Sri Sivamahapuranamu-II    Chapters   

అథ సప్తదశో%ధ్యాయః

ఇంద్ర మన్మథ సంవాదము

బ్రహ్మోవాచ|

గతేషు తేషు దేవేషు శక్రస్సస్మార వై స్మరమ్‌ | పీడితస్తారకేనాతి దైత్యేన చ దురాత్మనా || 1

ఆగతస్తత్‌క్షణాత్కామస్సవసంతో రతిప్రియః | సావలేపో యుతో రత్యా త్రై లోక్య విజయీ ప్రభుః || 2

ప్రణామం చ తతః కృత్వా స్థిత్వా తత్పురత్స్మరః | మహోన్నతమనాస్తాత సాంజలిశ్శక్రమబ్రవీత్‌ ||3

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలు వెళ్లిపోగానే దురాత్ముడగు తారకాసురునిచే మిక్కలి పీడింపబడియున్న ఇంద్రుడు మన్మథుని స్మరించెను (1). వసంతునితో కూడి యుండువాడు, రవీదేవికి ప్రియుడు, గర్విష్ఠి, రతీదేవితో కూడియున్నవాడు, ముల్లోకములను జయించువాడు అగు కామప్రభుడు వెంటనే వచ్చెను (2). వత్సా! తరువాత మహోన్నతమగు మనస్సు గల మన్మథుడు ప్రణమిల్లి ఇంద్రుని ఎదుట అంజలి ఘటించి నిలబడి ఇంద్రునితో నిట్లనెను (3).

కామ ఉవాచ|

కిం కార్యం తే సముత్పన్నం స్మృతో%హం కేన హేతునా | తత్త్వం కథయ దేవేశ తత్కర్తుం సముపాగతః || 4

మన్మథుడిట్లు పలికెను-

నీకు కలిగిన ఏమి? నన్ను స్మరించుటకు కారణమేమి? ఓ దేవరాజా! విషయమును చెప్పుము. నీవు చెప్పు పనిని చేయుటకు వచ్చితిని (4).

బ్రహ్మోవాచ|

తచ్ఛ్రుత్వా వచనం తస్య కందర్పస్య సురేశ్వరః | ఉవాచ వచనం ప్రీత్యా యుక్తం యుక్తమితి స్తువన్‌ || 5

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ మన్మథుని ఆ మాటను విని దేవరాజగు ఇంద్రుడు 'బాగున్నది, బాగున్నది' అని స్తుతిస్తూ ప్రేమ పూర్వకముగా నిట్లు పలికెను (5).

శక్ర ఉవాచ|

తవ సాధు సమారంభో యన్మే కార్యముపస్థితమ్‌ | తత్కర్తు మద్యతో%సి త్వం ధన్యో%సి మకరధ్వజ || 6

ప్రస్తుతం శృణు మద్వాక్యం కథయామి తవాగ్రతః | మదీయం చైవ యత్కార్యం త్వదీయం తన్న చాన్యథా || 7

మిత్రాణి మమ సంత్యేవ బహూని సుమహాంతి చ | పరం తు స్మర సన్మిత్రం త్వత్తుల్యం నహి కుత్రచిత్‌ || 8

జయార్థం మే ద్వయం తాత నిర్మితం వజ్రముత్తమమ్‌ | వజ్రం నిష్ఫలం స్యాద్వై త్వం తు నైవ కదాచన || 9

ఇంద్రుడిట్లు పలికెను-

ఓ మన్మథా! నాకు పని కలుగగానే నీవు దానిని చేయుటకు సంసిద్ధుడవైతివి. నీ ఈ ఉద్యమశీలత కొనియాడదగినది.నీవు ధన్యుడవు (6). నేను ప్రస్తుతంలో నీ ఎదుట చెప్పబోవు పలుకుల నాలకించుము. నా కర్యము నీ కార్యమే గాని మరియొకటిగాదు (7). నాకు అనేక మంది గొప్ప గొప్ప మిత్రులు గలరు. మన్మథా ! కాని నీవంటి మంచి మిత్రుడు ఎక్కడనూ లేడు (8). కుమారా! నా విజయము కొరకై రెండు నిర్మింపడినవి. ఒకటి ఉత్తమమగు నా వజ్రము. రెండవది నీవు. వజ్రము నిష్ఫలము కావచ్చును.

కాని నీవు ఎన్నడునూ నిర్వీర్యుడవు కావు (9).

యతో హితం ప్రజాయేత తతః కో నుప్రియః పరః | తస్మాన్మిత్ర వరస్త్వం హి మత్కార్యం కర్తుమర్హసి || 10

మమ దుఃఖం సముత్పన్న మసాధ్యం చాపి కాలజమ్‌ | కేనాపి నైవ తచ్ఛక్యం దూరీకర్తుం త్వయా వినా || 11

దాతుః పరీక్షా దుర్భిక్షే రణ శూరస్య జాయతే | ఆపత్కాలే తు మిత్రస్యాశక్తౌ స్త్రీణాం కులస్య హి || 12

వినతేస్సంకటే ప్రాప్తే%వితథస్య పరోక్షతః | సుస్నేహస్య తథా తాత నాన్యథా సత్యమీరితమ్‌ || 13

ఏవడు హితమును చేగూర్చునో, వానికంటె అధిక ప్రీతిపాత్రుడు మరెవ్వరు ఉందురు? కావున, నీవు నామిత్రులలో శ్రేష్ఠుడవు. నా కార్యమును నీవు చేయదగుదువు (10). నాకు కాల ప్రభావముచే అసాధ్యమగు దుఃఖము సంప్రాప్తమైనది. దానిని నీవు తక్క మరియొకరు ఎవరైననూ దూరము చేయజాలరు (11). దుర్భిక్షము నెలకొన్నప్పుడు దాత యొక్క దాతృత్వము, యుద్ధమునందు శూరుని శౌర్యము, ఆపద వచ్చినపుడు మిత్రుని మైత్రి, భర్త అసమర్థుడయినప్పుడు కుల స్త్రీల పాతివ్రత్యము నిగ్గుతేలును (12). కష్టము వచ్చినపుడు వినయము, పరోక్షమునందు వ్యర్థము కాని మంచి స్నేహము నిగ్గుదేలును. వీటి పరీక్షకు మరో మార్గము లేదు. నేను సత్యమును పలికితిని (13)

ప్రాప్తాయం వై మమాపత్తా వవార్యాయం పరేణ హి | పరీక్షా చ త్వదీయా%ద్య మిత్రవర్య భవిష్యతి || 14

న కేవలం మదీయం చ కార్యమస్తి సుఖావహమ్‌ | కిం తు సర్వసురాదీనాం కార్యమేతన్న సంశయః ||15

ఓ మిత్రశ్రేష్ఠా! నాకు ఆపద వచ్చినది. దానిని ఇతరులెవ్వరూ వారించలేరు. ఈనాడు ఇది నీకు పరీక్షకాగలదు (14). ఈ పని కేవలము నా వ్యక్తిగత కార్యము కాదు. దీనియందు దేవతలు, ఇతరులు అందరి క్షేమము ఇమిడియున్నది. దీనిలో సందియము లేదు (15).

బ్రహ్మోవాచ|

ఇత్యేతన్మఘవద్వాక్యం శ్రుత్వా తు మకరధ్వజః| ఉవాచ ప్రేమగంభీరం వాక్యం సుస్మిత పూర్వకమ్‌ || 16

మన్మథుడు ఇంద్రుని ఈ పలుకులను విని, చిరునవ్వుతో మరియు ప్రేమతో గంభీరముగా నిట్లు పలికెను (16).

కామ ఉవాచ|

కిమర్థ మిత్థం వదసి నోత్తరం వచ్మ్యహం తవ | ఉపకృత్‌కృత్రిమం లోకే దృశ్యతే కథ్యతే నచ || 17

సంకటే బహు యో బ్రూతే స కిం కార్యం కరిష్యతి | తథాపి చ మహారాజ కథయామి శృణు ప్రభో || 18

పదం తే కర్షితుం యో వై తపస్తపతి దారుణమ్‌ | పాతయిష్యామ్యహం తం చ శత్రుంతే మిత్ర సర్వథా || 19

క్షణన భ్రంశయిష్యామి కటాక్షేణ వరస్త్రియాః | దేవర్షి దానవాదీంశ్చ నరాణాం గణనా న మే || 20

మన్మథుడిట్లు పలికెను-

నీవు ఇట్లు ఏల పలుకుచుంటివి? నేను నీకు సమాధానమునీయను. ఉపకారమును చేయు మిత్రుని, కృత్రిమ మిత్రుని లోకమునందు పరిశీలించెదరే గాని, వారి గురించి మాటలాడరు (17). కష్టము కలిగినప్పుడు అధికముగా మాటలాడు వాడు కార్యమునేమి చేయగలడు? మహారాజా! ప్రభూ! అయిననూ చెప్పెదను. వినుము (18). నీ పదవిని లాగుకొనుటకై ఎవరైననూ ఘోరపతపస్సును చేయుచున్నాడా యేమి? ఓ మిత్రమా! అట్టి నీ శత్రువును నిశ్చితముగా పడకొట్టగలను (19). ఒక సుందరి యొక్క వాలు చూపుతో దేవతలను గాని, ఋషులు రాక్షసులు మొదలగు వారిని గాని, క్షణములో భ్రష్టులను చేయగలను. మానవులు నాకు లెక్క కాదు (20).

వజ్రం తిష్ఠతు దూరే వై శస్త్రాణ్యన్యాన్యనేకశః | కిం తే కార్యం కరిష్యంతి మయి మిత్ర ఉపస్థితే || 21

బ్రహ్మాణం వా హరిం వాపి భ్రష్టం కుర్యాం న సంశయః | అన్యేషాం గణనా నాస్తి పాతయేయం హరం త్వపి || 22

పంచైవ మృదవో బాణాస్తే చ పుష్పమయా మమ | చాపస్త్రిధా పుష్పమయ శ్శింజినీ భ్రమరార్జితా || 23

బలం సుదయితా మే హి వసంత స్సచివస్స్మృతః | అహం పంచబలో దేవ మిత్రం మమ సుధానిధిః || 24

వజ్రము, ఇతర అనేక ఆయుధములు దూరములో నుండుగాక! మిత్రుడనగు నేను వచ్చిన తరువాత అవి దేనికి పనికి రాగలవు? (21) బ్రహ్మను గాని, విష్ణువును గాని నేను నిస్సంశయముగా భ్రష్టుని చేయగలను. ఇతరుల లెక్కలేదు. నేను శివునియైనను పడగొట్టగలను (22). నాకు అయిదు బాణములు మాత్రమే గలవు. అవి పుష్పములచే చేయబడినవి. మృదువైనవి. నా ధనస్సు పుష్పములచే నిర్మింపబడి మూడు భాగములుగా నున్నది. నారిత్రాడును తుమ్మెదలు సమగూర్చును (23). నాకు మిత్రుడు, మంత్రియగు వసంతుడే నా సైన్యము. అయిదు బాణములే నా బలము. హే దేవా! చంద్రుడు నాకు మిత్రుడు (24).

సేనాధిపశ్చ శృంగారో హావభావాశ్చ సైనికాః | సర్వే మే మృదవశ్శక్ర అహం చాపి తథా విధః || 25

యద్యేన పూర్యతే కార్యం ధీమాంస్తత్తేన పూరయేత్‌ | మమ యోగ్యం తు యత్కార్యం సర్వం తన్మే నియోజయ || 26

శృంగారము నాకు సేనాధ్యక్షుడు. హావ భావములే నా సైనికులు. ఇంద్రా! నా బాణములన్నియూ మృదవైనవి. నేను గూడ అట్టివాడనే (25). ఏ కార్యము దేనిచే పూర్తియగునో, బుద్ధిమంతుడు ఆ కార్యమును ఆ సాధనముతో పూర్తి చేయవలెను. నాకు ఏ కార్యము ఉచితమో, దానియందు నన్ను సంపూర్ణముగా నియోగించుము (26).

బ్రహ్మోవాచ|

ఇత్యేవంతు వచస్తస్య శ్రుత్వా శక్రస్సుహర్షితః | ఉవాచ ప్రణమన్‌ వాచా కామం కాంత సుఖావహమ్‌ || 27

బ్రహ్మ ఇట్లు పలికెను-

వాని ఈ మాటలను విని ఇంద్రుడు మిక్కిలి ఆనందించి, నమస్కరించి, ప్రేమికులకు సుఖమునిచ్చు మన్మథునితో నిట్లు పలికెను (27).

శక్ర ఉవాచ|

యత్కార్యం మనసోద్దిష్టం మయా తాత మనోభవ | కర్తుం తత్త్వం సమర్థో%సి నాస్యస్మాత్తస్య సంభవః || 28

శృణు కామ ప్రవక్ష్యామి యథార్థం మిత్ర సత్తమ | యదర్థే చ స్పృహా జాతా తవ చాద్య మనోభవ || 29

తారకాఖ్యో మహాదైత్యో బ్రహ్మణో వరమద్భుతమ్‌ | అభూదజేయస్సం ప్రాప్య సర్వేషామపి దుఃఖదః || 30

తేన సంపీడ్యతే లోకో నష్టా ధర్మా హ్యనేకశః | దుఃఖితా నిర్జరాస్సర్వే ఋషయశ్చ తథాఖిలాః || 31

ఇంద్రుడిట్లు పలికెను-

వత్సా! మన్మథా! నేను నామనస్సులో తలపెట్టిన కార్యమును చేయుటకు నీవే సమర్థుడవై ఉన్నావు. నీవు గాక మరియొకరి వలన ఈ పని సంభవము గాదు (28). మన్మథా! మిత్రశ్రేష్ఠమా! ఈనాడు నిన్ను చూడవలెననే కోరిక కలుగుటకు గల వాస్తవ కారణమును చెప్పెదను. వినుము (29). తారకుడనే మహారాక్షసుడు బ్రహ్మ నుండి అద్భుతమగు వరమును పొంది, అందరికీ దుఃఖమును కలిగించుచున్నాడు. ఆతనిని జయించగలవారు లేరు (30). ఆతడు లోకములను పీడించుచున్నాడు. ధర్మములన్నియూ అనేక విధములుగా భ్రష్టమైనవి. దేవతలు, ఋషులు, ఇతరులు అందరు దుఃఖితులై ఉన్నారు (31).

దేవైశ్చ సకలైస్తేన కృతం యుద్ధం యథా బలమ్‌ | సర్వేషాం చాయుధాన్యత్ర విఫలాన్యభవన్‌ పురా || 32

భగ్నః పాశో జలేశస్య హరిచక్రం సుదర్శనమ్‌ | తత్కుంఠతమభూత్తస్య కంఠేం క్షిప్తం చ విష్ణునా || 33

ఏతస్య మరణం ప్రోక్తం ప్రజేశేన దురాత్మనః | శంభోర్వీర్యోద్భవాద్బాలాన్మహాయోగీశ్వరస్య హి || 34

ఏతత్కార్యం త్వయా సాధు కర్తవ్యం సుప్రయత్నతః | తతస్స్యాన్మిత్ర వర్యాతి దేవానానం నః పరస్సుఖమ్‌ || 35

ఒకప్పుడు దేవతలందరు వానితో యథాశక్తిగా యుద్ధమును చేసిరి. వారి అందరి ఆయుధములు ఆతనియందు వ్యర్థమైనవి (32). వరుణుని పాశము భగ్నమయ్యెను. విష్ణువు సుదర్శన చక్రమును ఆతనిపై ప్రయోగించగా, అది మొక్కవోయి ఆతని కంఠములో పడెను (33). మహాయోగీశ్వరుడగు శంభుని కుమారుని చేతిలో ఈ దుష్టుడు మరణించునని బ్రహ్మ చెప్పెను (34). ఓ మిత్ర శ్రేష్ఠమా! కావును నీవీ పనిని గొప్ప ప్రయత్నమును చేసి సాధించవలెను. ఈ కార్యము సిద్ధించినచో, దేవతలకు మహా సుఖము కలుగును (35).

మమాపి విహితం తస్మాత్సర్వలోకసుఖావహమ్‌ | మిత్ర ధర్మం హృది స్మృత్వా కర్తుమర్హసి సాంప్రతమ్‌ || 36

శంభుస్స గిరిరాజే హి తపః పరమమాస్థితః | స ప్రభుర్నాపి కామేన స్వతంత్రః పరమేశ్వరః || 37

తత్సమీపే చ దేవాథ పార్వతీ స్వసఖీయుతా | సేవమానా తిష్ఠీతీతి పిత్రాజ్ఞప్తా మయా శ్రుతమ్‌ || 38

యథా తస్యాం రుచిస్తస్య శివస్య నియతాత్మనః | జాయతే నితరాం మార తథా కార్యం త్వయా ధ్రువమ్‌ || 39

సర్వలోకములకు సుఖము నీయగలిగే ఈ కర్మను ఆ కారణము చేతనే నేను తప్పక చేయదగియున్నది. నీవు స్నేహ ధర్మమును మనసునందిడుకొని ఇపుడీ పనిని చేయదగుదువు (36). ఆ శంభుడు హిమవత్పర్వతము నందు గొప్ప తపస్సును చేయుచున్నాడు. ఆ ప్రభుడు కామమునకు వశుడు కాడు. ఆయన స్వతంత్రుడగు పరమేశ్వరుడు (37). ఓ కామదేవా! తండ్రి ఆజ్ఞచే పార్వతి తన సఖురాండ్రతో గూడి శివుని సమీపమునందుండి ఆయనను సేవించుచున్నదని నేను వినియుంటిని (38). జితేంద్రియుడగు శివునకు ఆమె యందు గొప్ప ప్రేమ కలుగునట్లు నీవు చేయవలెను. మన్మథా! నీవీ కార్యమును తప్పక సఫలము చేయవలెను (39).

ఇతి కృత్వా కృతీ స్యాస్త్వం సర్వం దుఃఖం వినంక్ష్యతి | లోకే స్థాయీ ప్రతాపస్తే భవిష్యతి న చాన్యథా || 40

నీవీ కార్యమును చేసి కృతార్థుడవు కమ్ము. దుఃఖమంతయూ నశించగలదు. నీ ప్రతాపము లోకమునందు చిరస్థాయిగా నుండగలదు. దీనికి భిన్నముగా జరిగే అవకాశము లేదు (40).

బ్రహ్మోవాచ|

ఇత్యుక్తస్స తు కామో హి ప్రపుల్ల ముఖపంకజః | ప్రేవ్ణూెవాచేతి దేవేశం కరిష్యామి న సంశయః || 41

ఇత్యుక్త్వా వచనం తసై#్మ తథేత్యోమితి తద్వచః | అగ్రహీత్తరసా కామశ్శివమాయావిమోహితః || 42

యత్ర యోగీశ్వరస్సాక్షాత్తప్యతే పరమం తపః | జగామ తత్ర సుప్రీత స్సదారస్సవసంతకః || 43

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం పార్వతీ ఖండే శక్ర కామ సంవాదవర్ణనం నామ సప్తదశో%ధ్యాయః (17).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇంద్రుడిట్లు పలుకగా, వికసించిన పద్మము వంటి ముఖము గల మన్మథుడు ఇంద్రునితో 'ఈ పనిని నిస్సందేహముగా చేసెదను' అని ప్రేమతో పలికెను (41). శివమాయచే విమోహితుడై ఆ మన్మథుడు ఇంద్రునితో నిట్లు పలికి, తన అంగీకారమును తెలిపి వెంటనే ఆయన వద్ద సెలవు తీసుకొనెను (42). ఆతడు భార్యతో వసంతునితో గూడి ఆనందముతో యోగీశ్వరుడగు శివుడు స్వయముగా గొప్ప తపస్సును చేయుచున్న స్థానమునకు వెళ్లెను (43).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో ఇంద్రమన్మథ సంవాద వర్ణనమనే పదిహేడవ అధ్యాయము ముగిసినది (17).

Sri Sivamahapuranamu-II    Chapters