Kamakoti   Chapters   Last Page

 

11. గురుదేవుల విభూతిలో నా అనుభూతి

కల్లూరి వేంకట సుబ్రహ్మణ్మ దీక్షితులు 'గురుశిశుః'

శ్రీ కామకోటి జగద్గురు సన్నిధానం విష్ణుకంచిలో శ్రీశంకరమఠం భక్తపరివారంతో ఉన్నారు. సాయం సంధ్యాసమయం అవుతున్నది. గురుదేవులు లోపలనుంచి వస్తూ ఉన్నారు. అడుగడుగునా వినతులయిన ప్రజలప్రణామాలు అందుకుంటున్నారు. ఆ ప్రసన్న వదనారవిందంలో ఆ సుందరమందహాసంలో అమృతం కురుస్తూన్నది. వెనుకనే ఉన్నాను. నాదృష్టి వారిమీదనే ఉన్నది. నావంక చూడగూడదా అనుకుంటున్నాను. మనం అనుకుంటున్నంతసేపు వారు మన వంక చూడరు. చూడనట్లుండి సర్వము చూచే విశ్వతశ్చక్షువు ఆ మూర్తి. అకర్ణులయి సర్వము నాకర్ణించే వస్తువు అది. ఇంచుక వెనుకనే వస్తూన్న నాతో అన్నారు. రేపు సంవత్సరాది. సంవత్సరాదినాడు ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందం గదా అంటున్నారు. చిత్తం అంటున్నాను. ముందడుగు వేస్తునే ఉన్నారు. ఆ అడుగులకు నా హృదయం మడుగులొత్తుతూనే ఉంది. మఠమువెలుపలికి తూర్పు దెసకు నడిచి వెళ్ళినారు. పరివారం స్త్రీపురుషులు ఆబాల గోపాలం అక్కడనే ఉన్నారు. శ్రీవారు నాతో అన్నారు గదా ! రేపు తెలుగు సంవత్సరాది. ఈ రోజు గోదర్శనం. ఈ సంధ్యాసమయంలో పవిత్రగోమాతృసందర్శనం మనకు అన్నారు. ఆ మాట వారు అనేదాక నా చూపు వారిమీదే లగ్నమయి ఉంది, వెంటనే గోవు మీద వ్రాలింది. దూడ పాలు గుడుచుకొంటున్నది. మన మఠానికి సంవత్సరాదికి ఈ గోవును ఒక భక్తులు సమర్పించారు. అన్నారు నాతోనే శ్రీవారు. నమస్కారం చేశాము. సుదక్షిణా దిలీపులు అనుగమించిన నందినీధేనువులా ఉన్నది, సవత్సయైన ఆ గోమాత. ఆమెచూపులు శ్రీ గురువుల చూపులు కలసికొన్నాయి. ఉభయులూ ఏదో పలకరించుకొన్నట్లు అనిపించింది. వెంటనే నీరాజనం ఈయబడింది. ఆ శ్రీ త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వర మహాసంస్థానంలో సాయం సమయ మంగళంగా నగారా మ్రోగింపబడింది. శ్రీవారు అనుష్ఠానార్ధం లోనికి దయచేశారు. తదనుధ్యానమే నాకనుష్ఠానం అయింది.

మరునాడు సంవత్సరాది మహోత్సవం. అందు పాల్గొన్న వారందరు అరవలు, అది తెలుగు సంవత్సరాది. అక్కడున్న తెలుగు వాడను నేనొక్కడనే. అర్చన అయింది. తీర్ధం అనుగ్రహించే సమయం అవుతున్నది. శ్రీవారు అర్చా పీఠమునుండి దిగి అమ్మ ఎదుట నిలువబడి నీరాజన మెత్తినారు. సన్నాయి, మంగళహారతి పాడుట అయినది. జనుల కోలాహలంలో మఠపరివారంలో ఎవరో నాపేరెత్తి పిలిచారు. ఎన్నో పిలుపులు అయి ఉంటాయి. ఒక పిలుపు నాకు వినబడింది. ''పెరియవాళ్‌ ఉత్తరువు'' అన్నారు ఒక విప్రపుంగవులు సన్నిధానానికి వెళ్ళాను. ఆ ప్రప్రధమప్రసన్న కటాక్షంతో పాటు పరదేవతా పద సరోజ మధుర భక్తికి మధుధారాసారంతో బాటు దేవతా తీర్ధపూరమునకు ప్రప్రధమ పాత్రమయినాను. ఆచార్య దేవుల హస్తకమలమందున్న ఉద్ధరిణినుండి ఆ తీర్ధం నాహస్తమందు పడుతూ ఉంటే అనేక జన్మల పుణ్యఫలం నా అరచేతిలో పడుతున్నట్లు అనిపించింది. వేపపువ్వు, శర్కర, తేనె, మామిడిముక్కలు, ఆవ్లుం మిరియపు పొడితో షడ్రసభరితమైన ప్రసాదం పరదేవతకు నివేదించినది మొట్టమొదట నాకే అనుగ్రహించారు ప్రభువు. కొన్ని వేలమందిలో నన్ను ఆచార్యపాదు లాదరించడానికి అశేషభక్తబృందం ఆశ్చర్యచకితం అయింది. నాలో గర్వం అంకురింపవలసిన ఘట్టం అది. కాని శ్రీవారి అపారకరుణా పారావారంలో మున్కలు పెట్టుతూ ఉన్న నా మనస్సున కప్పుడు గర్వావేశంపొందటానికి తీరిక లేకపోయింది, తరువాతనైనా ఇది తెలుగు సంవత్సరాది, అక్కడనున్న తెలుగువాడను నేనే కదా ! నాకు తొలిప్రసాదానుగ్రహం అందులకే చేశారు. అని శ్రీవారి అంతరంగగత భావతరంగములలోనే నా హృదయం ఉయ్యాల లూగి పోయింది.

తరువాత కూడా కొన్నాళ్లు శ్రీవారు సన్నిధానాన్ని అనుగ్రహించి ప్రసాదం దయచేసి యింటికి వెళ్ళు ! అన్నారు. వచ్చాను.

బెజవాడ వచ్చాను. గుమ్మంలో అడుగుపెట్టాను. పడమటావు అంతయెత్తునఉన్నది. తెల్లగా ముద్దులుమూటగడుతున్నది, ప్రక్కనదూడ. నాకుటుంబమంతా ఎదురుగా వచ్చారు. ఈ ఆవుదూడా సంవత్సరాది రేపనగా మన యింటికి వచ్చింది. దీనితోబాటు బండి జనుము మేత కూడా వచ్చింది. చూడు అని దొడ్లోకి రమ్మని మా పిల్లలు చూపించినారు. నా మనస్సు ఆనందభరితం అయింది. మూటదింపి ఆగోవునకు ప్రదక్షిణ చేశాను. కన్నులు చెమ్మగిల్లినవి. మనసు శ్రీవారి చరణసరోజములయందు వ్రాలిపోయింది. కంచిమఠం - సంవత్సరాది ముందురోజు శ్రీవారితో గోదర్శనం. ఆ మరునాడు ప్రసాదానుగ్రహం అదృశ్యం. ఆ త్రిపురాచంద్రమౌళీశ్వర సమారాధన సమాసక్త గురుదేవతా కటాక్ష చంద్రికా ప్రసార వైభవం మనసులో మెదిలినవి. అక్కడ ఏనాడు ఏక్షణంలో ఏరూపంలో గోదర్శనం అయిందో సరిగా యిక్కడ ఈక్షణంలో ఈరూపంలో గోదర్శనం అయింది. ఇది ఆశ్చరములకెల్ల ఆశ్చర్యమయిన గురుదేవుల విభూతి, అందులో నా అనుభూతి ఇది.

ఆ మరునాడే మీ అమ్మాయిని మాపిల్లవానికి చేసికొనుటకంగీకరించినాము. తాంబూలాలు పుచ్చుకొందాము అని లేఖ వచ్చినది. సంఘటన కాదనుకొన్న సంబంధం ఆక్షణంలో స్వయం సంఘటితం.

అందుకు నేను గురుకృపాలహరిలో వ్రాసికొన్నాను.

రమ్యం వీక్షిత మర్ధవత్సుమథురం మందస్మితం భావవత్‌

హృద్యం స్పందన మాధరం స్వరసవన్మౌనం మహావాక్యవత్‌

పారొక్ష్యం హ్యపరోక్ష వస్తు సుఖవత్తాత్పర్య వద్దర్శనం

స్వప్నే జాగ్రతి మే గురో ర్విలసనం సర్వాంతరం బ్రహ్మవత్‌ ||

బ్రహ్మవిద్వరిష్ఠులయిన ఆచార్యదేవుల చూపులో నొకయర్ధము మధుర మందహాసములో నొక భావము . మనోహరమగు నధరస్పందనము నందు ఒక స్వారస్యము, మౌనమున మహావాక్యార్ధము, చాటున చాటుపడని ఆత్మానుభూతి సుఖము దర్శనమున నొక తాత్పర్యము, నిద్రలో మెళకువలో గూడ నొక అపూర్వబోధ స్పందనము నగుచుండును. సర్వము బ్రహ్మవస్తుస్ఫురణమే అనిభావము. ఆసంవత్సరాది నాటి శ్రీవారి ఆనందఘట్టం అది ఆసంవత్సరం అంతా మమ్ము ఆనందంలో ముంచెత్తివేసింది. అన్నీ అభ్యుదయాలే ఆసంవత్సరం. గురువాయూరు 'అప్పన్‌' నా ఆంధ్రీకృత నారాయణీయకృతి కన్యా స్వీకారం చేసింది ఆసంవత్సరంలోనే. లక్ష్మీకటాక్షసమృద్ధి అంతా ఆయేడే.

కంచిలో గోదర్శనానికి యిక్కడ గోలాభానికి కారణ సంబంధం నేనూహించుకొన్నదే. నిస్సంకల్పస్థితిలో స్థితప్రజ్ఞతాభూమిక నధిగమించిన ఆచార్యపాదులలో నాకిట్టి అభ్యుదయం ఇప్పుడు కల్గింపవలెనన్న సంకల్పము లేదు, ఆకాశమున సూర్యుడుండుట స్వభావము. ఆసమయమున నవనిపై తామరపూవు విప్పారుటయు స్వభావమే, అట్లే గగనమందు జాబిల్లి యుదయించుట నైజము. ఈ రెండింటికి కార్యకారణభావము కవి కల్పితము. అట్లే బ్రహ్మణ్యులందు అణిమాది విభూతి సంభావించుట కల్పితమే. అయితే భక్తుడు తనకు కల్గిన అభ్యుదయపరస్పర 'పురాకృతపుణ్యఫలమయినను' మూలమని భగవంతుని యందు కర్తృత్వ మారోపించి భజించుట ద్వారా చిత్తశుద్ధిని బడసి ఉద్వేగ ముడిగి తండ్రిగల కొడుకులట్లు ఎట్టి ఘట్టములందను స్వస్థతగని పరమశాంతస్థితి రూపమయిన అనుభూతిని బడయగలరు.

శ్రీవారి జన్మోత్సవ నిమిత్మయిన యీఆనందసమయములో నిది నా యర్చించుకొను సువర్ణోపహారము.

Kamakoti   Chapters   Last Page