Sri Jayendravani    Chapters    Last Page

7. మన జాతీయ భాష, సంస్కృతం

ఈ రోజు ఈ సభను అఖిల భారత సంస్కృత సమ్మేళనం ఏర్పాటు చేసింది. మామూలుగ ఇలాటి సభలో ఉపన్యాసాలు చేయటానికి సంస్కృత భాషనే ఉపయోగించాలి. కాని సంస్కృతం తెలియని వారు కూడా ఉపన్యాసాలు అర్థం చేసుకో గల్గటానికి హిందీలో కూడా భాషించడం జరుగుతోంది. కాని నేను సంస్కృతంలో ఉపన్యసిస్తే సంస్కృతం రాని వారు కూడ సులభంగా అర్థం చేసుకో గలరని నా విశ్వాసం.

మనదేశం మహమ్మదీయులు, ఫ్రెంచివారు, డచ్‌వారు, ఆంగ్లేయులు - వీరందరి దండయాత్రలకు గురైంది. ఆ రోజుల్లో కూడ సంస్కృతం వచ్చినవారు ఈ రోజు ఉన్నంత తక్కువమంది ఉండేవారు కారు. స్వతంత్ర భారతదేశంలో వారి సంఖ్య బాగా తగ్గిపోవటం చాల దురదృష్టకరం. ఇది చాల దుఃఖకరమైన పరిస్థితి. దీనికి కారణమేమి టంటారు? పాలకులకు, ప్రజలకు కూడ ఈ విషయంపై శ్రద్ధలేకపోవటమే దీనికి ముఖ్యకారణం.

మన భారతీయ సంస్కృతి సంస్కృత భాషపై ఆధారపడిఉంది. ప్రాచీన కాలంలో మనదేశాన్ని పాలించిన రాజులకు సంస్కృత భాషపట్ల శ్రద్ధ ఉండేది. వాళ్ళకు మంచి సంస్కారాలుండేవి. కాని ప్రస్తుత కాలంలో మన జాతీయ భాష ఏది ఉండాలనే విషయం లో ఆందోళన జరుగుతోంది.

భాషంటే ఏమిటి? మనం ఇతరులకు మన భావాల్ని ఆలోచనల్ని చెప్పటానికి ఉపయోగపడే సాధనం మాత్రమే. మన సంభాషణకు ఒక సాధనం. ఒక మనిషి మనస్సులోని భావాలను, ఆలోచనలను మరియొకనికి తెల్పుటకు సంభాషణ ఒక సాధనం. సంభాషణ ధ్వని సమన్వితం. ఈ ధ్వనులు రెండు రకాలు. ధ్వన్యాత్మకం, వర్ణాత్మకం - అనగా స్వచ్ఛమైన ధ్వని రూపంగలది ఒకటి, వర్ణమాలలోని అక్షర రూపంగలది మరొకటి. మొదటిది అస్పష్టత కల్గినది, రెండవది స్పష్టమైనది. మొదటిది అవ్యక్తము, రెండవది వ్యక్తము. స్వరభేదం వల్ల లేక శబ్ద స్పష్టతవల్ల మనస్సులోని భావం సుస్పష్టమౌతుంది. ఉదాహరణకు ఒక గోవు సుఖంగా ఉన్నప్పుడు ఒక రకమైన అరుపును, ఆకలితో ఉన్నప్పుడు రెండవ రకమైన అరుపును, బాధలో ఉన్నప్పుడు మూడవ రకమైన అరుపును, తన దూడ మరణించినప్పుడు నాల్గవ రకమైన అరుపును చేస్తుంది. ఈ విధంగా అరుపులను విని ఆవు యొక్క మానసిక స్థితులను గ్రహించగలం. ఈ భావాలు కేవలం స్థూలభావాలు మాత్రమే. కాని స్పష్టమైన ధ్వనుల వల్లను, మరియు 'అ' నుండి 'క్ష' వరకు గల వర్ణమాలలోని అక్షరముల ద్వారా వ్యక్తీకరింపబడుట వల్లను సూక్ష్మభావాలు మనకు అవగతమౌతాయి. దాని మీద ఆధారపడిన భాషను వ్యక్తభాష అంటాం. భారతదేశంలో అలాంటివి చాలా భాషలున్నాయి.

ఉదాహరణకు ప్రభుత్వ వ్యవహారాలకు వివిధ రాష్ట్రాలలో భిన్నభిన్నమైన భాషలు వాడబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు, తమిళనాడులో తమిళం, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ ఉపయోగింప బడుతున్నాయి.

ఈ స్థితిలో సంస్కృతం నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎక్కడుందని ఎవరైనా ప్రశ్నించవచ్చు.

సంస్కృతం నేర్చుకోవడంవల్ల దాని ఫలితంగా వ్యక్తికి మంచి సంస్కారాలు అబ్బే లాభంవుంది. నిశ్చయంగా ఇతర భాషలు అభ్యసించినందువల్ల పొందగల్గిన లాభాలన్నీ సంస్కృతం చదువుకొనటంవల్ల కూడ లభ్యమౌతాయి. మీదు మిక్కిలి సంస్కృత భాషాజ్ఞానం అంతకంటే అధికమైన ప్రయోజనాల్ని సిద్ధింప చేస్తుంది. ఆంగ్లము, తెలుగు, తమిళం మొదలైనవి చదువుటవల్ల కొన్ని రకాలైన సంస్కారాలు మనకు అబ్బుతాయి. కాని అవన్నీ మంచివి కాకబోవచ్చు. కాని సంస్కృతం చదివితే మాత్రం మన సంస్కారాలు మంచివిగా పరిణమిస్తాయి, మన మనస్సుకూడ స్వచ్ఛతను పొందుతుంది.

సంస్కృతమంటే అర్థం :

'సంస్క్రియతే అనేన ఇతి సంస్కృతమ్‌'. దీనినే 'అ' తో మొదలై 'క్ష'తో అంత మౌతుంది గనుక 'అక్షమాల' అనికూడ అంటారు.

సంభాషణలో ఉచ్చరింపబడు శబ్దాలన్ని 'అ' నుండి 'క్ష' వరకు గల అక్షరాలలో ఇమిడి ఉన్నాయని శబ్దశాస్త్రజ్ఞులు చెప్తారు. సంస్కృతం స్వచ్ఛమైన భాష కావటమేకాదు, దానిని చదివిన వార్కి కూడ మానసిక స్వచ్ఛతను లేక హృదయ శుద్ధిని సమకూరుస్తుంది. సంస్కృతం పఠించుటవల్ల సిద్ధించే అదనపు ప్రయోజనం ఇది. మనం ఇతర భాషలు చదువు తున్నప్పుడు మనకు లభించే మానసిక సంస్కారాలు అంత మంచివైనవి కావు. సరియైన మానసిక సంస్కారాలు లేకుండా ఎవరుగాని జీవితంలో ఏదీ సాధించలేరనే విషయం తేటతెల్లమే. కనుక దివ్యమైన మానసిక సంస్కారాలు అందరూ పొందాలంటే సంస్కృతాన్ని అభ్యసించి ఉపయోగించాలి. సరియైన, ఉత్తమమైన సంస్కారాల బలంతో ఏ పని చేసినా అది జయప్రదం ఔతుంది. సంస్కృత భాషాభ్యాసం వలన మంచి సంస్కారాలు, ఉత్తమమైన భావాలు లభిస్తాయి.

సంస్కృత భాషను అభ్యసించటం చాల సులువైన విషయం. హిందీ, తెలుగు, కన్నడ భాషలలోని ఎక్కువ అక్షరాలు సంస్కృతంలో ఉన్నాయి. ఉచ్చారణా సామ్యం కూడా ఉంది. ఎక్కువ హల్లులు సంస్కృతంలో ఉన్నవే ఇతర భారతీయ భాషలలోనూ ఉన్నాయి. దేవనాగరి లిపిలోని వర్ణములన్నియు ఇతర భాషలలోను చూడవచ్చు. కాబట్టి సంస్కృతం అభ్యసించటం కష్టసాధ్యం కాదు.

తరచుగా ప్రజలు హిందీ, ఆంగ్లం, ఫ్రెంచి, రష్యన్‌ మొదలైన భాషలు నేర్చుకోవటానికి సిద్ధపడతారు. కాని సంస్కృతం విషయం వచ్చేసరికి అది నేర్చుకోవటం కష్టమని వాదిస్తారు. యధార్థానికి సంస్కృతమంత తేలిక భాష లేనేలేదు. అక్షర సముచ్చయాల్లోని చాలా అక్షరాలు సంస్కృతంలో ఉన్నవే. ఇతర భారతీయ భాషల్లోను అవే ఉన్నాయి. సంస్కృతం అభ్యసించటం మొదట్లో కష్టమని అనిపించవచ్చు. కాని ఒక సంవత్సరకాలం దాన్ని అభ్యసిస్తే ఎవరైనా ఆ భాషలోని ఏ రచననైనా ఏమీ కష్టం లేకుండా అసందిగ్ధమైన ఉచ్చారణతో చదవ గల్గుతారు. అదే ఆంగ్లం విషయంలో అయితే ఎం.ఎ. పట్టభద్రుడైనా క్రొత్త మాటల ఉచ్చారణ తెలిసికొనుటకు నిఘంటువు చూడవలసిందే. ఇదే సంస్కృతానికి ఇతర భాషలకున్న తేడా.

సంస్కృత భాష నేర్చుకొనుటకు కావలసిందల్లా శ్రద్ధ మాత్రమే. ఒకసారి దానిపై శ్రద్ధ జనిస్తే సంస్కృతాభ్యాసం అంత తేలిక విషయం మరొకటి ఉండదు.

ఇంకా చెప్పాలంటే సంస్కృతభాష పరబ్రహ్మ స్వరూప తుల్యం. సగుణ పరబ్రహ్మను - శివుడుగాని, గణశుడుగాని లేక సరస్వతిగాని, మరొక దైవంగాని - ఆరాధించుట కనువైన భాష. సామాన్య ప్రజల నిర్గుణ తత్వంగల భగవంతుని ధ్యానించటం అంత సుగమంగా భావించరు. అందుచేత వారు సాకార సగుణ రూపుడైన పరమాత్మనే ఆరాధించాలి. ఈ కార్యానికి సహజంగా పరమాత్మ స్వరూప తుల్యమైన సంస్కృతభాష అత్యుత్తమంగా సరిపోతుంది. అది పరమాత్మ స్వరూప తుల్యం గనుక సర్వవ్యాపి కూడాను. పరమాత్మ లేక పరబ్రహ్మ విష్ణువు, గణశుడు రామచంద్రుడు, కృష్ణుడు మొదలైన సాకార రూపాల్ని ధరించినట్లే పరమాత్మ సదృశ##మైన సంస్కృతభాష వివిధమైన రాష్ట్రీయ ప్రాంతీయ భాషల ద్వారా సాకారా రూపాన్ని స్వీకరించింది.

లిపి విషయానికొస్తే దేవనాగరలిపి గడచిన కొద్ది సంవత్సరాలలో మాత్రమే అమలులోకి వచ్చింది. కాని దానికి ముందు వివిధ రాష్ట్రల్లో అచ్చటి ప్రాంతీయ భాషల లిపులు మాత్రమే అమలులో ఉండేవి. ఈ రోజున మాత్రమే దేశానికి అంతటికి వర్తించే ఒకే లిపి ఉండాలని అంటున్నాం. కాని అంతకు మందు సంస్కృతం ప్రాంతీయ భాషల లిపుల ద్వారా అధ్యయనం చేయబడుతుండేది. కనుక సంస్కృతాధ్యయనం దేశమంతటా జరుగుతుండేది.

సంస్కృతం కమనీయమైన భాష. దాన్ని నేర్చుకోవటం, అవగాహన చేసుకోవటం కూడ సులభం. సంస్కృత భాష మనిషి యొక్క భావనలను స్వచ్ఛమైనవిగ చేసి మానసిక స్వచ్ఛతను కూడ సమకూరుస్తుంది. దీనికి వివరణ 'సంస్క్రియతే అనేన ఇతి సంస్కృతం'అనే వాక్యంలో ఉంది. దీనికి వ్యతిరేకంగా అసంస్కృతం అనగా స్వచ్ఛత లేనిది. కనుక నిర్విరామమైన సంఘర్షణ, ఆందోళనకు మూలమని అర్థం. కనుక ప్రతివాడు సంస్కృతాన్ని నేర్చుకోటానికి ఈ రోజునుండి, కనీసం రేపటినుంచి ఐనా ప్రయత్నం చేయాలి. సంస్కృతం నేర్చుకోనంత వరకు సత్ఫలితాలను ఆశించలేము.

ఈ ఉద్దేశ్యంతోనే సంస్కృతాన్ని ప్రజల మధ్య విస్తరింప చేయటం జరుగుతోంది. ఈ భాషలో ఒక స్థాయి ప్రాప్తించిన వారికి భారతదేశంలో వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలు వ్రాయుటకు తగిన ప్రోత్సాహమీయబడుతోంది. ఉదాహరణకు బృందావనంలో వారు సంస్కృత పరీక్షలను కొన్ని నడుపుతున్నారు. చిత్తూరులో సంస్కృతంలో అమరభారతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కోసలలో ఇంకా ఇతరచోట్ల ఆ విధమైన పరీక్షలు నిర్వహింపబడుతున్నాయి. కనుక సంస్కృతం నేర్చుకోవాలంటే శ్రద్ధ ఒక్కటి చాలు. శ్రద్ధవుంటే ప్రతివాడు సంస్కృతం అతి సులభంగా నేర్చుకోవచ్చు.

శ్రద్ధను ఏవిధంగా సమకూర్చుకోవాలి ? శ్రద్ధకోసం సంస్కృతం అభ్యసించాలి. సంస్కృతాభ్యాసం మనస్సును నిర్మలం చేస్తుంది. మనిషికి శ్రద్ధను ప్రసాదిస్తుంది. కాని శ్రద్ధను పొందాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. ఆ విధంగా ఈ రెండూ పరస్పర ఆధారములై ఉన్నాయి.

కొద్ది సంవత్సరాలకు పూర్వం సంస్కృతం ధారాళంగా మాట్లాడగల్గి మీమాంసలోను, వేదాంతంలోను పాండిత్యం గలవారుండే వారు. కాని ఇప్పుడు మామూలు స్థాయి సంస్కృతం తెలిసిన వారుకూడ అరుదైనారు. ఆదిలో ప్రజల్లో మంచి సంస్కారాలుండేవి. అందుచేత మానసిక స్వచ్ఛతుండేది. ప్రజలు భాషను అభ్యసించేవారు, మాట్లాడేవారు. కాని దురదృష్ట మేమంటే ప్రస్తుతపు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతివాడు ఈ భాషను నేర్చుకొనుటకు హృదయపూర్వకమైన ప్రయత్నం చేయాలి. ఈ భాషాజ్ఞానం ఉత్తమ సంస్కారాలకు, మంచి ప్రవృత్తులకు మార్గదర్శకం ఔతుంది.

జర్మనులు సంస్కృతంలో నిష్ణాతులు. అలాగే రష్యన్లు, అమెరికావారు కూడ. అమెరికాలో కూడ సంస్కృతం బాగా చదవగలవారు చాలమంది ఉన్నారు. కాని మనదేశంలో ఎవరూ మన భాషైన సంస్కృతం చదవటానికి ఆసక్తి చూపరు. మనకు జాతీయభాష ఉంది. జాతీయ పక్షి ఉంది, సత్యమేవ జయతే అనే జాతీయ మంగళవాక్యం ఉంది. కాని దురదృష్టమేమంటే మనం ఇంకా జాతీయ భాషను ప్రకటించలేదు.

సంస్కృతం ప్రాచీనకాలంలో ప్రజలు మాట్లాడేవారు గనుక ఇది భారతదేశం యొక్క ప్రాచీనభాషగా చెప్పాలి. ప్రజలు ఈ భాష యొక్క, దాని సారస్వతము యొక్క అభివృద్ధిని, పరిరక్షణను నిర్వహించుటలో శ్రద్ధ చూపారు. కాని ఈ రోజు స్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రజలు తిరిగి దీనిపై శ్రద్ధవహించి అభివృద్ధి పరిచితే మామూలు ప్రజానీకం యొక్క వుపయోగార్థం సంస్కృత భాష స్థాయి పెరిగి ప్రాచీన ఔన్నత్యాన్ని పొందగలుగుతుంది. ప్రధాన విషయమేమంటే ఈ భాషపట్ల శ్రద్ధ అవసరం. దాని ననుసరించే సరియైన భావాలు, సంస్కారాలు ఉత్పన్నమౌతాయి. ప్రస్తుతం కూడ ఎక్కువమంది ప్రజలు సంస్కృతాన్ని కొంత మేరకైనా అర్థం చేసు కుంటున్నారు. నిజానికి నేను సంస్కృతంలో భాషిస్తే ఎక్కువమంది దీన్ని అర్థం చేసుకోగలరు.

ప్రతి అమ్మాయి, అబ్బాయి తనకు మంచి సంస్కారాలు సిద్దించాలంటే ఈ భాషను అధ్యయనం చేయటం పూర్తిగా అవసరం. వృద్ధులు దీన్ని అభ్యసించటానికి తరుణం మించిపోయి ఉండవచ్చు. కనీసం యువకులకైనా ఈ భాషను బోధించాలి. సంస్కృత భాషలో నిక్షిప్తమైన ప్రాచీన సంస్కృతిని పరిరక్షించ నున్నవారు యువకులే.

ప్రతివాడు భగవంతునిపై భక్తి కల్గియుంటాడు. ప్రజలు తరచుగా నాకిదికావాలి, నాకది కావాలి, నేను పరీక్షల్లో ఉత్తీర్ణుణ్ణి కావాలి, ఉద్యోగంలో ఉన్నత పదవి కావాలి, నాకు సంపద కావాలి మొదలైన కోర్కెలతో భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. వారొక సంస్కృత శ్లోకాన్ని భగవంతుని కీర్తిస్తూ చదివితే భగవానుడు మెచ్చి వారికోర్కెలను తీరుస్తాడు. ప్రస్తుతం ఎవరికీ సంస్కృత శ్లోకం ఒక్కటీరాదు. అందుచే కోర్కెలను మాత్రమే కోరుతారు. అలాచేసినా ఫలితాలు సాధిస్తారు. కాని ఆ ఫలితాలు చాలకొద్ది ప్రమాణంలో ఉంటాయి. కాని వారు వారి ప్రార్థనలను శ్రద్ధతో సంస్కృత శ్లోకపఠనం ద్వారా చేస్తే వార్కి సంపూర్ణమైన ఫలితాలు దక్కుతాయి. అందుమూలంగా భక్తి అతిశయిస్తుంది. తత్ఫలితంగా మళ్ళీ పూర్తి ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా భక్తి, ఫలతాలు చక్రభ్రమణం చేస్తుంటాయి.

భక్తికి శ్రద్ధ అవసరం, శ్రద్ధకు సంస్కృతభాష అవసరం. ప్రజలు సంస్కృత భాష తెలిసికొని ఉంటే దానిద్వారా శ్రద్ధ వృద్ధవుతోంది. అలా అది సన్మార్గానికి దారితీస్తుంది. సంస్కృతంలోను సనాతనధర్మంలోను మనకు విశ్వాసముంటే భక్తి శ్రద్ధలు పెరిగి దానివలన ఆటంకాలు, ఇబ్బందులు తొలగిపోతాయి.

కనుక ప్రతివాడు సంస్కృత భాషను అభ్యసించుటకు త్రికరణశుద్ధిగ ప్రయత్నించాలి. భగవంతుని ప్రార్థించునపుడు కొన్ని సంస్కృతశ్లోకాల్ని వల్లించాలి.

రాధామాధవుని కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ప్రసరించి వారి సిరిసంపదలను, శ్రేయస్సును ఇనుమడింప జేయుగాక !

Sri Jayendravani    Chapters    Last Page