Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏక చత్వారింశోధ్యాయః

వివాహ మండపము

బ్రహ్మోవాచ|

తతస్సంమత్య్ర చ మిథః ప్రాప్యాజ్ఞాం శాంకరీం హరిః| మునే త్వాం ప్రేషయామాస ప్రథమం కుధరాలయమ్‌ 1

అథ ప్రణమ్య సర్వేశం గతస్త్వం నారదా గ్రతః | హరిణా నోదితః ప్రీత్యా హిమాచల గృహం ప్రతి || 2

త్వం మునేపశ్య ఆత్మానం గత్వా తద్వ్రీడయాన్వితమ్‌ | కృత్రిమం రచితం తత్ర విస్మితో విశ్వకర్మణా || 3

శ్రాంతస్త్వ మాత్మాన తేన కృత్రిమేణ మహామునే | అవలోకపర స్సోభూచ్చరితం విశ్వకర్మణః || 4

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! అపుడు విష్ణువు ఇతరులతో సంప్రదించి శంకరుని ఆజ్ఞను పొంది ముందుగా నిన్ను హిమవంతుని గృహమునకు పంపెను (1). ఓ నారదా! హరిచే ప్రేరితుడవైన నీవు సర్వేశ్వరునకు నమస్కరించి ముందుగా హిమవంతుని గృహమునకు ఆనందముతో వెళ్లితివి (2). ఓ మునీ! నీవచటకు వెళ్లి విశ్వకర్మచే రచింపబడిన నీ కృత్రిమ మూర్తిని గాంచి సిగ్గును, ఆశ్చర్యమును పొందితివి(3). మహార్షీ! అలసి యున్న నీవు విశ్వకర్మచే నిర్మింపబడిన నీయొక్క కృత్రిమ మూర్తిని చూస్తూ నిలబడి యుంటివి (4).

ప్రవిష్టో మండపం తస్య హిమాద్రే రత్న చిత్రితమ్‌ | సువర్ణ కలశైర్జుష్టం రంభాది బహుశోభితమ్‌ || 5

సహస్ర స్తంభ సంయుక్తం విచిత్రం పరమాద్భుతమ్‌ | వేదికాం చ తథా దృష్ట్వా విస్మయం త్వం మునే హ్యయాః || 6

తదావోచశ్చ స మునే నారద త్వం నగేశ్వరమ్‌ | విస్మితోతీవ మనసి నష్ట జ్ఞానో విమూఢధీః || 7

ఆగతాస్తే కిమధునా దేవ విష్ణు పురోగమాః | తథా మహర్ష యస్సర్వే సిద్ధా ఉపసురాః తథా || 8

మహాదేవో వృషారూఢో గణౖశ్చ పరివారితః | ఆగతః కిం వివాహార్థం వద తథ్యం నగేశ్వర || 9

ఇత్యేవం వచనం శ్రుత్వా తవ విస్మిత చేతసః | ఉవాచ త్వాం మునే తథ్యం వాక్యం స హిమవాన్‌ గిరిః || 10

ఓ మునీ! నీవు ఆ హిమవంతుని యెక్క, రత్నములతో పొదుగబడినది, బంగరు కలశములతో కూడి యున్నది, అరటి చెట్లు మొదలగు అలంకారములతో మిక్కిలి శోభిల్లునది (5), వేయి స్తంభములు గలది, అనేక రంగులు గలది, పరమాశ్చర్య కరమైనది అగు వివాహ మండపమును ప్రవేశించి వేదికను చూచి విస్మయమును పొందితివి (6). ఓ నారదమునీ! అట్టి నీవు మనస్సులో గొప్ప విస్మయమును పొంది, జ్ఞానము తొలగుటచే విమోహితమైన బుద్ధి గలవాడవై ఆ పర్వతరాజుతో ఇట్లంటివి (7). విష్ణువు మొదలగు దేవతలు వచ్చి యున్నారా యేమి? మరియు మహర్షులు, సిద్ధులు, ఉపసురులు అందరు విచ్చేసినారా? (8). మహాదేవుడు వృషభమునధిష్ఠించి గణములచే పరివేష్టింప బడిన వాడై వివాహము కొరకు వచ్చియున్నాడా యేమి? ఓ పర్వత రాజా! సత్యమును పలుకుము (9). ఓ మునీ! విస్మయముతో నిండిన మనస్సు గల నీ ఈ మాటను విని ఆ హిమవంతుడు నీతో సత్యవాక్యము నిట్లు పలికెను (10).

హిమవానువాచ|

హే నారద మహా ప్రాజ్ఞాగతో నైవాధునా శివః | వివాహార్థం చ పార్వత్యా స్సగణ స్సవరాతకః || 11

విశ్వకర్మ కృతం చిత్రం విద్ధి నారద సద్ధియా | విస్మయం త్యజ దేవర్షే స్వస్థో భవ శివం స్మర || 12

భుక్త్వా విశ్రమ్య సుప్రీతః కృపాం కృత్వా మమోపరి | మైనాకాది ధరైస్సార్ధం గచ్ఛ త్వం శంకరాంతికమ్‌ || 13

ఏభిస్సమేతో గిరిభిర్మహామతే సంప్రార్థ్య శీఘ్రం శివమత్ర చానయ |

దేవై స్సమేతం చ మహర్షి సంఘైః సురాసురైరర్చి తపాదపల్ల వమ్‌ || 14

హిమవంతుడిట్లు పలికెను-

ఓ నారదా! మహాప్రాజ్ఞా! శివుడు పార్వతిని వివాహమాడుటకై గణములతో కూడి వరయాత్రా సమేతుడై ఇంతవరకు రాలేదు (11). ఓ నారదా! ఇది విశ్వకర్మ సద్బుద్ధితో చేసిన విచిత్రమని యెరుంగుము. ఓ దేవర్షీ! విస్మయమును వీడుము. స్వస్థుడవై శివుని స్మరించుము (12). నీవు భోజనము చేసి , విశ్రమించి, నాపై దయ యుంచి, మైనాకుడు మొదలగు పర్వతములతో గూడి ఆనందముతో శంకరుని వద్దకు వెళ్లుము (13). ఓ మహామతీ! ఈ పర్వతములతో గూడి నీవు శీఘ్రమే శివుని వద్దకు వెళ్లి ప్రార్థించుము. దేవతలతో కూడి యున్నవాడు, మహర్షుల సంఘములచే, మరియు దేవతలచే రాక్షసులచే పూజింపబడే చిగుళ్ల వంటి పాదములు గలవాడు అగు శివుని ఇచటకు తీసుకొని రమ్ము (14).

బ్రహ్మోవాచ|

త థేతి చోక్త్వా గమ ఆశు హి త్వం సదైవ తైశ్శైల సుతాదిభిశ్చ |

తత్రత్యకృత్యం సువిధాయ భుక్త్వా మహామనాస్త్వం శివసన్నిధానమ్‌ || 15

తత్ర దృష్టో మహాదేవో దేవాది పరివారితః | నమస్కృతస్త్వయా దీప్తశ్శైలైసై#్త ర్భక్తి తశ్చ వై || 16

తదా మయా విష్ణునా చ సర్వే దేవా స్సవాసవాః | ప ప్రచ్ఛుస్త్వాం మునే సర్వే రుద్రస్యాను చరాస్తథా || 17

విస్మితాః పర్వతాన్‌ దృష్ట్వా సందేహాకుల మానసాః | మైనాక సమ్యమేర్వా ద్యాన్నా నాలంకార సంయుతాన్‌ || 18

బ్రహ్మ ఇట్లు పలికెను-

సరే యని పలికి నీవు వెంటనే ఆ పర్వత రాజకుమారులతో, మరియు ఇతరులతో గూడి మరలివచ్చితివి. విశాల హృదయుడవగు నీవు అచటి కార్యమును చక్కబెట్టి, భోజనము చేసి శీఘ్రమే శివుని సన్నిధికి వచ్చితివి (15). అచట దేవతలు మొదలగు వారిచే చుట్టు వారబడి యున్న మహాదేవుని చూచి నీవు, ఆ పర్వతులు భక్తితో ఆయనకు నమస్కరించిరి (16). ఓ మునీ! అపుడు నేను, విష్ణువు, ఇంద్రుడు, సర్వ దేవతలు, మరియు రుద్రుని అనుచరులు అందరు నిన్ను ప్రశ్నించితిమి (17). అనేకములగు ఆభరణములను ధరించి యున్న మైనాక సహ్య మేరు ఇత్యాది పర్వతులను చూచిన వెంటనే అందరి మనస్సులు సందేహముచే వ్యాకులమైనవి. వారికి విస్మయము కలిగినది (18).

దేవా ఊచుః |

హే నారద మహాప్రాజ్ఞ విస్మితస్త్వం హి దృశ్యసే | సత్కృతోసి హిమాగేన కిం న వా వద విస్తరాత్‌ || 19

ఏతే కస్మాత్సమాయాతాః పర్వతా ఇహ సత్తమాః | మైనాక సహ్య

మేర్వాద్యాస్సుప్రతాపాస్స్వలంకృతాః || 20

కన్యాం దాస్యతి శైలోసౌ స భ##వే వా న నారద | హిమాలయ గృహే తాత కిం భవత్యద్య తద్వద || 21

ఇతి సందిగ్ధ మనసామస్మాకం చ దివౌకసామ్‌ | వద త్వం పృచ్ఛ మానానాం సందేహం హర సువ్రత || 22

దేవతలిట్లు పలికిరి -

ఓ నారదా! మహాప్రాజ్ఞా! నీవు విస్మయమును పొందిన వాడువలె కన్పట్టు చున్నావు. హిమవంతుడు నిన్ను సత్కరించినాడా? లేదా? విస్తరముగా చెప్పుము (19). గొప్ప ప్రతాపము గల వారు, చక్కగా అలంకరించు కున్నవారు అగు ఈ మైనాక సహ్యమేర్వాది పర్వతోత్తములు ఇచటకు ఏల విచ్చేసిరి? (20) ఓ నారదా! ఈ హిమవంతుడు శివునకు కన్యను ఇచ్చువాడా? కాదా? తండ్రీ! ఇపుడు హిమవంతుని గృహములో ఏమి జరుగుచున్నది? ఆ విషయమును చెప్పుము (21). దేవతల మగు మాకు మనస్సులో సందేహము కలుగుచున్నది. హే మహావ్రతా! మా ప్రశ్నలకు సమాధానముల నిచ్చి సందేహములను తీర్చుము (22).

బ్రహ్మోవాచ|

ఇత్యాకర్ణ్య వచస్తేషాం విష్ణ్వాదీనాం దివౌకసామ్‌ | అవోచస్తాన్మునే త్వం హి విస్మితస్త్వాష్ట్ర మాయయా || 23

ఏకాంత మాశ్రిత్య హి మాం హి విష్ణుమ భాషథా వాక్యమిదం మునే త్వమ్‌ |

శచీపతిం సర్వసురేశ్వరం వై పక్షచ్చిదం పూర్వరిపుం ధరాణామ్‌ || 24

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! విశ్వకర్మ యొక్క మాయచే విస్మితుడవైన నీవు విష్ణువు మొదలగు ఆ దేవతల ఈ మాటను విని వారికి బదులు చెప్పి యుంటివి (23). ఓ మునీ! నీవు నన్ను, విష్ణువును, సర్వదేవతలకు ప్రభువు, శచీపతి, పర్వతముల రెక్కలను పూర్వము దునుమాడి శత్రుత్వమును నెరపిన ఇంద్రుని ఏకాంతమునందు పిలిచి ఇట్లు చెప్పి యుంటివి (24).

నారద ఉవాచ |

త్వష్ట్రా కృతం తద్వికృతం విచిత్రం విమోహనం సర్వ దివౌకసాం హి |

యేనైవ సర్వాన్‌ స విమోహితుం సురాన్‌ సమిచ్ఛతి ప్రేమత ఏవ యుక్త్యా || 25

పురా కృతం తస్య విమోహనం త్వయా సువిస్మృతం తత్‌ సకలం శచీపతే |

తస్మాదసౌ త్వాం విజిగీషు రేవ గృహే ధ్రువం తస్య గిరేర్మహాత్మనః || 26

అహం విమోహితస్తేన ప్రతిరూపేణ భాస్వతా | తథా విష్ణుః కృతస్తేన బ్రహ్మా శక్రోపి తాదృశః || 27

నారదుడిట్లు పలికెను-

వికృతము, విచిత్రము, దేవతలనందరినీ మోహింపజేయునది అగు మాయను విశ్వకర్మ నిర్మించినాడు. ఆతడు ప్రేమతో గూడిన యుక్తితో దేవతలనందరినీ మోహింపజేయు గోరు చున్నాడు (25). ఓ శచీ పతీ! పూర్వము నీ వాతనిని మోమింపజేసితివి. ఆ వృత్తాంతమునంతనూ నీవు మరచితివి. అందువలననే ఆతడు మహాత్ముడగు హిమవంతుని ఇంటిలో నిన్ను జయింపగోరు చున్నాడనుటలో సందేహము లేదు (26). ప్రకాశముతో కూడి యున్న నాకృత్రిమ రూపము నన్ను మోహపెట్టినది. ఆతడు విష్ణు, బ్రహ్మ, ఇంద్రుల రూపములనే విధముగా నిర్మించినాడు (27).

కిం బహూక్తేన దేవేశ సర్వ దేవగణాః కృతాః | కృత్రిమాశ్చిత్ర రూపేణ న కించి దవశేషితమ్‌ || 28

విమోహనార్థం సర్వేషాం దేవానాం చ విశేషతః | కృతా మాయా చిత్ర మయీ పరిహాసవికారిణీ || 29

ఇన్నిమాటలేల? ఓ దేవ దేవా! దేవ గణములందరి యొక్క కృత్రిమరూపములు నిర్మింపబడి యున్నవి. ఎవ్వరూ మిగులలేదు (28). దేవతలందరినీ ప్రత్యేకించి మోహింపజేయుటకై కృత్రిమ చిత్రముల రూపములో పరిహాసమును చేసే వికృతమైన మాయ నిర్మించబడినది (29).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వా వచనం తస్య దేవేంద్రో వాక్యమబ్రవీత్‌ | విష్ణుం ప్రతి తదా శీఘ్రం భయాకుల తనుర్హరిమ్‌ || 30

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆతని ఆ మాటను విని భయముచే కంపించే శరీరము గల దేవేంద్రుడు వెంటనే పాపములను పోగెట్టే విష్ణువుతో నిట్లనెను (30).

దేవేంద్ర ఉవాచ|

దేవ దేవ రమానాథ త్వష్టా మాం నిహ నిష్యతి | పుత్రశోకేన తప్తోసౌ వ్యాజేనానేన నాన్యథా || 31

దేవేంద్రుడిట్లు పలికెను-

దేవ దేవా! లక్ష్మీపతీ! పుత్రశోకముతో పీడింపబడే ఈ విశ్వకర్మ ఈ మిషతో నన్ను నిశ్చయమగా చంపివేయును (31).

బ్రహ్మోవాచ |

తస్య తద్వచనం శ్రుత్వా దేవదేవో జనార్దనః | ఉవాచ ప్రహసన్‌ వాక్యం శక్రమాశ్వాసయంస్తదా || 32

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇంద్రుని ఆ మాటను విని దేవదేవుడగు జనార్దనుడు నవ్వుతూ, ఆతనిని ఓదారుస్తూ, అపుడు ఇట్లు పలికెను (32).

విష్ణురువాచ|

నివాతకవచైః పూర్వం మోమితోసి శచీపతే | మహావిద్యా బలేనైవ దానవైః పూర్వవైరిభిః || 33

పర్వతో హిమవానేష తథాన్యేఖిల పర్వతాః | విపక్షా హి కృతాస్సర్వే మమ వాక్యాచ్చ వాసవ || 34

తేనుస్మృత్యా తు వైదృష్ట్వా మాయయా గిరయో హ్యమీ | జేతుమిచ్ఛంతు యే మూఢా న భేతవ్య మరావపి || 35

ఈశ్వరో నో హి సర్వేషాం శంకరో భక్తవత్సలః | సర్వథా కుశలం శక్ర కరిష్యతి న సంశయః || 36

విష్ణువు ఇట్లు పలికెను-

ఓ శచీపతీ! నీకు పూర్వశత్రువులగు నివాతకవచులను రాక్షసులు మహావిద్య యొక్క బలము చేతనే పూర్వము నిన్ను మోహింపజేసిరి (33). ఇంద్రా! నీవు నా ఆదేశముచే ఈ హిమవత్పర్వతునితో మాత్రమే గాక, ఇతర పర్వతములన్నింటితో విరోధమును నెరపి యుంటివి (34). ఈ పర్వతములు ఆ వృత్తాంతమును స్మరించి మూఢులై మనలను మాయచే జయింపనిచ్చగించి యుండవచ్చును. కాని నీవు లేశ##మైననూ భయపడవలదు (35). ఇంద్రా! మనందరికీ ప్రభువు, భక్తవత్సలుడు అగు శంకరుడు నిస్సందేహముగా అన్ని విధములుగా క్షేమమును కలిగించగలడు (36).

బ్రహ్మోవాచ|

ఏవం సం వదమానం తం శక్రం వికృతమానసమ్‌ | హరిణోక్తశ్చ గిరిశో లౌకికీం గతి మాశ్రి తః || 37

హే హరే హ సురేశాన కిం బ్రూథోద్య పరస్పరమ్‌ | ఇత్యుక్త్వా తౌ మహాశానో మునే త్వాం ప్రత్యువాచ సః || 38

కిం ను వక్తి మహాశైలో యథార్థం వద నారద | వృత్తాంతం సకలం బ్రూహిన గోప్యం కర్తు మర్హసి || 39

బ్రహ్మ ఇట్లు పలికెను -

వికారమును పొందిన మనస్సుగల ఇంద్రుడు, విష్ణువు ఇట్లు మాటలాడుకొనుచుండగా, శివుడు లోకపు పోకడననుసరిస్తూ, వారితో నిట్లనెకను (37). హే హరీ! ఓ ఇంద్రా! మీరిద్దరు ఒకరితోనొకరు ఏమి మాటలాడు కొను చున్నారు? మహేశ్వరుడిట్లు వారితో పలికి, తరువాత నీతో ఇట్లనెను (38). ఓ నారదా! పర్వతరాజు ఏమనుచున్నాడు? సత్యమును చెప్పుము. వృత్తాంతమునంతనూ చెప్పుము. ఏమియూ దాచిపెట్టవద్దు (39).

దదాతి వా నైవ దదాతి శైలః సుతాం స్వకీయాం వద తచ్చ శీఘ్రమ్‌ |

కిం తే దృష్టం కిం కృతం గత్వా ప్రీత్యా సర్వం తద్వదాశ్వద్య తాత || 40

హిమవంతుడు తన కుమార్తెను ఇచ్చునా? ఈయడా? ఆ విషయమును వెంటనే చెప్పుము. నీవచటకు వెళ్లి ఏమి చూసితివి? ఏమి చేసితివి? వత్స! ఇపుడా విషయమునంతనూ వెంటనే చెప్పుము (40).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్త శ్శంభునా తత్ర మునే త్వం దేవదర్శనః | సర్వం రహస్యవోచో వై యద్దృష్టం తత్ర మండపే || 41

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! శంభుడిట్లు పలుకగా, మహా జ్ఞానివగు నీవు అచట మండపము నందు చూచిన దంతయూ రహస్యముగా చెప్పియుంటివి (41).

నారద ఉవాచ |

దేవ దేవ మహాదేవ శృణు మద్వచనం శుభమ్‌ |నాస్తి విఘ్నభయం నాథ వివాహే కించిదేవ హి || 42

అవశ్యమేవశైలేశస్తుభ్యం దాస్యతి కన్యకామ్‌ | త్వామానయితు మాయాతా ఇమే శైలా న సంశయః || 43

కిం తు హ్మమర మోహార్థం మాయా విరచితాద్భుతా | కుతూహలార్థం సర్వజ్ఞ న కశ్చిద్విఘ్నసంభవః || 44

విచిత్రం మండపం గేహేకార్షీత్తస్య తదాజ్ఞయా | విశ్వకర్మా మహామాయీ నానాశ్చర్య మయం విభో || 45

నారదిట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! నా శుభవచనమును వినుము. ఓ నాథా! వివాహము నందు విఘ్నము కలుగుననే భయము ఏమియూ లేదు (42). హిమవంతుడు కన్యకను నీకిచ్చుట నిశ్చయము. ఈ పర్వతులు నిన్ను దోడ్కొని వెళ్లుటకై వచ్చి యున్నారు. సంశయము లేదు (43). ఓ సర్వజ్ఞా! కాని దేవతలను మోమింపజేసి కుతూహలమును కలిగించుట కొరకై అద్భుతమగు మాయ రచింపబడినది. విఘ్నము కలిగే ప్రసక్తియే లేదు (44). హే విభూ! హిమవంతుని ఆజ్ఞచే ఆతని గృహమునందు మహామాయావి యగు విశ్వకర్మ అనేకములగు అద్భుతములతో నిండియున్న విచిత్ర మగు మండపమును నిర్మించెను (45).

సర్వ దేవ సమాజశ్చ కృతస్తత్ర విమోహనః | తం దృష్ట్వా విస్మయం ప్రాప్తోహం తన్మాయా విమోహితః || 46

దేవ సమాజమంతయూ అచట మోహమును కలిగించు రీతిలో నిర్మింపబడనది. నేను దానిని చూచి ఆ మాయచే విమోహితుడనై విస్మయమును పొందితిని (46).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వా తద్వచస్తాత లోకాచారకరః ప్రభుః | హర్యాదీన్‌ ప్రహసన్‌ శంభురువాచ సకలాన్‌ సురాన్‌ || 47

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! లోకాచారములను ప్రవర్తిల్ల జేయు శంభు ప్రభుడు ఆ మాటను విని నవ్వి విష్ణువు మొదలగు దేవతలందరితో నిట్లనెను (47).

ఈశ్వర ఉవాచ |

కన్యాం దాస్యతి చేన్మహ్యాం పర్వతో హి హిమాచలః | మాయయా మమ కిం కార్యం వద విష్ణో యథాతథమ్‌ || 48

హే బ్రహ్మన్‌ శక్ర మునయస్సురా బ్రూతా యథార్థతః | మాయమా మమ కింకార్యం కన్యాం దాస్యతి చేద్గిరిః || 49

కేనాప్యుపాయేన ఫలం హి సాధ్యం ఇత్యుచ్యతే పండితైర్న్యాయ విద్భిః |

తస్మాత్సర్వైమ్యతాం శీఘ్రమేవ కార్యార్థి భిర్విష్ణు పురోగమైశ్చ || 50

ఈశ్వరుడిట్లు పలికెను-

హిమవంతుడు నాకు కన్యను ఇచ్చే పక్షంలో మాయతో నాకు పనియేమి? ఓ విష్ణూ! నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము (48). ఓ బ్రహ్మా! ఇంద్రా! మునులారా! దేవతలారా! సత్యమును పలుకుడు. పర్వతరాజు కన్యకు ఇచ్చే పక్షంలో నాకు మాయతో పని యేమి? (49) ఉపాయమేదైన ఫలమును సాధించవలెనని నీతివేత్తలగు పండితులు చెప్పెదరు. కావున మీరందరు విష్ణువును ముందిడు కొని వివాహకార్యము కొరకు శీఘ్రమే ముందుకుసాగుడు (50).

బ్రహ్మోవాచ|

ఏవం సంవదమానోసౌ దేవైశ్శంభురభూత్తదా | కృతస్స్మరేణౖవ వశీ వశం వా ప్రాకృతో నరః || 51

అథ శంభ్వాజ్ఞయా సర్వే విష్ణ్వాద్యా నిర్జరాస్తదా | ఋషయశ్చ మహాత్మానో యయుర్మోహ భ్రమాపహమ్‌ || 52

పురస్కృత్యమునే త్వాం చ పర్వతాంస్తాన్‌ సవిస్మయాః | హిమాద్రే శ్చ తదా జగ్ము ర్మందిరం పరమాద్భుతమ్‌ || 53

అథ విష్ణ్వాది సంయుక్తో ముదితైస్స్వబలైర్యుతః | ఆజగామోప హైమాగపురం ప్రముదితో హరః || 54

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్రసంహితాయాం పార్వతీ ఖండే మండపరచనా వర్ణనం నామ ఏక చత్వారింశోధ్యాయః (41).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ విధముగా దేవతలతో సంభాషించు చున్న ఆ శంభుడు అపుడు ప్రాకృతమానవుడు వలె మన్మథునకు వశుడైనట్లుండెను (51). అపుడు శంభుని ఆజ్ఞచే విష్ణువు మొదలగు దేవతలు, ఋషులు, మరియు సిద్ధులు మోహజనితమగు భ్రమను విడనాడిరి (52). ఓ మునీ! నిన్ను, ఆ పర్వతులను ముందిడు కొని విస్మ యావిష్టులైన ఆ దేవతలు మొదలగు వారు పరమాశ్చర్యకరమగు హిమవంతుని మందిరమునకు అపుడు వెళ్లిరి (53). తరువాత విష్ణువు మొదలగు వారితో, మరియు ఆనందముతో కూడియున్న తన గణములతో కూడి ప్రహర్షితుడైన శివుడు హిమవన్నగర సమీపమునకు వచ్చెను (54).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో వివాహమండప వర్ణనమనే నలభై ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

Sri Sivamahapuranamu-II    Chapters