Sri Sivamahapuranamu-I    Chapters   

అథ దశమోsధ్యాయః

బ్రహ్మకు జ్ఞనోదయమగుట

నారద ఉవాచ |

బ్రహ్మన్‌ విధే మాహాభాగ ధన్యస్త్వం శివ సక్తధీః | కథితం సుచరిత్రం తే శంకరస్య పరాత్మనః || 1

నిజాశ్రమే గతే కామే సగణ సరతౌ తతః | కిమాసీత్కిమకార్షీస్త్వం తచ్చరిత్రం వదాధునా || 2

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! విధీ! మహాత్మా! శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. శంకర పరమాత్ముని పుణ్యచరితమును చెప్పితివి (1). మన్మథుడు తన సహచరులతో మరియు రతితో గూడి తన ఆశ్రమమునకు వెళ్లగా ఏమి ఆయెను? నీవు ఏమి చేసితివి? ఆ చరితమునిప్పుడు చెప్పుము (2).

బ్రహ్మోవాచ |

శృణునారద సుప్రీత్యా చరిత్రం శశిమౌలినః | యస్య శ్రవణ మాత్రేణ నిర్వికారో భ##వేన్నరః || 3

నిజాశ్రమం గతే కామే పరివార సమన్వితే | యద్బ భూవ తదా జాతం తచ్చరిత్రం నిబోధమే || 4

నష్టోsభూన్నారద మదో విస్మయోsభూచ్చ మే హృది | నిరానందస్య చ మునేsపూర్ణే నిజమనోరథే || 5

అశోచం బహుధా చిత్తే గృహ్ణీయాత్స కథం స్త్రి యమ్‌ | నిర్వికారో జితాత్మ స శంకరో యోగతత్పరః || 6

బ్రహ్మ ఇట్లు పలికెను -

నారదా! చంద్రమౌళి యొక్క చరితమును మిక్కిలి ప్రీతితో వినుము. దీనిని విన్నంత మాత్రాన మానవుడు కామక్రోధాది వికారములకు దూరము కాగల్గును (3). తన అనుచరులతో కూడి మన్మథుడు తన ఆశ్రమమునకు వెళ్లిన తరువాత జరిగిన చరితమును చెప్పెదను. తెలుసు కొనుము (4). నారదా! నా గర్వము తొలగిపోయెను. నా హృదయములో ఆశ్చర్యము కలిగెను. ఓ మహర్షీ! నా కోరిక తీరనందున నాకు ఆనందము కరువయ్యెను (5). కామ క్రోధాది వికారములు లేని వాడు, జితేంద్రియుడు, యోగ పరాయణుడునగు ఆ శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని నేను మనస్సులో పరిపరి విధముల తలపోసితిని (6).

ఇత్థం విచార్య బహుధా తదాహం విమదో మునే | హరిం తం సోsస్మరం భక్త్యా శివాత్మానం స్వదేహదమ్‌ || 7

అస్తవం చ శుభస్తోత్రై ర్దీన వాక్య సమన్వితైః | తచ్ఛ్రుత్వా భగవానాశు బభూవావిర్హి మే పురా || 8

చతుర్భుజోs రవిందాక్ష శ్శంఖ శార్‌ఙ్గ గదాధరః | లసత్పీత పట శ్శ్యామతను ర్భక్త ప్రియో హరిః || 9

తం దృష్ట్వా తాదృశమహం సుశరణ్యం ముహుర్ముహుః | అస్తవం చ పునః ప్రేవ్ణూ బాష్ప గద్గదయా గిరా || 10

హరిరాకర్ణ్య తత్‌ స్తోత్రం సుప్రసన్న ఉవాచ మామ్‌ | దుఃఖహా నిజభక్తానాం బ్రహ్మాణం శరణం గతమ్‌ || 11

ఓ మహర్షీ! అపుడు నేను గర్వము తొలగిన వాడనై, పరిపరి విధముల తలపోసి, శివస్వరూపుడు, నాకు తండ్రి అగు విష్ణువును భక్తితో స్మరించితిని (7). మరియు, దీన వచనములతో గూడిన స్తోత్రములతో ఆయనను స్తుతించితిని. వాటిని విని విష్ణుభగవానుడు వెంటనే నా ఎదుట ప్రత్యక్షమయ్యెను (8). నాల్గు భుజములు గలవాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, శంఖమును, శార్‌ఙ్గమనే ధనస్సును, గదను ధరించినవాడు, ప్రకాశించే పచ్చని వస్త్రము గలవాడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు (9), భక్తులకు శరణునొసంగువాడు అగు ఆ హరిని చూచి కన్నీరు విడుచుచూ, గద్గదమగు వాక్కుతో ప్రేమపూర్వకముగా అనేక పర్యాయములు స్తుతించితిని (10). ఆ స్తోత్రమును విని తన భక్తుల దుఃఖములను తొలగించే హరి మిక్కిలి ప్రసన్నుడై, శరణు పొందిన నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (11).

హరిరువాచ |

విధే బ్రహ్మన్‌ మహాప్రాజ్ఞ ధన్యస్త్వం లోకకారక | కిమర్థం స్మరణం మేsద్య కృతం చ క్రియతే నుతిః || 12

కిం జాతం తే మహద్దుఃఖం మదగ్రే తద్వదాధునా | శమయిష్యామి తత్సర్వం నాత్ర కార్యా విచారణా || 13

విష్ణువు ఇట్లు పలికెను -

హే విధీ! బ్రహ్మన్‌! సృష్టికర్తవగు నీవు మహా ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈనాడు నీవు నన్ను స్మరించి, స్తుతించుటకు కారణమేమి? (12). నీకు కలిగిన మహాదుఃఖము ఏది? నాకు ఇప్పుడు చెప్పుము. నీ సర్వదుఃఖములను పోగెట్టెదను. నీకు సంశయముఅక్కరలేదు (13).

బ్రహ్మోవాచ |

ఇతి విష్ణోర్వచశ్ర్శుత్వా కించిదుచ్ఛ్వ సితాననః | అవోచం వచనం విష్ణుం ప్రణమ్య సుకృతాంజలిః || 14

దేవ దేవ రమానాథ మద్వార్తాం శృణు మానద | శ్రుత్వా చ కరుణాం కృత్వా హర దుఃఖ కమావహ || 15

రుద్రసంమోహనార్థం హి కామం ప్రేషితవానహమ్‌ | పరివారయుతం విష్ణో సమార మధు బాంధవమ్‌ || 16

చక్రుస్తే వివిధోపాయన్‌ నిష్ఫలా అభవంశ్చ తే | నాభవత్తస్య సంమోహో యోగిన స్సమదర్శినః || 17

ఇత్యా కర్ణ్య వచో మే స హరిర్మాం ప్రాహ విస్మితః | విజ్ఞాతాఖిలదజ్ఞానీ శివతత్త్వ విశారదః || 18

బ్రహ్మ ఇట్లు పలికెను -

విష్ణువు యొక్క ఈ మాటలను విన్న నా ముఖములో కొద్ది ఉత్సాహము కన్పట్టినది. నేను దోసిలి యొగ్గి విష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికితిని (14). ఓ దేవ దేవా! లక్ష్మీపతీ! మర్యాదను నిలబెట్టువాడా! నా మాటను వినుము. విని, దయను చూపి, దుఃఖమును పోగొట్టి , సుఖమునిమ్ము (15). నేను రుద్రుని మోహింపజేయుట కొరకై కాముని పంపితిని. హే విష్ణో! ఆతడు మారగణములతో, వసంతునితో, భార్యతో మరియు సహచరులతో గూడి వెళ్లెను (16). వారు అనేక ఉపాయములను చేసిరి. కానిఅవి నిష్ఫలమయ్యెను. యోగి, సమదర్శి యగు శివునకు వ్యామోహము కలుగలేదు (17). సర్వజుడు, శివతత్త్వమును బాగుగా నెరింగినవాడు అగు విష్ణువు నా మాటను విని, ఆశ్చర్యమును పొంది నాతో ఇట్లనెను (18).

విష్ణురువాచ |

కస్మాద్ధేతోరితి మతిస్తవ జాతా పితామహ | సర్వం విచార్య సుధియా బ్రహ్మన్‌ సత్యం హి తద్వద || 19

విష్ణువు ఇట్లు పలికెను -

హే పితామహా! నీకు ఇట్టి ఆలోచన కలుగుటకు కారణమేమి? హేబ్రహ్మన్‌! నీవు మంచి బుద్ధితో సర్వమును ఆలోచించి నాకు సత్యమును చెప్పుము (19).

బ్రహ్మోవాచ |

శృణు తాత చరిత్రం తత్తవ మాయా విమోహినీ | తదధీనం జగత్సర్వం సుఖదుః ఖాది తత్పరమ్‌ || 20

యయైవ ప్రేషితశ్చాహం పాపం కర్తుం సముద్యతః |ఆసం తచ్ఛృణు దేవేశ వదామి తమ శాసనాత్‌ || 21

సృష్టి ప్రారంభసమయే దశ పుత్రా హి జజ్ఞిరే | దక్షాద్యాస్తనయా చైకా వాగ్భవాప్యతి సుందరీ || 22

ధర్మో వక్షస్థ్స లాత్కామో నమసోsన్యేపి దేహతః | జాతాస్తత్రసుతాం దృష్ట్వా మమ మోహోsభవద్ధరే || 23

బ్రహ్మ ఇట్లు పలికెను -

తండ్రీ! ఆ చరిత్రను వినుము. నీ మాయ మోహింపజేయును. జగత్తంతయూ దానికి వశ##మై సుఖదుఃఖాదుల యందు లగ్నమై యున్నది (20). ఆ మాయచే ప్రేరితుడనై నేను పాపము చేయనొడగట్టితిని. ఆ వృత్తాంతమును వినుము. హే దేవదేవా! నీ ఆజ్ఞచే చెప్పు చున్నాను (21). సృష్ట్యాది యందు నాకు పది మంది దక్షుడు మొదలగు కుమారులు, ఒక కుమార్తె జన్మంచిరి. అతి సుందరియగు ఆమె నా వాక్కు నుండి జన్మించిరి (22). వక్షస్థ్సలము నుండి ధర్ముడు, మనస్సు నుండి మన్మథుడు, ఇతరకుమారులు దేహమునుండి జన్మించిరి. హేహరే! ఆ కుమార్తెను చూచిన నాకు మోహము కలిగినది (23).

కుదృష్ట్యా తాం సమద్రాక్షం తవ మాయావిమోహితః | తత్‌ క్షణాద్ధర ఆగత్య మామ నిందత్సుతానపి || 24

ధిక్కారం కృతవాన్‌ సర్వాన్‌ నిజం మత్వా పరప్రభుమ్‌ | జ్ఞానినం యోగినం నాథా భోగినం విజితేంద్రియమ్‌ || 25

పుత్రో భూత్వా మమ హరేs నిందన్మాం చసమక్షతః | ఇతి దుఃఖం మహన్మే హి తదుక్తం తవ సన్నిధౌ || 26

గృహ్ణీయాద్యది పత్నీం స స్యాం సుఖీ నష్టదుఃఖధీః | ఏతదర్థం సమాయాత శ్శరణం తవ కేశవ || 27

ఇత్యాకర్ణ్య వచో మే హి బ్రహ్మణో మధుసూదనః | విహస్య మాం ద్రుతం ప్రాహ హర్షయన్‌ భవకారకమ్‌ || 28

నేను నీ మాయచే మోహితుడనై ఆమెను చెడుదృష్టితో చూచితిని. వెంటనే శివుడు వచ్చి నన్ను, మరియు నా కుమారులను నిందించెను. (24). హే నాథా! తాను పరమాత్మ, జ్ఞాని, యోగి, విషయలాలసత లేని జితేంద్రియుడు అని భావించే శివుడు అందరినీ ఉద్దేశించి ధిక్కారమును చేసెను (25). హే హరీ! నాకుమారుడైన ఈ రుద్రుడు వీరందరి యెదుట నన్ను నిందించినాడని నాకు గొప్ప దుఃఖము కలిగినది. నేను నీ యెదుట సత్యమును చెప్పితిని (26). ఆయన వివాహమాడినచో నాకు దుఃఖము తొలగి సుఖము కలుగును. హే కేశవా! దీనికొరకై నేను నిన్ను శరణు జొచ్చితిని (27). ఈ నా మాటను విని మధుసూదనుడు నవ్వి సృష్టికర్త, బ్రహ్మ అగు నాకు ఆనందమును కలిగించు వాడై, వెంటనే ఇట్లు పలికెను (28).

విష్ణురువాచ |

విధే శృణు హి మద్వాక్యం సర్వ భ్రమ నివారణమ్‌ | సర్వ వేదాగమాదీనాం సంమతం పరమార్థతః || 29

మాహా మూఢమతి శ్చాద్య సంజాతోsసి కథం విధే | వేదవక్తాపి నిఖిలలో కకర్తా హి దుర్మతిః || 30

జడతాం త్యజ మందాత్మన్‌ కురు త్వాం నేదృశీం మతిమ్‌ | కిం బ్రువంత్యఖిలా వేదాస్త్సుత్యా తత్స్మర సద్ధియా || 31

రుద్రం జానాపి దుర్బద్ధే స్వసుతం పరమేశ్వరమ్‌ | వేద వక్తాపి విజ్ఞానం విస్మృతం తేsఖిలం విధే || 32

విష్ణువు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌ ! భ్రాంతులనన్నిటినీ తొలగించునది, వేద శాస్త్రములన్నింటి పరమార్థ సారము అగు నామాటను వినుము (29). హే బ్రహ్మన్‌! నీవీనాడు ఇంత పెద్ద మూర్ఖుడవు ఎట్లు కాగల్గితివి? వేద ప్రవర్తకుడవు, సర్వ జగత్తును సృష్టించినవాడవు అగు నీకు దుర్బుద్ధి ఎట్లు కలిగినది?(30). ఓ తెలివతక్కువ వాడా! నీ జడత్వమును వీడుము. ఇట్టి ఆలోచనను చేయకుము. కొనియాడదగిన వేదములన్నియూ ఏ పరమాత్మతత్త్వమును బోధించుచున్నవో, దానిని సద్బుద్ధితో స్మరింపుము (31). ఓరీ దుష్టబుద్ధీ! పరమేశ్వరుడగు రుద్రుని నీ కుమారుడని తలపోయుచుంటివి. హేబ్రహ్మన్‌! నీవు వేద ప్రవర్తకుడవే అయిననూ, విజ్ఞానమునంతనూ మరచిపోయితివి (32).

శంకరం సురసామాన్యం మత్వా ద్రోహం కరోషి హి | సుబుద్ధిర్విగతా తేద్యావిర్భూతా కుమతిస్తథా || 33

తత్త్వ సిద్ధాంత మాఖ్యాతం శృణు సద్బుద్ధిమావహ | యథార్థం నిగమాఖ్యాతం నిర్ణీయ భవకారకమ్‌ || 34

శివస్సర్వస్వకర్తా హి భర్తా హర్తా పరాత్పరః | పరబ్రహ్మ పరేశశ్చ నిర్గుణో నిత్య ఏవ చ || 35

అనిర్దేశ్యో నిర్వికారీ పరమాత్మాద్వయోsచ్యుతః | అనంతోంత కర స్స్వామీ వ్యాపకః పరమేశ్వరః || 36

శంకరుని దేవతలలో ఒకనిగా తలంచి నీవు ద్రోహమును చేయుచున్నావు. ఈనాడు నీకు మంచి బుద్ధి లుప్తమై, దుర్బుద్ధి పుట్టినది (33). ఈశ్వరతత్త్వమును గురించిన సిద్ధాంతమును వినుము. సద్బుద్ధిని కలిగియుండుము. వేదములలో ప్రతిపాదింపబడిన తీరులో వాస్తవమగు సృష్టికర్తను నిర్ణయించుకొనుము (34). సర్వమును సృష్టించి, రక్షించి, హరించునది శివుడే. ఆయనయే పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు. ఆయన నిర్గుణుడు మరియు నిత్యుడు (35). వికారములు లేని శివుని ఇదమిత్థముగా నిర్దేశించలేము. ఆయన అద్వితీయ, అవినాశి, అనంత పరమాత్మ. ప్రలయకర్తయగు ప్రభువు. సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు ఆయనయే (36).

సృష్టిస్థితి వినాశానాం కర్తా త్రిగుణ భాగ్విభుః | బ్రహ్మ విష్ణు మహేశాఖ్యో రజస్సత్త్వతమః పరః || 37

మాయాభిన్నో నిరీహశ్చ మాయో మాయా విశారదః | సగుణోsపి స్వతంత్రశ్చ నిజానందోsవికల్పకః || 38

ఆత్మారామో హి నిర్ద్వంద్వో భక్తాధీనస్సువిగ్రహః | యోగీ యోగరతో నిత్యం యోగమార్గప్రదర్శకః || 39

గర్వాపహారీ లోకేశస్సర్వదా దీనవత్సలః |ఏతాదృశో హి యస్స్వామీ స్వపుత్రం మన్యసే హి తమ్‌ || 40

ఈదృశం త్యజ కుజ్ఞానం శరణం వ్రజ తస్యవై | భజ సర్వాత్మనా శంభుం సంతుష్టశ్శం విధాస్యతి || 41

ఆప్రభువు రజస్సత్త్వ తమోగుణ ప్రధానుడై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను పేర్లతో సృష్టిస్థితి లయములను చేయుచుండును (37). మాయను స్వవశములో నుంచుకునే ఆ మాయావి కంటె వేరుగా మాయ లేదు. ఆయన ఆప్తకాముడు.ఆయన సగుణుడే అయినా నిర్గుణుడు. ఆయన స్వతంత్రుడు, ఆనందఘనుడు (38). ద్వంద్వములకు అతీతుడగు శివుడు తనయందు తాను రమించే జ్ఞాని. ఆయన భక్తులకు వశుడై, దివ్యమంగళ విగ్రమహమును ధరించియుండును. ఆ మహాయోగి నిత్యము యోగనిష్ఠుడుగా నుండి, భక్తులను యోగమార్గమున చూపును (39). ఆ లోక ప్రభువు దుష్టుల గర్వమునడంచును. ఆయన సర్వకాలములలో దీనులపై దయను చూపును. ఇట్టి ఆ స్వామిని నీవు నీ కుమారుడని భావించుచున్నావు (40). నీవు ఈ దుష్ట భావనను వీడి, ఆయనను శరణు జొచ్చుము. సర్వ విధములుగా శంభుని భజించుము. ఆయన సంతసించి నీకు సుఖమును కలిగించగలడు (41).

గృహ్ణీయాచ్ఛంకరః పత్నీం విచారో హృది చేత్తవ | శివాముద్దిశ్య సుతపః కురు బ్రహ్మన్‌ శివం స్మరన్‌ || 42

కురు ధ్యానం శివాయాస్త్వం కామముద్దిశ్య తం హృది | సా చేత్ర్పసన్నా దేవేశీ సర్వం కార్యం విధాస్యతి || 43

కృత్వావతారం సగుణా యది స్యాన్మానుషీ శివా | కస్య చిత్తనయా లోకే సా తత్పత్నీ భ##వేద్ధ్రువమ్‌ || 44

దక్షమాజ్ఞాపయ బ్రహ్మన్‌ తపః కుర్యాత్ర్పయత్నతః | తాముత్పాదయితుం పత్నీం శివార్థం భక్తి తస్స్వతః || 45

భక్తాధీనౌ చ తౌ తాత సువిజ్ఞే¸° శివాశివౌ | స్వేచ్ఛయా సగుణౌ జాతౌ పరబ్రహ్మస్వరూపిణౌ || 46

హే బ్రహ్మన్‌! శంకరుడు భార్యను స్వీకరించవలెననే ఆలోచన నీ హృదయములో నున్నచో, ఉమను ఉద్దేశించి శివుని స్మరించుచూ మంచి తపస్సును చేయుము (42). నీవు హృదయములో మన్మథుని ఉద్దేశించి ఉమను ధ్యానించుము. ఆ దేవదేవి ప్రసన్నురాలైనచో, నీకోర్కెలనన్నిటినీ ఈడేర్చగలదు (43). ఆ శివాదేవి సగుణయై అవతారమునెత్తి లోకములో మనుష్య దేహముతో ఎవరో ఒకరి గృహములో జన్మించినచో, నిశ్చయముగా శివునకు పత్ని కాగలదు (44). హే బ్రహ్మన్‌! శివుని కొరకు కన్యను కనుటకై దక్షుడు భక్తితో ప్రయత్న పూర్వకముగా తపస్సును చేయవలెను. కాన ఆతనిని ఆజ్ఞాపించుము (45). వత్సా! పరబ్రహ్మ స్వరూపులగు ఆ ఉమాపరమేశ్వరులు భక్తసులభులు. వారి స్వరూపమును భక్తిచే తేలికగా తెలియవచ్చును. వారు తమ ఇచ్ఛతే సగుణ రూపమును స్వీకరించెదరు (46).

బ్రహ్మో వాచ |

ఇత్యుక్త్వా తత్‌ క్షణం మేశశ్శివం సస్మార స్వప్రభుమ్‌ | కృపయా తస్య సంప్రాప్య జ్ఞాన మూచే చ మాం తతః || 47

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి విష్ణువు వెను వెంటనే తన ప్రభువగు శివుని స్మరించెను. ఆయన కృపచే ఆయన స్వరూపము నెరింగి తరువాత నాతో నిట్లనెను (47).

విష్ణురువాచ |

విధే స్మర పురోక్తం యద్వచనం శంకరేణ చ | ప్రార్థితేన యాదావాభ్యాముత్పన్నాభ్యాం తదిచ్ఛయా || 48

విస్మృతం తవ తత్సర్వం ధన్యా యా శాంభవీ పరా | తయా సమ్మోహితం సర్వం దుర్విజ్ఞేయా శివం వినా || 49

యదా హి సగుణో జాతస్స్వేచ్ఛయా నిర్గుణశ్శివః | మాముత్పాద్య తతస్త్వాం చ స్వశక్త్యా సువిహారకృత్‌ || 50

ఉపాదిదేశ త్వాం శంభు స్సృష్టి కార్యం తదా ప్రభుః | తత్పాలనం చ మాం బ్రహ్మన్‌ సోమ స్సూతికరోsవ్యయః || 51

విష్ణువు ఇట్లు పలికెను -

హే బ్రహ్మన్‌ ! మనమిద్దరము శంకరుని సంకల్పముచే జన్మించిన సమయములో ఆయనను మనము ప్రార్థించగా, మనలను ఉద్దేశించి ఆయన అపుడు చెప్పిన పలుకులను గుర్తుకు తెచ్చుకొనుము (48). నీవా వృత్తాంతమునంతనూ మరచితివి. శాంభవీ పరాదేవి ధన్యురాలు. ఆమె చే జగత్తు సర్వము మోహింపబడినది. శివుడు తక్క ఇతరులు ఆమెను ఎరుంగజాలరు (49). శివుడు తన ఇచ్ఛచే నిర్గుణ స్వరూపము నుండి సగుణుడై నన్ను సృష్టించి, ఆ తరువాత నిన్ను సృష్టించెను. ఆయన తన శక్తితో లీలలను సృష్టించును (50). అపుడు శంభుప్రభువపు నిన్ను సృష్టిని చేయుమని ఆదేశించెను. హే బ్రహ్మన్‌! దాని పాలనను నాకు అప్ప జెప్పెను. నాశరహితుడు ఉమా సహితుడునగు శివుడే వాస్తవముగా జగత్కారణమగును (51).

తదావాం వేశ్మ సంప్రాప్తౌ సాంజలీ నత మస్త కౌ | భవ త్వమపి సర్వేశోsవతారీ గుణరూపధృక్‌ || 52

ఇత్యుక్తః ప్రాహ స స్వామీ విహస్య కరుణాన్వితః | దివముద్వీక్ష్య సుప్రీత్యా నానాలీలా విశారదః || 53

మ ద్రూపం పరమం విష్ణో ఈదృశం హ్యంగతో విధేః | ప్రకటీ భవితా లోకే నామ్నా రుద్రః ప్రకీర్తితః || 54

పూర్ణరూపస్య మే పూజ్యస్సదా వాం సర్వకామకృత్‌ | లయ కర్తా గుణాధ్యక్షో నిర్విశేషః సుయోగకృత్‌ || 55

అపుడు మనిమిద్దరము దోసిలి యొగ్గి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్థానములకు వచ్చితిమి. సర్వేశ్వరుడవగు నీవు కూడా గుణ సంహితుడవై రూపమును స్వీకరించి అవతరించుము (52). అని మనము కోరగా, కరుణామయుడు అనేక లీలలను సృష్టించుటలో నిపుణుడు అగు ఆ ప్రభువు నవ్వి, ఆకాశము కేసి చూచి మిక్కిలి ప్రీతితో నిట్లనెను (53). హే విష్ణో! నా శ్రేష్ఠమగు రూపము, నన్ను పోలిన రూపము, బ్రహ్మదేహమునుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర కీర్తింపబడును (54). ఆ రుద్రుడు నా పూర్ణావతారము. మీరు ఆయనను సర్వదా పూజించుడు. ఆయన మీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. త్రిగుణసాక్షి, నిర్గుణుడు, గొప్ప యోగమునకు ప్రవర్తకుడునగు ఆ రుద్రుడు లయమును చేయగలడు (55).

త్రిదేవా అపి మే రూపం హరః పూర్ణో విశేషతః | ఉమాయా అపి రూపాణి భవిష్యంతి త్రిధా సుతాః || 56

లక్ష్మీర్నామ హరేః పత్నీ బ్రహ్మపత్నీ సరస్వతీ | పూర్ణరూపా సతీ నామ రుద్రపత్నీ భవిష్యతి || 57

ఇత్యుక్త్వాంతర్హితో జాతః కృపాం కృత్వా మహేశ్వరః |అభూతాం సుఖినావావాం స్వస్వకార్య పరాయణౌ || 58

సమయం ప్రాప్య సస్త్రీ కావావాం బ్రహ్మన్న శంకరః | అవతీర్ణస్స్వయం రుద్రనామాకైలాస సంశ్రయః || 59

ఈ త్రిమూర్తులు నాకుమారులు. వారు నా స్వరూపమే రుద్రుడు విశేషించి నా పూర్ణాంశ గలవాడు. ఉమాదేవికి కూడ మూడు రూపములు ఉండగలవు (56). ఆమె లక్ష్మి అను పేరుతో విష్ణువునకు భార్య యగును. సరస్వతి అను పేరుతో బ్రహ్మకు పత్నియగును. ఆమె పూర్ణరూపముతో సతియను పేరుగలదై రుద్రునకు భార్య కాగలదు (57). మహేశ్వరుడు దయతో ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. మనము మనకు అప్పిగించబడిన కార్యముల యందు నిమగ్నులమై సుఖముగా నుంటిమి (58). హే బ్రహ్మన్‌! మనము కాలము వచ్చుటచే వివాహమాడితిమి. శంకరుడింకనూ వివాహమాడలేదు.ఆయన స్వయముగా రుద్రుడను పేర అవతరించి కైలాసము నాశ్రయించి ఉన్నాడు (59).

అవతీర్ణా శివా స్యాత్సా సతీ నామ ప్రజేశ్వర | తదుత్పాదన హేతోర్హి యత్నోsతః కార్య ఏవవై || 60

ఇత్యుక్త్వాంతర్దధే విష్ణుః కృత్వా స కరుణాం పరమ్‌ | ప్రాప్నువం ప్రముదం చాథ హ్యధికం గతమత్సరః || 61

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే బ్రహ్మ విష్ణు సంవాదో నామ దశమోsధ్యాయః (10).

హే ప్రజాపతీ! ఉమాదేవి సతియను పేర అవతరించును. ఆమె పుట్టుట కొరకు ప్రయత్నమును చేయవలెను (60). విష్ణువు ఇట్లు పలికి మిక్కిలి దయను చూపి అంతర్దానమాయెను. నేను మిక్కిలి అధికమైన ఆనందమును పొందితిని. నాలోని ఈర్ష్య తొలగి పోయెను (61).

శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్రసంహితయందురెండవది యగు సతీ ఖండములో బ్రహ్మ విష్ణు సంవాదము అనే పదియవ అధ్యాయము ముగిసినది (10).

Sri Sivamahapuranamu-I    Chapters