Sri Sivamahapuranamu-II    Chapters   

అథ పంచమో%ధ్యాయః

త్రిపుర మోహనము

వ్యాస ఉవాచ |

దైత్యరాజే దీక్షితే చ మాయినా తేన మోమితే | కిమువాచ తదా మాయీ కిం చకార స దైత్యవః || 1

వ్యాసుడిట్లు పలికెను-

ఆ మాయవిచే మోహితుడైన రాక్షసరాజు దీక్షను స్వీకరించిన పిదప ఆ మాయావి ఏమనెను? ఆ రాక్షసరాజు ఏమి చేసెను? (1).

సనత్కుమార ఉవాచ |

దీక్షాం దత్త్వా యతిస్తస్మా అరిహన్నారదాదిభిః | శిషై#్య స్సేవితపాదబ్జో దైత్యరాజానమబ్రవీత్‌ || 2

సనత్కుమారుడిట్లు పలికెను |

అరిహన్‌ అనబడే ఆ యతి ఆ రాక్షసరాజునకు దీక్షను ఇచ్చి, నారదుడు మొదలగు శిష్యులచే సేవింపబడే పాదపద్మములు గలవాడై ఆతనితో నిట్లనెను (2).

అరిహన్నువాచ|

శృణు దైత్యపతే వాక్యం మమ సంజ్ఞాన గర్భితమ్‌ | వేదాంతసారసర్వస్వం రహస్యం పరమోత్తమమ్‌ || 3

అనాదిసిద్ధస్సంసారః కర్తృ కర్మ వివర్జితః | స్వయం ప్రాదుర్భవత్యేవ స్వయమేవ విలీయతే || 4

బ్రహ్మాదిస్తంబపర్యంతం యావద్దేహనిబంధనమ్‌ | ఆత్మైవై కేశ్వరస్తత్ర న ద్వితీయస్తదీశతా || 5

యద్బ్రహ్మ విష్ణు రుద్రాఖ్యాస్తదాఖ్యా దేహినామిమాః | అఖ్యా యథాస్మదాదీనా మరిహన్నాది రుచ్యతే || 6

అరిహన్‌ ఇట్లు పలికెను -

రాక్షసరాజా! మంచి జ్ఞానముతో నిండిన నా వాక్యములను వినుము. వేదాంతము యొక్క సారసర్వస్వమనదగినది, రహస్యమైనది, ఉత్తమోత్తమైనది అగు వాక్యమును చెప్పెదను (3). ఈ సంసారము అనాదినుండియు నిత్యసిద్ధమై యున్నది. దీనికి కర్తలేడు. ఇది క్రియనుండి జన్మించినది కాదు. ఇది స్వయముగా ప్రకటమై స్వయముగనే లీనమగు చుండును (4). బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు దేహములు ఏతీరున గలవో, ఆ దేహములే ఆత్మ. దేహమే ఈశ్వరుడు. దేహములను పాలించు ఈశ్వరుడు వేరుగా లేడు (5). బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనునవి దేహము గల ప్రాణుల నామముల మాత్రమే. నాకు అరిహన్‌ అనియు, ఇతరులకు ఆయా నామములు ఉన్నవి గదా ! సర్వత్రా అటులనే యుండును (6).

దేహో యథాస్మదాదీనాం స్వకాలేన విలీయతే | బ్రహ్మాది మశకాంతానాం స్వకాలాల్లీయతే తథా || 7

విచార్యమాణ దేహే%స్మిన్న కించిదధికం క్వచిత్‌ | ఆహారో మైథునం నిద్రా భయం సర్వత్ర యత్సమమ్‌ || 8

నిద్రాహారపరీమాణం ప్రాప్య సర్వో హి దేహభృత్‌ | సదృశీమేవ సంతృప్తిం ప్రాప్నుయాన్నాధికేతరామ్‌ || 9

యథా వితృషితాస్స్యామ పీత్వా పేయం ముదా వయమ్‌ | తృషితాస్తు తథాన్యే%పి ని విశేషో%ల్పకోధికః || 10

మన దేహములు వాటి వాటి ఆయుర్దాయము పూర్తి అయిన పిదప నశించును గదా ! బ్రహ్మ మొదలు దోమ వరకు గల ప్రాణుల దేహములు కూడా అటులనే కొంతకాలము జీవించి నశించును (7). విచారణ చేసినచో సర్వప్రాణుల దేహముల యందు ఆహారము, మైథునము, నిద్ర, భయము అనునవి సమానముగ నున్నవి. ఇంతకు మించి దేహములో అధికముగా ఏదీ లేదు (8). సర్వప్రాణులు ఆహారమును భుజించు నప్పుడు మరియు నిద్రించునప్పుడు పొందే సంతృప్తి సమానముగా నుండును. హెచ్చుతగ్గులు ఉండవు (9). మనము దాహము వేసినప్పుడు నీటిని త్రాగి ఆనందించెదము. దప్పిక తీరును. ఇతర ప్రాణుల విషయములో కూడ నింతే. తేడా గాని, హెచ్చు తగ్గులు గాని లేవు (10).

సంతు నార్యస్సహస్రాణి రూపలావణ్య భూమయః | పరం నిధువనే కాలే హ్యైకేవేహోపయుజ్యతే || 11

అశ్వాః పరశ్శతాస్సంతు సంత్వేనేకేప్యనేకధా | అధిరోపే తథాప్యేకో న ద్వితీయస్తథాత్మనః || 12

పర్యంకశాయినాం స్వాపే సుఖం యదుపజాయతే | తదేవ సౌఖ్యం నిద్రాభిర్భూతభూశాయినా మపి || 13

యథైవ మరణాద్భీతి రస్మదాది వపుష్మతామ్‌ | బ్రహ్మాది కీటకాంతానాం తథా మరణతో భయమ్‌ || 14

సౌందర్యలావణ్యములకు నిధానమనదగిన స్త్రీలు వేలాది మంది ఉండవచ్చును. కాని వివాహమాడి గృహస్థ జీవనమునకు అంకితమయ్యేది ఒక స్త్రీతో మాత్రమే గదా! (11). కొన్ని వందల గుర్రములు ఉపలభ్యముగానున్ననూ, అధిరోహించు కాలమునందు ఉపకరించునది ఒక గుర్రమే గాని, రెండు కాదు (12). హంస తూలికాతల్పముపై పరున్న వానికి ఏ నిద్రా సుఖము కలుగునో, భూమిపై శయనించువానికి కూడా అదియే నిద్రాసుఖము లభించును (13). మనవంటి దేహధారులకు ఎట్టి మరణభయము గలదో, అదే మరణ భయము బ్రహ్మ మొదలు కీటకము వరకు గల ప్రాణులన్నింటికీ గలదు (14).

సర్వే తనుభృతస్తుల్యా యది బుద్ధ్యా విచార్యతే | ఇదం నిశ్చిత్య కేనాపి నో హింస్యఃకో%పి కుత్రచిత్‌ || 15

ధర్మో జీవదయా తుల్యో న క్వాపి జగతీతలే | తస్మాత్సర్వ ప్రయత్నేన కార్యా జీవదయా నృభిః || 16

ఏకస్మిన్‌ రక్షితే జీవే త్రైలోక్యం రక్షితం భ##వేత్‌ | ఘాతితే ఘాతితం తద్వత్తస్మాద్రక్షేన్న ఘాతయేత్‌ || 17

అహింసా పరమో ధర్మః పాపమాత్మప్రపీడనమ్‌ | అపరాధీనతా ముక్తి స్స్వర్గో%భిలషితాశనమ్‌ || 18

బుద్ధితో విచారణ చేసినచో, దేహధారులందరు సమానమే. ఈ సత్యమును దృఢముగా ఎరింగి ఎవ్వరైననూ ఎక్కడైననూ ఇతర ప్రాణులను హింసించరాదు (15). భూమండలమునందు భూతదయతో సమానమైన ధర్మము ఎచ్చటనూ లేదు. కావున మానవులు సర్వప్రయత్నములను చేసి భూతదయను పాలించవలెను (16). ఒక్క ప్రాణిని రక్షించినచో, ముల్లోకములను రక్షించునట్లు అగును. ఒక్క ప్రాణిని హింసించినచో, ముల్లోకములను హింసించినట్లు అగును. కావున ప్రాణులను రక్షించవలెనే గాని, హింసించరాదు (17). అహింస సర్వోత్తమ మగు ధర్మము. దేహమునకు హింసను కలిగించుట పాపము. పరాధీనుడు కాకుండటయే మోక్షము. కోరిన సుఖముల ననుభవించుటయే స్వర్గము (18).

పూర్వసూరిభిత్యుక్తం సత్ప్రమాణతయా ధ్రువమ్‌ | తస్మాన్న హింసా కర్తవ్యా నరైర్నరకభీరుభిః || 19

న హింసాసదృశం పాపం త్రైలోక్యే సచరాచరే | హింసకో నరకం గచ్ఛేత్స్వర్గం గచ్ఛేదహింసకః || 20

సంతి దానాన్యనేకాని కిం తైస్తుచ్ఛఫలప్రదైః | అభీతిసదృశం దానం పరమేకమపీహన || 21

ఇహ చత్వారి దానాని ప్రోక్తాని పరమర్షిభిః | విచార్య నానాశాస్త్రాణి శర్మణ%త్ర పరత్ర చ || 22

పూర్వజులగు పండితులు సత్ప్రమాణములతో నిశ్చయించి ఇట్లు చెప్పిరి. కావున నరకభయము గల మానవులు హింసను చేయరాదు (19). స్థావర జంగమ ప్రాణులతో గూడియున్నముల్లోకములలో హింసతో సమానమగు పాపము లేదు. హింసచేయువాడు నరకమును పొందును. అహింసా పరుడు స్వర్గమును బడయును (20). దానములనేకములు గలవు. అల్ఫఫలములనిచ్చు ఆ దానములతో పని యేమున్నది? అభయదానముతో సమమగు దానము గాని, అంతెకంటె గొప్ప దానము గాని ఒక్కటి యైననూ లేదు (21). మహర్షులు శాస్త్రముల నన్నిటినీ పరిశీలించి ఇహ పరములలో సుఖమునిచ్చు నాలుగు దానములను నిర్దారించిరి (22).

భీతేభ్య శ్చాభయం దేయం వ్యాధితేభ్యస్తథౌషధమ్‌ | దేయా విద్యార్థినాం విద్యా దేయమన్నం క్షుధాతురే || 23

యాని యానీహ దానాని బహుమున్యుదితాని చ | జీవాభయ ప్రదానస్య కలాం నార్హంతి షోడశీమ్‌ || 24

అవిచింత్య ప్రభావం హి మణి మంత్రౌషధం బలమ్‌ | తదభ్యస్యం ప్రయత్నేన నామార్థోపార్జనాయ వై || 25

అర్థానుపార్జ్య బహుశో ద్వాదశాయతనాని వై | పరితః పరిపూజ్యాని కిమన్యైరిహ పూజితైః || 26

పంచ కర్మేంద్రియ గ్రామః పంచ బుద్ధీంద్రియాణి చ | మనో బుద్ధిరిహ ప్రోక్తం ద్వాదశాయతనం శుభమ్‌ || 27

భయపడిన వారికి అభయమును, వ్యాధిగ్రస్తులకు మందును, విద్యార్థులకు విద్యను, ఆకలి గొన్నవారికి అన్నమును ఈయవలెను (23). అనేక మహర్షులు చెప్పిన దానములు ఈ లోకములో ఎన్ని గలవో, అవి అన్నియు ప్రాణులకు ఇచ్చే అభయ దానము యొక్క పదునారవ అంశమునకైననూ సరిదూగవు (24). మణులకు, మంత్రములకు, మందులకు ఊహకు అందని శక్తులు గలవు. కావున మానవుడు పేరు ప్రతిష్ఠలను, ధనమును సంపాదించుట కొరకై ప్రయత్నముతో వాటిని అభ్యసించవలెను (25). ధనమును అధికముగా సంపాదించి పన్నెండు ఆయతనములను శ్రద్ధతో పూజించవలెను. ఇతరములను పూజించుట వలన ప్రయోజనమేమున్నది? (26) అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు, మనస్సు మరియు బుద్ధి కలిసి పన్నెండు శుభకరమగు ఆయతనములు అగును (27).

ఇహైవ స్వర్గనరకౌ ప్రాణినాం నాన్యతః క్వచిత్‌ | సుఖం స్వర్గస్సమాఖ్యాతా దుఃఖం నరకమేవ హి || 28

సుఖేషు భుజ్యమానేషు యత్‌ స్యాద్దేహవిసర్జజనమ్‌ | అయమేవ పరో మోక్షో విజ్ఞేయస్తత్త్వ చింతకైః || 29

వాసనాసహితే క్లేశసముచ్ఛేదే సతి ధ్రువమ్‌ | అజ్ఞానో పరమో మోక్షో విజ్ఞేయస్తత్త్వ చింతకైః || 30

ప్రామాణికీ శ్రుతిరియం ప్రోచ్యతే వేదవాదిభిః | న హింస్యాత్సర్వ భూతాని నాన్యా హింసా ప్రవర్తికా || 31

ప్రాణులు ఇచటనే స్వర్గనరకముల ననుభవించెదరు. ఇంతకు మించి ఎక్కడనో స్వర్గనరకములు లేవు. సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము (28). సుఖముల ననుభవిస్తూ ప్రాణములను విడనాడుటయే గొప్ప మోక్షము అగునని తత్త్వవేత్తలు ఎరుంగవలెను (29). వాసనలతో సహా చిత్తక్లేశములు నశించగా అజ్ఞానము నిశ్చయముగా తొలగిపోవును. అదియే మోక్షమని తత్త్వచింతకులు తెలియవలెను (30). వేదవేత్తలు బోధించే పరమ ప్రమాణమగు శ్రుతి ఇట్లు చెప్పుచున్నది: ఏ ప్రాణులనైననూ హింసించరాదు. హింసను బోధించు ఇతర శ్రుతివాక్యములు ప్రమాణము కావు (31).

అగ్నిష్టోమీయమితి యా భ్రామికా సా%సతామిహ | న సా ప్రమాణం జ్ఞాతౄణాం పశ్వాలంభనకారికా || 32

వృక్షాంశ్ఛిత్వా పశూన్‌ హత్వా కృత్వా రుధిరకర్దమమ్‌ | దగ్ధ్వా వహ్నౌతిలాజ్యాది చిత్రం స్వర్గో%భిలష్యతే || 33

ఇత్యేవం స్వమతం ప్రోచ్య యతిస్త్రిపురనాయకమ్‌ | శ్రావయిత్వాఖిలాన్‌ పౌరానువాచ పునరాదరాత్‌ || 34

దృష్టార్థ ప్రత్యయకరాన్‌ దేహసౌఖ్యకసాధకాన్‌ | బౌద్ధాగమ వినిర్దిష్టాన్‌ ధర్మాన్‌ వేదపరాంస్తతః || 35

ఈ లోకములో దుష్టులు ఆచరించే అగ్నిష్టోమాది యజ్ఞములు భ్రమ పూర్ణములు. పశువుల హింసతో కూడియున్న ఆ యజ్ఞములను విద్వాంసులు ప్రమాణముగా అంగీకరించరు (32). చెట్లను నరికి, పశువులను సంహరించి, రక్తమును చిందించి, అగ్నిలో తిలలు, నేయి మొదలగు వస్తువులను దహించి వీరు స్వర్గమును పొందగోరుచున్నారు. ఇది విచిత్రము (33). ఆ యతి త్రిపురాధీశునకు, పౌరులందరికీ ఈ విధముగా తన మతమును చెప్పి వినిపించి మరల ఆదరముతో నిట్లనెను (34). ప్రత్యక్షముగా కనబడు వాటిని మాత్రమే విశ్వసించునవి, దేహసౌఖ్యమును సాధించుట ప్రముఖ లక్ష్యముగా గలవి అగుర బౌద్ధాగమములోని ధర్మములు వేదము కంటె గొప్పవి (35).

ఆనందం బ్రహ్మణో రూపం శ్రుత్యైవం యన్నిగద్యతే | తత్తథైవేహ మంతవ్యం మిథ్యా నానాత్వకల్పనా || 36

యావత్‌ స్వస్థమిదం వర్ష్మ యావన్నేంద్రియవిక్లబః | యావజ్జరా చ దూరే%స్తి తావత్సౌఖ్యం ప్రసాధయేత్‌ || 37

అస్వాస్థ్యేంద్రియవైకల్యే వార్ధకే తు కుతస్సుఖమ్‌ | శరీరమపి దాతవ్యమర్థిభ్యో%తస్సుఖేప్సుభిః || 38

యాచమాన మనోవృత్తి ప్రీణనే యస్య నో జనిః | తేన భూర్భారవత్యేషా సముద్రాగద్రుమైర్నహి || 39

బ్రహ్మ యొక్క స్వరూపము ఆనందమని వేదము చెప్పుచున్నది. కాని ఆ ఆనందము ఈ లోకములో మాత్రమే పొందదగినది అని తెలియదగును. ఈ లోకములోని నానాత్వము మిథ్య, కల్పితము (36). ఈ దేహము ఆరోగ్యముగా నున్నంతవరకు, ఇంద్రియములు నీరసములు కానంతవరకు మరియు ముసలిదనము మీద బడనంతవరకు సుఖములననుభవించవలెను (37). దేహములో ఆరోగ్యములేని, ఇంద్రియములలో శక్తిలేని ముసలి దనములో సుఖమెక్కడది? కావున సుఖమును గోరు మానవులు యాచకులకు తమ దేహమునైననూ దానము చేయవలెను (38). యాచకుల మనస్సులకు ఆనందమును కలిగించని మానవుడు పుట్టుట వలన భూమికి భారము పెరుగుచున్నది. సముద్రములు, పర్వతములు, వృక్షములు భూమికి భారము కావు (39).

సత్వరం గత్వరో దేహ సంచయాస్సపరిక్షయాః | ఇతి విజ్ఞాయ విజ్ఞాతా దేహ సౌఖ్యం ప్రసాధయేత్‌ || 40

శ్వవాయస కృమీణాం చ ప్రాతర్భోజ్యమిదం వపుః | భస్మాంతం తచ్ఛరీరం చ వేదే సత్యం ప్రపఠ్యతే || 41

ముధా జాతివికషో%యం లోకేషు పరికల్ప్యతే | మానుష్యే సతి సామాన్యే కో%ధమః కో%థ చోత్తమః || 42

బ్రహ్మాది సృష్టి రేషేతి ప్రోచ్యతే వృద్ధపూరుషైః | తస్య జాతౌ సుతౌ దక్ష మరీచీ చేతి విశ్రుతౌ || 43

దేహము కొద్దికాలములో పడిపోవును. సంపాదించిన ధనము శాశ్వతము కాదు. బుద్ధి మంతుడు ఈ సత్యము నెరింగి దేహసౌఖ్యమును సంపాదించు కొనవలెను (40). కుక్కలు, కాకులు, క్రిములు ఈ శరీరమును చల్ది అన్నముగా చేసుకొని భుజించును. ఈ శరీరము అంతములో బూడిదయగునని వేదవాక్కు సత్యము(41). మానవులలో వీరు వ్యర్థముగా జాతి భేదమును కల్పించుచున్నారు. అందరిలో మానవత్వము సమానమై యుండగా, అధముడెవరు?ఉత్తముడెవరు? (42) ఈ సృష్టిని బ్రహ్మ రచించినాడని వృద్ధులు చెప్పెదరు. మరియు, ఆ బ్రహ్మ గారికి దక్షుడు, మరీచి అను ఇద్దరు కుమారులు గలరని పురాణ ప్రసిద్ధి గలదు (43).

మారీచేన కశ్యపేన దక్ష కన్యా స్సులోచనాః | ధర్మేణ కిల మార్గేణ పరిణీతాస్త్రయోదశ || 44

అపీదానీంతనైర్మర్త్యైరల్పబుద్ధిపరాక్రమైః | అపి గమ్యస్త్వగమ్యో%యం విచారః క్రియతే ముధా || 45

ముఖబాహూరు సంజాతం చాతుర్వర్ణ్యం సహోదితమ్‌ | కల్పనేయం కృతా పూర్వైర్నఘటేత విచారతః || 46

ఏకస్యాం చ తనౌ జాతా ఏకస్మాద్యది వా క్వచిత్‌ | చత్వారస్తనయాస్తత్కిం భిన్నవర్ణత్వమాప్నుయుః || 47

మరీచుని కుమారుడగు కశ్యపుడు దక్షుని కుమార్తెలగు పదముగ్గురు సుందరీ మణులను ధర్మమార్గములో వివాహమాడినాడు (44). కాని అల్పముగు బుద్ధి, అల్పమగు పరాక్రమము గల ఈనాటి మనుష్యులు 'వీనితో సంభోగించరాదు; వీనితో సంభోగించవచ్చునను' అంటూ వ్యర్ధమగు చర్చలను చేయుచున్నారు (45). బ్రహ్మగారి ముఖము, బాహువులు, ఊరువులు, పాదములనుండి క్రమముగా నాల్గు వర్ణములు జన్మించినవి అను కల్పనను పూర్వీకులు చేసి యుండిరి. ఈ కల్పన విచారము చేసినచో నిలబడదు (46). ఒకే భార్యా భర్తలకు నల్గరు కుమారులు పుట్టినచో, ఒకే దేహమునుండి పుట్టిన ఆ నల్గురు వేర్వేరు వర్ణముల వారు అగుదురా యేమి? (47).

వర్ణా వర్ణ విభాగో%యం తస్మాన్న ప్రతి భాసతే | అతో భేదో న మంతవ్యో మానుష్యే కేన చిత్‌ క్వచిత్‌ || 48

ఈ వర్ణ విభాగము యుక్తి యుక్తముగా ఉన్నట్లు కన్పట్టుట లేదు. కావున ఎక్కడైననూ మానవులందరూ సమానమే. వారిలో భేదమును భావన చేయరాదు (48).

సనత్కుమార ఉవాచ |

ఇత్థమాభాష్య దైత్యేశం పౌరాంశ్చ స యతిర్మునే | సశిష్యో వేద ధర్మాంశ్చ నాశయా మాస చాదరాత్‌ || 49

స్త్రీ ధర్మం ఖండయామాస పాతివ్రత్య పరం మహత్‌ | జితేంద్రియత్వం సర్వేషాం పురుషాణాం తథైవ సః || 50

దేవధర్మాన్‌ విశేషేణ శ్రాద్ధ ధర్మాంస్తథైవ చ | మఖధర్మాన్‌ వ్రతాదీంశ్చ తీర్థ శ్రాద్ధం విశేషతః || 51

శివపూజాం విశేషేణ లింగారాధన పూర్వికామ్‌ | విష్ణు సూర్య గణశాది పూజనం విధి పూర్వకమ్‌ || 52

సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ యతి రాక్షసరాజునకు, పౌరులకు ఇట్లు ప్రవచించి, శిష్యులచే వేదధర్మములను పట్టుదలతో నశింపజేసెను (49). స్త్రీలకు పరమ ధర్మమగు పాతివ్రత్యమును, పురుషులందరు పాటింపదగిన ఇంద్రియ జయమును ఆతడు ఖండించెను (50). ఆతడు దేవ (యజ్ఞాది) ధర్మములను, శ్రాద్ధ ధర్మములను, వ్రతములు మొదలగు వాటిని, ప్రత్యేకించి తీర్థములలో చేయు శ్రాద్ధములను ఖండించెను (51). లింగారాధన పూర్వకముగా చేయు శివపూజను ఆతడు ప్రత్యేకముగా ఖండించెను. యథావిధిగా చేయబడే విష్ణు సూర్య గణశాది పూజలను ఆతడు ఖండించెను (52).

స్నానదానాదికం సర్వం పర్వకాలం విశేషతః | ఖండయామాస స యతిర్మాయి మాయావినాం వరః || 53

కిం బహూక్తేన విప్రేంద్రే త్రిపురే తేన మాయినా | వేదధర్మాశ్చ యే కేచిత్తే సర్వే దూరతః కృతాః || 54

పతి ధర్మాశ్రయాస్సర్వా మోహితాస్త్రి పురాతంగనాః | భర్తృ శుశ్రూషణవతీం విజహుర్మతిముత్తమామ్‌ || 55

అభ్యస్యాకర్షణీం విద్యాం వశీకృత్యమయీ మపి | పురుషాస్సఫలీ చక్రుః పరదారేషు మోహితాః || 56

మాయావి, మాయావులలో అగ్రేసురుడు అగు ఆ యతి స్నానదానాదులను, విశేషించి పర్వకాలములో చేయు స్నానదానాదులను ఖండించెను (53). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! ఇన్ని మాటలేల? ఆ మాయావి త్రిపురములలో గలవేద ధర్ములన్నియూ దూరమగునట్లు చేసెను (54). పాతివ్రత్య ధర్మము ప్రధానముగా గల త్రిపురస్త్రీలు అందరు మోహితలై భర్తను శుశ్రూష చేయవలెననే ఉత్తమ బుద్ధిని విడనాడిరి (55). పురుషులు స్త్రీలను ఆకర్షించి వశము చేసుకొనే విద్యను నేర్చి మాయామోహితులై పరస్త్రీలయందు ఆ విద్యను సఫలమొనర్చిరి (56).

అంతః పురచరా నార్యస్తథా రాజకుమారకాః | పౌరాః పురాంగనాశ్చాపి సర్వే తైశ్చ విమోహితాః || 57

ఏవం పౌరేషు సర్వేషు నిజధర్మేషు సర్వథా | పారఙ్ముఖేషు జాతేషు ప్రోల్లలాస వృషేతరః || 58

మాయా చ దేవ దేవస్య విష్ణోస్తస్యాజ్ఞయా ప్రభోః | అలక్ష్మీశ్చ స్వయం తస్య నియోగాత్త్రిపురం గతా || 59

యా లక్ష్మీస్తపసా తేషాం లబ్ధా దేవేశ్వరాదరాత్‌ | బహిర్గతా పరిత్యజ్య నియోగాద్ర్బహ్మణః ప్రభోః || 60

అంతఃపురస్త్రీలు, రాజకుమారులు, పౌరులు మరియు పురస్త్రీలు అందరు వాని శిష్యులచే మోహింప చేయబడిరి (57). ఇట్లు పౌరులందరు అన్ని విధములా స్వధర్మ విముఖులు కాగా అధర్మము తాండవించెను (58). దేవదేవుడగు విష్ణుప్రభుని ఆజ్ఞచే మాయ, మరియు అలక్ష్మి స్వయముగా త్రిపురములకు వెళ్లిరి (59). దేవతలకు ప్రభువగు బ్రహ్మ తపస్సునకు మెచ్చి ఏ లక్ష్మిని వారికి ఇచ్చినాడో, ఆ లక్ష్మి బ్రహ్మ గారి ఆజ్ఞచే వారిని విడిచి దూరముగా వెళ్లిపోయెను (60).

బుద్ధి మోహం తథా భూతం విష్ణోర్మాయావినిర్మితమ్‌ | తేషాం దత్త్వా క్షణాదేవ కృతార్థో%భూత్స నారదః || 61

నారదో%పి తథారూపో యాథా మాయీ తథైవ సః | తథాపి వికృతో నాభూత్పరమేశాదను గ్రహాత్‌ || 62

ఆసీత్కుంఠితసామర్థ్యో దైత్యరాజో%పి భో మునే | భ్రాతృభ్యాం సహితస్తత్ర మయేన చ శివేచ్ఛయా || 63

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం యుద్ధ ఖండే త్రిపుర మోహనం నామ పంచమో%ధ్యాయః (5).

ఆ నారదుడు విష్ణువు యోక్క మాయచే నిర్మితమైన అట్టి బుద్ధి వ్యామోహమును వారికి క్షణకాలములో కలిగించి కృతార్థుడాయెను (61). ఆ మాయావి యగు యతి ఏ రూపములో నుండెనో, నారదుడు కూడ అదే రూపములో నుండెను. అయిననూ పరమేశ్వరుని ఆనుగ్రహముచే ఆయన బుద్ధిలో ఎట్టి వికారములు కలుగలేదు (62). ఓ మహర్షీ! అచట సోదరులిద్దరితో మరియు మయునితో కూడి యున్న ఆ రాక్షసరాజు యొక్క సామర్థ్యము శివుని సంకల్పముచే మొక్క వోయెను (63).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు యుద్ధ ఖండములో త్రిపురమోహనమనే

అయిదవ అధ్యాయము ముగిసినది (5).

Sri Sivamahapuranamu-II    Chapters