Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రయోదశో%ధ్యాయః

ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట

వ్యాస ఉవాచ |

భో బ్రహ్మన్‌ భగవన్‌ పూర్వం శ్రుతం మే బ్రహ్మపుత్రక | జలంధరం మహాదైత్య మవధీచ్ఛంకరః ప్రభుః || 1

తత్త్వం వద మహాప్రాజ్ఞ చరితం శశి మౌలినః | విస్తారపూర్వకం శృణ్వన్‌ కస్తృప్యేత్తద్యశో%మలమ్‌ || 2

వ్యాసుడిట్లు పలికెను -

ఓయీ పూజ్య బ్రాహ్మణా ! బ్రహ్మకుమారా! శంకరప్రభువు జలంధరుడను మహారాక్షసుని సంహరించెనని నేను పూర్వము వినియంటిని (1). ఓ మహాప్రాజ్ఞా! ఆ వృత్తాంతమును నీవు విస్తారముగా చెప్పుము. చంద్రశేఖరుని నిర్మలమగు కీర్తిని వినువాడు ఎవ్వాడు తృప్తిని చెందును? (2)

సూత ఉవాచ |

ఇత్యేవం వ్యాసంసపృష్టో బ్రహ్మపుత్రో మహామునిః | ఉవాచార్థవదవ్యగ్రం వాక్యం వాక్యవిశారదః || 3

సూతుడిట్లు పలికెను -

బ్రహ్మ పుత్రుడు, మహర్షి, వాక్యనిపుణుడునగు సనత్కుమారుడు వ్యాసునిచే ఇట్లు ప్రశ్నింపబడినవాడై తొందరపాటు లేని అర్థవంతమైన వాక్యమును ఇట్లు పలికెను (3).

సనత్కుమార ఉవాచ -

ఏకదా జీవశ##క్రే చ భక్త్యా పరమయా మునే | దర్శనం కర్తుమీశస్య కైలాసం జగ్మతుర్భృశమ్‌ || 4

అథ గుర్వింద్రయోర్‌ జ్ఞాత్వాగమనం శంకరః ప్రభుః | పరీక్షితుం తయోర్‌ జ్ఞానం స్వదర్శనరతాత్మనోః || 5

దిగంబరో%థ తన్మార్గమారుద్ధ్య సద్గతిస్సతామ్‌ | టాబద్ధేన శిరవసాతిష్ఠత్సంశోఖితాననః || 6

అథ తౌ గురుశక్రౌ చ కుర్వంతౌ గమనం ముదా | ఆలోక్య పురుషం భీమం మార్గమధ్యే%ద్భుతాకృతిమ్‌ || 7

మహాతేజస్వినం శాంతం జటా సంబద్ధమస్తకమ్‌ | మహా బాహుం మహోరస్కం గౌరం నయన భీషణమ్‌ || 8

అథో పురందరోపృచ్ఛత్‌ స్వాధికారేణ దుర్మదః | పురుషం తం స్వమార్గాంత స్థిత మజ్ఞాయ శంకరమ్‌ || 9

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మహర్షీ ! ఒకప్పుడు బృహస్పతి, మరియు ఇంద్రుడు పరమభక్తితో ఈశ్వరుని దర్శించగోరి వేగముగా కైలాసమునకు బయలుదేరిరి (4). తన దర్శనమునాకాంక్షించే మనస్సు గల ఇంద్ర బృహస్పతులు బయలు దేరిన సంగతిని ఎరింగిన శంకరప్రభుడు వారి జ్ఞానమును పరీక్షింప గోరి (5), వారి మార్గమునకు అడ్డముగా దిగంబరుడై నిలబడి యుండెను. సత్సురుషులకు శరణ్యుడు అగు శివుడు వెనుకకు కట్టబడిన జటలతో ప్రకాశించు ముఖము గలవాడై నిలబడి యుండెను (6). అపుడా ఇంద్రబృహస్పతులు ఆనందముతో పయనిస్తూ, మార్గమధ్యములో అద్భుత భయంకరాకారము గల పురుషుని గాంచిరి (7). అతడు మహాతేజశ్శాలి, శాంతుడు, జటలతో కట్టబడిన శిరస్సు గలవాడు, పెద్ద బాహువులు గలవాడు, విశాలమగు వక్షస్థ్సలము గలవాడు, గౌరవర్ణము గలవాడు, మరియు భయంకరముగు కన్నులు గలవాడు (8). తమ మార్గమునకు అడ్డుగా నున్న ఆ పురుషుడు శంకరుడే నని యెరుంగక, అధికారముచే గర్వితుడై యున్న ఇంద్రుడు అప్పుడు అతనితో నిట్లనెను (9).

పురందర ఉవాచ |

కస్త్వం భోః కుత ఆయాతః కిం నామ వద తత్త్వతః | స్వస్థానే సంస్థితశ్శంభుః కిం వాన్యత్ర గతః ప్రభుః || 10

ఇంద్రుడిట్లు పలికెను -

ఓయీ! నీవెవరిని? ఎచటనుండి వచ్చితివి? నీ పేరేమి? సత్యమును పలుకుము. శంబుడు తన ధామునందే ఉన్నాడా? లేక ఆ ప్రభుడు ఎచటి కైననూ వెళ్లియున్నాడా? (10)

సనత్కువార ఉవాచ |

శ##క్రేణత్థం స పృష్టస్తు కించిన్నోవాచ తాపసః | శక్రః పునరపృచ్ఛద్వై నోవాచ స దిగంబరః || 11

పునః పురందరో%పృచ్ఛల్లోకానా మధిపేశ్వరః | తూష్ణీమాస మహాయోగీ లీలారూపధరః ప్రభుః || 12

ఇత్థం పునః పునః పృష్టశ్శక్రేణ స దిగంబరః | నోవాచ కించిద్భగవాన్‌ శక్రజ్ఞాన పరీక్షయా || 13

అథ చుక్రోధ దేవేశ##సై#్త్రలోక్యైశ్వర్యగర్వితః | ఉవాచ వచనం చైవ తం నిర్భర్త్స్య జటాధరమ్‌ || 14

సనత్కుమారుడిట్లు పలికెను -

ఇంద్రుడిట్లు ప్రశ్నించగా ఆ తాపసుడు ఏమియూ పలుకలేదు. ఇంద్రుడు మరల ప్రశ్నించగా ఆ తాపసుడు సమాధానము నీయలేదు (11). లోకములకు ప్రభువగు ఇంద్రుడు మరల ప్రశ్నించెను. మహాయోగి, లీలచే వివిధరూపములను దరించువాడు అగు ఆ ప్రభుడు మిన్నకుండెను (12). ఈ విధముగా ఇంద్రుడు అనేక పర్యాయములు ప్రశ్నించెను. కాని దిగంబరుడగు ఆ భగవానుడు ఇంద్రుని జ్ఞానమును పరీక్షింప గోరి, ఏమియు పలుకలేదు (13). ముల్లోకముల ఐశ్వర్యముచే గర్వించియున్న దేవేంద్రుడు అపుడు కోపించి, ఆ జటాధారిని గద్దించి ఇట్లు పలికెను (14).

ఇంద్ర ఉవాచ |

రే మయా పృచ్ఛ్యమానో%పి నోత్తరం దత్తవానసి | అతస్త్వాం హన్మి వజ్రేణ కస్తే త్రాతాస్తి దుర్మతే || 15

ఇంద్రుడిట్లు పలికెను -

ఓరీ! నేను ప్రశ్నించు చున్ననూ నీవు ఉత్తరము నీయకున్నావు. కావున నిన్ను వజ్ర ముతో సంహరించెదను. ఓరీ దుర్బుద్ధీ! నిన్ను కాపాడు వారెవరు గలరు? (15)

సనత్కుమార ఉవాచ |

ఇత్యుదీర్య తతో వజ్రీ సంనిరీక్ష్య క్రుధా హి తమ్‌ | హంతుం దిగంబరం వజ్రముద్యతం స చకార హ || 16

పురందరం వజ్రహస్తం దృష్ట్యా దేవస్సదాశివః | చకరా స్తంభనం తస్య వజ్రపాతస్య శంకరః || 17

తతో రుద్రః క్రుధావిష్టః కరాలాక్షో భయంకరః | ద్రుతమేవ ప్రజజ్వాల తేజసా ప్రదహన్నివ || 18

బాహు ప్రతిష్టంభభువా మన్యునాంతశ్శచీపతిః | సమదహ్యత భోగీవ మంత్రరుద్ధ పరాక్రమః || 19

దృష్ట్వా బృహస్పతిస్తూర్ణం ప్రజ్వలంతం స్వతేజసా | పురుషం తం ధియా జ్ఞాత్వా ప్రణనామ హరం ప్రభుమ్‌ || 20

కృతాంజలి పుటో భూత్వా తతో గురురుదారధీః | నత్వా చ దండవద్భూమౌ ప్రభుం స్తోతుం ప్రచక్రమే || 21

సనత్కుమారుడిట్లు పలికెను -

వజ్రధారియగు ఇంద్రుడు ఇట్లు పలికి, ఆ దిగంబరుని కోపముతో చూచి ఆతనిని సంహరించుటకు వజ్రమును పైకి ఎత్తెను (16). ఇంద్రుడు వజ్రమును ఎత్తుటను గాంచి, సదా మంగళస్వరూపుడగు శంకరదేవుడు ఆ వజ్రపు దెబ్బను స్తంభింపజేసెను. (17). అపుడు రుద్రుడు క్రోధావేశమును పొంది, భయంకరమగు కన్నులు గలవాడై తేజస్సుతో దహించివేయునా యన్నట్లు మండిపడెను (18). మంత్రముచే నిరోధింపబడిన సర్పము వలె బాహువు స్తంభించుటచే కలిగిన కోపముతో శచీపతియగు ఇంద్రుడు తనలో తాను తపింప చేయబడెను (19). ఆ పురుషుడు స్వీయతేజస్సుతో ప్రకాశించుటను గాంచిన బృహస్పతి వెంటనే తన బుద్ధిచే ఆయనను గుర్తు పట్టి, ఆ శివప్రభువునకు ప్రణమిల్లెను (20). ప్రజ్ఞాశాలియగు బృహస్పతి అపుడు చేతులు జోడించి నేలపై బడి సాష్టాంగ ప్రణామము నాచరించి ఆ ప్రభువును స్తుతించుట మొదలిడెను (21).

గురురువాచ |

నమో దేవాధిదేవాయ మహాదేవాయ చాత్మనే | మహేశ్వరాయ ప్రభ##వే త్య్రంబకాయ కపర్దినే || 22

దీననాథాయ విభ##వే నమో%ంధకనిషూదినే | త్రిపురఘ్నాయ శర్వాయ బ్రహ్మణ పరిమేష్ఠినే || 23

విరూపాక్షాయ రుద్రాయ బహురూపాయ శంభ##వే | విరూపాయాతిరూపాయ రూపాతీతాయ తే నమః || 24

యజ్ఞ విధ్వంసకర్త్రే చ యజ్ఞానాం ఫలదాయినే | నమస్తే మఖరూపాయ పరకర్మ ప్రవర్తి నే || 25

కాలాంతకాయ కాలాయ కాలభోగిధరాయ చ | నమస్తే పరమేశాయ సర్వత్ర వ్యాపి నే నమః || 26

నమో బ్రహ్మశిరోహంత్రే బ్రహ్మచంద్రస్తుతాయ చ | బ్రహ్మణ్యాయ నమస్తేస్తు మనస్తే పరమాత్మనే || 27

త్వమగ్నిరనిలో వ్యోమ త్వమేవాపో వసుంధరా | త్వం సూర్యశ్చంద్రమా భాని జ్యోతిశ్చక్రం త్వమేవ హి || 28

బృహస్పతి ఇట్లు పలికెను -

దేవతలకు అధిదేవుడు, ఆత్మరూపుడు, మహేశ్వరుడు, ప్రభువు, ముక్కంటి, జటాజూట ధారి యగు మహాదేవుని కొరకు నమస్కారము (22). దీనులకు ప్రభువు, సర్వవ్యాపకుడు, అంధకాసురుని సంమరించిన వాడు, త్రిపురములను నాశము చేసినవాడు, పరంబ్రహ్మ, పరమేష్టి అగు శర్వునకు నమస్కారము (23). బేసి కన్నులవాడు, అనేకరూపములలో ప్రకటమై మంగళములను చేయువాడు, రుద్రుడు, వికృతరూపుడు, పెద్ద రూపము గలవాడు, రూపములకు అతీతుడు అగు నీకు నమస్కారము (24). దక్షయజ్ఞమును నాశనము చేసినవాడు, యజ్ఞముల ఫలమును ఇచ్చు వాడు, యజ్ఞ స్వరూపుడు, శ్రేష్ఠకర్మలను చేయించు వాడు అగు నీకు నమస్కారము (25). మృత్యువునకు మృత్యువు, కాల స్వరూపుడు, కాలసర్పములను ధరించువాడు, పరమేశ్వరుడు, సర్వవ్యాపకుడు అగు నీకు నమస్కారము (26). బ్రహ్మయొక్క శిరస్సును దునిమిన వాడు, బ్రహ్మచే మరియు చంద్రునిచే స్తుతింపబడిన వాడు, పరబ్రహ్మ, పరమాత్మ అగు నీకు అనేక నమస్కారములు (27). అగ్నివి నీవే. వాయువు నీవే. ఆకాశము నీవే. జలములు నీవే. భూమి నీవే. సూర్యుడు నీవే. చంద్రుడు నీవే. నక్షత్రములు నీవే. జ్యోతిర్మండలములతో నిండిన బ్రహ్మాండము నీవే (28).

త్వమేవ విష్ణుస్త్వం బ్రహ్మా తత్‌స్తుతస్త్వం పరేశ్వరః | మునయస్సనకాద్యాస్త్వం నారదస్త్వం తపోధనః || 29

త్వమేవ సర్వలోకేశస్త్వమేవ జగదాత్మకః | సర్వాన్వయస్సర్వభిన్నస్త్వమేవ ప్రకృతేః పరః || 30

త్వం తు సృజసి లోకాంశ్చ రజసా విధినామభాక్‌ | సత్వేన హరిరూపస్త్వం సకలం పాసి వై జగత్‌ || 31

త్వమేవాసి మహాదేవ తమసా హరరూపధృక్‌ | లీలయా భువనం సర్వం నిఖిలం పాంచ భౌతికమ్‌ || 32

త్వద్ధ్యానబలత స్సూర్యస్తపతే విశ్వభావన | అమృతం చ్యవతే లోకే శశీ వాతి సమీరణః || 33

త్వద్ధ్యాన బలతో మేఘాశ్చాంబు వర్షంతి శంకర | త్వద్ధ్యాన బలతశ్శక్రస్త్రిలోకీం పాతి పుత్రవత్‌ || 34

త్వద్ధ్యాన బలతో%మోఘాస్సర్వే దేవా మునీశ్వరాః | స్వాధికారం చ కుర్వంతి చకితా భవతో భయాత్‌ || 35

విష్ణువు నీవే. బ్రహ్మ నీవే. వారిచే స్తుతింపబడే పరమేశ్వరుడవు నీవే. సనకాది మహర్షులు నీ స్వరూపమే. తపోధనుడగు నారదుడవు నీవే (29). సర్వలోకములకు ప్రభువు నీవే. జగత్స్వరూపుడవు నీవే. సర్వపదార్థములయందు అనుగతముగ నుండు వాడవు నీవే. కాని నీవు సర్వము కంటె భిన్నుడవు. నీవు ప్రకృతికంటె అతీతుడవు (30). రజోగుణమునాశ్రయించి బ్రహ్మ అను పేరును పొంది నీవేలోకములను సృష్టించుచున్నావు. సత్త్వ గుణమునాశ్రయించి విష్ణురూపుడవై నీవే సమస్త జగత్తును పాలించుచున్నావు (31). ఓ మహదేవా! నీవే తమోగుణమునాశ్రయించి హరరూపమును ధరించి పంచభూతాత్మకమగు బ్రహ్మాండము నంతనూ లీలగా ఉపసంహరించెదవు (32). ఈ జగత్తు నీ కల్పనయే. సూర్యుడు నిన్ను ధ్యానించి ఆ బలముచే తపించుచున్నాడు. నీ ధ్యానబలముచే చంద్రుడు లోకములో అమృతకిరణములను వెదజల్లుచున్నాడు. వాయువు వీచుచున్నాడు (33). ఓ శంకరా! నిన్ను ధ్యానించిన బలముచే మేఘములు నీటిని వర్షించుచున్నవి. నిన్ను ధ్యానించిన బలముచే ఇంద్రుడు ముల్లోకములను తన సంతానమును వలె రక్షించుచున్నాడు (34) నిన్ను ధ్యానించిన బలము చేతనే దేవతలు అందరు తమ తమ అధికారములను ప్రవర్తిల్ల జేయుచున్నారు. నీ భయముచే వారు అట్లు చేయుచున్నారు. నీ ధ్యానముచే మహర్షులు అమోఘమగు తపస్సు గల వారగుచున్నారు (35).

త్వత్పాదకమలసై#్యవ సేవనాద్భువి మానవాః | నాద్రియంతే సురాస్రుద్ర లోకైశ్వర్యం చ భుంజతే || 36

త్వత్పాదకమలసై#్యవ సేవనాదగమన్‌ పరామ్‌ | గతిం యోగధనానామప్యగమ్యాం సర్వ దుర్లభామ్‌ || 37

ఓ రుద్రా! భూలోకములో మానవులు నీ పాదపద్మములను సేవించి దేవతలను ఆదరించుటను మానిరి. అయిననూ, వారు పుణ్యలోకములలోని భోగముల ననుభవించుచున్నారు (36). యోగసంపన్నులకైననూ పొందశక్యము కానిది, మిక్కిలి దుర్లభ##మైనది అగు పరమగతి (మోక్షము) ని మానవులు నీ పాదపద్మముల నారాధించి పొందు చున్నారు (37).

సనత్కుమార ఉవాచ -

బృహస్పతిరితి స్తుత్వా శంకరం లోకశంకరమ్‌ | పాదయోః పాతయామాస తస్యేశస్య పురందరమ్‌ || 38

పాతయిత్వా చ దేవేశమింద్రం నతశిరోధరమ్‌ | బృహస్పతిరువాచేదం ప్రశ్రయావనతశ్శివమ్‌ || 39

సనత్కు మారుడిట్లు పలికెను -

లోకములకు మంగళములను కలిగించు శంకరుని బృహస్పతి ఇట్లు స్తుతించి, ఇంద్రుని ఆ ఈశుని పాదములపై పడవేసెను (38). వంచిన శిరస్సుగల దేవేంద్రుని అట్లు పడవేసి, బృహస్పతి ఆదరముతో శివునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను (39).

బృహస్పతిరువాచ !

దీననాథ మహాదేవ ప్రణతం తవ పాదయోః | సుమద్ధర చ శాంతం స్వం క్రోధం నయనజం కురు || 40

తుష్టో భవ మహాదేవ పాహీంద్రం శరణాగతమ్‌ | అగ్నిరేష శమం యాతు భాలనేత్ర సముద్భవః || 41

బృహస్పతి ఇట్లు పలికెను -

దీనులకు ప్రభువగు మహాదేవా! నీ పాదములకు నమస్కరించుచున్న వీనిని ఉద్ధరింపుము. నీ కన్నులనుండి పుట్టిన కోపమును శాంతింపజేయును (40). ఓ మహాదేవా! తుష్టుడవై శరణు జొచ్చిన ఇంద్రుని రక్షింపుము. నీ లలాట నేత్రమునుండి పుట్టిన అగ్ని చల్లారు గాక! (41)

సనత్కుమార ఉవాచ |

ఇత్యాకర్ణ్య గురోర్వాక్యం దేవదేవో మహేశ్వరః | ఉవాచ కరుణాసింధుర్మేఘనిర్హ్రదయా గిరా || 42

సనత్కుమారుడిట్లు పలికెను -

బృహస్పతి యొక్క ఈ మాటను విని దేవదేవుడు, కరుణాసముద్రుడునగు మహేశ్వరుడు మేఘగర్జనవలె గంభీరమగు స్వరముతో నిట్లనెను (42).

మహేశ్వర ఉవాచ |

క్రోధం చ నిస్సృతం నేత్రాద్ధారయామి బృహస్పతే | కథం హి కంచుకీం సర్పస్సంధత్తే నోజ్ఝి తాం పునః || 43

మహేశ్వరుడిట్లు పలికెను -

ఓ బృహస్పతీ! కంటినుండి బయల్వడలిన కోపమును నేను మరల ఎట్లు వెనుకకు ఉపసంహరించ గల్గుదును? పాము విడిచిన కుబుసమును మరల తాను ధరించలేదు గదా! (43)

సనత్కుమార ఉవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్య శంకరస్య బృహస్పతిః | ఉవాచ క్లిష్టరూపశ్చ భయవ్యాకులమానసః || 44

సనత్కుమారుడిట్లు పలికెను -

భయముచే కంగారుపడిన బృహస్పతి శంకరుని ఆ మాటను విని దేహములో మిక్కిలి క్లేశమును పొంది ఇట్లు పలికెను (44).

బృహస్పతిరువాచ |

హే దేవ భగవన్‌ భక్తా అనుకంప్యాస్సదైవ హి | భక్తవత్సల నామేతి త్వం సత్యం కురు శంకర || 45

క్షేప్తు మన్యత్ర దేవేశ స్వతేజో%త్యుగ్రమర్హసి | ఉద్ధర్తస్సర్వ భక్తానాం సముద్ధర పురందరమ్‌ || 46

బృహస్పతి ఇట్లుపలికెను -

ఓ భగవన్‌ ! దేవా! నీవు సర్వకాలములయందు భక్తులపై దయను చూపవలెను. ఓ శంకరా! నీకు భక్తవత్సలుడను పేరు గలదు. దానిని సార్థకము చేయుము (45). ఓ దేవదేవా! నీ అతి భయంకరమగు తేజస్సును మరియొక చోటకు ప్రసరింపచేయుట దగును. భక్తులనందరినీ ఉద్ధరించువాడా! ఇంద్రుని ఉద్ధరించుము (46).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్తో గురుణా రుద్రో భక్త వత్సలనామభాక్‌ | ప్రత్యువాచ ప్రసన్నాత్మా సురేజ్యం ప్రణతార్తిహా || 47

సనత్కుమారుడిట్లు పలికెను -

భక్త వత్సలుడను పేరు గలవాడు, నమస్కరించినవారి ఆపదలను హరించు వాడు అగు రుద్రుడు బృహస్పతిచే ఇట్లు పలుకబడి ప్రసన్నమగు మనస్సు గలవాడై ఇట్లు బదులిడెను (47).

శివ ఉవాచ |

ప్రీతస్త్సు త్యానయా తాత దదామి వరముత్తమమ్‌ | ఇంద్రస్య జీవదానేన జీవేతి త్వం ప్రథాం వ్రజ || 48

సముద్భూతో% నలో యో%యం భాలనేత్రాత్సురేశహా | ఏనం త్యక్ష్యామ్యహం దూరం యథేంద్రం నైవ పీడయేత్‌ || 49

శివుడిట్లు పలికెను -

వత్సా! నీ ఈ స్తుతిచే ప్రసన్నుడనైతిని. నీకు ఉత్తమవరము నిచ్చెదను. నీవు ఇంద్రుని ప్రాణములను నిలబెట్టితివిగాన, నీకు జీవుడను పేరు ప్రసిద్ధిని గాంచగలదు (48). దేవేంద్రుని సంహరించుటకై నా ఫాలనేత్రమునుండి పుట్టిన ఈ అగ్నిని, ఇంద్రునకు పీడ కలుగని విధంబున, నేను దూరముగా విడిచి పెట్టెదను (49).

సనత్కుమార ఉవాచ |

ఇత్యుక్త్వా తం కరే ధృత్వా స్వతేజో % నలమద్భుతమ్‌ | భాలనేత్రాత్సముద్భూతం ప్రాక్షిపల్లవణాంభసి || 50

తతశ్చాంతర్దధే రుద్రో మహాలీలాకరః ప్రభుః | గురుశక్రౌ భయాన్ముక్తౌ జగ్మతుస్సుఖముత్తమమ్‌ || 51

యదర్థం గమనోద్యుక్తౌ దర్శనం ప్రాప్య తస్య వై | కృతార్థౌ గురుశక్రౌ హి స్వస్థానం జగ్మతుర్ముదా || 52

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితయాం యుద్ధఖండే శక్రజీవనం నామ త్రయోదశో%ధ్యాయః (13)

సనత్కుమారుడిట్లు పలికెను -

ఇట్లు పలికి ఫాలనేత్రమునుండి పుట్టిన అద్భుతమగు ఆ స్వీయతేజస్సును చేతితో పట్టుకొని సముద్రములో పారవైచెను (50). గొప్ప లీలలను చేయు ఆ రుద్రప్రభుడు అపుడు అంతర్ధానమయ్యెను. మరియు ఇంద్ర బృహస్పతులు భయమును వీడి ఉత్తమమగు సుఖమును పొందిరి (51). ఎవని దర్శనము కొరకు బయలుదేరిరో అట్టి శివుడు దారిలోనే దర్శనము నీయగా, ఇంద్రబృహస్పతులు కృతార్థులై అనందముతో స్వస్తానమునకు చేరిరి (52).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు యుద్ధఖండలో ఇంద్రుని జీవనము

అనే పదమూడవ అధ్యాయము ముగిసినది (13)

Sri Sivamahapuranamu-II    Chapters