Sri Sivamahapuranamu-II    Chapters   

అథ సప్తత్రింశో%ధ్యాయః

స్కందశంఖచూడుల ద్వంద్వయుద్ధము

సనత్కుమార ఉవాచ |

తదా దేవగణాస్సర్వే దానవైశ్చ పరాజితాః | దుద్రువుర్భయభీతాశ్చ శస్త్రాస్త్రక్షతవిగ్రహాః || 1

తే పరావృత్య విశ్వేశం శంకరం శరణం యయుః | త్రాహి త్రాహీతి సర్వేశేత్యూచుర్విహ్వలయా గిరా || 2

దృష్ట్వా పరాజయం తేషాం దేవాదీనాం స శంకరః | సభయం వచంన శ్రుత్వా కోపముచ్చైశ్చకార హ || 3

నిరీక్ష్య స కృపాదృష్ట్వా దేవేభ్యశ్చాభయం దదౌ | బలం చ స్వగణానాం వై వర్ధయామాస తేజసా || 4

శివాజ్ఞప్తస్తదా స్కందో దానవానాం గణౖస్సహ | యుయుధే నిర్భయస్సంఖ్యే మహావీరో హరాత్మజః || 5

కృత్వా క్రోధం వీరశబ్దం దేవో యస్తారకాంతకః | అక్షౌహిణీనాం శతకం సమరే స జఘాన హ || 6

రుధిరం పాతయామాస కాలీ కమలలోచనా | తేషాం శిరాంసి సంఛిద్య బభక్ష సహసా చ సా || 7

సనత్కుమారుడిట్లు పలికెను-

అపుడు దేవగణములన్నియు దానవులచే ఓడింపబడి శస్త్రాస్త్రములచే గాయపడిన దేహములు గలవారై భయభీతులై పారిపోయిరి (1). వారు విశ్వేశ్వరుడగు శంకరుని వద్దకు తిరిగి వచ్చి దుఃఖముతో నిండిన వాక్కుతో 'ఓ సర్వేశ్వరా! రక్షింపుము, రక్షింపుము'అని పలుకుతూ శరణుజొచ్చిరి (2). ఆ దేవాదుల పరాజయమును గాంచి భయపూరితములగు వారి మాటలను విని ఆ శంకరుడు గొప్ప క్రోధమును పొందెను (3). ఆయన దేవతలపై దయాదృష్టిని బరపి అభయమునిచ్చి తన తేజస్సుతో తన గణముల బలమును వర్ధిల్ల జేసెను (4). అపుడు మహావీరుడు, శివపుత్రుడు అగు స్కందుడు శివుని ఆజ్ఞను పొంది యుద్ధములో భయములేని వాడై దానవగణములతో పోరు సలిపెను (5). తారకాంతకుడగు ఆ స్కందుడు సింహనాదమును చేసి కోపించినవాడై యుద్ధములో వంద అక్షౌహిణీల సైన్యమును మట్టుబెట్టెను (6). పద్మములవంటి కన్నులు గల కాళి వారి శిరస్సులను దునిమి శీఘ్రమే రక్తమును త్రాగి మాంసమును భక్షించెను (7).

పపౌ రక్తాని తేషాం చ దానవానాం సమంతతః | యుద్ధం చకార వివిధం సురదానవభీషణమ్‌ || 8

శతలక్షం గజేంద్రాణాం శతలక్షం నృణాం తథా | సమాదాయైక హస్తేన ముఖే చిక్షేప లీలయా || 9

కబంధానాం సహస్రం చ సన్ననర్త రణ బహు | మహాన్‌ కోలాహలో జాతః క్లీబానాం చ భయంకరః || 10

పునస్స్కందః ప్రకుప్యోచ్చైశ్శరవర్షం చకార హ | పాతయామాస క్షణతః కోటిశో%సురనాయకాన్‌ || 11

దానవాశ్శరజాలేన స్కందస్య క్షతవిగ్రహాః | భీతాః ప్రదుద్రువుస్సర్వే శేషా మరణతస్తదా || 12

వృషపర్వా విప్రచిత్తిర్దండశ్చాపి వికంపనః | స్కందేన యుయుధు స్సార్ధం తేన సర్వే క్రమేణ చ || 13

మహామారీ చ యుయుధే న బభూవ పరాఙ్‌ముఖీ | బభూవుస్తే క్షతాంగాశ్చ స్కంద శక్తిప్రపీడితా || 14

ఆమె అన్నివైపులనుండి ఆ దానవుల రక్తమును త్రాగుచూ, దేవతలకు దానవులకు కూడ భయమును గొల్పు వివిధరకముల యుద్ధమును చేసెను (8). ఆమె కోటి శ్రేష్ఠమగు ఏనుగులను మరియు కోటి మంది మానవులను ఒకే చేతితో పట్టుకొని అవలీలగా నోటిలో పారవైచుకొనెను (9). ఆ యుద్ధములో వేలాది మొండెములు అనేక రకములుగా నాట్యమాడినవి. పిరికి వారికి భయమును గొల్పు పెద్ద కోలాహలము చెలరేగెను (10). మరల స్కందుడు పెద్దగా కోపించి బాణముల వర్షమును కురింపించి, క్షణకాలములో కోటి మంది రాక్షస వీరులను నేల గూల్చెను (11). స్కందుని బాణ పరంపరచే తెగిన దేహములు కలిగి మరణించగా మిగిలిన దానవులందరు అపుడు పారిపోయిరి (12). వృషపర్వుడు, విప్రచిత్తి, దండుడు మరయు వికంపనుడు అను వారందరు వరుసగా స్కందునితో యుద్ధమును చేసిరి. (13). మహామారి కూడ వెన్ను చూపకుండా యుద్ధమును చేసెను. స్కందుని శక్తి- ఆయుధముచే వారు తెగిన అవయవములు గలవారై అధికమగు పీడను పొందిరి (14).

మహామారీస్కందయోశ్చ విజయో%భూత్తదా మునే | నేదుర్దుందుభయస్స్వర్గే పుష్పవృష్టిః పపాత హ || 15

స్కందస్య సమరం దృష్ట్వా మహారౌద్రం తమద్భుతమ్‌ | దానవానాం క్షయకరం యథా ప్రకృతి కల్పకమ్‌ ||16

మహామారీ కృతం తచ్చోపద్రవం క్షయహేతుకమ్‌ | చుకోపాతీవ సహసా సన్నద్ధో%భూత్స్వయం తదా || 17

వరం విమానమారుహ్య నానాశస్త్రాస్త్ర సంయుతమ్‌ | అభయం సర్వవీరాణాం నానారత్న పరిచ్ఛదమ్‌ || 18

మహావీరైశ్శంఖచూడో జగామ రథమధ్యతః | ధనుర్వికృష్య కర్ణాంతం చకార శరవర్షణమ్‌ || 19

తస్య సా శరవృష్టిశ్చ దుర్నివార్యా భయంకరీ | మహోఘోరాంధ కారశ్చ వధస్థానే బభూవ హ || 20

దేవాః ప్రదుదద్రువుః సర్వే యో%న్యే నందీశ్వరాదయః | ఏక ఏవ కార్తికేయస్తస్థౌ సమరమూర్ధని || 21

ఓ మునీ! అపుడు మహామారి, స్కందుడు విజయమును పొందిరి. స్వర్గములో దుందుభులు మ్రోగెను. పూల వాన కురిసెను (15). మిక్కిలి భయంకరము, అద్భుతము, ప్రకృతి శక్తులను బోలి దానవులను వినాశమొనర్చునది అగు ఆ స్కందుని సమరమును గాంచి (16), మహామారిచే చేయబడిన వినాశకరమగు ఆ ఉపద్రవమును కూడ గాంచి, అపుడు శంఖచూడుడు మిక్కిలి కోపించి వెంటనే స్వయముగా యుద్ధమునకు సన్నద్ధుడై (17), అనేక శస్త్రాస్త్రములతో గూడినది, దానవవీరులందరికీ అభయమునిచ్చునది, అనేక శ్రేష్ఠవస్తువులతో నిర్మితమైనది అగు శ్రేష్ఠవిమానమునెక్కి (18), మహావీరులతో గూడి యుద్ధరంగమునకు వెళ్లెను. ఆతడు ఆ విమానరూపమగు రథమధ్యములో నున్న వాడై ఆకర్ణాంతము నారిత్రాటిని లాగి బాణముల వర్షమును కురిపించెను (19). ఆతని ఆ బాణవర్షము భయంకరమైనది, నివారింపశక్యము కానిది. వధస్థానము వంటి ఆ యుద్ధభూమిలో మిక్కిలి భయంకరమగు చీకటి నెలకొనెను (20). దేవతలు, మరియు నందీశ్వరుడు మొదలగు ఇతరుల అందరు పరుగెత్తిరి. రణరంగములో స్కందుడు ఒక్కడు మాత్రమే నిలబడి యుండెను (21)

పర్వతానాం చ సర్పాణాం నాగానాం శాఖినాం తథా | రాజా చకార వృష్టిం చ దుర్నివార్యాం భయంకరీమ్‌ || 22

తద్వృష్ట్యా ప్రహతస్స్కందో బభూవ శివనందనః | నీహారేణ చ సాంద్రేణ సంవృతో భాస్కరో యథా || 23

నానావిధాం స్వమాయాం చ చకార మయదర్శితామ్‌ | తాం నావిదన్‌ సురాః కే%పి గణాశ్చ మునిసత్తమ || 24

తదైవ శంఖచూడశ్చ మహామాయీ మహాబలః | శ##రేణౖకేన దివ్యేన ధనుశ్ఛిచ్ఛేద తస్య వై || 25

బభంజ తద్రథం దివ్యం చిచ్ఛేద రథ పీడకాన్‌| మయూరం జర్జరీ భూతం దివ్యాస్త్రేణ చకార సః ||26

శక్తిం చిక్షేప సూర్యాభాం తస్య వక్షసి ఘాతినీమ్‌ | మూర్ఛా మవాప సహసా తత్ర్పహారేణ స క్షణమ్‌ || 27

పునశ్చ చేతనాం ప్రాప్య కార్తికః పరవీరహా | రత్నేంద్రసారనిర్మాణ మారురోహ స్వవాహనమ్‌ || 28

శంఖచూడుడు పర్వతములను, సర్పములను, కొండచిలువలను, మరియు వృక్షములను వర్షరూపములో కురిపించెను. భయంకరమగు ఆ వర్షమును నివారించుట సంభవము కాదు (22). ఆ వర్షముచే కొట్టబడిన శివపుత్రుడగు స్కందుడు దట్టమగు మంచుచే కప్పబడిన సూర్యుని వలె నుండెను (23). ఆతడు మయుడు నేర్పించిన వివిధరకముల మాయను ప్రదర్శించెను. ఓ మహర్షీ! దేవతలలో మరియు గణములలో ఒక్కరైననూ ఆ మాయను తెలియలేకపోయిరి (24). అదే సమయములో మహామాయావి, మహాబలశాలి యగు శంఖచూడుడు ఒక దివ్యమగు బాణముతో స్కందుని ధనస్సును విరుగ గొట్టెను (25). ఆతడు స్కందుని దివ్యరథమును విరుగగొట్టి, రథమును లాగు గుర్రములను సంహరించి దివ్యమగు అస్త్రముతో నెమలిని కూడ నిష్క్రియముగా చేసెను (26). ఆతడు సూర్యకాంతి కలిగిన ప్రాణములను తీసే శక్తితో స్కందుని వక్షఃస్థలముపై కొట్టగా, ఆతడు ఆ దెబ్బచే వెంటనే క్షణకాలము మూర్ఛిల్లెను (27). శత్రువీరులను సంహరించే స్కందుడు మరల తెలివిని పొంది, గొప్ప రత్నమును పొదిగి దృఢముగా నిర్మింపబడిన తన వాహనము నెక్కెను (28).

స్మృత్వా పాదౌ మహేశస్య సాంబికస్య చ షణ్ముఖః | శస్త్రాస్త్రాణి గృహీత్వైవ చకార రణముల్బణమ్‌ || 29

సర్పాంశ్చ పర్వతాంశ్చైవ వృక్షాంశ్చ ప్రస్తరాంస్తథా | సర్వాంశ్చిచ్ఛేద కోపేన దివ్యాస్త్రేణ శివాత్మజః || 30

వహ్నిం నివారయామాస పార్జన్యేన శ##రేణ హ | రథం ధనుశ్చ చిచ్ఛేద శంఖచూడస్య లీలయా || 31

సన్నాహం సర్వవాహాంశ్చ కిరీటం ముకుటోజ్జ్వలమ్‌ | వీరశబ్దం చకారాసౌ జగర్జ చ పునః పునః || 32

కాలీ గృహీత్వా తం క్రోడే నినాయ శివసన్నిధౌ | జ్ఞానేనం తం శివశ్చాపి జీవయామాస లీలయా|| 36

దదౌ బలమనంతం చ సముత్తస్థౌ ప్రతాపవాన్‌ | గమనాయ మతిం చక్రే పునస్తత్ర శివాత్మజః || 37

ఏతస్మిన్నంతరే వీరో వీరభద్రో మహాబలః | శంఖచూడేన యుయుధే సమరే బలశాలినా || 38

వవర్ష సమరే%స్త్రాణి యాని యాని చ దానవః | చిచ్ఛేద లీలయా వీరస్తాని తాని నిజైశ్శరైః || 39

దివ్యాన్యస్త్రాణి శతశో ముముచే దానవేశ్వరః | తాని చిచ్ఛేద తం బాణౖర్వీరభద్రః ప్రతాపవాన్‌ || 40

అథాతీవ చుకోపోచ్చైశ్శంఖచూడః ప్రతాపవాన్‌ | శక్త్యా జగానోరసి తం స చకంపే పపాత కౌ || 41

క్షణన చేతనాం ప్రాప్య సముత్తస్థౌ గణశ్వరః | జగ్రాహ చ ధనుర్భూయో వీరభద్రో గణాగ్రణీః || 42

కాళి ఆతనిని తన ఒడిలోనికి తీసుకొని శివునిసన్నిధికి చేర్చగా, శివుడు తన జ్ఞానముచే ఆతనిని అవలీలగా జీవింపజేసెను (36). మరియు శివుడు ఆతనికి అనంతబలమునిచ్చెను. అపుడు ప్రతాపశాలి, శివపుత్రుడునగు స్కందుడు లేచి నిలబడి, మరల బయలుదేరుటకు సిద్ధపడెను (37). ఇంతలో వీరుడు, మహాబలుడు అగు వీరభద్రుడు యుద్ధములో గొప్ప బలమును ప్రదర్శించే శంఖచూడునితో పోరాడెను (38). శంఖచూడుడు యుద్ధములో ఏయే అస్త్రములను వర్షమువలె కురిపించెనో, ఆయా అస్త్రములను వీరుడగు వీరభద్రుడు తన బాణములచే అవలీలగా ఛేదించెను (39). ఆ రాక్షసరాజు వందలాది దివ్యాస్త్రములను ప్రయోగించెను ప్రతాప శాలియగు వీరభద్రుడు వాటిని తన బాణములతో ఛేదించి వానిని కొట్టెను (40). అపుడు ప్రతాపవంతుడగు శంఖచూడుడు మిక్కిలి కోపించి ఆతనిని శక్తితో వక్షస్థ్సలము నందు కొట్టెను. ఆతడు ఆ దెబ్బకు చలించినేలపై బడెను (41). గణాధ్యక్షులలో అగ్రసరుడగు వీరభద్రుడు క్షణములో తెలివిని దెచ్చు కొని లేచి నిలబడి మరల ధనస్సును చేతబట్టెను (42).

ఏతస్మిన్నంతరే కాలీ జగామ సమరం పునః | భక్షితుం దానవాన్‌ స్వాంశ్చ రక్షితుం కార్తికేచ్ఛయా || 43

వీరాస్తామను జగ్ముశ్చ తే చ నందీశ్వరాదయః | సర్వే దేవాశ్చ గంధర్వా యక్షా రక్షాంసి పన్నగాః || 44

వాద్యభాండాశ్చ బహుశశ్శతశో మధువాహకాః | పునస్సముద్యతాశ్చాసన్‌ వీరా ఉభయతో%ఖిలాః || 45

ఇతి శ్రీశివమహాపురాణ రుద్రసంహితాయాం యుద్ధఖండే ససైన్యశంఖచూడ యుద్ధవర్ణనం నామ సప్త త్రింశో%ధ్యాయః (37).

ఇంతలో కాళి స్కందుని కోర్కెపై, దానవులను భక్షించి తన వారిని రక్షించుట కొరకై మరల యుద్ధరంగమునకు వెళ్లెను (43). నందీశ్వరుడు మొదలగు వీరులు, సర్వదేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మరియు నాగులు ఆమె వెనుక నడిచిరి (44). వాద్యములను మ్రోగించువారు, మరియు మధువును అందించు వారు పెద్దసంఖ్యలో అనుసరించిరి. మరల రెండు పక్షములలోని వీరులందరు యుద్ధమునకు సన్నద్ధులైరి (45).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందలి యుద్ధఖండలో స్కందశంఖచూడుల ద్వంద్వ యుద్ధవర్ణనమనే ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది (37).

Sri Sivamahapuranamu-II    Chapters