Sri Sivamahapuranamu-II    Chapters   

అథ చతుశ్చత్వారింశో%ధ్యాయః

అంధకుని దూతలతో శివుని సంభాషణము

సనత్కుమార ఉవాచ |

తతో హిరణ్యాక్షసుతః కదాచిత్సంశ్రావితో నర్మయుతైర్మదాంధైః |

తైర్భ్రాతృభిస్సంప్రయుతో విహారే కిమంధ రాజ్యేన తవాద్య కార్యమ్‌ || 1

హిరణ్య నేత్రస్తు బభూవ మూఢః కలిప్రియం నేత్ర విహీనమేవ |

యో లబ్ధవాంస్త్వా వికృతం విరూపం ఘోరైస్తపోభిర్గిరిశం ప్రసాద్య || 2

స త్వం న భాగీ ఖలు రాజ్యకస్య కిమన్యజాతో%పి లభేత రాజ్యమ్‌ |

విచార్యతాం తద్భవతైవ నూనం వయం తు తద్భాగిన ఏవ సత్యమ్‌ || 3

తేషాం తు వాక్యాని నిశమ్య తాని విచార్య బుధ్ధ్వా స్వయమేవ దీనః |

తాన్‌ శాంతయిత్వా వివిధైర్వచోభిర్గతస్త్వరణ్యం నిశి నిర్జనం తు || 4

వర్షాయుతం తత్ర తపశ్చచార జజాప జాప్యం విధృతైకపాదః |

ఆహారహీనో నియమోర్ధ్వబాహుః కర్తుం న శక్యం హి సురాసురైర్యత్‌ || 5

ప్రజ్వాల్య వహ్నిం స్మ జుహోతి గాత్ర మాంసం సరక్తం ఖలు వర్షమాత్రమ్‌ |

తీక్ణేన శ##స్త్రేణ నికృత్య దేహాత్సమంత్రకం ప్రత్యహమేవ హుత్వా || 6

స్నాయ్వస్థి శేషం కుణపం తదాసౌ క్షయం గతం శోణితమేవ సర్వమ్‌ |

యదాస్య మాంసాని న సంతి దేహే ప్రక్షేప్తుకామస్తు హుతాశనాయ || 7

సనత్కుమారుడిట్లు పలికెను-

ఒకప్పుడు హిరణ్యాక్షుని కుమారుడగు అంధకుని గర్వముతో కన్ను గానని ఆతని సోదరులు పరిహాసము చేయుచూ విహారవేళయందు ఆతనితో నిట్లనిరి : ఓరీ గ్రుడ్డివాడా! నీకీ రాజ్యముతో పనియేమి? (1) ఘోరమగు తపస్సును చేసి శివుని ప్రసన్నుని చేసుకొని, కలహప్రియుడవు, అంధుడవు, వికృతరూపుడగు అగు నిన్ను పుత్రునిగా బడసిన హిరణ్యాక్షుడు నిశ్చయముగా మూర్ఖుడై నాడు (2). అట్టి నీవు రాజ్యమునకు అర్హుడవు కావు. హిరణ్యాక్షునకు జన్మించినవాడవు నీవు కావు. ఇతరుని సంతానమగు నీకు ఈ రాజ్యము ఎట్లు లభించును? నీవు స్వయముగా ఆలోచించుము. మేము యథార్థముగా నీకు భాగము నిచ్చెదము (3). ఆతడు వారి వచనములను విని తన బుద్ధితో ఆలోచించుకొని దీనుడై వారికి పలు వచనములతో నచ్చజెప్పి రాత్రియందు నిర్జనమగు అడవికి వెళ్లెను (4). ఆతడు అచట ఒంటి కాలిపై నిలబడి ఆహారమును విడనాడి నియమములను పాటిస్తూ చేతులను పైకెత్తి, దేవతలకు గాని రాక్షసులకు గాని చేయ శక్యము కాని తపస్సును పదివేల సంవత్సరములు చేసెను. ఆతడు మంత్రమును జపించెను (5). ఆతడు ఒక సంవత్సర కాలము ప్రతిదినము అగ్నిని ప్రజ్వరిల్ల జేసి పదునైన కత్తితో దేహమునుండి మాంసమును కోసి మంత్రపూర్వకముగా ఆ మాంసమును మరియు రక్తమును హోమము చేసెను (6). ఆతని దేహములోని రక్తమాంసములు పూర్తిగా హరించి పోయినవి. నరములు, ఎముకలు మాత్రమే మిగిలియుండెను. ఆ శవము వంటి శరీరమును ఆతడు అగ్నిలో హోమము చేయగోరెను(7).

తతస్స దృష్టస్త్రిదశాలయైర్జనైస్సువిస్మితైర్భీతియుతైస్సమసై#్తః |

అథామరై శ్శీఘ్రతరం ప్రసాదితో బభూవ ధాతా నుతిభిర్నుతో హి || 8

నివారయిత్వాథ పితామహస్తం హ్యువాచ తం చాద్య వరం వృణీష్వ |

యస్యాప్తి కామస్తవ సర్వలోకే సుదుర్లభం దానవ తం గృహాణ || 9

స పద్మయోనేస్తు వచో నిశమ్య ప్రోవాచ దీనః ప్రణతస్తు దైత్యః |

యైర్నిష్ఠురైర్మే ప్రహృతం తు రాజ్యం ప్రహ్లాదముఖ్యా మమ సంతు భృత్యాః || 10

అంధస్య దివ్యం హి తథాస్తు చక్షురింద్రాదయో మే కరదా భవంతు |

మృత్యుస్తు మా భూన్మమ దేవదైత్య గంధర్వయక్షోరగమానుషేభ్యః || 11

నారాయణాద్వా దితిజేంద్ర శత్రోస్సర్వాజ్ఞనాత్సర్వమయాచ్చ శర్వాత్‌ |

శ్రుత్వా వచస్తస్య సుదారుణం తత్సుశంకితః పద్మభవస్తమాహ || 12

అపుడు స్వర్గమునందలి దేవతలందరు ఆశ్చర్యముతో మరియు భయముతో ఆతనిని గాంచి వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్లి ఆయనను స్తుతించి ప్రసన్నుని చేసుకొనిరి (8). అపుడా బ్రహ్మ అంధకుని ఆ ప్రయత్నము నాపివేసి ఇట్లు పలికెను. ఓ దానవా! ఈ లోకములన్నింటిలో మిక్కిలి దుర్లభమగు ఏ వస్తువునైననూ నీవు కోరుచుంటివా ? అట్లైనచో వరమును కోరుకొనుము. నీ కోరిక ఈనాడే నీకు సిద్ధించగలదు (9). దీనుడగు ఆ దానవుడు బ్రహ్మయొక్క మాటను విని ప్రణమిల్లి ఇట్లు పలికెను: పరుష వచనములను పలికి నా రాజ్యము నపహరించిన ప్రహ్లాదుడు మొదలగు నా సోదరులు నాకు సేవకులగుదురు గాక! (10) అంధుడనగు నాకు దివ్యమగు నేత్రము నిమ్ము. ఇంద్రుడు మొదలగువారు నాకు పన్నును కట్టెదరు గాక! నాకు దేవ, దానవ, గంధర్వ, యక్ష, నాగ, మనుష్యుల చేతిలో మృత్యువు కలుగకుండుగాక! (11) రాక్షస శత్రువగు నారాయణుని వలనగాని, సర్వరూపుడగు శివుని వలన గాని, లేక సర్వజనుల వలన గాని నాకు మృత్యువు కలుగకుండు గాక! అంధకుని దారుణమగు ఈ మాటలను విని బ్రహ్మ అధికమగు శంకను పొంది ఆతనితో నిట్లనెను (12).

బ్రహ్మోవాచ|

దైత్యేంద్ర సర్వం భవితా తదేతద్వినాశ##హేతుం చ గృహాణ కించిత్‌ |

యస్మాన్న జాతో న జనిష్యతే వా యో న ప్రవిష్టో ముఖమంతకస్య ||13

అత్యంత దీర్ఘం ఖలు జీవితం తు భవాదృశా స్సత్సురుషాస్త్యజంతు |

ఏతద్వచస్సానునయం నిశమ్య పితామహాత్ర్పాహ పునస్స దైత్యః || 14

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ రాక్షసా వీరా! నీవు కోరిన సర్వము అటులనే జరుగగలదు. కాని ఏదో ఒక మరణ కారణమును స్వీకరించుము. ఏలయనగా, మృత్యు ముఖమును చేరని ప్రాణి ఇంతవరకు, పుట్టలేదు; ఈపైన పుట్టబోదు (13). నీ వంటి సత్పురుషులు మిక్కిలి దీర్ఘమగు జీవితమును స్వీకరించక పోవుటయే శ్రేష్ఠము గదా! బ్రహ్మగారు అనునయ పూర్వకముగా చెప్పిన ఈ మాటను విని ఆ రాక్షసుడు మరల ఇట్లు పలికెను (14).

అంధక ఉవాచ |

కాలత్రయే యాశ్చ భవంతి నార్యశ్రేష్ఠాశ్చ మధ్యాశ్చ తథా కనిష్ఠాః |

తాసాం చ మధ్యే ఖలు రత్నభూతా మమాపి నిత్యం జననీవ కాచిత్‌ || 15

కాయేన వాచా మనసాప్యగమ్యా నారీ నృలోకస్య చ దుర్లభా యా |

తాం కామయానస్య మమాస్తు నాశో దైత్యేంద్రబావాద్భగవాన్‌ స్వయంభూః || 16

వాక్యం తదాకర్ణ్య స పద్మయోనిస్సు విస్మిత శ్శంకరపాద పద్మమ్‌ |

సస్మార సంప్రాప్య నిదేశమాశు శంభోస్తు తం ప్రాహ తతోంధకంవై || 17

అంధకుడిట్లు పలికెను-

భూత భవిష్యద్వర్తమాన కాలములలో ఉత్తమ-మధ్యమ-అధమ స్వభావములు గల స్త్రీ లందరిలో సర్వశ్రేష్ఠురాలు, నాకు నిత్యము తల్లివలె పూజించ దగినది అగు ఒకానొక యువతి గలదు (15). ఆ యువతి మానవులకు మనో వాక్కాయములచే పొంద శక్యము గానిది. స్వయంభువుడవగు ఓ బ్రహ్మ భగవానుడా! ఆమెను నేను కామించినచో, రాక్షస చక్రవర్తి పదవినుండి వెంటనే భ్రష్ఠుడనగుదును గాక! (16). పద్మ సంభవుడగు ఆ బ్రహ్మ ఆ మాటలను విని మిక్కిలి విస్మయమును పొందినవాడై శంకరుని పాదపద్మమును స్మరించి వెంటనే శంభుని ఆదేశమును పొంది, అపుడా అంధకునితో నిట్లనెను (17).

బ్రహ్మోవాచ |

యత్కాంక్షసే దైత్యవరాస్తు తే వై సర్వం భవత్యేవ వచస్సకామమ్‌ |

ఉత్తిష్ఠ దైత్యేంద్ర లభస్వ కామం సదైవ వీరైస్తు కురుష్వ యుద్ధమ్‌ || 18

శ్రుత్వా తదేతద్వచనం మునీశ విధాతురాశు ప్రణిపత్య భక్త్యా |

లోకేశ్వరం హాటక నేత్రపుత్ర స్స్నాయ్య స్థిశేషస్తు తమాహ దేవమ్‌ || 19

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ రాక్షసవీరా! నీవు కోరిన కోరిక పూర్తిగా తథ్యము కాగలదు. ఓ రాక్షసరాజా! కోర్కెలు నీకు ఈడేరుగాక! సర్వదా వీరులతో యుద్ధమును చేయుము (18). ఓ మహర్షీ! నరములు, ఎముకలు మాత్రమే మిగిలియున్న ఆ హిరణ్యాక్ష పుత్రుడు లోకేశ్వరుడగు బ్రహ్మయొక్క ఆ మాటను విని వెంటనే భక్తితో ప్రణమిల్లి ఆ భగవానునితో నిట్లు పలికెను (19).

అంధక ఉవాచ |

కథం విభో వైరిబలం ప్రవిశ్య హ్యనేన దేహేన కరోమి యుద్ధమ్‌ |

స్నాయ్వస్థిశేషం కురు మాంసపుష్టం కరేణ పుణ్యన చ మాం స్పృశాద్య || 20

అంధకుడిట్లు పలికెను-

ఓ విభూ! నేనీ దేహముతో శత్రు సైన్యమును చొరబడి యుద్ధమును చేయుట ఎట్లు సంభవమగును? నీ పవిత్రమగు చేతితో నా ఈ దేహమునిపుడు స్పశించుము. ఎముకలు, నరములు మాత్రమే మిగిలియున్న ఈ దేహమును మాంసముతో నిండియుండునట్లు చేయుము (20).

సనత్కుమార ఉవాచ |

శ్రుత్వా వచస్తస్య స పద్మయోనిః కరేణ సంస్పృశ్య చ తచ్ఛరీరమ్‌ |

గతస్సురేంద్రైస్సహితస్స్వధామ సంపూజ్యమానో మునిసిద్ధసంఘై || 21

సంస్పృష్టమాత్రస్స చ దైత్యరాజస్సంపూర్ణ దేహో బలవాన్‌ బభూవ |

సంజాతనేత్ర స్సుభగో బభూవ హృష్టస్స్వమేవం నగరం వివేశ || 22

ఉత్సృజ్య రాజ్యం సకలం చ తసై#్మ ప్రహ్లాదముఖ్యాస్త్వథ దానవేంద్రాః |

తమాగతం లబ్ధవరం చ మత్వా భృత్వా బభూవుర్వశగాస్తు తస్య || 23

తతోంధక స్స్వర్గమగా ద్విజేతుం సేనాభియుక్త స్సహభృత్వర్గః |

విజిత్య లేఖాన్‌ ప్రధనే సమస్తాన్‌ కరప్రదం వజ్రధరం చకార || 24

నాగాన్‌ సుపర్ణాన్‌ వర రాక్షసాంశ్చ గంధర్వయక్షానపి మానుషాంస్తు |

గిరీంద్ర వృక్షాన్‌ సమరేషు సర్వాంశ్చతుష్పదస్సింహముఖాన్‌ విజిగ్యే || 25

త్రైలోక్యమేతద్ధి చరాచరం వై వశం చకారాత్మని సంనియోజ్య |

తతో %ను కూలాని సుదర్శనాని నారీసహస్రాణి బహూని గత్వా || 26

రసాతలే చైవ తథా ధరాయాం త్రివిష్ఠపే యాః ప్రమదాస్సురూపాః |

తాభిర్యుతో %న్యేషు స పర్వతేషు రరామ రమ్యేషు నదీతటేషు || 27

క్రీడాయామానస్స తు మధ్యవర్తీ తాసాం ప్రహర్షాదథ దానవేంద్రః |

తత్పీత శిష్టాని పిబన్‌ ప్రవృత్త్యై దివ్యాని పేయాని సుమానుషాణి || 28

సనత్కుమారుడిట్లు పలికెను-

వని ఆ మాటను విని ఆ పద్మ సంభవుడు వాని శరీరమును చేతితో బాగుగా స్పృశించి, ముని సిద్ధ గణములు పూజించుచుండగా దేవనాయకులతో గూడి తన లోకమును చేరెను (21). బ్రహ్మ స్సృశించిన వెంటనే ఆ రాక్షస రాజు పూర్ణదేహమును పొంది బలము గలవాడై చూపు గల సుందరాకారుడై ఆనందముతో తన నగరమును ప్రవేశించెను (22). ప్రహ్లాదుడు మొదలగు రాక్షస వీరులందరు ఆతడు వరములను పొంది వచ్చి యుండునని తలంచి, రాజ్యమునంతనూ ఆతనికి అప్పజెప్పి సేవకులై ఆతని కనుసన్నలలో మెలగుచుండిరి (23). అపుడు అంధకుడు సేనలతో, పరిచారక వర్గముతో గూడి స్వర్గముపై విజయయాత్రకు వెడలెను. యుద్ధములో ఆతడు దేవతల నందరినీ జయించి ఇంద్రుడు పన్ను కట్టునట్లు చేసెను (24). ఆతడు నాగులను, గరుడులను, రాక్షసవీరులను, గంధర్వులను, యక్షులను మరియు మానవులను జయించి పర్వతములు, వృక్షములు, సింహము మొదలగు జంతువులతో గూడిన భూమికి ప్రభువు ఆయెను. యుద్ధములలో సర్వులు ఆతనిచే పరాజితులైరి (25). ఆతడు స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తును తన వశము గావించుకొని, తరువాత చూడ చక్కని అనుకూలవంతులగు యువతులను వేలాది మందిని పొందెను (26). పాతాళ భూస్వర్గలోకములలో గల మిక్కిలి అందమైన స్త్రీలతో గూడి ఆతడు పర్వతములయందు, సుందరమగు నదీతీరముల యందు, ఇతర ప్రదేశముల యందు విహరించెను (27). వారి మధ్యలో నున్నవాడై ఆ రాక్షసరాజు ఆనందముతో రమిస్తూ మనుష్యలోక సంబంధి మరియ దేవలోక సంబంధి పానీయములను వారు త్రాగగా మిగిలిన వాటిని త్రాగి భోగముల ననుభవించెను (28).

అన్యాని దివ్యాని తు యద్రసాని ఫలాని మూలాని సుగంధివంతి |

సంప్రాప్య యానాని సువాహనాని మయేన సృష్టాని గృహోత్తమాని || 29

పుష్పార్ఘ ధూపాన్నవిలేపనైశ్చ సుశోభితాన్యద్భుత దర్శనైశ్చ |

సంక్రీడ మానస్య గతాని తస్య వర్షాయుతానీహ తథాంధకస్య || 30

జానాతి కించిన్న శుభం పరత్ర యదాత్మన స్సౌఖ్యకరం భ##వేద్ధి |

సదాంధకో దైత్యవరస్స మూఢో మదాంధ బుద్ధిః కృతదుష్టసంగః || 31

తతః ప్రమత్తస్తు సుతాన్‌ ప్రధానాన్‌ కుతర్కవాదైరభిభూయ సర్వాన్‌ |

చచార దైత్యైస్సహితో మహాత్మా వినాశయన్‌ వైదిక సర్వధర్మాన్‌ || 32

వేదాన్‌ ద్విజాన్‌ విత్త మదాభిభూతో న మన్యతే స్మాప్యమరాన్‌ గురూంశ్చ |

రేమే తథా దైవగతో హతాయుస్స్వసై#్య రహోభిర్గమయన్‌ వయశ్చ || 33

తతః కదాచిద్గతవాన్‌ ససైన్యో బహుప్రయాతా పృథివీతలే%స్మిన్‌ |

అనేకసంఖ్యా అపి వర్షకోట్యః ప్రహర్షితో మందరపర్వతం తు || 34

స్వర్ణోపమాం తత్ర నిరీక్ష్య శోభాంబ భ్రామ సైన్యైస్సహ మానమత్తః |

క్రీడార్థ మాసాద్య చ తం గిరీంద్ర మతిం స వాసాయ చకార మోహత్‌ || 35

శుభం దృఢం తత్ర పురం కృత్వా ముదా స్థితో దైత్యపతిః ప్రభావాత్‌ |

నివేశయామాస పునః క్రమేణ అత్యద్భుతం మందరశైలసానౌ || 36

ఇతరములగు దివ్యరసములను త్రాగి, ఫలములను పరిమళ భరితములగు దుంపలను భక్షించి, మంచి గుర్రములను పూన్చిన రథములపై విహరించి, మయునిచే నిర్మింపబడిన ఉత్తమ భవనములలో నివసిస్తూ (29), ఆ అంధకుడు పుష్పములతో, విలువైన ధూపములతో, ఆహారములతో, విలేపములతో రమిస్తూ అద్భుతములు, మిక్కిలి శోభగలవి అగు భోగముల ననుభవిస్తూ పదివేల సంవత్సరముల కాలమును గడిపెను (30). మూర్ఘుడు, గర్వముతో అంధమైన మనోనేత్రము గలవాడు, సర్వదా దుష్టుల సహవాసము గలవాడు, రాక్షస వీరుడు అగు ఆ అంధకుడు తనకు పరలోకములో సుఖము నిచ్చే శుభకర్మల గురించి లేశ##మైననూ జ్ఞానము లేక ఉండెను (31). అపుడు మిక్కిలి మదించిన ఆ మహారాక్షసుడు కుమారులు, మంత్రులు మొదలగు వారినందరినీ చెడు తర్కములతో నిండిన వాదములతో పరాజితులను చేసి, రాక్షసులతో గూడి సకల వైదిక ధర్మములను పాడుచేయుచూ తిరిగెను (32). ధనమదాంధుడు, దుర్దైవప్రేరితుడు, నశించిన ఆయుష్షు గలవాడు అగు ఆతడు వేదములను, బ్రాహ్మణులను, దేవతలను, గురువులను తిరస్కరించి ఆయువును వ్యర్థము చేయుచూ అనేక దినములు ఆ విధముగా రమించెను (33). ఈ భూమండలములో కొన్ని కోట్ల సంవత్సరములు గడిచెను. అపుడాతడు విస్తారముగా తిరుగుతూ ఒకనాడు సైన్యముతో గూడి ఆనందముతో మందర పర్వతమునకు వెళ్లెను (34). అభిమానముతో గర్వించియున్న ఆతడు క్రీడకొరకై ఆ పర్వతరాజము నెక్కి అచటి బంగరు శోభను తిలకించి సైన్యములతో గూడి తిరుగాడి, అజ్ఞానముచే అచట నివసింప నిశ్చయించెను (35). ఆ రాక్షసరాజు అచట సుందరమైన దృఢమగు నగరమును అత్యద్భుతముగా మందర పర్వతము యొక్క చరియయందు తన ప్రభావముచే కాలక్రమములో నిర్మించి ఆనందముతో అచట మకాము చేసెను (36).

దుర్యోధనో వైధస హస్తి సంజ్ఞౌ తన్మంత్రిణౌ దానవసత్త మస్య |

తే వై కదాచిద్గిరి సుస్థలే హి నారీం సురూపాం దదృశుస్త్ర యో%పి || 37

తే శీఘ్రగా దైత్యవరాస్తు హర్షా ద్ద్రుతం మహాదైత్యపతిం సమేత్య |

ఊచుర్యథా దృష్టమతీవ ప్రీత్యా తథాంధకం వీరవరం హి సర్వే || 38

ఆ రాక్షస వీరునకు దుర్యోధన, వైధస, హస్తి అను పేర్లు గల ముగ్గురు మంత్రులు ఉండిరి. వారు ముగ్గురు ఒకనాడు ఆ పర్వతసుందర దేశములో సందరియగు ఒక స్త్రీని గాంచిరి (37). ఆ ముగ్గురు రాక్షస వీరులు వెంటనే ఆనందముతో రాక్షస చక్రవర్తి, మహావీరుడు అగు అంధకుని వద్దకు వచ్చి తాము చూచిన దృశ్యమును మహాప్రీతితో వివరించి చెప్పిరి (38).

మంత్రిణ ఊచుః |

గుహాంతరే ధ్యాననిమీలితాక్షో దైత్యేంద్ర కశ్చిన్మునిరత్ర దృష్టః |

రూదాన్విత శంద్రకలార్ధచూడః కటిస్థలే బద్ధ గజేంద్రకృత్తిః ||39

నాగేంద్ర భోగావృత సర్వగాత్రః కపాలమాలాభరణో జటాలః |

స శూలహస్త శ్శరతూణధారీ మహాధనుష్మాన్‌ వివృతాక్ష సూత్రః || 40

ఖడ్గీ త్రిశూలీ లకుటీ కపర్దీ చతుర్భుజో గౌరతరాకృతిర్హి |

భస్మానులిప్తో విలసత్సుతేజాస్తపస్వి వర్యో%ద్భుత సర్వవేశః || 41

తస్యావిదూరే పురుషశ్చ దృష్ట స్స వానరో ఘోరముఖః కరాలః |

సర్వాయుధో రూక్షకరశ్చ రక్షన్‌ స్థితో జరద్గోవృషభశ్చ శుక్లః || 42

తస్యోపవిష్టస్య తపస్వినో%పి సుచారురూపా తరుణీ మనోజ్ఞా |

నారీ శుభా పార్శ్వగతా హి తస్య దృష్టా చ కాచిద్భువి రత్నభూతా || 43

ప్రవాల ముక్తామణి హేమరత్న వస్త్రావృతా మాల్యశుభోపగూఢా |

సా యేన దృష్టా స చ దృష్టిమాన్‌ స్యాద్దృష్టేన చాన్యేన కిమత్ర కార్యమ్‌ || 44

మన్యా మహేశస్య చ వా దివ్యనారీ భార్యా మునేః పుణ్యవతః ప్రియా సా |

యోగ్యా హి ద్రష్టుం భవతశ్చ సమ్యగానాయ్య దైత్యేంద్ర సురత్నభోక్తః || 45

మంత్రులు ఇట్లు పలికిరి -

ఓ రాక్షసరాజా! కన్నులను మూసి ధ్యానించువాడు, సుందరుడు, చంద్రకళను శిరముపై దాల్చినవాడు నడుమునకు ఏనుగు చర్మమును కట్టినవాడు, పాము పడగలతో చుట్టుబడియున్న సర్వావయవములు గలవాడు, కపాలము మాలయే ఆభరణముగా గలవాడు, జటాధారి, చేతిలో త్రిశూలమును దాల్చినవాడు, బాణములతో గూడిన అంబుల పొది గలవాడు, గొప్ప ధనుర్ధారి, స్ఫటికమాలను కనబరచు చున్నవాడు, ఖడ్గమును ధరించినవాడు, దండధారి, నాల్గు బాహువులు గలవాడు, పచ్చని దేహము గలవాడు, భస్మను పూసుకున్నవాడు, గొప్ప తేజస్సుతో ప్రకాశించువాడు, గొప్ప తపశ్శాలి, అద్భుతమగు విన్యాసము వేషము గలవాడు అగు ఒకానొక మునిని ఇచట గాంచితిమి (39, 40, 41)). వానికి కొద్ది దూరములో వానరాకారుడు, భయంకరమగు ముఖము గలవాడు, వికృతరూపుడు, సర్వాయుధములను బలమగు చేతులతో దాల్చినవాడు అగు ఒక పురుషుడు రక్షకుడై నిలబడి యుండెను. ఇంతేగాక, తెల్లని ముసలి ఎద్దు ఒకటి గలదు (42). కూర్చుండియున్న ఆ తపశ్శాలికి సమీపమునందు మిక్కిలి అందమగు రూపము గలది, సుందరి మనోహారిణి, మంగళ స్వరూపురాలు అగు ఒక శ్రేష్ఠయువతి నేలపై గూర్చుండి యున్నది (43). పగడములు, ముత్యములు, మణులు, రత్నములు పొదిగిన ఆభరణములను శుభకరమగు మాలను, గొప్ప వస్త్రములను దాల్చియున్న ఆమెను కాంచిన కనులు సార్ధకమగును. ఆమెని చూడని కనులు వ్యర్థము (44). ఓ రాక్షస రాజా! శ్రేష్ఠవస్తువుల ననుభవించువాడా! గొప్ప సమర్థుడు, పుణ్యాత్ముడు అగు ఆ మునికి ప్రియురాలు, ఆదరణీయురాలు, భార్య, దివ్యస్త్రీ అగు ఆమెను నీవు చూడదగుదువు. మరియు, ఆమెను నీవు చూడదగుదువు. మరియు, ఆమెను నీవు ఇచటకు రప్పించుము (45).

సనత్కుమార ఉవాచ |

శ్రుత్వేతి తేషాం వచనాని తాని కామాతురో ఘూర్ణిత సర్వగాత్రః |

విసర్జయామాస మునేస్సకాశం దుర్యోధనాదీన్‌ సహసా స దైత్యః || 46

ఆసాద్య తే తం మునిమప్రమేయం బృహద్ర్వతం మంత్రివరా హి తస్య |

సురాజనీతి ప్రవణా మునీశ ప్రణమ్య తం దైత్యనిదేశమాహుః || 47

సనత్కుమారుడిట్లు పలికెను-

వారి ఈ మాటలను విని ఆ రాక్షసుడు కామపీడితుడై, కంపించున్న సర్వావయవములు గలవాడై వెంటనే దుర్యోధనుడు మొదలగు ఆ మంత్రులు ముని వద్దకు పంపించెను (46). ఓ మహర్షీ! రాజనీతి చతురులగు ఆతని ఆ మంత్రివర్యులు అంచనావేయ శక్యముగాని మహిమ గలవాడు, మహావ్రత నిష్ఠుడు అగు ఆ మహర్షిని సమీపించి దానవేంద్రుని ఆదేశములను వినిపించిరి (47).

మంత్రిణ ఊచుః |

హిరణ్య నేత్రస్య సుతో మహాత్మా దైత్యాధిరాజో%ంధక నామధేయః |

త్రైలోక్యనాథో భవకృన్నిదేశా దిహోపవిష్టో%ద్య విహారశాలీ || 48

తన్మంత్రిణో వై వయమంగ వీరాస్తవోపకంఠం చ సమాగతాస్స్మః |

తత్ర్పేషితాస్త్వాం యదువాచ తద్వై శృణుష్వ సందత్తుమనాస్తపస్విన్‌ || 49

త్వం కస్య పుత్రో%సి కిమర్థమత్ర సుఖోపవిష్టో మునివర్య ధీమన్‌ |

కస్యేయమీదృక్‌ తరుణీ సురూపా దేయా శుభా దైత్యపతేర్మునీంద్ర || 50

క్వేదం శరీరం తవ భస్మదిగ్ధం కపాలమాలాభరణం విరూపమ్‌ |

తూణీసత్కార్ముక బాణ ఖడ్గ భుశుండి శూలాశనితోమరాణి || 51

క్వ జాహ్నవీ పుణ్యతమా జటాగ్రే క్వాయం శశీ వా కుణపాస్థి ఖండమ్‌ |

విషానలో దీర్ఘముఖః క్వ సర్పః క్వ సంగమః పీనపయోధరాయః || 52

జరద్గవారోహణ మప్రశస్తం క్షమావతస్తస్య న దర్శనం చ |

సంధ్యాప్రణామః క్వచిదేష ధర్మః క్వ భోజనం లోక విరుద్ధ మేతత్‌ || 53

ప్రయచ్ఛ నారీం మమ సాంత్వ పూర్వం స్త్రియా తపః కిం కురుషే విమూఢ |

అయుక్త మేతత్త్వయి నానురూపం యస్మాదహం రత్నపతిస్త్రిలోకే || 54

విముంచ శస్త్రాణి మయాద్య చోక్తః కురుష్వ పశ్చాత్తప ఏవ శుద్ధమ్‌ |

ఉల్లంఘ్య మచ్ఛాసనమప్రధృష్యం విమోక్ష్యసే సర్వమిదం శరీరమ్‌ || 55

మత్వాంధకం దుష్టమతిం ప్రధానో మహేశ్వరో లౌకిక భావశీలః |

ప్రోవాచ దైత్యం స్మితపూర్వమేవమాకర్ణ్య సర్వం త్వథ దూతవాక్యమ్‌ || 56

మంత్రులు ఇట్లు పలికిరి -

హిరణ్యాక్షుని కుమారుడు, మహాత్ముడు, అంధకుడను పేరు గలవాడు, ముల్లోకములకు, ప్రభువు అగు రాక్షస చక్రవర్తి బ్రహ్మయొక్క ఆదేశముచే విహారప్రియుడై ఇపుడు ఇచటకు సమీపములో మకాము చేసినాడు (48). ఓ మిత్రమా! ఆయన మంత్రులగు మేము వీరులము. ఓ తపశ్శాలీ! ఆయన చెప్పిన వచనములను మనస్సు లగ్నము చేసి వినుము (49). నీవు ఎవని పుత్రుడవు? ఓ మహర్షీ! బుద్ధిశాలివగు నీవు సుఖముగా ఇచట కూర్చుండుటకు కారణమేమి? ఇట్టి సుందరియగు ఈయువతి ఎవరికి చెందినది? ఓ మహర్షీ! ఈ శుభస్వరూపురాలివి రాక్షస చక్రవర్తికి సమర్పించుము (50). బూడిద అలమబడినది, పుర్రెల మాలయే ఆభరణముగా గలది, వికృతరూపము గలది అగు నీ ఈ శరీరమెక్కడ? తూణీరము, గొప్ప ధనస్సు, బాణములు, ఖడ్గము, భుశండి, శూలము, అశని (పిడుగు), తోమరము అను ఆయుధములు ఎక్కడ? (51). జటల అగ్ర భాగమునందు పరమ పుణ్యమగు గంగానది యెక్కడ? ఈ చంద్రుడు ఎక్కడ? శవముల ఎముకల ముక్కలు ఎక్కడ? పొడవైన పడగ కలిగి విషవాయువులను వెదజల్లు సర్పము ఎక్కడ? సుందరియగు ఈమె పొందు యెక్కడ? (52) ముసలి ఎద్దును ఎక్కుట ప్రశస్తమగు పని కాదు. భూమండలము నందెవ్వరైననూ అట్టి దృశ్యమును చూచియుండరు. సంధ్యాకాలములో ఈశ్వరునకు ప్రణమిల్లుట కొన్ని దేశములలో ధర్మమగుచున్నది. లోకమునకు విరుద్ధమగు ఈ భోజనము ఎక్కడిది? (53). నా అనునయవచనములను విని మంచితనముతో ఈమెను అప్పజెప్పుము. ఓరీ మూర్ఖా! స్త్రీతో గూడియుండి ఏమి తపస్సును చేసెదవు? ఇది నీకు యోగ్యమైన పని కాదు. కాని నేను ముల్లోకములలో శ్రేష్ఠవస్తువులకు ప్రభువునై యున్నాను (54). ఈ క్షణములో నా మాటను ఆదరించి ఆయుధములను పారవేసి తరువాత శుద్ధమగు తపస్సును చేసుకొనుము. తిరుగులేని నా ఆజ్ఞను ఉల్లఘించినచో, నీకు మృత్యువు తప్పదు (55). జగత్ర్పధానుడగు మహేశ్వరుడు దూతవాక్యమునంతయూ విని, అంధకుడు దుష్ట బుద్ధియని తలపోసి, లోకగతిని అనుసరించువాడై, చిరునవ్వుతో ఆ రాక్షసుని ఉద్దేశించి ఇట్లు పలికెను (56).

శివ ఉవాచ |

యద్యస్మి రుద్రస్తవ కిం మయా స్యాత్‌ కిమర్థమేవం వదసీతి మిథ్యా |

శృణు ప్రభావం మమ దైత్యనాథ న్యాయ్యం న వక్తుం వచనం త్వయైవమ్‌ || 57

నాహం క్వచిత్‌ స్వం పితరం స్మరామి గుహాంతరే ఘోరమనన్య చీర్ణమ్‌ |

ఏతద్ర్వతం పాశుపతం చరామి న మాతరం త్వజ్ఞతమో విరూపః || 58

అమూలమేతన్మయి తు ప్రసిద్ధం సుదుస్త్యజం సర్వమిదం మమాస్తి |

భార్యా మమేయం తరుణీ సురూపా సర్వం సహా సర్వగతస్య సిద్ధిః || 59

ఏతర్హి యద్యద్రుచితం తవాస్తి గృహాణ తద్వై ఖలు రాక్షస త్వమ్‌ |

ఏతావదుక్త్వా విరరామ శంభుస్తపస్వి వేషః పురతస్తు తేషామ్‌ || 60

శివుడిట్లు పలికెను-

నేను రుద్రుడ నైనచో, నాతో నీకు పనియేమి? నీవు ఇట్లు అనృతవచనముల నేల పలుకుచుంటివి? ఓ రాక్షసరాజా! నా ప్రభావమును గూర్చి వినుము. నీవు ఇట్లు పలుకుట తగదు (57). నేను ఏ కాలమునందైననూ నా తల్లిదండ్రులను స్మరించుట లేదు. అజ్ఞానిని, వికృతరూపుడు అగు నేను గుహ లోపల కూర్చుండి, ఇతరులెవ్వరూ చేయజాలని ఉగ్రమగు ఈ పాశుపత వ్రతముననుష్ఠించుచున్నాను (58). సర్వకారణుడనగు నాకు కారణము లేదను విషయము లోక ప్రసిద్ధము. నేనీ సర్వమును విడువలేకున్నాను. నా ఈ భార్య ¸°వనములో నున్న రూపవతి, సర్వమును సహించునది. మరియు సర్వవ్యాపకుడనగు నా సిద్ధి ఈమెయే (59). ఓ రాక్షసా! ఈ సమయములో నీకు ఏది రుచించునో, దానిని తీసుకొనుము. తపశ్శాలి వేషములో నున్న శంభుడు వారి యెదుట ఇంతమాత్రమే పలికి విరమించెను (60).

సనత్కుమార ఉవాచ |

గంభీరమేతద్వచనం నిశమ్య తే దానవాస్తం ప్రణిపత్య మూర్ధ్నా |

జగ్ముస్తతో దైత్యవరస్య సూనుం త్రైలోక్యనాశాయ కృతప్రతిజ్ఞమ్‌ || 61

బభాషిరే దైత్యపతిం ప్రమత్తం ప్రణమ్య రాజానమదీనసత్త్వాః |

తే తత్ర సర్వే జయ శబ్దపూర్వం రుద్రేణ యత్తత్‌ స్మితపూర్వకముక్తమ్‌ || 62

సనత్కుమారుడిట్లు పలికెను-

ఈ గంభీరమగు వచనములను విన్న పిదప ఆ దానవులు ఆయనకు తలవంచి ప్రణమిల్లి, ముల్లోకములను నశింపజేసెదనని ప్రతిజ్ఞను బూనియున్నవాడు, రాక్షసవీరుడగు హిరణ్యాక్షుని పుత్రుడు అగు అంధకుని వద్దకు వెళ్లిరి (61). దైన్యము నెరుంగని అంతఃకరణము గల వారు ముగ్గురు గర్వితుడై యున్న రాక్షస రాజునకు జయశబ్ద పూర్వకముగా ప్రణమిల్లి, రుద్రుడు చిరునవ్వుతో చెప్పిన సందేశమును ఆతని ఎదుట వినిపించిరి (62).

మంత్రిణ ఊచుః |

నిశాచరశ్చంచల శౌర్యధైర్యః క్వ దానవః కృపణస్సత్త్వహీనః |

క్రూరః కృతఘ్నశ్చ సదైవ పాపీ క్వ దానవ స్సూర్య సుతాద్బిభేతి || 63

రాజత్వముక్తో%ఖిల దైత్యనాథస్తపస్వినా తన్మునినా విహస్య |

మత్వా స్వ బుద్ధ్యా తృణవత్త్రిలోకం మహౌజసా వీరవరేణ నూనమ్‌ || 64

క్వాహం చ శస్త్రాణి చ దారుణాని మృత్యోశ్చ సంత్రాసకరం క్వ యుద్ధమ్‌ |

క్వ వీరకో వానరవక్త్రతుల్యో నిశాచరో జరసా జర్జరాంగః || 65

క్వాయం స్వరూపః క్వ చ మందభాగ్యః బలం త్వదీయెం క్వచ వీరుధో వా |

శక్తో%పి చేత్త్వం ప్రయతస్వ యుద్ధం కర్తుం తదా హ్యేహి కురుష్వ కించిత్‌ || 66

వజ్రాశ##నేస్తుల్య మిహాస్తి శస్త్రం భవాదృశాం నాశకరం చ ఘోరమ్‌ |

క్వ తే శరీరం మృదు పద్మతుల్యం విచార్య చైవం కురు రోచతే యత్‌ || 67

ఇత్యేవమాదీని వచాంసి భద్రం తపస్వినోక్తాని చ దానవేశ |

యుక్తం న తే తేన సహాత్ర యుద్ధం త్వామాహ రాజన్‌ స్మయమాన ఏవ || 68

వివస్తు శూన్యైర్బహుభిః ప్రలాపైరస్మాభిరుక్తైర్యది బుధ్యసే త్వమ్‌ |

తపోభియుక్తేన తపస్వినా వై స్మర్తాసి పశ్చాన్ముని వాక్యమేతత్‌ || 69

మంత్రులు ఇట్లు పలికిరి -

చంచలమగు శౌర్యధైర్యములు గలవాడు. దనువంశజుడు, దీనుడు, సత్త్వగుణము లేనివాడు అగు రాక్షసుడు ఎక్కడ? క్రూరుడు, కృతఘ్నుడు, సర్వకాలములలో పాపాచారి అగు ఆ దానవుడు యమునకు భయపడుతూ ఎక్కడనున్నాడు? (63). ఓ రాజా! తపశ్శాలి, గొప్ప శక్తిగలవాడు, నిశ్చయముగా వీరులలో శ్రేష్ఠుడునగు ఆ ముని తన బుద్ధిలో ముల్లోకములను తృణప్రాయముగా భావించి చిరునవ్వుతో సమస్త దైత్యులకు అధీశ్వరుడవగు నిన్ను ఉద్దేశించి ఇట్లు పలికినాడు (64). నేను ఎక్కడ? దారుణమగు శస్త్రములెక్కడ? మృత్యువునకైననూ భీతిని గొల్పు యుద్ధము ఎక్కడ? కోతి మోమువాడు, రాత్రులందు తిరుగాడువాడు, వయస్సు పైబడుటచే శిథిలమైన అవయవములు గలవాడునగు వీరకుడెక్కడ? (65) మందభాగ్యుడగు ఈ వీరకుని స్వరూపమెక్కడ? నీబలమెక్కడ? ఈ కోతి తిరుగాడు చెట్లు ఎక్కడ? నీవు సమర్థుడవైనచో, యుద్ధమును చేయుటకు ప్రయత్నించుము. అట్లైనచో రమ్ము ఏదో ఒకటి చేయుము (66). నీవంటి వారిని నశింపజేయగలది, భయంకరమైనది, వజ్రముతో పిడగుతో సమమైనది గు ఆయుధము ఇచట గలదు. మెత్తని పద్మముతో పోల్చదగిన నీ శరీరమెక్కడ? ఈ తీరున ఆలోచించి, నీకు తోచినట్లు చేయుము (67). ఓ దానవేశ్వరా! నీకు మంగళమగు గాక! ఆ తపశ్శాలి ఇటువంటి మాటలను పలికియున్నాడు. ఆతడు పొగరు గలవాడై నీకిట్టి సందేశమును పంపినాడు. ఆతనితో ఈ సమయములో నీకు యుద్ధము తగదు (68). విషయములేని ఇట్టి అనేక ప్రేలాపనలను మేము నీకు నివేదించితిమి. తపస్సును చేయుటలో దిట్టయగు ఆ మహర్షి పలికిన పలుకులు నీకు అర్ధమైనవా? నీవు తరువాత మహర్షియొక్క ఈ వచనములను గురించి ఆలోచించుము (59).

సనత్కుమార ఉవాచ |

తతస్స తేషాం వచనం నిశమ్య జజ్వాల రోషేణ స మంద బుద్ధిః |

ఆజ్యావసిక్త స్త్వివ కృష్ణవర్త్మా సత్యం హితం తత్కుటిలం సుతీక్ణమ్‌ || 70

గృహీత ఖడ్గో వరదానమత్తః ప్రచండవాతాను కృతిం చ కుర్వన్‌ |

గంతు చ తత్ర స్మరబాణ విద్ధస్సముద్యతో%భూద్విపరీతదేవః || 71

ఇతి శ్రీ శివ మహాపురాణ రుద్ర సంహితాయాం యుద్ధఖండే అంధక దూత సంవాదో నామ చతుశ్చత్వారింశో%ధ్యాయః (44)

సనత్కుమారు డిట్లు పలికెను -

మందబుద్ధియగు ఆ అంధకుడు సత్యము, హితకరము, వక్రోక్తులతో గూడినది, మిక్కిలి తీక్‌ష్ణమైనది అగు శివుని సందేశమును వారు చెప్పగా విని, నేతితో తడుపబడిన అగ్ని హోత్రుని వలె కోపముతో మండిపడెను (70). దైవోపహతుడు, బ్రహ్మ ఇచ్చిన వరములచే మదించియున్నవాడు, మన్మథావిష్ట హృదయుడునగు ఆ అంధకుడు కత్తిని చేతబట్టి తుఫాను గాలిని అనుకరించే చేష్ట గలవాడై అచటకు వెళ్లుటకై సంసిద్ధుడాయెను (71).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధ ఖండలో అంధక దూత సంవాదమనే నలుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (44).

Sri Sivamahapuranamu-II    Chapters