Neetikathamala-1    Chapters    Last Page

8

దైవస్తుతి

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించి విష్ణ్విన్ద్ర సుపూజితాభ్యామ్‌,

విభూతి పాటీర విలేపనాభ్యాం

నమో నమశ్శంకర పార్వతీభ్యామ్‌.

(ఉమామహేశ్వరస్తోత్రం)

భర్తృహరి

గ్రాసములేక స్రుక్కిన జరాకృశ##మైన విశీర్ణమైన సా

యాసమునైన నష్టరుచియైనను బ్రాణభయార్తమైన సం

త్రాస మదేభకుంభపిశిత గ్రహలాలసశీల సాగ్రహా

గ్రేసర భాసమానమగు కేసరి జీర్ణతృణంబు మేయునే.

శూరాగ్రణియగు సింహము అకలిచే డస్సినను, ముదిమిచే జిక్కినను, కష్టస్థితిని బొందినను, కాంతివిహీనమైనను, ప్రాణములు పోవుచున్నను మదించిన ఏనుగుయెక్క కుంభస్థలమును పగులగొట్టి యందలి మాంసమును భుజింపcదలచునేగాని ఎండుగడ్డిని తినునా? తినదని భావము.

* * *

వాల్మీకి

అతి భయరకరమైన కాననసీమ. ఆ ప్రాంతములో తమసానది ఉత్తుంగతరంగములతో పొంగి పొరలుచుండెను. చండమార్తాండుడు సహస్రకిరణములతో మండిపడుచుండెను. ఆ మట్టమధ్యాహ్నవేళ ఆ కాంతారపథములో కొందరు మహర్షివరేణ్యులు పుణ్యతీర్థములను సేవించుటకై వెడలుచుండిరి. ఆకస్మికముగా భుజాగ్రమందు భయంకరకుఠారమును ధరించిన గజదొంగ ఒకడు వారి ముందుకు దూకి ''ఆగండీ! జడదారులారా! ఆగండి. కాళ్లు కదిపారో ప్రాణాలు దక్కవు. ముందు మీదగ్గర ఉన్న ధనరాసులను అక్కడవుంచి వెళ్లండి.'' అని గర్జించెను. గజదొంగ గర్జనమును విని మునీశ్వరులు నిస్తబ్దులైరి. అందులో ఒక వృద్ధ తపోధనుడు ''నాయనా''! ముక్కు మూసుకొని తపము చేసుకొను మాకడ ధన కనక వస్తురాసులు ఎట్లుండును? ఇవిగో! ఈకమండలువులే మాధనము. ఈనారచీరలే, ఈజింక చర్మములే మా దగ్గరనున్న సొమ్ములు. కావలసివస్తే నిరభ్యంతరముగా తీసుకో'' అనెను. చోరుడు నవ్వుచు ''అయితే ఏ ధనమూ మీ దగ్గర లేనే లేదా? దౌర్భాగ్యులారా! ఏమి బ్రతుకులు మీవి! నగలు నాణాలు లేని మీ జీవితము లెందుకు? కాల్చనా? '' అని పలికెను.

నాయనా! లేకేమి! మాదగ్గర ఒక లోకోత్తరమైన ధనము ఉన్నది. కాని అది పురాకృత పుణ్యఫలమున కాని సమకూరదు. దీక్షాస్వీకారము చేస్తే కాని దానిని స్వీకరింపకూడదు.

''ఆమాట చెప్పరేమి? ఏదీ ఆ ధనము ఇటివ్వండి.''

''నాయనా! మా దగ్గర ఉన్న ధనము లోకకల్యాణకారకమైనది. ఇహ పర సౌఖ్యసంపాదకమైనది. దైవభక్తికి నిధానము. జ్ఞాన విద్యాధనము అది.''

మధురములైన మునీశ్వరుని వాక్యములు చోరుని మనస్సులో ఒక కొత్త కౌతూహలమును రేపెను. అతని హృదయము ఆర్ద్రము కాజొచ్చినది. ''మహామునీ! మీ వాక్యములు వినిన కొలది నా మానసము మెత్తపడుచున్నది. వెంటనే మీకడ నున్న ధనము నిప్పింపుడు'' అని కోరెను. చోరుని మాటలకు బదులు చెప్పుచు ''నాయనా! ఆధనము అంతతేలికగా ప్రాప్తింపదు. ఎంతమంది ప్రాణులు నీ గండ్రగొడ్డలికి బలిఐనారో! ఎంతమంది పతివ్రతల మంళసూత్రములు తెగిపోయినవో! ఎంతమంది సాధుజనుల బ్రతుకులు తెల్లవారినవో గ్రహంచితివా? అంత దారుణ హింస కొడిగట్టి నీవు తీసుకొని వెళ్లిన, ధన వస్తురాసులను గ్రహించిన ఆలుబిడ్డలు నీ పాపఫలమును పొందుదు రేమో ఆలోచించితివా?'' అని పలికెను.

మహర్షి మాటలు వినినకొలది ఆతని హృదయము తల్లడిల్లసాగినది. ఆతడు క్షణకాలము ఆలోచించి ''మహాత్మా! నేనింతవరకు ఈ విషయం ఆలోచించనే లేదు. నే నపహరించిన సొమ్ములు గ్రహించి సుఖములు అనుభవించుచున్న నాసతీసుతులు పాపఫలములో మాత్రము పాలెందుకు పంచుకొనరు'' అనెను. మహర్షి ప్రశాంతముగా ''ఇంటికి వెడలి భార్యను పిల్లలను అడిగి ర'' మ్మనెను.

గజదొంగ ముని పాదములపై వ్రాలి ''అట్లే స్వామీ! క్షణములో ఇంటికి వెళ్లి వచ్చెదను'' అని పలికి కానన మధ్యమున బడి ఇంటికి వెడలెను. వట్టి చేతులతో ఆతురతగా వచ్చుచ్చున్న ఆతనికి ఎదురుగా వచ్చిన భార్య నిరాశతో వెనుదిరిగి పోయెను. బంగారము తెచ్చినపుడు మధురభాషణములు పల్కు భార్య పెడమొగము పెట్టినందులకు ఆత డెంతయు పరితపించెను. భార్యను పిలిచి ''ఇదిగో! నేనింక ధనము సంపాదింపకుండ ఇంటిలోనే కూర్చుందును. ఏమందువు?'' అనెను. ఆమె కళ్లు పెద్దవిచేసి ''కుడిచి కూర్చుండిన మెతుకులు సంపాదించు వారెవరున్నారు! కుటుంబమును రక్షించు భారము మీది'' అని సమాధాన మిచ్చెను. ''అయితే పరధనముతోపాటు, ఆ పాపఫలమునకూడ పాలు పంచుకొనెదవా?'' అని అతడు తిరిగి భార్యను ప్రశ్నించెను. ''చాలు చాలు, ఈ విచిత్ర వాక్యములు. మాకు ధనముతోనే పనిగాని, ఎవరి పాపము వారు అనుభవించవలసినదే'' అని ఆమె బదులు చెప్పినది. కుమారులను పిలిచి అతడు ఇట్లే ప్రశ్నించెను. వారు తండ్రి మాటలను విని నవ్విరి. గజదొంగ మనస్సులో నిండిఉన్న అజ్ఞానము పటాపంచ లయ్యెను. సత్యము ద్యోతక మయ్యెను.

అతడు గబగబ మునీశ్వరు డున్న చోటికి వెళ్లి ''మహాత్ములారా! పాపిని మన్నించండి. స్వార్థమోహములచే ఇంతవరకును నే నెన్నో పాపకృత్యములను కావించితిని. మీ బోధలచే నా అజ్ఞానము పోయినది. నాకు తరణోపాయము ప్రబోధించి, నన్ను తరింపజేయుడు'' అని పాదములపై వ్రాలెను.

మునీశ్వరుడు ఆ దొంగకు నారాయణమంత్రము ఉపదేశించెను. ''మరా మరా'' అను దివ్వ మంత్రమును నిష్ఠతో ధ్యానింపుమని చెప్పెను. మునీశ్వరులు తమ దారిని తాము వెడలిపోయిరి.

గజదొంగ నిశ్చల ధ్యానతత్పరుడై ''మరా మరా'' అని జపింపదొడగెను. రోజులు గడచెను. నెలలు దాటిపోయెను. ముని అట్లే పరమ నిష్ఠాగరిష్ఠుడై మంత్రమును జపించుచుండెను. సంవత్సరములు గడచిపోవుచుండెను. తపసి అచంచలుడై రామమంత్రమును నిరంతర ధ్యానతత్పరుడై స్మరించుచుండెను. అతని జుట్టులో పిట్టలు గూండ్లు పెట్టెను. ఆయన చుట్టును పుట్టలు పెరిగెను.

జగత్పవిత్రమైన తారకమంత్ర జపైకలోలుడైనవానికి వర్షాతపములు లెక్కలేదు. ఆతపస్వి మహిమోదాత్త తపోదీక్షకు బ్రహ్మదేవుడు సంతసించి ఆయన ముందు సాక్షాత్కరించెను. వల్మీకమును ప్రక్కకు ఒత్తిగించి ''మునిసత్తమా! లెమ్ము. నీ తపోమహత్వము అనన్యసాధ్యమైనది. సర్వలోక హితమైనది. ఈనాటి నుండి నీవు ''వాల్మీకి'' యని ప్రసిద్ధి చెందుదువు. నీకు పరమజ్ఞానము ప్రసాదిస్తున్నాను. త్రికాలవేదియైన నారదుని ప్రబోధముచేత నీవు పరమపావనమైన రామాయణమును రచించి తరించెదవు'' అని దీవించెను. తపసి వల్మీకము నుండి లేచి అచ్చటే ఆశ్రమము నిర్మించుకొని ఉండెను.

ఒకనాడు వాల్మీకిమహర్షి స్నానార్థమై తమసానదికి శిష్యగణముతో కూడి వెళ్ళుచుండెను. ప్రకృతి సౌందర్యశోభను తిలకించుచు వెడలుచున్న మునికి ఒక దృశ్యము గోచరించెను. ఒకానొక వృక్షముపై క్రౌంచపక్షుల జంట క్రీడించుచుండెను. అంతట బోయవా డొకడు బాణాగ్రముతో పక్షుల జంటలో నొక దానిని కూల్చెను. రక్తసిక్తాంగమై క్రౌంచము నేల వ్రాలెను.

మహీతలముపై పడిన మగపక్షిని జూచి ఆడుపక్షి దురంత దుఃఖముతో ఆక్రోశింపసాగినది. ఈకరుణామయ దృశ్యమును గాంచిన వాల్మీకి హృదయము ఆర్ద్రమైపోయెను. ఆయన శోకము క్రోధముగా మారెను. ఆ కోపమే కిరాతుని పాలికి శాప మయ్యెను.

''మానిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః,

యత్‌ క్రౌంచ మిథునా దేక మవధీః కామమోహితమ్‌.''

అని ఆయన నోటివెంట శ్లోకము వెడలెను. ముని నోటినుండి ఆ వాక్యములు వెడలెనో లేదో కిరాతుడు కొండవోలె నేలపై కూలిపోయెను.

అప్రయత్నంగా నాడు వెడలిన ఆ శ్లోకమే రామాయణ మహాకావ్యమునకు నాంది అయ్యెను. వాల్మీకికోకిల మధుర మధురముగా గానము చేసిన రామకథయే జగదేకపావనమైన రామాయణముగా అవతరించెను.

గజదొంగకుకూడ తరణోపాయమును చూపిన రామమంత్ర మెంత మహిమాన్వితమో ఎవరు చెప్పగలరు?

ప్రశ్నలు

1. మునులను దొంగ ఏమి అడిగెను?

2. మునులవద్దగల వస్తువు లేవి?

3. గజదొంగ వాల్మీకి ఎట్లయ్యెను?

Neetikathamala-1    Chapters    Last Page