Maa Swami
Chapters
7.ప్రథమ విజయయాత్ర పీఠం అలంకరించగానే శ్రీచరణులు క్షేత్రాటన చేయాలని సంకల్పించారు. యాత్రారూపంగా శిష్యకోటికి దర్శనావకాశం కలిగించవచ్చును. పైగా మఠంలో అనుదినమూ జరిగే చంద్రమౌళీశ్వర త్రిపురసుందరీ త్రికాలపూజలలో వాళ్ళు పాల్గొనే అనుకూలమూ ఉంటుంది. మొట్టమొదట వారు జంబుకేశ్వరం వెళ్ళారు. దీనికి తిరువానైక్కావల్ అన్న పేరుకూడ ఉన్నది. ఇక్కడ ఒకప్పుడు జంబుమహర్షి తపస్సుచేసుకొంటూ చిరకాలం ఉండగా వారిచుట్టూ లతాగుల్మములు మొలచినవి. దానితోబాటు ఒక జంబూ వృక్షమున్ను మొలచినది. వారు ఆరాధిస్తూవచ్చిన శివలింగమే జంబుకేశ్వరుడు. ఇది ఆపోలింగము. లింగమున్న భాగంలో ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. కొచ్చెంగుడు అనే చోళమహారాజు ఆలయప్రాకారాది నిర్మాణం చేశాడు. క్షేత్రదేవత పేరు అఖిలాండేశ్వరి. ఆదిశంకరులవారు అఖిలాండేశ్వరి సన్నిధిలో శ్రీచక్ర ప్రతిష్ఠచేసి అమ్మవారికి తాంటకములు అమర్చినారు. భగవత్పాదులు దిగ్విజయయాత్రా సందర్భములలో కాశీ అన్నపూర్ణ, ఉత్తర కన్నడంలో మూకాంబిక, కంచిలో కామాక్షి, తిరువత్తియూరు (మద్రాసుకు సమీపములో ఉన్నది)లో త్రిపురసుందరి- వీరి సాన్నిధ్యములో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. వారిసన్నిధి కంచి, తిరువత్తియూరు, జంబుకేశ్వరములలో ఉన్నది. జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి ఉగ్రకళతో చాల భయంకరముగా ఉండేదట. ఆచార్యులు అక్కడకు వచ్చినపుడు ప్రజలు ఈ విషయాన్ని ఆయనకు విన్నవించుకొన్నారు. దేవాలయపు తలుపులు తీసే అర్చకులుకూడ ఆమె ఉగ్రకళకు గురి అయ్యేవారు. అమ్మవారిని సౌమ్యమూర్తిగా చేయదలచి ఆచార్యులు, ఆమె అరుగిట విఘ్నేశ్వర ప్రతిష్ఠ చేశారు. అమ్మవారి దృష్టిలో వినాయకుడు పడగానే ఆమెకు మాతృవాత్సల్యం పొంది, అతి సౌమ్యవతి ఐపోయినది. ఆచార్యులు అంతటితో ఆగలేదు- అమ్మవారికి శ్రీచక్రరూపంలో తాటకాలను చేయించి కర్ణాభరణములుగా అర్పించారు. ఈ తాటంకములు మాసి తేజస్సు తగ్గినపుడు కామకోటి పీఠాన్ని అధిష్టించిన ఆచార్యులు ఆగమ సంప్రదాయ ప్రకారము జపతపాదులుచేసి పునరోద్ధారణ చేయటం ఆచారమైపోయింది. ఈ జీర్ణోద్ధారం, తాటంకప్రతిష్ట 1846లో ఒకమారు శ్రీవారి పరమగురువులు నిర్వర్తించారు. ఈ కార్యం శృంగేరి మఠం చేయవలెనా లేక కామకోటి పీఠము చేయవలెనా అను విషయములో వివాదమేర్పడి, న్యాయస్థానంవారు తీర్పుమేరకు, కామకోటి మఠానికే ఈ అధికారమివ్వబడినది. 1908లో కుంభాభిషేకమునకు వలసిన ఏర్పాట్లు అన్నీచేశారు. స్థానికులు, అధికారులు స్వామివారిని ఆహ్వానించారు. కుంభాభిషేకము ప్లవంగపుష్యమి- 1908 ఫిబ్రవరి మహావైభవముగా జరిగినది. శృంగేరి మఠాధిపతులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వాములవారు కుంభాభిషేకం జరిగిన మరుసటిరోజు ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శివగంగా మఠాధిపతులు సుబ్రహ్మణ్మ భారతీ స్వాములవారు కొన్ని మాసముల పిదపవచ్చి దర్శనం చేశారు. ఇలయాత్తం గుడి రామనాథపురం జిల్లాలో ఉన్నది. ఇచ్చట కామకోటి 65వ ఆచార్యులు సిద్ధినొందారు. వీరిపేరు శ్రీ మహాదేవేంద్ర సరస్వతి. శ్రీవారి పరమేష్ఠి గురువులు. మార్గంలో పుదుక్కోటలో కొన్నిరోజులుండి ఇలయాత్తంగుడిలో పరమేష్ఠి గురువుల సమాధిని దర్శించుకుని, వారిని పూజించి, చాతుర్మాస్యవ్రతనిర్వహణకు జంబుకేశ్వరానికి మరలివచ్చారు. చాతుర్మాస్యవ్రతానంతరం, తంజావూరులో కొంతకాలమాగి కుంభకోణానికి విజయంచేశారు. 1909లో మహామాఖం- పండ్రెండు ఏళ్ళకోమారు జరిగే సంభవం- మహామఖంనాడు పావన జలావగాహనులై శ్రీవారు అంబారీలో భద్రగజంపై ఊరేగగా, లక్షలాది ప్రజలు ఆ ఉత్సవ వైభవంలో పాల్గొన్నారు. స్వాములవారికి 1909లో పదైదేళ్ళు. రెండేళ్ళు కుంభకోణంలోనే పండితులు శ్రీవారికి సంస్కృత కావ్యప్రవేశం చేయించారు. మఠమునకు వచ్చే తీర్థ ప్రజలవలన స్వాములవారి విద్యావ్యాసంగమునకు వలసిన ప్రశాంతత తోపిస్తుందని మఠాధికారులు అఖండకావేరికి ఉత్తరతీరమున ఉన్న మహేంద్రమంగళం చదువుకు తగిన ప్రదేశమని నిర్ఱయించి అచట కావేరీతీరాన ఒక పర్ణశాలను నిర్మించారు. 1911 నుండి 1914దాకా శ్రీవారు వేదశాస్త్రాధ్యయనం చేశారు. అధ్యాపకులు మఠంశిష్యులు. మఠాధిపతులుగా శ్రీవారు వారికి గురువులు. విద్యావ్యాసంగములో శ్రీవారు వారికి శిష్యులు! పరస్పర గౌరవపాలనం యధావిధిగ జరిగేది. సంగీత శాస్త్రజ్ఞులు, గాయకులు శ్రీవారి దర్శనార్ధం వచ్చినపుడు గానకళలోని మెలకువలను గూర్చి సంభాషిస్తూ అనేకాంశములు వారినుండి గ్రహించేవారు. ఆ కాలంలో ఫొటోగ్రఫీలో కూడ ఆసక్తి చూపేవారు. గణితం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలతో పరిచయంకూడ ఈ కాలంలోనే సంభవించినది. ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలతోకూడ పరిచయం చేసుకున్నారు. 1914లో కుంభకోణ మఠానికి తిరిగివచ్చినపుడు శ్రీవారి వయస్సు ఇరవైసంవత్సరాలు. దర్శనార్ధం వచ్చిన విద్వాంసులతో పరిశీలనాత్మకములైన ప్రశ్నలువేస్తూ ఇష్టాగోష్టి చేసేవారు. కుంభకోణంలో ఉన్నపుడు ప్రతిసంవత్సరమూ, గంగైకొండ చోళపురమునకు వెళ్ళి శిలాశాసనములు, శిల్పములూ పరిశీలించేవారు. కామకోటి మహాపీఠ ధుర్వహిణకు వలసిన విజ్ఞానం, దక్షత, చాకచక్యత అనతికాలంలోనే సంపాదించుకున్నారు. స్వాములవారు 'మేజరు' కానందున మఠలౌకిక వ్యవహరణ 1911 నుండి 1915 వరకు- కోర్ట్ ఆఫ్ వార్డ్స్- పర్యవేక్షణ క్రింద జరిగినది. 1915 మే నెలకు 21 సంవత్సరములు నిండినవి. అప్పటినుండీ పర్యవేక్షణ ప్రత్యక్షంగా చేసేవారు. లౌకిక వ్యవహారాలు మఠాధికారులు, ఏజంటు చూసుకునే ప్రధాన పత్రములపై మఠంముద్ర మాత్రం వేస్తారు. మఠం ఆధ్వర్యంలో'ఆర్యధర్మ'మనే అరవమాసపత్రిక ప్రచురింపబడేది. ఆ సంవత్సరం అనగా 1916లో శంకరజయంతి వైభవంగా జరిగినది. శరన్నవ ఉత్సవాలూ శోభాయమానంగా నడిచినవి.ఈ ఉత్సవ విశేషాలను విశేషంగా కీర్తిస్తూ సుబ్రహ్మణ్మభారతి ఒక వ్యాసం వ్రాశారు. విశ్వమాత, జగద్ధాత్రి- దుర్గా లక్ష్మీసరస్వతులనే త్రిమూర్తరూపిణిని కొలిచే రోజులు నవరాత్రులు. గాయకులు శ్రీవారిముందు కచ్చేరీ చేసేవారు.విజయదశమినాడు ఆచార్యులు పురవీధులలో ఊరేగింపులో దర్శనమిచ్చారు. ధర్మోద్ధరణకూ, అధ్యయన ప్రోత్సాహానికీ శ్రీవారు తలపెట్టిన పథకములన్నీ ఫలవంతములైనవి. మహా విద్వాంసులకు 'శాస్త్రరత్నాకర' అనే బిరుదు ఇచ్చేవారు. పాఠశాలలోనూ, కళాశాలలోనూ విద్యార్ధులకు యోగ్యతననుసరించి ఉపకారవేతనము లివ్వబడినవి. మఠంలో ఆయుర్వేద ఉచితచికిత్స ఏర్పాటు చేయబడినది. శ్రీవారు కుంభకోణం విజయం చేసినపుడంతా విద్వత్సభలు, సంగీతకచ్చేరీలు నిర్వహంపబడేవి. శాస్త్రార్ధాలు చర్చింపబడేవి. అద్వైత మతేతరులైన ఆస్తికులుకూడ శ్రీవారిని దర్శించి వారి ఆస్తిక్యమునందలి ఆసక్తి, ఆధ్యాత్మిక పద్దతులయందలి ఆదరణకు ముగ్ధులయ్యేవారు. స్వాములవారి జగద్గురుత్వం అందరికీ ప్రకటితమైంది. ఒకపుడు ఒక వైష్ణవ శతావధాని మఠానికి వచ్చారు. శతావధానంలో వారికిచ్చిన ప్రశ్నలకు శ్రీవారుకూడ ఒక పండితునిచేత తమ సమాధానములు వ్రాయించారు- శతావధానానంతరం, శతావధాని ఇచ్చిన జవాబులు, శ్రీవారు పండితునిచేత వ్రాయించినవానికి సరిగా వుండినవట. ఇది శ్రీవారి మేధస్సంపన్నతకొక నిదర్శనం. దర్బాంగ మహారాజు 1917లో దక్షిణదేశ యాత్రార్ధంవచ్చి కుంభకోణంలో మూడు రోజులున్నారు. ఆయనది సామవేదం. దాక్షిణాత్యసామశాకీయులను ఆహ్వానించి సత్కరించారు. దక్షిణోత్తరములను కలిపే దేవాలయాలను గురించి, వాని జీర్ణోద్ధారణ గూర్చీ ఆయన ముచ్చటించారట. ఉత్తరదేశమునకు విజయం చేయవలసినదిగా ఆయన శ్రీచరణులను ప్రార్ధించారు. స్వామి అద్వైతి. సర్వమతములూ ఆయనకు సమ్మతమే. దివ్యజ్ఞాన సమాజానికి చెందిన జినరాజదాసులనే వారు శ్రీవారిని దర్శించి వారి మతసామరస్యమునకు చాల సంతోషించిరట.