Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

శివుడవో మాధవుడవో

''శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః'' అని శివ విష్ణువుల ఐక్యం ప్రతిదినమూ సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు. శివ విష్ణువుల అభేదాన్ని ఈమంత్రం తెలుపుతున్నట్లే హరిహరుడూ రామలింగడూ రామేశ్వరుడూ శంకరనారాయణుడూ అనే పేరులుకూడా ఈ అభేదాన్ని చాటుతున్నవి.

ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది? అని సందేహం కలిగిందిట. వ్యాకరణంలో గల సమాసాలలో 'కర్మధారయము' తత్పురుషము బహువ్రీహి' అనేవి ఉన్నవి. రాజసేవకుడు అనేది తత్పురుష సమాసము. రాజుయొక్క సేవకుడు అని అర్థం. షష్ఠీవిభక్త్యర్థం దీనిలో ఇమిడిఉంది కాబట్టి ఇది షష్ఠీతత్పురుష. నీలో తల్పము. అనగా నల్లనికలువ. దీనిని కర్మధారయము అని అంటారు. దండపాణి అంటే పాణిలో - చేతిలో-కఱ్ఱగలవాడు. ఇది బహువ్రీహిసమాసము? దీనికి అర్థము సుబ్రహ్మణ్యుడు మొ|| దండ, పాణి, పదాలలో లేని అర్థాన్ని చెప్పేది కాబట్టి ఇది బహువ్రీహి. ''బహువ్రీహి'' పదానికే బాగా పండేపొలం అని అర్థం. నూరుకలాల ధాన్యం పండించేవాడు బహువ్రీహి.

రామేశ్వరం ఏ సమాసం? తత్‌ పురుషమా? 'రామస్య్శఈర్వరః అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభువు- అని అర్థం ఏర్పడుతుంది. అపుడు అది శివాధిక్యం చెపుతుంది. శివుని విల్లు విరిచిన రాముడు శివునికంటె ఏ విధంగా తక్కువ? సర్వలోక శరణ్యుడు రాముడు. అతనికి పైన ఇంకో ఈశ్వరుడా? ఈసందేహాలన్నీ తీర్చెవా రెవరు? వారు విష్ణుమూర్తినే అడిగి చూడామని అనుకొని వైకుంఠ వెళ్ళారు. 'ఇంత చిన్న విషయానికి ఎంతదూరం ఎంతదూరం వచ్చారు? ఈ పదాన్ని చూస్తేనే తెసుస్తున్నదే తత్పురుష అని. రామస్య్శఈర్వరః అని. విష్ణుమూర్తి దేవతలతో అన్నాడట. కాని దేవతలకు మాత్రం సందేహనివృత్తి కాలేదు.

విష్ణువు కల్యాణ గుణ పరిపూర్ణుడు? వినయంకూడా ఆ కల్యాణగుణాలలో ఒకటిగదా. ఏదో వినయంచేతనైతే కావచ్చు, అహంభావం ఉండరాదనికూడా కావచ్చు, మొగమాటమిచేగాని కావచ్చు. విష్ణుమూర్తి ఇలా చెప్పి ఉంటాడు, విష్ణువు నడిగాం సరిగదా, ఇక ఆ శివుణ్ణ అడుగుదాం, ఆయన ఏంచెప్తాడో చూదాం' అని అనుకొని 'విష్ణు స్తత్పురుషం బ్రూతే'్స'విష్ణువు రామేశ్వర పదం తత్పురుష సమాసం అని అనుకొంటూ కైలాసానికి కాళ్ళను మళ్ళించారట.

నాగలోకవాసుల సందేహాన్ని నాగాభరణుడు విన్నాడు. 'ఇందులో సందేహానికి అవకాశం ఏముందయ్యా? రామేశ్వర పదం బహువ్రీహిసమాసం రాముడై ఈశ్వరుడుగా గలవాడు రామేశ్వరుడు' అని ఆయన బదులు చెప్పాడట.

దేవతలకు ఏమీ తోచింది కాదు. వ్యాకరణ విషయంలో శివకేశవులకు ఈలాటి భేదాభిప్రాయాలు కలుగుతవని దేవతలకు కలలోనయినా తోచలేదు. 'వీరిద్దరికి పేరుతో ప్రసక్తి ఉన్నందున వేరే మధ్యవర్తిని అడిగి సందేహం తొలగించుకొందామని 'బహువ్రీహిం మహేశ్వరః'్స'శివుడుబహువ్రీహీ సమాసం' అని చెప్పుకొంటూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారట. బ్రహ్మదేవతలకు కలిగిన సందేహాన్ని జరిగినసమచారాన్నీ శాంతంగావిని 'ఇది తత్పురుషసమాసము కాదు, బహువ్రీహిన్నీ కాదు, మరి కర్మధారయసమాసం, వీరరాఘవు డంటే వీరుడు ఒకడూ రాఘవుడు మరొకడూనా? కాదుగదా? ఆలాగే రామేశ్వరు డంటే రాము డొకడూనూ ఈశ్వరుడింకోడూనా? రాముడే యీశ్వరుడు, ఈశ్వరుడే రాముడు అని అర్థం. కాగా 'రామశ్చాసా వీశ్వరశ్చ' రామేశ్వరః అని కర్మధారయమే యిది అని తీర్పు చేశారుట బ్రహ్మగారు.

విష్ణు స్తత్ఫురుషం బ్రూతే బహువ్రీహిం మహేశ్వరః.

ఉభయో రప్యతృప్తానా మాత్మభూః కర్మధారయమ్‌.

ఆత్మభూః అంటే బ్రహ్మ. దేవతలకు శివకేశవులొకే పరతత్త్వమని బ్రహ్మ బోధించాడట. ఈ సత్యాన్ని ఈ ఐక్యాన్ని మనంకూడా ఎన్నో విధాల తెలిసికొంటున్నాం.

శివకేశవులకు పోరు పొసగినటులు పురాణాలలో కొన్నిచోట్ల చదువుతూ వుంటాం. ఒకచోట విష్ణువు జయించాడని ఇంకొక చోట శివుడు జయించాడని చూస్తాం. ఇంతేకాదు కొన్ని చోట్ల పరస్పరము సహాయం చేసికొన్నారనీ ఒకరి నొకరు పూజించుకొన్నారనిన్నీ చదువుతాం. విష్ణుపురానికి సమీపాన 'తిరువీళిమిళ##లై' అనే క్షేత్రం ఉంది. ఇచ్చటి స్వామికి 'నేత్రార్పణశ్వరుడు' అని పేరు. ఈచోట అను దినమూ విష్ణువు ఈశ్వరుని వేయి కమలాలతో పూజించేవాడనీ, ఒకనాడు వేయింటికి ఒక పూవు తగ్గగా తన నేత్ర కమలమునే పెరకి ఇచ్చినాడనీ ఐతిహ్యం.

భగవత్పాదులున్నూ 'సాంబే పరబహ్మణి' అనే మకుటంతో ఒక స్తవం చేశారు. దానిలో ఒకటి.

విష్ణుర్యస్య సహస్రనామనియమా

దంభోరు హైరర్చయన్‌

ఏకేనాపచితేషు నేత్రకమలం

నైజంపదాబ్జద్వయమ్‌,

సంపూజ్యాసురసంహతిం విదళయం

సై#్త్రలోక్యసాలో7 భవత్‌.

తస్మిన్మే హృదయం సుఖేన

రమతాం సాంబే పరబ్రహ్మణి.

ఇట్లే తిరుక్కుండియూర్‌ అనే క్షేత్రం ఒకటి ఉన్నది. ఇచ్చట మూర్తికి బ్రహ్మశిరః ఖండీశ్వరుడని పేరు. పూర్వం బ్రహ్మగారుకూడా శివునివలెనే పంచముఖుడుగా ఉండేవాడట. దానిచేత ఆయనకు కొంచెం అహంభావం హెచ్చయింది. ఈశ్వరుడికి కోపం వచ్చింది. వెంటనే ఆయనగారి ఒకతలను గిల్లి వేశాడట. ఆ బ్రహ్మకపాలం ఒకానొక శాపంవల్ల ఈశ్వరుని చేతికే అంటుకోపోయిందిట. పైగా బ్రహ్మహత్యాపాతకం ఒకటి చుట్టుకొన్నదిట. శివునికి శాపనివృత్తి చేసింది. తిరుకుండియూరులోని పెరుమాళ్ళే అని ఈ స్థలపురాణం చెపుతూంది, ఇందలి మూర్తికి హరశాపవిమోచకుడని పేరు.

రామాయణంలోగూడా శివవిష్ణువులకు వివాదం ఒకటి ఏర్పడినటులున్నూ విష్ణువు 'హుమ్‌' అని అన్నంతనే శివుని వింటి అల్లెతాడు పుటుక్కున తుగిపోయినటులున్నూ వర్ణింపబడ్డది, 'అధికం మేసిరే విష్ణుమ్‌'్సవిష్ణువు గొప్పవాడని అనుకొన్నారట. ఇట్లే నాయనార్ల గీతాలు శివాధిక్యం చాటుతవి. ఆళ్వార్ల గీతాలు విష్ణువరాలు. అవి విష్ణ్వాధిక్యం చాటుతై.

పరతత్త్వం ఒకటంటే ఒకటికదా. శివుడు పరతత్త్వమా విష్ణువు పరతత్త్వమా? శైవులకుగాని వైష్ణువులకుగాని ఈలాటి సందేహమే ఉండదు. శైవులు శివుని వైష్ణవులు విష్ణువునూ గొప్పవానిగా తలపోస్తారు. అద్వైతులకే చిక్కు. సామరస్యపు ఆవశ్యకత వారికే.

ఉన్నది ఒకే ఒకవస్తువు. ఒకవస్తువు రెండెట్లా అవుతుంది? శివ విష్ణువుల భేదాలను అటుంచుదాం. రాముల వారున్నూ పరశురాములవారున్నూ విష్ణ్వంశలయిన రెండు అవతారాలు. వీరిమాటయేమిటి? వీరిలో ఎవరధికులు శివుని విల్లు విరిచాడని రాములవారిమీద పరశురాముల వారికి కోపంకలిగింది. క్షాత్రలోకాన్ని భస్మంచేసిన పరశురాముడు రామునిముందు నిర్వీర్యుడయిపోయాడుగదా ఈ సంగనతి యేమిటి?

'ఇవన్నీ భగవల్లీలలు. ఇద్దరూ ఒకేఒక పరమాత్మ యొక్క అంశంలుకదా!' అని ఒకరన్నారట. వాస్తవానికి అంతేగాక మఱమిటి?

కయ్యమాడినంతమాత్రాన వీరు వేరుకాదు. ఒకే పరమాత్మ తన మాయాశక్తి చేత ఆయా యీ సమయాలలో ఒకొక్క రూపంతో అనుగ్రహించడానికై ఆవిర్భవిస్తున్నది. ఏ అనుగ్రహాన్ని పొందాలని అనుకుంటామో ఆ అనుగ్రహాన్ని ఇచ్చేమూర్తిని ఆరాధించాలి. అన్నీ ఒకటే అన్న అభేదజ్ఞానం ఎప్పటికిన్నీ మరవరాదు, ఈ భేదాలన్నీ కార్యార్థం. సత్త్వముర జస్సు తమస్సు అనే త్రిగుణాలూ, మెలకువ కలనిద్ర అనే మూడవస్థలూ బ్రహ్మ విష్ణు శివులని త్రిమూర్తులూ ఇలా అన్నీ మూడు మూడుగా ఉన్నవి. త్రిమూర్తులు త్రిగుణాత్మకంగా ఉన్నారు. సత్త్వం తెల్లరంగు, రజస్సు పసపు ఎఱుపుల కలపోత. తమస్సు నలుపు, చీకటి రంగు ఒకటి చీకటి ఒకటి, శాంతము మరొకటి వేగము అని చెప్పవచ్చు. తెలుపు నలుపుల నడుమనున్న స్థితిరజస్సు.

బ్రహ్మది రజోగుణం. ఇతనిది ఎరుపు పసపుల కలగలుపుగా ఉండే బంగారు రంగు, విష్ణువుది సత్త్వగుణం. ఆయన లోకపాలకుడు. శివుడు సంహారకుడు. తామస గుణం కలవాడు. 'శ్రేయాంసి త త్ర ఖలుసత్త్వతనో ర్నృణాంస్యు?' అని భాగవతం చెపుతూంది.

జగత్తును కాపాడటమూ అనుగ్రహించడమూ సత్త్వగుణం. శ్రేయస్సు కావాలంటే సత్త్వగుణాన్నే మనం ఆరాధించాలి. ఒకే పరమాత్మ మూడు విధాలయిన గుణాలు కల మూడు మూర్తులుగా ఉన్నా అనుగ్రహంకోసం సత్త్వగుణం కలమూర్తినే ఆరాధించాలి మనం ఏ యే గుణాలు కలవారితో సంపర్కం పెట్టుకొంటామో ఆయా గుణాలు మనకు తెలియకుండానే మనలో ప్రతిఫలిస్తూ ఉంటవి. కోపిష్ఠిని చూస్తే మనకున్నూ కోపమో లేక నిరుత్సాహమో కలుగుతున్నది. కార్యజయాన్ని ఉద్దేశించినప్పుడు మన కెవరి వల్ల కార్యం కావాలో వారుశాంతంగానూ సంతోషంగానూ ఉన్న సమయం చూచిమరీ వెళతాం. పరమ శాంతుడున్నూ కోపం లేనివాడున్నూ ఐన మాధవుడే విష్ణువే కొలవదగిన దైవం అని విష్ణుసంబంధాలయిన పురాణాలు చెపుతున్నవి.

స్కాందము శైవపురాణము, 'మాయ తొలగిపోవాలనే కోరిక గలవారు ఈశ్వరోపాసన చేస్తారు. చేయాలి పశుపతి పాశమోచకుడు. ఆయన సాత్త్వికుడు. సాత్త్వికుని కొలిస్తేకదా సత్త్వగుణం ఏర్పడుతుంది.' అని స్కాందమూ సూతసంహిత చెపుతున్నవి. కొన్ని పురాణాలు శివునకు తమోగుణమును బ్రహ్మకు రజోగుణమును మాధవునకు సత్త్వగుణమును కలదని చెపుతున్నవి.

శివునిరంగు తెలుపు. ఆయన భస్తోద్ధూళితగాత్రుడు. ఉండేచోటో కైలాసం. అదీ పరమ తెలుపే. వాహనం తెలుపు. శుద్ధమయిన స్ఫటికంవలే ఉన్న శివునిచూడగానే ఆతడు సాత్త్వికమూర్తి అని తేటతెల్లంగా తెలుస్తుంది. విష్ణువు నలుపు. ఆయనస్థితి సతతనిద్ర. ఆయన వర్ణం తమోవర్ణం. గుణం తమోగుణం. అందుచేత విష్ణువుతామసి, శివుడు సాత్త్వికుడు అని కొన్ని పురాణాలు.

కొంచెం ఆలోచిస్తే శివునిస్వరూపమూ స్థితీ సత్త్వగుణ సూచకాలు. చేసే పనిమాత్రం జగత్‌ సంహారం. ఇది తమోగుణక్రియ. విష్ణువుయొక్క రూపమూ స్థితీ తమోగుణ సూచకం. కాని ఆయన చేసే లోకపరిపాలన అనే క్రియ సాత్త్వికక్రియ. ఇట్లా మాధవ-ఉమాధవులలో సత్త్వగుణ మిశ్రమం ఉన్నది.

బ్రహ్మనుగూర్చి వాదంలేదు. అందరున్నూ ఆయన గారిని రజోగుణవిశిష్టుడనే చెప్పారు. ఆయనకు గుళ్లుగాని గోపురాలుగాని ఆరాధనగాని లేదు. అందరూ ఆయనను మధ్యస్తంగా వదలివేశారు. వివాదాలన్నీ కామారినీ కంసారినీ గురించే.

ఆళువార్లలో ఒకరు పెరుమాళ్ళను వర్ణిస్తూ - 'నీవే మునివి, నీవే బ్రహ్మవు, మూడుకన్నుల తండ్రివిన్నీ నీవే' అని సరసమాడారు.

పాప పుణ్యాలనుబట్టి ఫలం ఇచ్చేవాడు విష్ణువు. బ్రహ్మ సృష్టిచేసేవాడు. శివుడు ప్రయలం చేస్తాడు. ఆప్రలయ సమయంలో చరాచరాలను తనలో లీనం చేసికొంటాడు. ఈ సంహారక్రియ క్రౌర్యమా? భ్రమణచక్రంలో చిక్కుకొని సదా భ్రమణం చేస్తున్న జీవుడికి ఆడి ఆడి అలసిపోయిన బిడ్డను చూచి-'బిడ్డా! అలసిపోయావు. నేటికి ఈ యాటచాలు, కొంచెం నిద్రపో' అని ప్రేమతో బుజ్జగించే తండ్రిలాగా తల్లిలాగా విరామం ఇచ్చే ఆ మహానటుని ప్రీతినీ అనుగ్రహాన్నీ చూపే ప్రలయక్రియ తామసికమా?

నిత్యప్రలయం మహాప్రలయం ఆత్యంతికప్రలయం అని ప్రలయం మూడువిధాలు. పగలంతా విసిగి వేసారి కష్టాలూ సుఖాలూ అనుభవించి నానాబాధలూపడిన జీవి నిద్రలో ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అది నిత్యప్రలయం. దానినిచ్చేదాత ఈశ్వరుడు. నిద్ర దుఃఖాలనన్నిటినీ పోగొట్టుతుంది. ఏదో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. 'హాయిగా నిద్ర పోయాను' అని పొద్దున్నే లేచి ఎంతో ఉత్సాహంగా అంటాం. ఆ నిద్రాసౌఖ్యం కలిగించే దాత ఈశ్వరుడే. మహాప్రలయంలో జగత్తు నిశ్శేషమౌతున్నది. మళ్ళా బ్రహ్మ సృష్టించాలి. ఈ పునస్‌ సృష్టిలో జీవులు పూర్వకర్మాను గుణంగా పుటతారు.

రెండు మూడు అని వేరువేరుగా తోచే భేదజ్ఞానాన్ని పొగొట్టి అద్వైతానుభవాన్ని మోక్షానందాన్ని ఇచ్చేదే ఆత్యంతికప్రలయం. నిద్రలో ప్రతిరోజూ సుఖం అనుభవించడూ, ఈశ్వరస్వరూపంలో లయమై విశ్రాంతి పొందటమూ అభేదదర్శనంచేస్తూ మోక్షానందం అనుభవించడమూ ఆ యీశ్వరుని కరుణ. ఈ కార్యాలు తామసాలవలె కనిపించినా తండ్రిచేయవలసినపని చేస్తేనే కదా ఆయన మూడుకనుల తండ్రి కాగలగడం?

విష్ణువుది యోగనిద్ర. 'నిద్రాముద్రాం నిఖిలజగనీ రక్షణ జాగరూకామ్‌'. నిద్రపోతూనే వుంటాడు, లోకరక్షణం చేస్తూనే వుంటాడు. పాలించడమూ సంహరించడమూ ఈ రెండున్నూ కారుణ్యాన్ని చూపే కార్యాలే. వీనిలో ఎక్కువ తక్కువలెంతమాత్రమూ లేవు. ఆలాగే ఈ మూర్తులలో ఆధిక్యానధిక్యా లేమాత్రమూలేవు. పసిపిల్లలు సమేతూ అరవంలో, 'హరియుం శివనుం ఒండ్రు, అరి యాదవన్‌ వాయిలే మణ్ణు' ్స 'హరిహరు లిద్దరూ ఒకటే, అది తెలియనివాని నోట్లో మన్ను' అని అంటారు. ఇది సామెత.

ఒకే ఒక తత్త్వం మాయచేత అనేకరూపాలతో మనకు గోచరిస్తుంది. భేదజ్ఞానం మనం అజ్ఞానంచేత పసిబిడ్డకు చెక్కతో చేసిన మామిడిపండు ఇస్తే దానిని తినడానికి పూనుకుంటుంది. మనకు నవ్వు వస్తుంది. ఈలాగే ఎన్నో వికారాలకులోనయిన ఈ ప్రపంచాన్నీ సృష్టించి, కాంతా కనక క్షేత్రాదులను చూపిస్తూ భగవంతుడు మనలను మభ్యపెడుతూ ఆడిస్తున్నాడు. ఇదంతా భ్రాంతి. చీకట్లలో చూపుసరిగా అందక తాటిని చూచి పామని అనుకొంటాం. పిదప పాము భ్రాంతి అని తేలుతుంది. అట్లే వేదాంతశాస్త్రపఠనం వల్ల ఇదంతా మిథ్య అనే ఎరుక కలుగుతుంది. వట్టి ఎరుకయే కలిగినంత మాత్రాన సరిపోదు. ఈశ్వరుని అనుగ్రహంచే అది అనుభవంలోకి రావాలి.

కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఊరివారిని అడిగి తెలిసికొన్నా అపుడపుడు ఏదిక్కున పోయేదీ తెలియక భ్రమపడుతూ వుంటాం. అదే దిగ్‌ భ్రాంతి. అనుభవ పూర్వకమయిన ఎరుక సంపాదించు కొన్నవానికి శివ మాధవుల తేడా కనిపించదు. దానిచేత ఎక్కువ తక్కువలు కట్టిపెట్టి వంశానుక్రమంగా కొలిచేదైవతాలను పరదేవతగా ఎంచవలె. తక్కిన దేవతలున్నూ ఆపరదేవతయొక్క వేరువేరు అంశాలని అభేదానుభవంతో అచంచలమయిన శాంతితో మనం ఉండాలి.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page