Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

గౌడపాదులు

నటరాజు తాండవం చేసేటప్పుడు పతంజలీ వ్యాఘ్రపాదుడూ సమీపంలో నిలుచుండి ఆనందిస్తూ ఉంటారు. చిత్తరువలలోనూ ఇతర శిల్పాలలోనూ ఇట్లా ఉండడం మనం చూస్తాం. వ్యాఘ్రపాదుల అధోభాగం పులి, పతంజలి అధోభాగం పాము.

పతంజలి ఆదిశేషుని అవతారం. వ్యాకరణ మహాభాష్యం వ్రాసింది వీరే. అత్రిపుత్రులు కాబట్టి వీరికి ఆత్రేయులనీ, తల్లి గోణిక కాబట్టి గోణికా పుత్రులనీ వ్యవహారం. వీరు యోగశాస్త్రానికి సూత్రాలను, వ్యాకరణానికి మహాభాష్యమునూ, ఉపవేదమైన ఆయుర్వేదానికి చరకమునూ వ్రాసినందువల్ల మూడు శాస్తాలకు ఆచార్యులు. చరకానికి మరో పేరు ఆత్రేయసంహిత. ఆత్రేయుడు పతంజలే. ఇలా మనోవాక్కాయ శుద్దికి ఉపయోగించే శాస్త్రాలు వీరి సృష్టి. మనోవృత్తులను నియమించి చిత్తశుద్ధి కలిగించేది యోగశాస్త్రం. వాక్కును శుద్ధ మొనరించేది వ్యాకరణ శాస్త్రం. కాయశుద్ధికి-ఉపాయాలు చెప్పేది చరకమనే ఆయుర్వేద శాస్త్రం. ఈ రీతిగా త్రికరణములను శుద్ధి చేసికోడానికి ఉపయోగించే మూడు శాస్త్రాలు ఆయన రచన.

వర్ణన చేయలేని విషయాలను గూర్చి చెప్పేటప్పుడు వేయి నాలుకలు వేయి తలలున్న ఆదిశేషున కయినా చెప్పతరం కాదు అని అనడం వాడుక.

వేయి జిహ్వలు కల ఆ పతంజలి చెప్పిన వ్యాకరణ భాష్య ప్రశస్తి విని దానిని చదువుకొనడానికి వేగురు శిష్యులు వచ్చారు. పతంజలి చిదంబరంలో వేగాళ్ల మంటపంలో ఉన్నారు. వేయిమందికి ఒకేమారు సందేహనివారణం చేయవలెనంటే ఒక నాలుక ఏం చాలుతుంది? అందు కోసం వారు ఆదిశేషునిరూపం తాల్చారు. అయితే శేష దృష్టి విష దృష్టి, నిట్టూర్పులు విషం కక్కుతూ వుంటై. అవి సోకితే ఎవరయినా సరే చిటికలో చిటికెడు భస్మమైపోతారు. అందువల్ల ఆయన తనకూ శిష్యులకూ నడుమ ఒక తెర కట్టారు. తెరలోపల తామూ తెర వెలుపల శిష్యులూ పాఠం చెపుతూ వుండగా నడుమ ఎవరు లేచి పోయినా సరే వారు బ్రహ్మరాక్షసులయిపోతారని పతంజలి ఒక కట్టడి చేశారు. బొమ్మ రాకాసులు పిశాచాలలో ఒక తెగ. ఐతే పిశాచాలు ఎన్నోతెరగులు. దేవతలలోనూ చాలా చాలా భేదాలున్నవి. ఈ రెండు తెరగున వారకీ చేరని వారుకూడా ఎందరో మనుష్యులు లున్నారు. ఈమూటికి చేరనివెన్నో ఉన్నవి. పిట్టలు, పురుగులు, ఇట్లా ఎన్నో కోట్ల భేదాలు. పుర్వులకూ మానవులకూ ఎంతో వ్యత్యాసం. అట్లే మానవులకూ దేవతలకూ ఎంతో వ్యత్యాసం. దేవతలు పుట్టుకతోనే గొప్పవారు. 'ఏయే లోకాలలో ఎవరేవరున్నారు? మన మెక్కడి నుండి వచ్చాము? ఎలా సృజింపబడ్డాము? అనే విషయాలు మనం తెలిసి కోకుండా ఉంటున్నాం. ఈ సంగతుల నన్నింటినీ వేదం మొదలయిన శాస్తాలు తెలుపుతై, కొందరకు పుట్టుకతోనే తెలుస్తవి. కాని మనం ప్రయాస పడి తెలిసి కోవాలి. పుట్టుకతోనే తెలిసికొన్న దేవతలను 'స్వయం ప్రతిభాత వేదాః' అని సంస్కృతంలో అంటారు. అనగా 'స్వయముగా స్ఫురించిన వేదాలు కలవారు' అని అర్ధం. వారికి ఒకరు చెప్ప నక్కఱ లేదు. వారు వేద జ్ఞానంతోనే పుట్టుకొని వస్తారు.

వేదాలు యజ్ఞాలనూ యాగాలనూ చెపుతై. వేదాలకు అర్ధాలు చెప్పేది మీమాంస అనే శాస్త్రం. దీనికి సూత్రాలు వ్రాసినవారూ జైమిని. దేవతలకు వేదాధ్యయనమూ వైదిక ధర్మానుష్ఠానము లేదని ఆయన తీర్మానించారు. దేవతల నుద్ధేశించి మన యజ్ఞయాగాదులు చేస్తాం. దేవతలు ఎవరిని ఉద్దేశించి ఆ యజ్ఞయాగాదులు చేస్తారు? దానిచేత వారికి ఉపనయనము వేదాధ్యయనమూ లేవు. అందులకు అధికారమూ లేదు. ఉపనయన మెపుడు లేదో యజ్ఞాదులూ లేవు. వారు ఆ అధికారానికి పైవారు. వారు సౌఖ్యం అనుభవించడానికి పుట్టారు.

వ్యాసులవా రుత్తర మీమాంస చెప్పారు. 'దేవతలు జపం చేస్తారా చేయరా? ఉపాసన వారి కున్నదా లేదా?' అని వారు ఉత్తర మీమాంసలో మీమాంస చేశారు. మనం ఇంద్రాది దేవతలను ఉపాసిస్తాం, సూర్యుని ఉపాసిస్తాం. అయితే సూర్యుడెవరిని ఉపాసిస్తాడు? ఇంద్రుడు ఇంద్రనే ఎలా ఉపాసిస్తాడు? అందుచేత వారికి ఉపాసనలు లేవు. అయితే వారికి బ్రహ్మజ్ఞానంలో అధికారం ఉందా లేదా? అని విచారించి జీవ బ్రహ్మైక్య శ్రవణమూ మననమూ నిదిధ్యాసనమూ అనే వానిలో అధికారం తప్పకుండా ఉన్నదని శ్రీ శంకరాచార్యులవారు చెప్పారు. 'ఉపనయనం లేకపోతే వేదాధ్యయనానికి అధికారం లేదు' అని జైమిని సిద్ధాంతం చేశారు. 'దేవతలకు అధికారం ఎందులకు లేదు?' అని అంటే వారు స్వయం ప్రతిభాత వేదులు. అనగా సకల వేద పారంగతు లయియే వారు పుట్టారు. వారికి స్వతహాగానే అట్టి జ్ఞానం ఉన్నది. చేపలకు ఈత ఎవరు నేర్పారు? అలాగే దేవతలకున్నూ జన్మతోనే వేదాలు వచ్చు.

అట్టి దేవతలలో కిన్నరులు కింపురుషులు యక్షులు సిద్దులు చారణులు ఇత్యాదిగా పలు తెగలు ఉన్నవి. దేవతల లెక్క వేసేటప్పుడు ముప్పదిమూడు కోట్ల దేవతలు అని అంటూ ఉంటాం. 'సాధారణంగా అందరకూ ఒకడే దేవుడు. హిందువులకు మాత్రం ముప్పది మూడు కోట్ల దేవుళ్ళు' అని ఇతర మతస్థులు హిందువులను గేలిచేస్తారు. దేవతలను పరమేశ్వరు డనుకొని కాదు, మనం యాగాదులు చేయడం, జ్ఞానశక్తీ క్రియాశక్తి మనకంటే వారు అధిక మనియే వారి నుద్దేశించి మనం యాగాదులు చేయడం. శక్తి జ్ఞానశక్తి యనిన్నీ క్రియాశక్తి అనిన్నీ ఇచ్ఛాశక్తి యనిన్నీ మూడు విధాలు. తిర్యక్‌ సృష్టులలో జ్ఞానశక్తీ క్రియాశక్తీ పోను పోనూ తగ్గుతూ రావడం కనబడుతుంది. కొన్నింటికి క్రియ ఎక్కువ. జ్ఞానం తక్కువ. ఏనుగులకూ సింహాలకూ ఉన్న బలం మానవులకు లేదు. పిట్టలవలె మనం గూండ్లు కట్టలేము. తేనెటీగలవలె తేనె సెరలను నిర్మించలేము. వీని కన్నిటికీ మనకంటే క్రియాశక్తి ఎక్కువ. కాని ఇవి మన కంటె తక్కువ. మనకు జ్ఞానశక్తి ఎక్కువ. వీనికంటెను మనకంటెను అధికులయిన దేవతలకు జ్ఞానశక్తి మఱింత ఎక్కువ. దేవుడైతే ఒక్కడంటే ఒక్కడే. దేవతలు వేరు, దేవుడు వేరు, (దేవుడనగా పరమేశ్వరుడు).

దివ్య సృష్టియయిన దేవతలలో పెక్కు భేదాలవారున్నట్లే దుష్ట సృష్టి యయిన పిశాచాలలోనూ ఎన్నో రకాలు భూతాలూ రక్షోగణాలూ ఈలాటివి. 'పిశాచో గుహ్యకస్సిద్దోభూతో మీ దేవ యోనయః' అని అమరం. రాక్షసులలో బ్రహ్మరక్షస్సులు అనేవారొక తెగ. వేదాధ్యయనం చక్కగా చేసి అల్పాయుష్కులై చనిపోయిన వారు వేదస్మృతితో పిశాచాలైపోతారు. వారే బొమ్మ రాకాసులు - 'విద్యాధరో2 ప్సరోయక్ష రక్షో గంధర్వ కిన్నరాః' అని అమరం. దేవయోనుల భేదాలను చెప్పింది. వీరిలో బొమ్మ రాకాసు లొకతీరు.

ఆజ్ఞ తీసుకొనకుండా బయటికి పోయినవాడు బొమ్మరాకాసి అయిపోతాడని కట్టడి చేసి పతంజలి ఆదిశేషుడై తెరలోపల కూర్చుండి పాఠం చెప్పడానికి పూనుకొన్నాడు. ఆ శిష్యులలో ఒకనికి మాత్రం సందేహం తోచింది - 'మనమేమో వేయిమందిమి, ఒక్కడు ఈ వేయి మందికీ ఎట్లా సమాధానం చెపుతాడు?' అని ఇట్లా అతడు సందేహించి ఆజ్ఞోల్లంఘనం చేసి తెర తొలగించి చూచాడు. అట్లా చూచాడో లేదో విషదృష్టి వారందరిమీదా ప్రసరించింది. అక్కడున్న శిష్యులందరూ పిడికెడుబూడిద అయిపోయారు. బూడిద అయిపోయిన వారు తొమ్మన్నూట తొంబది తొమ్మిది మంది. ఒకడు మాత్రం ఎక్కడికో వెళ్లాడు. అతగాడు కొంచెం బండబ్బాయి. అతనికి పాఠం తిన్నగా తెలియడం లేదు. కొంతసేపు అటూ ఇటూ తిరిగి వస్తే బుద్ధి స్థిరపడి పాఠం సరిగా అర్ధం అవుతుందేమో అని అనుకొని అతడు బయటికి వెళ్లాడు. ఇక్కడ భస్మమయి పోయిన శిష్యులను చూచిన ఆదిశేషుడు మళ్లా పతంజలియై వారి దుర్మరణానికి దుఃఖిస్తూవుండగా, వెలికి వెళ్ళిన శిష్యుడు - ''గురువుగారి ఆజ్ఞ మీరి బయటికి వెళ్ళితినే, గురువేమి కోపం తెచ్చుకుంటాడో'' అని బితుకు బితుకుమంటూ వచ్చాడు. పతంజలికి అతనిని చూడగానే సంతోషం కలిగింది. బండబ్బాయి అయితే అయినాడుకాని ఒకడయినా మిగిలాడుగదా అని ఊరటచెందాడు. ఇక అతనికి పాఠం చెప్పేటంత వ్యవధి తనకు లేదు. కాబట్టి అతనిని ఎట్లాగయినా అనుగ్రహించాలని - 'నాకు తెలిసినదంతా నీకు తెలియాలి. అయినా నా ఆజ్ఞ దాఁటి నీవు ఆవలికి వెళ్ళావు. కాబట్టి బ్రహ్మరాక్షసుడ వవటం నీకు తప్పదు. కాని దాని కొక నివృత్త్యుపాయం ఉన్నది. నే నిచ్చిన విద్యను పాత్రమెరిగి నీ వెపుడుపదేశిస్తావో అపుడు నీకీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది' అని అన్నాడు. (ఈ విషయాలన్నీ దాదాపు ఇన్నూరెండ్ల క్రితం జానకీ పరిణయం మొదలయిన గ్రంథాలు వ్రాసిన రామభద్ర దీక్షితులు అనువారు పతంజలి చరితమ్‌ అనే గ్రంథంలో వ్రాశారు) అనుగృహీతుడయిన ఈ శిష్యుడే గౌడపాదులు. ఆయన గౌడదేశం నుంచి వచ్చారు.

వింధ్య పర్వతాలకు ఉత్తరాన గౌడదేశం, దక్షిణాన ద్రావిడదేశం. గౌడులలో అయిదు శాఖలు ఉన్నవి. ఈ శాఖలకు చెందినవారే పంచగౌడులు. అటులే ద్రావిడులలో కూడా ఐదు శాఖలున్నాయ్‌. దక్షిణము నుండి కాశికి వలస పోయి అచట స్థిరులయిపోయిన బ్రాహ్మణులకు ద్రావిడ బ్రాహ్మణులని పేరు. తమిళ##దేశంలో తెలుగువారున్నటులే మహారాష్ట్ర దేశంలోనూ తెలుగువారూ తమిళులూ ఉన్నారు. మహారాష్ట్రులకు కేల్కర్‌ తిలక్‌ సావర్కర్‌ మొదలయిన వంశనామాలు ఉన్నయ్‌. తెలుగునాడు నుండి మహారాష్ట్రానికి వలసపోయినవారికి తెలాంగ్‌ అన్న వంశనామ మున్నది. కాని వారి కిపుడు తెలుగురాదు. తమిళనాడు నుండి వలసపోయినవారికి ద్రావిడ అనే వంశనామముంది. ఇపుడు వ్రాయబడే చరిత్రలలో ఆర్యులు, ద్రావిడులు అని రెండు విభాగాలు చేస్తారు. దీనివల్ల వివాదం ఏర్పడుతుంది. 'గౌడులు, ద్రావిడులు' అనియే పురాతనమయిన విభాగం. పంచగౌడులలో గౌడులు, సారస్వతులు, కాన్యకుబ్జగౌడులు, ఉత్కలులు మైథిలులు అని అయిదు తెగలు ఉన్నవి. సారస్వతులు కాశ్మీరంలోనూ, కాన్యకుబ్జులు పంజాబులోనూ, గౌడులు బంగాళములోనూ, ఉత్కలులు ఒరిస్సాలోనూ, మైథిలులు అని అయిదు తెగలె ఉన్నవి. సారస్వతులు కాశ్మీరంలోనూ, కాన్యకుబ్జులు పంజాబులోనూ, గౌడులు బంగాళములోనూ, ఉత్కలులు ఒరిస్సాలోనూ, మైథిలులు నేపాల బీహరములలోనూ ఉన్నారు. ఈ పంచగౌడులలోనూ ప్రధానమైన వారు గౌడులు. అటులే పంచద్రావిడులలో ప్రధానులు ద్రావిడులు. మైథిలులలో మిశ్ర అను బిరుదు ఉన్నవా రిధికులు. మైథిలదేశంలో దర్భాంగ్‌, జనక్‌ పూర్‌ అని రెండు పట్టణాలు ఉన్నవి. ధనుర్‌-భంగ అనే రెండు పదాల వల్ల పుట్టినది దర్భాంగ అనేది. శ్రీరాములు ధనుర్‌ భంగం చేసినది. అనగా శివుని విల్లు విరిచినది ఈ చోటనే. ఇక జనక్‌ పూర్‌ అనే పదము జనకమహారాజుల పేర పుట్టింది. జనకుడు ఉన్నదే మిథిలాపురి. ఆ దేశమునకే మైథిలదేశమని పేరు.

పంచద్రావిడులలోని శాఖలకు చెందినవారు ఆంధ్రులు, కర్ణాటకులు, మహారాష్ట్రులు, ఘూర్జరులు, ద్రావిడులు. ప్రకృత విషయానికి వద్దాం. పతంజలికడకు వచ్చిన వేగురు శిష్యులలో ఒకరు గౌడపాదులు. వారు గౌడదేశమునుండి వచ్చినవారు. ఆయన గురుశాపంచేత బ్రహ్మరాక్షసుడై కూచున్నాడు.

బొమ్మరాకాసి ప్రతిదినమూ ఒక బ్రాహ్మణ్ణి వేదాధ్యయనం చేసినవాణ్ణి గుటకాయ స్వాహా చేస్తూ ఉంటాడు. ఒక శాఖను అధ్యయనం చేసిన వాణ్ణి దూరంగా ఎత్తుకొని పోయి పలు తీరుల ప్రశ్నలు వేయడమూ, వాళ్ళు ప్రత్యుత్తరించలేక పోవడమూ గుటకాయ స్వాహా చేయడమూ ఇది బొమ్మ రాకాసులకు మామూలు. బొమ్మరాకాసి అయిపోయిన గౌడుడు నర్మదాతీరంలో ఒక రావిచెట్టు మీద కూచున్నాడు. ఆ చోటు పంచగౌడ దేశాలకూ పంచద్రావిడ దేశాలకు నట్టనడుమ ఉన్నది. దక్షిణమునుండి ఉత్తరానికిన్నీ ఉత్తరము నుండి దక్షిణానికిన్నీ పోయేవారికి అది దారి. ఉత్తరదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు చదవబోయే దాక్షిణాత్యులున్నూ దక్షిణదేశాన ప్రచారంలో ఉన్న శాస్త్రాలు నేర్వపోయే ఔత్తరాహులున్నూ అనుదినమూ ఆ దారిగుండానే రాకపోకలు చేస్తూవుండేవారు. గౌడులు ఆ వచ్చిపోయేవారిని వ్యాకరణంలో ఒక ప్రశ్న అడిగేది, వారు దానికి బదులు చెప్పలేకపోయేది, ఆ పళంగా వారిని చంపి ఫలాహారం చేసేది. ఇది వాడుక ఐపోయింది. ఆ గౌడపాదులకు ఒకేవిధంగా కనబడే పదాలలోకొన్ని కొన్నింటి ఉచ్ఛారణలో వైవిధ్యం ఉండడము కద్దు. అట్టి పదాలను విడిగా చెప్పుకొని పోతూవుంటే ఉచ్ఛారణ తప్పిపోతూఉంటుంది. ఇ.ీ.ి.ని బట్‌ అని ఉచ్ఛరిస్తారు? ఈ.ీ.ి.ని కట్‌ అని ఉచ్చరిస్తారు. ఆ వేగంతోనే .ీ.ి. ని ఎట్లా ఉచ్చరిస్తారు? అని బాలురనడిగితే పట్‌ అని చెప్తారు. సంస్కృతాది వ్యాకరణాలలో ప్రత్యయాలు అని కొన్ని ఉంటవి. సంస్కృతభాషలో ప్రత్యయాలు ప్రకృతికి (మొదటా నడుమా చివరా వచ్చినా) సాధారణంగా చివర వస్తూఉంటవి. అవి చాలరకాలు. కృత్తులనీ తద్ధిత లనీ సుప్పులనీ తిఙలనీ పలు తీరు లున్నవి. క్త అనిన్నీ క్తవతు అనిన్నీ రెండు ప్రత్యయాలు ఉన్నవి. వానికి 'నిష్ఠ' అని సంజ్ఞ. కృ అనే ధాతువుకు క్త అనే ప్రత్యయం చేరితే, ''కృతమ్‌'' అని అవుతుంది. 'చేయబడినది' అని దానికి అర్ధం. 'భుజ్‌' అనే ధాతు వొకటి ఉన్నది. 'తినుట' అని దాని కర్ధం. ఈ ధాతువుకు 'క్త' తగిలిస్తే 'భుక్తమ్‌' అని అయి 'తినబడినది' అని అర్ధం ఇస్తుంది. ఇటులే అక్తమ్‌, సిక్తమ్‌, రక్తమ్‌ అనే పదాలున్నూ నిష్ఠాంతాలు. వీనికి క్రమముగా వ్యంజితమయినది, తడుపబడినది, ఎరుపు చేయబడినది అనే అర్ధాలు వస్తవి. అను పూరక్వకమయిన రఞ్జ అనే ధాతువుకు నిష్ఠ చేరిస్తే అనురక్తమ్‌ అని అవుతుంది. పచ్‌ (డు పచష్‌ పాకే) అనే ధాతువొకటి ఉన్నది. దానికి నిష్ఠాప్రత్యయమైన క్త చేరిస్తే 'పక్వమ్‌' అని అవుతుంది. కాని 'పక్తమ్‌' అని మాత్రం కాదు. దీనికి ప్రత్యేకించి - 'పచో వః' (8-2-52) అని ఒక సూత్రమున్నది. దాని వల్ల 'పక్త' అని కాక 'పక్వ' అని అవుతుంది. గౌడ బ్రహ్మరాక్షసుడువైయాకరణుడు ఎవడయినా కనబడితే 'పచ' ధాతువుకు నిష్ఠలో రూపం ఏమిటి? అని ప్రశ్నించేవాడు. 'పక్తం' అని సమాధానం వచ్చేది. ఎంచేత నంటే అప్పటికింకా మహాభాష్యం అవతరించలేదు. 'పచ' అనే ధాతువుకు నిష్ఠలో వేరు రూపం కలుగుతుందని తెలియని కాలం అది. 'పక్తమ్‌' అని చెప్పగానే - 'పక్తం కాదు; పక్వమ్‌, అని ఔతుంది, నీవు కూడా పక్వమనే అని అంటూ ఆబొమ్మరాకాసి వానిని గుటుక్కున నోట్లో వేసికోనేవాడు. ఇది గౌడుల దినచర్య.

ఇట్లా ఉంటూ ఉండగా ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి ఆ తోవన వచ్చాడు. చాలా చక్కగా ఉన్నాడు. బొమ్మరాకాసి అతనిని చూడంగానే ఉప్పొంగిపోయాడు. ఎంచేత? నాటికి మంచి ఆహారం దొరికిందీ ఇంకేం తన అస్త్రం తీశాడు. అతడు మహాభాష్యం శాంతిచేయడానికి కాశ్మీరం నుంచి చిందంబరం వెళుతున్నాడు. అతన్ని నిలేసి ఆ బొమ్మరకాసి 'పచ' ధాతువుకు క్త ప్రత్యయం చేరిస్తే ఏమిటిరూపం? అని అడిగాడు. అతడు 'పక్వమ్‌' అని చెప్పాడు. గౌడునకు అపరిమితమయిన ఆనందం కలిగింది. 'ఎన్నో నాళ్ళుగా సరియయినవాడొకడయినా రాలేదు, నేటికి అట్టి వాడవు నీవు వచ్చావు, నీవు సరియయిన శిష్యుడవు. నా గురువు గారు నాకు చెప్పిన విద్యలన్నీ నీకు చెపుతాను, నీ వెక్కడికి వెళుతున్నావు' అని అడగాడు. అతడు వ్యాకరణం చదువు కోడానికి చిదంబంరం పోతున్నాను' అని చెప్పినాడు. 'నాయనా' అలాగా? చిదంబరం విషయం ఎపుడో కొండెక్కింది. అచట నీవు అభ్యసింపగోరే విద్యలను నేనే నీకు చెప్పగలను, నీ విక్కడ ఉండేం' అని గౌడు లన్నారు.

బ్రహ్మరాక్షసుని గురువునుగా వరించి ఎవరు నెగ్గగలరు? దయ్యాలముందు బిడ్డలా? ఎనాళ్ళా బ్రహ్మరాక్షసుడు పాఠం చెబుతాడో అన్నాళ్ళూ చెట్టుదిగరాదుగదా, నిద్రాహారాలుండవు గదా, పాఠాలు రాక్షసివేగంతో ముగించాలిగదా! ఇవన్నీ ఇలా తెలిసినన్నీ శిష్యుడు విని అన్నింటికీ తల ఒగ్గాడు.

పాఠాలు వ్రాసికొందామంటే తాటాకులూ లేవు, గంట మంతకంటే లేదు. పైగా చెట్టు చివరమెట్టు మీద పాఠశాల. చెట్టు దిగకూడదు. అంచేత ఆ శిష్యుడు తన తొడ చీరుకొని అందుండి కారే నెత్తురులో ఒక పుడక కలముగా ముంచి రావాకులమీద ఆ బొమ్మరాకాసి చెప్పేదంతా వ్రాసికోవడం సాగించాడు. ఇలా తొమ్మిది రోజులు నిద్రాహారాలు లేక గడచినవి. ఆ రావియాకులలో ఆ శిష్యుడు వ్రాసికొన్న పాఠమే మహాభాష్యం. ఆ శిష్యుని పేరు చంద్రశర్మ. ఈ కథ పతంజలి విజయం అనే పుస్తకంలో చూపబడుతుంది. పతంజలియే తన శిష్యుడయిన గౌడునికి శాపవిమోచనం చేయడానికి చంద్రశర్మగా వచ్చినటులు ఆ గ్రంథంలో చదువుతాం. ఈ చంద్రశర్మయే తరువాతి ఆశ్రమమున శ్రీ శంకరులకు గురువుగా గోవింద భగత్పాదులను పేర అవతరించారు. గౌడులు గౌడ పాదాచార్యులవారు అనే ప్రసిద్ధి పొందారు.

శ్రీ శంకరాచార్య గురు పరంపరలో ఈ గోవింద భగవత్‌ పాదాచార్యులవారి స్తుతి ఒకటి ఉన్నది.

హరి తల్ప హరాంఘ్రి నూపురక్ష్మా

ధర సౌమిత్రి బలా త్రి పుత్త్రజన్మా|

జయతా దు ప రే వ మాత్త ధామా

జయ గోవిందముని స్స చంద్ర నామా||

గురురత్న మాలిక

గోవిందముని అనగా గోవింద భగవత్‌ పాదులు. 'చంద్రనామా' అనునది పూర్వాశ్రమంలో చంద్రశర్మ అనే పేరు. వారు ఆదిశేషుని అవతారం. హరికి తల్పముగా పరమశివునకు నూపురముగానూ ఉండెడి సత్తా కలవారు. పైగా భూమిని తల మీద మోస్తూ ఉంటారు. క్షమ అనే పదమునుండి క్ష్మా అనే పదం వచ్చింది. క్షమ అంటే ఓరిమి. భూమికి ఓర్మి ఎక్కువ. దానిని ఎంతయినా తవ్వు, ఏమైన చెయ్‌ అది ఏమీ అనకుండా సహిస్తుంది. దానిని మోసేవారికి ఇంకా ఎంత ఎక్కువ ఓర్మి ఉండాలో ఆలోచించండి. ఆయననే సౌమిత్రి, అంటే లక్ష్మణుడు, బలరాముడు, అత్రి పుత్రుడైన పతంజలీ, ఆయనయే చంద్రశర్మ.

చంద్రశర్మ సన్యాసాశ్రమం స్వీకరించి నర్మదానదీ తీరంలోనే నివసించడం మొదలుపెట్టారు. ఇట్లా ఉంటూ శంకరాచార్యులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రశర్మ బ్రహ్మరాక్షసుని వద్ద కొన్నాళ్ళు నిద్రాహారాలు లేక ఎట్లా వ్యాకరణం అభ్యసించారు అని సందేహం కలుగవచ్చు. ఆయన లక్ష్మణుడుగా ఉన్నపుడు పదునాలుగేండ్లు నిద్ర జయించాడు. కాబట్టి చంద్రశర్మగా తొమ్మిది నాళ్ళు గుడాకేశుడై అనగా నిద్రను జయించి ఉండటంలో ఆశ్చర్యం లేదని చెప్పవలసి వస్తుంది.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page