Sri Sivamahapuranamu-I    Chapters   

అథ సప్తవింశో ధ్యాయః

దక్షయజ్ఞ ప్రారంభము

బ్రహ్మోవాచ |

ఏకదా తు మునే తేన యజ్ఞః ప్రారంభితో మహాన్‌ |తత్రాహూతాస్తదా సర్వే దీక్షితేన సురర్షయః || 1

మహర్షియోఖిలాస్తత్ర నిర్జరాశ్చ సమాగతాః | యద్యజ్ఞకరణార్థం హి శివమాయావిమోహితాః || 2

అగస్త్యః కశ్యపోత్రిశ్చ వామదేవస్తథా భృగుః | దధీచిర్భగవాన్‌ వ్యాసో భారద్వాజోథ గౌతమః || 3

పైలః పరాశరో గర్గో భార్గవః కకుపస్సితః | సుమంతుత్రికకంకాశ్చ వైశంపాయన ఏవ చ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఒకప్పుడు ఆ దక్షుడు గొప్ప యజ్ఞమునారంభించెను. ఆ యజ్ఞమునకు దీక్షితుడైన దక్షుడు దేవతలను, ఋషులను ఆహ్వానించెను (1). మహర్షులు, దేవతలు అందరు శివమాయచే మోహితులై ఆతని యజ్ఞమును చేయించుటకు అచటికి విచ్చేసిరి (2). అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాస భగవానుడు, భారద్వాజుడు, గౌతముడు (3), పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకుపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు, మరియు వైశంపాయనుడు విచ్చేసిరి (4).

ఏతే చాన్యే చ బహవో మునయో హర్షితా యయుః | మమ పుత్రస్య దక్షస్య సదారాస్ససుతా మఖమ్‌ || 5

తథా సర్వే సురగణా లోకపాలా మహోదయాః | తథోపనిర్జరాస్సర్వే స్వవాహన బలాన్వితాః || 6

సత్యలోకాత్సమానీతో నుతోహం విశ్వకారకః | స సుతస్సపరివారో మూర్తవేదాది సంయుతః || 7

వైకుంఠాచ్చ తథా విష్ణుస్సంప్రార్ధ్య వివిధా దరాత్‌ | సపార్ష దపరీవారస్సమానితో మఖం ప్రతి || 8

నా కుమారుడగు దక్షుని యజ్ఞమునకు వీరేగాక ఇంకా ఎందరో మహర్షులు తమ భార్య పిల్లలతో ఆనందముగా విచ్చేసిరి (5). మరియు, సర్వదేవగణములు, మహాత్ములగు లోకపాలురు, సర్వ ఉపదేవగణములు తమ వాహనముతో, సైన్యములతో కూడి విచ్చేసిరి (6). జగత్స్రష్టనగు నన్ను స్తుతించి సత్యలోకమునుండి తీసుకొని వెళ్లిరి. నేను నా కుమారులతో, పరివారముతో, మరియు మూర్తీభవించిన వేదశాస్త్రములతో గూడి వెళ్లితిని (7). మరియు, వైకుంఠము నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరముతో దోడ్కొని వచ్చిరి. ఆయన ఆ యజ్ఞమునకు తన భక్తులతో, పరివారముతో గూడి విచ్చేసెను (8).

ఏవమన్యే సమాయాతా దక్షయజ్ఞం విమోహితాః | సత్కృతాస్తేన దక్షేన సర్వే తే హి దురాత్మనా || 9

భవనాని మహార్హాణి సుప్రభాణి మహాంతి చ | త్వష్ట్రా కృతాని దివ్యాని తేభ్యో దత్తాని తేన వై || 10

తేషు సర్వేషు ధిష్ణ్యేషు యథా యోగ్యం చ సంస్థితాః | సన్మానితా అరాజంస్తే సకలా విష్ణునా మయా || 11

వర్తమానే మహాయజ్ఞే తీర్థే కనఖలే తదా | ఋత్విజశ్చ కృతాస్తేన భృగ్వాద్యాశ్చ తపోధనాః || 12

అధిష్ఠితా స్వయం విష్ణుస్సహ సర్వమరుద్గణౖః |అహం తత్రాభవం బ్రహ్మా త్రయీవిధి నిదర్శకః || 13

వీరే గాక, ఇంకనూ చాల మంది మోహితులై దక్షయజ్ఞమునకు వచ్చిరి. దుష్టుడగు దక్షుడు వారినందరినీ సత్కరించెను (9). విశ్వకర్మ మిక్కిలి విలువైన, గొప్పగా ప్రకాశించే మహాదివ్య భవనములను నిర్మించి యుండెను. దక్షుడు వారందరికీ వాటిలో మకామునిచ్చెను (10). ఆ భవనములన్నింటియందు యోగ్యతనను సరించి అందరు నివసించిరి. నేను, విష్ణువు కూడ అచట నివసింతిమి. అందరికీ సన్మానము చేయబడెను. వారందరు చక్కగా ప్రకాశించిరి (11). అపుడు కనఖల తీర్థమునందు జరిగిన ఆ మహాయజ్ఞములో దక్షుడు భృగువు మొదలగు తపశ్శాలురను ఋత్విక్కులుగా నియమించెను (12). విష్ణువు మరుద్గణములన్నింటితో గూడి స్వయముగా ఆ యజ్ఞమునకు అధ్యక్షుడు గా నుండెను. నేను బ్రహ్మనై ఆ యజ్ఞములో వేద విధిని వివరిస్తూ నడిపించితిని (13).

తథైవ సర్వదిక్పాలా ద్వారపాలాశ్చ రక్షకాః | సాయుధాస్సపరీవారాః కుతూహల కరాస్సదా || 14

ఉపతస్థే స్వయం యజ్ఞస్సురూపస్తస్య చాధ్వరే | సర్వే మహామునిశ్రేష్టా స్స్వ యం వేదధరాభవన్‌ || 15

తనూన పాదపి నిజం చక్రే రూపం సహస్రశః | హవిషాం గ్రహణాయాశు తస్మిన్‌ యజ్ఞే మహోత్సవే || 16

అష్టాశీతి సహస్రాణి జుహ్వతి సహ ఋత్విజః | ఉద్గాతారశ్చ తుష్షష్టి సహస్రాణి సురర్షయః || 17

సర్వదిక్పాలకులు ఆయుధములను ధరించి పరివారసమేతముగా ద్వారపాలకుల స్థానమునందు నిలబడి రక్షణనొసంగిరి. ఆ దృశ్యము చాల కుతూహలమును కలిగించెను (14). సుందరాకారుడగు యజ్ఞుడు ఆ దక్షుని యజ్ఞములో స్వయముగా హాజరయ్యెను. మహాముని శ్రేష్ఠులందరు స్వయముగా వేదోక్త కర్మలను నిర్వహించిరి (15). అగ్ని తన వేయి రూపములతో హవిస్సును స్వీకరించుటకై ఆ యజ్ఞమహోత్సవములో వెనువెంటనే ఉపస్థితుడాయెను (16). పద్ధెనిమిదివేల మంది ఋత్విక్కులు హోమమును చేసిరి. అరవై నాలుగు వేల దేవర్షులు ఉద్గాతృస్థానముల నలంకరించిరి (17).

అధ్వర్యవోథ హోతారస్తావంతో నారదాదయః | సప్తర్షయస్సమా గాథాః కుర్వంతి స్మ పృథక్‌ పృథక్‌ || 18

గంధర్వవిద్యాధర సిద్ధసంఘానాదిత్య సంఘాన్‌ సగణాన్‌ సయజ్ఞాన్‌ |

సంఖ్యావరాన్నా గచరాన్‌ సమస్తాన్‌ వవ్రే స దక్షో హి మహాధ్వరే స్వే || 19

ద్విజర్షి రాజర్షి సురర్షి సంఘా నృపాస్సమిత్రా స్సచివాస్ససైన్యాః |

వసుప్రముఖ్యా గణదేవతాశ్చ సర్వే వృతాస్తేన మఖోపవేత్రా|| 10

అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులైరి. నారదాది ఋషులు, మరియు సప్తవర్షులు వేర్వేరుగా గాథలను వినిపించిరి (18). ఆ దక్షుడు తన మహాయజ్ఞములో గంధర్వులను, విద్యాధరులను, సిద్ధ సంఘములను, ద్వాదశా దిత్యులను, అసంఖ్యాకములగు నాగులను వారివారి గణములతో యజ్ఞములతో సహా ఋత్విక్కులు గా వరణము చేసెను (19). ఆ యజ్ఞములో యజమానియగు దక్షుడు ద్విజర్షులను, రాజర్షులను, దేవర్షులను, మిత్రులతో మంత్రులతో సైన్యములతో గూడియున్న రాజులను, వసువులను, గణ దేవతలను అందరినీ వరణము చేసెను (20).

దీక్షాయుక్తస్తదా దక్షః కృతకౌతుకమంగలః | భార్యయా సహితో రేజే కృతస్వస్త్యయనో భృశమ్‌ .| 21

తస్మిన్‌ యజ్ఞే వృతశ్శంభుర్న దక్షేణ దురాత్మనా | కపాలీతి వినిశ్చిత్య తస్య యజ్ఞార్హతా న హి || 22

కపాలి భార్యేతి సతీ దయితా స్వసుతాపి చ | నాహూతా యజ్ఞవిషయే దక్షేణా గుణదర్శినా || 23

ఏవం ప్రవర్తమానే హి దక్షయజ్ఞే మహోత్సవే | స్వకార్యలగ్నాస్తత్రాసన్‌

సర్వే తేధ్వరసంమతాః || 24

ఏతస్మిన్నంతరేదృష్ట్వా తత్ర వై శంకరప్రభుమ్‌ | ప్రోద్విగ్న మానసశ్శైవో దధీచో వాక్యమబ్రవీత్‌ || 25

దీక్షితుడై, రక్షాబంధనోత్సవమును నిర్వర్తించి, స్వస్తి పుణ్యాహవాచనమును చేసిన దక్షుడు భార్యతో గూడి ఆ సమయములో మిక్కిలి ప్రకాశించెను (21). శంభుడు కపాలధారి గనుక, ఆయనకు యజ్ఞార్హత లేదని నిశ్చయించి, దురాత్ముడగు దక్షుడు ఆ యజ్ఞమునందు శివుని ఆహ్వానించలేదు (22). దోషదర్శియగు దక్షుడు, సతి తన కుమారైయే అయిననూ, కపాలధారి యొక్క భార్య అను కారణముచే యజ్ఞమునకు ఆహ్వానించలేదు (23). ఈ విధముగా దక్షయజ్ఞమహోత్సవము కొనసాగుచుండెను. యజ్ఞనియుక్తులైన వారందరు తమ తమ కార్యములయందు నిమగ్నులైరి (24). ఇంతలో శివభక్తుడగుదధీచుడు అచట శంకర ప్రభువు కానారాక పోవుటచే ఉద్వేగముతో నిండిన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (25).

దధీచ ఉవాచ |

సర్వే శృణుత మద్వాక్యం దేవర్షి ప్రముఖా ముదా | కస్మాన్నై వాగతశ్శంభు రస్మిన్‌ యజ్ఞే మహోత్సవే || 26

ఏతే సురేశా మునయో మహత్తరాః సలోకపాలాశ్చ సమాగతా హి |

తథాపి యజ్ఞస్తు న శోభ##తే భృశం పినాకినా తేన మహాత్మనా వినా || 27

యేనైవ సర్వాణ్యపి మంగలాని భవంతి శంసన్తి మహావిపశ్చితః |

సోసౌ న దృష్టోత్ర పుమాన్‌ పురాణో వృషధ్వజో నీలగలః పరేశః || 28

దధీచుడు ఇట్లు పలికెను -

దేవ ప్రముఖులారా! ఋషి ప్రముఖులారా! మీరందరు నా మాటను ఆనందముతో వినుడు. ఈ యజ్ఞముహోత్సవమునందు శంభుడు ఏల రాలేదు?(26) ఈ దేవ ప్రభువులు, గొప్ప మునులు, లోకపాలురు కూడ వచ్చినారు గదా! కాని మహాత్ముడగు ఆ పినాకి లేనిదే ఈ యజ్ఞము అధికముగా శోభించుటలేదు (27). మంగళములన్నియు ఎవని వలన కలుగునవి గొప్ప విద్వాంసులు చెప్పెదరో, అట్టి ఆ పురాణ పురుషుడు, వృషధ్వజుడు,నీలకంఠుడు అగు పరమేశ్వరుడు ఇచట కానరాలేదు (28).

అమంగలాన్యేవ చ మంగలాని భవంతి యేనాధిగతాని దక్ష | త్రిపంచకేనాప్యథ మంగలాని భవంతి సద్యః పరతః పురాణి ||

తస్మాత్త్వయైవ కర్తవ్య మహ్వానం పరమేశితుః | త్వరితం బ్రహ్మాణా వాపి విష్ణునా ప్రభవిష్ణునా || 30

ఇంద్రేణ లోకపాలైశ్చ ద్విజైస్సిద్ధై స్సహాధునా | సర్వథాऽऽనయనీయోసౌ శంకరో యజ్ఞపూర్తయే || 31

సర్వైర్భవద్భిర్గంతవ్యం యత్ర దేవో మహేశ్వరః | దాక్షాయణ్యా సమం శంభుమానయధ్వం త్వరాన్వితాః || 32

ఓ దక్షా! ఎవ్వనిచే స్వీకరింపబడిన అమంగళములు కూడా మంగళములగునో, అట్టి శివుడు తన పదిహేను నేత్రములతో చూడగా మహానగరములైననూ వెంటనే మంగళమయములగును (29). కావున, నీవు స్వయముగా పరమేశ్వరుని ఆహ్వానించవలెను. లేదా, బ్రహ్మచే గాని, సర్వ సమర్థుడగు విష్ణువుచే గాని వెంటనే ఆహ్వానింపజేయుము (30). యజ్ఞసిద్ధికొరకై ఇప్పుడు ఇంద్రుడుగాని, లోకపాలురు గాని, విప్రులుగాని, సిద్ధులుగాని ఆ శంకరుని తప్పని సరిగా తోడ్కోని రావలెను (31). మహేశ్వర దేవుడు ఉన్న చోటికి మీరందరు వెళ్లుడు. సతీ దేవితో సహా శంభుని వెనువెంటనే తోడ్కొని రండు (32).

తేన సర్వం పవిత్రం స్యాచ్ఛంభునా పరమాత్మనా | ఆత్రా గతేన దేవేశా స్సాంబేన పరమాత్మనా || 33

యస్య స్మృత్యా చ నామోక్త్యా సమగ్రం సుకృతం భ##వేత్‌ | తస్మాత్సర్వప్రయత్నేన హ్యానేతవ్యో వృషధ్వజః || 34

సమాగతే శంకరేత్ర పావనో హి భ##వేన్మఖః | భవిష్యత్యన్యథాపూర్ణః సత్యమేతద్బ్రవీమ్యహమ్‌ || 35

దేవ దేవుడు, సాంబుడు, పరమాత్మయగు శంభుడు ఇచటకు వచ్చినచో సర్వము పవిత్రమగును (33). శివుని స్మరించుటచే, నామమును ఉచ్చరించుటచే యజ్ఞము పరిపూర్ణము, సుకృతము అగును. కాన సర్వ ప్రయత్నములను చేసి శివుని ఇచటకు తీసుకుని రండు (34). శంకరుడు ఇచటకు వచ్చినచో యజ్ఞము పావనమగును. అట్లు గానిచో యజ్ఞము పూర్ణము కాబోదు. నేను సత్యమును పలుకుచున్నాను (35).

బ్రహ్మోవాచ |

తస్య తద్వచనం శ్రుత్వా దక్షో రోష సమన్వితః | ఉవాచ త్వరితం మూఢః ప్రహసన్నివ మూఢధీః || 36

మూలం విష్ణుర్దేవ తానాం యత్ర ధర్మస్సనాతనః | సమానీతో మయా సమ్యక్‌ కిమూనం యజ్ఞకర్మణి || 37

యస్మిన్‌ వేదాశ్చ యజ్ఞాశ్చ కర్మాణి వివిధాని చ | ప్రతిష్ఠితాని సర్వాణి సోసౌ విష్ణురిహాగతః || 38

సత్యలోకాత్సమాయాతో బ్రహ్మా లోకపితామహాః | వేదై స్సోపనిషద్భిశ్చ వివిధైరాగమై స్సహ || 39

బ్రహ్మ ఇట్లు పలికెను -

మూఢబుధ్ది, క్రోధావిష్టుడనగు దక్షుడు ఆయన యొక్క ఆ మాటలను విని చిరునవ్వును నటిస్తూ వెంటనే ఇట్లు పలికెను (36). విష్ణువు దేవతలకు ఆధారము. సనాతన ధర్మము ఆయన యందు ప్రతిష్ఠితమై యున్నది. అట్టి విష్ణువును నేను సాదరముగా రప్పించితిని. ఈ యజ్ఞమునకు ఏమి లోటు వచ్చినది?(37). ఎవనియందు వేదములు, యజ్ఞములు, వివిధ కర్మలు సర్వము ప్రతిష్ఠితమైయున్నవో, అట్టి విష్ణువు ఇచటకు వచ్చియున్నాడు (38). లోకములకు పితామహుడగు బ్రహ్మ వేదములతో, ఉపనిషత్తులతో, వివిధ శాస్త్రములతో గూడి సత్యలోకమునుండి విచ్చేసినాడు (39).

తథా సురగణౖ స్సాక మాగత స్సుర రాట్‌ స్వయమ్‌ | తథా యూయం సమాయాతా ఋషయే వీతకల్మషాః || 40

యే యే యజ్ఞోచితాశ్శాంతాః పాత్ర భూతాస్సమాగతాః | వేదవేదార్థతత్త్వజ్ఞాస్సర్వే యూయం దృఢవ్రతాః || 41

అత్రైవ చ కిమస్మాకం రుద్రేణాపి ప్రయోజనమ్‌ | కన్యా దత్తా మయా విప్ర బ్రహ్మణా నోదితేన హి || 42

హరోకులీనోసౌ విప్ర పితృమాతృవివర్జితః | భూతప్రేతపిశాచానాం పతిరేకోదురత్యయః || 43

మరియు ఇంద్రుడు స్వయముగాదేవతాగణములతో గూడి వచ్చినాడు. మరియు తొలగిన కల్మషములు గల ఋషులు మీరందరు విచ్చేసినారు (40). యజ్ఞమునకు యోగ్యమైన వారు, శాంతులు, సత్పాత్రులు, వేదముల తత్త్వమును వేదార్ధమును ఎరింగిన వారు, దృఢమగు వ్రతము గల వారు నగు మీరందరు వచ్చినారు (41). మనకు ఇచట రుద్రునితో పని యేమి ? హే దధీచీ! బ్రహ్మ ప్రేరేపించగా నేను ఆతనికి కన్యనిచ్చితిని (42). హే విప్రా! ఈ హరుడు కులముగాని, తల్లిదండ్రులు గాని లేనివాడు భూతప్రేత పిశాచములకు ప్రభువు. ఏకాకి. ఆతనికి అతిక్రమించుట చాల కష్టము (43).

ఆత్మ సంభావితో మూఢస్త్సబ్ధో మౌనీ సమత్సరః | కర్మణ్యస్మిన్న యోగ్యోసౌ నానీతో హి మయాధునా || 44

తస్మాత్త్వమీదృశం వాక్యం పునర్వాచ్యం నహి క్వచిత్‌ | సర్వైర్భవద్భిః కర్తవ్యో యజ్ఞో మే సఫలో మహాన్‌ || 45

ఆతడు తానే గొప్పయను గర్వము గల మూఢుడు. మౌనముగా నుండువాడు. అసూయాపరుడు. ఈ కర్మకు యోగ్యమైనవాడు కాదు. అందువలననే నేనాతనిని ఈనాడు రప్పించలేదు (44). కావున నీవు ఇట్టి పలుకులను మరియెచ్చటనూ చెప్పుకుము. మీరందరు కలిసి నా మహాయజ్ఞమును సఫలము చేయుడు (45).

బ్రహ్మోవాచ |

ఏతచ్ఛ్రుత్వా వచస్తస్య దధీచో వాక్యమబ్రవీత్‌ | సర్వేషాం శృణ్వతాం దేవమునీనాం సారసంయుతమ్‌ || 46

బ్రహ్మఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని, దధీచుడు దేవతలు మునులు అందరు వినుచుండగా సారముతో గూడిన మాటను పలికెను (46).

దధీచ ఉవాచ |

అయజ్ఞోయం మహాన్‌ జాతో వినా తేన శివేన హి | వినాశోపి విశేషేణ హ్యత్ర తే హి భవిష్యతి || 47

ఏవముక్త్వా దధీచోసావేక ఏవ వినిర్గతః | యజ్ఞవాటాచ్చ దక్షస్య త్వరిత స్స్వాశ్రమం య¸° || 48

తతోన్యే శాంకరా యే చ ముఖ్యాశ్శివమతానుగాః | నిర్యయుస్స్వా శ్రమాన్‌ సద్యశ్శాపం దత్త్వా తథైవ చ || 49

మునౌ వినిర్గతే తస్మిన్‌ మఖాదన్యేషు దుష్టధీః | శివద్రోహీ మునీ దక్షః ప్రహసన్నిద మబ్రవీత్‌ || 50

దధీచుడు ఇట్లు పలికెను -

శివుడు లేని ఈ మహాయజ్ఞము అయజ్ఞముగా మారినది. మరియు ఇచట విశేషించి నీ వినాశము కూడ జరుగగలదు (47). దధీచుడు ఇట్లు పలికి ఆయన ఒక్కడే దక్షుని యజ్ఞ వాటిక నుండి బయటకు వచ్చి వేగముగా తన ఆశ్రమమునకు వెళ్లి పోయెను (48). తరువాత శివమతానుయాయులగు ఇతర శంకర భక్తులు కూడా బయటకు వచ్చి, వెంటనే అదే తీరున శాపమునిచ్చి, తమ ఆశ్రమములకు వెళ్లిరి (49). దధీచి, ఇతర శంకర భక్తులు ఆ యజ్ఞమునుండి బయటకు రాగానే, దుష్టబుద్ధి శివద్రోహి అగు దక్షుడు నవ్వుచూ ఆ మునులతో నిట్లనెను (50).

దక్ష ఉవాచ |

గతశ్శివ ప్రియో విప్రో దధీచో నామ నామతః |అన్యే తథావిధా యే చ గతాస్తే మమ చాధ్వరాత్‌ || 51

ఏతచ్ఛుభతరం జాతం సంమతం మే హి సర్వథా | సత్యం బ్రవీమి దేవేశ సురాశ్చ మునయస్తథా || 52

వినష్టచిత్తా మందాశ్చ మిథ్యా వాదరతాః ఖలాః | వేద బాహ్యా దురాచారా స్త్యాజ్యాస్తే మఖకర్మణి || 53

వేదవాదరతా యూయం సర్వే విష్ణుపురోగమాః | యజ్ఞం మే సఫలం విప్రాస్సురాః కుర్వంతు మా చిరమ్‌ || 54

దక్షుడిట్లు పలికెను -

శివునకు ప్రియుడగు దధీచుడు అను బ్రాహ్మణుడు వెళ్లినాడు. అటు వంటి వారే మరి కొందరు కూడా నా యజ్ఞమునుండి తొలగిపోయిరి (51). ఇది అంతయూ మిక్కిలి శుభకరము. నాకు అన్ని విధముల సమ్మతము. ఇంద్రా! దేవతలారా! మునులారా! నేను సత్యమును పలుకుచున్నాను (52). వివేకము లేని మూర్ఖులను, మిథ్యావాదముల యందభిరుచి గల దుష్టులను, వేద బాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోనికి రానీయరాదు (53). మీరందరు వేదాధ్యయనపరులు. మీకు ముందు విష్ణువు ఉండి నడిపించును. ఓ బ్రాహ్మణులారా! దేవతలారా! విలంబము లేకుండగా నా యజ్ఞమును సఫలము చేయుడు (54).

బ్రహ్మోవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య శివమాయా విమోహితాః | యన్మఖే దేవయజనం చక్రుస్సర్వే సురర్షయః || 55

ఇతి తన్మఖశాపో హి వర్ణితో మే మునీశ్వర | యజ్ఞ విధ్వం సయోగోపి ప్రోచ్యతే శృణు సాదరమ్‌ || 56

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్రసంహితాయాం ద్వితీయే సతీఖండే యజ్ఞప్రారంభో నామ సప్తవింశోధ్యాయః (27).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వాని ఈ మాటలను విని శివమాయచే విమోహితులైన వారై దేవర్షులు అందరు ఆ యజ్ఞమునందు దేవతలకు హనిస్సులనీయ నారంభించిరి (55). ఓ మహర్షీ! ఇంతవరకు ఆ యజ్ఞమునకు శాపము కలిగిన తీరును వర్ణించితిని. ఇపుడు ఆ యజ్ఞము విధ్వంసమైన తీరును వర్ణించెదను. శ్రద్ధతో వినుము (56).

శ్రీశివ మహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండములో దక్షయజ్ఞ ప్రారంభమనే ఇరువది ఏడవ అధ్యాయము ముగిసినది (27).

Sri Sivamahapuranamu-I    Chapters