

ముఖేన దోహనం శస్తం మహిషీణాం తథా గవామ్‌ | సింహీనాం హస్తినీనాంచ బడవానాం తథైవ చ. 26

ప్రసాదో దేవవిప్రేభ్యో గురుభ్యశ్చ తథా ద్విజ | అంభసా చాభిషేకస్తు గవాంశృంగచ్యుతేన చ. 27

చంద్రాద్భ్రష్టేనవా రామజ్ఞేయం రాజ్యపదంహితత్‌ | రాజ్యాభిషేకశ్చ తథాఛేదనం శిరసో7ప్యథ. 28

మరణం వహ్నిలాభశ్చవహ్నిదాహోగృహాదిషు | లబ్ధిశ్చ రాజలింగానాం తంత్రీవాద్యాభివాదనమ్‌. 29

యస్తు పశ్యతి స్వప్నాన్తే రాజానం కుంజరం హయమ్‌ | హిరణ్యం వృషభం గాంచ కుటుంబన్తస్య వర్ధతే. 30

వృషేభగృహశైలాగ్ర వృక్షారోహణ రోదనమ్‌ | ఘృతవిష్టానులేపోవా హ్యగమ్యాగమనం తథా.

సితవస్త్రం ప్రసన్నాభ్యః ఫలీవృక్షో నభో7మలమ్‌. 31

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్వప్నాధ్యాయో నామైకోనత్రింశదధిక ద్విశతతమో7ధ్యాయః.

ఒకే రాత్రి శుభాశుభ స్వప్నములు రెండును వచ్చినచో తరువాత వచ్చినదాని ఫలమునే చెప్పవలెను. అందుచే శుభ స్వప్నము చూచిన తరువాత నిద్రించుట మంచిదికాదు. పర్వతము భవనము, ఏనుగు, గుఱ్ఱము, ఎద్దు ఎక్కినట్లు స్వప్నము వచ్చినచో మంచిది. పరశురామా! భూమిమీదగాని, ఆకాశమునందుగాని తెల్లటిపూవులతో నిండిన, వృక్షములు కనబడినను, తన నాభినుండి వృక్షముగాని, తృణముగాని మొలిచినను, తన భుజములుగాని, శిరస్సుగాని అధికముగా ఉన్నట్లు కనబడినను,కేశములు తెల్లబడినను మంచి ఫలములు లభించును. శ్వేతపుష్పమాలయు, శ్వేతవస్త్రములును ధరించుట, చంద్ర - సూర్య - నక్షత్రములను పట్టుకొనుట, వాటిని తుడుచుట, ఇంద్రధ్వజమును ఆలింగనము చేసికొనుట, ధ్వజమును పైకెత్తుట, భూమిపై పడుతున్న జలధారను తనమీద ఆపుట, శత్రువినాశమును చూచుట, వాదవివాదములందును, యుద్ధము నందునుతాను జయించుట, పాయసము భుజించుట, రక్తముచూచుట, రక్తములో స్నానమాడుట, సుర, మద్యము, లేదా పాలు త్రాగుట, అస్త్రప్రహారము తిని నేలపై దొర్లుట, ఆకాశము స్వచ్ఛమగుట, గోవు, గేదె, ఆడసింహము, ఆడఏనుగు, ఆడగుఱ్ఱము వీటి పొదుగునుండి పాలు త్రాగుట, ఇవన్నియు మంచిస్వప్నములు. దేవతా - గురు - బ్రాహ్మణులు ప్రసాదము, గోశృంగము నుండి గాని, చంద్రుని నుండిగాని స్రవించు ఉదకముతో అభిషేకము చేసికొనుట - ఈ స్వప్నములు రాజ్యము నిచ్చును. పరశురామా! తాను రాజ్యాభివిక్తుడగుట. తన శిరస్సు ఖండితమగుట, తాను చచ్చుట, అగ్నిలో పడుట, గృహాదులకు అగ్నిదగ్ధమగునపుడు ఆ అగ్నిలో పడుట, రాజచిహ్నములు లభించుట, స్వయముగా వీణవాయించుట, ఈ స్వప్నములు గూడ మంచివి; రాజ్యమునిచ్చునవి. స్వప్నము చివర రాజును, ఏనుగును, అశ్వమును, సువర్ణమును, వృషభమును, గోవును చూచినవారి కుటుంబము వృద్ధిచెందును. ఎద్దు, గజము, ప్రాసాదోపరిభాగము, పర్వతశిఖరము, వృక్షము వీటిపైకెక్కుట, ఏడ్చుట, శరీరమునకు నెయ్యి, మలము అంటుకొనుట, ఆగమ్యాస్త్రీగమనము - ఇవి కూడ శుభస్వప్నములు.

అగ్ని మహాపురాణమునందు శుభాశుభస్వప్న - దుఃస్వప్న నివారణమను

రెండువందల ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page