Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ద్వావింశో%ధ్యాయః

పార్వతీ తపోవర్ణనము

బ్రహ్మో వాచ|

త్వయి దేవమునే యాతే పార్వతీ హృష్టమానసా | తపస్సాధ్యం హరం మేనే తపోర్థం మన ఆదధే || 1

తతస్సఖ్యౌ సమాదాయ జయాం చ విజయాం తథా | మాతరం పితరం చైవ సఖీభ్యాం పర్యపృచ్ఛత|| 2

ప్రథమం పితరం గత్వా హిమవంతం నగేశ్వరమ్‌ | పర్యపృచ్ఛత్సుప్రణమ్య వినయేన సమన్వితా|| 3

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ దేవర్షీ! నీవు వెళ్లగానే, పార్వతి సంతసించిన మనస్సు గలదై శివుడు తపస్సుచే ప్రసన్నుడగునని తలంచి, తపస్సును చేయుటకు మనస్సులో నిశ్చయము చేసుకొనెను (1). అపుడామె జయ, విజయ, అను చెలికత్తెలనిద్దరినీ తోడ్కొని తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారిచే తల్లిదండ్రులను అడిగించెను (2). ఆమె ముందుగా పర్వత రాజు, తన తండ్రి అగు హిమవంతుని వద్దకు వెళ్లి, వినయముతో గూడినదై ప్రణమిల్లి ఇట్లు అడిగించెను (3).

సఖ్యావూచతుః |

హిమవన్‌ శ్రూయతాం పుత్రీ వచనం కథ్యతే %ధునా | సా స్వయం చైవ దేహస్య రూపస్యాపి తథా పునః || 4

భవతో హి కులస్యాస్య సాఫల్యం కర్తుమిచ్ఛతి | తపసా సాధనీయో%సౌ నాన్యథా దృశ్యతాం వ్రజేత్‌ || 5

తస్మాచ్చ పర్వత శ్రేష్ఠ దేయాజ్ఞా భవతాధునా | తపః కరోతు గిరిజాం వనం గత్వేతి సాదరమ్‌ || 6

సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-

ఓ హిమవంతుడా! నీ కుమారై మనసులోని మాటను ఇపుడు మేము చెప్పెదము. ఆమె తన దేహమునకు సౌందర్యమునకు (4), మరియు నీ ఈ కులమునకు సార్ధక్యమును కలిగింప గోరుచున్నది. ఈ శివుడు తపస్సునకు మాత్రమే లొంగును. తపస్సు చేయనిచో, ఆయన దర్శనము నీయడు (5). ఓ పర్వత రాజా! కావున నీవిపుడు అనుమతిని ఇమ్ము. పార్వతి నీ ప్రేమ పూర్వకమగు ఆజ్ఞను బడసి అడవికి వెళ్లి తపస్సు చేయును గాక! (6).

బ్రహ్మో వాచ |

ఇత్యేవం చ తదా పృష్టస్సఖీభ్యాం మునిసత్తమ | పార్వత్యా సువిచార్యాథా గిరిరాజో% బ్రవీదిదమ్‌|| 7

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! పార్వతి యొక్క సఖురాండ్రిద్దరు ఈ తీరున కోరగా, అపుడా పర్వతరాజు

చక్కగా ఆలోచించి ఇట్లు పలికను (7).

హిమాలయ ఉవాచ|

మహ్యం చ రోచతే%త్యర్థం మేనాయై రుచ్యతాం పునః | యథేదం భవితవ్యం చ కిమతః పరముత్తమమ్‌|| 8

సాఫల్యం తు మదీయస్య కులస్య చ న సంశయః | మాత్రే తు రుచ్యతే చేద్వై తతశ్శుభతరం ను కిమ్‌ || 9

హిమవంతుడిట్లు పలికెను-

ఈ ప్రస్తావము నాకు సమ్మతమే. కాని మేనకకు సమ్మతము కావలయును గదా! భవిష్యత్తులో ఇటులనే జరిగినచో, ఇంతకంటె ఇత్తమమగు విషయమేమి గలదు? (8) ఈమె తపస్సు చేసినచో, నా కులము సార్థకమగుననుటలో సందేహము లేదు. కావున ఈమె తల్లికి సమ్మతమైనచో, అంతకంటె గొప్ప శుభము మరి యేది గలదు? (9)

బ్రహ్మో వాచ |

ఇత్యేవం వచనం పిత్రా ప్రోక్తం శ్రుత్వా తు తే తదా | జుగ్మతుర్మాతరం సఖ్యౌ తదాజ్ఞప్తే తయా సహా || 10

గత్వా తు మాతరం తస్యాః పార్వత్యాస్తే చ నారద | సుప్రణమ్య కరౌ బధ్వోచతుర్వతనమాదరాత్‌ || 11

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని ఆ సఖురాండ్రిద్దరు ఆమెతో గూడి తల్లి అనుమతిని పొందుటకై ఆమె వద్దకు వెళ్లిరి (10). ఓ నారదా! వారిద్దరు పార్వతియొక్క తల్లి వద్దకు వెళ్లి ఆమెకు చేతులు జోడించి నమస్కరించి ఆదరముతో నిట్లనిరి (11).

సఖ్యావూచతుః |

మాతస్త్వం వచనం పుత్య్రాశ్శృణు దేవి నమో%స్తుతే| సుప్రసన్నతయా తద్వై శ్రుత్వా కర్తుమిహార్హసి|| 12

తప్తుకామా తు తే పుత్రీ శివార్థం పరమం తపః | ప్రాప్తానుజ్ఞా పితిశ్చైవ తుభ్యం చ పరిపృచ్ఛతి|| 13

ఇయం స్వరూప సాఫల్యం కర్తుకామా పతివ్రతే | త్వదాజ్ఞయా యది జాయేత తప్యతే చ తథా తపః || 14

సఖురాండ్రిద్దరు ఇట్లు పలికిరి-

ఓ తల్లీ! నీవు నీ కుమారై యొక్క మనస్సులోని మాటను వినుము. ఓ దేవీ! నీకు నమస్కారము. ఆమె మాటను ప్రసన్నమగు మసస్సుతో విని నీవు ఆచరించ తగుదువు (12). నీ కుమారై శివుని కొరకై తపస్సును చేయగోరుచున్నది. ఆమె పరమ తపస్సును చేయుటకు తండ్రిగారి అనుమతి లభించినది. ఇపుడామె నీ అనుమతిని గోరుచున్నది. (13). ఓ పతివ్రతా! ఈమె తన సౌందర్యమును సఫలము చేయగోరుచున్నది. నీవు అనుమతినిచ్చినచో, ఆమె ఈ ఆకాంక్షను సత్యము చేయుటకై తపస్సును చేయగలదు (14).

బ్రహ్మో వాచ|

ఇత్యుక్త్వా చ తతస్సఖ్యౌ తూష్ణీమాస్తాం మునీశ్వరా | నాంగీచకార మేనా సా దత్వాక్యం ఖిన్న మానసా || 15

తతస్సా పార్వతీ ప్రాహ స్వయమేవాథ మాతరమ్‌ | కరౌ బద్ధ్వా వినీతాత్మా స్మృత్వా శివపదాంబుజమ్‌ || 16

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ఆ సఖురాండ్రిద్దరు ఇట్లు పలికి మిన్నకుండిరి. కాని భేదమును పొందిన మనస్సుగల ఆ మేన వారి మాటను అంగీకరించలేదు (15). అపుడా పార్వతి వినయముతో నిండిన మనస్సు గలదై శివుని పాద పద్మములను స్మరించి, తల్లికి చేతులు జోడించి నమస్కరించి స్వయముగా నిట్లు చెప్పెను (16).

పార్వత్యువాచ |

మాతస్తప్తుం గమిష్యామి ప్రాతః ప్రాప్తుం మహేశ్వరమ్‌ | అనుజానీహి మాం గంతుం తపసే%ద్య తపోవనమ్‌|| 17

పార్వతి ఇట్లు పలికెను-

తల్లీ! నేను మహేశ్వరుని పొందగోరి తపస్సును చేయుటకై ఉదయమే వెళ్లబోవుచున్నాను. తపస్సు కొరకై తపోవనమునకు వెళ్లుటకు నాకిప్పుడు అనుమతినిమ్ము (17).

బ్రహ్మో వాచ|

ఇత్యాకర్ణ్య వచః పుత్య్రా మేనా దుఃఖముపాగతా | సోపాహూయ తదా పుత్రీమువాచ వికలా సతీ || 18

బ్రహ్మ ఇట్లు పలికెను-

మేన కుమారై యొక్క ఈ మాటలను విని దుఃఖితురాలయ్యెను. ఆమె మనస్సు వికలమయ్యెను. ఆమె కుమారైను దగ్గరకు పిలిచి ఇట్లు పలికెను (18).

మేనోవాచ |

దుఃఖితాసి శివే పుత్రి తపస్తప్తుం పురా యది | తపశ్చర గృహే%ద్య త్వం న బహిర్గచ్ఛ పార్వతి|| 19

కుత్ర యాసి తపః కర్తుం దేవాస్సంతి గృహే మమ | తీర్థాని చ సమస్తాని క్షేత్రాణి వివిధాని చ|| 20

కర్తవ్యో న హఠః పుత్రి గంతవ్యం న బహిః క్వచిత్‌ | సాధితం కిం త్వయా పూర్వం పునః కిం సాధయిష్యసి || 21

శరీరం కోమలం వత్సే తపస్తు కఠినం మహాత్‌ | ఏతస్మాత్తు త్వయా కార్యం తపో%త్ర న బహిర్వ్రజ || 22

స్త్రీణాం తపోవన గతిర్న శ్రుతా కామనార్థినీ | తస్మాత్త్వం పుత్రి మాకార్షీస్తపోర్థం గమనం ప్రతి || 23

మేన ఇట్లు పలికెను-

హే శివే! పుత్రీ! పూర్వము తపస్సును చేసి దుఃఖమును పొందితివి. ఇపుడు ఇంటిలో నుండి తపస్సును చేయుము. పార్వతీ! బయటకు వెళ్లకుము (19). నీవు తపస్సు చేయుట కొరకై ఎచటికి వెళ్లెదవు? నా ఇంటిలో దేవతలు గలరు. పుత్రీ! మొండితనమును వీడుము. బయటకు ఎచ్చటి కైననూ వెళ్లబనిలేదు. పూర్వము నీవు సాధించిన దేమి? భవిష్యత్తులో సాధించబోవునదేమి? ఇచటనే సర్వతీర్థములు, వివిధ క్షేత్రములు గలవు (20,21). అమ్మాయీ! నీ శరీరము సుకుమారమైనది. తపస్సులో చాల క్లేశము గలదు. కావున నీవు ఇచటనే యుండి తపస్సును చేయుము. బయటకు వెళ్ళవద్దు (22). కోర్కెలను సిద్ధింపజేయుటకై స్త్రీలు తపోవనమునకు వెళ్లిరను మాటను ఇంతకుముందు విని యుండలేదు. ఓ పుత్రీ! కావున నీవు తపస్సు కొరకై వెళ్లు తలంపును చేయకుము (23).

బ్రహ్మో వాచ|

ఇత్యేవం బహుధా పుత్రీ తన్మాత్రా వినివారితా | సంవేదే న సుఖం కిం చి ద్వినారాధ్య మహేశ్వరమ్‌ || 24

తపోనిషిద్ధా త పసే వనం గంతుం చ మేనయా | హేతునా తేన సోమేతి నామ ప్రాప శివా తదా|| 25

అథ తాం దుఃఖితాం జ్ఞాత్వా మేనా శైలప్రియా శివామ్‌ | నిదేశం సా దదౌ తస్యాః పార్వత్యాస్తపసే మునే || 26

మాతురాజ్ఞాం చ సంప్రాప్య సువ్రతా మునిసత్తమ | తతస్స్వాంతే సుఖం లేభే పార్వతీ స్మృతుశంకరా|| 27

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ విధముగా ఆ తల్లి తన కుమారైను అనేక తెరంగుల వారించెను. ఆమె మహేశ్వరుని ఆరాధించని ఆ స్థితిలో లేశ##మైననూ సుఖమును పొందలేకపోయెను (24). మేన ఆమెను తపస్సు కొరకై వనమునకు వెళ్లవద్దని నిషేదించుటచే (ఉమా=అమ్మాయీ! వద్దు) పార్వతికి ఉమా అని పేరు స్థిరమయ్యేను (25). ఓ మహర్షీ! హిమవంతుని భార్యయగు ఉమ తన కుమారైయగు శివాదేవి దుఃఖించి యుండుటను గాంచెను. అపుడామె పార్వతికి తపస్సును చేయుటకై అనుమతినిచ్చెను (26). ఓ మహర్షీ! గొప్ప నిష్ఠగల పార్వతి తల్లి అనుమతిని పొంది శంకరుని స్మరించి తన అంతరంగములో సుఖమును పొందెను (27).

మాతరం పితరం సాథ ప్రణిపత్య ముదా శివా | సఖీభ్యాం చ శివాం స్మృత్వా తపస్తప్తుం సముద్గతా|| 28

హిత్వా మతాన్యనేకాని వస్త్రాణి వివిధాని చ | వల్కలాని ధృతాన్యాశు మౌంజీ బద్ధ్వా తు శోభనామ్‌|| 29

హిత్వా హారం తథా చర్మ మృగస్య పరమం ధృతమ్‌ | జగామ తపసే తత్ర గంగావతరణం ప్రతి|| 30

శంభునా కుర్వతా ధ్యానం యత్ర దగ్ధో మనోభవః | గంగావతరణో నామ ప్రస్థో హిమవతస్సచ|| 31

హరశూన్యో%థ దదృశే స ప్రస్థో హిమభూభృతః | కాల్యా తత్రేత్య భోస్తాత పార్వత్యా జగదంబయా|| 32

అపుడా పార్వతి తల్లితండ్రులకు ఆనందముతో ప్రణమిల్లి సకురాండ్రిద్దరితో గూడినదై, శివుని స్మరించి తపస్సును చేయుటకై ఇంటినుండి బయులదేరెను (28). ఆమె తనకు ప్రీతిపాత్రములగు వివిధ వస్త్రములను విడనాడి నారబట్టలను ధరించి ముంజత్రాడును బంధించి శోభిల్లెను (29). ఆమె హారమును వీడి చక్కని మృగచర్మను ధరించి తపస్సు చేయుటకై, గంగానది దివినుండి భువికి దిగిన స్థానమును చేరుకొనెను (30). గంగావతరణమని ప్రసిద్ధి గాంచిన ఆ హిమవంతుని శిఖరముపైననే శంభుడు ధ్యానము చేయుచూ, విఘ్న కారకుడు మన్మథుడు దహించెను (31). హిమవంతుని ఆ శిఖరమునకు జగదంబయగు పార్వతీ దేవి విచ్చేసెను. ఓ వత్సా! అచట ఆమెకు శివుడు ఎచ్చటనూ కానరాలేదు (32).

యత్ర స్థిత్వా పురా శంభుస్తప్తవాన్‌ దుస్తరం తపః | తత్ర క్షణం తు సా స్థిత్వా బభూవ విరహార్దితా|| 33

హా హరేతి శివా తత్ర రుదన్తీ సా గిరేస్సుతా | విలలాపాతి దుఃఖార్తా చింతాశోక సమన్వితా|| 34

తతశ్చిరేణ సా మోహం ధైర్యాత్సం స్తభ్య పార్వతీ | నియమాయాభవత్తత్ర దీక్షితా హిమవత్సుతా|| 35

తపశ్చకార సా తత్ర శృంగీతీర్థే మహోత్తమే | గౌరీ శిఖర నామాసీత్తత్తపః కరణాద్ధి తత్‌|| 36

ఏ స్థలములో పూర్వము శంభుడు కూర్చుండి ఘోరమగు తపస్సును ఆచరించినాడో, అదే స్థలమునందు ఆమె క్షణ కాలము నిలుచుండి విరహముచే దుఃఖితురాలయ్యెను (33). ఆ పార్వతీ దేవి చింతాశోకములతో నిండిన మనస్సు గలదై మిక్కిలి దుఃఖితురాలై ఆచట 'హా హారా!' అని బిగ్గరగా రోదించెను (34). తరువాత చాల సేపటికి ఆ పార్వతీ దేవి ధైర్యమును వహించి, మోహమును వీడి, తపోనియమముల నారంభించుటకై దీక్షను గైకొనెను (35). పరమ పవిత్ర తీర్థమగు ఆ శిఖరము నందామె తపస్సును చేసెను. ఆమె తపస్సును చేయుటచే ఆ శిఖరమునకు గౌరీశిఖరమను పేరు వచ్చినది (36).

సుందరాశ్చ ద్రుమాస్తత్ర పవిత్రాశ్శివయా మునే | ఆరోపితాః పరీక్షార్థం తపసః ఫలభాగినః || 37

భూమి శుద్ధిం తతః కృత్వా వేదీం సుందరీ | తథా తపస్సుమారబ్ధం మునీనామపి దుష్కరమ్‌ || 38

విగృహ్యా మనసా సర్వాణీంద్రియాణి సహాశు సా | సముపస్థానికే తత్ర చకార పరమం తపః || 39

ఓ మహర్షీ! తపస్సును చేయు కాలము యొక్క గణన కొరకై ఆమె అచట సుందరమైనవి, పవిత్రమైనవి, పండ్లను ఇచ్చునని అగు వృక్షములను పాతెను (37). సుందరియగు ఆ శివాదేవి అచట భూమిని శుద్ధిచేసి వేదికను నిర్మించి, తరువాత మునులకైన చేయ శక్యముగాని కఠిన తపస్సును చేయుట ఆరంభించెను (38). ఆమె వెనువెంటనే మనస్సును, ఇతర ఇంద్రియములనన్నింటినీ నిగ్రహించి, శివుడు తపస్సు చేసిన స్థానమునకు సమీపములో గొప్ప తపస్సును చేసెను (39).

గ్రీష్మే చ పరితో వహ్నిం ప్రజ్వలంతం దివానిశమ్‌ | కృత్వా తస్థౌ చ తన్మధ్యే సతతం జపతీ మనుమ్‌ || 40

సతతం చైవ వర్షాసు స్థండిలే సుస్థిరాసనా| శిలాపృష్ఠే చ సంసిక్తా బభూవ జలధారయా|| 41

గ్రీష్మ కాలములో చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లు చుండగా ఆమె మధ్యలో కూర్చుండి రాత్రింబగళ్లు నిరంతరముగా మంత్రమును జపించెను (40). వర్షకాలమునందు ఆమె వేదికపై స్థిరమగు ఆసనములో కూర్చుండి, లేదా రాయిపై గూర్చుండి నిరంతరముగా జపము చేయుచుండగా, ఆమెపై జలధారలు వరషించెడివి (41).

శీతే జలాంతరే శశ్వత్తస్థౌ సా భక్తితత్పరా | అనాహారాపత్తత్ర నీహారేషు నిశాసు చ || 42

ఏవం తపః ప్రకుర్వాణా పంచాక్షర జపే రతా | దధ్యౌ శివం తత్ర సర్వకామఫలప్రదమ్‌|| 43

స్వారోపితాన్‌ శుభాన్‌ వృక్షాన్‌ సఖీభిస్సించతీ ముదా | ప్రత్యహం సావకాశే సా తత్రాతిథ్యమకల్పయత్‌|| 44

వాతశ్చైవ తథా శీతవృష్టిశ్చ వివిధా తథా | దుస్సహో%పి తథా ఘర్మస్తయా సేహే సుచిత్తయా|| 45

భక్తి యందు తత్పరురాలైన ఆ పార్వతి ఆహారము లేనిదై శీతకాలములో మంచు కురియు రాత్రులందు కూడా నీటి మధ్యలో నిరంతరముగా నిలబడి తపస్సును చేసెను (42). ఈ విధముగా శివాదేవి పంచాక్షరీ జపమునందు నిమగ్నురాలై తపస్సును చేయుచూ, సర్వకామనలను ఫలములను ఇచ్చు శివుని ద్యానించెను (43). ఆమె ప్రతిదినము సఖురాండ్రతో గూడి తాను పాతిన శుభకరమగు వృక్షములకు నీరు పోసెడిది. ఆమె అచట అతిథులకు ఆనందముతో స్వాగత సత్కారముల నిచ్చెడి (44). దృఢమగు చిత్తముగల ఆ పార్వతి సహింప శక్యము గాని గాలిని, చలిని, వర్షమును, మరియు ఎండలను, ఇట్టి వివిధ వాతావరణములను సహించెను (45).

దుఃఖం చ వివిధం తత్ర గణితం న తయాగతమ్‌ | కేవలం మన ఆధాయ శివే సాసీత్‌ స్థితా మునే || 46

ప్రథమం ఫలభోగేన ద్వితీయం పర్ణభోజనైః | తపః ప్రకుర్వతీ దేవీ క్రమాన్నిన్యే%మితాస్సమాః|| 47

ఆమె తనకు సంప్రాప్తమైన వివిధ దుఃఖములను లెక్క చేయలేదు. ఓ మహర్షి ఆమె మనస్సును శివుని యందు మాత్రమే లగ్నము చేసి నిర్వికారముగా నుండెను (46). ఆ దేవి ముందు ఫలములను ఆ తరువాత పత్రములను భుజించి తపస్సు చేసెను. ఆమె ఇట్లు వరుసగా అనేక సంవత్సరములను తపస్సుతో గడిపెను (47).

తతః పర్ణాన్యపి శివా నిరస్య హిమవత్సుతా | నిరాహారాభవద్దేవీ తపశ్చరణ సంరతా || 48

ఆహారే త్యక్తపర్ణాభూద్యస్మాద్ధిమవతస్సుతా | తేన దేవైరపర్ణేతి కథితా నామతశ్శివా || 49

ఏకపాదస్థితా సాసీచ్ఛివం సంస్మృత్య పార్వతీ | పంచాక్షరీ జపంతీ త మనుం తేపే తపో మహాత్‌ || 50

చీరవల్కల సంవీతా జటాసంఘాత ధారిణీ | శివచింతన సంసక్తా జిగాయ తపసా మునీన్‌|| 51

పర్వత పుత్రియగు ఆ శివాదేవి తరువాత పత్రములను కూడ విడనాడి, ఆహారమును భుజించకుండగనే తపస్సును చేయుటలో నిమగ్నమాయెను (48). ఆమె పత్రములను కూడ భుజించుట మానివేసినది గనుక, ఆ పార్వతీ దేవికి దేవతలు అపర్ణ అను పేరును ఇచ్చిరి (49). ఆ పార్వతి ఒంటి కాలిపై నిలబడి శివుని స్మరిస్తూ పంచాక్షర మంత్రమును జపిస్తూ గొప్ప తపస్సును చేసెను (50). నార బట్టలను ధరించిన ఆమె యొక్క కేశములు జడలు గట్టినవి. శివుని ఆరాధించుటయందు లగ్నమైన మనస్సు గల ఆ దేవి తపస్సును చేయుటలో మునులను కూడ జయించెను (51).

ఏవం తస్యాస్తపస్యంత్యా చింతయంత్యా మహేశ్వరమ్‌ | త్రీణి వర్ష సహస్రాణి జగ్ముః కాల్యాస్త పోవనే || 52

షష్టి వర్ష సహస్రాణి యత్ర తేపే తపో హరః | తత్ర క్షణమథోషిత్వా చింతయామాస సా శివా || 53

నియమస్థాం మహాదేవ కిం మాం జానాసి నాధునా | యేనాహం సుచిరం తేన నానుయాతా తపోరతా || 54

లోకే వేదే చ గిరిశో మునిభిర్గీయతే సదా | శంకరస్స హి సర్వజ్ఞస్సర్వాత్మా సర్వదర్శనః || 55

ఈ విధముగా ఆ కాళీ మహేశ్వరుని ధ్యానిస్తూ తపోవనములో తపస్సును చేయుచుండగా మూడువేల సంవత్సరములు గడచిపోయినవి (52). ఏ స్థానములో శివుడు అరవై వేల సంవత్సరములు తపస్సును చేసెనో, అదే స్థానమునందు ఆ పార్వతి కొంతసేపు కూర్చుండి ఇట్లు తలపోసెను (53). ఓ మహాదేవా! నేను చిరకాలము నుండియు తపస్సును చేయుచున్ననూ నీవు నన్ను అనుగ్రహించ లేదు. నేనీ నియమములో ఉన్నాను అను విషయము నీకు ఇంత వరకు తెలియదా యేమి (54) లోకములోని భక్తులు, వేదములు మరియు మహర్షులు శంకరుడు, కైలాసగిరివాసి సర్వజ్ఞుడనియు, సర్వుల ఆత్మరూపుడనియు, సర్వసాక్షి అనియూ సర్వదా కీర్తించుచుందురు (55).

సర్వభూతిప్రదో దేవస్సర్వ భావానుబావనః | భక్తా భీష్ట ప్రదో నిత్యం సర్వక్లేశనివారణః || 56

సర్వకామాన్‌ పరిత్యజ్య యది చాహం వృషధ్వజే | అనురక్తా తదా సో%త్ర సంప్రసీదతు శంకరః || 57

యది నారద తంత్రోక్త మంత్రో జప్తశ్శరాక్షరః | సుభక్త్యా విధినా సంప్రసీదతు శంకరః || 58

యది భక్త్యా శివస్యాహం నిర్వికారా యథోదితమ్‌ | సర్వేశ్వరస్య చాత్యంతం సంప్రసీదతు శంకరః || 59

ఏవం చింతయతీ నిత్యం తేపే సా సుచిరం తపః | అధోముఖీ నిర్వికారా జటావల్కలధారిణీ|| 60

ఆ దేవుడు సర్వ సంపదలనిచ్చువాడు, అందరి మనస్సులోని భావముల నెరుంగువాడు, నిత్యము భక్తుల కోర్కెలనీడేర్చి క్లేశములనన్నిటినీ తొలగించువాడు (56). నేను కోర్కెలనన్నిటినీ విడిచి పెట్టి శివుని యందు అనురాగము కలిగియున్న దాననైనచో వృషభధ్వజుడగు ఆ శంకరుడు నన్ను అనుగ్రహించుగాక! (57) నారదుడు ఉపదేశించిన పంచాక్షరీ మంత్రమును నేను తంత్ర పూర్వకముగా చక్కని భక్తితో యథావిధిగా ప్రతిదినము జపించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగుగాక! (58) నేను సర్వేశ్వరుడగు శివుని భక్తితో వికారములు లేనిదాననై యథావిధిగా ఆరాధించి యున్నచో, శంకరుడు ప్రసన్నుడగు గాక! (59) ఆమె తలను వంచుకొని, వికారములు లేనిదై జటలను నారబట్టలను ధరించి ఇట్లు నిత్యము తలపోయిచూ చిరకాలము తపస్సును చేసెను (60).

తథా తయా తపస్తప్తం మునీనామసి దుష్కరమ్‌| స్మృత్వా చ పురుషాస్తత్ర పరమం విస్మయం గతాః || 61

తత్తపోదర్శనార్థం హి సమాజగ్ముశ్చ తే%ఖిలాః | ధన్యాన్ని జాన్మన్యమానా జగదుశ్చేతి సమ్మతాః || 62

మహతాం ధర్మ వృద్ధేషు గమనం శ్రేయ ఉచ్యతే | ప్రమాణం తపసో నాస్తి మాన్యో ధర్మస్సదా బుధైః || 63

శ్రుత్వా దృష్ట్వా తపో%స్యాస్తు కిమన్యైః క్రియతే తపః | అస్మాత్తపో%ధికం లోకే న భూతం న భవిష్యతి || 64

ఆమె ఆ విధముగా మునులకు కూడ చేయ శక్యము గాని తపస్సును చేసెను. అచటి వ్యక్తులు ఆమె తపస్సు గుర్తుకు వచ్చినపుడు గొప్ప ఆశ్చర్యమును పొందెడివారు (61) వారందరు ఆమె తపస్సును చూచుటకి వచ్చి తాము ధన్యులమైతిమని తలపోయుచూ పరస్పరము ఆమె తపస్సును గురించి చర్చించుకొనెడివారు. ఆమె తపోమహిమ విషయములో వారికి ఒకే అభిప్రాయముండెడిది (62). గొప్పవారిని, ధర్మవృద్ధులను చేరి నమస్కరించుట శ్రేయోదాయకమని పెద్దలు చెప్పెదరు. తపస్సునకు కొలత లేదు వివేకులు సర్వదా ధర్మమును ఆదరించవలెను గదా! (63) ఈమె చేయు తపస్సును గురించి విని, చూచి ఇతరులు తపస్సును ఏల కొనసాగించుచున్నారు? ఈమె తపస్సు కంటె అధికమగు తపస్సు ఇంతకు ముందు లోకములో లేదు. ఈ పైన ఉండబోదు (64)

జల్పంత ఇతి తే సర్వే సుప్రశస్య శివాతపః | జగ్ముస్స్వం ధామ ముదితాః కఠినాంగాశ్చ యే హ్యపి || 65

అన్యచ్ఛణు మహర్షే త్వం ప్రభావం తపసో%ధునా | పార్వత్యా జగదంబాయాః పరాశ్చర్యకరం మహత్‌ || 66

తదాశ్రమగతా యే చ స్వభావేన విరోధినః | తేప్యా సంస్తత్ప్ర భావేణ విరోధరహితాస్తదా || 67

సింహా గావశ్చ సతతం రాగాది దోషసంయుతాః | తన్మహిమ్నా చ తే తత్ర నాబాధంత పరస్పరమ్‌|| 68

వారందరు ఇట్లు పలుకుచూ పార్వతి యొక్క తపస్సును అధికముగా ప్రశంసించి ఆనందముతో తమ స్థానములకు వెళ్లిరి. రాటు దేలిన దేహము గల వారు గూడా ఆమె తపస్సునకు విస్తుపోయిరి (65). ఓ మహర్షీ! ఆమె తపస్సు యొక్క మహిమను మరియొక

దానిని ఇప్పుడు చెప్పెదను. వినుము. జగన్మాతయగు పార్వతి యొక్క ఆ గొప్ప తపస్సు

పరమాశ్చర్యమును కలిగించును (66). ఆమె ఆశ్రమము వద్దకు వెళ్లిన జంతువులు సహజవిరోధము కలవి కూడా ఆ తపః ప్రభావముచే విరోధమును వీడి జీవించినవి (67). ఆమె యొక్క మహిమచే గోవులకు నిత్య విరోధియగు సింహము ఇత్యాది క్రూర మృగములు ఇతర మృగములను బాధించుటను మానివేసినవి. మృగములయందు కూడ రాగద్వేషాది దోషములు అదృశ్యమైనవి (68).

éఅథాన్యే చ మునిశ్రేష్ఠ మార్జారా మూషకాదయః | నిసర్గాద్వైరిణో యత్ర విక్రియంతే స్మ న క్వచిత్‌ || 69

వృక్షాశ్చ సఫలాస్తత్ర తృణాని వివిధాని చ ష పుష్పాణి చ విచిత్రాణి తత్రాసన్మునిసత్తమ|| 70

తద్వనం చ తదా సర్వం కైలాసేనోపమాన్వితమ్‌ | జాతం చ తపసస్తస్యాస్సిద్ధి రూపమాభూత్తదా || 71

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే పార్వతీ తపో వర్ణనం నామ ద్వావింశో%ధ్యాయః(22).

ఓ మహర్షీ! పిల్లి ఎలుక మొదలగు సహజవైరముగల ఇతర జంతువులు గూడ అచట ఏకాలముమందైననూ వికారమును పొందకుండా జీవించెను (69). అచటి చెట్లు పండ్లను కాయుచుండెడివి. పశువులకు పచ్చగడ్డి సమృద్ధిగ నుండెను. రంగు రంగుల పువ్వులతో ఆ స్థలము ప్రకాశించెను. ఓ మహర్షీ! (70). ఆ కాలములో ఆమె తపస్సు యొక్క సిద్ధియే వనరూపమును దాల్చినదా యన్నట్లు, ఆ వనము అంతయూ కైలాసమును బోలి ప్రకాశించెను (71).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతి ఖండలో పార్వతీ తపోవర్ణనమనే ఇరువది రెండవ అధ్యయము ముగిసినది (22).

Sri Sivamahapuranamu-II    Chapters