Mahayogama    Chapters   

ఓమ్‌

అంజలి

భగవాన్‌ శ్రీ రమణులు తమిళమున నిబంధించిన 'ఉళ్ళదు నార్పదు'కు ('ఉన్నది నలువది'కి) 'మహాయోగము' సరియగు భాష్యము. ఉన్న సద్వస్తువునుగూర్చిన యీ నలువది పద్యముల ప్రబంధము అసంశయముగ శ్రీ రమణోపనిషత్తు. వేదశీర్షములగు ఉపనిషత్తులకు నూత్నముగ ఘటించిన మకుటమణి.

'నేను (అహంత) జచ్చి, తాను (సత్‌) వెలుగగ, తానే మిగిలియుండు వస్తువు (శుద్ధచిత్‌)' నారూఢిగ తెలియబలుకుటే సర్వవేదాంతసిద్ధాంతసారము. ఆవస్తువు సదాసిద్ధము; దాని ఎఱుకకు ఋజుమార్గము ఆత్మవిచారమే యని ''ఊళ్ళదునార్పదు'' నిర్ణయము.

''ఉళ్ళదునార్పదు''కీ భాష్యమును 'ఎవరు' రచించిరో ఆ కె. లక్ష్మణశర్మతో ప్రాసంగికముగ శ్రీ రమణులు తాము ప్రవచించిన ఆత్మవిచారమును మహాయోగ మన్నారట. సాంఖ్యాది నాల్గు యోగములును అందిమిడియుండుటను గుర్తించిన శర్మగారు ఆ ''మహాయోగ'' పదమును తమ ఆంగ్ల భాష్యమునకు మకుటముగా గ్రహించినారు.

శ్రీ శర్మగారి జననము 1879 లో తలిదండ్రులు శ్రీ తులసీ కృష్ణయ్యలు. చిన్ననాటనే తండ్రి గతింపగా, శర్మ స్వయంకృషిచే క్రమముగ బి ఏ., బి. యల్‌. పట్టము లందికొన్నారు. నాటి సంస్థానము పుదుక్కోటలో న్యాయవాదిగనుండి, 1922 లో గాంధీజీ ప్రబోధింపగా ఆవృత్తినిమాని ప్రకృతివైద్య చికిత్సాప్రచారములతో ఆర్తజనసేవకు పూనుకొన్నారు.

శ్రీ లక్ష్మణశర్మ సంస్కృతాంగ్లములందు దిట్ట. శ్రీరామకృష్ణ పరమహంస ఉపదేశములందు విశేషమగు మక్కువ, అద్వైతాధ్యయన మందాదరమునూ, ఐదేండ్లు పుదుచ్చేరిలో నుండినను శ్రీ అరవిందుల నాశ్రయించు తలపే కలుగదయ్యెను. 1927 లో శ్రీ శుద్ధానంద భారతి తెలుపగావారు అరుణాచల రమణుల దరిజేరినారు. మిత్రులడుగగా, ''(ఆధ్యాత్మికముగ) నాకు బిగి పిడికిలికన్న ప్రసృత పాణియే మాన్య'' మన్నారట

శ్రీ శర్మ శాక్తాద్వైత, శాక్తద్వైతవాసన లసలు లేని శుద్ధాద్వైతి. వారి ననుగ్రహించి శ్రీ రమణులు వారిని ఉళ్ళదునార్పదును చదువ నాదేశించినారు. విశేషార్థయుక్తియు చిక్కనిదియూనగు భగవద్రచన గ్రహించుటకు చాలు పాండిత్యము తమిళమున తమకులేదన్న శర్మకు, రమణులు రోజుకు రెండుపద్యములను వివరింప తామైపూనుకొన్నారు. శర్మయు ఏనాటిపాఠము నానాడు సంస్కృత శ్లోకములుగ గూర్చి, భగవానుకు చూపి తమ యర్థగ్రహణము సరిదిద్దుకొనెడి వారు.

ఇది యిట్లు సాగునంతలో శ్రీ వాసిష్టగణపతుల 'సద్దర్శనము (ఉళ్ళదునార్పదుకు సంస్కృత శ్లోకానువాదము)ను, దానికి శ్రీ కపాలి భాష్యమునూ వెలసినవి. కావ్యకంఠుల శైలికి ముగ్ధులై శర్మ తమశ్లోకరచనము విరమించిరి కాని అర్థవివరణములందు భేదములు * కొన్ని తలసూపినవి. వానిని భగవాన్‌కు విన్నవించి, వారే ప్రోత్సహింపగా శ్రీ శర్మ తమ సంస్కృత శ్లోకానువాదమును పూర్తి గావించిరి. *

__________

* ఉదా : చూ. శ్రీ రమణభాషణములు. పృ. 452

* పై యుదంతము నాకు శ్రీ లక్ష్మణశర్మగారి కుమారులు నా కందించిరి. కాని ఆశ్రమము వారి కధనమిందుకు భిన్నము. శ్రీ శర్మగారి సంస్కృతానువాద శ్లోకములను. శ్రీ మహర్షి యనుమతిపై కావ్యకంఠులకు సరిజూడుడని పంపగా, వారు అంతకన్నను సులువని తామే శ్లోకములను సద్విద్య యనుపేర నిబంధించి ఆశ్రమమున కంపిరట.

ఆ రోజులలో పుదుక్కోటలో శ్రీ పి.ఎస్‌. సుబ్రహ్మణ్యయ్యర్‌ ''జనమిత్ర'' యను తమిళ వారపత్రికను నడపుచుండిరి. వారి యను రోధమున శ్రీ లక్ష్మణశర్మ ఉళ్ళదునార్పదుకు తమిళవ్యాఖ్యను సమకూర్చినారు.

శర్మగారి సంస్కృత రచనలు పెక్కులు. వానిలో ''గురురమణ వచనమాల, ''శ్రీరమణహృదయమ్‌,''''శ్రీరమణప్రావిద్యోపనిషత్‌'' ముఖ్యములు. శ్రీ భారతానందులు (మోరిస్‌ ఫ్రిడ్మన్‌) కోరగా శ్రీ శర్మగారు ఆంగ్లమున నీ ''మహాయోగ''మును రచించిరి. రచయితకు 'who' (ఎవరు) అని నామాంకముంచినారు. తమ కర్పించిన ప్రతికి శ్రీ భగవాన్‌ అట్టవైచి దానిపై 'who' (ఎవరు) ప్రక్కన ప్రశ్నాచిహ్నము (?) నిడి ఆక్రింద తామే కె.లక్ష్మణశర్మ యని పూరించి ప్రతిని తమ ప్రత్యేక గ్రంధ సంకలనమున చేర్చినారు.

మహర్షి బోధయే మనకు సద్దర్శనము. అదే అత్యంత ప్రామాణికము. అది ముఖ్యాధారముగా, దాని వివరణకు పూరణకు శ్రుత్యుపనిషత్తుల నుపయోగించుచూ ఆధ్యాత్మదర్శనము సంధానించుయత్న మీ మహాయోగము.

గ్రంధమున నుదాహరించిన ఉళ్ళదునార్పదు పద్యముల కాంగ్లానువాదములకు ప్రతిగా, యోగి రామయ్య సంప్రార్థనపై శ్రీ భగవానులే రచించిన తెనుగు వచనమును సంగ్రధించినాను. ఆ భాగములు ఆంగ్ల మూలమునకు కొంత భిన్నముగ గూడ ఉండుట సాధ్యమే.

ఉళ్ళదునార్పదు బోధబంధురము, అతి గభీరము; భాషసరాళము, సరళమునూ. కాని సరళములను గ్రహించుట పరిణతబుద్ధులకే సాధ్యమని భగవాన్‌ వేరొకచో అన్నారు.

శ్రీ లక్ష్మణశర్మగారు 1965 మే నెల 2 వ తేది తనువు చాలించినారు.

శర్మగారి ఆంగ్లము సరళము కాదు. వాక్యములు దీర్ఘ దీర్ఘములు, జటిలములునూ; భాషవలెనే భావములకూర్పుకూడ. వాని క్రమము తెనుగునకు సరిపడునది కాదు. అందుచే నీ యనువాదము. క్లేశసాధ్యమయినది. ఏదియెటులైనను మూలార్థమున కవిరోధముగ, అల్పాల్పముగనైన దాని నందింపగల్గినచో నా యీ ప్రయత్నము సుప్రయోజనమని భావింతును.

ఈ ముద్రణభారమును తమపై వైచుకొన్నవారు చిరంజీవి వి. కామేశ్వరశర్మ, ధర్మపత్ని చి|| సౌ|| హేమలతలు. భగవానునందలి నిస్సీమమగు భక్తియు నాయందలి యభిమానమును కారణములుగా వారి శ్రీ రమణభగవత్సేన యిట్లు తీరినది. శ్రీ రమణ కరుణా సుధవారి నమందముగ తన్పునుగాత.

దుర్మతి, ఆషాఢ బ|| ,

ఆదివారం } రామచంద్ర కౌండిన్య

19-7-1981

Mahayogama    Chapters