SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌ సత్‌

శ్రీ గణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

9-శ్వేతాశ్వత రోపనిషత్తు.

ప్రధమ అధ్యాయము.

పర బ్రహ్మ పరమాత్మను గూర్చి తెలిసికొనగోరు జిజ్ఞాసువులు. తమలో తాము ఇట్లు వివేచన చేయసాగిరి. హే వేదవిదుల మహర్షులారా! మనము వేదములందు చదివిన సమస్త జగత్కారణ బ్రహ్మ ఎవరు? మన ఉత్పత్తి కి మూలము ఎవరు? ఎవని ప్రభావము చే మనము జీవించుచున్నాము? అట్టి జీవనాధారమెవరు? భూత భవిష్యత్‌ వర్తమానకాలము లందు మనము ఎవరి యందు సంస్థితులమైయుందుము? మనకాశ్రయ మెవరు? మన అధిష్టాత, సువ్యవస్థాపక సంచాలకుడెవరు? ఇట్లు సత్సంగమ చేసిరి.

2) వేదశాస్త్రములందు కొందొకచో సృష్టి స్థితి లయములు కాలాధీనముగాన కాలము కారణమనిరి. కొందరు వస్తుగత స్వభావము, శక్తికారణమనిరి. కొందరు జీవుల కర్మాను సారము జన్మించుటచే కర్మయే కారణమనిరి కొందరు పంచ భూతములను, మరికొందరు జీవాత్మను కారణమనిరి. కాని కాలము మొదలు పంచ భూతములవరకు, అన్నియు జడ పదార్థములగుటచే, చేతన శక్తి లేని కారణముచే జగదుత్పత్తికారణము కావు. జీవాత్మయు సుఖదుఃఖహేతు భూత ప్రారబ్దవశుడగుటచే స్వతంత్రముగా ఏమియు చేయ జాలదు. కావునవీని కంటె భిన్నమగు వేరొక కారణ తత్వము కలదు.

3) వారు యుక్తులు, అనుమానాదుల ద్వారా విచారించి సరియగు నిర్ణయము చేయలేక మనస్సు , ఇంద్రియములను బాహ్య వస్తువుల నుండి మరల్చి పరబ్రహ్మ ను గూర్చి చింతించి పరమాత్మయే సత్వరజస్తమో గుణోపేతుడైనను త్రిగుణాతీతుడై కాలము మొదలు జీవాత్మ వరకుగల సమస్తమునకు అధిష్టాత, స్వామి, ప్రేరకుడు, సర్వశక్తి వంతుడగు పరమాత్మయే. జగత్తునకు వాస్తవీకారణు. అన్యులెవరు కారని నిశ్చయించుకొనిరి.

4) ఈ విశ్వము ఒక చక్రము. ఇందు అన్యాకృతి ప్రకృతియే. మూలాధారమగు ఇరుసు (నేమి) సత్వరజస్తమో గుణములు చక్రముయొక్క పట్టాలు. ఏలనన భగవంతుని అచింత్య శక్తి ఈ త్రిగుణములతో కూడియున్నది. ఈ సంసార చక్రమునకు ప్రకృతి రూపమగు ఇరుసునకు మనస్సు, బుద్ధి, అహంకారము ఆకాశ, వాయు, తేజ, జల, పృధ్వి, అను ఎనిమిది సూక్ష్మ తత్వములు వాని స్థూల రూపములు మొత్తం 16 ఆకులు, అంతఃకరణవృత్తికి 50 భేదములు కలవు. ఇందు పది ఇంద్రియములు, పంచ విషయములు, పంచ ప్రాణములు, 20 సహాయకములు, ఇందు ఎనిమిది వస్తువుల చొప్పున షష్ఠి అష్టకములు కలవు. శ్రీశంకరభాష్యానుసారము అవి

(1) పంచభూతములు, మనోబుద్ధి అహంకారములు (2) త్వత్‌, చర్మము, మాంసము, రక్తము, మేద, అస్థి, మజ్జి, వీర్యము అను శరీరగత అష్టధాతువులు. (3) అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వ, అను అష్ట ఐశ్వర్యములు, (4) ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్య, అను అష్ట భావములు. (5) బ్రహ్మ, ప్రజాపతి, దేవ, గంధర్వ యక్ష , రాక్షస, పితర, పిశాచ అను అష్టదేవయోనులు. (6) దయ, క్షమ, అనసూయ, శౌచ, అనాయాస, మంగళ, అకృపణత (ఉదారత) అస్పృహ అను ఆత్మయొక్క అష్ట గుణములు జీవుని ఈచక్రమునందు అనేక విధములగు ఆసక్తి బంధించును. దేవయాన, పితృయానములు, భూలోకములు జీవుడు పయనించు మార్గములు. పుణ్య కర్మ, పాపకర్మలు, జీవుని ఈ చక్రము నందు భ్రమింపజేయు నిమిత్తములు. చక్రకేంద్రమగు ఇరుసు (నాభి) యే అజ్ఞానము. ఇదియే జగత్‌ చక్రకేంద్రము.

5) సంసారము ఒక నది వంటిది. ఇందుమనస్సు మూల ఉద్గమస్థానము, పంచ జ్ఞానేంద్రియములు పంచశ్రోతస్సులు, ఈ నదీ ప్రవాహము భయంకరము. వక్రగతి కలది, దీనినుండి బయలు వెడలుట కష్టమైనది. ఇందు మునిగిన వారు జన్మ మరణ క్లేశములను భవింతురు. ప్రాణములు %ీ భావ సరితా తరంగ మాలికలు. శబ్ద స్పర్శాదులు ఈ నది యందు గల సుడి గుండములు. ఇందు చిక్కుకొని గర్భ, జన్మ, జరా, రోగ, మృత్యు దుఃఖములు పొందెదరు. అజ్ఞానము, అహంకారము, రాగద్వేష, మృత్యుభయములు, ఈ నదియొక్క విభాగములు. అంతఃకరణయొక్క ఏబది ప్రవృత్తులే ఈ నది యొక్క భిన్న భిన్న రూపములు.

6) సమస్త ప్రాణుల ఆశ్రయము, జీవన నిర్వాహహేతువు జగద్రూప బ్రహ్మ చక్ర సంచాలకుడు పరమాత్మయే. జీవాత్మ తన కర్మానుసారము పరమాత్మ ద్వారా సంచాలిత విరాట్‌ సంసార చక్రమున తిరుగాడుచుండును. సంచాలకుడగు పరమాత్మ కృపాపాత్రుడు కానంతవరకు ఈ సంసార చక్ర పరిభ్రమణము తప్పదు. కావున సర్వప్రేరక పరమాత్మను తెలిసికొని, ఆయనకు ప్రియ పాత్రుడై అమృతత్వము పొందవలెను.

7) ఎవని మహిమను వేదములు గానము చేసినవో అట్టి పరమాత్మ అందరకు సర్వోత్తమ ఆశ్రయము. ఆతని యందే సమస్త విశ్వము కలదు. ధ్యానయోగముచే హృదయాంతర్యామి పరమాత్మను తెలిసికొని, ఆయన దివ్య దర్శనము పొంది, సర్వతోభావమున ఆయన శరణు జొచ్చినవారు జన్మ మరణ రహిత పరమ పదము పొందెదరు.

8) వినాశముగల జడవర్గము భగవానుని అపరాప్రకృతి క్షీరతత్వము, భగవానుని పరాప్రకృతి రూప జీవ సముదాయము. ఆయన అక్షరతత్వము. వీని సంయోగముచే ప్రకట అప్రకట రూప సమస్త జగత్తునకు ధారణ పోషణ చేయు స్వామి, ప్రేరకుడు సంచాలకుడు నియమనకర్త. ఆపరమాత్మయే. జగత్‌ విషయములయందు భోగాసక్తిచే జీవాత్మ ప్రకృతి అధీనుడై మోహ జాలమున చిక్కుకొని పరమాత్మను చూడడు. ఆ పరమాత్మ యొక్క అకారణ కృపావిశేషముచేతను, మహాపురుషుల సాంగత్యము చే పరమాత్మను తెలిసికొన అభిలాషకలవాడై ప్రయత్నించి బంధవిముక్తుడై పరమేశ్వరుని చేరును.

9) సర్వజ్ఞ, సర్వశక్తి వంతుడగు పరమాత్మ, అల్పజ్ఞుడు, అల్పశక్తి వంతుడగు జీవాత్మ, జీవాత్మకు సమస్త భోగసామగ్రి నిచ్చు ప్రకృతి అజన్ములే. పరమాత్మ సృష్టి, స్తితి, లయకారక విలక్షణ, అనంత విశ్వస్వరూప విరాట్‌ పురుషుడు,ఇట్లు ప్రకృతి జీవులు పరమాత్మ ప్రకృతులు. పరమాత్మ వీరికి స్వామి అని ప్రత్యక్ష మొనర్చుకొనువారు బంధ విముక్తులై పరమాత్మ నుపొందెదరు.

10) ప్రకృతి క్షీరము, పరివర్తనము, వినాశశీలము, దీనిభోక్తయగు జీవసముదాయము అవినాశి, అక్షీరము. ఈ రెండు తత్వములకు పరమాత్మ శాసకుడు.ఇట్లు తత్వము తెలిసి ధృడ నిశ్చయముతో పరమాత్మను నిరంతరము ధ్యానించువారు అంతమున మాయామయ జగత్తునుండి విడివడి పరమాత్మను పొందెదరు.

11) పరమపురుష పరమాత్మను సదాధ్యానించు సాధకుడు అవిద్య, అహంకార, రాగద్వేష మరణ భయ వివర్జితులై బంధ విముక్తులై బ్రహ్మలోకమును పొందెదరు. అదియే పూర్ణకామ, విశుద్ధ కైవల్యపదము.

12) పరమాత్మ మనశరీరమందే హృదయ కుహరమున నున్నాడు. వేరు చోట్ల వెదుక పనిలేదు. ఇట్టి జ్ఞానము కలిగి సతత ధ్యానాదులచే ఆయనను తెలిసికొని, భోక్తయగు జీవాత్మ భోగ్యమగు ప్రకృతి ఆపరమాత్మ (అంశములే), పరమాత్మే వాని ఆధారము. నియామకుడు ఈమూడు బ్రహ్మరూపములే.

13) కాష్టమునందు అగ్నియున్నను అరణి చేమధింపనతం వరకు ప్రత్యక్షముకానట్లు, జీవాత్మ పరమాత్మలు హృదయకుహర మున నున్నను ప్రత్యక్షముకాదు. ఓంకార జపసాధనచేశరీర మందు ఆయన సాక్షాత్కరించును.

14) అగ్ని ప్రజ్వలనకు రెండు అరణిల మంధనముచేయవలెను. ఇందు క్రింది అరణి స్థిరము గానుండ పైఅరణి చె మదించును. అట్లే శరీరమను క్రింది అరణి ఓంకారమును పైఅరణి చే జపమననాది మంధనచే పరమాత్మ చింతన నిరంతరము చేసి సాధకుడు హృదయాంతర్వర్తియగు. పరమాత్మను ప్రత్యక్షమొనర్చుకొనును.

15) తిలలయందు తైలము దధియందు ఘృతము, ఎండిన నది క్రింద జలశ్రోతము ఉండును. వానిని ప్రయత్న పూర్వకముగా తీయవచ్చును. అట్లే విషయ విరక్తుడగు సాధకుడు సదాచార సత్య భాషణ సంయమపూర్వక తపోధ్యానాదులచే పరబ్రహ్మ పరమాత్మను పొందవచ్చును.

16) ఆత్మ విద్య తపము, అనుమూల భూత సాధనముల ద్వారా దధి యందలి ఘృతమువలె సర్వాంతర్యామి పరమాత్మను సాధకుడు పొందగలడు.ఇదియే ఉపనిషత్తుల యందు వర్ణింపబడిన పరమతత్వ బ్రహ్మ.

-----

ద్వితీయ అధ్యాయము

సర్వము ఉత్పన్నము చేయు పరమాత్మ మనమనస్సు బుద్ధియొక్క వృత్తులను తత్వప్రాప్తి కొరకు, తన దివ్య రూపమున నుంచుగాక, అగ్ని మొదలగు ఇంద్రియ దేవతల ప్రకాశము బాహ్య విషయములనుండి మరల్చి ఇంద్రియాదుల స్థిరముగా స్థాపించుగాక, ఇంద్రియప్రకాశము మనోబుద్ధుల స్థిరమగుగాక.

2) మనము నిరంతరము భగవదార ధనయందు నిమగ్నులమై భగవత్రాప్తి జనిత పరమానందము పొంద ప్రయత్న శీలుర మగుదుముగాక.

3) మనస్సు, ఇంద్రియముల అధిష్టాన దేవతలు స్వర్గాదుల చరించి గొప్ప ప్రకాశము వ్యాపింప జేయువారు మన మనస్సు ఇంద్రియముల పరమేశ్వర సాక్షాత్కారమునకై ధ్యాన సమర్థ మొనర్తురుగాక, నిద్ర, ఆలస్యము, అకర్మణ్యత మనధ్యానము నందు విఘ్నములు కలుగ జేయుకుండుగాక.

4) పరబ్రహ్మ పరమాత్మయందు శ్రేష్ఠ బుద్ధి గల బ్రాహ్మణులు తమ మనస్సు, సమస్త బుద్ధి వృత్తులను అగ్ని హోత్రాది శుభ కర్మల విధాన మున సర్వవ్యాపి, సర్వజ్ఞ పరమాత్మను స్తుతించెదరుగాక.

5) ఓ మనోబుద్ధులారా! నేను మీకిద్దరకు స్వామి, సమస్త జగత్తుకు ఆదికారణ పరబ్రహ్మకు నమస్కరించి వినయపూర్వకము గా ఆయన శరణు జొచ్చితిని. దివ్యలోక నివాసియగు పరమాత్మ పుత్రులు విందురు గాక.

6) అరణి మంధనద్వారా అగ్ని పొందునట్లు శరీమను అరణిని ఓంకారమను అరణిచే మధించి పరమాత్మను నిరంతరము జపధ్యానాదులచింతించి వాయు నిరోధన చేసి ఆనంద రూప సోమరసము పొందుగాక.

7) పైన తెలిపినట్లు సర్వాంతర్యామి పరమాత్మను స్తుతించి ఆయన శరణు జొచ్చి, భగవత్సేవ చేయుచు, ఆయన ఆశ్రయము పొంది తనను తాను ఆయన లో విలీనమొనర్చుకొనవలెను. అట్లు చేసి సమస్త సంచితకర్మ బంధ విముక్తుడు కావలెను.

8) ధ్యాన యోగము ద్వారా సాధన చేయువారు సుఖాశీనులై, శరీరము శిరస్సు, గ్రీవము నివారుగానుంచి, ఇంద్రియములను బాహ్యవిషయములనుండి మరల్చి, మనస్సును హృదయకుహరమందున్న ఓంకార వాచ్యుడగు పరమాత్మయందు నిలిపి జన్మ మృత్యు రహిత పరమాత్మ యొక్క అమరపదము పొందవలెను.

9) బుద్ధి మంతుడగు సాధకుడు ఆహార విహారాదుల మితసేవన చేయుచు, యోగశాస్త్ర విధిననుసరించి ప్రాణయామము చేయుచు, ఇంద్రియములనెడి చంచల అశ్వములను లొంగ దీసుకొని గమ్యస్థానముచేర్చు సారధివలె మనస్సును వశపరచు కొని పరమాత్మ ప్రాప్తి రూప గమ్యస్థానముచేరవలెను.

10) ధ్యాన యోగము ద్వారా సాధన చేయుటకు ఎత్తు పల్లములు లేని శుచియగు , శుద్ధమగు, సమతలప్రదేశము కావలెను. దేవాలయములు, తీర్థ స్థలములు, జలవనరులు కలిగిన ఏకాంత ప్రదేశముశ్రేష్ఠము.

11) పరమాత్మ ప్రాప్తికి ధ్యానయోగముద్వారా సాధన చేయువారికి ప్రారంభమున పొగమంచు పొగ, మిణుగురుపురుగు వలె మంద ప్రకాశము క్రమముగా సూర్య, చంద్ర, అగ్నివంటి పరిపూర్ణ దివ్యశీతల ప్రకాశము వ్యాపించినట్లు కనపడును.

12) ధ్యానయోగసాధన యందు పంచ మహాభూతవిషయిక పంచ సిద్ధులు లభించిన యోగాగ్ని మయ శరీరముపొందిన వాడై, జరారోగ, మృత్యువులు, ఆతని ఇచ్ఛాను సారము కలుగును.

13) పంచ భూతములపై విజయము పొందిన ధ్యాన యోగికి మరికొన్ని శక్తులు లభించును. ఆతని శరీరముతేలికయై ఆలస్యరహితమై, నిరోగమగును. భౌతిక పదార్థములు, ఆయనను ఆకర్షించలేవు. ఆతని శరీరము. ఉజ్వల కాంతివంతము, సుగంది పూరితమునగును. మలమూత్రములు స్వల్పముగా నగును. ఇవి ప్రారంభిక సిద్దులు.

14) తేజోమయ రత్నము. మట్టి చే కప్పబడి శుభ్రపరచిన పిదప స్వరూపమున ప్రకాశించునట్లు మనుష్యుడు ధ్యానయోగము ద్వారా జీవాత్మను చుట్టియున్న సమస్త మలినములను శుభ్రపరచగా అసంగమగు జీవాత్మ స్వస్వరూపమున ప్రకాశించి కైవల్య పదము పొందును. ఇదియే మనుష్య జన్మకు సార్థకత.

15) ఇట్టి యోగి ఈ స్థితి యందు దీపము వలె నిర్మల ప్రకాశమయ ఆత్మ తత్వము ద్వారా బ్రహ్మ తత్వమును ప్రత్యక్షము చేసుకొని జన్మ మరణ వికారరహితుడై అసంగుడై విశుద్ధ పరమాత్మ తత్వమును తెలిసికొనును.

16) పరబ్రహ్మ పరమాత్మ సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వశక్తివంతుడు, ఆయనే హిరణ్య గర్భ రూపమున, పిదప జగద్రూప మున ప్రకటితమై ప్రళయానంతరము మరల పునః సృష్టికాలమున ప్రకటితమగును.

17) సర్వశక్తి వంతుడగు పూర్ణ బ్రహ్మ సమస్త లోకముల అంతర్యామి రూపమున ప్రవిష్టుడై పంచభూతములు, ఓషధులు, వనస్పతులయందు సర్వత్ర వ్యాపించి యున్న పరమాత్మకు, మరల మరల నమస్కారము.

-----

తృతీయ అధ్యాయము

అద్వితీయ పరబ్రహ్మ జగజ్జాలరచనచేసి తన శాసనశక్తుల ద్వారా లోకపాలాది దేవతలు తమ తమ కర్తవ్యములు నియమ పూర్వకముగా చేయునట్లు శాసించుచున్నాడు. అన్యసహాయములేక తనే ఈ జగదుత్పత్తి, విస్తారకార్యము లొనరించును. ఇట్లు తత్వతః తెలుసుకొనువారు అమరులు.

2) స్వరూప భూత వివిధ శాశనశక్తుల ద్వారా సర్వ లోకములను నియమాను సారముగా నడిపించు శాసనకర్త ఆ పరమేశ్వరుడొక్కడే. అన్ని శక్తులు ఆయన వశ##మే ఆయనే జగదుత్పత్తికి ఏకైక కారణము. సర్వజీవుల లోపనుండు అతంర్యామి. సర్వలోకములు రచించి, పాలించి లయింప జేయు వాడు పరమాత్మయే.

3) పరమాత్మ ఒక్కడే అయినను తన సహస్రముఖ చక్షు, హస్త పాదాదులద్వారా సమస్త జీవుల కర్మలు, విచారములు, సంఘటనలు తన దివ్య శక్తుల ద్వారా చూచును. ఆయన నుండి ఏ విషయము దాచరానిది. భక్తులొసగునైవేద్యములు అందరకు అంరలై ఆరగించి, భక్తుల కష్టములు తీర్చి రక్షించుచు భక్తులమొరనాలకించి ప్రత్యక్షమగును. జీవులన్నిటికి అవసర మగు శక్తులను భుజాది అవయవముల రూపమున నొసగెను. పరమేశ్వరుడే సర్వశక్తి ప్రదాత, సర్వశక్తినియంత, సర్వశక్తివంతుడు.

4) రుద్ర ఇంద్రాది దేవతల సృజించి వారికి అధిపతియైన సర్వజ్ఞుడు. సృష్టికి ఆరంభమున హిరణ్యగర్భుని సృజించిన పరమాత్మ మమ్ముశుభ బుద్ధియుతులను గావించుగాక.

5) హేరుద్రాదేవా! నీభయానక శూన్యపుణ్యకర్మ ప్రకాశిత, కళ్యాణమయ సౌమ్యమూర్తిని దర్శించి మనుడుడు పరమానందమగ్నుడగును. హే కైలాస వాసా! సమస్త లోకములకు సుఖమునిచ్చు నీ కృపాదృష్టి మాపై బరుపుము.

6) హేకైలాసవాసా! నీవు హస్తమునందు విసరుటకు ధరించిన బాణము కౄరతను విడచి శాంతిమయమై, కళ్యాణ మయమై జీవరూప సముదాయమునకు కష్టముకలిగించి వినాశము చేయకుండుగాక.

7) జీవసముదాయ రూప జగత్తు హిరణ్య గర్భ బ్రహ్మ కంటె శ్రేష్టుడు, సమస్త ప్రాణుల యందు వాని శరీరాను రూపము గా వాని హృదయములవశించు ఏకమాత్మ పరమేశ్వరుని తెలిసికొని జ్ఞానులు అమరులగుదురు.

8) అవిద్యారూప అంధకారమునకు అతీతుడు, సూర్యుని వలె స్వయంప్రకాశకుడు నగు పురుషోత్తముని తెలిసికొన్న జ్ఞానులు జన్మ మృత్యురహితులై పరమపదముపొందెదరు. భగవప్రాప్తికి అన్యమార్గములేదు.

9) సర్వశ్రేష్ఠ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మ రూపమున సూక్ష్మ జీవుల శరీరమందుండును. అట్లే సమస్త విశ్వమున వ్యాపించి ప్రళయ కాలమున బ్రహ్మాండమునంతయు తనలో విలీనమొనర్చుకొనును. నిశ్చల భావము పరమధామరూప ప్రకాశ మయ దివ్య ఆకాశమున స్థితుడైన పరమపురుష పరమాత్మ నిరాకార రూపమున జగత్తున పరి పూర్ణుడు.

10) హిరణ్య గర్భునికంటె పరమోత్కృష్ట పరమాత్మ ఆకార రహిత, వికారరహితునిగా తెలిసనవారు అమరులగుదురు.

11) హృదయకుహరమున వశించు పరమాత్మ సర్వవ్యాపకుడు, కళ్యాణ స్వరూపుడు, ప్రత్యేక స్థానముల ప్రత్యేక అవయవములద్వారా కార్యము చేయ సమర్ధుడు. సాధకుడు ఆయనను ఏరూపమున ఎచట కోరినను ప్రత్యక్షమగును.

12) అవినాశి ప్రకాశస్వరూప పరమాత్మతన ఆనందమయ విసుద్ధ స్వరూప ప్రాప్తికి మనుష్యుని అంతఃకరణను ప్రేరేపించును. తనవైపు ఆకర్షించుకొనును, కాని మూర్ఖ మానవుడు ఆయనను పొందు ప్రయత్నముచేయక తిరుగాడును.

13) అంగుష్ఠ మాత్ర అంతర్యామి పరమాత్మ మనుష్యుని హృదయ కుహరములో పరిపూర్ణముగా వశించును. ఆయనే మనస్సునకు స్వామి . నిర్మల విశుద్ధమనస్సుతో ధ్యానము ద్వారా ఆయన ప్రత్యక్షమగును. ఇట్లు తెలిసినవారు అమరులగుదురు.

14, 15) సహస్రశిరములు, సహస్రనేత్రములు, సహస్రపాదుడైన సర్వశక్తి వంతుడైన పరమాత్మ సర్వత్ర వ్యాప్తుడైనను నాభికి పది అంగుళములపైన హృదయాకాశమున సంస్థితుడై యుండును. సర్వము పరమాత్మ అమృత స్వరూపమే.

16) పరమాత్మ సర్వత్ర హస్త, పాద నేత్ర ముఖకర్ణాదుల ద్వారా సర్వజీవుల సమస్త కార్యము లను చూచుచుండును. భక్తుల నమస్కారాదులు సర్వత్ర స్వీకరించును. ఇట్లు విశ్వసించు మనుష్యుడు సదా ఆయన సేవలోనే నిమగ్నుడు కావలెను (గీ. 13/3).

17) సర్వశక్తి వంతుడగు పరమాత్మ ఇంద్రియరహితుడైనను సమస్త ఇంద్రియ విషయములను తెలిసిన సమర్థ శాసకుడు. జీవునకు పరమాశ్రయము. సర్వతో భావమున ఆయన శరణుజొచ్చిన శరీరమును సత్కార్యముల నియోగించవలెను.

18) సమస్త స్థావర జంగమ జీవ జగత్తు నుతన వశమందుంచుకొను ప్రకాశమయ పరమాత్మ జీవుని నీవు ద్వారపురమున అంతర్యామి రూపమున వశించి బాహ్య జగతక్తున లీల లొనరించును. ఇట్లు మనము చింతించి సదా ధ్యానము చేయవలెను.

19) పరమాత్మ నిరవయవుడైనను కరచరణాది అవయవ కార్యములు చేయును. ఆయనకు సమస్తము తెలుసును. కాని ఆయనను తెలిసినవారెవరు లేరు. ఆయన ఆది, పురాతన మహాపురుషుడని జ్ఞానులు చెప్పుదురు.

20) ఇట్లు సూక్ష్మాతి సూక్ష్మ మహత్తులలో మహత్తుయగు పరమాత్మ జీవుల హృదయకుహరమున వశించును. పరమేశ్వరుని కృపచే స్వార్థ సంక్లపరహితుడై పరమాత్ముని మహిమను తెలిసికొని ఆయనను సాక్ష్కరించుకొని దుఃఖరహితుడై పరమానంద స్వరూప పరమాత్మను పొందును.

21) పరమాత్మను పొందిన మహాత్ములు వేదరహస్య వర్ణన చేయు మహాపురుషుడు, జన్మ రహితుడు, సర్వవ్యాపకుడు, జరామృత్యురహితుడు, ఆది పూరాణ పురుషుడు, సర్వాంతర్యామి ఆత్మ స్వరూపుని నే తెలిసితిని.

------

చతుర్థ అధ్యాయము

పరబ్రహ్మ పరమాత్మ తనకెట్టి ప్రయోజనములేకయో జీవ కళ్యాణార్థము వారి వారి కర్మానుసారము నానా రంగుల రూపముల జగత్తును సృష్టించి, పాలించి, లయింపజేయును. పరమాత్మ ఒక్కడే అద్వితీయుడు, ఆయన మమ్ములను శుభ బుద్ధికలగియుండునట్లు చేయుగాక.

2) అగ్ని, సూర్య చంద్రాది ప్రకాశవంతములగునవి, ప్రజాపతి, బ్రహ్మ అందురు ఆ పరమాత్మయొక్క విభూతులే.అందరి అంతర్యామి ఆత్మ ఆయనే. కావున జగత్తంతయు ఆయన స్వరూపమేనని చింతన చేయవలెను.

3) స్త్రీ పురుష, కౌమార వృద్ధాదిరూపములు, సంపూర్ణజగత్తు ఆవిరాడ్రూప పరమేస్వరుని స్వరూపమే.

4) నీలవర్ణ తుమ్మెద, పచ్చ ఎర్రని కండ్లుగలపక్షులు , రామచిలుకలు, విద్యుతీయుత మేఘము, వసంతాది ఋతువులు, సముద్ర సర్వము పరమాత్మ స్వరూపమే. జడచేతన పదార్థములు, సంపూర్ణ జీవ సముదాయము అన్నిటియందు వ్యక్తావ్యక్త రూపమున పరా అపరా ప్రకృతి రూపములన్నిట పరమాత్మ రూపములే.

5) అపరాప్రకృతి అష్ట భేదములకూడి పరమాత్మ అజ్ఞానుసారము సత్వరజోతస్తమోగుణముల త్రిగుణాత్మక రూపమున జీవుల సృష్టించును. నిర్మల సత్వగుణములు తెలుపు, రాగాత్మకరజోగుణము ఎరుపు, అజ్ఞాన రూపతమోగుణము నలుపు రంగుల వ్యక్తమగును. జీవుడు (చేతన ప్రకృతి) అక్షర పురుషుడు, క్షేత్ర క్షేత్రజ్ఞులు, జీవుడు, అపరాప్రకృతి యందు భోగా సక్తుడై కర్మాను సారాము అనుభవించుచుండును. వాస్తవమునకు జీవుడు, పరమాత్మ, అజన్ములు, అనాదియగుట 'అజ' శబ్ద వాద్యులు.

6) శరీరమను అశ్వద్ధ వృక్షమున హృదయకుహరమను గూటిలో జీవాత్మ పరమాత్మలు కలిసియే యుందురు. జీవాత్మ యనుపక్షి సుఖ దుఃఖరూప కర్మ ఫలములను అనుభవించును. పైకొమ్మపై నున్న పరమాత్మయను పక్షి సాక్షీభూతముగానుండును. జీవాత్మ ప్రాకృత భోగములననుభవించి అవి నిస్సారములని తెలిసి పరిత్యజించిన జీవాత్మ పరమాత్మలు పరస్పర మిత్రులు వలె ఆనందమునను భవింతురు.

7) జీవాత్మ శరీరముందాసక్తి కలిగి మోహమమతావశమున సుఖదుఃఖాములననుభవించుచున్న పరమాత్మయొక్క అహైతుక కృపచే సర్వధార, సర్వశాసక ఆనంద స్వరూప బ్రహ్మను శ్రద్ధా భక్తి పూర్వక హవిస్వరూపకానుకుల పూజించి సర్వము ఆయనకు సమర్పించిన సహజముగా ఆయనను పొందవచ్చును.

8) పర బ్రహ్మ పరమాత్మ దివ్యచేతన పరమాకాశరూప ధామమున దేవగణములు, వాని పార్షిదములైన వేదముల ఆయననే సేవించుచుండును. ఇట్లు తెలియని మనుష్యుడు ఏమియు పొందలేడు. పరమాత్మను తత్వతః తెలిసిన వారు ఆయన పరమధామమున నివసింతురు. వారు ఎన్నటికి తిరిగి రారు.

9) వేదమంత్ర రూపఛందములు, యజ్ఞములు, క్రతువులు సమస్తశుభకర్మలు, సదాచారాది నియమములు, భూత భవిష్య ద్వర్తమాన పదార్థములు వీటన్నింటిని ప్రకృతి అధిష్టాతయగు పరమేశ్వరుడు తన అంశమాత్రముగా సృజించెను. ఇట్లు పరమాత్మను తెలిసికొన తీవ్ర అభిలాష కలవారు ప్రకృతి నుండి విడివడి పరమాత్మను పొందెదరు.

10) ఇట్లు ప్రకృతి పరమాత్మయొక్క శక్తి రూపమే. దీని వలననే కార్యకారణ సముదాయ సర్వజగత్తు వ్వాప్తము.

11) ప్రత్యేకయోనికి ఏకమాత్ర అధ్యక్షుడగు పరమాత్మయే కారణ రూప జగత్తునకు అధిష్టాత, ఆయన శాసనముననే సర్వకార్యములు ఉత్పన్నమగును. వ్యవస్థీకరింపబడిన ప్రళయకాలమందు ఆయనలో విలీనమై మరల సృష్టి ప్రారంభమున వివిధ రూపముల ఉత్పన్నమగును. అట్లు పరమాత్మను తెలియుటయే పరమశాశ్వత శాంతి.

12) ఇంద్రాది దేవతలను, హిరణ్యగర్భ బ్రహ్మను సృజించి శాసించు రుద్రరూప పరమేశ్వరుడు మనకు శుభ బుద్ధి నిచ్చుగాక. జీవుని కళ్యాణమయ పరమాత్మ వేపు త్రిప్పునదేశుద్ధ బుద్ధి. గాయత్రీమంత్రమున ఈశుద్ధ బుద్ధినే ప్రార్థింతము.

13) సమస్త దేవతాధిపతి, సర్వలోకాశ్రితుడు, స్థూల సూక్ష్మ అవ్యక్త రూపముల సర్వులకు ఆశ్రితుడు. సమస్త జీవసముదాయమును శాసించు పరమాత్మను శ్రద్ధా భక్తి పూర్వక హవిప్రదానాధుల పూజించి పొందవలెను.

14) సూక్ష్మాతి సూక్ష్మరూపమున హృదయ కుహరమందున్న పరమాత్మమునకు సమీపమందున్నను విశ్వరచనచేసి, విశ్వరూపము ధరించి నిరాకార రూపమున జగత్తంతటా వ్యాపించిన కళ్యాణ స్వరూపుడిగా తెలిసికొన్న మనుష్యుడు అతిశయానందము పొంది జగత్ర్పపంచ సంబంధములేక ఉపరతుడై యుండును.

15) సమస్త బ్రహ్మాండరక్షకుడు, సమస్త జగదాధిపతి, సర్వాంతర్యామి, మహర్షుల, దేవతలు, ఆయన స్మరణ , చింతన, ధ్యానాదుల సంలగ్నులై జన్మ మరణ బంధ విముక్తులగుదురు.

16) వెన్న పైనుండు సార పదార్ధమువలె పరమాత్మ సూక్ష్మ రూపమున సమస్త ప్రాణులలో నుండి సమస్త విశ్వమున వ్యాపించి యున్నాడు. ఇట్లు తెలిసిన మనుష్యుడు సమస్త బంధవిముక్తుడగును.

17) సర్వవ్యాపి పరమాత్మ మనుష్యుని హృదయమున వశించు చున్నాడనితెలిసి ఆయన గుణ ప్రభావముచే ప్రభావితుడై నిర్మల హృదయముతో నిశ్చయ బుద్ధితో ఏకాగ్రచిత్తముతో నిరంతర ధ్యానముద్వారా పరమాత్మ ప్రత్యక్షమగును.

18) అజ్ఞానాంధకారము తొలగగనే ప్రత్యక్షమగు తత్వము సదసద్విలక్షణ కళ్యాణ స్వరూప శివతత్వము. ఆయన అవినాశి, సూర్యాది సమస్త దేవతలకు ఉపాస్యదైవము. ఆయన నుండియే అనాది జ్ఞానము ప్రాప్తించుచున్నది.

19) అట్టి పరమాత్మను పైనుండి కాని, క్రింద నుండి కాని పట్టలేని అగ్రాహ్యుడు మనోవాక్తులకు అతీతుడు. మహాయశనామధేయుడు, ఉపమారహితుడు.అట్టి పరమాత్మను పొందుటకు మనుష్యుడు తీవ్ర అభిలాషకలిగి ప్రయత్నము చే పొందవలెను.

20) సాధకుడు మనమునచింతించిన విశుద్ధ అంతఃకరణమున పరమాత్మ స్వరూపము తటిల్లతవలెకనిపించును. ప్రాకృత చక్షువులచే చూడలేము. పరమాత్మ కృపచే దివ్యదృష్టిపొంది చూడగలము. ఈ రహస్యము తెలిసిన సాధకుడు అంతర్యామి పరమాత్మ యొక్క గుణ ప్రభావముల శ్రవణ, కీర్తన, మననాదుల శ్రద్ధాపూర్వకముగా నిరంతర చింతన ద్వారా పొందవచ్చును. అట్టి వారు అమృతులగుదురు.

21) హే సంహార స్వరూపకరుద్రా! మీరు స్వయముగా ఆజన్ములగుటచే ఇతరులను జన్మ మృత్యువులనుండి ముక్తులు చేయు స్వభావముకలవారగుటచే జన్మ మరణ భయ భ్రాంతుడగు సాధకుడు సంసార చక్రమునుండి విడివడుటకు మిమ్ము శరణువేడుచున్నాడు. మీశాంత కళ్యాణ స్వరూప దక్షిణము ద్వారా నాయీ జన్మ మృత్యుభయమునుండి ఎప్పటికి రక్షించి ముక్తునిచేయుడు.

22) హేరుద్రాదేవా! మేము నానావిధకానుకలు సమర్పించి మారక్షకొరకు ప్రార్ధించుచున్నాము. మీరు మాపైకోపగించక మా పుత్రపౌత్రాదులను, గో అశ్వాది పశువులను నశింప జేయుడు. మా వీరులు, సాహస పురుషుల నశింపజేయక మాధన జనాదుల రక్షింపుము.

-----

పంచమ అధ్యాయము.

బ్రహ్మకంటె శ్రేష్ఠుడు, మాయాయను తెలరోనుండువాడు, అవినాశి పరమాత్మ, విద్య అవిద్యయనబడు క్షర అక్షరముల శాసనకర్త, స్వామి, ఈరెండును ఆయన ప్రకృతులు. మరియు పరమాత్మ వీనికంటె అన్యుడు. సర్వధావిలక్షణుడు (గీ. 15/17).

2) ఈ జగత్తునందుకల దేవ, పితర, మనుష్య, పశుపక్ష్యాది జీవుల కారణ స్వరూప పంచ భూతాది సమస్త తత్వములకు ఏకమాత్ర అధిపతి, ప్రధామముగా ఉత్పన్నమై (కపిల) హిరణ్యగర్భునికి కూడా ఆధారము.

3) పరమ దేవ పరమాత్మ జగత్‌ సృష్టియందు బుద్ధ్యాది ప్రకృతుల విభజించి భిన్న భిన్న, రూపనామ శక్తియుతులుగా విస్తరింప జేసి, ప్రళయకాలమున తనలో విలీనమొనర్చి మరల సృజించి శాసించును.

4) సూర్యుడు సర్వదిశల దేదీప్యమానముగా ప్రకాశించునట్లు పరమాత్మ సర్వవిధి ఐశ్వర్య సంపన్నుడై సమస్త కారణ రూప తన బిన్న భిన్న శక్తులకు అధిష్టాత, సంచాలకుడై యధాయోగ్యముగా కార్య ప్రవృత్తి చేయును.

5) ఈ సంపూర్ణ విశ్వమునకు పరమకారణము, జగత్కారణ రూప సమస్త శక్తులను తన సంకల్ప మాత్రమున రచించి, ప్రళయ కాలమున విలీనమొనర్చుకొని, మరల సత్యాది గుణ యుత సర్వ జీవుల కర్మాను సారము యధాయోగ్య సంబంధముల నియమించి వ్యవస్తీకరించి శాసించు సర్వశక్తిమయుడు పరమాత్మయే.

6) పరమాత్మస్వరూపవర్ణన వేదములు, ఉపనిషత్తుల యందు గుప్త రూపమున జరిగినది. వేదముల పరమాత్మయొక్క విశ్వాస రూపములు. పరమాత్మను బ్రహ్మ, మహాఋషులు తెలిసికొని తన్మయులై ఆనందస్వరూపులైరి. కావున మనుష్యుడుకూడా పరమాత్మను ఆవిధముగా తెలిసి, పొంద తత్పరుడు కావలెను.

7) సత్వరజస్తమో గుణములచే బంధితుడైన జీవాత్మ నానాకర్మ ఫల భోగమునకై కర్మలనాచరించి, చేసిన కర్మఫల మనుభవించుచు భ్రమించుచుండును. గుణాతీతునకుగాని జన్మ మరణ రాహిత్యము లభింపదు.

8) జీవాత్మ అంగుష్ఠ మాత్ర హృదయకుహరమున సూర్యుని వలె ప్రకాశవంతుడై, విజ్ఞానమయుడై, అజ్ఞానాంధకార విహీనుడై సూక్ష్మాతి సూక్ష్మ రూపముననుండును. సంకల్పాది బుద్ధి, అంతఃకరణ గుణములగు ఇంద్రియ ధర్మముల చేతను, అహంత, మమత, ఆస్తక్యాది అహంకార గుణముల సంబంధముకలిగి పరమాత్మకంటె భిన్నముగా నుండును.

9) జీవాత్మ తలవెంట్రుక కొనయొక్క పదివేల వంతు భాగమని చెప్పబడినను, చేతన సూక్ష్మ వస్తువును జడస్థూల వస్తువుతో పోల్చలెము. ఇట్లు అత్యంత సూక్ష్మ మైనను అనంత భావయుక్త సీమారహిత సర్వత్ర వ్యాప్తమైనను కేవలము బుద్ధియొక్క గుణములచే కూడియున్న కారణమున ఏక దేశయమై యున్నది.

10) జీవాత్మ వాస్తవమునకు స్త్రీపురుష నపుంసకాది భేద రహితము. ఈ భేదము శరీరమునకే గాని సర్వభేద శూన్య ఉపాధి రహిత జీవాత్మవుకావు.

11) స్త్రీ పురుషుల పరస్పర మోహపూర్వక సంకల్ప, స్పర్శ, దృష్టి పాతముల ద్వారా సహనాసముచే బీజరూపమున జీవాత్మ తల్లి గర్భమున ప్రవేశించి భోజనాదుల వృద్ధిపొంది జన్మించును. తాబేలు గ్రుడ్ల యందు సంకల్ప మాత్రమున, పక్షత్రులయందు ఆసక్తి పూర్వకస్పర్శచేతను, చేపయందు ఆసక్తి పూర్వక దర్శన మాత్రమున, వక్షాదులయందు వర్షములచేతను, మనుష్య జంతువుల యందు అన్నాది భక్షణమున సజీవ శరీర పోషణము తుష్టి పుష్టి రూప వృద్ధి జన్మము జరుగును. ఇట్లు జీవాత్మ కర్మానుసారము. ఫల భోగమునకై విభిన్నలోకములచరించుచు ఒకటి తర్వాత మరియొకటి చొప్పున క్రమముగా నానాశరీరము లను మరల మరల పొందుచుండును.

12) జీవాత్మ తన కర్మ సంస్కారములగు బుద్ధి,మనస్సు, ఇంద్రియములు, పంచ భూతముల సముదాయ రూప శరీర ధర్మములకూడి యుండుటచే అహంతా మమతాది గుణములవశవర్తియై అనేకానేక శరీరములుధరించును. ఇట్లు సంకల్ప కర్మానుసారము నానాయోనుల సంబంధము ఏర్పడుచునాడు పరమాత్మయే. ఇట్లు తత్వజ్ఞానముపొందిన మహాపురుషులు పరమాత్మను చూడగలరు. సమస్త తత్వ సముదాయ రూపశరీరముచే చూచుట, వినుట, తెలిసికొనుట మొదలగు శక్తులు ఆత్మ గుణములు, వీని సంబంధముచే జీవాత్మయందు అహంత, మమత, ఆసక్తి మొదలగు స్వగుణములు వచ్చును. ఇవియే కర్మసంస్కారనామక క్రియా గుణములు.

13) జీవాత్మకు. వివిధయోనుల సంబంధముకూర్చువాడు, అంతర్యామి, రూపమున మనుష్యుల హృదయకుహరమున నిరాకార రూపమున సమస్త జగముల వ్యాపించి , ఆద్యంత రహితుడై, ఉత్పత్తి వృద్ధి, వినాశాది వికారశూన్యుడై ఏకరసముననుండియు, సమస్త జగముల రచించి, జీవరూపముల ప్రకటితమై సమస్త జగత్తును అన్నిదిశల వ్యాపించిన ఏకమాత్ర, సర్వాధార, శక్తివంత, సర్వశాసక, సర్వేశ్వర, పరబ్రహ్మ పురుషోత్తమునితెలిసికొని ఈజీవాత్మ ఎప్పటికి సమస్త బంధముల నుండి పూర్తిగా విడివడును.

14) పరబ్రహ్మ పరమేశ్వరుడు ఆశ్రయ రహితుడు, శరీర రహితుడైనను, జగదుత్పత్తి సంహారములనొనర్చు షోడశకళలను ఉత్పన్నముచేయువాడు (ప్ర.ఉ.6/6/4). అట్లైనను కళ్యాణ మయ ఆనందమయ పరమేశ్వరుడు శ్రద్ధ, భక్తి, ప్రేమ భావములచే లభించును.ఇట్లు పరమేశ్వరుని తెలిసికొనిన మనుష్యుడు శరీర సంబంధము విడచి, సంసార చక్రవిముక్తుడగును. ఈ రహస్యము తెలిసిన మనుష్యుడు యధా శీఘ్రముగా ఆ పరమ సుహృద, పరమదయాళువు, పరమప్రేమి, సర్వశక్తివంత, సర్వాధార సర్వేశ్వర పరమాత్మను పొందుటకు వ్యాకులచిత్తుడై శ్రద్ధా భక్తి భావముల పరమాత్మ ఆరాధనయందు నిమగ్నుడు కావలెను.

----

షష్ఠ అధ్యాయము.

అగ్నియందు గల ప్రకాశదాహకత్వాది పదార్థముల స్వాభావికశక్తి డగత్తునకు కారణమనికొందరు, సమయము ప్రకారము వృక్షములు ఫలించుటమొదలగు కాలగత శక్తి జగత్కారణ మని మరికొందరు అందురు. కాని సమస్త కారణములకు అధిపతి యగు సర్వశక్తివంతుడగు పరమాత్మ మహిమావిశేషమే విచిత్ర జగత్కారణము. సంసారచక్రము త్రిప్పు ఆ పరమాత్మ శరణుజొచ్చిన వారే ముక్తులగుదురు.

2) జగన్నియంత, జగదాధార పరమాత్మ సీమారహితుడై చిన్మయ స్వరూపుడై, సమస్త బ్రహ్మండమును నియమపూర్వకముగా నడిపించుచున్నాడు. పంచ భూతములు ఆయన యొక్క శక్తి చేతనే తమతమ కార్యములు జరుప సమర్థత కలిగియున్నవి. ఇట్లు పరమాత్మను సర్వశక్తి సంపన్నునిగా చింతించవలెను.

3) పరమేశ్వరుడు తనశక్తి భూత ప్రకృతినుండి పంచమహా భూతముల రచించి జడత్వముతో చేతన తత్వసంయోగముచే నానా రూప విచిత్ర జగత్తును రచించెను. అవిద్య పుణ్యపాప రూప సంచిత కర్మసంస్కారములు, సత్వరజస్తమోగుణములు, మనస్సు, బుద్ధి, అహంకారము, పంచభూతములు (అష్టప్రకృతి) అహంత, మమత, ఆసక్త్యాది ఆత్మ సంబంధ సూక్ష్మ గుణములచే జీవాత్మకు సంబంధముకలిగించి జగద్రచనచేసెను.

4) సత్వరజస్తమోగుణములచే వ్యాపించిన తన వర్‌ఆమశ్రమాను కూల కర్తవ్యకర్మలనారంభించి, తన అహంత, మమత, ఆసక్త్యాది భావముల పరబ్రహ్మ సమర్పణ జేసిన కర్మ సంబంధ ఫలమునొందడు సంచిత కర్మ సంస్కారములు కూడా నశిచును. అజ్ఞాన జనిత అహంత మమతాది కారణమున కర్మ బద్ధుడైన జీవాత్మ కర్మ నాశనమగుట తోడనే పరమాత్మను పొందును. జీవాత్మ జడతత్వసముదాయము చే భిన్నుడు , విలక్షుణుడు.

5) సమస్త జగత్తునకు ఆదికారణ సర్వశక్తి వంత పరమాత్మ త్రికాలాతీతుడు.ఆయన సంసార సంబంధ రహితుడైనను ప్రకృతితో జీవసంయోగము చేయు కారణములకు కారణ భూతుడు.అట్టి పరమాత్మను వేరుచోట వెదుక పనిలేదు. హృదయకుహరమందు విరాజిల్లు చున్న పరమాత్మను ఉపాసన చేపొందవచ్చును.

6) తన అచింత్య శక్తి ప్రభావముచే ప్రపంచరూపసంసారమును నిరంతరమునడుపు పరమాత్మ, సంసార వృక్షము, కాలము, ఆకృతి మొదలగు వానికంటె సర్వదా అతీతుడు. ధర్మ వృద్ధి, పాపనాశము చేయు సమస్త ఐశ్వర్యములకు అధిపతి, జగదాధారుడు, సమస్త విశ్వమునకు ఆశ్రయ భూతుడగుపరమాత్మ అంతర్యామి రూపమున మన హృదయకుహరమందు వశించుయున్నాడని తెలిసిన జ్ఞానులు అమృతస్వరూప పరమాత్మను పొందెదరు.

7) పరబ్రహ్మ పురుషోత్తముడు, సమస్త లోకపాలాది దేవతలకు, ఆరాధ్యపతి, స్వామి, శాసకుడు, అట్టి సర్వశ్రేష్ఠ కారణ స్వరూపుడైనను వాని కంటె బిన్నుడైన ప్రకాశ రూప పరమాత్మ సర్వదాస్తుతింపయోగ్యుడు.

8) పరబ్రహ్మ పరమాత్మ కార్యకారణ, ఇంద్రియ భేద రహితుడైనను సమస్త ఇంద్రియ వ్యాపారము లొనర్చు ఆయన జ్ఞాన, బల, క్రియా స్వరూప భూత దివ్య శక్తులు అనేకానేకములని వినుచుందుము.

9) పరమాత్మయే అందరకుస్వామి. అందరు ఆయన దాసులే.అందరు ఆయన ఆజ్ఞా ప్రేరణానుసారము ఆయన నియంత్రణయందుందురు. అంతఃకరణాది సమస్త ఇంద్రియములకు అధిపతి, ఆయన అజన్ముడు. సనాతనుడు, సర్వస్వతంత్ర సర్వశక్తి వంతుడు.

10) సాలెపురుగు తన నుండి వెలువడిన తంతు జాలముచే ఆచ్ఛాదితమైనట్లు పరమాత్మస్వరూపభూత అచింత్య శక్తిచే ఉత్పన్నమైన అనంత కార్యములు స్వభావముచే ఆచ్ఛాదితుడైన కారణమున సంసారిక జీవులు ఆయనను చూడలేరు. ఆ పరమాత్మ మనకు తన పరబ్రహ్మ రూపమున ఆశ్రయ మిచ్చుగాక.

11) పరబ్రహ్మ పరమాత్మ ప్రాణుల హృదయ కుహరమున అంతర్యామి యైయున్నాడు. ఆయనే సర్వకర్మలకు అధిష్టాత. కర్మానుసార ఫలప్రదాత, సర్వప్రాణులకాశ్రయ భూతుడు, సర్వసాక్షిచేతన స్వరూప చేతన ప్రదాత. ప్రకృతి గుణములకతీతుడు. నిక్షేప విశుద్ధ పురుషుడు.

12) విశుద్ధ చేతన స్వరూప పరమేశ్వరుని అంశీభూతమగు అనంత జీవాత్మల నియంత, కర్మఫలప్రదాత, ప్రకృతి రూప బీజము నుండి విచిత్ర జగద్రచయిత. హృదయస్థ సుహృద పరమేశ్వరుని నిరంతర ధ్యానాదుల ద్వారా తన్మయుడై దర్శించి పరమానందము పొందును. నిరంతర చింతన లేని అన్యులకు లభింపడు.

13) నిత్యచేతన సర్వశక్తి సంపన్నుడు, జీవ సముదాయమునకు, కర్మ ఫల ప్రదాత, విచిత్ర జగద్రచయితయైన పరమాత్మను తెలిసి కొనుటకు జ్ఞానకర్మమార్గములనెడి రెండు మార్గములు కలవు. భక్తి మార్గము రెంటింటియందును అంతర్భాగమే. సాధకుడు తన కిష్టమగు మార్గమున తత్పరతతోకూడి సాధనచేసి పరమాత్మనుతెలిసికొనవలెను.

14) ఈ జగత్తునందు సూర్యచంద్రాగ్నులను ప్రకాశశీల తత్వములు ఆ పరమాత్మయొక్క దివ్య ప్రకాశముయొక్క అంశ##లే. ఈ సర్వజగత్తు జగదాత్మ పరమాత్మ దివ్య ప్రకాశణు చేతనే ప్రకాశించుచున్నది.

15) ప్రకాశస్వరూప పరమాత్మ బడబానీల, విద్యుత్‌ రూపమున జలములందుగల తేజోరూపము. జలతత్వకారణమగు తేజో తత్వము. జలములందు వ్యాపించుట ఉచితము. పరమాత్మ జడజగత్తుకంటె విలక్షణుడైనను చేతన జ్ఞాన స్వరూప సర్వజ్ఞుడగు పరమాత్మ జడము జ్ఞేయము. ఇట్లు పరమతత్వము తేలిసిన వారు ముక్తులగుదురు.

16) ఇట్టి జ్ఞాన స్వరూప పరమాత్మ తనను తానే ప్రకటించుకొనును. ఆయన కాలాతీతుడు. పరమేశ్వరుడు, సౌహార్ణము, ప్రేమ, దయాది కళ్యాణ దివ్య గుణ సంపన్నుడై సమస్త జీవులను తన అపరా- పరా ప్రకృతి జీవ సముదాయములకు స్వామియై కార్యకారణ రూపమున సంసార చక్రమున కర్మాను సారము బంధించి పోషించి , ముక్తులను చేయును.

17) ఇట్లు తన్మయుడై ఆత్మ స్వరూపమున సమస్తలోకపాలకుల యందు అంతర్యామి రూపమున నుండు సర్వజ్ఞ పరిపూర్ణ పరమేశ్వరుడు సమస్త బ్రహ్మండ రక్ష, నియంత్రణ, సంచాలన శాసకుడు.

18) తన నాభిక మలమునుండి సృష్టికర్త బ్రహ్మను సృజించి, సమస్త వేదముల జ్ఞానమొసంగి, తన స్వరూప జ్ఞానమొసంగుటకు భక్తుల హృదయముల విశుద్ధ రూపమున విరాజిల్లు పరమాత్మను మోక్షాభిలాషికై శరణు జొచ్చితిని.

19) నిర్గుణ నిరాకార పరమాత్మనుపాసించువారు, సర్వకళారహిత, క్రియారహిత, సర్వధాశాంత, నిర్దోష, నిర్మల, అమృతస్వరూప, నిర్మల, జ్యోతి, రూప పరమాత్మను తత్వత, తెలిసిన కొన ఆయననే లక్ష్యము చేసి సర్వదా చింతించెదను.

20) దుఃఖసముద్రముతరించుటకు మనుష్యుడు ఇతరములనుండి మనస్సును త్రిప్పి, తీవ్రసాధనచేసి పరమాత్మను స్మరించవలెను.

21) ప్రసిద్ధ శ్వేతాశ్వతరీ మహర్షి తన ప్రభావముచే సమస్త విషయ సుఖాత్యాగముచేసి పరమాత్మ నిర్హేతుక కృపచే ఆయనను తెలిసికొని దేహాభిమానశూన్య అధికారులగు మునలకు ఉపదేసము కావించెను.

22) పూర్వకల్పముల నుండి బాగుగా వర్ణింప బడిన ఈ ఉపనిషత్‌ జ్ఞానమును శాంత చిత్తులైన పుత్రులను శిష్యులకు ఉపదేశించవలెను.

23) పరమాత్మయందువలె గురువునందు కూడా శ్రద్ధా భక్తులు కలిగినవారి హృదయమున ఈ రహస్యమ య జ్ఞానము ప్రకాశించును.

--------

శ్వేతాశ్వతరోపనిషత్తు సమాప్తము.

ఓం తత్‌ సత్‌, ఓం తత్‌ సత్‌, ఓం తత్‌ సత్‌.

ఓం శాంతిః శాంతిః శాంతిః.

---------------

SARA SUDHA CHINDRIK    Chapters