Sri Sivamahapuranamu-II    Chapters   

అథ షట్‌ చత్వారింశో%ధ్యాయః

శివుడు పెళ్లికొడుకు

బ్రహ్మోవాచ |

అథ శంభుః ప్రసన్నాత్మా సదూతం స్వగణౖస్సురైః | సర్వేరన్యైర్గిరేర్ధామ జగామ సకుతూహలమ్‌ || 1

మేనాపి స్త్రీ గణౖసై#్తశ్చ హిమాచలవరప్రియా | తత ఉత్థాయ స్వగృహాభ్యంతరం హ జగామ సా || 2

నీరాజనార్థం శంభోశ్చ దీపపాత్రకరా సతీ | సర్వర్షిస్త్రీ గణౖ స్సాకమగచ్ఛ ద్ద్వారమాదరాత్‌ || 3

తత్రాగతం మహేశానం శంకరం గిరిజావరమ్‌ | దదర్శ ప్రీతితో మేనా సేవితం సకలైస్సురైః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడు ప్రసన్నమగు మనస్సుగల శివుడు దూతలతో, తన గణములతో, దేవతలతో, మరియు మిగిలిన వారందరితో గూడి కుతూహలము గలవాడై హిమవంతుని గృహమునకు వెళ్లెను (1). హిమవంతుని ప్రాణప్రియురాలగు ఆ మేన కూడా అప్పుడు లేచి ఆ స్త్రీ గణములతో కూడి తన ఇంటి లోపలికి వెళ్లెను (2). ఆమె చేతి యందు దీపపాత్రను ధరించి శంభునకు నీరాజనమిచ్చుట కొరకై స్త్రీ గణములందరితో బాటు సాదరముగా ద్వారము వద్దకు వచ్చెను (3). అచటకు విచ్చేసి నట్టియు, మహేశ్వరుడైనట్టియు, పార్వతీపతియైనట్టియు, దేవతలందరిచే సేవింపబడునట్టి శంకుని మేన ప్రీతితో చూచెను (4).

చారు చంపకవర్ణాభం హ్యేకవక్త్రం త్రిలోచనమ్‌ | ఈషద్ధాస్య ప్రసన్నాస్యం రత్నస్వర్ణాది భూషితమ్‌ || 5

మాలతీ మాలయా యుక్తం సద్రత్న ముకుటోజ్జ్వలమ్‌ | సత్కంఠాభరణం చారు వలయాంగద బూషితమ్‌ || 6

వహ్నిశౌచేనాతులైన త్వతి సూక్షేణ చారుణా | అమూల్య వస్త్ర యుగ్మేన విచిత్రేణాతిరాజితమ్‌ || 7

చందనాగరు కస్తూరి చారు కుంకుమ భూషితమ్‌ | రత్న దర్పణ హస్తం చ కజ్జలో జ్జ్వలలోచనమ్‌ || 8

సుందరమగు సంపెంగల కాంతి వంటి కాంతితో ప్రకాశించువాడు, ఒక ముఖము గలవాడు, మూడు కన్నులు గలవాడు, చిరునవ్వుతో గూడి ప్రసన్నముగా నున్న ముఖము గలవాడు, రత్నములతో, బంగరు ఆభరణములతో అలంకరింపబడినవాడు (5), మల్లెల మాలను ధరించినవాడు, గొప్ప రత్నములు పొదిగిన కిరీటముతో విరాజిల్లువాడు, మంచి కంఠహారమును ధరించినవాడు, సుందరమగు కంకణములతో అంగదములతో అలంకరింపబడినవాడు (6), అగ్నివలె ప్రకాశించు సాటిలేని సన్నని నూలుతో వడకిన సుందరమగు అమూల్యమైన రంగు రంగుల వస్త్రముల జంటతో ప్రకాశించువాడు (7) చందనము, అగరు, కస్తూరి, మంచి కుంకుమలతో అలంకరింపబడిన వాడు, రత్నపుటద్దము చేతి యందు గలవాడు, కాటుకతో ఒప్పారు కన్నులు గలవాడు అగు శివుని చూచెను (8).

సర్వస్వప్రభయాచ్ఛన్న మతీవ సుమనోహరమ్‌ | అతీవ తరుణం రమ్యం భూషితాంగైశ్చ భూషితమ్‌ || 9

కామినీ కంతమవ్యగ్రం కోటి చంద్రననాంబుజమ్‌ | కోటిస్మరాధిక తనుచ్ఛవిం సర్వాంగం సుందరమ్‌ || 10

ఈ దృగ్విధం సుదేవం తం స్థితం స్వపురతః ప్రభుమ్‌ | దృష్ట్వా జామాతరం మేనా జహౌ శోకం ముదాన్వితా || 11

ప్రశశంస స్వభాగ్యం సా గిరిజాం భూధరం కులమ్‌ | మేనే కృతార్థామాత్మానం జహర్ష చ పునః పునః || 12

తన కాంతిచే సర్వమును కప్పివేసిన వాడు, మిక్కిలి మనోహరాకారుడు, యువకుడు, సుందరుడు, అలంకరింపబడిన అవయవములతో నొప్పారువాడు (9), స్త్రీలను మోహింపజేయువాడు, తొందరపాటు లేనివాడు, కోటిచంద్రుల కాంతి గల పద్మము వంటి ముఖము గలవాడు, కోటి మన్మథుల కంటె అధికమగు శరీరకాంతి గలవాడు, సర్వాంగ సుందరుడు (10), గొప్ప దైవము, మహాప్రభుడు అగు అటు వంటి శివుడు అల్లుని స్థానములో తన యెదట నిలబడియుండగా గాంచిమేన శోకమును వీడి ఆనందించెను (11). ఆ మేన తన భాగ్యమును, పార్వతి సౌభాగ్యమును, హిమవంతుని, మరియు తన కులమును కొనియాడెను. ఆమె తాను కృతార్థురాలైనట్లు భావించి గొప్ప ఆనందమును పొందెను (12).

నీరాజనం చకారాసౌ ప్రఫుల్ల వదనా సతీ | అవలోకపరా తత్ర మేనా జామాతరం ముదా || 13

వికసించిన ముఖము గల ఆ మేన అల్లుని ఆనందంముతో పరికిస్తూ అచట ఆయనకు నీరాజనము నిచ్చెను (13).

గిరిజోక్త మనుస్మృత్య మేనా విస్మయమాగతా | మనసైవ హ్యు వా చేదం హర్ష ఫుల్లాననాంబుజా || 14

యద్వై పురోక్తం చ తయా పార్వత్యా మమ తత్ర చ | తతో%ధికం ప్రపశ్యామి సౌందర్యం పరమేశితుః || 15

మహేశస్య సులావణ్య మనిర్వాచ్యం చ సంప్రతి | ఏవం విస్మయమాపన్నా మేనా స్వగృహమామ¸° || 16

ప్రశశంసుర్యువతయో ధన్యా ధన్యా గిరేస్సుతా | దుర్గా భగవతీ త్యేవ మూచుః కాశ్చన కన్యకాః || 17

పార్వతి పలుకులను స్మరించుకొని విస్మయమును పొందిన మేన ఆనందముతో వికసించిన పద్మము వంటి ముఖము గలదై మనసులో ఇట్లు తలపోసెను (14). పార్వతి పూర్వము అచట నాతో చెప్పిన సౌందర్యము కంటె అధికమగు సౌందర్యము మహేశ్వరుని యందు కనబడుచున్నది (15). ఇప్పటి మహేశ్వరుని సొగసును వర్ణించుట సంభవము కాదు. మేన ఈ తీరున విస్మయమును పొంది తన గృహమునకు వెళ్లెను (16). పార్వతి ధన్యురాలు, ధన్యురాలని స్త్రీలు కొనియాడిరి. దుర్గ, భగవతి ఈమె అని కొందరు కన్యకలు పలికిరి (17).

న దృష్టో వర ఇత్యేవమస్మాభిర్ధ్యానగోచరః | ధన్యా హి గిరిజా దేవిమూచుః కాశ్చన కన్యకాః || 18

జగర్గంధర్వ ప్రవరా ననృతుశ్చాప్సరోగణాః | దృష్ట్వా శంకరరూపం చ ప్రహృష్టాస్సర్వదేవతాః || 19

నానా ప్రకారవాద్యాని వాదకా మధురాక్షరమ్‌ | నానా ప్రకారశిల్పేన వాదయామాసురాదరాత్‌ || 20

హిమాచలో%పి ముదితో ద్వారాచారమథాకరోత్‌ | మేనాపి సర్వనారీభిర్మహోత్సవపురస్సరమ్‌ || 21

'ఇటువంటి వరుడు మాకెన్నడునూ కానరాలేదు. మేము ధ్యానములోనైననూ ఇట్టి వరుని చూడలేదు. పార్వతి ధన్యురాలు' అని కొందరు కన్యలు మేనాదేవితో చెప్పిరి (18). గంధర్వ శ్రేష్ఠులు గానము చేయగా, అప్సరసల గణములు నర్తించెను. శంకరుని రూపమును చూసి దేవతలందరు మిక్కిలి ఆనందించిరి (19). వాద్యగాండ్రు వివిధ వాద్యములను వివిధ రకముల నైపుణ్యముతో మధురముగా శ్రద్ధతో మ్రోగించిరి (20). ఆనందముతో నిండిన హిమవంతుడు మరియు మేన స్త్రీలందరితో గూడి మహోత్సాహముతో ద్వారము వద్ద జరిగే ఆచారముననుష్ఠించిరి (21).

పరిపృచ్ఛాం చకారాసౌ ముదితా స్వగృహం య¸° | శివో నివేదితం స్థానం జగామ గణ నిర్జరైః ||

22

ఏతస్మిన్నంతరే దుర్గాం శైలాంతః పురచారికాః | బహిర్జగ్ముస్సమాదాయ పూజితుం కులదేవతామ్‌ ||23

తత్ర తాం దదృశుర్దేవా నిమేషారహితా ముదా | సునీలాంజన వర్ణాభాం స్వాంగైశ్చ ప్రతి భూషితామ్‌ || 24

త్రినేత్రాదృతనే త్రాం తామన్యవారితలోచనామ్‌ | ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం సకటాక్షం మనోహరమ్‌ || 25

మేన పార్వతీ పరమేశ్వరుల పేర్లను అడిగి చెప్పించెను. ఆమె ఆనందముతో తన గృహమునకు వెళ్ళెను. శివుడు గణములతో దేవతలతో గూడి తనకు వినయముగా నిర్దేశింపబడిన స్థానమునకు వెళ్ళెను (22). ఇంతలో హిమవంతుని అంతః పుర పరిచారికలు కులదేవతను ఆరాధించుటకై దుర్గను తీసుకొని నగర బహిః స్థానమునకు వెళ్ళిరి (23). ఆ సమయములో నల్లని కాటుక రంగు కలిగినది, తన అవయవములే అలంకారముగా గలది, ముక్కంటిని ప్రేమతో చూచు నేత్రములు గలది, కన్నులతో ఇతరులను చూడనిది, చిరునవ్వుతో ప్రసన్నమగు ముఖముగలది, మనోహరములగు నేత్రములు గలది అగు ఆ దేవిని దేవతలు ఆనందముతో రెప్ప వాల్చకుండగా చూచిరి (24,25).

సుచారు కబరీభారాం చారు పత్రకశోభితామ్‌ | కస్తూరీ బిందుభిస్సార్ధం సిందూర బిందుశోభితామ్‌ || 26

రత్నేంద్ర సారహారేణ వక్షసా సువిరాజితామ్‌ | రత్న కేయూరవలయాం రత్న కంకణమండితామ్‌ |7 27

సద్రత్నకుండలాభ్యాం చ చారుగండస్థలోజ్జ్వలామ్‌ | మణిరత్న ప్రభాముష్టి దంతరాజివిరాజితామ్‌ || 28

మధు బింబాధరోష్ఠాం చ రత్నయావక సంయుతామ్‌ | రత్న దర్పణహస్తాం చ క్రీడా పద్మవిభూషితామ్‌ || 29

అందమగు కేశపాశము గలది, చెక్కిళ్లపై సుందరమగు పత్రరచన గలది, కస్తూరి బిందువులతో గూడిన కుంకుమబొట్టుతో ప్రకాశించుచున్నది (26). సర్వ శ్రేష్ఠరత్నములు పొదిగిన హారముతో శోభిల్లు వక్షస్థ్సలము గలది, రత్నములు పొదిగిన అంగదములను, కంకణములను ధరించి శోభిల్లునది (27), చక్కని రత్న కుండలములు కాంతులతో ప్రకాశించు అందమగు చెక్కిళ్లు గలది, మణుల కాంతులను, రత్నముల ప్రభలను అపహరించే దంత పంక్తితో ప్రకాశించుచున్నది (28), దొండపండు వంటి అధరోష్ఠము గలది, పాదముల యందు రత్ననూపురములను మరియు లత్తుక రంగును కలిగియున్నది, చేతి యందు రత్నపుటద్దమును, లీలా పద్మమును ధరించి ప్రకాశించునది అగు పార్వతిని వారు చూచిరి (29).

చందనాగురు కస్తూరీ కుంకుమేనాతి చర్చితామ్‌ | క్వణన్మంజీరపాదాం చ రక్తాంఘ్రితలరాజితామ్‌ || 30

ప్రణముశ్శిరసా దేవీం భక్తి యుక్తా స్సమేనకామ్‌ || సర్వే సురాదయో దృష్ట్వా జగదాద్యాం జగత్ప్రసూమ్‌ || 31

త్రినేత్రో నేత్రకోణన తాం దదర్శ ముదాన్వితః | శివస్సత్యాకృతిం దృష్ట్వా విజహౌ విరహజ్వరమ్‌ || 32

శివస్సర్వం విపస్మార శివసన్న్యస్తలోచనః | పులకాంచిత సర్వాంగో పుర్షాద్గౌరీవిలోచనః || 33

ఆమె చందనము, అగరు, కస్తూరి, కుంకుమలను లేపనము చేసుకున్నది. ఆమె పాదములు ఎర్రగా ప్రకాశించుచుండెను. మంజీరములు మధురముగా ధ్వినించుచుండెను (30). జగత్కారణము, జగత్తునకు తల్లి అగు పార్వతీ దేవిని మేనకతో సహా చూచి దేవతలు మొదలగు వారందరు భక్తితో కూడినవారై శిరస్సులను వంచి నమస్కరించిరి (31). ముక్కంటి ఆనందముతో ఆమెను ఓరకంట చూచెను. ఆ సతీదేవి యొక్క ఆకృతిని చూచి శివుడు విరహజ్వరమును విడనాడెను (32). పార్వతివైపు చూచుచున్న శివుని అంగములన్నియూ పులకించి పోయెను. ఆయన కన్నులు ఆనందముతో నిండెను. ఆయన కన్నులలో ఆమెయే నిండి యుండుటచే ఆయన సర్వమును మరచెను (33).

అథ కాలీ బహిః పుర్యాం గత్వా పూజ్య కులాంబికామ్‌ | వివేశ భవనం రమ్యం స్సపితుస్స ద్విజాంగనా || 34

శంకరో%పి సురైస్సార్ధం హ రిణా బ్రహ్మణా తథా | హిమాచల సముద్దిష్టం స్వస్థానమగమన్ముదా || 35

తత్ర సర్వే సుఖం తస్థుస్సేవంతశ్శంకరం యథా | సమ్మానితా గిరీశేన నానావిధసుసంపదా || 36

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే వరగమనాది వర్ణనం నామ షట్‌ చత్వారింశో%ధ్యాయః (46).

తరువాత ఆ కాళి బ్రాహ్మణ స్త్రీలతో కలిసి నగరమునకు బయట కులదైవమగు అంబికను అర్చించి తిరిగి తన తండ్రి యొక్క సుందరమగు భవనములో ప్రవేశించెను (34). శంకరుడు కూడా దేవతలతో, విష్ణువుతో మరియు బ్రహ్మతో గూడి హిమవంతునిచే నిర్దేశించబడిన తమ మకామునకు ఆనందముతో వెళ్లెను (35). హిమవంతునిచే సమస్త సంపదలతో సన్మానింపబడిన ఆ దేవతలందరు అచట శంకరుని సేవిస్తూ సుఖముగా నుండిరి (36).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీఖండలో వరుని రాకను వర్ణించుట అనే నలుబదియారవ అధ్యాయము ముగిసినది (46).

Sri Sivamahapuranamu-II    Chapters