Kathakanchiki    Chapters    Last Page

 

''శైవం వేదబాహ్యమైన మత శాఖకాదు''

యుగోస్లావియా నుండి డాక్టర్‌ చెడోవేల్యాచివ్‌ ఒక విజిటింగ్‌ ప్రోఫెసర్‌ స్వామివారిని దర్శించారు. ఈ సమావేశం 1964 అక్టోబరు 30 వ తేదీన కంచిలో జరిగింది.

&#జనసామాన్యం దృష్టిలో శైవానికీ వైష్ణవానికీ వున్న అసలు భేదమేమిటో తెలుసుకోవాలని తనకు కోరిక వున్నట్లు అతిథి ముందుగా చెప్పారు. తనకు వైష్ణవ మతమంటే అభిమానమని కూడా అన్నారు. దానికి కారణం వేదాలకూ పురాణతిహాసాలకూ వైష్ణవంతో వున్న సన్నిహిత సంబంధం. శైవం అలాకాదు ఆర్యులు భారతదేశానికి రాకముందర నుంచీ వున్న మతమది. తరువాతి కాలంలో క్రమంగా వేదసంస్కృతి మీద ఆధిపత్యం సంపాదించింది. జగద్గురువులు ఆదిశంకరులవారు తాము శైవులమైనా భగవద్గీతోపనిషద్బ్రహ్మసూత్రాలకు అద్వైత వేదాంత పరమైన భాష్యాలను వ్రాసి శైవ, వైష్ణవ భేదానికి తాము అతీతులమని నిరూపించుకున్నారు. కాని తరువాత తరువాత వచ్చిన మార్పుల్లో శివునకు ప్రాధాన్యం పెరిగి బ్రహ్మావిష్ణువులకు ప్రాధాన్యం తరిగి పోయింది.

ఈ మార్పు ప్రాచీన భారతీయకళల్లో స్పష్టంగా కనబడుతుంది. ఎలిఫెంటాగుహాశిల్పాల్లో ఎల్లోరా కుడ్యచిత్రాల్లో, అలాగే ఒరిస్సాలోని అనేకానేక దేవాలయాల్లో వున్న విగ్రహాలను పరిశీలిస్తే త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు ప్రాధాన్యం క్షీణించి శివప్రాధాన్యం అధికమైనట్లు కనబడుతుంది. కొందరు శైవులు ఒక్క శివుడే త్రిమూర్త్మాత్మకుడనీ, సృష్టిస్థితి లయకారకుడనీ తనతో చెప్పినట్లు వేల్యాచివ్‌ అన్నారు.

అలా చెప్పినవారు బ్రహ్మ విష్ణువులను పూర్తిగా ఉపేక్షించారు. ఈ రెండు మతశాఖలకు సంబంధించినవారు జరిపిన పరిశీలన ఏమేరకు సరియైనదో తెలుసుకోవాలని వేల్యాచిన్‌ స్వామివారి నర్థించారు. తాను పరిశీలించి తెలుసుకున్న విషయం అంతకు మునుపు విన్నదీ, చదివినదీకాదనీ భారతీయ సాంస్కృతిక చరిత్రాధ్యయనంలో తనకెక్కడా కనపడలేదనీ భారతదేశానికి వచ్చి గమనించేవరకూ ఆసంగతి తనకూ తెలియదనీ అన్నారు.

వారు భారతదేశానికి వచ్చి అనేక దేవాలయాలు సందర్శించి, ఆ దేహలయాల్లోని విగ్రహ శిల్పాలూ ఆచారకాండా గమనించిన తరువాత వారికి కలిగిన అభిప్రాయం అది. ముఖ్యంగా ఈ మార్పు 8, 13 శతాబ్ధాల మధ్య జరిగినట్లు కనబడుతుంది. చాలామట్టుకు వారి అభిప్రాయాలతో స్వామివారేకీభవించారు. కాని శైవం వేదబాహ్యమైన మతశాఖకాదని స్వామివారన్నారు. వేద మధ్యంలో శివపంచాక్షరీ మంత్రం వుంది. వేదసంహితలో శివనామాలున్నాయి. హరప్ప, మొహంజుదారో ప్రాచీన సంస్కృతిలో శైవమత చిహ్నాలు కనబడతాయి. ప్రస్తుత శివమత వ్యాప్తికి స్వామివారు కొన్ని కారణాలు చెప్పారు.

&#ఒక కారణం శైవాచార కాండ సులభతరం కావటం. నుదుట విష్ణుపాదాలు ధరించటం కన్నా విభూతిరేఖలు ధరించటం సులువు. రెండో కారణం వైష్ణవులపట్ల శైవులకున్న ఉదారబుద్ది. శైవులు వైష్ణవులతో కలుస్తారుగాని, వైష్ణవులు శైవులతో కలవరు అంతగా.

వేల్యాచివ్‌- తాను కొన్ని పుణ్యక్షేత్రాల్లో గమనించినదాన్ని బట్టి- ముఖ్యంగా కోణార్క దేవాలయంలో చూచినదాన్ని బట్టి- సూర్యమతం అడుగుజాడల్లో శైవమతం నడచినట్లు కనబడుతుందన్నారు.

దానికి స్వామివారు ''శివుడు తెల్లనివాడు, విష్ణువు నీలమేఘశ్యాముడు. త్రిమూర్తుల్లో ఈ ఇద్దరి స్థానాలనూ ఇష్టాన్నిబట్టి మార్చుకోవచ్చు. బ్రహ్మ రజోగుణానికి చిహ్నం. శైవ వైష్ణవాలు రెంటిలోనూ ఆయనకు స్థానం ఒకటే. శైవులు శ్వేతస్వరూపుడైన భవుణ్ణి సత్యమూర్తిగా అభివర్ణిస్తారు. నీలమూర్తి అయిన విష్ణువును తమోగుణ చిహ్నంగా భావిస్తారు. దీన్ని తలక్రిందులుచేసి వైష్ణవులు శివుణ్ణ తమోగుణ ప్రధానుణ్ణిగా, విష్ణువును సత్వగుణ ప్రధానుణ్ణిగా ప్రతిపాదిస్తారు వారలా. వీరిలా అనటం సహజమే, ఎందువల్లనంటే తానుకొలచే దైవానికి త్రిమూర్తుల్లో ఉత్తమత్వం కల్పించాలనే ఆరాటం భక్తులకుంటుంది. శైవుల్లోనూ, వైష్ణవుల్లోనూ ఇదే పరిస్థితి.

గాని స్వామివారి అద్వైత వేదాంతంలో శివకేశవులకు బేధంలేదు. స్వామివారు శివారాధకులైన సమున్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో ఆదిశంకరులవారు ప్రతిపాదించిన అద్వైత వేదాంత సిద్ధాంతాన్నే అనుసరిస్తారు. ఆశీర్వచన సమయంలో నారాయణ స్మరణం చేస్తారు.

వేల్యాచివ్‌ స్వామివారితో సంభాషించటం వల్ల ఎంతో ఆహ్లాదాన్ని, ఉత్తేజాన్ని పొందారు. వారి సంభాషణ యించుమించు అరగంటసేపు సాగింది. చివరకు నారాయణ, నారాయణ అంటూనే ఒక పండిచ్చి స్వామివారు అతిథిని ఆశీర్వదించారు.

&#మద్రాసు విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రాచార్యులైన ప్రోఫెసర్‌ టి.యం.పి.మహదేవన్‌ ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

Kathakanchiki    Chapters    Last Page