Sri Bhagavatha kamudi    Chapters   

5వ కిరణము

జడభరతో పాఖ్యానము

ఉత్తానపాదుని చరిత్ర వినిన తర్వాత అతని సోదరు డైన ప్రియ వ్రతుని చరిత్ర చెప్పమని కోరగా శుకుడు పరీక్షిత్తున కిట్లు చెప్పెను.

ప్రియవతుడు పిన్నవయస్సు నుండియు ఆధ్యాత్మిక చింతన కలిగి, వివాహమునకు విముఖత చూపగా బ్రహ్మదేవుడు గృహస్థాశ్రమ విశిష్టతను ఉత్కృష్టతను వివరించి వివాహము చేసుకొని, గృహస్థాశ్రమములో నుండి అంతశ్శుత్రువులను గెలిచి, ధర్మపధమున రాజ్యపాలన చేసి, చివరకు ఆత్మనిష్ఠలో నుంచి మోక్షమును పొందవచ్చును. అని బోధింపగా ప్రియవ్రతుడు అందుకు అంగీకరించెను అతని తండ్రియైన స్వాయంభువమనువు అఖిలభూమండలమునకు ప్రియవ్రతుని రాజుగా అభిషేకించి తాను విరక్తుడై పరమార్ధసాధనపరుడయ్యెను. ప్రియవ్రతుడు పిన్న వయస్సు నుండి ఆధ్యాత్మచింతనచే ఆత్మారాముడయ్యూ బ్రహ్మ ఉపదేశమున రాజ్యభారమును వహించి వనస్సు నిత్యము భగవంతునిపై నుంచుచూ ఆదర్శప్రాయముగా రాజ్యపాలన చేసెను. తదుపరి విశ్వకర్మ కుమార్గెయగు బర్హిష్మతిని వివాహమాడి పదిమంది కుమారులను ఒక కుమార్తెను, మరియొక భార్యయందు ఉత్తముడు, తామసుడు, రైవతుడు అను ముగ్గురు కుమారులను కనెను. ప్రియవ్రతుడు తన పాలనలో ఉత్తమరధము నారోహించి సూర్యుని వెంట ఏడు మారులు తిరుగగా అందువలన సప్తసముద్రములు ఏర్పడినవి. ఆ సముద్రముల యవధిలో జంబూ, పక్ష, కుశ, క్రౌంచ, శాఖ, శాల్మల పుష్కరమును సప్తద్వీపములు ఏర్పడెను. అరిషడ్వర్గములను జయించి భగవంతుని మనస్సులో నిడుకొని ఉత్తమపురుషుడైన ఆ ప్రియవ్రతుడు ఇంతటి గొప్ప ప్రభావము లుండుటచేత ఇట్టి మహత్తర కార్యములను సాధించి అనేక వేల సంవత్సరములు రాజ్య పాలనచేసి కుమారుడైన ఆగ్నీధ్రునకు పట్టాభిషేకము చేసి సర్వసంగ పరిత్యాగియై కృతార్థుడయ్యెను.

ఆగ్నీధ్రుడు రాజ్యపాలనచేయుచు పూర్వచిత్తియను అప్సరను చూచి మోహపరవశుడై వివాహము చేసుకొని, ఆమెయందు తొమ్మండుగురు పుత్రుల కనియెను. వారిలో పెద్దకుమారుడు పుత్రాకామేష్ఠి చేయగా భగవంతుడు సాక్షాత్కరించెను, అంతట నీయట్టి కుమారుడు నాకు కలుగునటుల వరమిమ్మని కోరగా, నావంటివాడింకొకడు లేడు. (ఉండడు) కనుక నేనే యవతరించెదనని వరమిచ్చి యంతర్ధానమయ్యెను. అంతట నాభి పత్నియగు మేరుదేవి యందు భగవంతుడు ఋషభుడు అను పేరుతో నవతరించెను. తేజోబల పరాక్రమాదులచే నసమానుడగుటచే ఋషభుడను పేరు సార్థకమయ్యెను. ఈ ఋషభుడు ఇంద్ర దత్తయగు జయంతి యను నామెను వివాహమాడి అద్భుతముగ ధర్మపాలనముచేసి తన భార్యయందు తనకు తుల్యులగు నూర్గురు కుమారులను పొందెను. వారిలో జ్యేష్ఠుడు భరతుడనువాడు అందరిలో నుత్తముడగుటచేత, అతనికి రాజ్యపట్టాభిషేకము చేయగా భరతుడు పూర్వపు మహారాజులందరికంటె అత్యుత్తముగ పరిపాలనచేయూటచేత ఈ అజనాభవర్షమునకు అతని పేరున భరతవర్షమని దేవతలు పేరుపెట్టిరి. తాను ఉత్తమ డయ్యెనేని ప్రజలందరు తనను అనుసరింతురు కనుక తాను జీవస్ముక్తు డగుట చేత తనకు ప్రాప్యంబు లేకపోయినను, లోకసంగ్రహార్థమై యన్ని ధర్మముల ననుష్ఠించి ఆదర్శప్రాయమగు ప్రభుత్వము, నెఱపి, ప్రజలందరను కర్మనిష్ఠులను చేసెను. బుషభుడు కూడ కుమారులందరకు ధర్మమార్గమును బోధించి మిగిలిన వారందరిని భరతుని సేవింపుమనిన ఆజ్ఞాపించెను. అంతట ఋషభుడు సర్వసంగపరిత్యాగియై చివరకు అవధూతయై సంచరించుచుండగా, అడవియం దగ్నిపుట్టి యతని దేహమును దహించెను.

భరతుడు రాజ్యభారమును పూని విశ్వరూపుని కుమార్తెయగు పంచజనిని వివాహమాడి అయిదుగురు కుమారులను పొందెను.

ఆదర్శప్రాయముగ భరతుడు పెక్కువేల యేండ్లు రాజ్యపాలనము గావించి విరక్తుడై రాజ్యమును కుమారులకు వప్పగించి వులహాశ్రమమునకు జనియెను. అయ్యాశ్రమము సాలగ్రామముల నుత్పత్తిచేయు పవిత్రమగు గండకీ నదీతీరమున విలసిల్లుచుండెను. అందు విషయ వాంఛలను విడచి, భగవంతుని ఆరాధించుచు హరిచరణారవింద ధ్యానములో నిమగ్నుడైయుండెను.

అంత ఒకనాడు నిండుగర్భముతోనున్న ఒక లేడీ గండకీ నదిలో నీరు త్రాగుచుండగా, భయంకరమైన సింహ నాదమును విని, భయపడినదై నదిని దూకి దాటుటకు ప్రయత్నించుచుండగా గర్భస్థయగు లేడిపిల్ల నీటిలో పడెను. ఆ తల్లి లేడియు నదిలోపడి మరణించెను ఈ సింహగర్జనను వినిన భరతరాజర్షికనులు తెఱచి చనిపోయిన తల్లిలేడియు, ప్రవాహమున బడియున్న లేడిపిల్లలను చూచి దయతో ఆ పిల్లను తన యాశ్రమమునకు తీసుకొనివచ్చి పెంచెను. ఈ లేడిపిల్లమీది మమకారముచే తన నిష్ఠయంతయు వదలుకొని, తానెక్కడికిపోయిన దానిని తీసుకొని పోవుచూ, మనస్సంతయూ ఆ లేడిపిల్లపై కేంద్రీకరించి యుండగా ఒకనాడు ఆ లేడిపిల్ల ఎచటికో పోయెను. అంతట ఆ లేడిపిల్లను ఏ క్రూరజంతువైననూ తినివేసేనేమోయని దిగులు చెంది, దుఃఖించుచూ ప్రాణములను విడచి మరల లేడిజన్మ నెత్తెను. పూర్వ మొనర్చిన తపోబలముచేత పూర్వస్మరణ కలిగి తన కట్టి మృగజన్మ కలుగుటకు ఆ లేడిపిల్లపై గల వాత్సల్యమే కారణమని పశ్చాత్తాపము నొంది, మిగిలిన లేళ్ళతో సంగమించలేదు. భగవంతుని మీద మనస్సు నిల్పి ధ్యానించుచు శుష్క పర్ణ తృణాదులను భుజించుచు, చివరకు మృగశరీరమును విడచెను.

ఆ లేడి శరీరము వదలిన తర్వాత తపస్స్వాధ్యాయ సంపన్నమైన పవిత్ర కుటుంబములో పుట్టి పూర్వజన్మ పుణ్యవశమున అస్యజన సంగమము వీడి పూర్వస్మృతి వుండుటవలన మనస్సును నిరంతరము భగవంతుని పాద పద్మములందు లగ్నముచేసి ప్రపంచములో ఉన్మత్తుడువలె సంచరించుచుండెను. ఇట్లు జడుడుగా ఉన్నప్పటికీ తండ్రి అతనికి ఉపనయమను చేసి కర్మనియములను బోధించి సంప్రదాయానుసారముగ ప్రవర్తింపజేయవలెనని ఎంత ప్రయత్నించిననూ అతను వినకుండెను. ఇంతలో తండ్రియూ తల్లియూ చనిపోగా సోదరులు అతనిని జడుడుగా భావించి ఆతనితో సంబంధము వదలుకొనిరి. ఈ విధముగ భరతుడు నిగూఢ బ్రహ్మవర్చస్కుండై నింద్యవస్త్రములుగట్టి జడునివలె సంచరించుచుండుగా ఆ దేశమును పాలించు ఒక శూద్ర నాయకుడు సంతానార్థమై భద్రకాళికి నరబలి ఇచ్చుటకు తగిన పురుషుని తెచ్చుటకు పరిచారకులను నలువైపులకు పంపెను. ఆ పరిచారకులు తిరిగి తిరిగి, జడభరతుని గని, వానిని భద్రకాళి ఆలయమునకు గొనిపోగా, ఆతని దివ్యమైన బ్రహ్మతేజస్సుచే భద్రకాళి విగ్రహమున మంటలు కలుగగా, ఆమె ప్రత్యక్షమై, భరతుని వదలి, బలి ఇచ్చుటకు వచ్చినవారినందరను నరకివేసెను. ఆత్మజ్ఞానము కలిగిన భగవద్రూపుడు గనుక జడభరతునికి అపకారము చేయబూనిన వారికే అపకారము కలిగెను.

ఇట్లు యధాప్రకారము తిరుగుచూ ఒకనాడు సింధు సౌవీరదేశ ప్రభువగు రహూగుణుడు ఆత్మజ్ఞానబోధకై గురువు నొద్దకు పల్లకినెక్కి పోవుచుండ, మోయువారిలో ఒకడు తక్కువైనందున; ఈ జడభరతుని మోయుటకు ఏర్పాటుచేసిరి. ఇతని నడక మిగిలినవారితో వరుస కలువ నందున, పల్లకీకి కుదుపువచ్చి, చికాకుపడిన రాజు ఆగ్రహముతో అడుగగా, క్రొత్తగా వచ్చినవానివలన కుదుపు వచ్చినదని బోయీలు సమాధానము చెప్పిరి అంత, రాజు అతనిని చూచి ''నీవు మొద్దువలె బలిసియున్నావు, సరిగా మోయనియడల శిక్షించెదను'' అని పరుషముగా నిందించెను.

అంతట జడభరతుడు ''రాజా, నీవు నన్ను బలిసియున్నావని యంటివి, బలిసియున్నది దేహమా? ఆత్మయా? ఆత్మకు బలిసియుండుట అనునది లేదుగదా, దేహము బలిసి యున్నను అది ఆత్మకు అన్వయింపదుగదా, నీవు చెప్పిన దేదియూ దేహాభిమాన హీనుడనైన నాయందు వర్తింపవు'' అని జవాబిచ్చెను.

ఈ మాటలు వినిన రాజు అతడు ఆత్మజ్ఞానముకల జీవన్ముకుడైన మహాపురుషుడని గ్రహించి పల్లకిదిగి అతనికి సాష్టాంగ నమస్కారముచేసి, 'జ్ఞానార్థినై గురువు నన్వే షించుచున్న నాకు జ్ఞానోపదేశము చేయగల గురువుగా నన్ను శిష్యునిగ స్వీకరించి జ్ఞానబోధ చేయుడని ప్రార్థించెను.

అంతట ఆ జడభరతుడు, యజ్ఞాది కర్మ కలాపముల యందు పరమార్థము లేదనియూ ప్రపంచమంతయూ దృశ్యము గావున నశ్వరంబనియూ స్వప్నదృష్టాంతమున నిశ్చయించుమని చెప్పి యింకనూ ఇట్లు బోధించెను.

స్థూల సూక్ష్మ దేహములు, సంసారము అన్నియూ దృశ్యము గావున మిధ్యాభూతములని గ్రహించుము. మనస్సు గుణానుక్తమయ్యెనేని సంసారమునకునూ, నిర్గుణమయ్యెనేని మోక్షమునకును కారణ మగును సర్వభూతాశ్రయుడగు నారయణుడు ఈ చరాచర ప్రపంచములో ఆత్మస్వరూపమున ప్రవేశించి ఈ విశ్వమును నియమించు చుండును. తాను క్రోధాది అరిషడ్వర్గమును జయించి నిస్సంగుడై, ఆత్మసాక్షాత్కారము కాకుండ యీ వరించిన మాయను జయించి, ఆత్మసాక్షాత్కారము పొంది తానే నారాయణుడను అనుభవము జీవన్ముక్తుడగును. అట్టి స్థితి వచ్చువరకూ సంసార భ్రమణము తప్పదు. ఈ ఆత్మజ్ఞానము పెద్దల పాదసేవవలననే కలుగును. అట్టి సాధువుల సంగమమున భగవద్గుణాను వర్ణనము చేయబడునుగాన భగవంతునియందు భక్తి ఏర్పడి అట్టి భక్తి వలన వైరాగ్యము, ఆత్మజ్ఞానము కలిగి తరింతురు'' అని బోధించి ఆ రాజునకు గాఢమైన వైరాగ్యమును గలుగజేయుటకై సంసారమును ఒక అడవితో పోల్చి, సంసారము యొక్క హేయత్వమును విశదీకరించి ఆత్మజ్ఞానమును చక్కగా నుపదేశించెను.

అంత రహూగణ మహారాజు ఆయనకు నమస్కరించి ఆశీస్సులను పొంది, దేహాత్మాభిమానము వదలి ఆత్మజ్ఞానము బడసి జీవన్ముక్తుడయ్యెను. భరతుడు కొంత కాలము అవధూతగా సంచరించి దేహమును విడచి విదేహ ముక్తుడయ్యెను.

తరువాత శుకుడు పరీక్షిత్తునకు భరతునియొక్క వంశానుక్రమమును చెప్పి, భూగోళ పరిణామాదులను, గంగా నిర్గమ ప్రకారంబును, నవవర్షములలో పరిపాలనా విధానమును భగవత్సేవా విధానమును విశదీకరించెను. తర్వాత లోకాలోక పర్వతాది వ్యవస్థను, ద్యులోక ప్రకారమును, గ్రహముల గతి స్థానములను అధోలోక వర్ణనమును, నరకభేద స్వరూపములను వివరించెను.

(ఐదవ కిరణము సమాప్తము)

భగవతమున ఐదవ స్కందము సమాప్తము

Sri Bhagavatha kamudi    Chapters