Neetikathamala-1    Chapters    Last Page

30

దైవస్తుతి

ముక్తాహార లసత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్రప్రభాం

శింజన్నూపుర కింకిణీ మణిధరాం పద్మప్రభా భాసురామ్‌

సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీరమా సేవితాం

మీనాక్షీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్‌.

- మీనాక్షీ సంచరత్నం

-----

దాశరథీ

అగణిత జన్మకర్మ దురితాంబుధిలో బహుదుఃఖ వీచికల్‌

తెగిపడ నీదలేక జగతీధవ! నీ పదభక్తి నావచేc

దగిలి తరింపc గోరితిc బదంపడి నాదు భయంబు మాన్పవే

తగదని చిత్తమం దిడక దాశరథీ!కురుణాపయోనిధీ!

దయాసముద్రుడవైన ఓరామా! జన్మ కారణంగా లెక్కలేనన్ని పాపములలో మునిగి దుఃఖపు తెరలు దాటిపోవ ఈదలేక నీ పదములందలి భక్తియను నావను ఆశ్రయించి తరింప దలచితిని. వేగమేవచ్చి నా భయమును పోగొట్టుము. ఇది తగని పనియని మనమున దలపకుమయ్యా రామయ్యా!

---

ధృతరాష్ట్రుడు

ధృతరాష్ట్రుడు కురు సమ్రాట్టు. సోదరుడైన పాండురాజు మరణానంతరము రాజ్యార్హతలేని అంధుడైనప్పటికీ రాజయ్యాడు. పాండుకుమారులను ఆదరించి తన కుమారులతో పెంచాడు. తండ్రికి సహజమైన పుత్ర వాత్సల్యం ఆతనిలో అసహజమైన హద్దులకు చేరింది. దుర్యోధనుడు పుడుతూనే గాడిద ఓండ్ర పెట్టినట్లు రోదించాడు. పరిసరంలో గాడిదలు ఆ ధ్వనితో శ్రుతికలిపి ఓండ్రపెట్టాయి. తుఫానురేగింది. ఈ దుశ్శకునాలవలన వాడు కులనాశకు డౌతాడు, వెంటనే విసర్జించవలసినదని ధర్మవిదుడైన విదురుడు, భీష్మాదులు చెప్పినా పుత్ర స్నేహ బంధంతో వారి మాటలు పెడచెవిని పెట్టాడు. పాండు నందనుల సద్గుణాలు, తేజో పరాక్రమాదులు విని లోలోన శోక సంతప్తుడైనాడు. అగ్నికి ఆజ్యంవలె దుర్యోధనునకు కర్ణ, శకుని, దుశ్శాసనుల దుర్యోగం ప్రాప్తించినదని ఎరిగి పాండవుల నాశనమునకు వారి దుస్తంత్రాలను ఆమోదించాడు. పాండవులను వారణావతమునకు పంపి వారు లాక్షాగృహమందు మరణించారని విని లోలోన తన కుమారునికే రాజ్యం ప్రాప్తించిదని సంతోషించి బయటకు దుఃఖం నటించాడు. పాండవుల శక్తిని సంజయుడు వివరించినపుడు భయంతో ఆతని కంటికి నిద్రపట్టలేదు. శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చినపుడు సభలో నారద, పరశురామ, భీష్మ, ద్రోణ, విదురాదుల హితవచనాలను విని భీషణసంగ్రామానికి, కులనాశనానికి దారితీయు దుర్యోధనుని సమ్రాట్టుగా, తండ్రిగా నిరోదించక తనమాటను దుర్యోధనుడు వినుటలేదనే దుఃఖించాడు. ఆ కుటిలునికి లోలోన విజయం కౌరవులకు దక్కుతుందను ఆశ##యే దానికి కారణం.

పాండవులలో దృఢశరీరుడు, మేరుమహానగ ధీరుడు, మత్తశుండాలమువంటి హస్తములలో, యమదండము వంటి గదా దండమును ధరించు భీమసేనుడంటే ధృతరాష్ట్రునకు చాల భీతి. కురుసభలో ప్రతిజ్ఞచేసినట్లుగానే వాడు భీషణ సంగ్రామంలో దుశ్శాసనుని రొమ్ము వ్రయ్యలుచేసి రుధిరపానం చేశాడు. ద్రౌపదిని తొడచరిచి అంక సీమపై కూర్చొనమని సంజ్ఞ చేసిన దుర్యోధనుని తొడలను తన గదాదండముతో విరుగ గొట్టాడు. తన ప్రియపుత్రుని మరణానికి ఉద్ధతుడైన ఆ భీముడే కారణం అని ధృతరాష్ట్రునికి బాగా తెలుసు.

సంగ్రామానంతరం శ్రీకృష్ణునితో కూడి పాండవులు ధృతరాష్ట్రుని ఓదార్చుటకు వెళ్ళారు. వాసుదేవుడు, ధర్మరాజు అతనిని ఆశ్వాసించారు. ధృతరాష్ట్రుడు భీమసేనుడు వచ్చాడా అని అడిగాడు, వచ్చినట్లుగ్రహించి-

''నాయనా భీమసేనా! ఇటురమ్ము'' అని పిలిచాడు. ఆ పలుకులలోని కాఠిన్యత, కుటిలత్వము ప్రతిధ్వనించిన ప్రతీకారములను గుర్తించాడు వాసుదేవుడు. కాని భీముడు అమాయకంగా ముందుకు అడుగులు వేస్తున్నాడు. భీముని కౌగిలించుకొనుటకు ధృతరాష్ట్రుడు తన రెండు చేతులు చాచాడు. వెంటనే ఆ భక్తరక్షకుడు భీముని ప్రక్కకులాగి ఒక ఉక్కు భీముని విగ్రహాన్ని ముందుకు నెట్టాడు. దృతరాష్ట్రుడు పెల్లుబుకుతున్న క్రోధ ద్వేషాలతో బయటకు కపటంగా సంతోషాన్ని ప్రకటిస్తూ - ''నాయనా వచ్చావా ! విజయంతో నావద్దకు వచ్చావా ! నీవు తప్ప నా కింకెవరున్నారు'' అంటూ తన బాహు బంధంలో ఆ విగ్రహాన్ని నలిపి వేసి తునాతునకలుగాచేశాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చూడగా పాండవులు భీత చిత్తులై తెల్లమొగాలు వేశారు.

''మామా!నీ కోపద్వేషాలు తగ్గాయా? సర్వమూ కోల్పోయినా నీకు ఈ ద్వేషము నశించలేదా? నీ చిత్తవృత్తి ఎరిగి నేను భీముని నీ కడకు రానీయక దుర్యోధనుడు ద్వేషభావంతో తాను గదా ప్రహారములు నేర్చుకొనుటకు ఉపయోగించు భీముని ఉక్కు విగ్రహాన్నే నీముందుంచాను. భీముడు క్షేమగా ఉన్నాడు'' అని కృష్ణుడు పలికాడు. హతాశుడై తన కుటిలత్వం బయలుపడగా ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు.

కుటిల బుద్ధులకు మొదట విజయాలు, సౌఖ్యములు కల్గి నప్పటికి తుదకు సర్వనాశనమేస వారికి ప్రాప్తిస్తుంది. ధృతరాష్ణ్రుని చరితమే దానికి ప్రబల తార్కాణము.

ప్రశ్నలు

1. కౌరవ నాశనమునకు కారకు లెవరు?

2. భీముని చంపుటకు ధృతరాష్ట్రుడు ఎట్లు ప్రయత్నించెను?

3. శ్రీకృష్ణుడు ప్రమాదమునుండి భీము నెట్లు రక్షించెను?

Neetikathamala-1    Chapters    Last Page