Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page

భగవద్గీతా ప్రథమశ్లోకం

''ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః,

మామకాః పాండవాశ్చైవ కి మకుర్వత సంజయ.''

గీతాహృదయమంతా యీ శ్లోకమందు నిక్షిప్తమై వుందని చెపుతారు. 'క్షేత్రే ధర్మక్షేత్రే(సతి) కురు మామకాః పాండవాశ్చైవ సమవేతా యుయుత్సవః కి మకుర్వత' 'సత్‌ జయ!' అని అన్వయించుకోవాలి. క్షేత్రం అనగా శరీరం ధర్మమాచరించుటకు యోగ్యమయిన దగుచుండగా, కుర్సుధర్మమాచరింపుము. ధర్మమెందులకాచరింపవలెనంటేఈశరీరమందు, మామక్సాఃఅహంకార మమకారములనే రాజసతామస గుణములును, పాండవ్సాఃతెల్లనైన సాత్త్వికవృత్తులును, యుద్ధమునకు సిద్ధముగా వున్నవి. ఈ రెంటి అలజడిని తప్పించుకొనుటకు (కిమకుర్వత) శాస్త్రవిహితములైన ధర్మము లాచరించాలి అనే అర్థం సిధ్ధిస్తున్నది.

గీతాచార్యులు -

''తస్మాత్‌ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మకర్తు మిహార్హసి''

''కార్యాకార్యవిషయమును శాస్త్రమే నీకు ప్రమాణం కాబట్టి శాస్త్రమందు చెప్పబడిన కర్మలనాచరింపుము.'' అని చెబుతున్నారు గనుక లౌకికములైనకర్మలకు ప్రాధాన్యంలేదు. అవి దేశ కాలపాత్రవశానమారుతూవుంటవి కనుక, సార్వత్రికములు కావు ఋషి ప్రోక్తములైన శాస్త్రములందు చెప్పబడిన ధర్మములట్టికావు. సృష్టినుండి ప్రళయమువరకు ఇహమునందు పరమునందు వాటికి ప్రామాణ్యం సుస్థిరముగా ఉంటుంది.

ఈ వ్యాఖ్యానం మరోవిశేషాన్ని కూడా చెబుతున్నది. శ్లోకాంతమందున్న సంజయశబ్దము సంబుద్ధిమాత్రమే కాదు. సన్‌ జయ అని దానికి పదవభాగం చెప్పుకోవాలి. శాస్త్రవిహిత కర్మలను ఫలాపేక్షలేకుండా ఆచరిస్తే నువ్వు సన్‌ సత్పురుషుడవై, జయ్సజయంపొందగలవు. సన్‌ అనేది సత్‌ అనేదానికి ప్రథమైకవచనం కనుక దానికి పవిత్రత అనే అర్థం చెప్పుకోవాలి. కటపయాది సంఖ్యా అనే సంఖ్యాశాస్త్రంవల్ల జ వర్ణమునకు 8, య వర్ణానికి 1 సంకేతములు. ఈ రెండూచేరితే 81 అవుతుంది. ''విపరీతక్రమో ద్రష్టవ్యః'' అనే సూత్రం వల్ల 81 అనే సంఖ్య 18 అవుతుంది. ఆ సంఖ్య జయమునకు సంకేతం.

మహాభారతమందు-

''నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్‌,

దేవీం సరస్వతీం చైవ తతో జయ ముదీర యేత్‌||''

అనే మంగళాచరణ శ్లోకంలోకూడా అంతమందు జయ శబ్దంకనుపిస్తున్నది. భారతమందు పర్వముల సంఖ్యకూడా 18. అక్షౌహిణుల సంఖ్యా పదునెనిమిదే. భారతయుద్ధం 18 దినములు జరిగింది. భగవద్గీతలో అధ్యాయములు 18. భారత మంగళాచరణమందున్న జయ అనేశబ్దం గీతాప్రధమశ్లోకాంతమందుకూడా కనిపిస్తున్నది. వీటినిబట్టి ఈ జయశబ్దానికి ప్రాముఖ్యం కలిగి అహంకారాదులను జయించినవానికి అంతమందు జయం తథ్యమని చాటిచెప్పినట్లేర్పడుతున్నది. ఉపక్రమోపసంహారములకు ఏకీభావం ఉండాలంటారుకనుక, ప్రధమ శ్లోకమందున్న ఈ జయశబ్దము గీతలోతుదిదైన 'యత్రయోగేశ్వరః కృష్ణో యత్ర పార్దో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోభూతిః ధ్రువానీతిర్మతిర్మమ' అనే శ్లోకమందుకూడా కనుపించటం విశేషం.

సకాలమందు భూమికి ఎరువువేసి, నీరుపెట్టి, దున్ని, విత్తి, కలుపుతీసినకర్శకునకు ఇతరమైన శ్రమలేకుండానేపంట చేతికివస్తుంది. అలాగే శరీరమనే క్షేత్రం ధర్మాచరణకు అనుకూలమై యున్నప్పుడు శాస్త్రవిహితధర్మం ఆచరించిన వానికి సత్త్వములభిస్తుంది. అతనికి యిక చేయదగినదంటూ ఉండదు సకాలమందు సత్కర్మనాచరించుటే నైష్కర్మ్యమునకు మార్గం. కర్మయే అకర్మణ్యతకు సాధన మవుతుంది. ఆ పిమ్మట పొందదగినదంటూ వుండదు. కనుక చేయదగినదీ ఉండదు. ఈవిధంగా భగవద్గీతా ప్రథమశ్లోకం వస్తునిర్దేశ రూపమయిన మంగళాచరణం చేస్తుంది.

ధర్మక్షేత్రే అనే శ్లోకానికి చెప్పబడిన ఈవ్యాఖ్యానం కొత్తగానూ, వింతగానూ కనుపించినా అర్ధవంతంగానూ, ఆశాజనకంగానూ ఉన్నది. ఈశ్వరునిపొందుట కనేక మార్గాలున్నట్లే, గీతావ్యాఖ్యానం కూడా 'నీటికొలది తామర' అన్నట్లు అనేక విధాలుగా చేయవచ్చు. ''యో యో యాం యాం'' అంటూ గీతాచార్యులు చెప్పనే చెప్పారు. కనుక సకలమార్గములు, వ్యాఖ్యానములు భగవతునియందు భగవద్గీతలయందు సార్ధకత్వమునే భజించును.


Jagathguru Bhodalu Vol-5        Chapters        Last Page