Dharmakruthi  Chapters   Last Page 

9. శ్రీమఠం ఖైదు అయిన కథ

ఒకరోజు విదేశాలలో సైన్యం విద్రోహం చేసి ఆ దేశపు చక్రవర్తిని గృహనిర్బంధం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. శ్రీవారు ఆ రోజు సాయంత్రం చాలా తక్కువ మంది పరిచారక, భక్తవర్గంతో కూర్చుని ఉన్నప్పుడు మన శ్రీమఠం కూడా రెండు పర్యాయములు ఖైదీ అయినది తెలుసునా. అంటూ ప్రశ్నించారు. ఆశ్చర్యంగా తెలియదన్నట్లు తలలూపారు శిష్యులు. ''ఖైదు చేసినది శివాజీ మహారాజా'' అని నవ్వుతూ, ''ఈ కథ నాకు చెప్పినది, ఓ ముసలి మామ్మగారు. ఆమె కథాకథనశైలి చాల గొప్పది. ఈ కాలపు చరిత్రకారులు ఎవరూ చెప్పలేనంత వివరంగా చెప్పారామె. అసలీ కథలో ఆమె కూడా ఒక పాత్ర అంటూ ఆరంభించారు శ్రీచరణులు.

18వ శతాబ్దపు మొదటి దశాబ్దంలో మహారాష్ట్ర పరంపరకు చెందిన శ్రీ సర్వోజీ మహారాజా రాజ్యం చేస్తున్న కాలమది. సర్వోజీ మహారాజాకు, వారి బాబాయి వరుస అయిన అమరసింహునకూ, మనస్ఫర్థలు వుండేది. బ్రిటిష్‌ తెల్లదొరలు - పిల్లులకు రొట్టె పంపకం కథలో మధ్యస్థంగా వచ్చి, తీర్పు చెప్పినట్లు నటించి, మొత్తం తన్నుకుపోయిన కోతివలె - తీర్పు చెప్పారు. సర్వోజీరాజాను తంజావూరు రాజాగా చేశారు. అమరసింహుని తిరువడైమరుదూరుకు నామమాత్రపు రాజుగా చేశారు. కేవలం బిరుదుకు మాత్రమే రాజా. రాజా పట్టం పొందిన సర్వోజీ వారికి 'తంజావూరు', 'వల్లం' సీమలే మిగిలినాయి. మిగతావన్నీ మద్రాస్‌ ప్రెసిడెన్సీలో కలుపుకొనబడినవి. (పూర్తిక్షవరం చేసినారని శ్రీవారి సౌంజ్ఞ) బ్రిటిష్‌వారు రాజాలకు పెన్షన్‌, భరణంలాంటివి దండిగా ఇచ్చి సామర్ధ్యంగా వారి నోరు నొక్కేసేవారు - సర్వోజీరాజా, అమరసింహుల విషయంలోనూ ఈ విధంగానే జరిగింది. సర్వోజీ అమరసింహుల మధ్య ఎలాటి గొడవలు వున్నప్పటికీ ఇరువురూ మహాపండితులు. ఇరువురూ వేదశాస్త్ర విద్వాంసులనే కాక సకల కళలనూ పోషించారు. రాజాగా సర్వోజీవారు చేసినంత ఘనంగా చిన్న ప్రభువులైన అమరసింహులు కూడా సంస్కృతీ పోషణ చేశారు. అమరసింహులు తిరువడైమరుదూరులో స్థిర పడటానికి వచ్చినప్పుడు వారితో మహారాష్ట్ర పండితులనేకులు వలసవచ్చారు. వారితో బాటు స్థానికులయిన మహాపండితులుండేవారు. వీరందరినీ చేర్చి అమరసింహులు వేద, శాస్త్ర సంస్కృతీ పోషణములు చేసినారు.

తంజావూరు, మహారాష్ట్ర రాజుల పాలనలోనికి రాక ముందు నాయక రాజుల పాలనలో ఉండేది. ఆ నాయకరాజులకు కులగురువు, ప్రధానమంత్రి శ్రీగోవింద దీక్షితులవారు. వీరు హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. వారి కాలంలో అనేక మంది హోయసల కర్ణాటక బ్రాహ్మణులు తంజావూరు సంస్థానములో స్థిరబడినారు. ఆ కుటుంబములకు చెందిన వారొకరు అమరసింహుని కాలంలో మహాలింగస్వామి దేవాలయపు ఉత్తరవీధిలో వున్న మన శంకరమఠములో పూజ చేస్తూ ఉండేవారు. అంతేకాదు ఆ ఊరిలో శ్రీమఠ ముద్రాధికారిగా ఉంటూ ఆ చుట్టుప్రక్కల గ్రామములలో శ్రీమఠ శిష్యుల వద్ద అగ్ర తాంబూలము స్వీకరించి, అప్పటి పీఠాధిపతులయిన 64వ స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారు. వీరు స్వయముగా పండితులయినందు వలన, శ్రీమఠ ముద్రాధికారి అయినందు వలన, మహారాష్ట్ర పండితులలో వీరికెంతో గౌరవము ఉండేది. వీరింటిలో అందరూ మహారాష్ట్ర, కన్నడ, తమిళ భాషా సంస్కృతులలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. తిరువడైమరుదూరు కుంభకోణం మఠమునకు ఈశాన్య మూలగా 5 కి. మీ. దూరంలో ఉన్నది. కుంభకోణ శ్రీమఠంలో పూజారంభ సమయములో మ్రోగించబడే భేరీ వాద్యము విని, ఈ బ్రాహ్మణుడు కాలి నడకన శ్రీమఠానికి బయలుదేరేవారు.

ఇక్కడ భేరీ గురించిన అసక్తికరమయిన విషయం చెబుతాను. భేరీ రెండురకాలు ఒకటి నగారా, రెండవది ఢంకా. రెండునూ చర్మవాద్యములే. పై ప్రక్క వృత్తాకారమయినవే. నగారా వ్యాసము రెండు అడుగులు. క్రింద అర్థ వృత్తాకారమయిన భాండము ఇనుముతో చేయబడి ఉంటుంది. ఢంకా వ్యాసము ఒక అడుగు, క్రింది భాగము చెక్కతో చేయబడి ఉంటుంది. వీటిని చోపు కఱ్ఱలతో మోగిస్తారు. ప్రక్కన పెద్ద జాలరా కూడా మ్రోయింప బడుతుంది. ఈ నగారా ఢంకా, జాలరాలు లయవిన్యాసంగా, శ్రుతిబద్దంగా మ్రోయించడానికి మన శ్రీమఠంలో ఒక కుటుంబమే ఉండేది. వారెవరని తెలిస్తే మీకాశ్చర్యంగా ఉంటుంది. వారు తురుష్కులు. వారు ఉర్దూ భాష మాత్రమే మాట్లాడగలరు. ఉడయార్‌పాళెం జమీందార్లకు మన మఠంపై అత్యంత భక్తి ప్రపత్తులున్నాయి. వారే ఈ తురష్కులను ఈ కైంకర్యమునకు మన వద్దకు పంపినారు. అంతేకాదు, ఊరేగింపు సమయంలో కూడా గుఱ్ఱపు స్వారీ కూడా వీరే చేసేవారు. నే కథ చెప్పే కాలంలో శ్రీమఠపు వాకిలిలో భేరీ మంటపమని ఎత్తైన మండపము ఒకటి ఉండేది. ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో కట్టి ఉండటంవలననూ ఇప్పటి వలే బస్సు, లారీల వల్ల సంభవించే శబ్దకాలుష్యం లేనందువల్లనూ, ఈ భేరీనినాదం తిరువడైమరుదూరులోని ఈ బ్రాహ్మణునికి స్పష్టంగా వినిపించేది.

సరి! భేరీ నినాదం విని బయలుదేరిన ఈ బ్రాహ్మణుడు దీపారాధన సమయమునకు శ్రీమఠం చేరి స్వామివద్ద తీర్థస్వీకారం చేసి, శ్రీమఠ సంతర్పణలో తృప్తిగా భుజించి, విశ్రాంతి తీసుకొని శ్రీమఠకార్యము లేవైనా ఉంటే చూసుకొని, సాయంసంధ్యా సమయనాకి తిరిగి తిరువిడైమరుదూరు చేరేవారు. ఆచార్యాశీర్వాదమున వారికి ఇరువురు పుత్రులు కలిగారు. ఇరువురూ శ్రీమఠవేద పాఠశాలలో క్రమంగా ఋగ్వేదాధ్యయనం చేశారు. పెద్ద కుమారులు తండ్రి పూజ, ముద్రాధికారమున్నూ స్వీకరించి తిరువిడైమడుదూరులోనే స్థిరబడినారు. ఇక రెండవవారు (ఇక ముందు వీరు ద్వితీయులని వ్యవహరించబడతారు) వేదాధ్యయనాంతరము శాస్త్రం చదువుకొన్నారు. మంచి తేజస్వి, బుద్దిశాలి, సమర్థుడు అయినందువల్ల ఆచార్య స్వామి విశేష కృపకు పాత్రులయినారు. వీరు స్వగ్రామము పోక శ్రీమఠములోనే ఉండిపోయి, మఠకార్యక్రమములలో సుశిక్షితులయినారు. అత్యల్పకాలంలోనే వీరికి శ్రీమఠంలో అత్యంత ముఖ్యమయిన పనులు అప్పగించబడినాయి. అన్నట్లు విద్యాభ్యాసమయిన వెంటనే ఇరువురికి వివాహమయినది.

అది 1843 - 44 ప్రాంతపు కాలం. తిరువానైక్కావల్‌ లోని అఖిలాండేశ్వరీ అమ్మవారి తాటంకములను పునఃప్రతిష్ఠ చేయవలసిన సమయమాసన్నమైంది. ఆదిశంకర భగవత్పాదులే మొట్టమొదట అమ్మవారి ఉగ్రకళను ఉపశమించడానికి శ్రీచక్రాకారమయిన ఈ తాటంక ప్రతిష్ట చేసినారు. అవి మరమత్తు చేయవలసిన అవసరం కలిగినపుడు, మన పీఠ ఆచార్యులే జీర్ణోద్దరణం చేయడం అనూచానంగా వస్తున్న ఆచారం. ఇప్పుడు నే చెప్పేకాలంలో ఆ ఆలయ అర్చక, అధికార, భక్తజన బృందం ఈ కార్యక్రమం నిర్వర్తించవలసినదని అప్పటి మన 64వ స్వామివారిని ప్రార్ధించినారు. స్వామివారునూ తమ పరివారంతో తిరువానైక్కావల్‌ చేరినారు. ఈ తాటంక ప్రతిష్ఠా సంబంధమయిన భాద్యతలన్నీ ఈ ద్వీతీయునకొప్పగింపబడినవి.

ఆ మహోన్నతమయిన ఏర్పాట్లను ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తున్న సమయంలో ఒక పెద్ద విపత్తు వచ్చిపడింది. తిరుచినాపల్లి కోర్టులో తాటంక ప్రతిష్ఠ విషయికంగా ఒక దావా దాఖలు చేయబడింది. లిటిగేషన్‌ అంటే వెంటనే అవుతుందా! చాలాకాలం మఠం అక్కడనే ఉండిపోవలసి వచ్చింది. మఠ గౌరవమునకు సంబంధించిన చిక్కులు, దావా వ్యవహారములు, మరి మఠం ఇతర ఊర్లలో ఉండవలసి వచ్చినపుడు వచ్చే చిక్కులన్నీ వీరే పరిష్కరించవలసి వచ్చింది. ఎంతో శ్రమపడవలసి వచ్చింది. వారి శ్రమ వృధా కాలేదు. అమ్మవారి అనుగ్రహం వల్ల కోర్టులో శ్రీమఠ పక్షంగానే తీర్పీయబడినది. ఇలాంటి కేసుల్లో వాది ప్రతివాదులు పై పై కోర్టులకు పోతూనే ఉంటారు కదా! ఈ విషయంలోనూ ఆ రకంగానే జరిగింది. అనాటి న్యాయవ్యవస్థ ప్రకారం ప్రిన్సిపల్‌ సదర్‌ అమీన్‌ కోర్టు, సివిల్‌ కోర్టు, సదర్‌ అదాలత్‌ అని పిలవబడే హైకోర్టు ఉండేవి. ఈ మూడింటిలోనూ వాది అంచెలంచెలుగా కేసు వేసినప్పటికీ ప్రతిచోట శ్రీమఠానికి అనుకూలముగా తీర్పు ఇయ్యబడినది.

దీనికంతటికీ ఎంత సమయమయిందనే విషయం నాకు కథ చెప్పిన మామ్మగారు చాలా చమత్కారంగా చెప్పారు. ఆ కాలపు వృద్ధులకు కాలెండర్‌ ప్రకారమో, పంచాంగం ప్రకారమో కాలం చెప్పడం చాత కాదు. అందువల్ల ఆమె - మఠం తిరువానైక్కావల్‌ చేరిన తొలి రోజుల్లో ఓనాడు శ్రీచరణులు (స్వామివారు) అభిషేక సమయంలో చంద్రమౌళీశ్వరునిపై నిమ్మరసం పిండారు. పిదప ఆ నిమ్మడిప్ప స్వామి అతిలాఘవంగా విసరగా అది సాధారణంగా మండువా ఇళ్ళ మధ్య మట్టితో నిండి కప్పులేకుండా ఉండే ప్రదేశంలో పడింది. అందున్న ఒక బీజం మొలకెత్తి, పెరిగి, కొమ్మలు వేసి, పుష్పించి, ఫలించి ఆ ఫలములు తిరిగి స్వామివారి చేతిలోనికి అభిషేకార్థము వచ్చినవి. మళ్ళీ ఆ ఫలాలతో చంద్రమౌళీశ్వరునికి అభిషేకం చేసిన తరువాతే స్వామివారు ఆ ఊరునుండి కదిలారు-అని చెప్పారు. సాధారణంగా నిమ్మ చెట్టు పెరిగి, ఫలించడానికి నాలుగయిదు సంవత్సరములు పడుతుంది కాబట్టి, శ్రీమఠం తిరువానైక్కావల్‌లో నాల్గయిదేండ్లు న్నదనుకోవచ్చును. కేసు సానుకూలంగా ముగిసిందనే సంతోషం, ఇంతకాలం నిలుపవలసివచ్చిన తాటంక ప్రతిష్ట ఇప్పుడు జరుపుటకు అవకాశం దొరికినదనే ఉత్సాహం, ఈ పరీక్ష ద్వారా (అమ్మవారు) తమ బలం, తన అనుగ్రహం చూపింది అనే కృతజ్ఞత, ఈ భావనలన్నీ కూడుకొని తాటంక ప్రతిష్ఠ అనేకరెట్ల ఆనందోత్సాహములతో పరమ వైభవోపేతంగా జరుపబడింది. ఈపరమమైన కీర్తిలో ఎక్కువపాలు మన ద్వితీయునికే చేరింది.

అయితే కేసు నడిచే కాలంలో వారికో వైయక్తిక మయిన పెద్ద కష్ఠం వచ్చిపడింది. పిన్నవయస్కురాలయిన వారి భార్య కాలం చేసింది. శ్రీమఠసేవకే తనని తానర్పించుకొన్న వీరిని ఈ విషయం కష్టపెట్టందో లేదో మనకు తెలియదుకానీ, ప్రతికక్షులు మాత్రం వీరు చేసిన ఈ పెద్ద ఆర్బాటం వల్లనే అమ్మవారు నెత్తి అడించిందని పుకార్లు లేవదీసి ప్రచారం చేశారు. అది కూడా వీరు లెక్కచేయలేదు. అయితే శ్రీమఠానికై తమ తనువు, మనస్సు అర్పించి సేవచేస్తున్న వీరిపై ఈ నీలాపనింద స్వామివారి కరుణా పూరితమైన హృదయమును కలచి వైచింది. అందువల్లనే తాటంక ప్రతిష్ట అయిన చేతితోనే ఈ ద్వితీయునికి, అమ్మవారి సన్నిధిలో, ఎనిమిదేళ్ళ కన్యతో వివాహం చేయించారు.

మన ద్వితీయునకు ద్వితీయ భార్యగా వచ్చిన ఈ కన్య ఉత్తమ పతిని ప్రసాదించిన అమ్మవారిని ముసలివగ్గు అయి కన్నుమూసే వరకూ నిత్యపూజ చేస్తూ వచ్చారు. అప్పర్‌ కుడందైకీళ్‌ కోట్టం (కుంభకోణపు తూర్పు కోట) అని పాడిన తిరునాగేశ్వరస్వామి వారిని ప్రతి రోజూ వదలకుండా దర్శనం చేస్తూవచ్చారు. ఈ కథంతా నాకు చెప్పినది వారే.

సరి! అసలు కథకు వద్దాం. శ్రీమఠం కుంభకోణమునకు తిరిగి ప్రయాణమయ్యింది. ఇన్ని సంవత్సరముల ఆదాయ వ్యయపట్టిక చూసి, వ్యవహారములన్నీ చక్కబరచి కదా వెళ్ళవలసినది? లెక్కలు చూశారు. ఒక్కసారి విద్యుద్ఘాత మిచ్చినటయినది. బహుకాలం దావా అడిన ఖర్చు, బయట ఊరిలో వుండవలసి వచ్చినందు వలన అయ్యే అదనపు ఖర్చు అంతా చేరి తడిసి మోపెడయ్యింది. శ్రీమఠం అప్పులలో మునిగిపోయి ఈ క్లిష్ట పరిస్థితి నుండి గట్టెక్కి, ఊరుదాటి బయట పడగలమా అనే అధైర్యమేర్పడింది.

స్వామివారికి కూడా ఒక్కటే మనఃక్లేశము నా కాలంలో మఠానికి ఇంత క్లిష్ట పరిస్థితి వచ్చిందేమా అని. నేనీ కేసు వ్యాజ్యము లాంటి లౌకిక వ్యవహారాలలో ప్రవేశించాల్సిన అవసరం రాకుండానే సర్వజనామోదకంగా ఏది జరిగితే మంచిదో ఆ మంచి జరిగి వుండకూడదా! కక్షిదారులు తమకే ఆ ప్రతిష్ట రావాలని కేసు వేసినపుడు, ఎదురు వ్యాజ్యమాడక వారికే ఆ ప్రతిష్ట వదిలితే పోయేదికాదా! అని వారు ద్వితీయుని ముందు క్లేశపడినారు. కార్యనిర్వాహణాధికారిగా వున్న వీరికి తాము సరిగా కార్యము నిర్వర్తింప జాలనందులకే స్వామివారికి మనఃక్లేశ##మేర్పడినదని బాధవేసింది.

బాగుంది! విజయం కలిగిన వెంటనే మనకు అహంకారమెక్కడ పెరిగిపోతుందో అని అమ్మ ఈ రకమైన కష్టములు కలగచేస్తుంది. అమె కృప చేతనే కష్ట నివృత్తికి దారి దొరుకుతుందనే నమ్మకంతో మనస్సులో నొచ్చుకోకుండా మన కర్తవ్యము మనం నిర్వహించుకు పోతూ వుంటే తుదకు సంతోషం, జయం లభిస్తాయి. ద్వితీయులు శ్రీచరణులపై, అమ్మవారి అనుగ్రహ బలంపై నమ్మకముంచి ఈ క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనడానికి తన వల్లనయ్యే అన్ని ప్రయత్నాలూ చేయడానికి తీర్మానించుకొన్నారు. తన ప్రయత్నాలు ఏరకంగా ఫలిస్తాయో అని స్వామివారితో సహా ఎవరకీ తెలియపరచకుండా, చడీచప్పుడు చేయకుండా తాను నిర్ణయించుకొన్న ప్రణాళికను అమలుపరచ సంకల్పించారు.

వెంటనే తంజావూరు వెళ్ళారు. అప్పటికే సర్వోజీరాజా కాలం ముగిసి వారి పుత్రుడు శివాజీ మహారాజు రాజ్యానికొచ్చారు. వారి వద్దకు పోయిన ఈ ద్వితీయులు, మఠగౌరవానికి భంగము వాటిల్లని విధంగా నాజూకుగా విషయం తెలియచేశారు. ఒక పెద్ద వ్యాజ్యం జయించి తంజావూరు సీమకే ప్రతిష్ఠ తెచ్చిన శ్రీమఠాన్ని తిరుచ్చి నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు ఆహ్వానించి తగిన మర్యాద చేస్తే బాగుంటుందని సూచించారు. రాజావారు ఏ రకమైన ఇబ్బందుల్లో వున్నారో, వెంటనే ఆ సూచనను ఒప్పుకోనూ లేదు. తిరస్కరించనూ లేదు. మూడునాళ్ళు ఆలోచించి తుదకు తన అశక్తతను తెలియబరిచారు. రాజుగార్ని కలిసి శ్రీమఠాన్ని ఈ ఇక్కట్టు నుండి కొంత వరకూ బయట పడవేయవచ్చని దిటవు చేసుకున్న ఈ ద్వితీయుని హృదయం మరల దిజగారిపోయింది. తన ఉద్దేశ్యము మంచిదే అయినప్పటికీ తన గురువులయిన శ్రీచరణులు ఆజ్ఞ తీసుకొనకయే, వారి ఆశీర్వాదము లేకయే ఈ ప్రయత్నము చేసినందున శ్రమ వృధా అయింది అని చాలా బాధపడ్డారు. స్వామివారి వద్దకు తిరిగి వచ్చి తన హృదయవేదనంతా వెళ్ళ బోసుకున్నారు. స్వామివారు ఎంతో దయతో ఓదార్పు వాక్యములు పలికి ''అమ్మ దయ! అంతా ఆమె దయకు వదిలి మనం బయలుదేరుదాం'' అంటూ శ్రీమఠం కుంభకోణం తిరుగు ప్రయాణానికి ఆజ్ఞాపించారు.

శ్రీమఠం కుంభకోణానికి బయలుదేరింది. తిరువానైక్కావల్‌ నుండి కుంభకోణం పోయేటప్పుడు తంజావూరు మీదుగా పోనవసరం లేదు. కోవలడి మీదుగా మఠం పరివారం, బళ్ళు, లొట్టి పిట్టలు, ఏనుగులు, గుఱ్ఱపు బళ్ళు ఈ విధంగా సాగిపోతున్నాయి. వెనుక మేనాపై స్వామి వెళుతున్నారు. బళ్ళు తిరువయ్యార్‌కి కావేరి అవతల గట్టునే సాగిపోతున్నాయి. హఠాత్తుగా అనేక మంది సిపాయిలు ఆ బళ్ళను చుట్టుముట్టి, కావేరిలో దింపి ఇవతలి గట్టు మీదుగా తంజావూరు మార్గం పట్టించారు. బండి వారంతా ఇవి శ్రీమఠం బళ్ళు, మేమీ గట్టు%ినే పడి కుంభకోణం పోవలెనని విన్నవించుకొన్నారు. సిపాయిలు వింటేనా! వారిలో కొందరు ఆ బళ్ళకు కావలిగా పోయారు. వెనుక వస్తున్న ఏనుగులు, గుఱ్ఱములు, ఒంటెలకు కూడా అదే గతి పట్టింది.

స్వామి మేనా కూడా ఆపబడింది. అయితే వారితో ఎంత మర్యాదతో ప్రవర్తించారు. రాజాగారి పురోహితులు పూర్ణకుంభములతో స్వామిని తంజావూరు విచ్చేయవలెనని ప్రార్థించుచుండగా, నాల్గుప్రక్కల సిపాయిలు మోహరించి ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా సిపాయిలు Coup చేసినపుడు రాజుగారిని ఎంతో మర్యాదగా గృహనిర్బంధం చేస్తారు కదా! తానా విధంగా చేయబడినానని అర్థం చేసుకున్నారు స్వామివారు.

స్వామివారు అంతకు 8 - 10 సం.. ముందు కామాక్షిదేవి ఆలయము జీర్ణోద్దారణ, కుంభాభిషేకము చేసినవారు. అమ్మవారే స్వప్నంలో ఆదేశించి వారి మూలంగా కుంభాభిషేకం చేయించుకున్నది. పిదప ఇప్పుడు అఖిలాండ్వేరీ తాటంక ప్రతిష్ఠ చేసారు. అయినా తిరువానైక్కావల్‌ నుండి బయలుదేరే ముందు - అంతా అమ్మ దయకు వదలి బయలు దేరుదాం- అని కదా బయలు దేరారు. ''అమ్మా నీదయ! ఈ రకంగా నడుపుతున్నావా? అయితే ఇదీ సమ్మతమే'' అనుకుంటూ సిపాయిల మధ్యలో బ్రాహ్మణుల వేద ఘోష నడుమ స్వామి తంజావూరు బయలుదేరారు.

ఈ రకంగా సిపాయిలను పంపినది సర్వోజీ మహారాజా వారి పుత్రులు శివాజీ మహారాజా! శ్రీమఠాన్ని ఆహ్వానించి మర్యాద చేయడానికి తగిన వసతి లేదని మూడు రోజుల ప్రతీక్షానంతరము చెప్పినది వీరే! శ్రీమఠాన్ని శివాజీ మహారాజా అరెస్ట్‌ చేయించారు అని మొదట్లో చెప్పానుకదా! అది వీరిని ఉద్దేశించి చెప్పినదే. మీరందరూ ఛత్రపది శివాజీ అని ఏమరుపాటునొంది ఆశ్చర్యపోవాలనే ఆ రకంగా చెప్పాను. కథారసం కోసం ఈ రకంగా చెప్పాను. కథారసం కోసం ఈ రకంగా కికురించడం కవులకు సహజమే కదా! మీకందరికీ చరిత్ర గుర్తు ఉండి ఉంటే అంత ముందు శతాబ్దంలోని ఛత్రపతి ఈ కథలోనికి ఎలా వచ్చారా అని మీకు వెంటనే సంశయం కలిగి నన్నడిగి వుండేవారే!

సరి! నిర్బంధింపబడి తంజావూరునకు కొనిపోబడిన అనంతరం శ్రీమఠానికి కోలాహలమయిన రాజోపచారం జరగ నారంభించింది. వెన్నట్రంగరై సత్రం మొదలయిన పెద్ద సత్రములు శ్రీమఠ నివాసార్థం ఏర్పాటు చేయబడినవి. ఒక్కో సత్రంలోనూ గుండోదరుని కథలో సుందరేశ్వరుడు సృష్టి చేసిన మాదిరి భక్షణాల గుట్టలు అన్న పర్వతాలు అమర్చబడినాయి. విడవకుండా ఒకదాని తరువాయిగా ఇంకొకటిగా ఈ మర్యాద లేమి? ఆది అలా ఉండనీయండి. భక్తితో ఆహ్వానించకుండా ఈ మొరటు నిర్బంధ భక్తి ఏమి? అంతా చంద్రమౌళీశ్వరుని పనే!

ద్వితీయునితో శ్రీమఠాన్ని ఆహ్వానించడానికి సావకాశం లేదని త్రిప్పి పంపిన రాత్రి రాజావారికి కలవచ్చింది. స్వామివారికి కామాక్షి దేవి స్వప్నంలో సాక్షాత్కరించి జీర్ణోద్దరణ కుంభాభిషేకాదులకు ఆనతి నిచ్చిన రీతి రాజావారి కలలో చంద్రమౌళీశ్వరుడు దర్శనమిచ్చి, తాను వసించియున్న మఠమునకూ, తదాచార్య స్వామికీ ఉపచారమొనరింప వలసినదిగా ఆదేశించినారు. అవిధేయుడైన పుత్రునిపై తండ్రికి అతి ప్రేమ ఉండే విధాన రాజావారు కుదరదని తిరస్కరించిన దానికి బహుమానంగా చంద్రమౌళీశ్వరుడే సాక్షాత్కరించారు. అందు వలననే వారికంత ఆనందమూ, సంభ్రమమూనూ.

మరి ఈ రాక్షస భక్తో? కొంచెంనాళ్ల ముందుగానే కదా శ్రీ మఠ నిర్వహణాధికారిని ముఖం మీద కుదరదని చెప్పి త్రిప్పి పంపివేశారు. రాజ సింహాసనానికి పైనది ఈ ఆదిశంకరుల ధర్మాసనం. ఇప్పుడు వచ్చి ఆహ్వానిస్తే నీవు ఆడిన ఆటకల్లా మేము తాళ##మేస్తామా అని శ్రీమఠమనవచ్చు. వైయక్తికంగా స్వామి మానాభిమానములకు అతీతులయి ఉండవచ్చు. కీడు చేసిన వారిని కూడా మనః పూర్వకముగా ఆశీర్వదించే వారుగా ఉండవచ్చు. అయితే పీఠగౌరవ విషయంలో కొంచెం అయినా బిగువు సడలించరు కదా! ఇదంతా రాజు ఆస్థాన పురోహితులతో, విద్వాంసులతో ఆలోచించే ఈ అసుర భక్తి ప్రదర్శించారు. అయినా ఇదంతా మనకీ స్వారస్యమైన కథ ప్రసాదించడానికే కావచ్చు.

చంద్రమౌళీశ్వరుడు మంచి లాభం సంపాదించుకొన్నాడు. శివాజీ రాజా చంద్రమౌళీశ్వర పూజార్థం అనేక స్వర్ణ పాత్రలు, నవరత్న ఖచిత పాత్రలు, బంగారు కవచం తొడిగిన దక్షిణావర్త శంఖం సమర్పించారు. శ్రీవారిని ఎంతో వైభవంగా ఊరేగించారు. జోడు ఏనుగుల వెనుక పెద్ద వెండి అంబారీ కట్టి దానిపై ఊరేగవలెనని స్వామివారిని ప్రార్ధించారు. ఇప్పుడు శ్రీమఠంలో పూజకోసం ఉపయోగించే వెండి రథానికి నాలుగింట మూడు వంతులుంటుందట. ఈ అంబారీ ఎనిమిది కాళ్ళతో అష్టకోణంగా ఉండేదట. స్వామివారు పైకి ఎక్కడానికి అంబారీ కాళ్ళు అవరోధంగా ఉన్నవనీ, అంబారీ కొంచెం వంచితే అనుకూలంగా వుంటుందనీ గ్రహించారు రాజాగారు. వెంటనే స్వయంగా నిచ్చెనలాంటి వేమి లేకుండానే ఒకే గంతులో ఏనుగునెక్కి అంబారీ గోపురాన్ని ఒక చేత్తో త్రోసిపెట్టి భుజం అంబారీ పీఠం క్రింద మోపి పెట్టి స్వామివారి ఆరోహణకు సౌకర్యం చేసి, ముగిసిన వెంటనే చెంగున క్రిందికి దుమికారట రాజాగారు. రాజ మర్యాదానుసారం, అంబారీ ప్రక్క రక్షకస్థానంలో రాజుగారి ఒకే కూతురి భర్త అయిన సహారాం సాహెబు కూర్చుని ఉన్నారు.

ఆ వెనుక ఇదే మాదిరి అంబారీ కట్టబడిన ఏనుగుల జోడి ఉన్నది. అందులో అంబారీ ముందు ప్రక్క రాజావారు కూర్చుని ఉన్నారు. అది రాచ మర్యాద. అది విశేషం కాదు. వెనుక ప్రక్క పరమ మర్యాద సూచకమయిన రక్షక స్థానంతో ఎవరు కూర్చున్నారు అన్నదే విశేషం. పూర్వం ముఖంపై కొట్టి పంపటమే తరువాయిగా చేసి త్రిప్పి పంపబడిన ద్వితీయులు!! పూర్వం దక్కవలసిన మర్యాద వడ్డీతో సహా తీర్చుతున్నట్టు రాజావారు తమ ప్రక్క కూర్చుండ పెట్టుకొని ఊరంతా చూపి గౌరవించారు.

ద్వితీయునిది లజ్జా స్వభావం అది తెలిసిన రాజాగారు ఎవరూ చూడకుండా అంబారీలో ఊరేగే సమయంలో దోసిలి నిండా స్వర్ణపుష్పాలు గ్రహించి ఈ ద్వీతీయునకు బహుకరించారు. ఆ పరమ వైభవంలో అవి తమంతట తామే మూట కట్టుకోవడం లేకిగా, అనుచితంగా ఉంటుందని భావించిన వీరు, క్రిందనున్న గుంపులో, తనకు బాగా కావలసిన వృద్ధుని చేతిలో పోశారు. ఆయన ఆ మూటతో పలాయనం చిత్తగించారు. దాన్ని సరుకు చేయలేదీయన. ఆత్మార్ధంగా తాను గురువులకు చేసే కైంకర్యమునకు గురు కటాక్షరూపంగానే ప్రతిఫలం ఉండాలిగానీ, ధనరూపంగా కాదని భావించారు. ఊరందరికీ తెలపేటట్లు రాజుగారు ఇంకో మర్యాద చేశారు. వారికి ''హెజీబ్‌'' అనబడే గౌరవ పదవి ఇచ్చారు. పరమ ప్రతిష్టాకరమైన సంస్థకు ప్రతినిధులుగా ఉన్నవారు రాజ్యాంగంతో నేరుగా వ్యవహరించడాని కుద్దేశించినది ఈ పదవి. రాజు వీరికి స్వర్ణపుష్పములకు బహుకరించినది గుంపులో ఎవరికి తెలియదు. వారంతా స్వామివారి ఊరేగింపు సంరంభం, తమ రాజావారితో వెళ్ళే ఆయన గొప్పదనం తెలుసుకొని శ్లాఘించడంతో పూర్తిగా నిమగ్నమయి ఉన్నందున అది గ్రహించే అవకాశం లేకపోయింది.

ఆ సంరంభంలో అఖిలాండేశ్వరీ దేవాలయంలో అమ్మవారి సన్నిధిలో ఈ ద్వితీయుడు పాణిగ్రహణ మొనరించిన ఆ ఎనిమిదేళ్ళ చిన్నపిల్ల కూడా ఉన్నారు. ఆ బాల చుట్టూ ఊరి సువాపినులంతా చేరి రాజావారి ప్రక్కన రాజాలాగా వెలిగిపోతున్న నవ ¸°వనుడయిన శాస్త్రిగారు ఈమె భ##ర్తే అని బహుధా ప్రశంసింప సాగారట. ఆ మాటలకీ చిన్నపిల్లకు సిగ్గుతో ఏడ్పువచ్చేది. సిగ్గుతో ఆమె ఎక్కడికి పారిపోతే అక్కడంతా సువాసినులు చుట్టేశేవారట. పాపం ఈ చిన్న పిల్ల ఏం చేస్తుంది. అందరూ ఆనందంలో మునక లేస్తుంటే, ఆ చిన్నపిల్లకు సిగ్గూ, ఏడుపూనూ. అయితే ఆనందంలేదా అంటే ఈ సిగ్గూ దుఃఖాలకు సమానంగా అదీ మనసులో ఉన్నదట. ముసలివగ్గు అయిన తరువాత అంటే 50 సంవత్సరాల తరువాత ఈ కథ చెప్పేటపుడు కూడా ఆమె ఈ మిశ్రమ భావనలతో సతమతమవుతూ, అనుభవిస్తూ చెప్పారు. అదీకాక మొదట్లో తనకు అప్పట్లో తెలియని తన భర్త గొప్పదనాన్ని ఎంతో గర్వంగా కూడా చెప్పుకొన్నారు.

శ్రీమఠానికి రాజుగారు చేసిన మర్యాదలకు శిఖరంగా పీఠం కుంభకోణానికి బయలుదేరే ముందు స్వామివారికి కనకాభిషేకం చేశారు. వారిని ఆహ్వానించడానికే డబ్బు లేదని చెప్పిన రాజుగారు స్వర్ణపుష్పాలతో స్వామి నిండిపోయేంతవరకూ అభిషేకం చేశారు. ద్వితీయుల శ్వాస ఆశ్చర్యంతో నిలిచిపోయినంత పని అయింది. వారి ఆనందానికి అంతేలేదు. 5000 వరహాల బంగారం. (సుమారు పది కిలోలు). జంబుకేశ్వరంలో చేసిన అప్పంతా ఈ బంగారంతో తీర్చివేయవచ్చు. అలానే కుంభకోణం చేరిన వెంటనే జంబుకేశ్వరపు అప్పులు తీర్చివేశారు. మిగిలిన బంగారాన్ని నవనిధులను కాపాడే నాగుబామువలె కాపాడుతూ వచ్చారు ఈ ద్వితీయులు.

స్వామివారికి కూడా అమ్మవారి దయతో అప్పు తీరిందనే తృప్తి. కామాక్షి అఖిలాండేశ్వరీ అమ్మవార్ల కార్యాలు తన హయంలో పూర్తి చేయగలిగాననే సంతృప్తి. ఆ తరువాత రెండు మూడు సంవత్సరాల్లోనే స్వామివారు పరిపూర్ణ తృప్తిపదాన్ని పొందారు. రాజదృష్టియే దోషమంటారు. రాజుగారి చేత అత్యంతమైన మర్యాద పొందినందుననే ఈ రకంగా అయిందని ఊరిలో చెప్పుకొన్నారు. సిద్దిపొందక ముందే స్వామివారు తమ వారసుని, తరువాతి పీఠాధిపతిని నియమించారు. వారెవరో కాదు శంకర మఠంలో పూజ చేస్తూ, శ్రీమఠ ముద్రాధికారిగా తిరువడైమరుదూరులో స్థిరబడిన మన ద్వితీయుల అన్నగారి కుమారులే.

వారు బాల్యంలోనే పాండిత్యంలోనూ, దాన ధర్మాలలో ధారాళమయిన బుద్ధికలవారుగా ప్రసిద్ధినొందారు. చిన్నప్పటి నుండి మహాపండితులు, దానశూరులు అయిన మహారాష్ట్ర పండితుల మధ్య పెరిగివుండటం వీరిలో ఈ గుణాలు పరిఢవిల్లడానికి కారణమయి వుండవచ్చు. పీఠమునకు వచ్చిన తరువాత వీరి పాండిత్యము, దాన శూరత మరింత పరిఢవిల్లినది. పూజాకల్పములో చెప్పిన విధముగా ప్రతిదినము త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరులను కొంగ్రొత్త ద్రవ్యములతో పూజించుట, ఔత్తరాహిక భక్షణములు వివిధములు పుష్కలముగా చేయించి నైవేద్యములు చేసి, మహాసంతర్పణాదులు చేయించుట, పేదలకు అన్నవస్త్రాది దానములెన్నో చేయుట, విద్వత్సదస్సులు, శాస్త్రగోష్ఠులు జరిపించి శాస్త్రవిచారములు పండిత పన్మానాదులు చేయుట మొదలుగా గల మహత్కార్యములలో కాలము గడపజొచ్చినారు. 64వ ఆచార్యుల వలె వీరు ఆజానుబాహువులు కానప్పటికీ, తేజోగాంభీర్యవిశేషము చేత శీఘ్రముగానే సర్వజనప్రియులయినారు. వీరి మూలముగనే శ్రీమఠము రెండవతూరి ఖైదు అయినది. ఖైదు చేసినది అదే తంజావూరు సిపాయిలు. అయితే పోయినసారి రాజావారి ఆజ్ఞానుసారం జరిగింది. ఈసారి ఇంకొకరు అజ్ఞ చేసినారు. వారెవరో తెలుసుకుంటే ఆశ్యర్యంగా ఉంటుంది. మన కథలో ముఖ్యపాత్ర, శ్రీమఠమే ఊపిరిగా జీవిస్తున్న ద్వితీయులే. పోయినసారి మార్గమధ్యంలో మఠం నిర్బంధించబడినది ఏ కారణాన ఈ ద్వితీయులీ సాహసాని కొడిగట్టారని మీకు ఉత్సుకతగా ఉన్నది కదా?

ధనం విలువ, దాని అవశ్యకత, అది లేనందువల్ల పడవలసిన కష్టములు తెలిసినవారు కదా ఈ ద్వితీయులు? క్రొత్తస్వామి ఆదాయవ్యయములు చూడకుండా దానధర్మములు విరివిగా చేయనారంభించారు. మధ్యకాలంలో పోగుచేయబడిన డబ్బంతా కరిగిపోయింది. తంజావూరు ఊరేగింపులో సమర్పింపబడిన వెండి అంబారీ వెండిని తొలగించి అమ్మివేసి ఆ డబ్బు కూడా దానం చేసేశారు. ద్వితీయులు ఈ క్రొత్తస్వామివారికి పూర్వాశ్రమపు పినతండ్రి అయి ఉండటాన, శ్రీమఠ శ్రీకార్యం చూసేవారు చెప్పవలసిన విధంగానైన చెప్పజాలని సున్నితస్థితి ఏర్పడింది. ద్వితీయులు తీవ్రంగా ఆలోచించారు. స్వయంగా స్వామివారితో తలబడితే వారికీ వీరికీ కూడా మొహమాటంగా ఉంటుంది. అందువల్ల మొరటు కార్యక్రమమే చేయాలి అనుకున్నారు. మన కోసం చేయడం లేదు, భగవత్పాద పీఠం కోసం చేస్తున్నాము. అందువలన మర్యాదాతిక్రమణ చేశామనే చెడు పేరు వచ్చినా ఫరవాలేదని సిద్ధపడ్డారు.

వీరు తంజావూరు సంస్థాన ''హెజీబు'' కదా! నేరుగా రాజావారికి మఠమునకు 12 మంది సిపాయిలు కావాలని సందేశము పంపారు. రాజావారికి వీరివాక్కు వేదవాక్కు అయినందు వలన కారణమడుగకుండానే సిపాయిలను పంపారు. సాధు బ్రాహ్మణుడయిన ఈయన మిలటరీ చర్య తీసుకొన్నారు. మఠంలో పహారావారిని తొలగించి వారి స్థానే సిపాయిలను నియమించారు.

సన్నిధానమువారి బాల హృదయాన్ని కరిగించి అబద్ధాలో నిజాలో చెప్పి వారివద్ద నుండి ద్రవ్యము సంగ్రహించేవారిని ఆపడమే వీరి ఈ ఏర్పాటులోని మర్మం. మఠం బాగుచేస్తున్నానని చెప్పుకుంటూ తానీ పని చేయడమే తప్పు. అందులో మఠ సిబ్బందిని స్వామివారికి వ్యతిరేకంగా ప్రోత్సహించడం మరింత తప్పు. ఇది యోచించే రాజ సేవకులను పిలిపించారు. వారితో ''నే చెప్పేవారిని తప్పించి ఇతరుల నెవరినీ లోనికి పంపరాదు'' అని కట్టుదిట్టమైన ఆజ్ఞ చేశారు. సిపాయిల పహారా అనగానే స్వామి వద్ద వంచన మాటలతో మోసపుచ్చి ద్రవ్యం సంగ్రహించే వారు భయపడతారు కదా అని ఆయన అభిప్రాయం. ఈ నడవడి చూసి ఊరంత గడగడలాడింది.

యవ్వనంలో ఉన్న క్రొత్తస్వామి కూడా దీనిని సవాలుగా తీసుకొని సిపాయిలు తిరిగిపోతే గానీ తాను భిక్ష స్వీకరించనని సత్యాగ్రహ మారంభించినారు. మన హెజీబువారు సంకటంలో పడ్డారు. స్వామివారిని పూర్వంవలెనే చరించనిస్తే శ్రీమఠమునకు తిరువానైక్కవల్‌ నుండి బయలుదేరిన నాటి స్థితి వస్తుంది. లేకుంటే వీరు భిక్షే తీసుకోవడం లేదు. వీరి మనసులో ఒకటే పోరాటం. స్వామివారు కూడా మంచి పట్టుదలపై ఉన్నారు. ఇక తాత్సారం చేయడానికి వీరి మనసొప్పలేదు. వీరు సరాసరి సన్నిధానం వద్దకు పోయి నేను మఠం మొదట్లో పడిన కష్టాలను దృష్టిలో ఉంచుకొని చెబుతున్నాను. ఈ మఠానికి నేవున్నా లేక పోయినా ఆ దశరాకూడదనేదే నా ఆకాంక్ష తప్ప ఇంకే దురుద్దేశ్యమూ నా మనస్సులో లేదు. కనకాభిషేకపు స్వర్ణరాశిని నే జాగ్రత్తగా కాపాడుకొస్తున్నాను కదా! అది అయినా మఠానికి నిరంతర ఆదాయం వచ్చే లాగున పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఈయమని కోరారు. ఈ మధ్యేమార్గం క్రొత్త స్వామివారికి కూడా నచ్చింది. ఈ కోర్కెపరమన్యాయంగా ఉన్నదని తోచింది. అనుమతి మంజూరు చేయబడింది. ద్వితీయులు మిలటరీ చర్య ఉపసంహరించి సిపాయిలను త్రిప్పి పంపివేశారు. స్వామి భిక్ష గ్రహించారు. భక్తులు ఊపిరి పీల్చుకొన్నారు.

ఎవరికీ చెప్పకుండా ద్వితీయులు అన్ని బంగారు కాసులను వస్త్రంలో మూటకట్టుకొని గుఱ్ఱంపై బయలుదేరారు. (మఠకార్యములకు అవసరం వస్తుందని వారు గుఱ్ఱపు స్వారీ పూర్వమే నేర్చుకొని యున్నారు). నేరుగా కపిస్థలముకు వెళ్ళారు. ఆ ఊరిలో తంజావూరి సీమలో ముఖ్యులుగా పేరుగల మూపనార్‌ ఉన్నారు (వీరు కాంగ్రెస్‌ నాయకుడు కురుపయ్య మూపనార్‌ పూర్వీకులు). మూపనార్‌ సంపన్నులు, దైవభక్తి కలవారు. ధర్మాచార పరాయణులు, దానశీలురు, మీదు మిక్కిలి ఎలాంటి పెట్టుబడి పెడితే మంచి ప్రతిఫలం పొందవచ్చో చెప్పగలిగిన సామర్థ్యం కలవారు. రమారమి 17 వేల రూపాయల విలువ చేసే ఈ బంగారంతో ఏ రకమైన పెట్టుబడి పెడితే మంచి లాభము పొందవచ్చుననే విషయంపై వారితో మంతనాలు జరిపారు. శ్రీ మఠం కోసమై తాపత్రయపడే వీరిని చూసి మూపనార్‌కి ఎంతో సంతోషమయింది. ఆయనకో మంచి సలహా ఇచ్చారు.

కుంభకోణమునకు ఈశాన్యంగా ''ఆనక్కుడి'' అనే ఒక గ్రామం ఉన్నది. ఆ ఊరి మిరాశీదారు ఆనక్కుడిపిళ్లై మంచి శైవ వేలాల కుటుంబానికి చెందినవారు. వారికి ఆ రోజుల్లో ఏడువేల ఎకరాల సుక్షేత్రమయిన మాగాణి ఉండేది. ఆయన తన బంగారు నాగలితో సేద్యమారంభించిన పిదపే ఆ సీమలో సేద్యపు పనులు ఆరంభమయ్యేవట. ఆయన తన పొలంలో కొంత అమ్మజూపుతున్నారనే విషయం ఈ మూపనార్‌ వాసన బట్టారు. ''ధార్మికుడు, దాన స్వభావంగల ఆయన శ్రీమఠంకోసమయితే తక్కువ ధరకు కూడా ఇస్తారు. ఆ పొలాలమీద వచ్చే ఆదాయం మరి ఏ ఇతర పెట్టుబడులపైననూ రాదని'' సలహా ఇచ్చారు. ఈ ఆలోచన ద్వితీయులకెంతో నచ్చింది. మూపనార్‌వారికి తగిన బందోబస్తునిచ్చి తన గుమాస్తా తోడుగా అనక్కుడిపిళ్లై వద్దకు పంపారు. ద్వితీయునిలో ఒక విశిష్టమయిన లక్షణం ఉన్నది. పైస అంటే అంత జాగ్రత్తగల వారు ఎవరినైనా నమ్మితే నవనిధులు సైతం అధీనం చేస్తారు. అదేమాదిరి మొత్తం బంగారం అనైక్కుడిపిళ్లైకి ధారాదత్తం చేశారు. బేరసారాలు చేయలేదు. ఎంత శీఘ్రంగా వీలవుతుందో అంత త్వరగా, ఈ బంగారమునకు ఎంత పొలం వస్తుందో అంత పొలం శ్రీమఠం పేర వ్రాయించమని చెప్పి కుంభకోణం తిరిగి వచ్చారు. ద్వితీయుని ఈ గుణం పిళ్లై హృదయాన్ని కదిలించి వేసింది. శ్రీ మఠమునకిస్తున్నామనే భావంతో కొంత పొలం ఎక్కువగా ఇస్తే మనని నమ్మి నిర్ణయాధికారమంతా మనపైన వదిలినాడే ఆ బ్రాహ్మణుడు అని మరి కొంత పొలం ఎక్కువగా వ్రాసి ఇచ్చారు.

స్వల్పకాలంలోనే కుంభకోణమునకు ఈశాన్యాన రెండే మైళ్ల దూరంలో నున్న కరుప్పూరు గ్రామంలోని 270 ఎకరాల సుక్షేత్రమైన పొలాన్ని శ్రీమఠానికి వ్రాసి ఇచ్చారు. ఆ కాలంలో ధరలు ఎంత తక్కువగా వున్నాయనుకొన్నా అతి సారవంతమయిన 270 ఎకరాల సేద్యపు భూమి 17 వేలకే ఇవ్వడం వారి ఉదారతను చాటుతోంది. ఇప్పటికీ శ్రీమఠ సేద్యపు భూములలో వచ్చే ఫలసాయంలో ఈ భూమిదే అగ్రభాగం.

మఠమునకు ధనబలం ఎక్కువగా వుండకూడదు అన్న పక్షానికి చెందినవాడిని నేను. ఆ ద్రవ్యం జాగ్రత్త పరచడం, ప్రతిఫలం ఆశించి పెట్టుబడులు పెట్టడం వంటివి మేము చేయదగిన ఆత్మ విచారానికి బద్ద వ్యతిరేకమని కూడా నా అభిప్రాయం. ఈ ద్రవ్యబలం, ధనబలం తక్కువ వుంటేనే మఠాధిపతులు తమ తపోబలాన్ని వృద్ధి చేసుకొని తన్మూలమున ధర్మ పరిపాలనమును చేయగలుగుతారు.

అయినప్పటికీ, యధోక్తంగా పూజచేయడం, విద్వత్సదస్సులు నడిపి పండిత పోషణ, సంభావనలు చేయడం, ఆచారంగా వస్తున్న సంతర్పణ, దీనజనరక్షణ, ధర్మ ప్రచారమునునవి మఠపు ముఖ్య విధులుగా నిర్ణయించబడినందువల్ల, మరి ఈ కార్యముల నిర్వహణమునకు కొంత మేరకు ద్రవ్య మవసరమవుతుంది కాబట్టి, శ్రీమఠానికి కావలసిన ఈ అత్యంత ఆవశ్యకతలను పూరించడానికి ఎంతో ముందు చూపుతో తన తనువును మనస్సును ఈ కైంకర్యములో లగ్నపరచి ధన్యుడయిన ఈ ద్వితీయుని కథ చెప్పాను.
ఒక సిపాయిల తిరుగుబాటు (Coup) సందర్భంగా మొదలుబెట్టి, ఒక లక్ష్యసాధనకు తన జీవితాన్ని ధారబోసిన ఈ శ్రీమఠ కింకరుని కథ చెప్పాను. సహదేవుడు కృష్ణపరమాత్మను కేవలం భక్తిమూలంగా కట్టివేశాడు. వాని మాదిరి భక్తి, జ్ఞానం తెలియని యశోద కూడా కేవల ప్రేమతో ఆ ఉపనిషదర్దాన్ని ఉలూఖలా నిబద్దం చేసింది. శివాజీ మహారాజా, ''హెజీబు'' అయిన ఈ ద్వితీయులు శ్రీమఠాన్ని ఖైదు చేసినది ఒక కోణంలో చూస్తే భాగవత కథలతో పోల్చతగినదనిపిస్తుంది. ( *కథలో ద్వితీయునిగా చెప్పబడినవారు మహాస్వామివారి పూర్వాశ్రమపు తాతగారు శ్రీగణపతి శాస్త్రి)

Dharmakruthi  Chapters   Last Page