Sri Jayendravani    Chapters    Last Page

40. మూడు విధాలైన వాస్తవికతలు

ªyxqsòª«sLi @LiÛÉÁ[ xqs»R½ùLi

వాస్తవాన్ని మూడు తరగతులుగా వర్గీకరింపవచ్చు :

1) ప్రాతిభాసిక సత్యము 2) వ్యావహారిక సత్యము 3) పారమార్థిక సత్యము.

ప్రాతిభాసిక సత్యానికి ఉదాహరణగా స్టీలు, ముచ్చెబంగారం, వెండిరంగు కాగితాలు వగైరాలను వెండియని భ్రమ కల్పించే వస్తువులుగా భావించవచ్చు. కాని వాటిని చేతితో తీసికొని చూడగానే వెండి కాదని మనకు తెలుస్తుంది.

వెండికాని దాన్ని వెండియని మనల్ని భ్రమింపజేసే వాస్తవ ధర్మాన్ని ప్రాతిభాసిక సత్యం అంటాం. దీనినే పైకి కనిపించే వాస్తవికత అనికూడ అనవచ్చును. అంటే తాత్కాలికంగా మాత్రమే మనకు నిజమని అనిపించే ఒక విపరీతం.

చీకటిపడే ముందు సంధ్యాసమయంలో ఒక త్రాడుగాని, మాలగాని ఒక ప్రదేశంలో వుంటే, దాన్ని జూచి సర్పమని భయపడి ఆందోళనతో అరుస్తాంకూడ. కాని తర్వాత ఒక దీపం సహాయంతో ఆ ప్రదేశంలో పరికించి చూచి అది పాముకాదని, త్రాడో, మాలో అని తెలిసికుంటాం. సర్పమని భావించి అరచిన సమయంలో అచ్చట పాముయొక్క ఉనికి యథార్థమే. లేనిచో మనం భయంతో అరచివుండేవాళ్లం కాదు. కాని తర్వాత దీపం కాంతిలో అది సర్పంకాదని, తాడేనని తెలుసుకుంటాం. మన మనస్సులో కొంత సమయం మాత్రమే వుండి తర్వాత అదృశ్యమయ్యే ఈ రకమైన వాస్తవాన్ని కూడా ప్రాతిభాషిక సత్యం అంటాం.

అదే విధంగా ఒక వ్యక్తి తన స్వప్నావస్థలో కలలు కంటాడు. కలల్లో ఏవో చూస్తాడు. కలలో చూసిందంతా కలకంటున్నంత సేపు అతని విషయంలో యథార్థంగానే వుంటుంది. కాని అతడు నిద్రనుండి మేల్కొనగానే కల అంతా కల్ల అని తెలిసికుంటాడు. వ్యవహార సమయంలో సత్యమని అనిపించే ఈ రకమైన వాస్తవాన్ని వ్యావహారిక సత్యం అని అంటాం. మనం జ్ఞానులమై బ్రహ్మానందానుభూతిని పొందేవరకు ఈ దృశ్యమాన ప్రపంచం అంతా మనకు వాస్తవమే అవుతుంది. కాని మనకు బ్రహ్మానందానుభూతి కల్గిన మరుక్షణం ఈ ప్రపంచమంతా మిధ్య అవుతుంది. ఇక్కడ ప్రపంచం వ్యావహారిక సత్యం, పరబ్రహ్మ పారమార్థిక సత్యంగా మనం తెలుసుకోవాలి.

మిథ్యను గురించి మనం చర్చించేటప్పుడు దానికి చాలా రూపాలున్నాయని కూడ తెలుసుకోవాలి. ఉదాహరణకు కుందేటి కొమ్ముని గురించి, అశ్వం యొక్క కొమ్ముని గురించి ఒక వ్యక్తి మాట్లాడవచ్చు. కాని అవి రెండూకూడ వుండవని, అవి అవాస్తవికాలని మనకు తెలుసు. అలాగే ఎండమావి ఆ ప్రదేశంలో నీరువుందనే భ్రమను కల్పిస్తుంది. కాని దానిని సమీపించి చూస్తే అక్కడ నిజానికి నీరేమీ వుందు. అలాగే స్వప్నావస్థ కూడ. కలల్లోవి మాత్రమే ఉంటాయి. మెళకువతర్వాత ఉండవు. ప్రపంచం కూడా మిధ్యే. అది మిధ్యే అని దృఢంగా తెలిసేదాక, ఈ పూజలు, ఆరాధనలు తప్పవు. కనుక దేవకార్యాలు, పితృకార్యాలు విధిగా నిర్వర్తింపవలసిందే.

ఆదిశంకరులు జగత్తు అంతా మిధ్యే అని ప్రతిపాదించారు. ఇచ్చట 'మిధ్య' అనే పదానికి వేరే అర్థమున్నది. పరమాత్మ వస్తువు లేదని ప్రకటించలేదు. కాని వున్నట్లు మనకు కనిపించేది సత్యమైనది కాదు. మనమందరం బ్రహ్మ స్వరూపాలైతే మనలో మనకు వివాదాలెందుకు ? ''మనమంతా బ్రహ్మ స్వరూపులమేగదా. నీ ధనమంతా నాకెందుకీయవు'' అని ఒక వ్యక్తి అనవచ్చు. మనం బ్రహ్మ స్వరూపులం అనే విషయంలో వివాదం లేదు. కాని ఆ విషయాన్ని మనం అన్ని వేళల జ్ఞప్తియం దంచుకోము. ధనాన్ని కాంక్షించకు. ఏలనన ఆధనానికి వాస్తవికత లేదు. కల వుంటుంది. కాని అది సత్యంకాదు. అట్లే జగత్తు వుంది కాని అది అంతా మిధ్యే. ఆ విధంగా మన వేదాంతంలో స్వప్నవృత్తాంతం ఒక ముఖ్య పాత్రను వహిస్తుంది.

పరబ్రహ్మ యొక్కటే మహోత్కృష్టమైన అంతిమ సత్యమనే ప్రతిపాదనే పారమార్థిక సత్యానికి ఉదాహరణ. మిగతాదంతా సాపేక్ష మైన వాస్తవికతను కల్గినదే. అవి కొంతకాలం తమ ఉనికిని నిలుపుకొని తదుపరి నశించవలసినదే. బ్రహ్మపదార్థం మాత్రం నిత్యమైంది, మార్పులేనిది.

21)

Sri Jayendravani    Chapters    Last Page