Varahamahapuranam-1    Chapters   

త్రయస్త్రింశో7ధ్యాయః - ముప్పదిమూడవ అధ్యాయము

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

అథాపరాం రుద్ర సంభూతి మాద్యాం

శృణుష్వ రాజన్నితి సోభ్యువాచ,

మహాతపాః ప్రీతితో ధర్మదక్షః

క్షమాస్త్రధారీ ఋషి రుగ్రతేజాః.

ధర్మము నిర్వహించుటలో సమర్థుడు, క్షమయే గొప్ప ఆయుధముగా ధరించినవాడు, గొప్పతేజస్సుగలవాడు అగు మహాతపుడను ఋషి ప్రీతితో 'రాజా! వినుము, మొట్టమొదటిదగు రుద్రుని పుట్టుకను గూర్చి మరియొక కథను వినిపింతును' - అని పలికెను.

జాతః ప్రజానాం పతి రుగ్రతేజా

జ్ఞానం పరం తత్త్వభవం విదిత్వా,

సృష్టిం సిసృక్షుః క్షుభితోతికోపా

దవృద్ధికాలే జగతః ప్రకామమ్‌. 2

భయము గొలుపు తేజస్సుగల ప్రజాపతి పుట్టి అన్నిటికన్న మిన్నయగు జ్ఞానభావమును తెలిసికొని సృష్టి చేయగోరినవాడై జగత్తు ఎక్కువగా వృధ్దిపొందని కారణమున పట్టరాని కోపముతో క్షోభపడెను.

తపస్యతోతః స్థిరకీర్తిః పురాణో

రజ స్తమోధ్వస్తగతి ర్భభూవ,

వరో వరేణ్యో వరదః ప్రతాపీ

కృష్ణారుణః పురుషః పిఙ్గనేత్రః.

అంత బ్రహ్మ తపస్సుచేయుచుండగా స్థిరమైన కీర్తికలవాడు పురాణుడు, రజస్తమోగుణములు జారిన ప్రవృత్తికలవాడు, శ్రేష్ఠుడు, వరములనొసగువాడు, ప్రతాపము గలవాడు, నలుపు తిరగిన యెఱ్ఱని వన్నె కలవాడు, పసుపువన్నె కన్నులు గలవాడునగు ఒక పురుషుడు ఉదయించెను.

రుదన్నుక్తో బ్రహ్మణా మారుద త్వం

రుద్రస్తతోసా వభవత్‌ పురాణః,

నయస్వ సృష్టిం వితతస్వరూపాం

భవాన్‌ సమర్థోసి మహానుభావ. 4

ఆతడు పెద్దగా అరచుచుండగా బ్రహ్మ అరువకుమని పలికెను. అందువలన ఆ పురాణపురుషునకు రుద్రుడను పేరు కలిగెను. 'మహానుభావా! నీవు సమర్థుడవు. సృష్టిని చక్కగా వ్యాపించిన స్వరూపముగలదానినిగా చేయుము' అని బ్రహ్మ పలికెను. (రుద్రుడు - రోదనము - ఏడుపు గలవాడు - మారుద - ఏడువకు)

ఇత్యుక్తమాత్రః సలిలే మమజ

మగ్నే ససర్జాత్మభవాయ దక్షః,

కస్థే తదా దేవవరే వితేనుః

సృష్టింతు తే మానసా బ్రహ్మజాతాః. 5

ఇట్లన్నంత మాత్రమున ఆతడు నీటమునిగెను. మునిగి సమర్థుడై కొడుకు కొరకు సృష్టిచేసెను. అట్లు దేవతలలో శ్రేష్ఠుడగు అతడు నీటనుండగా బ్రహ్మమానస పుత్రులు సృష్టిని విస్తారపరచిరి.

తస్యాం తతాయాం తు సురాధిపే తు

పైతామహం యజ్ఞవరం ప్రకామమ్‌,

మగ్నః పురా యత్సలిలే స రుద్రః

ఉత్సృజ్య విశ్వంతు సురాన్‌ సిసృక్షుః. 6

అట్లు సృష్టి వ్యాప్తిచెందగా దేవేంద్రుడు బ్రహ్మకు సంబంధించిన గొప్పయజ్ఞమును సాగించెను. మునుపు నీటమునిగిన రుద్రుడు దానినుండి వెలువడి దేవతలను సృజింపగోరిన వాడాయెను.

సుస్రావ యజ్ఞం సురసిద్ధ యక్షా

సుపాగతాన్‌ క్రోధవశం జగామ,

మన్యుం ప్రదీప్తం పరిభావ్య కేన

సృష్టం జగన్మాం వ్యతిరిచ్య మోహాత్‌. 7

ఆయజ్ఞమును, దానికై వచ్చిన సురలు, సిద్ధులు, యక్షులు, మొదలగువారిని గాంచి ఆరుద్రుడు కోపగించెను. నన్ను కాదని నాకంటె వేరుగా మోహమువలన ఈ జగత్తు నంతటిని ఎవ్వడు సృజించెనని కోపముతో మండిపడెను.

హాహేతి చోక్తే జ్వల నార్చిషస్తు

నిశ్చేరు రాస్యాత్‌ పరిపిఙ్గళస్య,

తత్రాభవన్‌ క్షుద్రపిశాచ సంఘా

వేతాళభూతాని చ యోగిసంఘాః. 8

హా! హా! అని ఆతడు అరచుచుండగా ముదురు పసుపువన్నెగల గల ఆతని నోటినుండి అగ్నిజ్వాలలు కదలాడజొచ్చెను. అంత క్షుద్రులగు పిశాచములు, బేతాళ భూతములు, యోగులు గుంపులు గుంపులుగా వెలువడిరి.

ఘనం యదా తై ర్వితతం వియచ్చ

భూమిశ్చ సర్వాశ్చ దిశశ్చ లోకాః,

తదా స సర్వజ్ఞతయా చకార

ధను శ్చతుర్వింశతి హస్తమాత్రమ్‌. 9

భూమియు, ఆకాశము, అన్నిదిక్కులు, అన్నిలోకములు వారితో గొప్పగానిండి పోగా, ఆతడు సర్వము నెఱిగినవాడు కనుక ఇరువదినాలుగు మూరల కొలతగల వింటి నొకదానిని నిర్మించెను.

గుణం త్రివృత్తం చ చకార రోషా-

దాదత్త దివ్యే చ ధనుర్గుణం చ,

తతశ్చ పూష్ణో దశనా నవిధ్యద్‌

భగస్య నేత్రే వృషణౌ క్రతోశ్చ. 10

మూడు పేటల అల్లెత్రాటిని ఆ ధనువునకు ఏర్పరచెను. రోషముతో దివ్యములగు ఆ ధనువును, త్రాటిని పట్టుకొని దానితో పూషుని పండ్లు విరుగగొట్టెను. భగుని నేత్రములు డుల్చెను. క్రతువు వృషణములు రాలగొట్టెను.

సవిద్ధబీజో వ్యపయాత్‌ క్రతుశ్చ

మార్గం వాయు ర్ధారయన్‌ యజ్ఞవాటాత్‌,

దేవాశ్చ సర్వే పశుపతి ముపేయు

ర్జగ్ముశ్చ సర్వే ప్రణతిం భవస్య. 11

ఊడిన వృషణములుగల క్రతువు అటనుండి వాయుదేవుని దారి పట్టి యజ్ఞభూమినుండి పారిపోయెను. దేవత లందరు పశుపతిని సమీపించి ఆతనికి మ్రొక్కులిడిరి.

ఆగమ్య తత్రైవ పితామహస్తు

భవం ప్రతీతః సంపరిష్వజ్య దేవాన్‌,

భక్త్యోపేతాన్‌ వీక్షయద్‌ దేవదేవాన్‌

విజ్ఞాన మన్తః కురు వీరబాహో. 12

బ్రహ్మయునచటికే వచ్చి శివుని శాంతపరచి దేవతలను కౌగిలించుకొని 'దేవా! వీరబాహూ! భక్తిభావముగల వీరి నందరను చూడుము. మరల నీవిజ్ఞానమును మనసునకు తెచ్చుకొమ్ము' అని ప్రార్థించెను.

రుద్ర ఉవాచ - రుద్రుడిట్లు పలికెను.

సృష్టః పూర్వం భవతాహం న చేమే

కస్మా న్నభాగం పరికల్పయన్తి,

యజ్ఞోద్భవం తేన రుషా మయేమే

హృతజ్ఞానా వికృతా దేవదేవ!

దేవదేవా! నన్ను మొట్టమొదట నీవు సృజించితివి. వీరిని కాదు. యజ్ఞమునందు నాకు వీరేలభాగమును కల్పింపరు? కావున కోపముతో నేను వీరి జ్ఞానమును కొల్లగొట్టితిని. అంగభంగము గావించితిని.

బ్రహ్మోవాచ - బ్రహ్మయిట్లు పలికెను.

దేవాః శంభుం స్తుతిభి ర్జాన హేతో

ర్యజధ్వ ముచ్చై రసురాశ్చ సర్వే,

యేన రుద్రో భగవాం స్తోష మేతి

సర్వజ్ఞతా తోషమాత్రస్య చ స్యాత్‌. 14

దేవతలారా! అసురులారా! మీరందరు జ్ఞానముకొఱకు పెద్దగా సూక్తులతో శంభుని కొలువుడు. దానితో భగవంతుడగు రుద్రుడు తుష్టి నందును. ఆతడు తుష్టిచెందినంతనే మీకు సర్వ విషయములు జ్ఞానము కలుగును.

ఇత్యుక్తా స్తేన తే దేవాః స్తుతిం చక్రు ర్మహాత్మనః. 15

బ్రహ్మయిట్లు పలుకగా దేవత లందఱు ఆ మహత్మునిట్లు స్తుతించిరి.

దేవా ఊచుః - దేవత లిట్లు పలికిరి.

నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే.

రక్తపిఙ్గిలనేత్రాయ జటాముకుట ధారిణ. 16

దేవాదిదేవునకు, ముక్కంటికి, ఎఱుపెక్కిన గోరోజనము వంటి కన్నులుగల స్వామికి జటలనెడు కిరీటము ధరించు మహాత్మునకు నమస్సులు.

భూతబేతాళ జుష్టాయ మహాభోగోపవీతినే,

భీమాట్టహాస వక్త్రాయ కపర్దిన్‌ స్థాణవే నమః. 17

భూతములతో బేతాళములతో కూడినవానికి పెను బాములు జన్నిదముగాగల దేవరకు, భయముగొలుపు అట్టహాసము చేయు మోముగల ప్రభువునకు, కపర్దమను జడలముడి గల స్వామికి స్థాణువునకు నమస్కారము.

పూష్ణో దన్తవినాశాయ భగనేత్రహనే నమః,

భవిష్య వృషచిహ్నాయ మహాభూతపతే నమః. 18

పూషుని దంతములను, భగునేత్రములను డుల్చిన దేవునకు, మున్ముందు ఎద్దు గురుతుగా చేసికొను ప్రభువునకు మహాభూతములకు ఏలికయైన వానికి నమస్కారము.

భవిష్యతి పురాన్తాయ తథాన్ధకవినాశినే,

కైలాసపరవాసాయ కరికృత్తినివాసినే. 19

భవిష్యత్తునందు త్రిపురాసురులను, అంధకాసురుని పరమార్చు వానికి, కైలాసమనెడు శ్రేష్ఠమగు చోట నివసించువానికి, ఏనుగుతోలు వస్త్రముగా ధరించువానికి నమస్కారము.

వికరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమోనమః,

అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళికృతే నమః. 20

మిక్కిలిగా భయము గొలుపునట్టి పైకిలేచిన జుట్టుగలవానికి, భైరవునకు, అగ్నిజ్వాలలతో వెరపుగొలుపు వానికి చంద్రుని శిరోభూషణ ముగా తాల్చినవానికి నమస్కారము.

భవిష్యకృత కాపాలి వ్రతాయ పరమేష్ఠినే,

తథా దారువనధ్వంస కారిణ తిగ్మశూలినే. 21

భవిష్యత్తునందు కాపాలి వ్రతము (పుఱ్ఱతాల్చువాని వ్రతము) కలవానికి, ఉత్కృష్టమగు స్థానమున నుండు వానికి, దారువనమును ధ్వంసముచేయువానికి, పదునైన శూలముగలవానికి నమస్కారము.

కృతకఙ్కణ భోగీన్ద్ర నీలకణ్ఠ త్రిశూలినే,

ప్రచణ్డ దణ్డ హస్తాయ వడవాగ్నిముఖాయ చ. 22

పాములను కంకణములుగా తాల్చు స్వామీ! నీలకంఠా! త్రిశూలధారీ, భయము గొలుపు దండము చేత బట్టిన నీకు, ముఖమునుండి బడబాగ్ని వెలువరుచు నీకు నమస్కారము.

వేదాన్తవేద్యాయ నమో యజ్ఞ మూర్తే నమో నమః,

దక్షయజ్ఞ వినాశాయ జగద్భయ కరాయ చ. 23

వేదాంతముచేత తెలియదగినవానికి, యజ్ఞమూర్తికి, దక్షుని యజ్ఞమును పాడుచేసినవానికి, జగత్తునకు భయము కలిగించువానికి నీకు నమస్కారము.

విశ్వేశ్వరాయ దేవాయ శివశంభు భవాయ చ,

కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః. 24

విశ్వమునకు ప్రభువు, దైవము, మంగళస్వరూపుడు, శుభము కూర్చువాడు, భవుడు, జటాధారి, వెఱపుగొలుపు వాడునగు మహాదేవునకు నీకు నమస్కారము.

ఏవం దేవైః స్తుతః శంభు రుగ్రధన్వా సనాతనః,

ఉవాచ దేవదేవోహం యత్కరోమి తదుచ్యతామ్‌. 25

ఇట్లు దేవతలు స్తుతింపగా భయంకరమగు ధనువు తాల్చిన సనాతనుడగుదేవుడు శంభువు 'నేను దేవులకు దేవుడను' ఏమి చేయవలయునో చెప్పుడు' అని పలికెను.

దేవా ఊచుః - దేవత లిట్లు పలికిరి.

వేదశాస్త్రాణి విజ్ఞానం దేహి నో భవ మాచిరమ్‌,

యజ్ఞం సరహ్యం నో యది తుష్టోసి నః ప్రభో. 26

ప్రభూ! భవా! మాయెడల నీవు ప్రసన్నుడవైతివేని వేదశాస్త్రములను, విజ్ఞానమును, రహస్యములతో కూడిన యజ్ఞ విధానమును ఆలసింపక మాకు దయచేయము.

మహాదేవ ఉవాచ - మహాదేవు డిట్లు పలికెను.

భవన్తః పశవః సర్వే భవన్తు సహితా ఇతి,

అహం పతి ర్వో భవతాం తతో మోక్ష మవాప్స్యథ,

తథేతి దేవాన్తం ప్రాహు స్తతః పశుపతి ర్భవత్‌. 27

'మీరందరు కూడి పశువులగుడు. నేను మీకు పతి నగుదును. ఆ విధముగా మీరందరు మోక్షమును పొందుడు' అనగా దేవతలు అట్లే అనిరి. శివుడు పశుపతి యాయెను.

బ్రహ్మా పశుపతిం ప్రాహ ప్రసన్నే నాన్తరాత్మనా,

చతుర్దశీ తే దేవేశ తిథి ర్తసు న సంశయః. 28

అంత బ్రహ్మ పశుపతితో ప్రసన్నమగు హృదయముతో ఇట్లు పలికెను. దేవదేవా! నీకు చతుర్దశి ప్రీతికరమగు తిథియగు గాక!

తస్యాం తిథౌ భవన్తం యే యజన్తే శ్రద్ధయాన్వితాః,

ఉషోష్య పశ్చాద్‌ భుఞ్జీయాద్‌ గోధూమాన్నేన వై ద్విజాన్‌,

తస్యత్వం తుష్టిమాపన్నో నయ స్థాన మనుత్తమమ్‌. 29

ఆ తిథియందు శ్రద్ధతో పూజించి ఉపవాసముండి, గోధుమ అన్నముతో బ్రాహ్మణులకు సంతర్పణ చేయువారికి నీవు తృప్తిచెంది మిక్కిలి శ్రేష్ఠమగు స్థానమును ప్రసాదింపుము.

ఏవముక్త స్తదా రుద్రో బ్రహ్మణా వ్యక్తజన్మనా,

దన్తాన్‌ నేత్రే ఫలౌ ప్రాదాద్‌ భగపూష్ణోః క్రతోరపి,

పరిజ్ఞానం చ సకలం స ప్రాదాచ్చ సురేష్వపి. 30

అవ్యక్తమునుండి ఉదయించిన బ్రహ్మ యిట్లు పలుకగా అంతరుద్రుడు భగునకు దంతములను, పూషునకు కనులను క్రతువునకు బీజములను ఒసగెను. దేవతలందరకు చక్కని జ్ఞానమును ప్రసాదించెను.

ఏవం రుద్రస్య సంభూతిః సంభూతా బ్రహ్మణః పురా,

అనేనైవ ప్రయోగేన దేవానాం పతి రుచ్యతే. 31

ఇట్లు బ్రహ్మవలన రుద్రుని పుట్టుక సంభవించెను. ఈ ప్రయోగమువలననే ఆతడు దేవతలకు ప్రభువాయెను.

యశ్చైనం శృణుయా న్నిత్యం ప్రాత రుత్థాయ మానవః,

సర్వపాపవినిర్ముక్తో రుద్రలోక మవాప్నుయాత్‌. 32

వేకువజామున లేచి యీ కథను విను మానవుడు సర్వ పాపములనుండి విడివడి రుద్రలోకమును పొందును.

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే త్రయస్త్రింశోధ్యాయః

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ముప్పదిమూడవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters