Varahamahapuranam-1    Chapters   

సప్తత్రింశత్యధికశతతమోధ్యాయః - నూట ముప్పది యేడవ అధ్యాయము

భూమి రువాచ - భూమి యిట్లు పలికెను.

శ్రుత్వా తు విపులం హ్యేత దపరాధ విశోధనమ్‌,

కర్మ భాగవతం శ్రేష్ఠం సర్వభాగవత ప్రియమ్‌. 1

అహో కర్మ మహాశ్రేష్ఠం భగవం స్తవ భాషితమ్‌,

మమ చైవ ప్రియార్థాయ తవ భక్త సుఖావహమ్‌ 2

శ్రుతం హ్యేవ మయా విష్ణో సర్వధర్మార్థ సాధకమ్‌,

ప్రముక్తా సర్వపాపేభ్యో జాతాసి శశినిర్మలా. 3

స్వామీ! ఈ అపరాధ విశోధనమును విస్తారముగా వింటిని. ఇవి భగవంతునికి సంబంధించినది. శ్రేష్ఠమైనది ఆశ్చర్యకరమైనది. భాగవతులందరకు మిక్కిలి ప్రియమైనది. నా ప్రియము కొరకు, నీ భక్తుల సుఖము కొరకు, నీవు తెలిపితివి. సర్వ ధర్మములను సాధించునట్టి దీనిని నేను వింటిని. సర్వ పాపములనుండియు పూర్తిగా విడివడితిని. చంద్రుని వలె నిర్మల నయితిని.

ఏకం మే పరమం గుహ్యం సర్వధర్మసుఖావహమ్‌,

తవ భక్త సుకార్థాయ తద్‌ భవాన్‌ వక్తు మర్హసి. 4

అన్ని ధర్మముల సుఖములకును తావలమైన ఒక పరమ రహస్యమును గూర్చి నిన్నడుగుదును. నీ భక్తుల సుఖముకొరకు నీవు దానిని చెప్పవలయును.

కి ముచ్యతే వ్రతం చైవ తతః కుబ్జామ్రకం శుభమ్‌,

కతరం వాపి తచ్ఛ్రేష్ఠం క్షేత్రం భక్త సుఖావహమ్‌. 5

శ్రేష్ఠమైన వ్రతమని దేనిని చెప్పుదురు? శుభ##మైన కుబ్జామ్రక మెట్టిది? భక్తజనులకు సుఖమును కూర్చెడు క్షేత్రములలో మేలైన దేది?

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవు డిట్లు చెప్పెను.

శృణు మే పరమం గుహ్యం యత్త్వయా పరిపృచ్ఛితమ్‌,

మమ క్షేత్రం ప్రియం చైవ శుద్ధం భాగవతప్రియమ్‌. 6

భూమీ! నీవు నన్నడిగినదానికి బదులుగా పరమ రహస్యమును చెప్పెదను. నాకు ప్రియమైనదియు, భాగవతులకు ఇష్టమైనదియు నగు క్షేత్రమును గూర్చి తెలియజెప్పెదను. వినుము.

పరం కోకాముఖం స్థానం తథా కుబ్జామ్రకం పరమ్‌,

పరం సౌకరకం స్థానం సర్వ సంసార మోక్షణమ్‌. 7

కోకా ముఖము గొప్పక్షేత్రము. అట్లే కుబ్జామ్రకము కూడ గొప్పదియే. సౌకరకము కూడ మిన్నయే. సమస్తమగు సంసారమును విడిపించు నట్టిది.

యత్ర స్థానే మయా దేవి ఉద్ధృతాసి రసాతలాత్‌,

తత్ర భాగీరథీ గఙ్గా మమ సౌకరకే స్థితా. 8

దేవీ! నిన్నా తావు నందే రసాతలము నుండి నేను ఉద్ధరించి తిని. ఆ సౌకరకమున భాగీరథి యగు గంగయు నున్నది.

ధరోవాచ - భూదేవి యిట్లు పలికెను.

కాని లోకాని లోకేశ యాన్తి సౌకరకే మృతాః,

కించ పుణ్యం భ##వే త్తత్ర స్నాతస్య పిబత స్తథా. 9

లోకనాథా! సౌకరకమున మరణించిన వారు ఏ లోకముల కరుగుదురు? అందు స్నానము చేసిన వానికి, పానము చేసిన వానికి ఎట్టి పుణ్యము లభించును?

కతి తీర్థాని పద్మాక్షక్షేత్రే సౌకరకే తవ,

ధర్మ సంస్థాపనార్థాయ తద్‌ విష్ణో వక్తు మర్హసి. 10

విష్ణూ! పద్మాక్షా! నీ దగు ఆ సౌకరకక్షేత్రమున ఎన్ని తీర్థములు కలవు. ధర్మసంస్థాపన కొరకు దానిని నాకు నీవు చెప్పుదగును.

శ్రీ వరాహ ఉవాచ - శ్రీ వరాహ దేవు డిట్లనెను.

శృణు తత్త్వేన మే దేవి య న్మాం త్వం పరిపృచ్ఛసి,

కాం గతిం తే ప్రపద్యన్తే నరాః సౌకరకే మృతాః. 11

యేషాం స్నాతస్య వై పుణ్యం గతసై#్యవ మృతస్య చ,

యత్ర యాని చ తీర్థాని మమ సంస్థాన సంస్థితాః. 12

దేవీ! నీవు నన్నడిగిన దానికి బదులు చెప్పెదను. సౌకరకమున మరణించు వారు ఎట్టిగతి పొందుదురో, స్నానము చేసిన వానికిని, మరణించిన వానికిని ఎట్టి పుణ్యము లభించునో, నా సంస్థానము నందున్న తీర్థము లేవియో చెప్పెదను. వినుము.

శృణు పుణ్యం మహాభాగే మమ క్షేత్రేషు సుందరి,

ప్రాప్నువన్తి మహాభాగే గత్వా సౌకరకం ప్రతి. 13

సుందరీ! పుణ్యాత్మురాలా! నా క్షేత్రములలో సౌకరకము నకు పోయి పొందెడు పుణ్య మెట్టిదియో వినుము.

దశ పూర్వాపరాంస్త్రీణి అపరాన్‌ సప్త పఞ్చ చ,

సుగమిష్యన్తి యే తత్ర తాని తేష్వపి జన్తవః. 14

వెనుకటి పదితరముల వారిని, ముందు పదునైదు తరముల వారిని అచటికరుగు వారు ముక్తి చెందింతురు.

గమనాదేన సుశ్రోణి ముఖస్య మమ దర్శనాత్‌,

సప్త జన్మాంతరే భ##ద్రే జాయతే విపులే కులే. 15

ఆ క్షేత్రమునకు పోయినంత మాత్రమున, నా ముఖమును చూచినంత మాత్రమున మానవుడు ఏడుతరములు గొప్పకులమున జన్మించును.

ధనధాన్య సమృద్ధేషు రూపవాన్‌ గుణవాన్‌ శుచిః,

మద్భ క్తశ్చైవ జాయేత మమ కర్మపరాయణః. 16

ధనము, ధాన్యము నిండుగా గల కులములందు, నా భక్తుడు, చక్కని రూపము, గుణములు, పవిత్రత కలవాడై జన్మించును.

ఏవం వై మానుషో భూత్వా అపరాధ వివర్జితః,

గమనం తస్య క్షేత్రస్య మరణం తత్ర కారయేత్‌. 17

మనుజుడై పుట్టి ఎట్టి దోషములు లేనివాడు కావలయును. అందువలననే అతడా క్షేత్రమున కరుగుటయు, అందు మరణించుటయు సంభవించును.

యే మృతా స్తత్ర సుశ్రోణి క్షేత్రే సౌకరకే మమ,

ధన్వీ తూణీ గదీ ఖడ్గీ దీప్తియుక్త శ్చతుర్భుజః,

త్యక్త్వాసౌ సర్వసంసార శ్వేతద్వీపాయ గచ్ఛతి. 18

సుశ్రోణీ! నా దగు సౌకరక క్షేత్రమున మృతి చెందినవాడు సంసారమంతటిని వదలి వైచి, ధనుస్సు, అంపపొదులు, ఖడ్గము, గద, గొప్ప తేజస్సు, నాల్గు భుజములు కలవాడై శ్వేతద్వీపమున కరుగును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తీర్థేషు తత్ర స్నాతశ్చ ప్రాప్నోతి పరమాం గతిమ్‌. 19

వసుంధరా! నీకు మరియొక విషయమును కూడ చెప్పెదను. అందలి తీర్థములందు స్నానము చేసినవాడు పరమగతిని పొందును.

చక్రతీర్థం మహాభాగే యత్ర చక్రం ప్రతిష్ఠితమ్‌

శృణు పుణ్యం తస్య భ##ద్రే ప్రాప్నువన్తి నరాః సచ. 20

చక్రము ప్రతిష్ఠితమైన చక్రతీర్థమును సేవించిన నరులు ఎట్టిపుణ్యమును పొందుదురో చెప్పెదను. వినుము.

చక్రతీర్థే నరో గత్వా తదర్థాయ శుభః శుచిః,

స్నానం కుర్యాద్‌ యథాన్యాయం ప్రాప్తోమాధవద్వాదశీమ్‌. 21

దశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ,

ధనధాన్య సమృద్ధోపి జాయతే విపులే కులే. 22

అదియే పనిగ చక్ర తీర్థమున కరిగినవాడు మేలుగా, పవిత్రతతో విధి ననుసరించి వైశాఖ ద్వాదశినాడు స్నానము చేసినేని పదివలే పదివందల యేండ్లు ధనధాన్యములు పుష్కలముగా గల గొప్పకులమున పుట్టును.

మద్భక్త శ్చాత్ర జాయతే మమ కర్మపరాయణః,

అపరాధం వర్జయతి దీక్షితశ్చైవ జాయతే. 23

అట్టి కులమున నాభక్తుడు, నా అర్చనల యందు శ్రద్ధ కల వాడు పుట్టును. పాపములను విడనాడును. దీక్షకలవాడగును.

భూత్వా వై మానుష స్తత్ర తీర్ణః సంసార సాగరమ్‌,

గమనం కురుతే తత్ర మరణం తత్ర కారయేత్‌. 24

అట్లు మంచికులమున పుట్టి సంసారమను సముద్రమును దాటి ఆ క్షేత్రమున కరిగి అందు మరణించును.

ధన్వీ చక్రీ గదీ ఖడ్గీ జాయతే చ చతుర్భుజః,

నరో భూత్వా మహాభాగే విముక్తః సర్వ కిల్బిషాత్‌. 25

అట్టి నరుడు పాపములన్నింటినుండి విముక్తి పొంది ధనుస్సు, చక్రము, గద, ఖడ్గము గల నాలుగు భుజములు గలవాడై యలరారును.

చక్రతీర్థస్య పుణ్యన శ్వేతద్వీపం స గచ్ఛతి,

ఏతత్‌ పుణ్యం మహాభాగే మమ శౌకరకం ప్రతి,

చక్ర తీర్థే విశాలాక్షి మరణ కృతకృత్యతా. 26

చక్రతీర్థము పుణ్యము వలన అతడు శ్వేతద్వీపమున కరుగును. శౌకరక క్షేత్రపు పుణ్యమిట్టిది. చక్రతీర్థమున చచ్చుట యనగా అధియే కృతకృత్యత.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

రూపతీర్థ మితి ఖ్యాతం క్షేత్రే సౌకరకే మమ. 27

వసుంధరా! మఱియొక విషయమును చెప్పెదను. దానిని వినుము. నాదైన సౌకరకక్షేత్రమున రూపతీర్థమని ప్రఖ్యాతి చెందిన దొకటి కలదు.

తత్ర పుణ్యం ప్రవక్ష్యామి స్నాతస్య చ మృతస్య చ,

యాం గతిం వై ప్రపద్యేత మమ కర్మపరాయణః. 28

నా అర్చనలయందు శ్రద్ధ గల నా భక్తుడు, అక్కడ స్నానమాడినచో, మరణించినచో పొందెడు పుణ్య మెట్టిదియో వక్కాణింతును.

అభక్ష్యభక్షణం కృత్వా స్నానం కృత్వా దృఢవ్రతః,

కౌముదస్య చ మాసస్య శుక్లపక్షస్య ద్వాదశీమ్‌. 29

తారితాః పితర స్తేన తథైవ చ పితామహాః,

దశ పఞ్చ చ సపై#్తవ వ్యతీతా యే ఉపస్థితాః. 30

తినరాని తిండి తిన్న వాడైనను, గట్టి నియమముతో ఇచట కార్తీకమాస శుక్లపక్ష ద్వాదశినాడు స్నానము చేసినచో అతని తండ్రులు, తాతలు వెనుకటి పది తరముల వారు, ముందటి పండ్రెండు తరముల వారు తరింతురు.

యావన్తి జలబిన్దూని తస్య గాత్రే ప్రతిష్ఠితాః,

తావద్‌ వర్షసహస్రాణి మమ భక్తశ్చ జాయతే. 31

రూపవాన్‌ గుణవాం శ్చైవ జాయతే ద్రవిణాన్వితః

సురూపాం లభ##తే భార్యాం మద్భక్తశ్చ పతివ్రతామ్‌. 32

అతని ఒడలిపై ఎన్నినీటిచుక్కలు నిలుచునో అన్నివేల యేండ్లు ఆతడు నా భక్తుడగును. రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడు నగునట్టి నాభక్తుడు చక్కని రూపముగల పతివ్రత యగు భార్యను పొందును.

దాతా చైవ తు జాయేత క్రోధరాగవివర్జితః,

సంవిభాగీ సుశీలశ్చ మద్భక్తేషు చ వత్సలః. 33

అతడు దాతయగును. క్రోధరాగములు లేనివాడగును. వివేకవంతుడు, చక్కని శీలము కలవాడు, నా భక్తుల యందు వాత్సల్యము కలవాడు నగును.

ప్రతీర్త్వా సర్వసంసారం మమ కర్మపరాయణః,

కురుతే మరణం తత్ర మత్ప్రసాదా న్న సంశయః. 34

సంసారమును మూలముట్టుగా దాటి ఆనా అర్చకుడు నా దయవలన అచటనే మరణమును పొందును. సందియము లేదు.

మృత స్తత్ర విశాలాక్షి రూపతీర్థే మహౌజసి,

దీప్తిమాంశ్చైవ జాయేత ద్యుతిమాంశ్చ చతుర్భుజః,

శ్వేతద్వీపం సమాసాద్య వాయుభక్షశ్చ సంస్థితః. 35

గొప్పశక్తిగల ఆ రూపతీర్థమున మరణించిన ఆతడు గొప్పతేజస్సు, కాంతి,నాలుగు చేతులు కలవాడై శ్వేతద్వీపమును పొంది వాయుభక్షుడై నిలిచి పోవును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి రూపతీర్థస్య సుందరి,

యేన విజ్ఞాయతే భూమి మమ కర్మపరాయణః. 36

సుందరీ! ఆ రూపతీర్థపు గుర్తును చెప్పెదను. వినుము. దానితో నా భక్తుడు దానిని చక్కగా తెలిసికొనును.

చిహ్నం కురవక స్తత్ర దక్షిణ పార్శ్వసంస్థితః,

నాతిస్థూలో న చాత్యుచ్చైవ ర్మధ్యమస్య చ పాదపః. 37

అచట దక్షిణపు ప్రక్కభాగమున మిక్కిలి లావుకానిది, పెద్దగా ఎత్తుగా లేనిది అగు ఒకపాటి ఎఱ్ఱగోరంట వృక్షము కలదు.

పుష్పితో మాధవే మాసి కామిన్యాకృతి శోషణః,

పుష్పితః సతు సుశ్రోణి కౌముదే ద్వాదశీ దినే. 38

వైశాఖ మాసమున మానవతుల హృదయములను ఆకర్షించుచు అది పూచును. అట్లే కార్తీకమాసము ద్వాదశినాడును అది పుష్పించును.

ఏత చ్చిహ్నం మహాభాగే తత్ర శౌకరకే మమ,

అటమానేన మర్త్యేన విజ్ఞేయం తు న సంశయః. 39

ఓ మహాభాగా! ఆ నాశౌకరక క్షేత్రమున తిరుగాడు నరుడు ఈ గుర్తుతో దాని నెరుగును. సంశయములేదు.

పునరన్యత్‌ ప్రవక్ష్యామి తస్మిన్‌ శౌకరకే మమ,

యోగతీర్థ మితి ఖ్యాతం దుర్విజ్ఞేయం సురైరపి. 40

ఆ నాశౌకరకక్షేత్రమున మరియొక దానిని గూర్చి చెప్పెదను. అచట యోగతీర్థమని చెప్పబడు నది ఒకటి కలదు. దానిని దేవతలును ఎరుగజాలరు.

యోగతీర్థే చ యే స్నాతా మమ కర్మపరాయణాః,

యాం గతిం తే ప్రపద్యన్తే మమ కర్మసుకౌశలాః. 41

నా భక్తులు, నా అర్చనయందు మిక్కిలినేర్పు కలవారు ఆ యోగ తీర్థమున స్నానమాడి యెట్టిగతిని పొందుదురో చెప్పుదును. వినుము.

దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ,

మద్భక్తాశ్చైవ జాయన్తే అపరాధ వివర్జితాః,

క్రోధరాగవినిర్ముక్తా హ్యహింసాకృత నిశ్చయాః. 42

వారు పదునొకండు వేలయేండ్లు ఎట్టి దోషములు లేనివారు, క్రోధరాగములు వదలిన వారు, అహింస యందు గట్టి పట్టుదలకల వారునగు నా భక్తులుగానే అయిపుట్టుదురు.

ఏతత్‌ పుణ్యం మహాభాగే యోగతీర్థే మహాత్మని,

అహోరాత్రోషిత స్తత్ర యః కరోతి యశస్విని,

సర్వసంసార నిర్ముక్తోమమ కర్మ పరాయణః. 43

ఓ మహానుభావా! దొడ్డదైన ఆ యోగతీర్థమున ఒక దినము నివసించినవాడు సంసారబంధముల నన్నింటిని త్రెంచుకొని నా అర్చనల యందు శ్రద్ధకలవాడగును.

స తం మృగయతే తీర్థం యోగేన పరిసంస్థితః,

స చ తం లభ##తే తీర్థం మత్ర్పసా దా న్న సంశయః,

పుణ్యం శౌకరకే భ##ద్రే తత్ర స్నానం ప్రయచ్ఛతి. 44

యోగమునందు నిష్ఠ కలవాడు ఆ తీర్థమును వెదకుచుండును. నా దయవలన దానిని పొందును. ఆ శౌకరకమున పుణ్యమైన స్నానము నాచరించును.

తత్ర ప్రాణాన్‌ పరిత్యజ్య మమ కర్మపరాయణః,

యోగీ చాపి తతో భూత్వా శ్వేతద్వీపం స గచ్ఛతి. 45

అట్టి నా ఆరాధకుడు అందు ప్రాణములను వదలి యోగియై కడకు శ్వేతద్వీపమున కరుగును.

ఏతత్‌ తే కథితం భ##ద్రే యోగతీర్థే మహత్‌ ఫలమ్‌,

యోగినో యత్ర గచ్ఛన్తి మమ కర్మపరాయణాః. 46

మంచిదానా! యోగతీర్థపు గొప్ప ఫలమును యోగులైన నా భక్తులు అరుగుతావును గూర్చి నీకు చెప్పితిని.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి యోగతీర్థస్య సుందరి,

స చ విజ్ఞాయతే తత్ర మమ కర్మపరాయణౖః. 47

నన్ను శ్రద్ధతో అర్చించువారు ఆ యోగతీర్థమునెట్లు తెలిసి కొందురో ఆ గుర్తును చక్కగా వివరింతును.

మార్గశీర్షస్య మాసస్య శుక్లపక్షే చతుర్దశీమ్‌,

అకస్మా దన్ధకారోత్ర సత్తీర్థేషు చ జాయతే. 48

మార్గశీర్ష శుక్లపక్ష చతుర్దశినాడు ఆ తీర్థపు తావులందు ఒక్కపెట్టున చీకటి ఏర్పడును.

త్రీణి హస్త సహస్రాణి త్రీణి హస్త శతాని చ.

త్రయో హస్తా విశాలాక్షి పరిమాణం విధీయతే. 49

మూడు వేల మూడు వందల మూడు మూరల కొలత ఆ తీర్థమునకు చేయబడినది.

ఏత చ్చిహ్నం తతో దృష్ట్వా మరణం యస్తుకారయేత్‌,

స్నానం చైవ విశాలాక్షి పూర్వోక్తాం గచ్ఛతే గతిమ్‌. 50

ఈ గుర్తును పట్టుకొని అందు మరణించుటయో, స్నాన మాడుటయో చేయువాడు మునుపు చెప్పిన గతి కరుగును.

ఏతచ్చిహ్నం మహాభాగే యోగతీర్థే మయి స్థితే,

మాం యజేత్‌ సిద్ధికామస్తు యదీచ్ఛేత్‌ పరమాం గతిమ్‌. 51

ఓ మహాభాగా! నేనున్న యోగతీర్థపు గుర్తిట్టిది. అందు సిద్ధిని కోరువాడు, పరమగతిని ఆపేక్షించువాడును నన్ను పూజింప వలయును.

వసుధేన్యం ప్రవక్ష్యామి తీర్థే శౌకరకే మమ,

యత్ర తప్తం తపశ్చైవ సోమేన తదనన్తరమ్‌. 52

వసుధా! శౌకరతీర్థమునందలి మరియొక విశేషమును చెప్పెదను. అందు చంద్రుడు తపస్సు చేసెను.

పఞ్చవర్ష సహస్రాణి ఏకపాదేన తిష్ఠతి,

పఞ్చవర్ష సహస్రాణి ఊర్ధ్వ బాహు స్తథైవ చ. 53

అయిదేవేలయేండ్లు ఒంటికాలిపై నిలిచియుండెను. అయిదు వేలయేండ్లు చేతులు పైకెత్తి కొని నిలిచెను.

అథోముకః పఞ్చపునః పఞ్చై వోర్ధ్వముఖ స్తథా,

వాయుభక్షః పునః పఞ్చ నిరాహారో వ్రతే స్థితః. 54

తలవంచుకొని అయిదువేలయేండ్లు, తలపైకెత్తి అయిదు వేల యేండ్లు, గాలినితినుచు అయిదువేలయేండ్లు, ఆహరాములేని వాడై అయిదు వేలయేండ్లు ఆతడు వ్రతమున నిలిచియుండెను.

ఏవం విధ సహస్రాణి వత్సరాణాం కృతం తపః,

మమై వారాధనే యుక్తో బ్రాహ్మణానాం హితే రతః. 55

ఇట్లు వేలకొలది యేండ్లు తపస్సు చేసెను. నా ఆరాధనయందే తగులుకొని యుండెను. బ్రహ్మజ్ఞాన సంపన్నుల హితమునందు ప్రీతికలవాడై యుండెను.

ఏతచ్ఛ్రుత్వా వచ స్తస్య ప్రష్టుకామా వసుంధరా,

శిరస్యఞ్జలి మాధాయ తతః శ్లక్ష మువాచ హ. 56

ఆతని ఈ పలుకువిని వసుంధర ఏదో అడుగ గోరినదై తలపై దోసిలియొగ్గి పిదప మెల్లగా ఇట్లు పలికెను.

కి మేవం తోషిత స్తేవ శశాఙ్కేన జనార్దనః,

ఏత దాచక్ష్వ తత్త్వేన పరం కౌతూహలం హి మే. 57

జనార్దనుని ఆ చంద్రుని డేకారణమున మెచ్చించెను? ప్రభూ! దీనిని నాకు చక్కగా తెలుపవలయును. నాకు దానిని వినవలయునను ఉత్కంఠ మిక్కుటముగా నున్నది.

వసుధాయా వచః శ్రుత్వా విష్ణు ర్మాయా కరణ్డకః,

ఉవాచ మధురం వాక్యం మేఘదుందుభి నిఃస్వనః. 58

భూదేవిపలుకు విని మాయలపెట్టె యగు విష్ణువు ఉరుము వంటి కంఠధ్వనితో తీయగా నిట్లు పలికెను.

శృణు భూమి ప్రయత్నేన కథ్యమానం మయానఘే,

తస్య వై కారణం యేన తేన చారాధితోస్మ్యహమ్‌. 59

భూమీ! నేను ప్రయత్నపడి చెప్పుచున్నదానిని వినుము. ఆతడు నన్నేల ఆరాధించెనో ఆ కారణమును చెప్పెదను.

తస్య ప్రీతోస్మ్యహం దేవి విశుద్ధే నాన్తరాత్మనా,

దర్శిత శ్చ మయా హ్యాత్మా యో హి దేవేషు దుర్లభః. 60

ఆతని విశుద్ధమగు అంతరాత్మతో నేను ప్రీతుడనైతిని. దేవతలకు దుర్లభ##మైన నా ఆత్మ నాతనికి చూపితిని.

రూపం సోమేన మేదృష్టం విసంజ్ఞ స్తదనన్తరమ్‌,

మహ్యం ద్రష్టుం న శక్నోతి మమ తేజః ప్రమోహితః. 61

చంద్రుడు నా రూపమును చూచెను. వెంటనే మూర్ఛనందెను. నాతేజస్సుచే మిక్కిలి మోహము నందినవాడై నారూపమును మొత్తముగా చూడజాలకపోయెను.

తత ఏవ నిమిలాక్షః శిరసా చ కృతాఞ్జలిః,

న శక్నోతి తథావక్తుం భీరుః సంత్రస్తలోచనః. 62

అట్లే మోడ్పుకన్నులు కలవాడై తలతోదోసిలిఒగ్గి, మాటలు పెకలిరానివాడై బెదరు కన్నులతో దిగులుదిగులుగా ఉండెను.

ఏవ మేతద్‌ విచేష్టన్తం బ్రాహ్మణానా మపీశ్వరమ్‌,

వాణీం సూక్ష్మాం సమాదాయ స సోమో నోదితో మయా. 63

ఇట్లు తిరుగుళ్లు పడుచున్న బ్రాహ్మణాధిపతి యగు సోమునితో నేను మెల్లని చల్లని వాకకుతో ఇట్లంటిని.

కి మిదం కారణం సోమ తప్యసే కర్తులాలసః,

బ్రూహి తత్త్వేన మే సర్వం తత్‌ త్వం సోమ మనీషితమ్‌,

సర్వం తే కారయిష్యామి మత్ర్పసాదా న్న సంశయః. 64

సోమా! నీవు ఏమి చేయదలచితివి? నీ తపమునకు కారణమేమి? ఉన్నదున్నట్లు చెప్పుము. నీవు కోరినదేదో దానినంతటిని అనుగ్రహముతో చేసెదను. సంశయింపకుము.

మమ వాక్యం తతః శ్రుత్వా గ్రహాణాం ప్రవరేశ్వరః,

ఉవాచ మధురం వాక్యం సోమతీర్థ మవస్థితః. 65

సోమ తీర్థమున నున్న ఆ గ్రహపతి నా మాటవిని తీయగా నిట్లు పలికెను.

భగవన్‌ యది తుష్టోసి మమ చాత్ర తతః ప్రభో,

లోకనాథ జగత్ర్సష్టః సర్వయోగేశ్వరేశ్వర. 66

యావల్లోకా ధరిష్యన్తి యావత్‌ త్వం చ జనార్దన,

అతులా త్వయి మే భక్తి స్తుభ్యం భక్తో జనార్దన. 67

ప్రభూ! జనార్దనా! లోకనాథా! లోకస్రష్టా! సర్వయోగేశ్వరేశ్వరా! నా విషయమున నీవు తుష్టుడవైనచో ఈ లోకము లుండునందాక, నీవు ఉండునంతవరకు నీయందు నాభక్తి సాటిలేనిదై నిలువ వలయును.

యచ్చాపి మమ తద్రూపం త్వయా సంస్థాపితం ప్రభో,

సప్తద్వీపే చ దృశ్యేత తత్ర తత్రైవ సంస్థితమ్‌. 68

నీవు నాయందు నెలకొల్పిన ఆ నా రూపము, ఏడు ద్వీపముల యందును ఎక్కడి కక్కడ నిలుచుచు నందరకు కానవచ్చు గాక!

సోమ మిత్యేష యజ్ఞేషు పిబన్తి మమ బ్రాహ్మణాః,

గతిః పరమికా తేషాం దివ్యా విష్ణో భ##వే ద్యథా. 69

యజ్ఞములందు బ్రాహ్మణులు సోమమను పేరున నా అమృతమును త్రావుదురు. అది దేవతల కమృతము వలెపరమగతికి కారణమగు గాక!

క్షీణ స్తత్ర త్వమావాస్యాం యత్ర పిణ్డ పితృ క్రియా,

ప్రవర్తేత యథాన్యాయం భ##వేయం సౌమ్యదర్శనః. 70

అమావాస్యనాడు నేను క్షీణించినప్పుడు బ్రాహ్మణులు చేయు పిండపితృయజ్ఞము విధితప్పని దై జరుగుగాక! నే నప్పుడు చక్కని దర్శనము కలవాడ నగుదును గాక!

అధర్మే చ న మే బుద్ధి ర్భవేద్‌ విష్ణో కదాచన,

పతిత్వం చాథ గచ్ఛేయ మోషధీనాం తథా కురు. 71

విష్ణూ! నాబుద్ధి ఎన్నటికిని అధర్మమున నిలువ కుండుగాక! నేను ఓషధులకు పతి నగుదును గాక! ఈ విధముగా నీవను గ్రహింపుము.

యది తుష్టో మయా దేవ త్వమే వావ్యక్తమాయయా,

మమ చైవ ప్రియార్థాయ ఏత న్మే దీయతాం వరః. 72

నా యెడల నీవు తుష్టుడ వైనచో అవ్యక్తమగు మాయతో నా ప్రియముకొరకు, దేవా! నీవు నాకీ వరము ననుగ్రహింపుము.

తతః సోమవచః శ్రుత్వా సమయా సంశితవ్రతః,

భవిష్యతి న సందేహో యత్త్వయా సోమ చేప్సితమ్‌. 73

స్వచ్ఛమగు వ్రతములు కల ఆ చంద్రుని మాట విని నే నాతనితో సోమా! అట్లే అగును. నీవు కోరినది నెరవేరును. సందేహము లేదు అని పలికితిని.

తతః స బ్రాహ్మణ స్తుష్టో విశుద్ధే నాన్తరాత్మనా,

వచనం బాఢమిత్యేవ అనుగ్రహ మమన్యత. 74

అంత ఆ బ్రాహ్మణుడు (సోముడు) నిర్మలమగు అంత రాత్మతో 'సరి సరి' అని పలుకుచు నా మాటను అనుగ్రహముగా భావించెను.

తత స్తస్య వచః శ్రుత్వా సోమస్య తదనన్తరమ్‌,

గచ్ఛ సోమ యథాన్యాయ ముక్త్వా చాన్తరధీయత. 75

అంత నా సోముని మాట విని అతనికి వర మనుగ్రహించి, సోమా! పోయి రమ్మని పలికి అదృశ్యుడ నయితిని.

ఏవం తప్తం మహాభాగే తపః సోమేన నిశ్చయాత్‌,

ప్రాప్తశ్చ పరమాం సిద్ధిం సోమతీర్థే న సంశయః. 76

మహాభాగా! ఇట్లు చంద్రుడు చెదరని బుద్ధితో సోమతీర్థమున తపమాచరించెను. పరమసిద్ధి నందెను.

యత్తత్ర స్నాపయేత్‌ తీర్థే మమ కర్మ పరాయణః,

అష్టమేన తు భ##క్తేన మమ కర్మవిధిస్థితః. 77

ఆ తీర్థమున స్నానము చేయువాడు నాలుగు దినములు ఉపవాసముండు వాడునగు నా ఆరాధకుడు పొందు ప్రయోజనము చెప్పెదను. వినుము (అష్టమేవ భ##క్తేన - ఎనిమిదవ కాలపు భోజనము చేత-అనగా రోజునకు రెండు చొప్పున ఎనిమిది భోజనములను విడచి - నాలుగురోజులు ఉపవాసము చేసి - అని తాత్పర్యము)

ఫలం తస్య ప్రవక్ష్యామి స్నాత్వైవం యస్తు కారయేత్‌,

ప్రాప్నోతి యన్మహాభాగే సోమతీర్థే కృతోదకః. 78

ఆ సోమతీర్థమున స్నానముచేసి ఆరాధన చేయువాడు పొందెడు ఫలమును వక్కాణించెదను.

త్రింశ ద్వర్షసహస్రాణి త్రింశద్వర్షశతాని చ,

జాయతే బ్రాహ్మణః సుభ్రు వేదవేదాంగ పారగః. 79

మూడు వేలమూడు వందల సంవత్సరములు ఆతడు, వేదములయు, వేదాంగములయు పారమును ముట్టిన బ్రహ్మ జ్ఞాని యగును.

ద్రవ్యవాన్‌ గుణవాం శ్చైవ సంవిభాగీ యశస్విని,

మద్భక్త శ్చైవ జాయేత అపరాధ వివర్జితః,

స ఏష బ్రాహ్మణో భూత్వా స్థిత్వా సంసారసాగరే. 80

ఆతడు ద్రవ్యవంతుడు, గుణవంతుడు, వివేకము కలవాడు, దోషములు లేనివాడు నగు నా భక్తుడగును. సంసారసాగరమున నున్నను బ్రహ్మజ్ఞానము కలవాడగును.

తస్య చిహ్నం ప్రవక్ష్యామి సోమతీర్థస్య సుందరి,

స తత్ర యేన విజ్ఞేయో మమ మార్గానుసారిణా. 81

నా మార్గమదు ననుసరించు భక్తుడు తెలిసికొనెడు సోమతీర్థపు గుర్తును తెలిపెదను.

వైశాఖస్య తు మాసస్య కృష్ణపక్షస్య ద్వాదశీమ్‌,

ప్రవృత్తే చాన్ధకారే తు యత్ర కిఞ్చిన్న దృశ్యతే. 82

సోమేన చ వినా భూమి ర్దృశ్యతే చంద్రసప్రభా,

ఆలోకశ్చైవ దృశ్యేత సోమస్తత్ర న దృశ్యతే. 83

వైశాఖమాస కృష్ణపక్ష ద్వాదశినాడు చీకట్లు క్రమ్ముకొని యుండగా అందేమియు కానరాకుండును. అప్పుడు ఆనేల చంద్రుడు లేకయే చంద్రుని కాంతితో మెరసి పోవుచుండును. వెన్నెలకానవచ్చును. చంద్రుడు కానరాడు.

ఆత్మనో దృశ్యతే ఛాయా యథాన్యాయం పథేస్థితే,

సోమశ్చైవ న దృశ్యేత ఏవం వై విస్మయం పరమ్‌. 84

దారి యందు నిలిచియుండగా తననీడ కానవచ్చును. చంద్రుడు కానరాడు. ఇది మిక్కిలి ఆశ్చర్యము.

ఏతచ్చిహ్నం మహాభాగే పుణ్య సౌకరకే మమ,

సోమతీర్థే విశాలాక్షి యేన ముచ్యన్తి మానవాః. 85

పుణ్యమగు నా సౌకరకక్షేత్రమున సోమతీర్థపు గుర్తిట్టిది. మానవు లిందు ముక్తి పొందుదురు.

ఏతత్‌ తే కథితం భ##ద్రే సోమతీర్థస్య నిశ్చయమ్‌,

తరన్తి మనుజా యేన గత్వా సంసారసాగరమ్‌. 86

భద్రులారా! సంసారమను సముద్రమున చిక్కిన నరులు ఎచట తరింతురో ఆ సోమతీర్థమును గూర్చి నీకు వివరించితిని.

అన్యచ్చ తేప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

ప్రభావ మస్య క్షేత్రస్య విస్మయం పరమం మహత్‌. 87

వసుంధరా! ఈ క్షేత్రము ప్రభావమును గూర్చి మరియొక విషయమును చెప్పెదను. వినుము. అది పరమాశ్చర్యమును కలిగించును.

అకామాత్‌ తు మృతా తీర్థే ఆత్మనః కర్మ నిశ్చయాత్‌,

మమ క్షేత్ర ప్రభావేన సృగాలీ మానుసీ భవత్‌. 88

తన పూర్వకర్మ నిర్ణయము వలన తనకోరిక లేకయే ఈ క్షేత్రమున చచ్చిన ఆడునక్క మనుష్య స్త్రీ అయినది.

రాజపుత్రీ విశాలాక్షీ శుద్ధా సర్వాఙ్గ సుందరీ,

రూపాన్వితా గుణవతీ చతుఃషష్టి కళాన్వితా. 89

ఆమెవిశాలమైన కన్నులు కలది. దోషములు లేనిది, నిలువెల్ల సౌందర్యము కలది. రూపవతి, గుణవతి, అరువది నాలుగు కళలలో ఆరితేరినది అగు రాజపుత్రి అయినది.

తస్య పూర్వేణ పార్శ్వేన తీర్థం గృధ్రవటం స్మృతమ్‌,

యత్రాకామో మృతో గృధ్రో మానుషత్వ ముపాగతః. 90

ఆ సోమతీర్థమునకు తూర్పుప్రక్కగా గృధ్రవటమను తీర్థము కలదు. అచట అనుకొనకయే మరణించిన గ్రద్ద మనుష్యత్వమును పొందెను.

వాక్యం నారాయణా చ్ఛ్రుత్వా ధరణీ శుభలక్షణా,

ఉవాచ మధురం వాక్యం విష్ణుభక్త సుఖావహమ్‌. 91

నారాయణుని వలన పై మాటవిని శుభలక్షణ యగుభూదేవి విష్ణుభక్తుల సుఖమునకు ఆస్పదమైన వాక్యమును తీయగా ఇట్లు పలికెను.

అహో తీర్థప్రభావో వై త్వం చైవ శుభలక్షణః,

తస్య దేవ ప్రభావేన తిర్యగ్యోనిత్వ మాగతౌ,

గృధ్రశ్చైవ సృగాలీ చ ప్రాప్తౌ దై మానుషీం తనుమ్‌. 92

ఆ తీర్థప్రభావము ఎంతగొప్పది? నీవెంత శుభలక్షణుడవు! అట్టి నీ ప్రభావము చేత పశుపక్ష్యాది జన్మములను పొందిన గ్రద్దయు నక్కయు మానవ దేహమును పొందినవి.

స్నానం చ తత్ర తీర్థేషు మరణం చ జనార్దన,

కాం గతిం తే ప్రపద్యన్తే తన్మమాచక్ష్వ కేశవ. 93

జనార్దనా! అచటి తీర్థములందలి స్నానము, మరణము పొందినవారు ఎట్టి గతిని పొందుదురో నాకు చక్కగా తెలియజెప్పుము.

చిహ్నం చ కీదృశం తేషాం యేన జ్ఞాయన్తి తే తథా,

తీర్థాని చ తవ క్షేత్రే విష్ణుభక్తసుకావహే. 94

వారిని గుర్తింపదగు చిహ్న మెట్టిది? విష్ణుభక్తులకు సుఖమును కూర్చెడు నీ క్షేత్రమునందలి తీర్థము లెట్టివి?

కేన కర్మవిపాకేన మృతౌ గృధ్ర సృగాలకౌ,

అకామౌ తవ క్షేత్రేషు ప్రాప్తవంతౌ మహత్‌ ప్రియమ్‌. 95

ఎట్టి కర్మపరిపాకముతో, కోరుకొనకుండియు గ్రద్దయు, నక్కయు నీక్షేత్రములందు మరణించి గొప్ప ప్రియమును పొందినవి?

తతో మహీవచః శ్రుత్వా విష్ణు ర్ధర్మవిదాం వరః,

ఉవాచ మధురం వాక్యం ధర్మకామాం వసుంధరామ్‌. 96

అంతట ధర్మవేత్తలలో శ్రేష్ఠుడగు విష్ణువు భూదేవిమాట విని ధర్మమెరుగగోరు వసుంధరతో తీయగా ఇట్లు పలికెను.

శృణు తత్త్వేన మే భూమి యన్మాం త్వం పరిపృచ్ఛసి,

ఉభౌ తౌ కారణాద్‌ యేన ప్రాప్తౌ వై మానుషీం తనుమ్‌. 97

భూమీ! ఆ రెండును ఏ కారణమున మనుష్య దేహము పొందెనని నన్ను నీవడిగితివి. దానిని చక్కగా తెలియజెప్పెదను. వినుము.

తస్మిన్‌ కాలే హ్యతిక్రాన్తే మమ కర్మ వినిశ్చయాత్‌,

త్రేతా యుగ మనుప్రాప్తే జాతే చ యుగే సంస్థితే. 98

తత్ర రాజా మహాభాగః సర్వకర్మవినిశ్చితః,

బ్రహ్మదత్తేతి విఖ్యాతః పురం కాంపిల్య మాస్థితః. 99

ఆ కృత యుగము నా ఏర్పాటు వలన గడువగా యుగముల వరుసలో త్రేత రాగా, కాంపిల్య నగరమునందు సర్వకర్మముల చక్కని జ్ఞానము కలవాడు, పుణ్యమూర్తి బ్రహ్మదత్తుడని ప్రసిద్ధి కన్నవాడు నగు ఒకరాజు ఉండెడివాడు.

తస్య పుత్రో మహాభాగః సర్వధర్మేషు నిష్ఠితః,

సోమదత్తేతి విఖ్యాతః కుమారః శుభలక్షణః. 100

అతని కుమారుడు సోమదత్తుడు. సర్వధర్మములలో నిష్ఠ కలవాడు. పుణ్యాత్ముడు. శుభ##మైన లక్షణములు కలవడు.

పిత్రర్థే త్వథమావాస్యా మృగలిప్సా ముపాగమత్‌,

అరణ్యం స తతో గత్వా వ్యాఘ్రసింహ నిషేవితమ్‌,

న తత్ర లభ##తే కిఞ్చిత్‌ పితృకార్యే నరాధిపః. 101

అతడు పితృక్రియ కొరకు (శ్రాద్ధము కొరకు) ఒక అమావాస్య నాడు మృగమును పొంద గోరి పులులు, సింహములు తిరుగాడెడు అడవికి వేటకై అరిగెను. కాని ఆ రాజు అందొక్క మృగమును కూడ శ్రాద్ధమునకై పొందజాలకుండెను.

ఏవం తు భ్రమత స్తస్య శృగాలీ దక్షిణ స్థితా,

అఙ్గమధ్యే తు విద్ధా సా స్ఫురన్తీ సర్వమఙ్గలా. 102

ఇట్లు తిరుగుచుండగా అతని కుడివైపున నిలిచిన ఒక నక్క కానవచ్చెను. సర్వశుభములుకల ఆ నక్క వేగముగా పోవుచుండగా ఆతడు దానిని దేహము నడుమ బాణముతో కొట్టెను.

ఏవం సా బాణసంతప్తా వ్యథయా చ పరిప్లుతా,

అకామాముఞ్చత ప్రాణాంస్తీర్థం సోమాత్మకం ప్రతి. 103

అట్లు ఆ బాణము కాల్చివేయుచుండగా నిలువెల్ల వేదనతో కూడిన ఆ ఆడునక్క సోమతీర్థముకడ యాదృచ్చికముగా ప్రాణము లను వదలెను.

ఏతస్మి న్నంతరే భ##ద్రే రాజపుత్రః క్షుధార్దితః,

ప్రాప్తో గృధ్రవటం తీర్థం విశ్రామం తత్ర చాకరోత్‌. 104

ఇంతలో ఆ రాజపుత్రుడు ఆకలిగొన్నవాడై గృధ్రవట తీర్థము నకు చేరి అచట విశ్రాంతి గొనుచుండెను.

అథ పశ్యతి గృధ్రస్య న్యగ్రోధే శాఖ మాశ్రితమ్‌,

ఏకేన చ స బాణన తథా చ వినిపాతితః. 105

అంతలో రావిచెట్టుకొమ్మ పై నన్ను ఒక గ్రద్దను చూచి ఒక బాణముతో దానిని కూలనేసెను.

స తత్ర పతితో గృధ్రో వటమూలే యశస్విని,

గతాసు ర్నష్టసంజ్ఞో వై బాణభగ్న హృద స్తథా. 107

బాణముతో ముక్కలైన గుండెగల ఆ గ్రద్ధ ప్రాణములు పోయినదై, చైతన్యము లేనిదై ఆ రావిచెట్టు మొదట కూలెను.

తం దృష్ట్వా పతితం గృధ్రం రాజపుత్రః సతుష్టవాన్‌,

స తస్య లూనపక్షాన్‌ వై బాణపక్షవిలోహితః. 108

గృహీత్వా తస్య పత్రాణి సోమదత్తో నరాధిపః,

వటే గృధ్రం స్థాపయిత్వా స్వంపురంవై సమాగతః. 109

రాజపుత్రుడు అట్లు కూలిన గ్రద్దను కాంచి, తెగి పడిన రెక్కలు గల ఆ గ్రద్ద నెత్తుటితో ఎరు పెక్కిన బాణములతో దాని రెక్కలను తొలగించి దానిని ఆవటమున నుంచి తన పురమునకు తిరిగి వచ్చెను.

సోపి దీర్ఘేణ కాలేన అకామః పతిత స్తథా,

కళిఙ్గస్య సుతః శ్రేష్ఠో జాతో వై సర్వశాస్త్రవిత్‌. 110

అదియు పెక్కుకాలమునకు కోరకయే అచట కూటి, కళింగ రాజు కుమారుడై పుట్టెను. సర్వశాస్త్రములను చక్కగా తెలిసిన దాయెను.

పణ్డితో గుణవాంశ్చైవ ఆత్మదేశ ప్రియంకరః,

ఆయాసం న తు విన్దేత దుఃఖం తత్ర క్వచిన్నతుః. 111

అతడు పండితుడు. గుణవంతుడు. తనదేశమునకు ప్రియము చేయువాడు. ఆయాసమెరుగడు. దుఃఖమాతనికి ఎన్నడు కలుగదు.

యా సా సృగాలీ హే భూమి కాన్తరాజ్యే నరాధిపః,

అజాయత కులే తస్య రాజపుత్రీ మనోరమా, 112

భూమీ! ఆ నక్క ఉన్నదే, అది కాంతీరాజ్య పాలకుని కులమున రాజపుత్రియై మనోరమ యను పేరున పుట్టెను.

రూపవతీ గుణవతీ దక్షా సర్వాఙ్గ సుందరీ,

చతుః షష్టి కళాయుక్తా కోకి లేవ సుఖస్వరా. 113

చక్కని రూపము కలది. గుణములు కలది. సమర్థ సర్వాంగ సుందరి. అరువది నాలుగు కళలలో ఆరితేరినది. కోకిలవలె చక్కని కంఠస్వరము కలది.

ఏవం ప్రవర్తితే తత్ర కాంతీరాజ్యే కళిఙ్గకే,

సౌహృదాత్‌ ప్రతిహార్దిక్యా దన్యోన్య కులనిశ్చయాత్‌,

భూమే మమ ప్రసాదేన సంబంధో జాయతే తతః. 114

ఇట్లు కాగా, మంచి భావనల వలనను, ఒకరి కొకరికి ఏర్పడిన ఆత్మీయత వలనను, పరస్పరము కులములు కలసినందు వలనను, నా అనుగ్రహమువలనను కాంతీరాజ్య కళింగరాజ్య పాలకులకు సంబంధము ఏర్పడెను.

అథ దీర్ఘేణ కాలేన కాంతీరాజ కళింగయోః,

ఉద్వాహం కారయామాసు ర్విధిదృష్టేన కర్మణా. 115

అంత కొంతకాలమునకు కాంతీరాజ కళింగరాజులు శాస్త్రము చూపిన పద్ధతితో వారిరువురకు వివాహము చేసిరి.

ధనరత్న సమృద్ధాని దదౌ తస్య కళిఙ్గయోః,

యోగ్యాని రమణీయాని భూషణా న్యర్హణాని చ. 116

కళింగరాజ కుమారదంపతులకు సమృద్ధములైన ధనములను, రత్నములను, రమణీయములును, యోగ్యములునగు ఆభరణములను, వస్తువులను కానుకగా ఇచ్చిరి.

వధూం గృహ్య కళిజ్గో వై కృతోద్వాహాం సుతస్థితామ్‌,

హృష్టతుష్టేన మనసా స్వం పురం శీఘ్రమాగతః. 117

కళింగరాజు వివాహము కావించి తన తనయునితో కూడియున్న కోడలిని కైకొని మిక్కిలి సంతోషము నొందిన మనస్సుతో వేగముగా తన పురమునకు వచ్చెను.

ఏవం గచ్ఛతి కాలే వై దంపతీనాం సహానుగః,

ప్రీతి ర్జాయతి చాన్యోన్యం రోహిణీ చన్ద్రయో రివ. 118

ఇట్లు ఆ దంపతులకు అనుకూలముగా కాలము గడచుచుండగా ఒకరి యెడ నొకరికి ప్రీతియు, రోహిణీ చంద్రులకు వలె, వృద్ధి పొందుచుండెను.

రేమతుస్తౌ విహారేషు దేవతాయతనేషు చ,

వనే చోపవనే చైవ యే కేచిన్నన్దనోపమాః. 119

వారిరువురు చక్కని రమణీయ ప్రదేశములందును, దేవాయముల యందును, నందనముతో సరితూగెడు ఉద్యాన వనముల యందును ప్రీతితో విహరించిరి.

భర్తారం సా న పశ్యచ్చేత్‌ కదాచిద్యది పార్శ్వతః,

నష్టం మన్యతి చాత్మానం రాజుపుత్రీ యశస్వినీ. 120

చక్కని ప్రతిష్ఠగల రాజపుత్రి ఏ క్షణమునందైనను, భర్త తన పార్శ్వమున కనబడనిచో తాను మరణించిన నట్లే భావించెడిది.

న స పశ్యతి భార్యాం స్వాం సర్వరూపాతి సుందరీమ్‌,

సోపి పశ్యతి చాత్మానం నష్టమేవ జనాధిపః,

దివసే దివసేప్యేవం వర్ధ త్యేవ చ సుందరి. 121

అతడును, సర్వమైన రూపముచేత మిక్కిలి సౌందర్యము కల తన భార్యను ఒక్క క్షణమైన చూడకుండెనేని తానుచు మరణించి నట్లే భావించెడివాడు. ఇట్లు వారిరువురకు ప్రేమ పెరుగుచునే యుండెను.

తయోః ప్రవర్ధతే ప్రీతి ర్వేలేవ చ మహోధరేః,

నాన్తరం లభ##తే తత్ర పురుషో వా కదాచన. 122

సముద్రపు వేలవలె వారి ప్రీతి పెరుగుచునే యుండెను. ఆమె తన హృదయమున మరియొక పురుషుని తలచి యెరుగదు.

సా తు చాత్మసుశీలేన వృత్తేన చ వసుంధరే,

కలిఙ్గం తోషయామాస పౌరజానపదాం స్తథా. 123

ఆమెయు తన చక్కని శీలము చేతను, నడవడి చేతను, కళింగరాజును, పౌరులను, జానపదులను సంతోషపరచుచుండెను.

అన్తః పురేషు యా నార్యః కలిఙ్గేషు నరాధిపః,

వృత్తేన తాభ్యాం తుష్టా స్తే కర్మభ్యాం పూజనేన చ. 124

కళింగరాజు అంతఃపురము నందలి కాంతులు, రాజును వారినడవడితో, పనులతో, మన్ననలతో పరమానందమందిరి.

ఏవం ప్రవర్ధితా తాభ్యాం ప్రీతిః పూర్వం యశస్విని,

రేమాతే తత్ర చాన్యోన్యం శచీవాసవయో ర్యథా. 125

ఇట్లు వారిరువురకు, శచీపురందరులకు వలె, ఒకరియెడ నొకరికి ప్రీతి పెరుగుచుండెను. ఆనందమందు చుండిరి.

అథ సా ప్రణయ పూర్వ మేకాన్తే తు యశస్విని,

ప్రేవ్ణూ తు హ్రీమతీ బాలా రాజపుత్రం ప్రభాషతి. 126

అంతనొకనాడు ఆ బాల ఏకాంతమున ప్రేమతో, సిగ్గుతో ఆ రాజపుత్రునితో ఇట్లు పలికెను.

కి ఞ్చి దిచ్ఛామి తే వక్తుం రాజపుత్ర యశోధన,

మమస్నేహాత్‌ప్రియం చైవ తద్‌ భవాన్‌ వక్తు మర్హసి. 127

రాజపుత్రా! యశోధనా! నిన్నొక్క చిన్న విషయ మడుగ గోరుచున్నాను. నా యందలి స్నేహముతో, ప్రియముతో నీవు దానిని గూర్చి చెప్పవలయును.

తతో భార్యావచః శ్రుత్వా కళిఙ్గస్య సుతః ప్రభుః,

ఉవాచ మధురం వాక్యం పద్మపత్ర నిభేక్షణః. 128

అంత కళింగ రాజు కుమారుడు, పద్మపత్రముల వంటి కన్నులుకలవాడు ప్రియురాలి మాట విని తీయగా నిట్లు పలికెను.

యం యం చ వక్ష్యసే భ##ద్రే తంతం తుభ్యం మనీషితమ్‌,

తత్సర్వం కారయిష్యామి శ##పే సత్యేన సుందరి. 129

మంచిదానా! నీవేదేది కోరుదనో దానినంతటిని చేసెదను. సత్యము మీద ఒట్టు వేసి చెప్పుచున్నాను.

సత్యం మూలం బ్రాహ్మణానాం విష్ణుః సత్యే ప్రతిష్ఠితః,

తస్య మూలం తపో రాజ్ఞి రాజ్యం సత్యే ప్రవర్తతే. 130

రాణీ! సత్యము బ్రాహ్మణులకు కుదురు. విష్ణువు సత్యము నందే నెలకొని యుండును. దానికుదురు తపస్సు. రాజ్యము సత్యమునందే ప్రవర్తించును.

నాహం మిథ్యా ప్రవక్ష్యామి కదాచి దపి సుందరి,

ఉక్తపూర్వం నమే మిథ్యా బ్రూహి కిం కరవాణి తే. 131

నేను ఎన్నటికిని అసత్యము పలుకను. సుందరీ! ఇంతవరకు అసత్యమాడలేదు. చెప్పు. నీ కొరకు నేనేమి చేయవలయును?

హస్త్యశ్వరథయానాని యే చ రత్నా మహౌజసః,

అథవా పరమగ్ర్యం తు పట్టబంధం కరోమి తే. 132

ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, వాహనములు, మిక్కిలి శక్తికల రత్నములు - నీకు వలయునా? లేక అన్నిటి కంటె మిన్నయినది నా పట్టబంధమును నీ కొసగుదునా?

(పట్ట బంధము - రాజలాంఛనమగు కిరీటము)

సా భర్తృవచనం శ్రుత్వా కాన్తీరాజస్య చాత్మజా,

ఉభౌ చరణౌ సంగృహ్య భర్తారం ప్రత్యువాచ హ. 133

కాంతీరాజ పుత్రి యగు ఆమె భర్త పలుకు విని ఆతని రెండు పాదములను చక్కగా పట్టుకొని భర్త కిట్లు బదులు చెప్పెను.

న చైవ రత్న మిచ్ఛామి హస్త్యశ్వరథ మేవ చ,

పట్ట బన్ధేన మే కార్యం యావద్‌ధ్రియతి మే గురుః. 134

నేను రత్నమును కోరను. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు నాకక్కరలేదు. నా భర్త జీవించియున్నంతవరకు నాకు కిరీటముతో పనిలేదు.

ఏకా స్వపితు మిచ్ఛామి మధ్యాహ్నే తు తథావిధే,

న చిరం చాల్పకాలం తు యథా కశ్చి న్న పశ్యతి. 135

నేను మధ్యాహ్నమున ఒంటరిగా నిద్రింపగోరుచున్నాను. ఎక్కువ సేపు కాదు. చాల తక్కువ కాలము. అట్లు నేను నిద్రించు నపుడు నన్నెవ్వడు చూడరాదు.

శ్వశురో యది వా శ్వశ్రూ ర్యే చాన్యే చ నరాధిప,

సుప్తానైవ తు ద్రష్ట వ్యా వ్రత మేత న్ముహూర్తకమ్‌. 136

మామకాని, అత్తగాని, మరియెవరు కాని, నేను నిద్రించు చుండగా చూడరాదు. ఇది ఒక్క ముహూర్తకాలము నాకు వ్రతము.

ఆత్మనో వై గృహజనా యే కేచిత్‌ స్వజనే జనాః,

తైస్తు సుప్తా నద్రష్టవ్యా కదాచిదపి సంస్థితా. 137

ఇంటి పరిచారకులు గాని, బంధుజనులు గాని ఎవ్వరు గాని నేను నిద్రించుచుండగా నన్ను చూడరాదు.

తతో భార్యావచః శ్రుత్వా కళింగైశ్వర్య వర్ధనః,

బాఢ మిత్యేవ తాం వాక్యం ప్రత్యువాచ వసుంధరే. 138

కళింగ సంపదల పెంపొందించు ఆ రాజకుమారుడు భార్యమాట విని అట్లే అని పలికెను.

విస్రబ్ధా భవ సుశ్రోణి కల్యాణన యశస్విని,

న త్వాం వై ద్రక్ష్యతే కశ్చి చ్ఛయనీయ మహావ్రతమ్‌. 139

సుశ్రోణీ! నమ్మకముతో నుండుము. శుభముగా నీ వ్రతమును చేసికొనుము. నీశయనీయ మహావ్రతమును ఎవ్వడును చూడడు.

ఏవం గచ్ఛతి కాలే తు తయోస్తు తదనన్తరమ్‌,

కళిఙ్గో జరయా యుక్తం పుత్రం రాజ్యేభిషేచయత్‌. 140

ఇట్లు వారిరువురకు కాలము గడచుచుండగా కళింగుడు ముసలితనము పొంది పుత్రుని రాజ్యమున అభిషేకించెను.

రాజ్యం దత్త్వా వరారోహే యథాన్యాయం కులోద్భవమ్‌,

భుక్త్వా నిష్కంటకం రాజ్యం దత్వా పఞ్చత్వ మాగతః. 141

వంశపు మొలకఅయిన కొడుకునకు న్యాయము ననుసరించి తాను నిష్కంటకముగా అనుభవించిన రాజ్యమును ఒసగి కళింగుడు మరణించెను.

ఏవం ప్రభుఞ్జతే రాజ్యం పితుర్దత్తం యశోర్జితమ్‌,

ఏకాకీ స్వపతే తత్ర యత్ర కశ్చి న్న పశ్యతి. 142

ఇట్లు తండ్రి ఒసగినదియు, తనకీర్తిచే చేతికందినయు నగు రాజ్యమును ఆతడు అనుభవించుచుండెను. ఆమెయు తన్నెవ్వరు చూడని తావున ఒంటరిగా నిద్రించుచుండెను.

స తు దీర్ఘేణ కాలేన కళింగవంశవర్ధనః,

సుతాన్‌ జనయతే పఞ్చ ఆదిత్యవపుషః శుచీన్‌. 143

అంత పెద్దకాలమునకు ఆ కళింగ వంశవర్ధనుడు సూర్యునితో సమానమగు తేజస్సుగల పవిత్రులగు అయిదుగురు పుత్రులను పొందెను.

ఏవం తు మానుషం లోకం మయా మాయా ప్రమోహితమ్‌,

ఆత్మకర్మ సుసంయుక్తం చక్రవత్పరి వర్తతే. 144

ఈ విధముగా నా మాయతో మోహితమైన మనుష్యలోకము తమతమ కర్మములతో చక్కగా కూడుకొని చక్రమువలె తిరుగు చున్నది.

జాతో జన్తు ర్భవేద్‌ బాలో తరుణో భ##వేత్‌,

తరుణో మధ్యమం యాతి పశ్చాద్యాతి జరాయతమ్‌. 145

జనుడు పుట్టుచున్నాడు. పుట్టి బలుడగుచున్నాడు. తరువాత తరుణుడగుచున్నాడు. వెనుక నడిమివయస్సు కలవాడగుచున్నాడు. అటుపై ముదుసలి యగుచున్నాడు.

బాలో వై యాని కర్మాణి కరోతి హ్యవిజానతః,

న స లిప్యతి పాపేన ఏవ మేతన్న సంశయః. 146

బాలుడై తెలియక చేయు కర్మములనుబట్టి పాపముతో అంటు పొందడు. ఇందు సంశయము లేదు.

తత్ర కారయమాణస్య రాజ్యం చాఖిలకణ్టకమ్‌,

సప్త సప్తతి వర్షాణి హ్యతీతాని యశస్విని. 147

అన్నివిధములగు అడ్డంకులతో కూడిన రాజ్యము నట్లత డేలుచుండగా డెబ్బది యేడేండ్లు కడచినవి.

అష్టసప్తతియే వర్షే ఏకాన్తే తు నరాధిపః,

తాం చిన్తాం చిన్తయేత్‌ త్తర మధ్యాహ్నేతు దివాకరః. 148

డెబ్బదియెనిమిదవ ఏట ఆ రాజు ఏకాంతమున సూర్యుడు మధ్యాహ్నమున నుండగా ఆమెను గూర్చి ఆలోచించెను.

మాధవస్య తు మాసస్య వుక్లపక్షేతు ద్వాదశీమ్‌,

బుద్ధిః సంపద్యతే తస్య ప్రియదర్శనలాలసా. 149

వైశాఖమాస శుక్లపక్ష ద్వాదశినాడు ఆతనికి ప్రియురాలిని చూడవలయునను బుద్ధి పుట్టెను.

కోర్థ స్తత్‌ కిం వ్రతంచాస్యా ఏషా స్వపితి నిర్జనే,

నసుప్తాయాం వ్రతం కిఞ్చిద్‌ దృశ్యతే ధర్మసంచయే. 150

ఇందు ప్రయోజనమేమి? ఈ వ్రతమెట్టిది? ఈమె జనులు లేనిచోట నిద్రించెడు వ్రతమేమి? ఏధర్మశాస్త్ర గ్రంథమునను ఇట్టి నిద్రించు వ్రతమేదియు కానరాదే!

న చ విష్ణుకృతం కర్మ న చైవేశ్వర చోదితమ్‌,

మనునా వై కృతో ధర్మ ఏషచైవ నదృశ్యతే. 151

ఇది విష్ణువు చేసిన కర్మము కాదు. ఈశ్వరుడు ఉపదేశించినది కాదు. మనువు ఏర్పాటుచేసిన ధర్మముగా కానరాదు.

న కాశ్యపకృతో ధర్మో మహానపి న యోగినామ్‌,

నతత్ర ఏష విద్యేత యశ్చరేత ఇమం వ్రతమ్‌. 152

కాశ్యపుడు చేసిన ధర్మము కాదు. మహాయోగు లెవ్వరి వ్రతము కాదు. ఈ వ్రతము నాచరించిన వాడెవ్వడు ఇంతవరకు కానరాడు.

బార్హస్పత్యేషు ధర్మేషు యామ్యేషు చ న విద్యతే,

న ఏష విద్యతే తత్ర సుప్తా చరతి యద్ర్వతమ్‌. 153

బృహస్పతి చెప్పిన ధర్మములందు గాని, యముడు బోధించిన ధర్మములందు గాని యిది కానరాదు. ఈమె నిద్రించుచు ఈవ్రతము నాచరించుచున్నది.

భుక్త్వాతు కామభోగాని భుక్త్వాతు పిశితాశనమ్‌,

తాంబూలం రక్త వస్త్రాణి సుసూక్ష్మౌ పట్టవాససీ. 154

నుగన్ధై ర్భూషితం గాత్రం సర్వరత్న సమాయుతమ్‌,

మమ కాన్తా విశాలాక్షీ కిమత్ర వ్రతమ్‌. 155

ఇష్టమైన భోగముల ననుభవించుచు, చక్కని మాంసభోజనములు చేయుచు, తాంబూలము వేసికొని, ఎఱ్ఱని వస్త్రములను, సన్నిని వలిపెములను ధరించి, రత్నమయములగు ఆభరణము లతో నిండిన శరీరమున సుగంధముల లందుకొని ఆ వెడదకన్నుల నాకాంత ఏవ్రతము చేయుచున్నది?

కుప్యతే పి చ దృష్ట్వా వా ప్రియామే కమలేక్షణా,

అవశ్యమేవ ద్రష్టవ్యా చరన్తీ కీదృశం వ్రతమ్‌. 156

కమలముల వంటి కన్నులుగల నా ప్రియురాలు కోపగించి నను తప్పక ఆమె ఎట్టి వ్రతమునుచేయుచున్నదో చూడనే వలయును.

కిన్నరైః సుప్రలక్ష్యేత వశీకరణ ముత్తమమ్‌,

అథ యోగీశ్వరీ భూత్వా గచ్ఛతే యత్ర రోచతే. 157

ఇతరులను వశపరచుకొనెడు కిన్నరుల వ్రతము చేయుచున్నదా? కాక యోగీశ్వరయై యిచ్చవచ్చిన తావున కరుగుచున్నదా?

అథవా చాన్యసంసృష్టా కామరోగేణ చావృతా,

ముహూర్తం స్వపతే ధూర్తా పురుషం చాన్య మాశ్రితా. 158

అట్లుకాక ఇతరుని మరిగి కామరోగముతో పైకొనియున్నదా? లేక ముహూర్తకాలము చెడిపె యై మరియొక పురుషుని అంటి పెట్టుకొని యుండెనా?

ఏవం చిన్తయత స్తస్య అస్తంగతదివాకరే,

సంవృత్తా రజనీ సుభ్రు సర్వ సార్థసుఖావహా. 159

ఇట్లతడు తలచుచుండగా సూర్యుడస్తమించెను. జను లందరకు సుఖము కలిగించు రాత్రి అరుదెంచెను.

తతో రాత్య్రాం వ్యతీతాయాం ప్రభాతసమయే తతః,

పఠన్తి మాగధా వన్దిసుతా వైతాళికా స్తథా. 160

అంత రాత్రి గడువగా వేకువజామురాగా వందులు మాగధులు, వైతాళికులు స్తోత్ర పాఠములు చేయ మొదలిడిరి.

శఙ్ఖదుందుభినాదైశ్చ బోధితో వై నరాధిపః,

సర్వలోకహితార్థాయ ఉదితే చ దివాకరే. 161

సర్వలోకముల మేలుకొరకు సూర్యుడు ఉదయింపగా రాజు శంఖములయు, దుందుభులయు నాదములతో మేల్కాంచెను.

యత్‌ తదా చిన్తితం పూర్వం ద్రష్టుకామేన తాం ప్రియామ్‌,

సర్వచిన్తాం పరిత్యజ్య సా చిన్తా పరివర్తతే. 162

తన ప్రియురాలిని (నిద్రించుచుండగా) చూడవలయునని తాను వెనేకటిదినమున తలచిన ఆ తలపే తక్కిన అన్ని చింతలను పారద్రోలి తిరుగసాగెను.

స్నాతో పస్పృశ్య న్యాయేన క్షౌమనస్త్రేణ చావృతః,

కృత్వా చోత్సారణం చైవ మాజ్ఞాం దత్వా యథోచితామ్‌. 163

వ్రతస్థం మాం తు యః పశ్యే న్నారీ పురుష ఏవనా.

ధర్మయుక్తేన దణ్డన మమ వధ్యోభ##వేత్‌ తు సః. 164

స్నానము చేసి సంధ్యవార్చి తగు విధముగా పట్టుపుట్టములు గట్టిఅందరను తొలగించి తగు విధముగా ఇట్లు ఆజ్ఞను ప్రకటించెను. వ్రతమున నున్న నన్ను స్త్రీగాని, పురుషుడు గాని చూచినచో ధర్మ యుక్తమైన దండముతో ఆవ్యక్తి నాకు చంపదగినది యగును.

ఏవ మాజ్ఞాపయిత్వా తు కళిఙ్గో నృపతిః ప్రభుః,

గతఃస్మ త్వరయా ధీమాన్‌ ప్రవిష్ట స్తత్ర సువ్రతే. 165

ఇట్లాపించి ఆ కళింగనృపతి తొందరతో దీరుడై యాచోటి కరిగి అందు ప్రవేశించెను.

పర్యఙ్కస్య తలే తత్ర రాజా దర్శనలాలసః,

విలోక్య తాం వరారోహం తత శ్చిన్తాపరాయణః. 166

ఆమెను చూడవలయును. ఆస కల ఆ రాజు పాన్పుపై నున్న ఆ సుందరిని చూచి చింతాసక్తు డాయెను.

తతః కమలపత్రాక్షీ వేదనాయాసపీడితా,

రుజార్తా రురుదే తత్ర శిరోవేదనతాడితా. 167

ఆ కమలపత్రాక్షి వేదనతో, ఆయాసముతో, తలనొప్పితో రోగపీడితయై యేడ్చుచుండెను.

కిం మయా తు కృతం కర్మ పూర్వ మేవ సుదుష్కరమ్‌,

యేనాహ మీదృశీం ప్రాప్తా దశాం పుణ్య పరిక్షయాత్‌. 168

నేను పూర్వజన్మమున ఎట్టి చేయరాని పని చేసితినో, నా పుణ్యము తరిగిపోగా ఇట్టి దశను పొందితిని.

భర్తా చ మాం నజానాతి క్లిశ్యమానా మనాథవత్‌,

అథేమం కింతు భర్తా చ మన్యతే స్వజనస్య వా. 169

దిక్కులేనిదానివలె పాటుపడుచున్న నన్ను నా భర్త యెఱుగడు. నాభర్త నన్ను గూర్చి యేమి అనుకొనుచున్నాడో? అతని జనులభావము లెట్టివో?

కథయే కిం శయానీ తు సఖీనాం యత్ర వర్తతే,

తేన తత్ర నయిజ్యేత యన్మయా పరిచిన్తితమ్‌. 170

ఇచట పడియున్న నేను చెలులకేమి చెప్పుదును? నేను తలచెడుతీరు సరికాదను కొందును.

కించ వాత్మని దుఃఖస్య సర్వ మేత న్న యుజ్యతే,

కించమాం వక్ష్యతే భర్తా కిం చ మామితరే జనాః,

అన్యాయేన వ్రతం చీర్ణం సర్వతో వికృతం భ##వేత్‌. 171

కోరి తెచ్చుకొన్నదానికి ఈ దుఃఖము తగదు. భర్త నన్ను గూర్చి యేమి తలచునో? తక్కిన జను లేమనుకొనుచున్నారో? సరికాని విధముగా నేనీవ్రతమును చేపట్టితిని. ఇది అన్నియెడల వికటించినది.

కదాచి దపి కాలస్య గచ్ఛేత్‌ సౌకరకం ప్రతి,

తతో బ్రూయా దిదం వాక్యం యన్మయా హృది వర్తతే. 172

ఏనాటికైన సౌకరక క్షేత్రమునకు పోవలయును. అప్పుడు నామదిలో నున్నమాటను చెప్పవలయును.

తతః ప్రియావచః శ్రుత్వా తత ఉత్థాయ వై నృపః,

దోర్భ్యా మాలిఙ్గ్య వై భార్యాం వాక్య మేతత్‌ ప్రభాషతి. 173

అంత ప్రియురాలి మాటవిని రాజులేచి చేతులతో భార్యను కౌగిలించుకొని యిట్లు పలికెను.

కిమిదం నిన్థసే భ##ద్రే ఆత్మానం న ప్రశంససి,

అశోచ్యా శోచనీయా తు యచ్చ నిందసి చాత్మని. 174

ప్రియా! నిన్ను నీవు ఏల నిందించుకొందువు. మెచ్చుకొనవేల? శోకింపరానిదానవు. శోకింపదగిన దానవేల అయితివి?

భిషజః కిం నవిద్యన్తే అష్టకర్మ సమాయుతాః,

యై స్తు వై సామనీయత ప్రవృద్ధా వేదనా శిరే. 175

ఎనిమిది అంగములు గల వైద్యమున నేర్పుగల వైద్యులు లేరా? పెరిగిన నీ తలపోటును మెల్లగా తొలగింపగలరు కదా!

త్వయా యచ్చాపరాధేన ఏతద్‌ గుహ్యం కృతం మహత్‌,

యేన వై క్లిశ్యసే భ##ద్రే శిరస్యసుఖ పీడితా. 176

ఏదొసగుచేత నీవు దీనిని ఇంత గుట్టుగా నుంచితిని? తలపోటు నిన్ను పీడింపగా ఏల నలిగి పోవుచున్నావు?

వాయునా కఫపిత్తేన శోణితేన కఫేన వా,

సన్నిపాతస్య దోషేణ యేనేదం దూయతే శిరః. 177

వాతరోగమా? కఫముతో కూడిన పైత్యదోషమా? రక్త దోషమా? శ్లేష్మదోషమా? సన్నిపాతమా? దేనితో నీతల నొచ్చుచున్నది?

కాలాకాలాదితత్వజ్ఞా హ్యుపాయజ్ఞా యశస్విని,

అశ్నాసి పిశితం చాన్నం తేనేదం దూయతే శిరః. 178

కాలము, అకాలము అనువాని తత్త్వమెరిగినవారు, ఉపాయములు తెలిసినవారు ఎందరో కలరు. మాంసపు కూడుతిను చున్నావు. దానివలన నీతల నొచ్చుచున్నదేమో?

కృత మత్ర శిరావేధో రక్తం చైవాతిస్రావ్యతే,

దీయతేథ శిరోభ్యంగం కిం నతిష్ఠతి వేదనా. 179

తలనరములను గట్టిగా పొడిచినచో చెడురక్తము వెలువడును. తలకు తైలము మర్దించినచో తలనొప్పి పోవకుండునా?

కి మేతద్‌ గోపితం గుహ్యం మయి పూర్వం నచోదితమ్‌,

త్వయాత్ర వ్రతలక్ష్యేణ చాత్మానం చైవ క్లిశ్యసి. 180

దీనినింత గుట్టుచేసితివి. నాకును మునుపు చెప్పవైతివి. వ్రతమను నెపముతో నిన్ను నీవు హింసించుకొంటివి.

యా త్వం వై భాషసే వాక్యం గచ్ఛ సౌకరకం ప్రతి,

తవైవ కార్యం యద్గుహ్యం యేన బాద్యతి వేదనా. 181

నీలోనీవు సౌకరమునకు పోవుటను గూర్చి మాటాడుకొను చున్నావు. అందు నీవే గుట్టుగా చేయవలసినది కలదేమో! దానిచేతనే వేదన నిన్ను పీడించుచున్నది.

తతః కమలపత్రాక్షీ సవ్రీడా దుఃఖసంవృతా,

ఉభౌ తౌ చరణౌ గృహ్య భర్తారం ప్రత్యభాషత. 182

అంత ఆ కమలపత్రాక్షి సిగ్గుతో దుఃఖముతో కుమిలిపోవుచు ఆతనిరెండు పాదములను పట్టుకొని యిట్లు పలికెను.

కిం ప్రసాదేన రాజేన్ద్ర న త్వం పృచ్ఛితు మర్హసి,

ఇమాం కథాం విశాలాక్ష మమ కర్మానుసారిణీమ్‌. 183

రాజేంద్ర! నీవు అనుగ్రహముతో నన్నడుగ దగదా? ఇది నా పూర్వకర్మ ననుసరించి వచ్చిన విషయము. దీనిని నీవడుగదగును.

తతో భార్యావచః శ్రుత్వా కళిఙ్గానాం జనాధిపః,

ఉవాచ మధురం వాక్యం విహితేనాన్త రాత్మనా. 184

అంత భార్య మాటను విని కళింగజనేశ్వరుడు మనసు కుదుటపరచుకొని తీయగా నిట్లు పలికెను.

కిమిదం గోపసే గుహ్యం మమ చాత్ర యశస్విని,

కథం న కథ్యసే మహ్యం పృచ్ఛమానా యశస్విని. 185

ఓ కీర్తిశాలినీ! ఈ రహస్యమును నాకును దాచెదవేల? అడుగుచున్నను నాకను చెప్పవేల?

సా భర్తు శ్చ వచః శ్రుత్వా విస్మయోత్ఫుల్ల లోచనా,

ఉవాచ మధురం వాక్యం కళిఙ్గానాం జనాధిపమ్‌. 186

భర్త మాట విని విస్మయముతో విప్పారిన కనులుగల ఆమె కళింగ జనాధిపునితో మెల్లగా ఇట్లనెను.

భర్తా ధర్మో యశోభర్తా తథాభర్తా ప్రియేణ చ,

అవశ్య మేవ తద్వాచ్యం యన్మాం త్వం పరిపృచ్ఛసి. 187

భర్తయే ధర్మము, భర్తయే యశస్సు. భర్తయే అన్నింటికంటె ప్రియముతో చూడదగిన వ్యక్తి. నన్ను నీవడిగిన దానిని తప్పక చెప్ప వలసినదే.

నాహం జాతు ప్రవక్ష్యామి తవ హ్యస్మిన్‌ నరాధిప,

ఏత ద్దుఃఖం మహాభాగ యన్మే హృది వివర్తతే. 188

కానీ రాజా! నాహృదయమున ఏమి తిరుగుచున్నదో, ఈ దుఃఖమేమో నేను నీకు ఇందు ఎన్నటికిని చెప్పజాలను.

సుఖే హి వర్తసే నిత్యం మహారాజోసి సున్దరః,

బహ్వ్యో మత్సదృశా భార్యా స్తిష్ఠత్యన్తః పురే తవ,

అశ్నాసి పిశితాన్నాని ఆజ్ఞయా వర్తతే ప్రజాః. 189

నీవు మహారాజవు. నిత్యము సుఖముతో నున్నవాడవు. అందగాడవు. నావంటిభార్యలు నీకు అంతఃపురమున పెక్కండ్రు కలరు. మాంసభోజనములు చేయుచుందువు. ప్రజలు నీమాటపై నడతురు.

త్వం మే దేవో గురుః సాక్షాద్‌ భర్తా యజ్ఞః సనాతనః,

ధర్మశ్చార్థశ్చ కామశ్చ యశః స్వర్గం పతిః స్మృతః,

సర్వ మేవ హి చిన్త్యం మే పృష్టాయాస్తే జనాధిప. 190

నీవు నాకు దేవుడవు. గురువవు. సాక్షాత్తు భర్తవు. సనాతనమైన యజ్ఞమవు. ధర్మము, అర్థము, కామము కీర్తి, స్వర్గము, పాలకుడు - అన్నియు నీవే. రాజా! నీవు అడిగినపుడు ఇదియంతయు నేను చింతింపదగినది.

అవశ్య మేవ వక్తవ్యం కారణం తత్ర చానఘ,

సుముఖే తవరాజేన్ద్ర రాజ్యకామేఖి లేపి వా. 191

రాజేంద్రా! సమస్తమగు రాజ్యమున కోరిక గల సుముఖుడ వగు నీకు ఆ కారణమును తప్పక చెప్పవలయును.

బహవః సన్తి తే భార్యా వేదనాం ప్రష్టు మర్హసి,

అశ్నామి పిశితాన్నాని ఆజ్ఞా మే వర్తతే ప్రభో,

గన్ధభోగాశ్చ విద్యన్తే న మాంత్వం ప్రష్టు మర్హసి. 192

నీకు పెక్కండ్రు భార్యలు కలరు. నీవు వారిని నా వేదనను గూర్చి అడుగదగును. ఇక నేనో మాంసపుకూడులను తినుచున్నాను.

నామాట చెల్లుచున్నది. గంధములు, భోగములు కలవు. అట్టి నన్ను నీవు అడుగరాదు.

తతో భార్యావచః శ్రుత్వా కళిఙ్గానాం జనాధిపః,

ఉవాచ మధురం వాక్యం భార్యాం కమలలోచనామ్‌. 193

అంత భార్య పలికినది విని కళింగ దేశ మహారాజు కమల ములవంటి కన్నులుగల ఆమెతో తీయగా ఇట్లు పలికెను.

శృణు తత్త్వేన మే భ##ద్రే శుభం వా యది నా శుభమ్‌,

అవశ్య మేవ వక్తవ్యం ధర్మ మేతన్న సంశయః. 194

మంచిదానా! శ్రద్ధగా వినుము. అది శుభమో, అశుభమో, నీవు తప్పక చెప్పవలయును. ఇది ధర్మము. సంశయము లేదు.

ఇమాని యాని గృహ్యాని స్త్రీణాం ధర్మపథే స్థితాః,

భర్తారం చ సమాసాద్య రహస్యా గోపయన్తి న. 195

ధర్మమార్గమున నున్న స్త్రీలకు గ్రహింపదగిన వెన్నియున్నను, భర్తను పొందిన పిమ్మట వారు రహస్యములను దాచరు.

కృత్వా సుదుష్కరం కర్మ రాగలోభప్రమోహితా,

యాతు గోపయతే గుహ్యం సతీ సా నోచ్యతే బుధైః. 196

ఎంత దుష్కరమగు పని చేసినను రాగ లోభములకు కక్కుర్తి పడి రహస్యమును దాచునేని ఆమెను పండితులు 'సతి' అనరు.

ఏవం చిన్త్య మహాభాగే బ్రూహి సత్యం యశస్విని,

అధర్మస్తే న భవితా గుహ్యార్థకథనే మమ. 197

దీనిని బాగుగా విచారించి ఓ యశస్వినీ! పుణ్యాత్మురాలా! సత్యమును చెప్పుము. ఆ రహస్యమగు విషయమును నాకు చెప్పుట వలన నీకు అధర్మము కలుగదు.

తతో భర్తృ వచః శ్రుత్వా కాంతీరాజ కులోద్భవా,

ప్రత్యువాచ ప్రియం వాక్యం కళిఙ్గానాం నరాధిపమ్‌. 198

అంత భర్త మాట నాలకించి కాంతీరాజ కులమున పుట్టిన ఆయమ కళింగాధిపతికి ప్రియమగు మాట నిట్లు చెప్పెను.

దేవో రాజా గురూ రాజా సోమో రాజేతి పఠ్యతే,

అవశ్య మేవ వక్తవ్య మేష ధర్మః సనాతనః. 199

రాజే దైవము. రాజుగురువు. రాజు చంద్రుడని గ్రంథము లందు చదువుదురు. తప్పక చెప్పవలయును. ఇది సనాతనమగు ధర్మము.

యది గుహ్యం న తే కార్యం శ్రూయతాం రాజసత్తమ,

జ్యేష్ఠం పుత్రం భిషిఞ్చస్వ మహారాజ్యేవనీశ్వర. 200

నీతో రహస్యము చేయరాని దగునేని, రాజసత్తమా! విను. నీ పెద్దకుమారుని రాజ్యమున నభిషేకింపుము.

దత్వా రాజ్యం చ పుత్రాయ యథాన్యాయం కులోచితమ్‌,

ఏహి నాథ మయా సార్ధం గచ్ఛావః సౌకరం ప్రతి. 201

న్యాయము ననుసరించి కులమునకు తగినట్లుగా రాజ్యమును పుత్రున కొసగి నాతోపాటు రమ్ము. సౌరక్షేత్రమునకు పోదము.

తతో భార్యాదవచః శ్రుత్వా కళిఙ్గానాం జనాధిపః,

బాఢ మిత్యేన వాక్యేన ఛందయామాస సుందరీమ్‌. 202

అంత తన యిల్లాలి పలుకువిని కళింగరాజు అట్లే అని పలికి ఆమెమాట నంగీకరించెను.

అహం దాస్యామి పుత్రాయ స్వం రాజ్యం వచనాత్‌ తవ,

యథాన్యాయేన వై పూర్వం పితుర్లబ్ధ్వా యథక్రమమ్‌, 203

నేను నా తండ్రి నుండి క్రమమైన మార్గమున మునుపు పొందిన రాజ్యమును, నీ మాట మీద కుమారున కొసగెదను.

తే తు తత్ర యథాన్యాయం నిష్క్రాన్తాస్తదనన్తరమ్‌,

రాజా చ రాజపుత్రీ చ అపశ్యన్త తతో జనాన్‌. 204

అంత రాజును, రాజపుత్రియు వెలుపలికి వచ్చిరి. అచట జనులను గాంచిరి.

తత శ్చో చ్చస్వరే ణాథ రాజా తత్ర ప్రభాషతే,

క ఏష తిష్ఠతే ద్వారి శీఘ్రం కఞ్చుకి మాగతమ్‌. 205

అంత రాజు పెద్దకంఠధ్వనితో, ఎవరక్కడ ద్వారము కడనిలిచినది? అని కంచుకిని త్వరగా రమ్మని పిలిచెను.

ప్రస్థాపయ జనాః సర్వే మమ యే పరిచారకాః,

వృత్తం కౌతూహలం యోయం శీఘ్రం యాతు యశస్వినీ. 206

ఈ జనులనందరను, నా పరిచారకులను ఇక్కడ ఉండి పంపివేయుము. ఒక వింత జరిగినది. ఈ కీర్తి శాలిని త్వరగా వెడలుగాక!

తతో హలాహలా శబ్దా హాస్య మన్తః పురా జనాః,

కిమిదం కారణం వాక్యం యేనచోత్సారితావయమ్‌. 207

అంత హలాహలా అను శబ్దము, నవ్వులు అంతఃపుర జనమునుండి వెలువడినవి. మమ్ములను తోలివేయుటకు కారణమే మని వారు పలికిరి.

రాజతో బహవ శ్చిన్తా బహుకార్యాభి సారిణాత్‌,

అశ్రోతవ్యం భ##వేన్నూనం యేన చోత్సారితా వయమ్‌. 208

రాజులకు పెక్కుచింతలు. పెక్కుపనుల తొందరలు కనుక మమ్ముల నెందులకు తొలగద్రోయుచున్నారో మేము వినరాదా?

తతోభ్యోజ్యాన్న పానాని సర్వతో భుఞ్జతే నృపః,

అమాత్యాన్‌ స్థాపయామాస అభిషేకస్య కారణాత్‌. 209

పిమ్మట రాజు పెక్కు విధములగు అన్నపానములను తీసి కొనెను. అభిషేకముకై మంత్రులను ఆయా కార్యములకు నియోగించెను.

సంప్రాప్తాన్‌ సచివాం స్తత్ర రాజా వచన మబ్రవీత్‌,

రాజధానీం విశాలాక్షో రాజశాస్త్ర విశారదః, 210

దృష్ట్వా చైవ మమాత్యాం శ్చ కళింగో ధర్మ సంమతమ్‌,

ఉవాచ మధురం వాక్యం శబ్ద శాస్త్రార్థ నిష్ఠితమ్‌. 211

రాజధానికి వచ్చిన మంత్రులనందరిని చూచి వెడద కన్నులు గలవాడు, రాజనీతిలో ఆరితేరిన వాడునగు కళింగుడు ధర్మముతో కూడినది, శబ్దశాస్త్ర మర్యాదలు తప్పనిది అగు మదుర మగు మాట నిట్లాడెను.

కల్య మిచ్ఛామహే తావత్‌ పుత్రం రాజ్యేభిషేచితుమ్‌,

శిఘ్రం సజ్జయ యత్కార్యం మమ పుత్రాభిషేచనే. 212

రేపు ఉదయమున పుత్రుని రాజ్యము నందభిషేకింప గోరుచున్నాము. కుమారుని అభిషేకమునకు చేయవలసినదానిని వెంటనే సిద్ధపరపుడు.

కృత మిత్యేవ తత్రాహుః సచివా స్తం నరాధిపమ్‌,

అస్మాకం చ ప్రియం చైవ యత్త్వం రాజన్‌ ప్రభాషసే. 213

అంత మంత్రులు రాజుతో అంతయు సిద్ధమే యనిరి. రాజా! నీవు పలికినది మాకును ప్రియమే అనియు పలికిరి.

ఏవ ముక్త్వా గతా మాత్యా అస్తం ప్రాప్తో దివాకరః,

సుఖేన సా గతా రాత్రి ర్గీతగాంధర్వ వాదితైః. 214

ఇట్లు పలికి మంత్రులు వెడలిపోయిరి. సూర్యుడు అస్తమించెను. ఆరాత్రి ఆట పాటలతో సుఖముగా గడచిపోయెను.

బోధితః సచ రాజా తు సూతమాగధవన్దిభిః,

వైతాళికై శ్చ సుశ్రోణి సర్వమంగళ పాఠకైః. 215

సూతులు, మాగధులు, వందులు, వైతాళికులు స్తోత్ర పాఠములతో మంగళ గీతములతో రాజును మేల్కొల్పిరి.

ప్రభాతాయాం తు శర్వర్యా ముదితే చ దివాకరే,

ముహూర్తం శుభమాసాద్య హ్యభిషిక్తో నృపేణ హి. 216

రాత్రి గడచిన పిదప సూర్యుడుదయించినంత శుభ ముహూర్తమున రాజు కుమారు నభిషేకించెను.

ఏవం దత్త్వా తతో రాజ్యం మూర్ధ్ని చాఘ్రాయ ధర్మవిత్‌,

ఉవాచ మధురం వాక్యం పుత్రం పుత్రవతాం వరః. 217

కుమానకు రాజ్యమొసగి ఆతని శిరస్సు మూర్కొని పుత్రులు కలవారిలో శ్రేష్ఠుడు, ధర్మవేత్తయునగు ఆరాజు కొడుకుతో నిట్లనెను.

రాజ్యస్థేనాపి తే పుత్ర కర్తవ్యం శృణు తన్మమ,

యదీచ్ఛేత్‌ పరమం ధర్మం పితౄణాం తారణం తథా. 218

కుమారా! రాజ్య పదవి యందున్న నీకు కర్తవ్య మెట్టిదో నా వలన వినుము. పరమ ధర్మమును, పితృదేవతల ముక్తని కోరినచో నీ విది వినవలయును.

దాత వ్యార్తి ర్న కర్తవ్యా హన్తవ్యాః పారదారికాః,

బాలఘాతాశ్చ హన్తవ్యా హంతవ్యాః స్త్రీ విఘాతకాః. 219

ఈయదగిన వారి యందు ఆర్తిని కలిగించరాదు. పరుల భార్యలను చెరచువారిని, బాలురను, స్త్రీలను హింసించు వారిని కఠినముగా శిక్షింపవలయును.

మా లోభం పరభార్యాసు బ్రాహ్మణీషు కదాచన,

సురూపాం పరనారీం తు దృష్ట్వా చక్షు ర్ని మీలయేత్‌. 220

పరుల భార్యల యందు, ముఖ్యముగా బ్రాహ్మణ స్త్రీల యందు లోభము ఎన్నటికి చేయవలదు. చక్కని రూపము గల పర స్త్రీని చూచి కన్నులు మూసికొనవలయును.

మా లోభః పరద్రవ్యేషు అన్యాయోపార్జి తేషు చ,

న చిరం తిష్ఠతే క్వాపి సర్వే మాత్యాః కదాచన. 221

ఇతరుల ధనములందును, అన్యాయముగా సంపాదించు ధనములందును లోభము కూడదు. మంత్రులందరు సర్వ కాలముల యందును ఒక్క తీరున నిలువరు.

రక్షణీయశ్చ తే దేశః కులన్యాయ యశోర్జితః,

నిత్యోద్యుక్తేన స్థాతవ్య మమాత్య వచనం కురు. 222

కుల ధర్మమును బట్టియు, కీర్తిని బట్టియు నీవు సాధించిన దేశమును రక్షించుకొనవలయును. ఏమరుపాటు లేక నిలువవలయును. మంత్రుల మాటలు పాటింపవలయును.

అమాత్యో యద్‌వచో బ్రూయాత్‌ పుత్ర కార్యం విమర్శనమ్‌,

అవశ్య మేవ కర్తవ్యం శరీర పరిరక్షణమ్‌. 223

మంత్రులు చెప్పినదానిని బాగుగా విమర్శించి చేయవలయును. శరీరరక్షణమును తప్పనిసరిగా చేయవలయును.

ప్రజా యేన ప్రమోదన్తి యేన తుష్యన్తి బ్రాహ్మణాః,

ఏవం తే పుత్ర కర్తవ్యం మమ ప్రియాహితైషిణా. 224

నాకు ప్రియమును, హితమును కోరెడు నీవు ప్రజలను సంతోషపెట్టవలయును. వేదవేత్తలను ఆనందింపజేయవలయును. కుమారా! ఇది నీకు కర్తవ్యము.

సప్త వ్యసన వర్జేత దోషా రాజసుతో మహాః,

యేషు రాజా వినశ్యేత సంపన్నోపి మహాద్యుతిః. 225

ఏడు వ్యసనములను రాజు విడువవలయును. రాజసుతులలో దోషములు మెండుగా నుండును. వానితో ఎంత సంపదగల వాడైను, ఎంతటి తేజశ్శాలి అయినను రాజు నశించును. (1. స్త్రీ 2. జూదము 3. పానము 4. వేట 5. పలుకులలో పరుసదనము. 6. కఠినమైన దండనము 7. సొమ్మును వ్యర్ఘముగా వెచ్చించుట ఇవి సప్త వ్యసనములు.)

వర్జయేత సురాపానం మృగవ్యాం వర్జయేత్‌ సదా,

వా క్పారుష్యం న వక్తవ్యం వృథా వాచం కదాచన. 226

మద్యము త్రావుటను వదలి వేయవలయును. వేటను ఎల్లప్పుడు వదలవలయును. పరుషమైన పలుకు పలుకరాదు. చొల్లువాగుడు ఎన్నటికిని చేయరాదు.

రాజ్యగుహ్యం న వక్తవ్యం దూతభేదం చ వర్జయేత్‌,

వర్జ యే ద్దణ్డ పారుష్య మసద్భిశ్చ సమాగమమ్‌. 227

రాజ్య సంబంధమగు రహస్యమును రట్టు సేయరాదు దూత మనసు విరుగగొట్టరాదు. దండమున పరుసదనమును, చెడువారి సహవాసమును వదలవలయును.

అర్థ దూషణకం చైవ న కర్తవ్యం కదాచన,

అమాత్యం నాప్రియం బ్రూయాద్‌ యఇచ్ఛేద్‌ రాజకర్మణి. 228

ధనమును వ్యర్థపరుపరాదు. రాజకార్యము నెరవేర వలయునన్న కోరిక యున్నచో మంత్రితో అప్రియము పలుకరాదు.

నాహం వారిత మిచ్ఛామి గమనాయ పథేస్థితః,

ఏత న్మే క్రియతాం శీఘ్రం యదీచ్ఛసి మమ ప్రియమ్‌. 229

వెడలిపోవుటకు దారియందున్న నన్ను వారింప వలదు. అది నా కిష్టము కాదు. నాయందు నీ కిష్టమున్నచో వెంటనే దీనిని ఆచరింపుము. (నా యాత్రను అంగీకరింపు మని తాత్పర్యము)

తతః పితు ర్వచః శ్రుత్వా రాజపుత్రో యశస్విని,

ఉభౌ తు పాదౌ సంగృహ్య కారుణ్యాత్‌ ప్రత్యువాచ తమ్‌. 230

అంత తండ్రిమాటవిని రాజపుత్రుడు, ఓ యశస్వినీ! రెండు పాదములను పట్టుకొని దీనముగా ఇట్లు బదులు పలికెను.

మమ కిం తాత రాజ్యేన కోశేన చ బలేన చ,

యత్త్వయా విరహే తాత న శక్నోమి విచేష్టితుమ్‌. 231

నాయనా! నీవు లేనపుడు నాకు రాజ్యమేల? కోశ##మేల? బలమేల? ఏను కాలుచేతులాడించుటకును చాలను.

అభిషేకం రాజశబ్దం మమ సంజ్ఞార్పితం త్వయా,

ఏత న్న బహుమన్యేహం వినా తాత త్వయా హ్యహమ్‌. 232

అభిషేకము, రాజశబ్దము వీనిని నాకు నీవంటగట్టుచున్నావు. నీవు లేని నేను వీనిని గొప్పవిగా భావింపను.

క్రీడామాత్రం విజానామి యేన క్రీడన్తి బాలకాః,

రాజ్యచిన్తాం న జానామి రాజానో యాంతు కుర్వతే. 233

ఏదో ఆటలాడుట మాత్ర మెరుగుదును. బాలకులు క్రీడింతురుగదా! రాజులు చేసెడు రాజ్యచింత యననేమో నాకు తెలియదు.

స రాజా తద్వచః శ్రుత్వా కళిఙ్గానాం మహీపతిః,

ఉవాచ మధురం వాక్యం సామపూర్వం యశస్విని 234

కళింగమహీపతి ఆ మాటను విని మెత్తని మాటలతో ఇట్లు పలికెను.

యద్యేవం భాషసే పుత్ర నాహం జానామి తే వచః,

పుత్ర శిక్షాపయిష్యన్తి పౌరజానపదా స్తవ. 235

కుమారా! ఇట్లాడుదువేమి? నేను నీ పలుకును తెలియకున్నాను. పౌరులు, జానపదులు నీకు అన్నియు నేర్పుదురు.

ఏవం సందిశ్య తం తత్ర సరాజా ధర్మశాస్త్రతః,

గమనం చక్రిరే తత్ర క్షేత్రాయ కృతనిశ్చయః. 236

ఇట్లు ధర్మశాస్త్రానుసారము ఆ రాజు కుమారునిబోధించి గట్టి నిశ్చయము చేసికొని బయలుదేరుటకు సిద్ధమాయెను.

తం ప్రయాన్తం తతో దృష్ట్వా పౌరజానపదా స్తథా,

సకళత్ర సుతా శ్చాపి అనుయాన్తి నరాధిపమ్‌. 237

అట్లు బయలుదేరిన రాజును గాంచి పౌరులు, జానపదులు ఆలు బిడ్డలతో పాటు ఆరాజును వెంటనంటిరి.

హస్త్యశ్వరథయానాని స్త్రియ శ్చాన్తః పుర స్తథా,

హృష్టతుష్టమనాః సర్వే అనుయాన్తి నరాధిపమ్‌. 238

ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, వాహనములు, స్త్రీలు, అంతఃపురము - పొంగులెత్తు ఆనందముతో అందరు రాజు వెంట పోసాగిరి.

అథ దీర్ఘేణ కాలేన ప్రాప్త స్సౌకరకం ప్రతి,

ధనధాన్య సమృద్ధాని ప్రదదౌ తత్ర మాధవి. 239

మాధవీ! పెద్దకాలమున కాతడు సౌకరక క్షేత్రమును చేరుకొనెను. ధనములను, ధాన్యములను, పెద్ద యెత్తున దాన మొసగెను.

ఏవం చ గచ్ఛతే కాల స్తత్ర తస్య వసుంధరే,

వర్తమానే యథాన్యాయం ధర్మేణ చ క్రియాపరమ్‌. 240

వసుంధరా! ఈవిధముగా ధర్మసంబంధములగు కార్యకలాపముతో న్యాయము తప్పని రీతితో అతనికి కాలము గడచుచున్నది.

తతః సపద్మపత్రాక్షః కళిఙ్గనాం జనాధిపః,

ఉవాచ మధురం వాక్యం కాన్తీరాజసుతాం తదా. 241

అంత నొకనాడు పద్మముల రేకుల వంటి కన్నులు గల ఆ కళింగరాజు కాంతీరాజసుతతో తీయగా ఇట్లు పలికెను.

పూర్ణం వర్షమహస్రం వై జీవితం మమ సుందరి,

బ్రూహి తత్‌ పరమం గుహ్యం యన్మయా పూర్వ పృచ్ఛితమ్‌. 242

సుందరీ! నా జీవితమున వేయి యేండ్లు నిండినవి. నిన్ను నేనడిగిన ఆ పరమ రహస్య మేమియో చెప్పుము.

తతో భర్తుర్వచః శ్రుత్వా ప్రహసిత్వా శుభేక్షణా,

ఉభౌ తౌ చరణౌ గృహ్య రాజానం వాక్యమబ్రవీత్‌. 243

అంత పతిమాట విని నవ్వి ఆ శుభేక్షణ ఆతని రెండు పాదములను పట్టుకొని రాజుతో ఇట్లు పలికెను.

ఏవమేత న్మహాభాగ యన్మాం త్వం పరిపృచ్ఛసి,

ఉపవాసం త్రిరాత్రం తు పశ్చా చ్ఛ్రోష్యసి పుంగవ. 244

పుణ్యాత్మా! నీవడిగినది అది యట్లే యగును. మూడు రాత్రుల ఉపవాసము తరువాత దానిని విందువు.

బాఢ మిత్యేవ రాజా స ప్రత్యువాచ యశస్విని,

పద్మపత్ర విశాలాక్షి పూర్ణచంద్ర నిభాననే. 245

ఓ యశస్వినీ! పద్మపత్ర విశాలాక్షీ! నిండుచంద్రుని బోలు మోము కలదానా! ఆ రాజు 'సరే' అని ఆమెకు బదులు పలికెను.

దన్తకాష్ఠం తతో గృహ్య ద్వాదశాఙ్గుళ మేవ చ,

ఉపవిశ్య విధానేన సోపవాసం సమాచరేత్‌. 246

పండ్రెండంగుళముల పలుదోము పుల్లను గ్రహించి చక్కగా కూర్చుండి విధిననుసరించి ఆమె ఉపవాసమును ప్రారంభించెను.

గతే తత్ర త్రిరాత్రే తు స్నాతౌ క్షౌమవిభూషితౌ,

ప్రణమిత్వా తు తౌ విష్ణుం దంపతీ తదనన్తరమ్‌. 247

మూడు రాత్రులు కడచిన పిమ్మట ఆ దంపతులిద్దరు స్నానమాచరించి తెల్లనివస్త్రములు ధరించి విష్ణుదేవునకు ప్రణమిల్లిరి.

తత స్సర్వాణి రత్నాని విముచ్య చ శుభాననా,

ప్రదదౌ సున్దరీ మహ్యం యత్ర గాత్రేషు సంస్థితిః. 248

అంత చక్కని మోము గల ఆ సుందరి తన రత్నాభరణము లన్నింటిని తీసి నా ఆయా అవయవముల యందు సమర్పించెను.

త్య క్తాభరణసర్వాఙ్గీ ప్రత్యువాచ జనేశ్వరమ్‌,

ఏహ్యేహి నాథ గచ్ఛామో యత్‌ త్వయైవ మనీషితమ్‌. 249

ఆ భరణములన్నింటిని తీసి వైచిన ఆ కాంత రాజుతో నాథా! రమ్ము, రమ్ము నీవు కోరినచోటి కరుగుదము. అని పలికెను.

తతోహస్తే పతిం గృహ్య ఉత్థాయ చ యశస్వినీ,

ఉవాచ మధురం వాక్యం కళిఙ్గాధిపతిం తథా. 250

అంత ఆ కీర్తిశాలిని భర్త చేతిని చేతితో పట్టుకొని లేచి తీయగా ఆ కళింగరాజుతో ఇట్లు పలికెను.

సృగాలీ పూర్వ మేవాహం తిర్యగ్యోని వ్యవస్థితా,

విద్ధాస్మి సోమదత్తేన బాణన మృగలిప్సునా. 251

రాజా! నేను పూర్వజన్మమున ఆడునక్కను. పశు జాతి దానను. మృగమును పొందగోరిన సోమదత్తుడు బానముతో నన్ను కొట్టెను.

ఏతం శిరసి మే రాజన్‌ పశ్య బాణం సుసంస్థితమ్‌,

యస్య దోషేణ మయ్యే షా రజస్తమ వశానుగా. 252

రాజా! ఇదిగో నాతలయందు నాటుకొనియున్న ఈ బాణమును చూడు. దీనిదోషము వలన నేను రజస్సు, తమస్సులకు వశ##మై పోయితిని.

కాన్తీ రాజకులే జన్మ పిత్రా దత్తా తవ ప్రియా,

గచ్ఛ రాజన్‌ యథాన్యాయం పరాం సిద్ధిం నమోస్తుతే. 253

కాంతీరాజకులమున నా పుట్టుక అయినది. నా తండ్రి నన్ను నీ కొసగెను. నేను నీకు క్రపియ నయితిని. రాజా! పద్ధతి ప్రకారము నీవు పరమసిద్ధి కరుగుము. నీకు నమస్కారము.

తతః స పద్మ పత్రాక్షః కళిఙ్గానాం జనాధిపః,

శ్రుత్వా వాక్యం మహారాజో విశుద్ధేనా న్తరాత్మనా,

ఉవాచ మధురం వాక్యం తాం ప్రియాం చారుహాసినీమ్‌. 254

అంత తామరరేకుల వంటి కన్నులు గలా కళింగరాజు ఆ మాట విని విశుద్ధమైన అంతరంగముతో మనోహరమగు నవ్వుగల తనప్రియురాలితో తీయగా ఇట్లు పలికెను.

అహం గృధ్రో మహాభాగే ఏవం వనవిచారిణా,

తేనైవ సోమదత్తేన ఏకబాణ నిపాతితః. 255

మహాభాగా! నేను గ్రద్దను. ఆడవియందు తిరుగుచున్న ఆ సోమదత్తుడే ఒక్క బాణముతో నన్ను కూలవేసెను.

తతో హ మపి సుశ్రోణి కలిఙ్గాధిపతి ర్నృపః,

లబ్ధా చ పరమా వ్యుష్టిః రాజ్యం చ ప్రాపితం మయా,

లబ్ధా సిద్ధి ర్వరారోహే మయా సర్వాఙ్గసుందరి. 256

అందువలన నేనును ఓ సుశ్రోణీ! కళింగదేశపు నృపతినయితిని. గొప్ప భాగ్యము, రాజ్యము నాకు లభించినది. సర్వాంగ సుందరీ! సిద్ధియు నాకు దొరకినది.

అకామఘాతితో భ##ద్రే చరతా వై మహౌజసే,

ప్రాప్తోస్మి పరమాం సిద్ధిం రాజ్యలక్ష్మీం చ ప్రాపితః. 257

గొప్ప సత్తువతో తిరుగుచు నేనొకనాడు కోరుకొనకయే యిచట మరణము పొంది పరమసిద్ధిని, రాజ్యలక్ష్మిని పొందగలిగితిని.

ఏహికాన్తే మయా సార్థం కురు కర్మాణి సున్దరి,

యే చ భాగవతాః శ్రేష్ఠా యే చ నారాయణప్రియాః. 258

పౌరజానపదాః సర్వే శ్రుత్వా తు తదనన్తరమ్‌,

లాభాలాభౌ పరిత్యజ్య తేపి కర్మాణి కారయేత్‌. 259

కాంతా! రమ్ము. నాతోపాటు పూజలను చేయుము అని పలికెను. శ్రేష్ఠులైన భగవద్భక్తులు, నారాయణ ప్రియులు, పౌరులు, పల్లెలవారు అందరు లాభనష్టములను లెక్కగొనక పూజలు చేసిరి.

తేపి దీర్ఘేన కాలేన ఘటమానాత్మనో గతిమ్‌,

కృత్వా తు విమలం కర్మ సర్వే పఞ్చత్వ మాగతాః. 260

వారందరు పెద్దకాలమునకు తమగతిని కూర్చుకొనుచు నిర్మలమగు కర్మము లాచరించి దేహములను వదలిరి.

శ్వేతద్వీపం తతః ప్రాప్తః సర్వే చైవ చతుర్భుజాః,

సర్వే శఙ్ఖధరా శ్చైవ సర్వేచాయుధ సంయుతాః. 261

వారందరు నాలుగుభుజములవారు, శంఖచక్రములను దాల్చినవారు, ఆయుధములతో కూడినవారునై శ్వేతద్వీపమున కరిగిరి (విష్ణు సారూప్యమును సామీప్యమును పొందిరని భావము)

యాః స్త్రియశ్చ వరారోహే స్తుతిమాన్యా మహౌజసః,

శ్వేతద్వీపే ప్రమోదన్తి సర్వభోగ సమన్వితాః. 262

అందలి స్త్రీలందరు శ్వేతద్వీపమున అన్నిభోగములతో కూడిన వారై స్తుతులచే మన్నింపదగిన వారు, గొప్ప దేహశక్తి కలవారునై పరమానంద మందిరి.

ఏవం తే కథితా భూమి వ్యుష్టిః సౌకరకే మహత్‌,

అకామపతితా శ్చైవ వ్వేతద్వీప ముపాగతాః. 263

భూదేవి! సౌకరకక్షేత్రమునందలి మహాభాగ్యమును గూర్చి నీకు చెప్పితిని. కోరకయే అందు మరణించిన వారు కూడా శ్వేత ద్వీపమున కరుగుచున్నారు.

య ఏతేన విధానేన వాసం తీర్థేతు కారయేత్‌,

మరణం చ విశాలక్షి శ్వేతద్వీపం సగచ్ఛతి. 264

ఈ విధానముతో ఆ తీర్థమున నివాసము కల్పించుకొని మరణము పొందెడు వాడు, విశాలాక్షీ! తప్పక శ్వేతద్వీపమున కరుగును.

అన్యచ్చ తే ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

స్నానా చ్ఛాఖోటకే తీర్తే తత్ర్పాప్నోతి సమాధవి. 265

వసుంధరా! మరియొక విషయమును చెప్పెదను. వినుము. శాఖోటక తీర్థమున స్నానము చేసిన పుణ్యఫలమెట్టిదో చెప్పెదను. వినుము.

దశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ,

నన్దనం వన మాశ్రిత్య మోదతే తత్ర వై సదా. 266

పదునొకండు వేల యేండ్లు అట్టివాడు నందనవనమును పొంది ఎల్లప్పుడు ఆనందమందుచుండును.

తతః స్వర్గాత్‌ పరిభ్రష్టో జాయతే విపులే కులే,

మద్భక్త శ్చైవ జాయేత ఏవ మేతన్న పంశయః. 267

అటుపై స్వర్గమునుండి తిరిగి వచ్చి గొప్ప కులమున నాభక్తుడై పుట్టును. సంశయము లేదు.

పునరన్యత్‌ ప్రవక్ష్యామి స్నాతో గృధ్రవటే నరః,

యత్ఫలం సమవాప్నోతి స్నాతమాత్రః కృతోదకః. 268

మరియొక విషయమును చెప్పెదను. గృధ్రవటమున స్నానము చేసి నీరుపుచ్చుకున్న మాత్రమున నరుడు పొందు ఫలమెట్టిదో చెప్పెదను.

నవవర్ష సహస్రాణి నవవర్షశతాని చ,

ఇన్ద్రలోకం సమాసాద్య మోదత సహదైవతైః. 269

తొమ్మిదివేల తొమ్మిది వందల యేండ్లు ఇంద్రలోకమున నుండి దేవతలతోపాటు ఆనందము పొందుచుండును.

ఇన్ద్రలోకాత్‌ పరిభ్రష్టో మమ తీర్థప్రభావతః,

సర్వసఙ్గం పరిత్యజ్య మద్భక్త శ్చైవ జాయతే. 270

ఇంద్రలోకము నుండి తిరిగివచ్చి నా తీర్థ ప్రభావమువలన తగులములన్నింటిని వదలి వైచి నాభక్తుడై పుట్టును.

ఏతత్‌ తే కథితం భ##ద్రే స్నానమాత్రస్య యత్ఫలమ్‌,

యత్‌ త్వయా పృచ్ఛితం పూర్వం సర్వసంసారమోక్షణమ్‌. 271

దేవీ! నీవు మున్ను నన్నడిగిన స్నానమాత్ర ఫలమును, సంసారలంపటములన్నింటిని వదలించు దానిని, నీకు వివరించితిని.

తతో నారాయణా చ్ఛ్రుత్వా పృథివీ సంశితవ్రతా,

ఉవాచ మదురం వాక్యం లోకనాథం జనార్దనమ్‌. 272

శుద్ధమగు వ్రతములు గల భూదేవి నారాయణునివలన ఈ విషయములన్నింటిని విని లోకనాథుడగు జనార్దనునితో మధురముగా ఇట్లు పలికెను.

కిం తేన వికృతం కర్మ ఏన తీర్థత్వ మాప్యతే,

ఏత దాచక్ష్వ తత్త్వేన రహస్యం పర ముత్తమమ్‌. 273

ఆతడు చేసిన విశిష్ట కర్మమెట్టిది? దానివలన అతడు తీర్థత్వమును పొందెను గదా! ఈ ఉత్తమమైన పరమరహస్యమును నా కెరిగింపుము.

తతో మహీవచః శ్రుత్వా సర్వలోకప్రభు ర్హరిః,

ఉవాచ మధురం వాక్యం ధర్మకామాం వసుంధరామ్‌. 274

సర్వలోకములకు ప్రభువైన హరి భూదేవి వాక్యమును విని ధర్మము నందు కోరిక గల వసుంధరతో ఇట్లు పలికెను.

శృణు తత్వేన మే దేవింన్మాం త్వం పరిచ్ఛసి,

తిర్యగ్యోని మనుప్రాప్తౌ ఉభౌతౌ గృధ్ర జమ్బుకౌ. 275

దేవీ! నీవు నన్నడిగిని దానికి బదులు చెప్పెదను వినుము. ఆ గ్రద్ధయు, నక్కయు పశుజన్మమును పొందినవి కదా!

జన్మాంతరార్జితతైః పుణ్యౖ స్తీర్థస్నానజపాదిభిః,

మహాదానైశ్చ లభ్యేత తీర్థే పఞ్చత్వ మర్చకైః.|| 276

పెక్కు జన్మములలో సంపాదించిన పుణ్యముల చేతను, తీర్థ స్నాన జపాదులచేతను, మహాదానముల చేతను, నాభక్తులు తీర్థమున మరణము పొందుదురు.

జన్మాంతరకృతం కర్మ యత్‌ స్వల్ప మపి వా బహు,

తత్కదాచిత్‌ ఫలత్యేవ న తస్య పరిసంక్షయః. 277

వెనుకటి జన్మములలో చేసిన కర్మయు తక్కువదియో ఎక్కువదియో అది ఎప్పటికైనను ఫలించియే తీరును. దానికి పూర్తిగా నశించుట యనునది యుండదు.

కదాచిత్‌ స సహాయం వై పుణ్య తీర్థాదిదర్శనాత్‌,

దుర్బలం ప్రబలం భూత్వా ప్రబలం దుర్బలం భ##వేత్‌,

పాపాంతరం సమాపసాద్య గహనా కర్మణో గతిః. 278

ఒకప్పుడు పుణ్యతీర్థములు మొదలగు వానిని దర్శించుట వలన కలిగిన పుణ్యము మరింతతోడు తెచ్చుకొని ప్రబలమైనది దుర్బలమగును. కర్మపు గతి అర్థము కానట్టిది.

య దల్పమపి దృశ్యేత తన్మహత్వాయ కల్పతే,

అత ఏవ మనుష్యత్వం ప్రాప్తం రాజత్వ మేవ చ,

సృగాలీ చైవ గృధ్రశ్చ తీర్థసై#్యవ ప్రభావతః. 279

చాల తక్కువదిగా కన్పట్టునది గొప్పది యగుటకును సమర్థమగును. అందువలననే తీర్థముప్రబావమువలన ఆ నక్కకును, గ్రద్ధకును మనుష్యత్వమే కాదు, రాజత్వము కూడ ప్రాప్తించినది.

మరణాదేవ సంప్రాప్య క్షీణపాపౌ స్మృతిం పునః,

శ్వేతద్వీపం తతః ప్రాప్తౌ జానీహి త్వం వసుంధరే. 280

తీర్థమున కేవలము చనిపోయిన మాత్రమున వారు నశించిన పాపము కలవారై, పూర్వజన్మ స్మరణము పొంది శ్వేతద్వీపమునకు చేరుకొనిరి. వసుంధరా! నీవు దీనిని తెలిసికొనుము.

పునరన్యత్‌ ప్రవక్ష్యామి తచ్ఛ్రుణుష్వ వసుంధరే,

తీర్థం వైవస్వతం నామ ఆదిత్యో యత్ర తప్యతే,

తేన తప్తం మహాభాగే పుత్రార్థేన యశస్విని. 281

వసుంధరా! మరియొక విషయమును చెప్పెదను. ఆదిత్యుడు తపస్సు చేసిన తావు వైవస్వత తీర్థమను పేరు పొందినది. యశస్వినీ! అతడు పుత్రుని కొరకు తపము నాచరించెను.

దశవర్షసహస్రాణి చాన్ద్రాయణపరో భవత్‌,

తతః సప్త సహస్రాణి వాయుభక్షః సమాశ్రితః,

తత స్తుష్టోస్మ్యహం భ##ద్రే ఆదిత్యస్య మహౌజసః. 282

పదివేల యేండ్లాతడు చాంద్రాయణ వ్రతమున శ్రద్ధ కల వాడాయెను. పిదప ఏడువేల యేండ్లు వాయుభక్షుడైతపము చేసెను. అంత గొప్ప శక్తి కల ఆ సూర్యుని విషయమున నేను తుష్టుడనైతిని.

వరేణ ఛందయామాస ఆదిత్యం తదనన్తరమ్‌,

వివస్వంతం మహాభాగం మమ కర్మపరాయణమ్‌,

ఏవం బ్రూహి మహాతేజా యత్త్వయా మనసే ప్సితమ్‌. 283

అటుపై ఆదిత్యుని వరము కోరుకొమ్మంటిని. ఓయి మహా తేజశ్శాలీ! నీ మనసున నున్న కోరికయేమో తెలుపుమని మహానుభావుడు,నా ఆరాధనయందు శ్రద్ధకలవాడు నగు వివస్వంతునితో పలికితిని.

తతో మమ వచః శ్రుత్వా కశ్యపస్య సుతో బలీ,

మధురం స్వర మాదాయ ప్రత్యువాచ మహద్వచః. 284

అంతనా మాటవిని మహాబలము గల కశ్యపపుత్రుడు చక్కని కంటస్వరముతో గొప్పమాట నిట్లు పలికెను.

యది దేవ ప్రసన్నోసి ఏవం మే దీయతాం వరః,

పుత్ర మిచ్ఛామి తే దేవ త్వత్ర్పసాదేన కేశవ. 285

దేవా నాయెడ ప్రసన్నుడ వైతివేని ఈ వరమొసగుము. నీ దయవలన నాకొక పుత్రుడు కలుగవలయును.

వివస్వ ద్వచనం శ్రుత్వా వరకామస్య సున్దరి,

భాషితం చ మయా వాక్యం విశుద్ధే నాన్తరాత్మనా. 286

వరము కోరెడు సూర్యుని పలుకు విని, సుందరీ! నిర్మలమగు మనస్సుతో నేనిట్లంటిని.

ఏవ మేత న్మహాభాగ భవిష్యతి న సంశయః,

యమశ్చ యమునా చైవ భవిష్యేతే న సంశయః. 287

మహానుభావా! అది అట్టిదే యగును. నీకు యముడు, యమున అనుసంతానము కలుగుదురు. సంశయము లేదు.

ఏవం తస్య వరం దత్వా ఆదిత్యస్య వసుంధరే,

ఆత్మయోగ ప్రభావేన తత్రై వాన్తరధీయత. 288

వసుంధరా! ఇట్లు ఆ సూర్యునకు వరమొసగి నాదైన యోగము ప్రభావముతో అక్కడనే అంతర్ధానము చెందితిని.

ఆదిత్యో పి గతో భ##ద్రే వేశ్మ చైవ మహాధనమ్‌,

పుణ్య సౌకరకే చైవ కృత్వా కర్మ సుదుష్కరమ్‌. 289

ఎవ్వరికిని చేయనలవి కాని కర్మమును ఆ సౌకరకక్షేత్రమున చేసి ఆదిత్యుడును గొప్ప విలువ కల తన గృహమున కరిగెను.

అష్టమేన తు భ##క్తేన యస్తు స్నాతి వసుంధరే,

దశవర్ష సహస్రాణి ఆదిత్యేషు ప్రమోదతే. 290

రెండురోజులు ఉపవాసముండి ఆ తీర్థమున స్నానము చేయువాడు పదివేలయేండ్లు ఆదిత్య లోకములలో ఆనంద మందును.

అథవా మ్రియతే తత్ర తీర్థే వైవస్వతేశుభే,

న స గచ్ఛతి సుశ్రోణి యమస్య భవనం క్వచిత్‌. 291

లేదా, ఆ వైవస్వతతీర్థమున మరణించినవాడు యమునింటికి ఎన్నటికిని పోడు.

ఏతత్‌ తే కథితం భ##ద్రే స్నానం తీర్థే వివస్వతే,

మరణ చ ప్రవక్ష్యామి యత్ఫలం శుభలోచనే. 292

భూదేవీ! చల్లని చూపులదానా! వైవస్వత తీర్థమున స్నానము,మరణము లభించువాడు పొందెడు ఫలమును గూర్చి నీకు చెప్పితిని.

కృత్వా త్వనశనం చైవ దినాని దశ పఞ్చ చ,

సర్వసఙ్గం పరిత్యజ్య మమలోకం స గచ్ఛతి. 293

పదునైదు దినము లచట ఉపవాసముండినవాడు అన్ని తగులములను వదలివైచి నా లోకమున కరుగును.

ఏతత్‌ తే కథితం భ##ద్రే తీర్థే వైవస్వతే ఫలమ్‌,

యథావృత్తం పురా తత్ర క్షేత్రే సౌకరే మమ. 294

మంచిదానా! వైవస్వత తీర్థఫలమును నీకు చెప్పితిని. సౌకరక క్షేత్రమున జరిగిన వృత్తమును నీకు వివరించితిని.

ఆ ఖ్యానానాం మహాఖ్యానం క్రియాణాం చ మహాక్రియా,

ఏష జప్యః ప్రమానశ్చ సంద్యోపాసన మేవచ,

ఏష వేదా శ్చ మన్త్రాశ్చ సర్వం భాగవతప్రియమ్‌. 295

ఇది ఆ ఖ్యానములలో గొప్ప ఆఖ్యానము. క్రియలలో మహా క్రియ. ఇది జపింపదగినది. ప్రమాణమైనది. సంద్యను ఉపాసించుట వంటిది. ఇది వేదములు, మంత్రములు. ఇది యంతయు భాగవతులకు ప్రియమైనది.

పిశునాయ న దాతవ్యం మూర్ఖే భాగవతే న తు,

న చ వైశ్యాయ శూద్రాయ యే నజానన్తి మాం పరమ్‌. 296

దీనిని పిసిని గొట్టునకు ఒసగరాదు. భాగవతుడైను మూర్ఖుడైన వానికి, అట్టి వైశ్యునకు, శూద్రునకు, నన్నెరుగనివారికి ఒసగరాదు.

పణ్డితానాం సభామధ్యే యేచ భాగవతా భువి,

పఠేద్‌ బ్రాహ్మణ మధ్యే తు యేచ వేదవిదాం వరాః. 297

పండితుల సభ నడుమను, భాగవతుల కడను, వేద మెరిగిన వారిలో శ్రేష్ఠులగు బ్రాహ్మణులకడను దీనిని చదువ వలయును.

దీక్షితాయైవ దాతవ్యం యే చ శాస్త్రాణి జానతే,

ఏతత్‌ తే కథితం భ##ద్రే పుణ్యం సౌకరకే మహత్‌. 298

చక్కగా శాస్త్రముల నెరిగిన నిష్ఠకలవారికి మాత్రమే దీని నొసగవలయును. మంచిదానా! సౌకరకక్షేత్రపు గొప్ప పుణ్యమును నీకెరిగించితిని.

య ఏతత్‌ పఠతే సుభ్రు కల్య ముత్థాయ నిత్యశః,

తేన ద్వాదశ వర్షాణి చిన్తితోహం న సంశయః,

న స జాయతే గర్భేషు సంసారం చ న గచ్ఛతి. 299

ఉదయమున లేచి ప్రతిదినము దీనిని పారాయణము చేయువాడు పండ్రెండు సంవత్సరములు నన్ను భావించిన వాడగును. అతడు మరల గర్భముల యందు పుట్టడు. సంసారమున చిక్కడు.

పఠితం హ్యేక మధ్యాయం తారయేత కులాన్‌ దశ,

సర్వసంసారమోక్షాయ కిమన్యత్‌ పరిపృచ్ఛసి. 300

ఈ ఒక అధ్యాయమును పఠించుట వలన పదితరముల వారిని తరింపజేయును. సమస్తమగు సంసారము నుండి విముక్తి పొందును. వసుంధరా! ఇంకనేమి అడుగుదువు?

ఇతి శ్రీ వరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తత్రింశతదధిక శతతమోధ్యాయః.

ఇది శ్రీ వరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటముప్పది యేడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters