Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

ఈశ్వరముద్ర గల ధర్మద్రవ్యానికే విశ్వమంతటా చెలామణి

రెండుదేశాలకు నడుమ నొక పర్వతమున్నది. ఆవలి దేశపు ద్రవ్యం ఈవలా, ఈవలిదేశపుది ఆవలా చెల్లదు. ఈవలి దేశమందొక గృహస్థు విస్తారంగా ధనార్జనచేసి నాణములు నోట్లు దాచుకొన్నాడనుకొండి. కొంతకాలానికచట ఆరాజరికము, సంక్షోభము ప్రబలడంవల్ల అతని ద్రవ్యానికి భద్రత లేకపోయింది. అంతట ఆ గేస్తు తన ధనంతో కొండ కావాలి దేశంలో తలదాచుకోవాలనుకొన్నాడు. మోయతరంగానిధనరాశి నావలికి చేరవేయడం కష్టంగనుక చిల్లరమల్లర నోట్లను, నాణలను వదులుకోక తప్పిందికాదు. పెద్దపెద్ద నోట్లను, బంగారాన్ని మూటకట్టుకుని అతికష్టంతో కొండయెక్కి పారిపోజూస్తున్నాడు. త్రోవలో మహోదారు డొకడాతని కెదురై, ''ఎందుకయ్యా నీకంతకష్టం. ఇవిగో ఆవలి దేశంలో చెల్లే ఈ పెద్దనోట్లు పుచ్చుకుని ఈ మల్లేమూటా నాకిచ్చివేయమన్నా'' డనుకోండి. అపుడాగృహస్థు కెంతటిసంతోషంగలుగుతుందో ఆలోచించండి. మోయరాని తనబరువు వదలిపోయి, తేలికగా తనజేబులో ఇమిడే నోట్లకట్ట లభించిందికదా అని పరమానందం చెందుతాడు.

అలాగే మనం బ్రతికినన్నాళ్ళు సంపాదించి, దాచుకున్న ధనసంచయాన్నంతటినీ ఈ ఇహమందే విడిచిపెట్టి ఎన్నడో ఒకనాడు పరలోకయాత్ర చేయవలసివస్తుంది. అపుడు చిల్లిగవ్వ కూడా మన వెంటరాదు. ఈ సొమ్ముకు ఆ పరలోకమందు చెల్లుబడి లేదు. అయితే ఒక సదుపాయంలేకపోలేదు. ఇ ద్రవ్యమంతటినీ మార్చి పరమందు చెల్లుబడి అయ్యే ద్రవ్యాన్ని మనం సంపాదించవచ్చు. పరలోకపు బ్యాంకులో చెల్లుబడి అయ్యే ఆ నోట్లపై నాణములపై ధర్మముద్రవుంటుంది. ఆ ధర్మముద్రగల సొమ్మును మనం సంపాదించుకొంటే అది అచటి ధర్మబ్యాంకులో చెలామణి అవుతుంది. సకలలోక వ్యాప్తమైన ఆ ధర్మముద్రధరించిన నోట్లకు, నాణములకు భంగం కలుగదు.

కాబట్టి ఐహికమైనధనంసంచయంవల్ల మనకు వీసమైనా ప్రయోజనంలేదు. మనం ఇహలోకమందు చేసిన పుణ్యపాపకర్మలు, సంకల్పాలు ఇవియే మన మనస్సును పట్టుకొని, పుణ్యపాపాలనే పేరుతో పరలోకానికి మనలను వెటనంటుకొని వస్తవి. పరలోకమందు పుణ్యమనే విత్తానికిచెలామణి. ఆపుణ్యవిత్తం హెచ్చించి ఆ పరమందు నువ్వు సుఖాన్ని అనుభవించ గలుగుతావు. ఇహమందు మనోవాక్కాయములచే మనమాచరించిన పాపాన్ని - అచట అన్యాయార్జితంగా, చెల్లని ద్రవ్యంగా, ఎంచి, దానిని సంపాదించుకొన్నందుకు దండనం విధిస్తారు.

నీకు ప్రియమైన వస్తువేది? అని మనం ఎవరి నడిగినా వారిలో ఒకొకరు పెండ్లమనీ, బిడ్డలనీ, ఇల్లనీ, పొలమనీ ఇలా ఒకజాబితా వల్లిస్తారు. ప్రీతికి ఆస్పదములయిన ఈవస్తువులన్నీ నిజానికి మన దఃఖానికి ఆలంబనములని తేలుతున్నది. ఎందు వల్లనంటే, వీనిలో ఒక్కటీ మనవెంట వచ్చేదిలేదు. కనుక ఇవి అన్నీ దుఃఖహేతువులే అవుతవి. మనం బ్రతికివుండగానే వీనిని పోగోట్టుకుంటే, అయ్యో! పోయినవే నన్ను విడిచి-అనే దుఃఖం, మరణకాలమందు వీటినన్నిటిని వదలిపోతున్నా ననే దుఃఖం తప్పదు. కాబట్టి ఐహిక వస్తువులందు మనకుండే అనురక్తి, సంగమూ ఇవే దుఃఖానికి బీజములు, ప్రియవస్తు జాతమునుండి ఈ బలవంతపు టెడబాటు లేకపోతే దుఃఖానికి కారణంవుండదు. ఎడబాటు ఏట్లునూ తప్పదు. మరి ఆ ఏడబాటు దుఃఖరహితం ఎలా అవుతుంది? అనేది ప్రశ్న. నిస్సంగం వైరాగ్యం అనేవే దీనికిమందు. ప్రియవస్తువులకు, మనకు, ఒడంబడికవంటి దొకటి కుదిరితే సుఖంగా శాంతంగా వాటి నెడబాసి పోవచ్చు. ఆ ఎడబాటునే నిస్సంగమనీ, విరాగమనీ అంటారు. బలవద్వియోగంవల్ల కన్నీరు జారి తీరుతుంది. మామిడిచెట్టు నుండి పచ్చికాయను కోసిచూడు. ఆకోసినచోటు ద్రవం పుట్టుతుంది. ఆ ద్రవమే దుఃఖబాష్పాలు, మరి ఆరబండిన పండో తనంతతాను నిశ్చితంగా చెట్టునుండి విడివడినేలపై రాలుతుంది. అంతేకాదు. పచ్చికాయ చేదుగా, పుల్లగావుంటుంది. పండ్లు తియ్యగా వుంటవి. అపక్వమైన మనస్సుగూడా అపక్వఫలం వంటిదే గనుక సంసారవృక్షాన్ని అంటిపెట్టుకుని వుంటుంది. బలవద్వియోగం కలిగితే దుఃఖంపాలవుతుంది. పరిపక్వమనస్కులైన జ్ఞానులు ఎల్లకోరికలను విడనాడి సంసారమును ఇట్టే త్యజింపగలుగుతారు. అపక్వచిత్తులు చేదును పులుపును అనుభవింపగ తీరదు. మరి పరిపక్వహృదయలో - శాంతిపేరిటి అంతర మాధుర్యాన్ని చూరలాడుతారు.

కాబట్టి తలపులు, పలుకులు, చేతలు అనేవానిశక్తిని విశ్వమంతటా చలామణి అయ్యే ద్రవ్యంగా మార్చకోవచ్చు. అది మనచేతిలోని పని. ప్రతిదేశంలోను ఆయా దేశపాలకుల శిరస్సునో, ఇతరలాంఛనమునో నాణములపై ముద్రిస్తారు. ఆ ముద్రగల నాణము లాదేశములో మాత్రమే చెల్లుతవి. మరి ధర్మమనేద్రవ్యం అట్టిదికాదు. సకలలోకపాలకుడైన పరమేశ్వరుని ముద్రనుధరించే ఆ ద్రవ్యం ఎల్లలోకములందు చెల్లుతుంది. మనచే సంచితమైన ధర్మాన్నంతటినీ ఒకటే పెద్దనోటుగా మార్చకోవచ్చు. అది మనశరీరాన్ని అంటిపెట్టుకునేది కాదు. గనుక సులభంగా మన ఆత్మవెంట కొనిపోవచ్చు. అది అప్పుచేసి సంపాదించిన పాపపు నోటయితే అరెస్టువారంటు మన వెంటనే తయారవుతుంది. పుణ్యకర్మార్జితమైన నోటయితేనే నిలువసొమ్ముగా చెలామణి అవుతుంది. శరీరం సంపద, మనస్సు అనే మూడిటిలో రెండవది మనవెంటరాదు. దానిని మన బిడ్డలకోసం వదలివేయక తీరదు. మనశ్శరీరాలశక్తీ, ఆ రెండింటి చేతలూ - మరణానంతరం మనలను వెన్నంటివస్తవి. ఆ పరదేశానికి పర్వతమెక్కి వెళ్ళేటపుడు విషయవాంఛాశక్తీ, పాపభారం మనలను క్రుంగదీస్తుంది. కనుక పరలోక ప్రయాణం సుఖంగా జరగాలంటే మన మనోవాక్కాయకర్మలు అందు కనుగుణంగా వుండాలి. ఈ పనికి ప్రత్యేకకౌశల మక్కరలేదు. దొంగనోట్లు ముద్రించడానికి తెలివితేటలు కావాలి కాని, మంచిసొమ్ముకు అట్టి నేర్పుతో పనియుండదు. నిర్మలము, సరళము అయిన చిత్తంతో పరమేశ్వరి నామజపం చేస్తూ విషయాసక్తిని విడనాడి, ఆ పరమేశ్వరీ పాదకమలముల నంటిపెట్టుకుని వుంటేచాలు. ''పరమేశ్వరా! నీ అనుగ్రహానికి అర్హమైన పుణ్యం చేసినవాణ్ణిగాను, నాపాపాలను మన్నించి, నన్ననుగ్రహించి రక్షించుకో''. అంటూ పశ్చాత్తాపంతో, నిరహంకారంతో స్వామిని భజింతుముగాక!


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page