Sri Devi Bhagavatam-1    Chapters   

అథ అష్టాదశో%ధ్యాయః

జనమేజయః : ఇతి శప్తా భగవతా సింధుజా కోపయోగతః | కథం సా బడబా జాతా రేవంతేన చకిం కృతమ్‌. 1

కస్మి న్దేశే%బ్ధిజా దేవీ బడబారూపధారిణీ | సంస్థితైకాకినీ బాలా పరోషిత్పతికా యథా. 2

కాలం కియంత మాయుష్మ న్వియుక్తా పతినా రమా | సంస్థితా విజనే%రణ్య కిం కృతం చ తయా పునః. 3

సమాగమం కదా ప్రాప్తా వాసుదవేస్య సింధుజా | పుత్రః కథం తయా ప్రాప్తో నారాయణ వియుక్తయా. 4

ఏతద్వృత్తాంత మార్యేశ కథయస్వ సవిస్తరమ్‌ | శ్రోతుకామో%స్మి విప్రేంద్ర కథాఖ్యాన మనుత్తమమ్‌. 5

ఇతిపృష్ట స్తదా వ్యాసః పరీక్షిత్తనయేనవై | కథ యామాస భోవిప్రాః కథామేతాం సువిస్తరామ్‌. 6

శృణురాజ న్ర్పవక్ష్యామి కథాంపౌరాణికీంశుభామ్‌ | పావనీం సుఖదాం కర్ణే విశదాక్షరసంయుతామ్‌. 7

రేవంత స్తు రమాం దృష్ట్వా శప్తాం దేవేన కామినీమ్‌ | భయార్తః ప్రయ¸° దూరాత్ర్పణమ్య జగతాంపతిమ్‌. 8

పితుః సకాశం త్వరితో వీక్ష్య కోపం జగత్పతేః | నివేదయామాస కథాం భాస్కరాయ స శాపజామ్‌. 9

దుఃఃతా సారమా దేవీ ప్రణమ్య జగదీశ్వరమ్‌ | ఆజ్ఞప్తా మానుషం లోకం ప్రాప్తా కమలలోచనా. 10

సూర్యపత్న్యా తపస్తప్తం యత్ర పూర్వ సుదారుణమ్‌ | తత్రైవ సా యయావాశు బడబారూపధారిణీ. 11

కాళిందీమసాసంగే సువర్ణాక్షస్య చోత్తరే | సర్వకామప్రదే స్తానే సురమ్యవనమండితే. 12

పదుఎనిమిదవధ్యాయము

హైహయ చరిత్ర

అట్లు శ్రీ మహావిష్ణువు కోపముతో లక్ష్మిని శపింపగ నామె యిట్లు గుఱ్ఱమయ్యెను. ఆ రేవంతు డేమయ్యెను? ఏ యువతియైన తన పతి విదేశములనుండగ విరాళిచే కుందును. అటులే లక్ష్మియే దేశమున నాడు గుఱ్ఱమై యొంటిగ బాధ పడెను? లక్ష్మీదేవి యెంతకాల మొంటరిగ నిర్జన ప్రదేశమున నుండెను. ఆ పిమ్మట నామె యేమి చేసెను? శ్రీమన్నారాయణుడు లక్ష్మి చెంత లేడుగదా! ఆమెకెట్లు పుత్రుడుదయించెను? ఆమె తిరిగి శ్రీహరినెట్లు కలిసికొనెను? ఈ లక్ష్మీనారాయణుల చరిత మంతయు విన వేడుకగ నున్నది. దానినంతయు నాకు విశదీకరింపుము అని జనమేజయుడు ప్రశ్నింపగా వ్యాసు డా కథ యంతయు చక్కగ నిట్లు వివరింప దొడగెను. ఓ జనమేజయా ! ఈ పురాణగాధ చెవులకింపుగొల్పును. పవిత్రమైనది. దీనిని లలితాక్షరములతో వినిపింతును చక్కగ వినుము. అట్లు హరిచే లక్ష్మి శపింపబడుట రేవంతుడుగాంచెను. అతడు భయమున హరికి మ్రొక్కి యచ్చోటు విడిచి వెళ్ళి వెంటనే తన తండ్రి చెంతకేగి యతనితో లక్ష్మిని హరి శపించిన విధానమంతయు వెల్లడించెను. రమాదేవియు చేయునదిలేక వగచుచు హరికి చేతులు మోడ్చి యతని యనుమతితో మనుజలోకమునకు వచ్చెను. పూర్వము సూర్యపత్ని యెచ్చోట తీవ్రతప మొనర్చెనో యచ్చోట లక్ష్మి గుఱ్ఱపు రూపు దాల్చి చేరెను. ఆ చోటు సువర్ణ గిరికి నుత్తరముగ కాళిందీ తమసానదుల తటమున సుందరవనములతో నొప్పారుచుండెను.

తత్ర స్థితం మహాదేవం శంకరం వాంఛిత ప్రదమ్‌ | ద ధ్యౌ చైకేన మనసా శూలినం చంద్రశేఖరమ్‌. 13

పంచాననం దుశభుజం గౌరీదేహార్ధ ధారిణమ్‌ | కర్పూరగౌరదేహాభం నీలకంఠం త్రిలోచనమ్‌. 14

వ్యాఘ్రాజినధరం గజచర్మోత్తరీయకమ్‌ | కపాలమాలాకలితం నాగయజ్ఞోపవీతినమ్‌. 15

సాగరస్య సుతా కృత్వా హయీరూపం మనోహరమ్‌ | తస్మిం స్తీర్థే రమాదేవీ చకార దుశ్చరం తపః. 16

ధ్యాయమానా పరం దేవం వైరాగ్యం సముపాశ్రితా | దివ్యం వర్షసహస్రం తు గతం తత్ర మహీపతే. 17

తత స్తుష్టో మహాదేవో వృషారూఢ స్త్రిలోచనః | ప్రత్యక్షో%భూ న్మహేశానః పార్వతీసహితః ప్రభుః 18

తత్రైత్య సగణః శంభు స్తామాహ హరివల్లభామ్‌ | తపస్యంతీం మహాభాగా మశ్వినీరూపధారిణీమ్‌. 19

కిం తపస్యసి కళ్యాణి! జగన్మాతర్వదస్వమే | సర్వార్థదః పతిస్తే%స్తి సర్వలోకవిధాయకః. 20

హరిం త్యక్త్వా%ద్య మాం కస్మాత్త్సౌషి దేవి జగత్పతిమ్‌ | వాసుదేవం జగన్నాథం భుక్తి ముక్తి ప్రదాయకమ్‌. 21

వేదోక్తం వచనం కార్యం నారీణాం దేవతా పతిః | నాన్యస్మి న్త్సర్వథాభావః కర్తవ్యః కర్హిచిత్క్వచిత్‌. 22

పతిశుశ్రూషణం స్త్రీణాం ధర్మ ఏవ సనాతనః | యాదృశ స్తాదృశః సేవ్యః సర్వథా శుభకామ్యయా. 23

నారాయణ స్తు సర్వేషాం సేవ్యో యోగ్యః సదైవహి | తం త్యక్త్వా దేవదేవేశం కిం మాం ధ్యాయసి సింధుజే. 24

ఆమె యచట శ్రీచంద్రశేఖరుడు - త్రిశూలి - కామప్రదుడు - మహా దేవుడు - నగు శంకరుని గుఱించి యేకాగ్రచిత్తముతో ధ్యానించెను. పరమశివుడు పంచాననుడు - త్రిలోచనుడు - దశభుజుడు - అర్ధనారీశ్వరుడు - నీలకంధరుడు. కర్పూర గౌర శరీరుడు - శివుడు, పులితోలుదాల్పు - గజచర్మోత్తరీయుడు - నాగయజ్ఞోపవీతి - కపాల మాలాధరుడు - అట్టి శంకరుని గుఱించి యా పుణ్యతీర్థమున హయరూపము దాల్చిన లక్ష్మి తీవ్రతపమొనరించెను. ఆ విధముగ రమాదేవి వైరాగ్యముతో పరమశివుని ధ్యానించుచుండగ వేయి దివ్యవర్షములు గడచెను. మహాదేవుడు - పశుపతి - ముక్కంటి - మహేశ్వరుడునగు శివుడు పార్వతీ సహితముగ వృషవాహనమెక్కి యామెకు ప్రత్యక్షమయ్యెను. శివుడు ప్రమథగణసమేతముగ యశ్వినీరూపమున తపమొనరించు హరివల్లభతో నిట్లనెను : కళ్యాణీ! జగన్మాతా! నీ పతి సకలలోకపతి సర్వార్థప్రదాయకుడు. మఱి నీవేల యిట్లు తపించుచున్నావో తెలుపుము. దేవీ! జగన్నాధుడు భుక్తి ముక్తి ప్రదుడు. అట్టి జగత్పతియైన వాసుదేవుని వదలి నన్నేల స్తుతించుచున్నావు? ప్రతివారును పుణ్యశ్లోకము దివ్యమునైన వేదవాక్కు పాటించవలయును. సతులకు పతియే పరమదైవము. కనుకనే యువతియు నితరునందెన్నడును తన మనస్సునుంచరాదు. ఎల్ల స్త్రీలకు పతిసేవయే పరమము; స్వధర్మము. తన మేలుగోరుకొను ప్రతి యువతియు తన పతి యెట్టివాడైన నతని నెల్లరీతుల గొలువవలయును. సింధు తనయా! నారాయణు డెల్లవారికి సంసేవ్యుడు యోగ్యుడు పురుషోత్తముడు. అట్టి దేవదేవేశుని విడనాడి నన్నేల ధ్యానించుచున్నావు?

లక్ష్మీరువాచ : ఆశుతోష మహేశాన శప్తా%హం పతినా శివ | మాం సముద్ధర దేవేశ శాపా దస్మా ద్దయానిధే. 25

తదోక్తం హరిణా శంభో శాపానుగ్రహకారణమ్‌ | విజ్ఞప్తేన మయా కామం దయాయుక్తేన విష్ణునా. 26

యదా తే భవితా పుత్ర స్తదా శాపస్య మోక్షణమ్‌ | భవిష్యతి చ వైకుంఠవాస స్తే కమలాలయే. 27

ఇత్యుక్తా%హం తపస్తప్తు మాగతాస్మి తపోవనే | ఆరాధితో మయా దేవ త్వం సర్వార్థ ప్రదాయకః. 28

పతిసంగం వినా పుత్రం దేవదేవ లభే కథమ్‌ | స తు తిష్ఠతి వైకుంఠే త్యక్త్వా వామా మనాగసమ్‌. 29

వరం మే దేహి దేవేశ యది తుష్టో%సి శంకర | తవ తస్య ద్విధా భావో నాస్తి నూనం కదాచన. 30

మయైత ద్గిరిజాకాంత జ్ఞాతం పత్యుః వురాహర | య స్త్వం యో%సౌ పునర్యో%సౌ సత్వం నాస్త్యత్రసంశయంః. 31

ఏకత్వం చ మయా జ్ఞాత్వామయాతే స్మరణం కృతమ్‌ | అన్యథా మమ దోష స్త్వామాశ్రయంత్యా భ##వేచ్ఛివ. 32

శివః - కథం జ్ఞాత స్త్వయాదేవి మమతస్య చ సుందరి | ఐక్యభావో హరే ర్నూనం సత్యం మే వద సింధుజే. 33

ఏకత్వం చ న జానంతి దేవాశ్చ మునయస్తథా | జ్ఞానినో వేదతత్త్వజ్ఞాః కుతర్కోపహతాః కిల. 34

మద్భక్తా వాసుదేవస్య నిందకా బహవస్తథా | విష్ణు భక్తాస్తు బహవో మమ నిందాపరాయణాః. 35

భవంతి కాలభేదేన కదా దేవి విశేషతః | కథం జ్ఞాత స్త్వయా భ##ద్రే దుర్జే యోహ్య కృతాత్మభిః. 36

సర్వథా త్వైక్యభావస్తు హరే ర్మమ చ దుర్లభః | ఇతి సా శంభునా పృష్టా తుష్టేణ హరివల్లభ. 37

వృత్తాంతం తస్య విజ్ఞాతం ప్రవక్తు ముపచక్రమే | శివం ప్రతిరమా తత్ర ప్రసన్నవదనాభృశమ్‌. 38

అన లక్ష్మి ఇట్లనెను : శంభూ! దయాళూ! దేవేశా! ఈశా! మహేశా! నా పతి నన్ను శపించెను. కనుక నీవు నన్నీ శాపమునుండి సముద్ధరింపుము. నేను సవినయముగ హరిని ప్రార్థింప నతడు దయతో నాకు శాపమోక్ష మీరీతిగ దెలిపెను. 'ఓ కమలాలయా! నీకు పుత్రుడు గల్గినపుడు శాపమోచనము గల్గును. అపుడు నీవు తిరిగి వైకుంఠమందు నివసింపగలవు'' అని హరి యనగనే నేను తపము చేయుటకీ తపోవనము జేరితిని. నీవు సర్వకామప్రదుడవు. కనుక నిన్నే యారాధించుచున్నాను. దేవదేవా! భర్తతో సంగమము లేక పుత్రునెట్లు పడయగలను? నేను నిరపరాధను. నా పతి నన్ను వదలి వైకుంఠమందున్నాడు. శంకరా! నీవు సుప్రసన్నుడవైనచో నాకు కామ్యవరమొసంగుము. నీకును శ్రీహరికిని భేదభావమెందును లేదు. గిరిజామనోహరా! పూర్వము నా పతి వలన శివుడే విష్ణువు - విష్ణువే శివుడని యెఱింగితిని. ఇందు సందియమేమియు లేదు. నేను మీ యిర్వురిలో నొక్కరూపు గాంచితిని. కనుక నిన్నే స్మరించుచున్నాను. అది తెలియక నిన్నాశ్రయించినచో నాకు దోషము గల్గును. శివుడిట్లనెను : క్షీరసముద్రరాజతనయా! సుందరీ! శ్రీహరికి నాకు గల యేకత్వమెట్లెఱుంగ గల్గితివో నిక్కము పలుకుము. మునులు - సురలు - వేదతత్త్వము తెలిసిన జ్ఞానులును - మా యేకత్వమెఱుంగలేరు. వారు కుతర్కములకు లోనగుదురు. నా భక్తులలో పెక్కురు తెలియక వాసుదేవుని నిందింతురు. విష్ణు భక్తులలో పల్వురు నన్ను తెగడుదురు. దేవీ! మూర్ఖులు కలికాలమున కాలయోగమున మమ్మెక్కువగ ద్వేషింతురు. మా యేకత్వము మహోదారులకును తెలియరాదు. నీ వెట్లెఱిగితివి? కనుక మా యిర్వురి ఏకత్వ మెఱుగుట కడు దుర్లభము అని శంభుడు లక్ష్మితోనన రమాదేవి ప్రసన్నవదనముతో శివునితో నీ విధముగ చెప్పసాగెను :

ఏకదా దేవదేవేశ విష్ణు ర్ధ్యానపరో రహః | దృష్టో మయా తపః కుర్వన్పద్మాసనగతో యదా. 39

తదా%హం విస్మితా దేవం తమపృచ్ఛం పతిం కిల| ప్రబుద్ధం సుప్రసన్నం చ జ్ఞాత్వా వినయపూర్వకమ్‌. 40

దేవదేవ జగన్నాథ యదా%హం నిర్గతా%ర్ణవాత్‌ | మథ్యమానా త్సురైర్దైత్యైః సర్వై ర్ర్బహ్మాదిభిః ప్రభో. 41

వీక్షితా శ్చ మయా సర్వే పతికామనయా తదా | వృతస్త్వం సర్వ దేవేభ్యః శ్రేష్ఠో%సీతి వినిశ్చయాత్‌. 42

త్వం కం ధ్యాయసి సర్వేశ సంశయో%యం మహాన్మమ | ప్రియోసి కైటభారే మే కథయస్వ మనోగతమ్‌. 43

విష్ణు రువాచ : శృణు కాంతే ప్రవక్ష్యామి యం ధ్యాయామి సురోత్తమమ్‌ |

ఆశుతోషం మహేశానం గిరిజావల్లభం హృది. 44

కదాచి ద్దేవదేవో మాం ధ్యాయత్యమితవిక్రమః | ధ్యాయా మ్యహం చ దేవేశం శంకరం త్రిపురాంతకమ్‌. 45

శివస్యాహం ప్రియః ప్రాణః శంకరస్తు తథా మమ | ఉభయో రంతరం నాస్తి మిథః సంసక్త చేతసోః. 46

నరకం యాంతి తే నూనం యే ద్విషంతి మహేశ్వరమ్‌ | భక్తా మమ విశాలాక్షి సత్యమేత ద్ర్బవీమ్యహమ్‌. 47

ఇత్యుక్తం దేవదేవేన విష్ణునా ప్రభవిష్ణునా | ఏకాంతే కిల పృష్ణేన మయా శైలసుతాప్రియ. 48

లక్ష్మి యిట్లనెను : దేవదేవా! మున్నొకప్పుడు విష్ణువు పద్మాసనమందుండి యేకాంతమున పరమధ్యానపరుడై యుండుట గాంచితిని. కొంతవడికి హరి ధ్యానము చాలించి సుప్రసన్నుడయ్యెను. అపుడు నేను నా పతిని సవినయముగ నిట్లు ప్రశ్నించితిని : దేవదేవా! ప్రభూ! పూర్వము దేవదానవులు సాగరమును చిలుకగ నేనందుండి యుద్భవించితిని. అచట బ్రహ్మాది సురలుండిరి. వారు పతినెన్నుకొనుచున్న నన్ను గాంచిరి. వారిలో నీవు సర్వశ్రేష్ఠుడవై యుండుట వలన నేను నిన్నే వరించితిని. అట్టి సర్వేశ్వరుడువగు నీ విపుడెవరిని ధ్యానించుచున్నావు? నీ మనోగత మేదియో తెలుపుము. నీవు నాకత్యంతము ప్రియతముడవు అనగా విష్ణు విట్లనెను : 'కాంతా! వినుము. నేను నెమ్మదిలో గిరిజాపతి - శీఘ్రసంతోషి - సురోత్తముడు నగు శివుని ధ్యానించుచున్నాను. ఒక్కొక్కప్పుడు మహావిక్రముడగు మహాదేవుడు సైతము నన్ను ధ్యానించును. నేనును త్రిపురహరుడు దేవేశుడు శంకరుడు నగు హరుని ధ్యానింతును. ఆ శంకరునకు నేను ప్రాణ ప్రియుడను. అతడు నాకు నంతియే. మా యిర్వురి చిత్తములు గాఢముగ నొకటిగనుండును. మాలో మాకు భేదము లేదు. విశాలాక్షీ! అట్టి మహాదేవుని ద్వేషించు భక్తులు తప్పక నరకమున గూలుదురని నీతో నిజము పల్కుచున్నాను.'' నేనేకాంతమున నడిగిన ప్రశ్నమునకు ప్రభవిష్ణువగు విష్ణువు నాతో నట్లు పలికెను.

తస్మా త్త్వాం వల్లభం విష్ణోర్జాత్వా ధ్యాతవతీహ్యహమ్‌ | తథా కురు మహేశాన యథా మే ప్రియసంగమః. 49

ఇతి శ్రియోవచః శ్రుత్వా ప్రత్యువాచ మహేశ్వరః | తామాశ్వాస్య ప్రియైర్వాక్యై ర్యథార్థం వాక్యకోవిదః. 50

స్వస్థా భవ పృథు శ్రోణితుష్టో%హం తపసా తవ | సమాగమ స్తే పతినా భవిష్యతి న సంశయః. 51

అత్రైవ హయరూపేణ భగవాన్‌ జగదీశ్వరః | ఆగమిష్యతి తే కామం పూర్ణం కర్తుం మయేరితః. 52

తథా%హం ప్రేరయిష్యామి తం దేవం మధుసూదనమ్‌ | యథా%సౌహయరూపేణ త్వా మేష్యతి మదాతురః. 53

పుత్రస్తే భవితా సుభ్రు నారాయణ సమః క్షితౌ | భవిష్యతి స భూపాలః సర్వలోక నమస్కృతః. 54

సుతం ప్రాప్య మహాభాగే త్వం తేన పతినా సహ | గంతాసి దివి వైకుంఠం ప్రియా తస్య భవిష్యతి. 55

ఏకవీరేతి నామ్నా%సౌ ఖ్యాతిం యాస్యతి తే సుతః | తస్మాత్తు హైహయోవంశో భువి విస్తార మేష్యతి. 56

పరంతు విస్మృతా%సిత్వంహృదిస్థాం పరమేశ్వరీమ్‌ | మదాంధా మత్తచిత్తా చ తేన తేఫల మీదృశమ్‌. 57

అతస్తద్దోషశాంత్యర్థం హృదిస్థాం పరదేవతామ్‌ | శరణం యాహి సర్వాత్మభావేన జలధేః సుతే. 58

అన్యథా తప చిత్తంతు కథం గచ్ఛే ద్ధయోత్తమే | ఇతి దత్వావరం దేవై భగవాన్‌ శైలజాపతిః. 59

అంతర్ధానం గతః సాక్షాదుమయా సహితః శివః | సా%పి తత్రైవ చార్వంగీ సంస్థితా కమలాసనా. 60

ధ్యాయంతీ చరణాంభోజం దేవ్యాః పరమశోభనమ్‌ | దేవాసుర శిరోరత్న నిఘృష్ట నఖ మండలమ్‌. 61

ప్రేమగద్గదయా వాచా తుష్టావ చ ముహుర్ముహుః | ప్రతీక్షమాణా భర్తారం హయరూపధరం హరిమ్‌. 62

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ షష్ఠస్కంధే%ష్టాదశో%ధ్యాయః.

కనుక నీవు విష్ణువునకు ప్రియుడవని యెఱిగి నిన్నే ధ్యానించుచున్నాను. మహేశా! నాకు నా ప్రియునితో సంగము గల్గునట్టు లొనరింపుము అని లక్ష్మి పలుకగ విని వాక్యవిశారదుడగు శివుడు మధుర ప్రియవచనములతో లక్ష్మి నూరార్చి యిట్లనెను : నితంబినీ! నీ తపమునకు మెచ్చితిని. ఇక నిశ్చింతగ నుండుము. నిన్ను నీ ప్రియునితో తప్పక చేర్పగలను. నా ప్రేరణ వలన జగన్నాథుడగు భగవానుడు గుఱ్ఱమురూపము దాల్చి నీ మమతలు పండింప నిచటికి రాగలడు. మధుసూదనుడు హయరూపమున మదాతిరేకమున పరవళ్ళు ద్రొక్కుచు వచ్చి నిన్ను గలియు విధముగ నే నతనిని ప్రేరింతును. సుముఖీ! నీకంతట నారాయణుని వంటి పుత్రుడు గల్గును. అతడీ నేలపై భూపాలుడై యెల్లలోకములకు వందనీయుడు కాగలడు. సౌభాగ్యవతీ! అట్లు నీవు పుత్రునిబడసి పిదప నీ పతితో వైకుంఠమేగి విష్ణుప్రియవుగాగలవు. ఆ నీ కుమారు డేకవీరుడను పేర వన్నె గాంచును. అతని మూలమున భూమిపై హైహయ వంశము విస్తరిల్లును. నీవు మదాంధురాలవై మత్తచిత్తవై నీ హృదయపీఠమందున్న శ్రీమాతయగు పరమేశ్వరిని మఱచితివి. కనుక నిట్టి క్లేశములు పడితివి. త్రైలోక్య కుటుంబినీ! ఆ దోషముల శాంతికి నీ హృదయకమలకోశమందలి పరాదేవతను సర్వాత్మ భావమున శరణు పొందుము. ఆనాడు నీ చిత్త మా యానంద స్వరూపిణియందు లగ్నమెయున్నచో గుఱ్ఱమందెట్లు చిక్కుకొనును? అని గిరిజారమణుడగు శంకరుడు లక్ష్మీదేవికి వరమొసగి గిరిజతో నంతర్ధాన మొందెను. లక్ష్మి యచ్చోటనే యుండెను. ఆమె దేవాసుర శిరోరత్నములను దాకుచు దివ్యనఖములతో నలరారు శ్రీదేవీచరణ కమలయుగమును ధ్యానించుచు మాటిమాటికి ప్రేమగద్గద వాక్కులతో దేవిని సంస్తుతించుచు గుఱ్ఱము రూపుదాల్చి తన ప్రియుడగు హరిరాకకు దారితెన్నులు చూచుచుండెను.

ఇది శ్రీ మద్దేవీ భాగవతమందలి షష్ఠ స్కంధమందు హైహయ చరిత్రమను పదునెనిమిదవ యధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters