BHAGAVATA KADHA-3    Chapters   

మ న వి

శ్రీశ్రీశ్రీ ప్రభుదత్తజీ బ్రహ్మచారిమహారాజుగారు ప్రయాగ నివాసులు. వీరు గొప్ప పండితులగుటయేగాక హిందీభాషలో గొప్పకవులు. వచన రచనలో వీరు అందెవేసిన చేయి. వీరి "మహాత్మ కర్ణ" వంటి గ్రంథములను ఉత్తర ప్రదేశ్‌ లో బి. ఏ. కు, ఎం. ఏ కు పాఠ్య గ్రంథములుగ నిర్ణయింపఁ బడినవి. వీరు అమిత రసవత్తరముగ 'భాగవతచరిత' అను భాగవత గ్రంథమును రచించిరి. దానికి వ్యాఖ్యానభూతముగ 'భాగవతీ కథా' అను పేరుతో హిందీభాషలో షుమారు 100 భాగములను రచించిరి. వాటిని తెలుఁగులోనికి అనువదింప వలయునని వారు నా కాజ్ఞాపించుటచే నేను వాటిని తెలుఁగులోనికి అనువదించుచుంటిని. ఇదివఱకే ప్రథమ భాగమును గుంటూరు, శ్రీ రామనామక్షేత్రమువారును, ద్వితీయ భాగమును శ్రీ వావిళ్ల రామస్వామిశాస్తుర్లు అండ్‌ సన్సువారును ప్రచురించిరి. ఇన్ని భాగములను వారు ప్రచురింపఁగలరను నమ్మకములేక 'భాగవత కథా గ్రంథమాల' యను పేర సాధన గ్రంథ మండలి ద్వారా ఆంధ్రలోకమునకు ఈ దివ్య గ్రంథ విషయము నందింపఁదలఁచినాము. బ్రహ్మచారిగారు కొన్ని వేలసార్లు భాగవత గ్రంథమును 108 సార్లు అష్టాదశపురాణములను పారాయణముగావించి, ఆ సారమును 'భాగవతీకథా' రూపమున హిందీలో సరసవచన గ్రంథములుగఁ బ్రచురించు చున్నారు. ఈ గ్రంథమును జదివిన నిఁక యే సాధన గ్రంథమును గాని, యే పురాణమునుగాని చదువ వలసిన పనిలేదు. అన్నిటిసారము దీనిలో రాఁగలదు.

ఇట్టి గ్రంథమును సంవత్సరమునకు షుమారు 5 భాగములకు పైగాఁ బ్రచురింపఁదలఁచినాము. సంవత్సరమునకు, సభ్యులకు రు.10-0-0 లును, పోషకులకు రు. 25-0-0 లును, రాజపోషకులకు} రు. 58-0-0 లును, మహారాజపోషకులకు రు.116-0-0 లును, సంస్థాపకులకు రు.300-0-0 లును నిర్ణయింపఁబడినది. కావున మహాశయులను, ఉదారులును విరివిగా వివిధ చందాదారులుగఁజేరి ఈ సదుద్యమమునకుఁ జేయూత నొసంగఁ గోరుచున్నాము. సంస్థాపకుల ఫోటో ఒక భాగమున ముద్రింపఁ బడును. ప్రతిభాగమున పై తరగతులవారి నామములు ముద్రించి, గ్రంథము లుచితముగ పంపబడును. సాధన గ్రంథమండలి ప్రచురణలుకూడ పంపఁబడును.

మన్మథ ఇట్లు,

ఫాల్గుణము శ్రీ రా మ శ ర ణ్‌

కందుర్తి వేంకటనరసయ్య

BHAGAVATA KADHA-3    Chapters