Sri Jayendravani    Chapters    Last Page

పదినొకండవ భాగము

49. మన సంస్కార సంబంధమైన కొన్ని ఆచారాలు

వ్యక్తి ఖైదీగా బంధింపబడినప్పుడే తన స్వాతంత్ర్యాన్ని కోల్పోతాడని మనం మామూలుగ భావిస్తాం. కాని బయట ప్రపంచంలో జీవిస్తున్నా, బానిసత్వం అనుభవిస్తున్నట్లే. ఖైదీల మనస్తత్వంలో మార్పును సాధించి వారిని సత్ర్పవర్తకులుగా రూపొందించాలనే ప్రయత్నంలో మేము చాల జైళ్లను సందర్శిస్తూ వుండేవారం. పరమత ప్రవక్తలు ఇదే కార్యక్రమాన్ని నిర్వహించటం చూచి మనం కూడ ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాలని తలంచాం. మేము జైళ్లను సందర్శించి, తిరిగి వచ్చిన తర్వాత అనుష్ఠానాది ప్రాయశ్చిత్త కర్మలు చేసికొనేవారం. నేను ఖైదీలతో సంభాషించినప్పుడు వారి జీవితాలు బయట వారికంటే సుఖప్రదంగా వున్నవని వారిని ఊరటపరచేవాణ్ణి. దానికి కారణం జైళ్లలో వారిని చాల జాగ్రత్తగా చూచుకోవటమే. అంతేగాక జైలు జీవితం గడిపినంతవరకు వారికేవిధమైన తాపత్రయాలు వుండవు. నేను మధ్యప్రదేశ్‌లో చాల జైళ్లను చూచి, ఖైదీలకు నా శుభాశీస్సులను అందచేశాను. ధర్మాన్ని బోధించటానికి వారికి మన ధర్మం పట్ల, శాస్త్రాల పట్ల ఆసక్తిని జాగృతం చేయటానికి నేను అక్కడకు వెళ్లాను. వారిలో మంచి నడతను అలవరచుకున్న వారు తెల్ల దుస్తులు ధరించి జైలు ఆవరణలో స్వేచ్ఛగా విహరించటానికి అనుమతింపబడేవారు. ఒక వ్యక్తిలో సరియైన మానసిక పరివర్తన సంభవిస్తే అతనికి ఉద్యోగం జైలు ప్రాంగణంలోనే ప్రాప్తిస్తుంది. తద్వారా అతడు ధనం సంపాదించుకోగల్గుతాడు. ఉద్యోగంలో పై స్థాయికి పోగల్గుతాడు. జైలు నుండి విడుదలను కూడ నియమిత కాలంకంటే ముందుగా సాధించగల్గుతాడు. బయట ప్రజలు నిత్యం బానిస జీవితాన్నే గడుపుతున్నారని, ఖైదీలు అనుభవించేటంత స్వాతంత్ర్యాన్ని కూడ వారు అనుభవించలేక పోతున్నారని, బయటవారి జీవితంకంటే వీరిదే ఎక్కువ సుఖప్రదంగా వుందని నేను ఖైదీలకు చెప్పేవాణ్ణి.

బయట ప్రపంచంలో వున్న మనం బానిసత్వం నుండి బయటపడి, మన జీవితాల్ని ఆనందమయం ఎలా చేసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. లోగడ మనమొక సందర్భంలో చెప్పుకున్నట్లు మనకు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరమని మూడు రకాల శరీరాలున్నాయి. సూక్ష్మ శరీరం యొక్క చర్యలు స్థూల శరీరాన్ని ప్రభావితంచేస్తాయి. అలాగే స్థూల శరీరాన్ని మనం ఏ విధంగా చూస్తా మనేదాని ప్రభావం కూడ సూక్ష్మ శరీరంపై ఉంటుంది.

సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరం ఏ పనీ చేయలేదు. ఏ చిన్న శారీరక కదలిక జరగాలన్నా సూక్ష్మ శరీరం యొక్క సహకారాన్ని అర్థించాలి. కనుక మనం సూక్ష్మ శరీరానికి ఏమి చేసినా అది స్థూల శరీరంలో మార్పును సాధిస్తుంది. అలాగే స్థూల శరీరంలో నడిచే చర్యలకు సూక్ష్మ శరీరంలో స్పందన వుంటుంది.

ఒక వ్యక్తి శ్రాద్ధ కర్మల్ని, పితృకార్యాల్ని, దేవ కార్యాల్ని నిర్వర్తించటం తరచుగా చూస్తూనే వుంటాం. అతడీ కార్యాల్ని క్రమం తప్పకుండా, విశ్వాసంతో చేస్తూ దేవతల్ని కూడ ఆరాధిస్తుంటాడు. ఐనా అతనికి సుఖశాంతులు లభించక పోవటం గమనిస్తాం. దీనికి హేతువు ఏమిటంటారు ? సాంప్రదాయబద్ధమైన సంస్కారపు టలవాట్లను మన యిష్టం వచ్చినట్లు మార్చుకోటమే దీనికి కారణమని తరచుగా నేను చెప్తూనే వున్నాను. వ్యక్తి అసౌఖ్యానికి వేరే కారణాలు చాల వుండవచ్చు. కాని యీ సంస్కారాలకు సంబంధించిన మార్పుకూడ ప్రధాన కారణాల్లో ఒకటి. సంస్కారాలు మారినప్పుడు మన సుఖశాంతులు క్షీణిస్తాయి. కనుక మనం, మన స్త్రీలు ధరించే శుభప్రదమైన ఆభరణాలు, యితర వస్తువుల విషయంలో సరియైన శ్రద్ధ చూపాలి.

సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఈ విషయంపై క్రింది శ్లోకాన్ని చెప్పారు.

శ్లో|| ''సుధామప్యా స్వాద్య ప్రతి-భయ-జరామృత్యు-హరిణీం|

విపన్యంతే విశ్వే విధి - శతమఖాద్యా దివిషదః |

కరాలిం యత్‌ స్వేలం కబలితవతః కాలకలనా

న శంభోస్తన్మూలం తవ జనని తాటం క-మహిమా||''

దేవతలు సముద్రాన్ని మథించినప్పుడు ఆవిర్భవించిన వస్తువులనన్నిటిని వారు గ్రహించారు. కాని విషం బయల్పడగానే భయభ్రాంతులై ఆ స్థలాన్ని విడిచి వెళ్లటం ఆరంభించారు. అమృతం లభించగానే దేవతలు దాన్ని సేవించి అమరులైనారు. ఐనా విషం కనిపించగానే దేవతలు భయంతో బ్రహ్మతో సహా వెనుదిరిగారు. పరమేశ్వరుడు మాత్రం గరళాన్ని మ్రింగి కంఠ స్థలంలో వుంచి గరళ కంఠుడై భాసిల్లాడు. గరళం మ్రింగిన ఆయన మరణించలేదు. ఎందువలన? ఆదిశంకరులు నుడివిన ప్రకారం పార్వతీమాత ధరించిన తాటంకము యొక్క మహాత్మ్యమే దానికి కారణం. ఈ శ్లోకంలో ఒక గొప్పధర్మ సూత్రం ఇమిడివుంది. స్త్రీ తన చెవికి ధరించే ఆభరణం తన భర్తకేగాక తన మొత్తం కుటుంబానికి గొప్ప రక్షగా విలసిల్లుతుందనేదే ఆ ధర్మ సూత్రం.

భారతీయ సంస్కృతికి యీ తాటంకం ఒక ఉత్కృష్టమైన చిహ్నం గనుక దానికున్న సంరక్షక విలువల దృష్ట్యా ఆ ఆచారాన్ని మనం తప్పక నిలబెట్టుకోవాలి. కాని మన గృహిణులు వేరే ఆభరణాల్ని ధరించటం ప్రారంభిస్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా వుంటాయి. నేడు మన పిల్లలు, పెద్ద ముత్తైదువులు కూడ బంగారంతోగాని, వెండితోగాని, ప్లాస్టిక్‌తోగాని చేసిన గుండ్రని బోలురింగులను చెవికి ఆభరణాలుగా ధరించటం గమనిస్తాం. ఇది పూర్తిగా భారతీయ సంస్కారానికి విరుద్ధం. నా యీ నిరూపణకు హేతువుకూడ తేటతెల్లమే. పాఠశాల పరీక్షలో మన పిల్లవాడొకనికి ఒక సబ్జెక్టులో నూటికి సున్నా మార్కులొచ్చాయని అనుకుందాం. అలా వచ్చింది ఒకే ఒక సబ్జెక్టులోనైనా మనం అతిగా బాధపడతాం. కాని మన గృహిణులు సున్న రూపంలో వున్న ఆభరణాన్ని శరీరంపై ధరిస్తే దాన్ని గురించి పట్టించుకోము. వలయాకృతిలో వున్న ఆభరణాన్ని ధరిస్తే, మనకు ప్రాప్తించే కష్టాలకు నివారణ లభించదు. ఆ పొరపాటు వలన సంభవించే దుష్ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. తాటంకం మన భారతీయ సంస్కృతిలో అనాది చిహ్నము. కనుక దానిని ధరించుట మానరాదు. అందుచేత, బంగారంతోగాని, ప్లాస్టిక్‌తో గాని చేసిన బోలుగుండ్రని రింగులను ఎన్నడూ ధరించరాదు. వాటికి బదులు మన పిల్లలు మన ప్రాచీనుల నుండి సంక్రమించిన లోలకులను ధరించవచ్చును.

ఈ విధమైన సంస్కార సంబంధిత సాంప్రదాయ ధార్మిక విషయాలు మనం శ్రద్ధగా పాటించాల్సినవి చాల వున్నాయి. రామాయణంలో సీత అశోకవనంలో వున్నంతసేపు ఆమె నిత్యం రాముని గురించే స్మరించేది. ఆమె రావణునిచేత తీసికొనిపోబడే సమయంలో ఆమె తనకున్న వాటిలో ఎక్కువ ఆభరణాలను తీసివైచి పారవేసింది. ఆ నగలనే వానరులు చూచి తీసికొని, దానిని బట్టి రావణాసురుడనుసరించిన మార్గాన్ని రామునకు తెలుపగల్గారు. కాని సీత తన మంగళప్రదమైన ఆభరణాలని శరీరం నుండి తొలగించలేదు. రాముడు తనకిచ్చిన అంగుళీయకాన్నిగాని, కాలిమట్టెలను గాని, చెవుల ఆభరణాల్ని గాని, చేతి గాజులను కాని, మెడలోని దివ్యాభరణాల్ని గాని తీయలేదు. ఈ ఆభరణాలన్నీ శరీరానికి కేవలం సౌందర్యాన్ని ఇవ్వటం కొరకు గాక మంగళ ప్రదమైనవిగా ధరింప బడుతున్నాయి. కనుక వీటిని ఎన్నడూ శరీరం నుండి తొలగించరాదు. ఈ రోజుల్లో స్త్రీలు తమ ఎడమ చేతి గాజుల్ని తొలగించి కుడిచేతికి ధరించి, ఎడమ చేతికి గాజుల స్థానంలో చేతి గడియారాన్ని పెట్టుకుంటున్నారు. కుడిచేతికి గాజులు ధరించి ధర్మాన్ని పాటిస్తూ రెండవ చేతి గాజులు తొలగించి ధర్మాన్ని విడనాడుతున్నారు. కనుక అలాంటివారు మిశ్రమ ఫలితాల్ని అనుభవిస్తారు.

వివాహ సమయంలో పసుపు కుంకుమలతో అలంకరింప బడిన పసుపుతాడును మంగళసూత్రంగా పెండ్లికుమారుడు పెండ్లికుమార్తెకు శుభసూచకంగా బహుకరిస్తాడు. ప్రస్తుతం పసుపుతాడు స్థానంలో బాగా విలువ గల బంగారు గొలుసును మంగళ సూత్రంగా వినియోగిస్తున్నారు. వైదిక వివాహాల్లో దీనికి స్థానం లేదు. ధర్మ శాస్త్రాల్లో పసుపుత్రాడే మంగళ సూత్రంగా నిర్ణయింపబడింది. కాని బంగారు గొలుసు కాదు. బంగారు గొలుసు పెండ్లి కూతురునకు అలంకారికము గావచ్చుగాని, పసుపు త్రాడు రూపంలోని మంగళ సూత్రం ప్రతి వివాహిత స్త్రీ తప్పనిసరిగా ధరించాలి.

నిజానికి యీ మంగళ ద్రవ్యాలు, మంగళాభరణాలు శుభప్రదమైన ఆభరణాలు మాత్రమే. అవి ధరించుట వలన మన జీవితాలు సుఖదాయకము లవుతాయి.

అలాగే ఫాలభాగంపై తిలకధారణ కూడ శుభసూచకమైనది. అది అందం కొరకు మాత్రమే ధరించేది కాదు. స్త్రీలు నియమిత పద్ధతిలో నిమ్మరసము, నెయ్యికలిపిన పసుపుతో తయారు చేయబడిన కుంకుమను మాత్రమే తమ ఫాల భాగంపై ధరించాలి. కాని ప్రస్తుత కాలంలో స్త్రీలు అనేక రంగులు గల బొట్లను ధరించటం చూస్తున్నాం. దీని వలన ప్రజల జీవితాలు సుఖశాంతులను కోల్పోతాయి.

వస్త్రధారణ విషయంలో కూడ చాల మార్పులను ఈనాడు మనం చూస్తాము. వస్త్రధారణ కేవలం అందం కొరకే గాదు. శరీరారోగ్యం కొరకు, పరిశుభ్రత కొరకు గూడ వస్త్రధారణ చేస్తాం. ప్రపంచంలో మనకు తటస్థించే విషయాల్ని అనుభవించ కూడదని కాదు. ధర్మాన్ని పాటిస్తూ, ధర్మం ద్వారా వ్యక్తి తన అనుభవాల్ని సమీకరించుకోవాలి. ధర్మానికి గ్లాని సంభవించకుండా ఏదైనా చేయవచ్చు.

ప్రపంచంలోని సుఖానుభూతిల్ని ప్రతివాడు ఆకాంక్షించవచ్చు. అనుభవించవచ్చు. కాని ధర్మానికి హాని కల్గకూడదు; సంస్కారపు సాంప్రదాయాలకు భంగము వాటిల్లకూడదు.

తర్వాత స్త్రీల కేశములు, జడలను గురించి పరిశీలిద్దాం. సీతాదేవి ఒక్క జడనే ధరించేది. ఆమె ఏకవేణీధరగా వర్ణింపబడ్డది. రావణుని అంతఃపురంలోని రాక్షస స్త్రీలు ఆమెను పరివేష్ఠించి వుండేవారు. వారందరూ ఒకటికంటే ఎక్కువ జడలను ధరించినవారే. త్రిజట అనే రాక్షసి, ఆమె పేరు సూచించినట్లు, మూడు జడలను కల్గి వుండేది. కేశ సంస్కార విషయంలో వచ్చిన యీ మార్పు మనకు మనోవైకల్యాన్ని కల్గిస్తుంది. మన సాంప్రదాయం ప్రకారం స్త్రీలు ఒక జడనే ధరించాలి. ఒకటి కంటే ఎక్కువ జడలను కల్గియుండటం మన సంస్కారానికి విరుద్ధం. రాక్షస స్త్రీలు కూడ రెండు కంటే ఎక్కువ జడలను ధరించారు.

స్థూల శరీరంపై ధరించే బాహ్యధారణలు కూడ సూక్ష్మశరీరాన్ని పరోక్షంగా ప్రభావితంచేసి సుఖశాంతుల్ని భగ్నం చేస్తాయని విశదీకరించటానికే ఈ విషయాన్ని సూచిస్తున్నాను. నే నీ విషయాన్ని సోదాహరణంగా వివరించగలను.

రక్షకభటుడు తన ఉద్యోగ దుస్తులలో (యూనిఫారంలో) వున్నపుడు అతనిని మనం రక్షకభటునిగా భావించి గౌరవాన్ని, భయాన్ని అతని పట్ల ప్రదర్శిస్తాం. అతని దుస్తులే మనలో గౌరవభావాన్ని, భయాన్ని రేకెత్తిస్తాయి. అలాగే ఒక వ్యక్తి నల్లకోటు, నల్ల టై ధరించి మనకు ఎదుటపడితే అతనిని న్యాయవాదిగా గుర్తిస్తాం. అదే విధంగా మిలిటరి దస్తులను ధరించిన వ్యక్తిని సైనికునిగా తెలుసుకుంటాం. మిలిటరి దుస్తులు సైనికునిలో ఒక విధమైన సాహస భావానికి ప్రోద్బలం యిస్తుందని అంటారు.

కనుక, వ్యక్తి ధరించే దుస్తులు అతని వృత్తి ధర్మాన్ని, అతడు నిర్వర్తించే విధులను గూర్చి మనకు సూచిస్తాయి. మన శరీరంపై ధరించే దుస్తులు, యితర వస్తువులు, వాటి ప్రభావాన్ని మన మనస్సులపై ప్రసరిస్తాయి. అంతేగాదు, ఇతరులు కూడ మనల్ని గురించి ఏర్పరచుకునే అభిప్రాయాలకు దోహదం చేస్తాయి.

కనుక, వస్త్రధారణ విషయంలో మనం మార్పులు చేసుకుని క్రొత్త పద్ధతులను అవలంబిస్తే, సహజంగానే మన ఆలోచనా విధానంలోనే మార్పులు సంభవిస్తాయి. ఈ విధంగా స్థూల శరీరంపై మనం ధరించే దుస్తుల వలన సూక్ష్మశరీరంలో కూడ మార్పులు ఆవిర్భవిస్తాయి.

నిజానికి మనం భుజించే ఆహారం మన మనస్సుల్ని ప్రభావితం చేస్తుంది.

''ఆహారశుద్ధే సత్వ శుద్ధిః''

పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరిస్తే, మన ఆలోచనలు నిర్మలంగా వుంటాయి.

కనుక మనం బాహ్యంగా ఏమి చేసినా, దాని ప్రభావం అంతర్గతంగా వున్న సూక్ష్మశరీరంపై కూడ వుంటుంది. ఒక వ్యక్తి పూజా కార్యక్రమంలో పదిరోజులు నిమగ్నమైనాడనుకుందాం. దాని ఫలితంగా మంచి కలలు కంటాడు, సుఖాన్ని అనుభవిస్తాడు. అలాగాక అతడే పదిరోజులు వరుసగా సినిమాలు చూస్తే, దాని ఫలితం మరొక విధంగా వుంటుంది. దుష్ట స్వప్నాలు కంటాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. కనుక మన భౌతిక జీవితాన్ని క్రమపరచుకుంటే, ఆంతరంగిక జీవనం దానంతటదే సద్గతిని సంతరించుకుంటుంది. అందుచేత, సూక్ష్మ శరీరాన్ని మంచి స్థితిలో వుంచుకోవాలంటే, భౌతిక శరీరాన్ని కాపాడుకుంటూ, దైనందిన కార్యక్రమాల్ని సన్మార్గంలో నడుపుకోవాలి.

ప్రతిరోజు కనీసం పది పదిహేను నిముషాల కాలమైనను మన సంస్కారాల్ని గురించి, సాంప్రదాయాల్ని గురించి ఆలోచించుకోవాలి. ఆ మాత్రపు శ్రద్ధా విశ్వాసాల్ని మనం వాటిపట్ల చూపాలి. మనకు అనుకూల వాతావరణం సిద్ధించలేదనే నెపంతో మనకు నిర్దేశింపబడిన సంస్కారాల్ని విడనాడరాదు. కనీసం పదిపదిహేను నిముషాలైన వాటి క్రింద వినియోగించాలి.

దైవపూజ చేసే సమయాల్లో, దేవాలయాలను దర్శించే సందర్భాల్లో, దైవారాధన చేసేటప్పుడు మనం విధిగా సాంప్రదాయ పద్ధతుల్లో వస్త్రధారణ చేసుకోవాలి. విభూతిధారణ మనకు సత్ఫలితాలు సమకూరుస్తుంది. అలాగే ఆభరణాల విషయంలో కూడ మన సంస్కారాలకు, సాంప్రదాయాలకు అనుగుణంగా శుభప్రదమైన వాటినే ధరించాలి. ఈ విధానాలన్నీ మనం సక్రమంగా పాటిస్తే మన సూక్ష్మ శరీరంలో వాంఛనీయమైన పరిణామాలుద్భవించి దాని వలన స్థూల శరీరం ప్రభావితమై మన బాహ్య జీవనం సన్మార్గంలో నడూస్తుంది. బాహ్య జీవనం సుశిక్షితమైతే, ఆంతరంగిక జీవనం దాన్ననుసరిస్తుంది. అలా రెండింటిని సుగమం చేసుకుంటే మన సుఖసౌఖ్యాలకు అవధులుండవు.

కనుక మనం మన సంస్కారాన్ని గురించి, ధర్మాన్ని గురించి, నాగరికతను గురించి సరియైన అవగాహన సమకూర్చుకొని వాటిని సంరక్షించుకొనుటకు శాయశక్తులా కృషిచేద్దాం. మన దేశంలో మనకు లభ్యమయ్యే కళలన్నీ మన అంతిమ గమ్యమైన పరమాత్మను గురించి తెలిసికొనుటకు సాధనాలు మాత్రమే. నిత్యసత్య స్వరూపమైన పరతత్వం యెడల సామాన్య మానవునకు కూడ భక్తిని జనింపచేయుటకే యివి ఉద్దేశింపబడ్డాయి. కనుక ప్రతి సంవత్సరము మనం యీ కళల్లో నిష్ణాతులైన వారిని సన్మానించుకుంటాం. ఈ కళలన్నీ మోక్ష ప్రాప్తికి సాధనాలు మాత్రమే. ఈ కళల్లో ఒకటే అష్టావధానం. పూర్వం శతావధానులు అధికంగా వుండేవారు. అంటే వారు నూరు విషయాల్ని పరామర్శించి, ఏకకాలంలో వాటిని ధారణచేసి చెప్పగలరని భావం. కాని ప్రస్తుతం అష్టావధానులు మాత్రమే మనకున్నారు. వీరు ఎనిమిది విషయములు మాత్రమే ధారణ చేసి చెప్పగలరు. అవధానమంటే మనస్సును ఒక వస్తువుపై లగ్నంచేయుట. అలాగ, అష్టావధాని ఎనిమిది విషయాలపై ఏక కాలంలో మనస్సును లగ్నంచేసి వాటిని తరువాత పునస్సమీకరించుకొని వెల్లడిస్తాడు. అష్టావధానం మనం ఆస్వాదించేటప్పుడు మన మనస్సులు కూడ విషయంపై కేంద్రీకరింపబడి ఒక రకమైన స్థాయీ భావాన్ని అనుభవిస్తాం. కనుక తరతరాలుగ మనకు సంక్రమించిన యీ కళలను ప్రోత్సహించవలసిన పవిత్ర కర్తవ్యం మనపై వుంది.

Sri Jayendravani    Chapters    Last Page