Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ద్వావింశో%ధ్యాయః

జనమేజయ ఉవాచః కిం కృతం పాతకం తేన బాలకేన పితామహ | యో జాతమాత్రో నిహత స్తథా తేన దురాత్మనా. 1

నారదో%పి మునిశ్రేష్ఠో జ్ఞానవాన్‌ ధర్మ తత్పరః | కథ మేవం విధం పాపం కృతవాన్‌ బ్రహ్మవిత్తమః. 2

కర్తాకారయితా పాపే తుల్యపాపౌ స్మృతౌ బుధైః | స కథం ప్రేరయామాస మునిః కంసం ఖలం తదా. 3

సంశయో%యంమహాన్మే%త్ర బ్రూహి సర్వం సవిస్తరమ్‌ | యేన కర్మవిపాకేన బాలకో నిధనం గతః. 4

వ్యాసః : నారదః కౌతుక ప్రేక్షీ సర్వదా కలహప్రియః | దేవకార్యార్థ మాగత్యసర్వమేత చ్చకార హ. 5

న మిథ్యా భాషణ బుద్ధి ర్మునే స్తస్య కదాచన | సత్యవక్తా సురాణాం స కర్తవ్యే నిరతః శుచిః. 6

ఏవం షడ్బాలకాస్తేన జాతాజాతా నిపాతితాః | షడ్గర్భాః శాపయోగేన సంభూయ మరణం గతాః. 7

శృణు రాజన్ప్రవక్ష్యామి తేషాం శాపస్య కారణమ్‌ | స్వాయంభువే%ంతరే పుత్త్రా మరీచేః షణ్మహాబలాః. 8

ఊర్ణాయాం చైవ భార్యాయా మాసన్ధర్మ విచక్షణాః | బ్రహ్మాణం జహసు ర్వీక్ష్య సుతాం యభితు ముద్యతమ్‌. 9

శశాప తాం స్తదా బ్రహ్మా దైత్యయోనిం విశంత్వధః | కానేమిసుతా జాతా స్తే షడ్గర్భా విశాంపతే. 10

అవతారే పరే తే తు హిరణ్యకశిపోః సుతాః | జాతాస్తే జ్ఞానసంయుక్తాః పూర్వశాపభయా న్పృప! 11

తస్మిన్‌ జన్మని శాంతాశ్చ తపశ్చ తపశ్చక్రుః సమాహితాః | తేషాం ప్రీతో%భవ ద్బ్రహ్మా షడ్గర్భాణాం వరాన్‌ దదౌ. 12

ఇరువది రెండవ యధ్యాయము

దేవదానవుల యంశావతారముల వర్ణనము

జనమేజయు డిట్లు ప్రశ్నించెను : ఓ పితామహా! ఆ పపిపాపడు పుట్టిన వెంటనే దుర్మార్గుని చేతిలో దిక్కులేని చావు చచ్చెగదా! వాడేమి పాప మొనర్చెనో కదా! అట్లు బ్రహ్మ విత్తముడు జ్ఞాని ధర్మనిరతుడు మునిప్రవరుడు నగు నారదుడు సైత మా పాపకార్య మేల చేయించెను? కర్త-కారయిత ఇరువురును పాపమును సమముగ ననుభవింతురని పెద్దలందురు. అది తెలిసియు నారదడు కంసు నేల ప్రేరించెను? ఆ బాలుడు ఎట్టి కర్మవిపాకము కారణమున చచ్చెనో నాకు తెల్ల మొనరించి నా శంక తొలగింపుము అన విని వ్యాసుడిట్లనెను : నారదుడు వినోదప్రియుడు - కలహభోక్త. అతడు దేవకార్యార్థముగ వచ్చి యిదంతయును చేయించెను. ముని కసత్యములు గిట్టవు. అతడు సత్యభాషి. సురకర్తవ్య నిరతుడు - శుచి. ఏది యెట్లున్నను దేవకి కారుగురు బాలురు పుట్టిరి. వారందఱును శాపవశమున చంపబడిరి. వారి శాప కారణము చెప్పుదును వినుము. పూర్వము స్వాయంభువ మన్వంతరమున మరీచికి ఊర్ణనాభి యను పత్నివలన ఆరుగురు మహాబలులు పుట్టిరి. వారు ధర్మరతులు. వారొకసారి బ్రహ్మ తన కన్యతో గలియుట కుద్యమించుట గని నవ్విరి. అంత మీరసురులకు పుట్టుదురు గాకని బ్రహ్మ వారిని శపించెను. దాని ఫలితముగ నాయారుగురును కాలనేమికి సుతులై పుట్టిరి. వారు మరొక జన్మమున హిరణ్యకశిపునకు పుత్రులైరి. కాని వెనుకటి శాపభయమువలన వారు జ్ఞానచ్యుతులు గాకుండిరి. ఆ జన్మములో వారు శాంతులు తపోనిరతులునై యుండిరి. అందుచే బ్రహ్మ సుప్రసన్నుడై వారి కిట్లు వరప్రదానము చేసెను :

బ్రహ్మా : శప్తా యూయం మయా పూర్వం క్రోధయుక్తేన పుత్త్రకాః |

తుష్టో%స్మి వో మహాభాగా బ్రువంతు వాంచితం వరమ్‌. 13

వ్యాసః : తే తు శ్రుత్వావచస్తస్య బ్రహ్మణః ప్రీతమానసాః | బ్రహ్మాణ మబ్రువన్కామం సర్వేకార్యార్థతత్పరాః. 14

గర్భాః : పితామహాద్య తుష్టో%సి దేహి నో వాంఛితం వరమ్‌ | అవధ్యాదైవతైః సర్వై ర్మానవైశ్చ మహోరగైః. 15

గంధర్వసిద్ధపతిభి ర్వధో మా భూత్పితామహ | తానువాచ తతో బ్రహ్మా సర్వమేత ద్భవిష్యతి. 16

గచ్ఛంతు వో మహాభాగాః ! సత్యమేవ న సంశయః | దత్వా వరం తతో బ్రహ్మాముదితాస్తే తదా%భవన్‌. 17

హిరణ్యకశిపుః క్రుద్ధస్తానువాచ కురూద్వహ | యస్మాద్విహాయ మాం పుత్త్రాస్తోషితోవైపితామహః. 18

వరేణ ప్రార్థితో%త్యర్థం బలవంతోయతో%భవన్‌ | యుష్మాభిర్హాపిత స్నేహస్తతో యుష్మాన్‌ త్యజామ్యహమ్‌. 19

యూయం వ్రజంతు పాతాళే షడ్గర్భా విశ్రుతాభువి | పాతా లే నిద్రయా%%విష్టా స్తిష్ఠంతు బహువత్సరాన్‌. 20

తతస్తు దేవకీగర్భే వర్షే పునః పునః | పితా వః కాలనేమి స్తు తత్ర కంసోభవిష్యతి. 21

స ఏవ జాతమాత్రా న్వో వధిష్యతి సుదారుణః | వ్యాసః : ఏవం శప్తాం స్తదాతేన గర్భే జాతా న్పునఃపునః 22

జఘాన దేవకీపుత్త్రాన్‌ షడ్గర్భాన్‌ శాపనోదితః | శేషాంశః సప్తమ స్తత్ర దేవకీగర్భ సంస్థితః. 23

విస్రం సితశ్చ గర్భే%సౌ యోగేన యోగమాయయా | నీతశ్చ రోహిణీ గర్భే కృత్వా సంకర్షణం బలాత్‌. 24

పతితః పంచమే మాసి లోకఖ్యాతిం గత స్తదా | కంసో%పి జ్ఞాతవాం స్తత్ర దేవకీగర్భపాతనమ్‌ : 25

'ఓ పుత్రకులారా! ఆనాడు నేను మిమ్ము కోపమాపుకొనలేక శపించితిని. ఇపుడు మీ యెడల ప్రసన్నుడనైతిని. ఏదేని వరము గోరుకొనుడు.' బ్రహ్మవాక్కులు విని వారు ప్రీత మనస్కులై తమ కార్యము సాధించుకొనుటకు బ్రహ్మతో నిట్లు పలికిరి. 'పితామహా! నీవు ప్రసన్నుడవే యైనచో మా వాంఛిత వరమిమ్ము. మేము దేవ నర పన్నగుల వలన చావకుందుము గాక! మాకు గంధర్వ సిద్ధపతుల వలన చావు లేకుండు గాక!' అనగా బ్రహ్మయు నట్లేయగు గాక! నాయనలారా! నా యీ వాక్కు నిక్కువమైనది. సంవయింప బనిలేదు' అని బ్రహ్మ వారికి వరమొసగెను. వారును వరమంది ముదమందిరి. అపుడు హిరణ్యకశిపుడు కోపముతో కిట్లనెను. మీరలు నన్ను వదలి బ్రహ్మను సంతోషపఱచితిరి. మీరు వరబల గర్వితులైరి. నా స్నేహమును కాలదన్నితిరి. కాన నేను మిమ్ము విడనాడుదును. ఇక మీరు షడ్గర్భులను నామమున బఱగుదురు. మీరు పాతాళమునకు పొండు. అట మీరు నిద్రావశులై పెక్కేండ్లుందురుగాక! మీరు ప్రతి యేట దేవకీ గర్భమందు పుట్టగలరు. మీ వెనుకటి తండ్రియైన కాలనేమి కంసుడుగ బుట్టగలడు. పుట్టుటే తడవుగా ఆ కఠినాత్ముడు మిమ్ము చంపగలడు.' వారిట్లు శపింపబడి దేవకీ గర్భమున మాటిమాటికి జన్మించిరి. కంసుడు శాపప్రేరణ వలన షడ్గర్భులనబడు దేవకీ పుత్రులను చంపెను. దేవకి కేడవ గర్భమున శేషుడంశావతారమున నుండెను. అపుడు యోగమాయ తన యోగబలమున దేవకీ గర్భస్థ శిశువు నాకర్షించి రోహిణీ గర్భమందుంచెను. దేవకికైదవ నెలకే గర్భము పోయినదని జనులనుకొనజొచ్చిరి. కంసుడును గర్భపాతము జరిగెనేమో యని భావించెను.

ముదం ప్రాప స దుష్టాత్మా శ్రుత్వా వార్తాం సుఖావహాం | అష్టమే దేవకీ గర్భే భగవా న్సాత్వతాంపతిః. 26

ఉవాస దేవకార్యార్థం భారావతరణాయ చ | రాజోవాచ: వసుదేవః కశ్యపాంశః శేషాంశశ్చ తదా%భవత్‌. 27

హరే రంశ స్తథా ప్రాక్తో భవతా మునిసత్తమ | అన్యేచ యే%ంశా దేవానాం తత్ర జాతాస్తు తాన్వద. 28

భారావతరణార్థం వై క్షితేః ప్రార్థనయా%నఘ | వ్యాసః : సురాణా మసురాణాం చ యేయే%ంశా భువివిశ్రుతాః. 29

తానహం సంప్రవక్ష్యామి సంక్షేపేణ శృణుష్వ తాన్‌ | వసుదేవః కశ్యపాంశో దేవకీ చ తథా%దితిః. 30

బలదేవ స్త్వనంతాంశో వర్తమానేషు తేషు చ | యో%సౌ ధర్మసుతః శ్రీమాన్నారాయణ ఇతిశ్రుతః. 31

తస్యాంశో వాసుదేవ స్తు విద్యమానే మునౌ తదా | నర స్తస్యానుజో యస్తు తస్యాంశో%ర్జున ఏవ చ. 32

యుధిష్ఠిరస్తు ధర్మాంశో వాయ్వంశో భీమ ఇత్యుత | అశ్వినంశౌ తతః ప్రోక్తౌ మాద్రీపుత్రౌ మహాబలౌ. 33

సూర్యాంశః కర్ణ ఆఖ్యాతో ధర్మాంశో విదురః స్మృతః | ద్రోణో బృహస్పతే రంశ స్తత్సుతస్తు శివాంశజః. 34

సముద్రః శంతనుః ప్రోక్తో గంగా భార్యా మతా బుధైః | దేవకస్తు సమాఖ్యాతో గంధర్వపతి రాగమే. 35

వసు ర్భీష్మో విరాటస్తు మరుద్గణ ఇతి స్మృతః | అరిష్టస్య సుతో హంసో ధృతరాష్ట్రః ప్రకీర్తితః. 36

మరుద్గణః కృపః ప్రోక్తః కృతవర్మా తతా%పరః | దుర్యోధనః కలేరంశః శకునిం విద్ధి ద్వాపరమ్‌. 37

ఈ విషయము దుష్ట కంసునకు సంతోషకరముగ నుండెను. చివరకు దేవకి కష్టమ గర్భమునందు సాధు పోషకుడు - సాక్షాత్తుగ భగవానుడు - భూభార ముడుప దేవకార్యార్థము వసించెను అను వ్యాసవచనములు విని జనమేజయుడిట్లు ప్రశ్నించెను : ఓ మునిసత్తమా ! కశ్య పాంశజుడైన వసుదేవుని శేషాంశమును విష్ణునంశమును తెలిపితివి. మఱి యిచట జన్మించిన యితర దేవాంశములను గూడ విశదపఱచుము. అనఘా! భూ భారము దింపుటకు భూదేవి ప్రార్థన పురస్కరించుకొని యెవరెవరు జన్మించిరో తెలుపుము అన వ్యాసుడిట్లనెను : భూమిపై సురాసురుల యెన్నో యంశములు ప్రసిద్ధి గాంచినవి. శేషాంశము వలన బలరాము డవతరించెను. ధర్ముని కుమారుడగు నారాయణ మహర్షి దివ్యాంశము వలన శ్రీ వాసుదేవు డవతరించెను. అతని తమ్ముడగు నరునంశమువలన నర్జును డుద్భవించెను. ఇటులే ధర్మాంశమున యుధిష్టిరుడు వాయునంశమున విదురుడు గురునంశమున ద్రోణుడు శివాంశముతో నశ్వత్థామయు సముద్రాంశమున శంతనుడును గంగ స్త్రీ రూపమున శంతనుని పత్నిగను నవతరించిరి. గంధర్వ పత్యంశమున దేవకరాజు పుట్టెను. వసు నంశమున భీష్ముడు మరుద్గణాంశమున విరాటరాజు అరిష్టనేమి సుతుడైన హంసువంశమున ధృతరాష్ట్రుడును మరుద్గణాంశమున కృప కృతవర్మలు ఘోరకల్యంశమున దుర్యోధనుడు ద్వాపర యుగాంశమున శకుని ఉద్భవిల్లిరి.

సోమపుత్రః సువర్చాఖ్యః సోమప్రరురుదాహృతః | పాకాంశో ధృష్టద్యుమ్న శ్చ శిఖండీ రాక్షస స్తథా. 38

సనత్కుమారస్యాంశస్తు ప్రద్యుమ్నః పరికీర్తితః | ద్రుపదో వరుణ స్యాంశో ద్రౌపదీ చ రమాంశజా. 39

ద్రౌపదీతనయాః పంచ విశ్వేదేవాంశజాః స్మృతాః | కుంతిః సిద్ధి ర్ధృతి ర్మాద్రీ మతిర్గాంధార రాజజా. 40

కృష్ణ పత్న్య స్తథా సర్వ దేవవారాంగనాః స్మృతాః | రాజానశ్చ తథా సర్వే అసురాః శక్రనోదితాః. 41

హిరణ్యకశిపో రంశః శిశుపాల ఉదాహృతః | విప్రచిత్తి ర్జరాసంధః శల్యః ప్రహ్లాద ఇత్యపి. 42

కాలనేమి స్తథా కంసః కేశీ హయశిరా స్తథా | అరిష్టో బలిపుత్త్రస్తు కకుద్మీ గోకులే హతః. 43

అనుహ్రదో ధృష్టకేతు ర్భగదత్తో%థ బాష్కలః | లంబః ప్రలంబసంజాతః ఖరో%సౌ ధేనుకో%భవత్‌. 44

వారాహశ్చ కిశోరశ్చ దైత్యౌ పరమదారుణౌ | మల్లౌ తావేవ సాంజాతౌ ఖ్యాతౌ చాణూరముష్టికౌ. 45

దితిపుత్ర స్తథా%రిష్టో గజః కువల యాభిధః | బలిపుత్త్రీ బకీ ఖ్యాతా బక స్తదనుజః స్మృత. 46

యమో రుద్ర స్తథా కామః క్రోధశ్చైవ చతుర్థకః తేషామంశైస్తు సంజాతో ద్రోణపుత్త్రో మహాబలః. 47

అంశావతరణ పూర్వం దైతేయా రాక్షసా స్తథా | జాతాః సర్వే సురాంశాస్తే క్షితిభారావతారణ. 48

ఏతేషాం కథితం రాజన్నంశావతరణం నృప | సురాణాం చాసురాణాం చ పురాణషు ప్రకీర్తితమ్‌. 49

యదా బ్రహ్మాదయో దేవాః ప్రార్థనార్థం హరింగతాః | హరిణా చ తదా దత్తౌ కేశౌ ఖలు సితాసితౌ. 50

శ్యామవర్ణ స్తతః కృష్ణః శ్వేతః సంకర్షణ స్తథా | భారావతరణార్థం తౌ జాతౌ దేవాంశసంభవౌ. 51

అంశావతరణం చైత చ్ఛృణోతి భక్తి భావతః | సర్వపాపవినిర్ముకో మోదతే స్వజనై ర్వృతః. 52

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ చతుర్థస్కంధే ద్వావింశో%ధ్యాయః.

సోమపుత్త్రుడు సువర్చసుడు. అతడు సోమప్రరు నామమున బరగెను. పావకాంశమున ధృష్టద్యుమ్నుడు రాక్షసాంశమున శిఖండి సనత్కుమారాంశమున ప్రద్యుమ్నుడు వరుణాంశమున ద్రుపదుడు లక్ష్మ్యంశమున ద్రౌపదియు - విశ్వేదేవతలు యంశము వలన ద్రౌపదేయులును జన్మించిరి. కుంతి సిద్ధిరూప - ధృతిరూప మాద్రి. గాంధారి మతిరూప. ఎల్ల దేవవార కాంతలును శ్రీకృష్ణుని భార్యలుగ నుద్భవించిరి. ఈ తీరు నెల్లరాజులు రాక్షసులు నింద్రుని ప్రేరణచే జన్మములు దాల్చిరి. హిరణ్యకశిపుని వంశమున శిశుపాలుడు విప్రచిత్తి వలన జరాసంధుడు ప్రహ్లాదాంశముతో శల్యుడు కాలనేమ్యంశమున కంసుడు హయశిరోంశమున కేశి పుట్టిరి. బలిపుత్రు నంశమున నరిష్టుడను వృషాసురుడు గోకులమందు పుట్టి వారిచే నీల్గెను. అనుహ్రదాంశమున ధృష్టకేతువు బాష్కలు నంశముతో భగదత్తుడు లంబాంశమున ప్రలంబుడు ఖరాంశముతో ధేనుకుడు వరాహ కిశోరు లనబడు దారుణ రాక్షసుల అంశముతో చాణూర ముష్టికులను మహామల్లులు పుట్టిరి. దితిసుతుడగు నరిష్టునంశముతో కువలయమను కంసు నేనుగు బలికూతురు బకిగ నామె సోదరుడు బకుడుగ పుట్టిరి. కామ క్రోధ రుద్ర యమాంశములన్నియు పుణికి పుచ్చుకొని యశ్వత్థామ యుద్భవిల్లెను. ఇట్లు భూభారము తొలగించుట కసురాంశముల వలన పెక్కు దైత్య రాక్షస గణములు పుట్టెను. రాజా! ఇట్లు పురాణములందు కీర్తింపబడిన సురాసురాంశముల యవతారము లెల్ల నీకు తెల్పితిని. పూర్వము బ్రహ్మాది దేవతలు శ్రీహరి ప్రార్థింప నేగిరి. అపుడు హరి వారికి తెలుపు నలుపు వెండ్రుకలు రెండు ఒసంగెను. అందు శ్యామల వర్ణము మేఘశ్యాముడగు శ్రీకృష్ణుడుగ శ్వేతవర్ణము బలరాముడుగ నయ్యెను. ఆ రెండును ఇట్లు శ్రీ మహావిష్ణు నంశమున భూభార ముడుప నవతరించెను. ఏ పరమ భాగవతోత్తముడు ప్రేమభక్తుల నివాళులతో నీదేవాసురుల యంశావతార వర్ణనము వినునో యతడు సర్వపాప విముక్తుడై స్వజనములను గూడి మోదమున నలరారును.

ఇది శ్రీ మద్దేవీ భాగవత చతుర్థ స్కంధమందు దేవదానవాంశావతార వర్ణమను ద్వావింశాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters