Mahayogama    Chapters   

ఓమ్‌

మహా యోగము

2. మనం సుఖంగా ఉన్నామా ?

- * -

జీవితంలో అందరికీ సౌఖ్యమే లక్ష్యం. అందుకై ప్రపంచాన్ని ఉపయోగించుకుంటాం. కాని మన జీవితం జగత్తు కొఱకేగాని, మనకై కాదని కొందరి వాదం. అంటే మన బ్రతుకు ప్రయోజనం ప్రపంచానికి ఉపకారకం కావలె, మనకే కాదని. అది వేరే విషయం. నిజానికి మనం ప్రధానంగా మన కొఱకే జీవిస్తాం; మన మంచి కనుకూలించే మటుకు ప్రపంచ సౌఖ్యానికై గూడ. అందుచేత ఒకప్పుడైనా ఆలోచింపక తప్పదు: మనం సుఖులమేనా ? కాకపోతే ఎందుచేత ? ఇంకొకటి కూడ ఆలోచించ తగ్గదే- అసలీ ప్రపంచంలో, ప్రపంచమూలంగా సౌఖ్యమాసించడంలో పొరబడ్డామా ?

ఇహంలో సుఖపడగలమన్న నమ్మకంతోనే మన బ్రదుకు మొదలౌతుంది. చాలామందికి చివరిదాకా ఈ నమ్మకం సళ్ళదు. కాస్త ఆగి విచారించే తలపేలేదు : వారి సౌఖ్యాశలు అడియాసలై నాయన్న గుర్తింపే లేకుంటే, ఎందుకిట్లన్న ప్రశ్నకు తావేది ?

ఓపికగా విచారిస్తే తెలుస్తుంది- మనకు మనం చేసుకోగలంత, ప్రపంచంలో యే మతాలూ తత్త్వాలూ మనకు చేయబోవు. వానివల్ల మన మనస్సుకు మోతే, తలపుల్లో, మాటల్లో ఒక యొడుపూ, ఒక నేర్పూ, అంతే. వానికీ మన ఉనికికీ పొందేలేదు. అనుభవం నేర్పిందే నిజంగా మన కుపయోగించేది. అది గూడ కొంచెం తీరికగా విచారిస్తేనే అందుకు అవసరమైన ఆపూ ఓపూ త్వరగా యీగల్గితే యీ మతాలూ తత్త్వాలూ సర్వమూ చేసినట్లే.

కాని ఆపాటి యోచనలకు ఓర్పునకు సందీయని ఒక వెఱ్ఱినమ్మకం మనకు - మనం కోరే ఆసౌఖ్యం ఇక్కడే యిప్పుడే ఉన్నదనో, లేకుంటే త్వరలోనే దొరకుతుందనో. ఈ నమ్మకం సడలించ చాలింది కష్టానుభవ మొక్కటే స్వప్నాలు దాహరిస్తూ అరుణాచల మహర్షి, ప్రకృతి రీతే అది యంటారు. సుఖస్వప్నాలు మనల్ను నిద్ర నుంచి లేపవు. అవే భయంకర దృశ్యాలైతే ఠకీమని మేల్కొంటాం. క్షోభ నెఱుగని జీవితం గంభీర విషయాలకూ నిశితాలోచనలకూ సహజంగానే తావీయదు. అంతమటుకూ తాత్త్వికులూ సామాన్యజనం ఒకటే. కొలది వ్యక్తులకూ జాతికీ జీవితం దుస్సహంగాక పోవచ్చు. కాని నిరాశాజనకం మాత్రమయిందనుకొందాం. అలా అనుకొనేవారికే ఈ చర్చలూ విచారాలూ. మనలో చాలమందికి అట్టి అనుభవమే, ఒకమారుగాదు, పలుసార్లు.

అలా అయినప్పుడెల్లా మనం పురోహితులతో జ్యోతిష్కులతో సంప్రదిస్తాం, కాకుంటే దైవాన్ని ప్రార్థిస్తాం. జనసాధారణమైన ఆ జబ్బుకు అవే అభిమత ఔషధాలు. అవి ఆపదను తాత్కాలికంగా గడవబెట్టేవే. నిలిచి పరిశీలించేదాకా ఆ స్థితి అంతే.

ఎంతో శ్రమపడి, ఏండ్లతరబడి సుఖానికై వెదకుతున్నాం. అదేదో చేజిక్కినట్లు, ఇక శాశ్వతంగా అది మనదే అయినట్లు మరి మరి మురిసిపోతాం. కాని ప్రతి మారూ ఎలాగూ మోసపోతాం. అయినా ప్రాతపద్ధతిని మానం, విమర్శతో విచారించిందాకా. దానికి పూనుకొనక పూర్వం ఒక్క అనుమానం - సౌఖ్యస్వరూపం, దాని మూలాన్ని సరిగా తెలిసే అన్వేషిస్తున్నామా ? అని.

అసలు సౌఖ్యమంటే యేమి ? అది మనం కలంత కాలం నిరంతరం నిత్యనూతనంగా శుద్ధంగా మనతో ఉండవలసినదని మన భావన. కాని మన కందేది అశాశ్వతం, తఱచూ మారుతుంటుంది. అది సంతోషమేగాని సౌఖ్యంగాదు. సుఖసంతోషాలు వేర్వేరు: వాని కెంతో అంతరం. సంతోషాన్ని చ్చేవి పడుగుపేకలుగా నుండేది సౌఖ్యమని ఊహ. అట్టి వానిని నిత్యంగా సంతతమూ ధారావాహికంగా సమీకరిస్తే, సౌఖ్యం మన సొమ్మేయని నమ్ముతాము.

త్రుళ్ళూ తుంపులుగా నుండటమే సంతోషానికి సహజం.మనకు సంతోషం కల్గించేవి మనకు వెలిగా నున్న విషయజాతం. వాటిని సంకలించి స్వంతం జేసుకోగోరుతాము. విషయాలవేయైనా, అవి ఇచ్చేముదము ఎల్లవేళలా సమంగాదు. ఒక్కొక్కప్పుడవి బాధకాలు అవుతవి. ఆసించిన ఫలం బహుళంగా దక్కదు, సరికదా, కొన్నిమార్లు దుఃఖాన్ని కొనితెచ్చుకోవడమవుతుంది. మోద శోకాల మైత్రి నిజంగా విడదీయగాదు.

ఆ సంతోషం గూడ విషయముల వలన కాదంటారు మహర్షీ. వానివల్లనే అయితే, వాని నెక్కువ సేకరిస్తే సంతోషం హెచ్చవలె; తక్కువగానై తే అది తగ్గవలె: అవి ఏవీ లేనప్పుడు అది అసలు లేకుండవలె. కాని అనుభవం వేరు. అన్నీ ఎన్నో కలవాడు సుఖిస్తున్నాడన లేము, ఏమీ లేని బడుగు సుఖమే యెఱుగడననూలేము. కాని వారూ వీరూ గూడ కలలెఱుగని గాఢనిద్రలో పరమ సుఖులే. అట్టి నిద్ర కంతరాయం కలుగకుండా అనుకూలాలు - మెత్తలూ దిండ్లూ దోమతెరలు వెచ్చని కంబళ్ళూ చల్లని వాయు ప్రసారం - అన్నీ కల్పించు కుంటారు. నిద్రలేకపోతే అంత దుఃఖమన్నమాట. నిద్రకై కొందరు మారకౌషధాలు సేవించి, జీవిత మూలమైన మేధనే విషాక్తం జేసుకోసిద్ధమౌతారు. నిద్రాభిలాష అంత హెచ్చన్నమాట. నిద్రలో పరమసౌఖ్యమున్నది గనుకే దానికై అంతంత వాంఛ.

అచ్చపు సౌఖ్యం మనకు నిసర్గమని పెద్దలంటారు. చిరంగా ఋషులు చెప్పుతున్నదే అది. సంతోషానికి స్వయంగా నిలుకడ లేదు. వెలివస్తువులవలనా కలుగదు; కలిగితే, అదికాక తాళీయమే. మన అంతరాంతరాల్లో సహజానందం నిబద్ధమైయుంది. అది వెలివడు లక్షణమే ఆసంతోషం. ఎంతగానో శ్రమపడి వెదకే ఇష్టవస్తువు లభిస్తే, అనిష్ట వస్తువు తొలగిపోతే, సంతోషం కలుగుతుంది. అఱ్ఱాకలి వీధికుక్కకు ఎండు ఎముక దొరకింది. ఆవురావురని దాన్నినమలసాగింది. రాపిడికి దానిదౌడలూ పెదవులూ రక్తమోడుతుంటే ఆరుచి ఎముకచే అనుకుంటుంది. మన సంతోషం విషయగతమను కోవడమూ అట్లే మనలను లోని ఆనందానికి వెలిజేసేది ఆశ. ఆశలు దిగినక్షణం తాత్కాలికంగా పరమానందాన్ని అల్పాల్పమైనా రుచిచూడ వీలవుతుంది.

మన జీవితంలో చాలభాగం ఇష్టార్థ సంపాదనకో, అనిష్టార్థ నివారణకో గడుపుతాం; అంచేతే అంతకాలమూ దుఃఖాకులంగా గడచి పోతుంది. దేన్నైనా వదల్చుకో యత్నిస్తే అది భయం వల్ల. వాంఛాభయాలు మనకు అసుఖ కారణాలు. వానికి లోను కావడమే ఒక అసుఖం. వానికి వశులమై యున్నంతకాలం మనకసౌఖ్యం తప్పదు. ఈవశ్వత హెచ్చేకొద్దీ మన అసౌఖ్యమూ గాఢమవుతూంటుంది.

మాటిమాటికీ కోర్కి చెబుతుంది. ''ఇదిగో, దీన్ని సంపాదించు; సుఖపడతా''వని. అది పూర్తిగా నమ్మి ఆ వస్తువుకై యత్నిస్తాం. యత్నమే ఒక ప్రయాస. యత్నకాలంలో దాన్ని మఱుస్తాం. కోరింది దొరక్కుంటే బాధ; దొరికినా బాధే. ఒకటి దొరికితే మరొకటి కోరక మానం. ఇట్లు కోరిక మనల్ను అనుక్షణమూ మూఢులను చేస్తుంది. నిజమిది:- వాంఛ అడుగులేని అగాధం; దాని పూరణం అసాధ్యం.అది సర్వభక్షకుని లాగే ఉపభోగంవల్ల వృద్ధి¸°తుందేగాని ఉడిగిపోదు.1

కోరికల కంతంలేదు. అలాగే భయానికిన్నీ, వద్దని భయం వారించే విషయాలకు లెక్కయేలేదు.

సారాంశం : మనపై భయకామనల అధికారం సాగేంతకాలం, సౌఖ్యమసాధ్యం. వానికి దాసులమై తృప్తి పడేటైతే, వివరం తెలిసిన వాళ్ళం గనుక సౌఖ్యాశకు నీళ్ళు వదలుకోవలసిందే.

ఆశాభయాలు మనకు బద్ధశత్రువులని ఎఱుగుదుము. వానిని సంకల్పబల మాత్రానవారింపలేమా? గ్రీకుస్టాయిక్స్‌2 లాగా వానితో కుస్తీ పట్టి, దబాయించి కాసేపు అణచవచ్చు. ఆ విజయం స్థిరం కాదు. చివరకా పోరాటం విరమిస్తాం. వేరొక తోడులేక, వాటినుంచి విమోచన మాసించలేము. తానై వానిని సమూలం నిర్జించి పూర్ణసౌఖ్యం సాధించినవాడే తోడుపడవలె. ఆ శత్రువులను తప్పించుకోవలెనన్న నిశ్చయం దృఢమూ మనఃపూర్వకమూ అయితే, అట్టి తోడును శ్రద్ధగా వెదకి కనుగోవలె. ఆయనకు పధమూ గమ్యమూ రెండూ ఎఱుకే ఆయన మనకు మార్గం చూపడమేగాక అందులో నడచే పటిమ గూడ యిస్తాడు. మోక్షం కోరేవారు ముక్తుని వెదకికొని సవినయంగా అడిగి మార్గం తెలిసికోవలెనని సనాతన సంప్రదాయం స్పష్టంగా చెబుతున్నది. విడుమరలేని యిడుమల్లో పెనగొన్న జీవికి అట్టి సమర్ధ గురువును పరమౌషధిగా సేవించుటవసరం. రోగికి వైద్యుడుగాక వేరు గతి యేమి ?

_____________________

1. నజాతు కామః కామానా ముపభోగేన శామ్యతి |

హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్థతే || - మహాభారతం

చూ. అనుబంధం 'చ' శ్లో 44.

2. సుఖమన్నా దుఃఖమన్నా ఉదాసీనులు.

తాము పరమానంద సిద్ధులై ఒరులకూ ప్రాపైన పూర్వులెందరో యున్నారు.3 వారి బోధలు ఆ యా మత గ్రంథాల్లో యధాతథం వ్రాసియే యున్నవి. వానిలో మనకిప్పుడు దొరకేని పూర్ణంగాలేవు. లేఖకుల అజ్ఞతవల్ల చాలాచోట్ల సందిగ్ధార్థాలుగానూ ఉన్నవి. వారు వాచా బోధించారు. వారు గతించిన యెన్నేండ్లకోగాని వారిబోధలు లిఖితాలుగా రూపొందలేదు. ఎట్లునూ అవి జీవద్గురు ముఖతః విన్న వానితో సరితూగవు ఇవి సూటిగా మన మనసుకెక్కుతవి, ఎక్కువ విశ్వసింప తగ్గవి. అంతేగాదు. సద్గురు సన్నిధులు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. అట్టి అరిది గురువులు అరుణా చల మహర్షి శ్రీరమణులు.

________________

3. క్రైస్తవ దర్శనం సంపూర్ణంగాదు. మోక్షభావన, దాని సాధనామార్గం అందుకానరాదు. అట్టి బోధ జీసస్‌ తన శిష్యులలో నొక్కని కిచ్చినట్లు వాక్యమొకటి అపవాదంగా ఉంది. ముక్తుడగుటెట్లని ప్రశ్న : జీసస్‌ బదులు, ''సత్యం తెలుసుకో. అదే నిన్ను ముక్తుణ్ణి చేయనీ. (Know the Truth and let It make you free)'' అది తప్ప ఆ నాల్గు క్రైస్తవ గీతాల్లోను (Gospels) న్యూటెస్టమెంటులో మరెక్కడా విమోచనార్థికి సాయకారి వాక్యమే లేదు. బహుశః అట్టి బోధలందిన జీసస్‌ శిష్యులెవ్వరూ క్రైస్తవ గీతారచనలో పాల్గొనలేదేమో.

Mahayogama    Chapters