Sri Jayendravani    Chapters    Last Page

రెండవ భాగము

8. హిందూమతం యొక్క మూల సిద్ధాంతాలు

అతి ప్రాచీనమైన మన హిందూమతం ఎన్నో మహోన్నతమైన అంశాలు కల్గివుంది. కాని చాలమందికి దాని ప్రధానగుణ గణాలను గురించి సరియైన అవగాహన లేకపోవటం దురదృష్టకరం. చాలమంది అవగాహన ఏనుగును గురించిన గ్రుడ్డివారి అభిప్రాయం వంటిది. ఒకడు ఏనుగు చెవిని స్పృశించి అది యొక చదునైన వస్తువని సూచిస్తాడు. మరొకడు దాని తొండాన్ని తాకి అది యొక పెద్దతాడంటాడు. ఇంకొకడు ఆ జంతువు యొక్క కాళ్ళను తడిమి ఏనుగు ఒక పెద్ద స్తంభమని చెప్తాడు. హిందూమతం సరిగా తెలియనివారి స్థితి ఇలాగే ఉంటుంది. చాలకొద్దిమందికే హిందూమతం యొక్క మూలసిద్ధాంతాలు, వాటి నిజస్వరూపంలో సరియైన అవగాహన ఉంది.

ప్రధానంగా, హిందూమతంలో మూడు, నాల్గు విశేషమైన లక్షణాలున్నాయి.

ప్రధమంగా హిందూమతం ప్రకారం ఈశ్వరుణ్ణి రెండు పద్ధతుల్లో ఆరాధించగలం. మరొకమతం ఏదీ అలాంటి దానికి అవకాశమివ్వదు. ఇతరమతాల్లో సర్వాంతర్యామి ఒక్కడే సూచింపబడుతాడు. కాని హిందూ మతానుసారం అతడు సర్వాంతర్యామియే గాక విశేషరూపాల్లో కూడ దర్శనమిస్తాడు. మన దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు; ఐనా మరొకవిధంగా సాకారుడు, సగుణుడు. ఆ విధంగా మన భగవానుని రెండు రకాలుగా ఆరాధించగలం. దేవుడు నిజానికి రాముడు, కృష్ణుని రూపాల్లో అవతరిస్తాడు; మామూలు మానవుల్లోనూ ఉంటాడు. ఆయన మహాపురుషులుగాను, దివ్యరూపులు లేక పరమాత్ములుగాను కూడ అవతరిస్తాడు. భగవానుడు మనకు శుభాలను కల్గచేయటానికి తన కరుణను మనమీద ప్రసరింపచేయటానికి అనేక రూపాల్లో భూలోకానికి వేంచేస్తాడు. మరే ఇతర మతం కూడ ఇలాంటి భావనకు తావివ్వదు. ఇతర మతాలు సర్వాంతర్యామి యగువాని నొకనిని గురించే మాట్లాడుతాయి. మనం నియమిత రూపాల్లో భగవంతుని ఆరాధించగలం అనే అంశం మన హిందూమతం యొక్క ప్రత్యేక లక్షణం. అలా మనకు విగ్రహారాధన లేక మూర్తి పూజ అనే విధానమున్నది. విగ్రహారాధన లేక మూర్తి పూజ దీని వెనుక ఒక ప్రత్యేక ప్రాముఖ్యాన్ని, ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కల్గివుంది. మన మనస్సుల్లో భగవంతునికొక రూపకల్పన చేసికొని ఆరాధిస్తాం. అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. వాటిలో దైవసాన్నిధ్యాన్ని, దైవశక్తిని సృష్టించుకొని ఆరాధించి ఆ దేవతలయొక్క ఆశీస్సులను పొందుతాం.

గృహస్తులకు భగవంతుని సర్వాంతర్యామి రూపంలో ఆరాధించటం కష్టసాధ్యమైన విషయం. సర్వాంతర్యామిని ధ్యానించుట కొరకు కళ్ళుమూసుకోటం ఆరంభించగానే వారి చక్షువులు, శ్రోత్రేంద్రియాలు, మనస్సు పరిపరివిషయాలపై సంచరించటం ప్రారంభిస్తాయి. కాన మామూలు గృహస్తులు సాకార సగుణ రూపంలో ఒక ప్రత్యేక దేవతా మూర్తిగా భగవంతుని భావించాలి. ప్రపంచంలో ఎంతమంది మానవులున్నారో అన్ని రూపాలు ఈశ్వరునకున్నాయి. భగవంతుడు ఒక రూపాన్ని ఆకారాన్ని స్వీకరించి మనకు శుభాల్ని ఇచ్చుటకు మన వద్దకు దిగుతాడు. మనం ఆశిస్తున్న ఫలితాల దృష్ట్యా మనం ఆయన యొక్క ఏ రూపాన్ని ఇష్టపడతామో దాన్నే ఆరాధిస్తాం.

గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు :

''ఆర్తో జిజ్ఞాసురద్ధార్థీ జ్ఞానీ చభరతర్షభ ||''

ప్రపంచంలో నాల్గువిధాలైన భక్తులున్నారు. 1) ఏదో విషయంలో వ్యధ చెందుతున్నవారు, రోగగ్రస్తులైనవారు, 2) ధనాశాపరులు, 3) కొన్ని పనులను నిర్వర్తింపచేయ దలచిన వారు 4) ఆఖరిగా పరమాత్ముని గురించి ఎరుకకై తాపత్రయపడువారు. అందరు వారివారి కోర్కెలు సఫలీకృతం చేసికొనుటకై అనుకూలమైన రూపాన్ని ఎన్నుకొని ఆ రూపంలో భగవంతుని ఆరాధిస్తారు. ఉదాహరణకు విఘ్నాలు రాకుండుటకై వినాయకుని ప్రార్థిస్తాను. సంపదకొరకై అగ్నిని, ఆరోగ్యం కొరకు సూర్యుణ్ణి, జ్ఞానసిద్ధి కొరకు శివుని లేక దక్షిణామూర్తిని, మోక్షప్రాప్తి కొరకు విష్ణువును ఆరాధిస్తారు.

వినాయకుడు విఘ్నాల్ని నివృత్తి చేస్తాడు. విద్యార్థులు తమ పరీక్షలకాలంలో పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగోరి ఆయన్ని ఆరాధించటం గమనిస్తాం. ఫలితాలు లభిస్తాయనే కోరిక ప్రేరణతో వారు వినాయకుని ఆరాధింప మొదలుపెడ్తారు. ఈ ప్రేరణ ఒక ప్రత్యేకమైన దేవత యందు భక్తిని పెంచుతుంది. అదే విధంగా సంపద మిక్కుటంగా కోరుకునే వారు సత్యనారాయణ స్వామిని లేక లక్ష్మీదేవిని ఆరాధించటానికి ఉద్యుక్తులౌతారు.

కాని యధార్థానికి వీనిలో ప్రతిరూపం పరమాత్మది మాత్రమే. వినాయకునకు విఘ్నాలు తొలగించేశక్తి వుందంటే అది ఆయనకు మాత్రమే వుందనిగాదు. ఆయన కూడ పరమాత్మయే. భక్తుల్ని ఆకర్షించటానికి విఘ్నాల్ని నిర్మూలించే ప్రత్యేక శక్తిని ఆయన ప్రదర్శిస్తాడు. అలాగే లక్ష్మీదేవి కూడ పరమాత్మ స్వరూపిణ. ఆ దేవి ధనాపేక్షగల భక్తుల్ని ఆకర్షించటానిక ధనలక్ష్మియై సంపదలను ప్రసాదించేశక్తిని ప్రదర్శిస్తుంది. కొన్ని పనులను పూర్తిచేసే ప్రభావాన్ని ప్రదర్శించటం ద్వారా ఈ విధమైన రూపాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి.

మన సమాజంలో భగవంతునిపట్ల భక్తి వుంది. కాని దురదృష్టమేమంటే మనమతం పట్ల ధర్మం విషయంలో అదేభక్తి కనిపించదు. ఈశ్వర భక్తితోబాటు మనం మన మతం యొక్క మూలసిద్ధాంతాలలోని విషయాన్ని తెలుసుకోవాలి. మన మతంలో అచంచల విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. దీనికొరకు మన మతం యొక్క మూలమైన, ప్రధానమైన అంశాల్ని అవగాహన చేసుకోవటం అవసరం.

దేవతారాధన కొరకు మనం దేవాలయాల్ని నిర్మించాం. ఇతరమతాల్లో వారి ఆరాధనాస్థలాలు, ప్రార్థనా మందిరాలు తప్ప విగ్రహ ప్రతిష్ఠ అనే ప్రసక్తే వుండదు. ఒక విశాలమైన హాలులోనే సమావేశ##మైన ప్రజలు ప్రార్థనలు చేస్తారు. మన మతంలో అలా వుండదు. మన విగ్రహాలు దైవత్వాన్ని వాటి యందు కల్గి ఉంటాయి. ఒక నిర్ణీత దినంవరకు శిల్పి దాని మీద నగిషీపని చెక్కుతూనే ఉంటాడు. కాని ఆ మరునాడే మనం దీపహారతి, అభిషేకం మొదలైన కార్యక్రమాలు ఆరంభిస్తాం. విగ్రహం శక్తిని, చైతన్యాన్ని పొందుతుంది.

ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాలను అచ్చట సమావేశమయ్యే 'ప్రజల' సంఖ్యను బట్టి, అందరూ ఒకే పర్యాయం ప్రార్థనలు సలుపుకొనుటకు వీలుగా నిర్మిస్తారు. కాని మన దేవాలయంలో భక్తులు ఒకరి తర్వాత మరొకరు ప్రవేశించాలి. అందరూ ఒకేపర్యాయం గుంపుగా గర్భగుడివద్దకు ప్రవేశించకూడదు. ప్రజల సమూహం ఎంతవున్నా, గర్భగుడి వద్దకు ఒకరొకరుగా నిర్దేశించిన క్రమశిక్షణ ననుసరించి, వెళ్ళి ప్రార్థనలు చేయాలి. మన దేవాలయాలు కొంత పవిత్రతతో, దైవత్వంతో నిర్మింపబడ్డాయి. ప్రతిదేవాలయానికి, విగ్రహానికి వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఆ విధంగా మన దేవాలయాలు, విగ్రహాలు లేక దేవతలు దైవశక్తితో భాసిలుతున్న స్థలాలుగ రాణిస్తాయి. దేవాలయాలు, దేవతా విగ్రహాలు ఆగమశాస్త్ర ప్రకారం నిర్మిస్తారు.

ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాలు చాల ప్రశాంతంగా వుంటాయని, మన హిందూ దేవాలయాలు మాత్రం నిత్యం సందడితో, మ్రోతలతో ఉంటాయని కొంతమంది అంటారు. మన గుళ్ళలో రెండురకాలైన సందడులుంటాయి. గంటల మోతలు, మంగళ వాయిద్యాల ధ్వనులు, అర్చనా సవ్వడులు, నామావళి పఠన, మంత్రస్వరాలు మొదలైనవి మొదటి తరగతి ధ్వనులు. ఇవి అభిలషణీయమైనవే. సమావేశితులలో ఒకరితో నొకరు చేయు అనవసర సంభాషణలు, గుసగుసలు మొదలైనవి రెండవ వర్గానికి చెందినవి. ఈ రెండవది అభిలషణీయం కాదు. దేవాలయాల్లో ఈ అనవసరమైన సందడులను తగ్గించుటకు ప్రయత్నాలు చేయాలి. ఇతర మతస్థుల ఆలయాల్లో ప్రశాంతత నెలకొని వుండటానికి కారణముంది. వారికి ఒకే ఒక విశాలమైన ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడే ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనా గీతాల్ని మానసికంగాను సామూహికంగాను కూడ పాడుతారు. ఎవరి దోవన వారు నిష్క్రమిస్తారు. కొంతమంది నిమీలిత నేత్రాలతో ధ్యానం చేసి ప్రార్థనలు సలిపి మానసిక శాంతినిపొంది వెళ్ళిపోతారు. కాని మన ఆలయాల్లో అభిషేకం, అర్చన కర్పూరహారతి, దీపహారతి, నైవేద్యం, భక్తులకు ప్రసాదం ఇచ్చుట మొదలైన తతంగాలు చాలా ఉంటాయి. ఇంకా మంగళ వాయిద్యాలు, చామరసేవ లాంటి ఉపచారాలు కూడ మనకున్నాయి.

ఈ విధంగా మన విగ్రహాల్లో దైవత్వం ఆపాదించబడి యుంది గనుక, ఈ విగ్రహాల్ని మనం ఆరాధించినప్పుడు మన పాపాలు పరిహరింపబడటమేగాక మనదారిద్ర్యం కూడ

నిర్మూలింప బడుతుంది. మనం ఒక విగ్రహంలో కేవలం రాతిని మాత్రమే చూడం; అందొక భగవత్స్వరూపాన్ని దర్శిస్తాం. దానిని ఒక సౌందర్య మూర్తిగా భావిస్తాం. ఆ విధంగా హిందూమతంలో విగ్రహారాధన ఒక ప్రత్యేకస్థానాన్ని సంతరించుకొంది.

అదేరీతిలో ఫాలభాగంపై బొట్టును ధరించుట కూడ హిందూమతం యొక్క ప్రత్యేక లక్షణం. జైనులు, బౌద్ధులు కూడ వారి మొఖాలమీద బొట్టు పెట్టుకుంటారు గనుక వారిని కూడ హిందువులుగ పరిగణింపవచ్చు. జైనులు వేదాల్ని ఆమోదించరు కాని మోక్షసాధనకు వైరాగ్య మార్గాన్నే ఎన్నుకుంటారు. ఐనా వారుకూడ ముఖంపైన బొట్టును ధరించుటకు ఇష్టపడతారు. జ్యోతిష్యం మీద, జాతకాలపైన వార్కి విశ్వాసముంది. అంటే వారికి పునర్జన్మ సిద్ధాంతంపై కూడ నమ్మకమున్నట్లే. వెనుకటిజన్మ, ముందుజన్మలు కలవనే విశ్వాసంకూడ వారికుంది. అందుచేతనే హిందూ సంస్కార చిహ్నాలైన చందన ధారణ, కుంకుమ ధారణ మొదలైనవి వారు ఆచరిస్తారు.

హిందువులు తమ మొగాలపై విభూతి మొదలైన గుర్తులను ధరించటానికి చాల హేతువులున్నాయి. దురదృష్టవశాత్తు చాలమందికి దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు. నాగరికత ఎంతపురోగ మించిందంటే మనకు ముఖాలపై బొట్టు లాంటి గుర్తులను ఎందుకు ధరిస్తామో దానికి కారణాలు కూడ మనకు తెలియని స్థితికి మనం దిగజారాము.

పరమాత్మ స్వరూపం యొక్క స్వచ్ఛమైన తెల్లని రూపాన్ని విభూతి లేక భస్మధారణ మనకు గుర్తుచేస్తుంది. ఏ వస్తువునైనా పూర్తిగా కాలిస్తే ఏర్పడే అంతిమస్థితిని కూడ ఈ భస్మం సూచిస్తుంది. ప్రపంచంలోని ప్రతిపదార్థమూ కాలి నశించినప్పుడు ఈశ్వర పదార్థం ఒక్కటే మిగులుతుంది. లక్ష్మీస్థానమైన గోపృష్ఠంనుండి లభించిన గోమయం (పేడ)తో తయారుచేసిన విభూతిధారణ లక్ష్మీప్రదం అనగా సంపదలకు చిహ్నంగా భావించాలి. అందుకనే 'విభూతిరైశ్వర్యం' అని మనం చెప్పుకుంటాం. మన మొత్తం జాతి విభూతి ధారణకు ఉపక్రమిస్తే మనదేశం ఎల్లప్పుడూ సంపదలతో తులతూగుతుంది. అప్పులబాధ అనేదే ఉండదు. విభూతి ధారణను ప్రజల తిరస్కరించారు గనుకనే మనం అంతా ఈతి బాధలకు గురి¸°తున్నాం.

అలాగే పసుపునకు నిమ్మరసం, నెయ్యి కలపటం వల్ల తయారయ్యే రక్తవర్ణం కల్గిన కుంకుమ అదేరంగు కల్గిన లక్ష్మీదేవిని స్ఫురింపజేస్తుంది. కనుక కుంకుమ కూడ సంపదచిహ్నమే.

మనం గోపీచందనం ధరించినప్పుడు మనకు గోపికలు, తద్వారా కృష్ణభగవానుడు స్మరణకు వస్తారు. కృష్ణుని, గోపికల యొక్క పాదస్పర్శతో పవిత్రం కాబడిన మట్టితో తయారైనదే గోపిచందనం.

ఏదైన వస్తువును కాల్చినపుడు అది మసియై నల్లనిరూపాన్ని తాలుస్తుంది. విష్ణుమూర్తి రంగుకూడ నలుపే. మధ్వులు తమముఖాలపై ధరించే బొగ్గు యొక్క నల్లని రేఖ పై రెండు సత్యాల్ని మనకు గుర్తుచేస్తుంది. విష్ణుమూర్తి కూడ నలుపు గనుక ప్రపంచమంతా విష్ణుమయమనే మనకు స్ఫురిస్తుంది. ''సర్వం విష్ణుమయం జగత్‌''.

చందనం పట్టెలు, చందనం బొట్టులను పరమేశ్వరుడు కూడ ధరిస్తాడు. ఈ ధారణ సంపద్భాగ్యాలకు చిహ్నమని వాటినే ప్రజలు ధరించటం శుభసూచకమని, పరమేశ్వరుని జ్ఞప్తికి తెచ్చే అంశాలని మనం భావించాలి.

ముఖంమీద ఇలాంటి గుర్తులను ధరించటం ఇతర మతస్థుల విషయంలో కన్పించదు. ఇప్పుడిప్పుడే ఇతర మతాల వారుకూడ తమ ముఖాలపై తిలకం అమర్చుకునే అభ్యాసాన్ని ప్రారంభించారు. కాని మన హిందువులు మాత్రం ఈ ఆచారాన్ని విడనాడటం దురదృష్టకరం. మనదేశం ఋణవిముక్తమై సిరిసంపదలతో తులతూగాలంటే ఈ ఆచారాన్ని పునరుద్ధరించాలి.

మనిషికి సుఖదుఃఖాలు ఎందుకు ప్రాప్తిస్తున్నాయో ఇతరమతాలు వివరించవు. కాని మన మతంలో కర్మసిద్ధాంతం ప్రకారం పునర్జన్మను విశ్వశిస్తాం. ఈ కర్మ సిద్ధాంతం మనమతం యొక్క విశేష లక్షణం. ఆత్మకు మరణంలేదు: శరీరం మాత్రమే నశిస్తుంది. ఆత్మ పరిణామక్రమానికి అతీతమైంది, నిత్యమైంది. జీవాత్మ తానుచేసిన కర్మఫలాన్ని బట్టి వివిధములైన శరీరాలను ఆశ్రయిస్తుంది. తన సహజస్థితిని అనగా మార్పులేని, నిత్యమైన ఆత్మస్థితిని పొందువరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

దహనం ద్వారా శవాల్ని పరిహరించే విధానం కూడ మన హిందూమతం యొక్క ప్రత్యేకతే. మిగతా మతాలవారికి ఈ ఆచారం లేదు. వారు శవాలను మట్టిలో పూడ్చిపెడతారు. హిందూ మతస్థుల్లో కూడ కొందరు శవాల్ని ఖననం చేసే ఆచారాన్ని పాటిస్తారు. బౌద్ధ జైన మతాలవారు కొంతమంది దహనం చేస్తారు. మరికొంతమంది ఖననాన్ని పాటిస్తారు. దహనక్రియలో దాగియున్న ధర్మ సూక్ష్మ మేమిటి? పునర్జన్మ సిద్ధాంతంపై విశ్వాసం లేనివారు ఖననక్రియను అవలంబిస్తారు. అలాగే సన్యాసులు, సాధువులు, మహాపురుషులు తమకు మరొక జన్మలేదని భావించే తరగతికి చెందినవారు గనుక వీరి విషయంలో కూడ ఖననాన్నే అవలంబిస్తారు. మహాత్ములు మరణించినప్పుడు వారి శరీరాల్ని ఖననంచేసి వాటిపై సమాధులను నిర్మిస్తారు.

పునర్జన్మ సిద్ధాంతంపై విశ్వాసమున్న వారు మరణించినప్పుడు వారిని దహనంచేయటం పరిపాటి. జీవాత్మ మరొక దేహంలో ప్రవేశించి దాని అనుభవాల్ని స్వీకరిస్తుంది. మృతదేహం ఇక్కడ దహనం ఔతుంది. జీవాత్మ మరొక జన్మను పొంది కర్మానుసారం సుఖదుఃఖాల్ని అనుభవిస్తుంది. సన్యాసుల విషయంలో నూతన దేహం యొక్క ఆవశ్యకత వుండదు. ఇదే న్యాయం సాధువులకు, జ్ఞానులకు కూడ వర్తిస్తుంది. ఖననం కావింప బడ్డ శరీరాలు పంచమహా భూతాలతో ఐక్యమవుతాయి. ఈ పంచభూతాల సమ్మేళనం వల్లనే జన్మకాలంలో శరీరాలు ఉద్భవిస్తాయి.

దీనిని బట్టి ఖననం చేయబడ్డ ఇతరులకు కూడ పునర్జన్మ వుండదని భావించాలా ? పునర్జన్మ సిద్ధాంతంపై వారికి విశ్వాసం లేకపోతే వార్కికూడ సమాధుల్ని ఏర్పాటుచేస్తారు. అలాగని వారు మరల జన్మించరని అర్థం కాదు. నిజానికి వారు ఎన్ని జన్మలు ఎత్తవలసి యుంటుందో ఎవరూ చెప్పలేరు.

అప్పుడప్పుడు ప్రజలు నా వద్దకు వచ్చి ''నేను భరించలేని కష్టాల్లో కూరుకొని వున్నాను. నాకు మరణమే శరణ్యం'' అని వాపోతారు. వారివి కుటుంబ కష్టాలు కావచ్చు. లేక దీర్ఘవ్యాధులు కావచ్చు. ఆత్మహత్యతో ఈ శరీరం నశిస్తే దానితోబాటు వారి బాధలుకూడ నివృత్తి కాగలవని తలుస్తారు. అది పొరపాటు. ఈ శరీరం గతించటంలో దానికున్న బాధలు పోవు. వచ్చే మరెన్ని జన్మల్లో ఇంతకంటే అతీతమైన బాధల్ని అనుభవించాల్సి వస్తుందో, లేదో ఎవరూ చెప్పలేరు. ఈ శరీరం వుంటే గదా నా వద్దకు వచ్చి బాధల నివృత్తి కొరకు సలహా అడగటం సంభవించింది. కనుక ఎవరూ ఆత్మహత్య చేసుకోవాలనే తలంపును దరిజేరనీయరాదు. బాధలను ఓర్పుతో సహించి నివృత్తి కొరకు యత్నిస్తే అన్నీ చక్కబడతాయి. ప్రతివాడు తనకు సహజమైన మరణం వచ్చే వరకు జీవించటం ఉచితం. ఆత్మహత్య మహాపాపం.

రాజపుత్రులలో సతి అనే ఆచారముంది. రాజపుత్ర సైనికుడుగాని, రాజుగాని మరణిస్తే, ఆయన సతీమణి అదే చితిమీద ప్రవేశించి భర్తతోబాటు తానుకూడ సజీవదహనం ఔతూవుండేది. అలా చేయటం వల్ల వారు మరుజన్మలో కూడ భార్యాభర్తలుగ వుండగలరనే విశ్వాసం వారికుండేది.

పునర్జన్మ లేనివారి మృతదేహాలు ఖననం చేయబడుతాయి. వారి ఆత్మలకు మోక్షప్రాప్తి కలుగు తుందని నమ్మిక. కనుక మనమతంలో సమాధి అనేది మహాత్ములకు కాని జరుగదు. లింగాయతులలో కూడ మరణించిన వారిని ఖననం చేయటం అనే ఆచారం వుంది. వారిలో మనిషి పుట్టగానే లింగధారణ చేసికొని దానిని ఆరాధించి, పూజలు చేస్తాడు. కనుక లింగాయతు ఐనవాడు తనకు తిరిగి జన్మలేదని తలుస్తాడు. అతడు మరణానంతరం తాను శివసాన్నిధ్యాన్ని పొందుతాననే తలంపుతో వుంటాడు. కనుక లింగాయత్‌ చనిపోయినపుడు ఆయన్ని ఖననం చేస్తారే తప్ప దహనం చేయరు. మరణానంతరం మోక్షప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం కలవారు, తమకు పునర్జన్మ అంటూ వుండదనుకునేవారు ఖననం చేయబడతారు.

ఆ విధంగా మామూలు ప్రజల విషయంలో దహనం, మహాపురుషులు సన్యాసుల విషయంలో ఖననం, ఈ రెండూ హిందూమతం యొక్క విశేష లక్షణాలు. థాయ్‌లాండు, కంబోడియా నుంచి వచ్చినవారు తమ దేశాల్లో కూడ కొంతమందికి దహనసంస్కారమే అమలులో వున్నట్లు నాకు తెల్పారు. కొంతమంది మహాపురుషులు మరణించినప్పుడు వారి ఆస్తికలను పదిలపరచి కొన్ని కర్మలను నిర్వహిస్తూ వుంటారు.

బౌద్ధులు, జైనులు కూడ కర్మసిద్ధాంతంపై విశ్వాసం కలవారే; వారికి జాతకంపై విశ్వాసముంది గనుక పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడ నమ్ముతారు.

పై విషయాలన్నిటిని క్రోడీకరిస్తే హిందూమతం ఈ క్రింద ఉదహరించిన అంశాల్ని మౌలిక లక్షణాలుగా కల్గివుందని రూఢి అవుతుంది.

1) విగ్రహారాధన మరియు నిర్గుణ, సగుణ రూపాల్లో భగవంతుని ఆరాధన.

2) ఫాలభాగంపై బొట్టును ధరించుట.

3) జాతకంలో విశ్వాసం, తదనుగుణంగా కర్మ సిద్ధాంతం ప్రకారం పూర్వజన్మ, ముందు జన్మలున్న వనే సిద్ధాంతంలో విశ్వాసం.

4) మామూలు ప్రజలకు దహనం, మహాపురుషులకు ఖననం.

ఒక విధంగా పైవన్నీ సంబంధిత అంశాలే. విష్ణుమూర్తి యొక్క సగుణోపాసన చేయువారందరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వారికి పునర్జన్మ వుండదు. క్రమముక్తి ద్వారా కాలాంతరంలో వారికి మోక్షప్రాప్తి కల్గుతుంది.

Sri Jayendravani    Chapters    Last Page