Sri Devi Bhagavatam-1    Chapters   

అథ పంచవింశో%ధ్యాయః

వ్యాస ఉవాచ:

 గత్వా%యోధ్యాం నృపశ్రేష్ఠో గృహం రాజ్ఞ స్సుహృద్వృతః | శత్రుజి న్మాతతరం ప్రాహ ప్రణమ్య శోకసంకులామ్‌. 1

మాత ర్నతే మయా పుత్రః సంగ్రామే నిహతః కిల | న పితా తే యుధాజిచ్ఛ శ##పే తే చరణౌ తథా. 2

దుర్గయా తౌ హతౌ సంఖ్యే నాపరాధో మమాత్ర వై | అవశ్యంభావిభావేషు ప్రతీకారో న విద్యతే. 3

న శోకో%త్ర త్వయా కార్యో మృతపుత్రస్య మానిని | స్వకర్మవశగో జీవో భుంక్తే భోగా న్సుఖాసుకాన్‌. 4

దాసో%స్మి తవ భో మాత ర్యథా మమ మనోరమా | తథా త్వమపి ధర్మజ్ఞే ! న భేదో%స్తి మనాగపి. 5

అవశ్య మేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ | తస్మా న్న శోచితవ్యం తే సుఖ దుఃఖే కదాచన. 6

దుఃఖే దుఃఖాదికా న్పశ్యే త్సుభే పశ్యే త్సుఖాదికమ్‌ | ఆత్మానం శోకహర్షాభ్యాం శత్రుభ్యామివ నార్పయేత్‌. 7

దైవాధీన మిదం సర్వం నాత్మాధీనం కదాచన | న శోకేన తదా%త్మానం శోషయే న్మతిమా న్నరః. 8

యథా దారుమయీ యోషా నటాధీనా ప్రచేష్టతే | తథా స్వకర్మవశగో దేహీ సర్వత్ర వర్తతే. 9

అహం వనగతో మాత ర్నాభవం దుఃఖమానసః | చింతయ న్స్వకృతం కర్మ భోక్తవ్య మితి వేద్మి చ. 10

మృతో మాతామహోత్రైవ విధవా జననీ మమ | భయాతురా గృహీత్వా మాం నిర్య¸° గహనం వనమ్‌. 11

ఇరువదియైదవ అధ్యాయము

శ్రీ దుర్గాదేవి ప్రతిష్ఠ

వ్యాసభగవాను డిట్లనియె: ఆ విధముగ తన మిత్రులతో సుదర్శన రాజవరేణ్యు డయోధ్యకేగి శోక సంతప్త యగు శత్రుజిత్తుని తల్లికి ప్రణమిల్లి యామె కిట్లు పలికెను. తల్లీ! నేను నీ తనయునిగాని తండ్రినిగాని రణరంగమున జంపలేదు. నీ పాదములు సాక్షిగ బలుకుచున్నాను. వారు పోరులో శ్రీ దుర్గాదేవి చేతిలో మడిసిరి. ఇందు నా యపరాధ మిసుమంతయును లేదు తప్పక జరుగవలసి జరుగు కార్యముల విషయమున ప్రతీకారమెన్నడును జరుగదు. ఓ మానినీ! ఇంక నీ చచ్చిన కొడుకునకై శోకింపకుము. ప్రాణులు కర్మపరతంత్రులై సుఖ దుఃఖము లనుభవింతురు సుమా! ఓ మాతా! ధర్మజ్ఞులారా! నేను నీకు దాసుడను. నాకు నా తల్లి మనోరమ యెట్లో నీవు నట్టే. మీ యిరువురి పట్ల నాకు భేదభావము లేదు. ప్రాణులు వెనుకటి శుభాశుభము లవశ్య మనుభవించి తీరవలయును. కాన సుఖ దుఃఖములు ప్రాప్తించినపుడు శోకింపదగదు. ఎవ్వడును దుఃఖములందు దుఃఖాదికమును సుఖములందు సుఖాదికమును అనుభవించును కాని దుఃఖము కలిగినపుడు అత్యంత శోకమును సుఖము కలిగినపుడు అధిక హర్షమును పొంది వాటికి లోబడరాదు. ఈ సమస్త బ్రహ్మాండమును దైవాధీనము. ఇందాత్మాధీన మైన దేదియును లేదు. కాన మతిమంతుడగు నరుడు శోకములచే తన యాత్మను శోషింపజేసికొనరాదు. ఒక కట్టెబొమ్మ నటుని చేతిలోబడి యభినయించును. అటుల జీవుడు తాను జేసికొన్ని కర్మకు పరతంత్రుడై ప్రవర్తిల్లును. స్వయంకృత కర్మఫలముల ననుభవింపక తప్పదు. అందువలన నేను వనమందున్నను మనస్సునందు బాధపడలేదు. నా తాత చనిపోయెను. నాతల్లి విధవ యయ్యెను. ఆమె భయాతిరేకమున నన్ను వనములకు కొనిపోయెను.

లుంఠితా తస్కరై ర్మార్గే వస్త్రహీనా తథా కృతా | పాథేయం చ హృతం సర్వ బాలపుత్రా నిరాశ్రయా. 12

మాతా గృహీత్వా మాం ప్రాప్తా భారద్వాజాశ్రమం ప్రతి| విదల్లో%యం సమాయాత స్తథాత్రేయికా%బలా. 13

మునిభి ర్మునిపత్నీ భిర్దయాయుకైః సమంతతః | పోషితాః ఫలనీవారై ర్వయం తత్ర స్థితా స్త్రయః. 14

దుఃఖం న మే దతా హ్యాసీత్సుఖం నాద్య ధనాగమే | న వైరం న చ మాత్సర్యం మమ చిత్తే తు కర్హిచిత్‌. 15

నీవార భక్షణం శ్రేష్ఠం రాజభోగా త్పరంతపే| తదాశీ నరకం యాతి న నీవారాశనః క్వచిత్‌. 16

ధర్మస్యాచరణం కార్యం పురుషేణ విజానతా | సంజిత్యేంద్రియవర్గం వై యథా న నరకం వ్రజేత్‌. 17

మానుష్యం దుర్లభం మాతః ఖండే%స్మి న్భారతే శుభే | ఆహారాదిసుఖం నూనం భ##వేత్సర్వాసు యేనిషు. 18

ప్రాప్య తం మానుషం దేహం కర్తవ్యం ధర్మసాధనమ్‌ | స్వర్గమోక్షప్రదం నౄణాం దుర్లభం చాన్యయోనిషు. 19

ఇత్యుక్తా సా తదా తేన లీలా వత్య తిలజ్జితా | పుత్రశోకం పరిత్యజ్య తమా హాశ్రువిలోచనా. 20

సా% పరాధా%స్మి పుత్రాహం కృతా పిత్రా యుధాజితా | హత్వా మాతామహంతే%త్రహృతం రాజ్యం తు యేన వై. 21

న తం వారయితుం శక్తా తదా%హం న సుతం మమ| యత్కృతం కర్మతేనైవ నాపరాధో%స్తి మే సుతే. 22

తా మృతౌ స్వకృతేనైన కారణం త్వంతయోర్నచ | నాహం శోచామి తం పుత్రం సదా శోచామి తత్కృతమ్‌. 23

పుత్ర స్త్వమసి కల్యాణ: భగినీ మే మనోరమా | న క్రోధో న చ శోకో మే త్వయి పుత్రః మనాగపి. 24

కురు రాజ్యం మహాభాగ! ప్రజాః పాలయ సువ్రత| భగవత్యాః ప్రసాదేన ప్రాప్త మేత దకంటకమ్‌. 25

ఆమె తన సర్వస్వమును ముష్కరుల వలన గోలుపోయినది. ఆమె బాలపుత్రయై నిరాశ్రయురాలై పెక్కు వస్త్రములు లేనిదై యుండెను. నా తల్లి నన్ను భారాద్వాజాశ్రమమునకు గొనిపోయినది. మావెంట విదల్లుడును నొక దాదియు నేతెంచిరి. అచ్చట మేము మువ్వురమును మునులును మునిపత్నులు నొసంగిన పండ్లును నీవారాన్నములును దిని వారిచే బోషింపబడితిమి. ఆ పవిత్ర స్థలమునందు నా నిర్మల చిత్తమందు ధనము వలని సుఖముగాని లేమి వలని దుఃఖముగాని వైరద్వేషములుగాని లేవు. రాజభోగముల కన్న నీవారాన్న భోజనములు మేలైనవి. రాజభోగి తుదకు నరకమేగును. కాని, నీవారన్నములు దిన్నవాడు జనడు. పండితుడైన పురుషుడు ధర్మాభ్యుదయము గల్గింప వలయును. అత డింద్రియ వర్గమును జయింపవలయును. అట్టివాడు నరకమున పతనము బొందడు. ఎల్ల ప్రాణులకు నాహార విహారముల వలన సౌఖ్యము చేకూరును. కాని, యీ పవిత్ర భరత ఖండమునందు మనుజజన్మము లభించుటచే మాత్రము ఇతర జన్మములందు కడుంగడు దుర్లభమగు మోక్షము లభించును. అట్టి సదుర్లభ##మైన నరజన్మ మెత్తినవాడు తప్పక ధర్మసమాచరణము జరుపవలయును. ఈ నరజన్మము స్వర్గమోక్షములకు చక్కని రాజమార్గము. ఇది యితర జంతువుల కసాధ్యమైనది. ఇట్లు సుదర్శను నోదార్పు మాటలకు లీలావతి లజ్జించి పుత్రశోకము వీడియు కన్నీరు గార్చుచు నతని కిట్లనియెను నా తండ్రీ యుధాజిత్తు. అతడు నీ తాతను జంపెను. నీ రాజ్య మపహరించెను. పుత్రా! నన్నీ దుఃస్థితి పాలుచేసెను. ఆనాడు నేను నా తండ్రిని నా కొడుకును వారింపలేక పోతిని. అతడు చేసిన పనిలో నా దోష మేమియును లేదు. వారు స్వయంకృతాపరాధమున మడిసిరి. అందులకు నీవు కారణము గావు. నా పుత్రుని గూర్చి నేను శోకించుటలేదు. అతని చెడునంతకు కుందుచున్నాను. పుత్త్రా! నీవు నాకు తనయుడవు. మనోరమ నా సోదరి. నీ మీద నాకు కోపతాపము లెంత మాత్రము లేవు. నీవు చక్కగ రాజ్యమేలుము. ప్రజలను కన్నబిడ్డలను వలె బాలింపుము. నీకీ నిష్కంటక రాజ్యము భగవతి కరుణ వలన సంప్రాప్తించినది.''

తదాకర్ణ్య వచో మాతు ర్నత్వా తాం నృపవందనః | జగామ భవనం రమ్యం యత్ర పూర్వం మనోరమా. 26

న్యవస త్తత్త్ర గత్వా తు సర్వా నాహూయ మంత్రిణః | దైవజ్ఞా నత పప్రచ్ఛ ముహూర్తం దివసం శుభమ్‌. 27

సింహాసనం తథా హైమం కారయిత్వా మనోహరమ్‌ | సింహాసనే స్థితాం దేవీం పూజయిష్యే సదా%ప్యహమ్‌. 28

స్థాపయిత్వా%%సనే దేవీం ధర్మార్థ కామమోక్షదామ్‌ | రాజ్యం వశ్చా త్కరిష్యామి యథా రామాదిభిః కృతమ్‌. 29

పూజనీయా సదా దేవీ సర్వైర్నాగరకైర్జనైః | మాననీయా శివాశక్తిః సర్వ కామార్థ సిద్ధిదా. 30

ఇత్యుక్తా మంత్రిణస్తే తు చక్రుర్వై రజా శాసనమ్‌ | ప్రాసాదం కారయామానుః శిల్పిభిః సుమనోరమమ్‌. 31

ప్రతిమాం కారయిత్వా%థ ముహూర్తే%థ శుభే దినే | ద్విజా నాహూయ వేదజ్ఞా న్ధ్సాపయామాస భూపతిః. 32

హవనం విధివ త్కృత్వా పూజయిత్వా%థ దేవతామ్‌ | ప్రాసాదే మతిమాన్దేవ్యాః స్థాపయామాస భూమిపః 33

ఉత్సవ స్తత్ర సంవృత్తో వాదిత్రాణాం చ నిః స్వనైః | బ్రామ్మణానాం వేద ఘోషై ర్గానైస్తు వివిధైర్నృపః 34

అను తల్లి మాటలు విని సుదర్శనుడామెకు నమస్కరించెను. ఆ పిదప మనోరమ మునుపు వసించిన రమ్య హర్మ్యమున కేగెను. సుదర్శను డందుండి యెల్ల మంత్రులను దైవజ్ఞులను రావించి వారికొక శుభముహూర్తము చూడుడనెను. నేనొక బంగారు గద్దె చేయింతును. దానిపై శ్రీదేవిని ప్రతిష్ఠ చేతును. మనము నిత్య మా దేవిని బూజింపవలయును. పూర్వము శ్రీరామచంద్రులు ధర్మార్థ కామమోక్షదాయిని యగు భగవతి నున్నత పీఠముపై ప్రతిష్ఠించి పూజించిరి. నేను నట్లు చేసి పిదప రాజ్యమేలుదును. ఆ దేవి శివాశక్తి - వాంఛితార్థ సిద్ధిద. అట్టి జగదంబను నాగరికజనులు భక్తి ప్రపత్తులతో ప్రతినిత్యము పూజించవలయుననియు సుదర్శనుడు పలికెను. అపుడు మంత్రులు రాజశాసనములను తలదాల్చిరి. వారు శిల్పివరులచేత సుందర దేవీమందిరము నిర్మింపజేసిరి. సుదర్శనుడు చైతన్యముట్టిపడు దేవీ విగ్రహమును సిద్ధము చేసెను. వేదవిదులగు బ్రాహ్మణులను రావించెను. ఒక సుముహూర్తమున శ్రీదేవీ ప్రతిష్ఠ జరిపించెను. ఆ మతిమంతుడు యథావిధిగ శ్రీ మద్దేవీ యాగము జరిపించెను. సురలను బూజించెను. దివ్య పీఠముపై పరాశక్తిని ప్రతిష్టించెను. ఆ దేవీ ప్రతిష్ఠామహోత్సముల విప్రుల వేదఘోషలతో దివ్యగానములతో వాద్యనిస్వనములతో కనులకు చెవులకు పండువుగ నుండెను.

ప్రతిష్ఠాప్య శివాం దేవీం విధివ ద్వేదవాదిభిః | పూజాం నానావిధాం రాజా చకారాతివిధానతః. 35

కృత్వా పూజావిధిం రాజా రాజ్యం ప్రాప్య స్వపైతృకమ్‌ | విఖ్యాత శ్చాంబికా దేవీ కోసలేషు బభూవ హ. 36

రాజ్యం ప్రాప్య నృపః సర్వ సామంతక నృపా నథ | వశే చక్రే%తి ధర్మిష్ఠా న్స ధర్మ విజయీ నృపః 37

యథా రామః సర్వరాజ్యే%భూ ద్దిలీపస్య రఘుర్యథా | ప్రజానాం వై సుఖం తద్వన్మర్యాదా%పి తథా%భవత్‌. 38

ధర్మా వర్ణాశ్రమాణాం చ చతుష్పాదభవత్తథా | నాధర్మే రమతే చిత్తం కేషామపి మహీతలే. 39

గ్రామే గ్రామే చ ప్రాసాదాం శ్చక్రుః సర్వే జనాధిపాః | దేవ్యాః పుజా తదా ప్రీత్యా కోసలేషు ప్రవర్తితా. 40

సుబాహు రపి కాశ్యాంతు దుర్గాయాః ప్రతిమాం శుభామ్‌ | కారయిత్వా చ ప్రాసాదం స్థాపయామాస భక్తితః. 41

తత్ర తస్యా జనాః సర్వే ప్రేమభక్తి పరాయణాః| పూజాం చక్రుర్వి ధానేన యథా విశ్వేశ్వరస్య హ. 42

విఖ్యాతా సా బభూవాథ దుర్గాదేవీ ధరాతలే | దేశే దేశే మహారాజః తస్యాం భక్తి ర్వ్యవర్థత. 43

సర్వత్ర భారతే లోకే సర్వవర్ణేషు సర్వథా | భజనీయో భవానీ తు సర్వేషా మభవ త్తదా. 44

శక్తి భక్తిరతాః సర్వే మానిన శ్చాభవ న్నృప | ఆగమోక్తై రథ స్తోత్రై ర్జపధ్యాన పరాయణాః. 45

నవరాత్రేషు సర్వేషు చక్రుః సర్వే విధానతః | అర్చనం హవనం యాగం దేవ్యా భక్తి పరా జనాః. 46

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ తృతీయస్కంధే పంచవింశో%ధ్యాయః.

ఆ విధముగ సుదర్శనుడు వేదవిదుల వలన శ్రీదేవిని ప్రతిష్ఠించి విధి విధానమున నానావిధ పూజలు జరిపించెను. అట్లు సుదర్శనుడు పూజా విధులు సమాచరించి తన పైతృక రాజ్యము బడసెను. ఇట్లంబికాదేవి కోసల దేశమున విఖ్యాతి నందెను. అట్లు ధర్మవిజయుడగు సుదర్శనుడు రాజ్యము బడసి ధర్మిష్ఠులగు సకల సామంతులను తనకు వశుల జేసికొనెను. శ్రీ దిలీపుడు రఘువు శ్రీరాముడు పరిపాలించిన రాజ్యములోని ప్రజ లెట్లుండిరో సుదర్శనుని పాలనలోని ప్రజలు నట్లు సుఖ సంపన్నులై విలసిల్లిరి. అతని యేలుబడిలో వర్ణాశ్రమాదుల ధర్మము నాలుగు పదములతో ప్రవర్తిల్లెను. ప్రతివాడును ధర్మతత్పరుడై యుండెను. ఆనాటినుండి గ్రామగ్రామమున దేవీమందిరములు వెలసినవి. ఇట్లు కోసలదేశమున శ్రీ భగవతీ పూజ విరివిగా జరుగుచుండెను. కాశియందు సుబాహువును భక్తి భావములతో శ్రీ దుర్గా విగ్రహము చేయించెను. దేవీ మందిరము నిర్మింపజేసెను. అందా దేవిని ప్రతిష్ఠించెను. అచటి భక్తులెల్లరును భక్తి పరాయణులై శ్రీ విశ్వేశ్వరుని పూజించు విధముగ శ్రీ దుర్గాదేవిని యథావిధిగ బూజించుచుండిరి. ఈ విధముగ భూమిపై శ్రీ దుర్గాదేవి విలసిల్లినది. ఈ రీతిగ దేవీభక్తి దేశ##దేశముల వ్యాపించెను. ఆనాటినుండి యావద్భారతమున భూలోకమందంతటను నెల్ల వారికెల్ల భంగుల భగవతీ దేవి పూజింపదగినదయ్యెను. కొందఱు భక్తి యుక్తులై యాగమప్రోక్తములైన స్తోత్రములతో జపధ్యాన పరాయణులై దేవిని గొలుచు చుండిరి. దేవీభక్తులెల్లరును శ్రద్ధాభక్తులతో శ్రీ మద్దేవీయాగములును సమారాధనములును జరుపుచుండిరి అని వ్యాసముని జనమేజయునకు తెలిపెను.

ఇది శ్రీ మద్దేవీభాగవతమందలి తృతీయస్కందమం దిరువది యైదవ అధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters