Kamakoti   Chapters   Last Page

 

10. శ్రీకంచికామకోటి జగద్గురు శంకరాచార్య

శ్రీ చంద్రశాఖరేంద్రసరస్వతీ స్వామివారి ఉపదేశము

సంధ్యావందనము

అస్త్రశస్త్రాలనే రెండు రకాలైన ఆయుధాలు ధనుర్వేదం చెప్పింది. మంత్రపూర్వకంగా చేసే ప్రయోగమే అస్త్రం. దానివల్ల నాశం కావాలని అనుకొన్న వస్తువు నాశమవుతుంది. అనుదినమూ ప్రయోగం చేయవలసిన అస్త్రమొకటి ఉన్నది. అసురనాశనార్ధం అనుదినమూ బ్రాహ్మణులు చేయవలసిన అస్త్రప్రయోగమే సంధ్యావందనం. ఆ అస్త్రప్రయోగం చేసినామంటే మన బుద్ధిని ఆశ్రయించుకొన్న అసురశక్తులన్నీ సమసిపోతవి. ''నేను ప్రతిరోజూ ఎన్నో పాపాలు చేస్తున్నాను. అబద్ధాలు చెప్పుతున్నాను. ఇవన్నీ నాహృదయసీమలో జ్ఞానభాస్కరుని ప్రకాశానికి ప్రతిబంధకాలై ఉన్నాయి. ఇవి తొలగి పోవాలి. జ్ఞానసూర్యుడు నాలోని తమస్సు పోగొట్టి సహస్రకిరణాలతో ఒక్కుమ్మడి ఉజ్వలంగా ప్రకాశించాలి.'' అన్న భావంతో మిగతా కార్యాలను చేసినా, చేయకపోయానా ప్రాణాయామపూర్వకంగా ఆర్ఘ్యప్రదానమనే ఈ అస్త్రప్రయోగాన్ని మనం అనుదినమూ త్రికాలాలలోనూ విధిగా చేయాలి.

ఒక దుర్ఘటనమైన కార్యం ఉంది. ఎంతో శ్రమపడితే కాని అది సాధ్యంకాదు. దానిని ఒకరికి అప్పగించి 'నాయనా ! ఈ పని కాస్త ముక్కు పట్టుకొని అయిందనిపిస్తే చాలు, నీకు పుణ్యం ఉంటుంది', అని అంటాము. అంతశ్శత్రువులు అంతరించిపోవడానికి చేసే ఈ సంధ్యావందనం అనే అస్త్రప్రయోగమూ అదేవిధంగా ముక్కు పట్టుకొని చేయవలసినదే. దీనిని ఊపిరి బిగపట్టి చేయాలి. వ్యవహారార్ధం ముక్కు పట్టుకొని అంటాము గాని, నిజంగా అది ఊపిరిబిగబట్టడమే. అది నాసికాయామం కాదు. ప్రాణాయామమే.

ఏ కార్యం చేయదలచుకొన్నా మనస్సు ఓర్మివహించడం ప్రధానం. జలం గ్రహించి చేసే ఈ అస్త్రప్రయోగానికి, మనస్సు ఓర్మిగా ఉండాలి. అందుకొరకే ప్రాణాయామం, మనస్సుకూ, అవిరామంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసవ్యాపారాలకూ ఏమి సంబంధం ? ఊపిరి బిగబట్టితే మనస్సు నిలుస్తుందా ? ఒక పెద్ద ఆశ్చర్యం వేస్తుంది. హా ! యని నిలిచిపోతాం. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు కట్టిపోతవి. గొప్పకష్టం, మితిలేని దుఃఖం అపరిమితానందం, ఇవి కలిగేటప్పుడు మనస్సు లయించిపోయి ఏకాంతమైపోతుంది. తర్వాత మళ్ళీ ఈ వ్యాపారాలు ద్విగుణీకృతవేగంతో నడుస్తాయి. విన్న వార్తచేతనో, మరే ఇతర కారణంచేతనో మనస్సు లయించి పోయి ప్రాణాయామం తానుగా సిద్ధిస్తుంది. అట్లుగాక ఇచ్ఛాపూర్వకంగా ప్రాణాయామం చేస్తే అది చిత్తవృత్తి నిరోధానికి కారణమవుతుంది.

ఆర్ఘ్యం మనం చిత్తైకాగ్రతతో వదలాలి. అది ప్రాణాయామం తోనే సిద్ధిస్తుంది. అధిక ప్రమాణంలో ప్రాణాయామం చేయడం యోగం. అది కష్టం, దానిని ఉపదేశానుసారం సాగించాలి. మనం ప్రాణాయామం చేస్తేరోజుకు ఏ పదిమార్లో చేస్తాము. మూడు మార్లు చేయడం కొందరికి నియమం. చిన్న నాట జరిగిన ఉపనయన మాది క్రమంగా ప్రాణాయామం నియామకంగా చేస్తూవచ్చి ఉండినట్లయితే ఈ సరికి మనం యోగీశ్వరులమైపోయి ఉండాలి. చేసే ఏ పనినైనా సరిగా చేస్తేకదా కృతకృత్యత ? అరనిముషం ప్రాణాయామం చాలు. అధికం అక్కరలేదు. వారి వారి శరీరానుకూలంగానూ చేయవచ్చు. ప్రాణం నిలచిందంటే మనం వదిలే జలం అస్త్రమౌతుంది. సంధ్య ఆద్యంతాలను పరమేశ్వరార్పణ చేయాలి. అర్ఘ్యమనే అస్త్ర ప్రయోగానంతరం గాయత్రీజపం, కూడినంతవరకూ ప్రాణాయామం, ఊపిరి కొంచెం బిగపట్టి వదిలితే చాలు. అధికం అనవసరం. సంకల్పం, మార్జన, ప్రాశన, ఆర్ఘ్యప్రదానం, జపం, స్తోత్రం, అభివాదం - అన్నిటినీ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తికోపం చేస్తున్నానని చెప్పి చేయడమే సంకల్పం. తర్వాత మార్జన మంత్రం చెప్పి తీర్ధం ప్రోక్షించుకోవాలి. వీని అన్నిటికీ ప్రాణాయామం ముఖ్యమైన అంగం. త్రికాలాలలోనూ స్వల్ప ప్రాణాయామం చేయాలి. అధికంగా చేస్తే ఉపద్రవమూ, గురువు యొక్క అవశ్యకతా కలగుతుంది. అనుదినమూ స్వల్పంగా - రోగిష్టులు సహితం ప్రాణాయామం చేస్తే ఏ విధమైన ఉపద్రవమూ ఉండదు.

ఋషయో దీర్ఘసంధ్యత్వా ద్దీర్ఘమాయు రవాప్నుయుః,

ప్రజ్ఞాం యశశ్చ కీర్తిం చ బ్రహ్మవర్చస మేవచ ||

మనము మనోవాక్కాయాలచేత పాపాలు చేస్తున్నాము. దీనికి విరుగుడు సంధ్యోపాసన, వాక్కుద్వారా మంత్రోచ్చరణం, మానసికంగా గాయత్రీజపం, మార్జనం - ఇవి మనోవాక్కాయ శుద్ధి చేస్తవి. ఇవేకాక కర్మయోగ భక్తియోగ జ్ఞానయోగ రూపముగాకూడా సంధ్యావందన మున్నది. ఎవరికి వారు ఒక ప్రత్యేకమైన పాత్రను అమర్చుకొని, ప్రాణాయామ పూర్వకంగా ఈశ్వరార్పణబుద్ధితో సంధ్యోపాసన తొందర తొందరగా కాక తీరికగా చేయాలి.

సరియైన కాలంలో ఉచిత సంధ్యానుష్ఠానం చేసినందువల్లనే పలువురు ఋషులైనారు. అభివాదనలో ఒకానొక మహర్షి గోత్రం చెప్పుకొంటాం. ఎంచేత ? ఆ మహర్షి గోత్రంలో పుట్టాం. కనుక అప్పటినుండికూడా గాయత్రిజపింపబడుతూ రావడంచేత, ఈ మాత్రం కర్మానుష్ఠానం చేయడం మనకు అవశ్యకర్తవ్యం. మొదటిఋషి తర్వాత ఎంతో మంది ఆ సంతతిలోనే ఋషులైనారు. త్రయార్షేయమనీ, పంచార్షేయమనీసప్తార్షేయమనీ ఏకార్షేయమనీ చెప్పుకొంటారు. దీని వల్ల ఆయాగోత్రాలలో ఆయా ఋషులు ఉన్నారని తెలుస్తున్నది. శ్రీవత్సగోత్రం పంచార్షేయం.

ఎంతో కాలంనుంచీ వస్తున్న ఈ ధారను మనం త్రుంచివేయరాదు. అందుచే ప్రాణాయామపూర్వకంగా చిత్తైకాగ్రతతో, మంత్రలోపం లేకుండా పరమేశ్వరార్పణ చేసి సంధ్యను మనం తప్పక అనుష్ఠించాలి. భక్తిశ్రద్ధలతో కర్మకలాపంలో అర్ధం తెలుసుకొని సంధ్యను అనుష్ఠిస్తే పుట్టుక సార్ధకమవుతుంది.



 

Kamakoti   Chapters   Last Page